Pages

Thursday, January 13, 2011

సంక్రాంతి పండుగ ... నాడూ నేడూ

కృష్ణార్పణం...


నాడు.... ప్రభాతాన హరిదాసు పాటలు
శ్రీహరి నామ సంకీర్తనలు
నేడు మారిన అలవాటులు
నోరు పెగలని వింత ఆలాపనలు.

అప్పటి... వాలుజడల వయ్యారాలు
తీరుగా అమరిన ముద్ద బంతి పువ్వులు
ఇప్పటి కట్టడి లేని కురుల సోయగాలు
చోటు కానని పూబాల దీనవదనాలు

నాడు పట్టుపరికిణీలలో మొగ్గలైన సిగ్గులు
కొత్త అల్లుళ్ళ కొంటె చూపుల చిలిపి అల్లర్లు
నేడు జీన్స్ నాగరికతలో బిగిసిన అందాలు
గ"మ్మత్తు"గా ఊగించే పాప్ సంగీతాలు

ఆనాడు ముంగిట దిద్దిన రంగుల రంగవల్లులు
శుభ స్వాగతాలు పలికే పచ్చ తోరణాలు
ఈనాడు ఆగంతకుల వివరాలు నమోదు చేసే సెల్లార్ లు
లోపలికి అనుమతించే రక్షక ప్రతినిధులు

అప్పుడు పసుపు గడపలు
ముత్యాల లోగిళ్ళు
ఇప్పుడు గడపల అడ్డాలే లేని
అప్పార్టుమెంటు వాటాలు

ఆ సిరులు పొంగే పాల పొంగళ్ళు
బామ్మ చేతి సున్నుండల ఘుమఘుమలు
మరి మరో సీమనుండి దిగిన బర్గర్లూ పిజ్జాలు
ఊదుకుంటూ దిగమ్రింగే నూడుల్స్ మషాలాలు

ఙ్ఞాపకాలలో లయ తప్పని గొబ్బిళ్ళ పాటలు
ముచ్చటలు వెలిగే భోగి మంటలు
వాస్తవములో నగరపు సెంటరులో పెత్తందారు ప్రగల్భాలు
నడి బొడ్డులో రగిలే టైరు వాసనల చలిమంటలు

ఆనాటి క్రమంతప్పని సంక్రాంతి సంబరాలు
తెలుగింటి సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు
ఇక అవి కాలంలో కలసిన ఙ్ఞాపకాలు
తెలుగునాట ఆ సంస్కృతి మరి ఇప్పుడు............
కృష్ణార్పణం


(స్థానిక దినపత్రిక "సమాచారం"లో ప్రచురితమయినది.)

Sunday, January 9, 2011

ఓప్రాక్టికల్ జోకు



ఓప్రాక్టికల్ జోకు మీతో పంచుకుందామని...
మా హాసం క్లబ్ కార్యక్రమంలో జోకే
వార్ని ఆహ్వానిస్తూ "పాత జోకైనా చెప్పవచ్చు..
పంచుండాలి"అని ప్రకటిస్తే--"మీరు పంచుండాలంటున్నారు
నాది ప్యాంటు మరి..పనికొస్తానా" అని అడిగారొకాయన.
దాని కొనసాగింపుగా మరొక సమావేశంలో ఓ పెద్దాయన
ఈ సమావేశంలో నేనొక్కడినే జోకు చెప్పడానికి
అర్హుడిని ..యెందుకంటే నాకు పంచుంది..అందరివీ
ప్యాంటులే." అన్నారు. ఆయన వయస్సు 70 ప్లస్...
(హాసం క్లబ్, రాజమండ్రి )

Friday, January 7, 2011

రామేశ్వరం వెళ్ళినా



పద్మ: వదిన గారూ..ఏవో యాత్రలట, క్యాంపులట యెపుడు వచ్చారు. ఏ యే చోట్లకు వెళ్ళారు..ఏమిటి విశేషాలు...చెప్పండి--చెప్పండి...
శారద: వరుసగా ప్రశ్నలేమిటి వదినా..రండి..ముందు కూర్చోండి అన్నీ చెప్తా!
పద్మ: చెప్పండి మరి..
శారద: రామేశ్వరము వెళ్ళామొదినా...అక్కడనుంచి కన్యాకుమారి వెళ్ళాము. వచ్చేటపుడు దారే కదా అని తిరుపతికూడా వెళ్ళి వచ్చాము.
పద్మ: ఢిల్లీ కూడా వెళ్ళారని విన్నాను.
శారద: అది రెండు నెలల క్రింద వెళ్ళామొదినా!
పద్మ: వదినగారు బాగానే వెళ్ళి వచ్చారు...రామలింగేశ్వరుణ్ణి చూసారన్నమాట! దర్శనం బాగా అయిందా? ఏమన్నా కొన్నారా?
శారద: దేముడినెక్కడ వదినా? లోపలెక్కడో చీకటిలో గర్భగుడిలో సరిగా కనపడనే కనపడడు...కాని అక్కడ ఆల్చిప్పలూ, గవ్వలూ చాలా బాగున్నాయి. వదినా ఊరుగాయల సీజనులో పనికొస్తాయని ఓ నాలుగు డజన్లు పట్టుకొచ్చా! మాగాయకాయ గీసుకోవడం కష్టమౌతోంది కదా?
పద్మ: మరి రామేశ్వరంలో కారిడార్స్ చూసారా వదినగారూ ? వాటికి ప్రపంచంలోనే గొప్ప పేరుందికదా?
శారద: నాకు కనపళ్ళేదు వదినా--ఆ వేళ శలవేమో? అన్నట్టు శంఖాలు కొన్ననొదినా! మనవాళ్ళందరి పేర్లూ వేయించా..మీక్కూడా తెచ్చా..యిస్తా!
పద్మ: వదినగారూ కన్యాకుమారిలో సూర్యోదయం చూసారా? అద్భుతమని విన్నాను.
శారద: ఈ మధ్య సూర్యోదయం మరీ యర్లీగా అయిపోతోంది వదినా..మేం నిద్ర లేచేసరికి బాగా పైకి వెళ్ళిపోయాడు ఆయనగారు.
పద్మ: అస్తమయం చూసారా? సముద్రంలోకి జారుతున్న సూర్యబింబందృశ్యం ఓ వింత అనుభూతినిస్తుందికదా?
శారద: చూద్దామనే అనుకున్నానొదినా! కాని ఆ వూళ్ళో ఋషికపూర్ చేసిన 'బాబీ' సినీమా ఆడుతోంది..ఆ వేళ ఆఖరి రోజట. మేం భలే లక్కీ...నాకు ఆ సినీమా భలే యిష్టం..దానికి వెళ్ళాం వదినా!
పద్మ: సరేలెండి వదినగారు...ఢిల్లీ వెళ్ళానన్నారు కదా..ఆగ్రా కూడా వెళ్ళారా? తాజ్ మహల్ చూసేవుంటారు.
శారద: ఆగ్రా వెళ్ళానొదినా! అక్కడ తాజ్ మహల్ కు వెళ్ళేదారిలో అప్పడాలు,పూరీలు వత్తడానికి పాలరాతి పీటలు ..
యెంత బాగున్నాయో..మనవాళ్ళకి వుపయోగమని రెండు డజన్లు పుచ్చుకున్నాను...అమాన్ దస్తాలు పాలరాతివి...
బుజ్జిముండలు... యెంత ముద్దొస్తున్నాయో... కావాలంటే అదికూడా ఒకటి యిస్తాలే...యింకా కొందును వొదినా...
లగేజీ యెక్కువయిపోతోందంటూ మీ అన్నయ్యగారు ఒకటే గొడవ.
పద్మ: మరి ప్రపంచ వింత తాజ్ మహల్ చూడలేదా?
శారద:ఏదీ? మేము యింకా షాపింగు చేస్తుండగానే టూరిస్టు బస్సు వాడు"టైమయిపోయిం" దంటూ విజిల్ వేసేసాడు
వదినా..ఇంకేం చూస్తాం తాజ్ మహల్...అసలు షాపింగే పూర్తవలేదు...అయినా తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రాయే
వెళ్ళాలావదినా...మన పిచ్చిగాని...మన వంటింటిలో టీ ప్యాకెట్టు మీద రోజూ చూస్తూనే వుంటాంగా "తాజ్ మహల్ "
పద్మ:ఆఁ!...అవును స్మీ! ! !
౦౦౦~~~౦౦౦
(నేను వ్రాసిన ఈ స్కిట్టు "హాసం" క్లబ్ కార్యక్రమాల్లో రాజమండ్రిలోనూ,
యితర చోట్లాచాలాసార్లు ప్రదర్శించబడింది. అందరూ నచ్చిందన్నారు మరి.)