Pages

Tuesday, October 22, 2013

గురువయ్యూర్



క్షేత్ర దర్శనం - మూడవ (ఆఖరి) భాగం


గురువయ్యూర్ చుట్టుప్రక్కల
నమో నారాయణాయ నమః
గజ కేసరి అనేఏనుగు గురువాయురప్ప ఊరేగింపులో సేవ చేసేది. అది మరణించాక దానిని సమాధి చేసారు.. అక్కడ ఆ ఏనుగు విగ్రహం...

ఎన్నిసార్లు చూసినా తనివితీరని స్వామిని మళ్లీ మళ్లీ చూసాము. ఇక గురువాయుర్ లోను .. ఆ చుట్టుప్రక్కల ఉన్న విశేషాలను కూడా చూసాము..’

దగ్గరలోనే పునత్తూర్ కొట్ట .. మా తావునుండి సుమారు 3 కి.మీ.లో ఉంది. అక్కడ గురువాయుర్ దేవస్వాం వారి నిర్వహణలో ఒక ఏనుగులశాల ఉంది. విశాలమైన తోటలో సుమారు 60 లేక 70 ఏనుగుల సంరక్షణ అక్కడ జరుగుతున్నది. ఏనుగుల సంరక్షణకై సలహా సంప్రతింపులకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ ఒకటి  ఆ లోపల ఉంది. ప్రత్యేక ఉత్సవాలలో .. కేరళలో ఏనుగులను అలంకరించి ముందు నడిపిస్తారు.. అలాగే నిత్యమూ గురువాయురప్ప మూడు నాలుగు సమయాలలో శ్రీ వెల్లి అనే తిరువీధి ఉత్సవంలో ఏనుగు మీదనే కదులుతాడు కదా. అలా గురువాయుర్ దెవస్వాంలోనూ, ఇతర ఆలయాలకు ఈ గజరాజులు వెళ్తూ ఉంటాయి. అలా స్వామి సేవ చేసిన ఒక గజరాజు చనిపోతే దానికి గురువాయుర్ లో ఆలయానికి దగ్గర్లో సమాధి కట్టి ..  పెద్ద ఏనుగు విగ్రహం పెట్టారు.  ప్రతి సంవత్సరము ఏనుగులకు పరుగు పందాలు పెట్టి నెగ్గిన ఏనుగుకు ఈ గజరాజు పేర అవార్డ్ ఇస్తారట.

గురువాయుర్ ఆలయానికి ఒక కి. మీ. దూరంలో మమ్మియూర్ శివాలయం ఉంది. అది చూసాం.. ప్రాచీనమైన ఆలయం. చక్కటి దీపాలంకరణతో శోభిస్తున్నది. కేరళలో దీపానికి చాలా ప్రత్యెకత. సాయం సంధ్యలో నియమంగా ప్రతి ఇంట్లోనూ దీపం పెట్తారు. ప్రతి ఆలయం లోనూ ఎత్తైన దీపం కుందెలు, వరుస దీపాలకు ఏర్పాటు- విధిగా ఉంటుంది. నేను చూసిన ఆలయాలలో సభావేదికలు కనపడ్డాయి.  ఆ వేదికల మీద ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిత్యమూ జరుగుతూ ఉంటుంది. మేము వెళ్ళిన శివాలయం లో  అవకాశం ఇస్తే మా ఆవిడ  రెండు పాటలు పాడింది .. సంస్కృత పదాలతో ఉన్న ఒక పాటను పాడినప్పుడు వారు  ఆస్వాదించారు. కాని తెలుగు పదాలతో పాడిన  పాటకు వారి బుర్రలు ఊగలేదు.

3 కి. మీ దూరంలో ఉన్న అతి ప్రాచీనమైన చౌయల్లుర్  ఆలయం చూసాం. కేరళ బాలాజీ గా చెప్పబడే వేంకటాచలపతి ఆలయం, పార్థసారథి ఆలయం, నారాయణి ఆలయం చూసాం. మహా మహిమగల చాముండేశ్వరి ఆలయం చూసాం. బలరామునికి కట్టిన  గుడి చూసాం. అది ప్రస్తుతం పునర్నిర్మాణం చేస్తున్నారు.

మరో ప్రముఖ దేవాలయం… వడక్కునాథన్ శివాలయం.. ఇది త్రిసూర్ లో ఉంది. సాధారణంగా రైలులో ప్రయాణం చేసేవారు త్రిసూర్ లో దిగి అక్కడనుంచి బస్సులో నలభై అయిదునిముషాల ప్రయాణ దూరంలో గురువయ్యూర్ చేరుకోవచ్చు. .  మొన్న వచ్చినప్పుడు మేమూ త్రిసూరులో దిగి గురువయ్యూర్ వెళ్లాము..ఒకరోజు గురువయ్యూర్ నుంచి త్రిసూర్ వచ్చి మేము స్వామిని దర్శించుకున్నాము. ఈ ఆలయం ఒక ఎత్తైన గుట్టపై, ఊరుకి మధ్యస్తంగా ఉంది. చుట్టూ చక్కని ఆకుపచ్చదనం అందంగా కనపడుతుంది. పరశురామ క్షేత్రంగా ఈ ఆలయం చెప్పబడుతున్నది. అలాగే శంకరాచార్యుల తల్లి ఆర్యాంబ ఈ స్వామిని సేవించి, పుత్రుని బడసినట్లు చెప్తారు. ఆమె కాలడి నుండి ఈ క్షేత్రానికి నడచి వచ్చెడిదట. ఈ ఆలయ ప్రాంగణంలో .. వడక్కునాథుడు, విష్ణుమూర్తి, హరిహరుడు .. ఆలయాలు కలిగి ఉన్నారు. ప్రధాన ఆలయమైన వడక్కునాథుడు.. శివలింగం.. దానిపై నిత్యము ఆవునెయ్యి అభిషేకం చేస్తారు.. అది తీయరు.. అలా గడ్డకట్టుకుపోయి ఉంటుంది. శతాబ్దాలుగా ఆ శివలింగ మూర్తిని చూసినవారు లేరు. ఘనీభవించిన నేతి పిరమిడ్ లా ఉన్నది మాత్రము చూడగలము .. నిత్యమూ గర్భగుడిలో వెలుగుతున్న దీపాల వేడికి కాని, తీవ్రవేసవిలోని ఎండవేడికి గాని ఆ నేయి కరగదట. పైనుంచి గోకిన నేయినే ప్రసాదంగా ఇస్తారు. అంత నేయితో కప్పబడినా.. అక్కడెక్కడా చీమలు చేరవు. అది మరో విశేషం.. తెల్లవారుఝామున అయితే నేతితో కప్పబడిన మూర్తిని చూడగలమట. మేము పొద్దెక్కి వెళ్ళాము, అంచేత భూషణాలంకృతుడయినాడు వడక్కునాథుడు దర్శనమిచ్చాడు, అక్కడ ప్రసాదంగా నేతి అప్పాలు అమ్మారు. చూడ్డానికి అంత బాగో లేదు కాని తింటే బాగానే ఉన్నాయి..

ఆ మరునాడు సుమారు వారం రోజులుగా సాగిన మా గురువయ్యూర్ యాత్ర పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం .. గురువయ్యూర్ నుంచి ట్రైన్ లో త్రిసూర్ 35 నిముషాలు … దారి పొడుగుతా చక్కని పచ్చటి తోటలు.. త్రిసూర్ లో మద్రాసు ఎక్స్ ప్రెస్ ఎక్కి చెన్నై చేరాము అక్కడనుంచి రాత్రి,  సర్కార్ లో బయల్దేరి మరునాటికి రాజమండ్రి చేరాము. .

మంజీరం ముంజనాదైరివ పదభజనం  శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతి మజ్జత్ ప్రణతజన మనోమందరోద్ధార కూర్మమ్।  
ఉత్తుంగాతామ్రరాజ న్నఖరహి మకర జ్యోత్స్నయా చాశ్రితానాం
సంతపధ్వాంత హంత్రీం తతిమనుకలయే మంగళామంగుళీనామ్ ॥

గురువాయురప్పా ! నీ చరణములను సేవించుటవలన ఎల్లరకును మోక్షముతో కూడా .. సర్వశ్రేయస్సులు కలుగును-  
అని తెలుపునట్లు నీ కాలి అందెలు సవ్వడిచేయుచున్నవి. అజ్ఞానమనెడి మహాసముద్రమున మునిగియున్ననీ సేవకులను ఉద్ధరించుటయందు నీ పాదాగ్రభాగము పరమసాధనముగా విలసిల్లుచు, క్షీరసాగరమును మధించు సమయమున మందర పర్వతమును ఉద్ధరించిన కూర్మమును తలపింప జేయుచున్నది. నీ చరణ నఖ శోభలనెడి అరుణకాంతులు చంద్రకాంతులవలె నిన్ను ఆశ్రయించెడి వారియొక్క సంతాపములనెడి చీకట్లను పోద్రోలునవియై విలసిల్లుచున్నవి. అట్టి నీ పాదములను నేను భక్తి పూర్వకముగా సేవించుచున్నాను… (నారాయణీయము నుండి)



Monday, October 21, 2013

ఎన్ని కలలో … ఎంతెంత కలలో



 ఎన్ని కలలో … ఎంతెంత కలలో
                                              ----------------------------------------

                                                                                     రచన: డి.వి. హనుమంత రావు.


ఒక సర్వ సంగ పరిత్యాగి కి కల వచ్చింది.
ఆ కలలో ఆ సాధు మహారాజ్ కు బంగారు రాశులు కనపడ్డాయి..
ఏంచేసుకుంటాడు ఆయన సర్వ సంగ పరిత్యాగి కదా.
కలలో కూడా అంతంత బంగారు రాశులను చూడని ఆ సర్వ సంగ పరిత్యాగి,
కలలో చూసిన ఆ బంగారు రాశులను
కలలో కూడా   ముట్టుకోకుండా లోపాయికారీగా యువరాజావార్కి  కబురు చేరవేసాడు.

అప్పటికే హస్తినాపురి గద్దె నెలా ఎక్కాలా అని ఆలోచిస్తూ, కలలు కంటున్నారు యువరాజా వారు.  
యు.రా. వార్కి బంగారం(లాంటి) కబురు అందింది… ఆ బంగారు కల తనకెందుకు రాలేదా అని కొంచంసేపు సోచాయించి, ఇదేమైనా ప్రతిపక్షాల కుట్రా అని కూడా ఆలోచించిన వారై, ఎందుకైనా మంచిది అని లోపాయికారీగానే వెళ్లి బంగారు రాశులు ఎక్కడ ఉన్నట్టు కలవచ్చిందో తెలుసుకున్నారు.. అది ఏదో ఆలయ ప్రాంతం. అక్కడ తవ్వితే ఆ బంగారు రాశులు స్వంతమవుతాయి. కాని  గునపాలు,పారలు ఉపయోగించాలి,...
గుడి ప్రాంతం అంటే   .. మడిగా వుండాలి కదా .. తను సెక్యులర్.. పాపం  మడికి పనికి రాడు..
అదీ కాక, తనకు పెళ్ళంటే ఖర్మ కాలి అవలేదు కాని,  తను అప్పుడే తాత వయసుకు వచ్చేస్తున్నాడు. ఆ గునపాలు, పారలు పట్టుకుని శారీరక శ్రమ అంటే కష్టం.. అందుకని రాజమాతకు చెబ్తే సరి. ఆమె చూసుకుంటుంది..
ఆవిడదగ్గర ఎంత అడ్డమైన పనులున్నా చెప్పండమ్మా చేస్తామంటూ జుత్తూడిపోయినవారు, గెడ్డాలు మీసాలు పెంచుకున్నవారు  చాలా మంది ఉన్నారు… వాళ్లకి తనంటే కూడా చాలా వినయమూ భక్తీ కలవారు. .. అని బంగారం కబురు  రాజమాతకు చెప్పడానికి వెళ్లారు  యువరాజా వారు..  

అక్కడకు వెళ్లేటప్పటికి అక్కడ జైలు నుంచి వచ్చిన కిష్టన్నయ్య ఉన్నాడు..
” ఏంటన్నయ్యా ఇలా వచ్చావు.” అన్నారు  యు. రా.
“తమ్మూ ! నీ మీద నాకు చాలా కోపం గా ఉంది. “ అన్నాడు కిష్ట్
“ఏమైంది ?”
“ఎప్పటికైనా మనం మనం ఒకటి.. అలాంటప్పుడు ఎవరికో తిండి లేదని రాజమాత ఏడిచినారట  ?”
“అవును.. నేను.. అక్కడెక్కడో చెప్పాను కదా ?”
“అదే.. అదే… ఎక్కడో చెప్పడమేమిటి , నాకు చెప్పొచ్చుకదా ? ఎప్పటికైనా మనం మనం ఒకటి కదా?”
“నువ్వేం చేస్తావన్నయ్యా”
“ఏడుస్తుంటే ఓదార్చడంలో నేను చాలా పరిశోధన చేసాను, నేనొచ్చి క్షణంలో ఓదార్చగలను..ఆమాత్రం అమ్మని ఓదార్చలేనా.. ఎప్పటికైనా మనం మనం ఒకటి. నీకు తెలియదా?  “
“నిజమే అన్నా .. నువ్వెంతోమందిని  ఓదార్చావు కదా.. మరచిపోయాను, సారీ…”
“ఇక ఎప్పుడూ అలా చేయకు తమ్మూ,నా దగ్గర ఎప్పుడూ బిక్క మొహం రెడీగా ఉంటుంది. అదేసుకుని వెంటనే వచ్చెయ్యగలను.. ఎంత చెడ్డా మనం మనం ఎప్పటికైనా ఒక్కటే కదా..  “ అన్నాడు క్రిష్ట్.

సరే తాను విన్న బంగారు కల, ఆ అన్న ముందు చెప్పడమా మానడమా.. అని ఆలోచించారు యు. రా. వారు. లక్షలకోట్లు సునాయాసంగా  లాగడానికి ఎన్నో ఉపాయాలు తెలుసున్నవాడు, అనుభవజ్ఞుడు, కనుక చెప్తేనే మంచిది అని నిర్ణయించుకుని, రాజమాతకు  బంగారు రాశులు గురించి చెప్పారు.. యు.రా వారు…
“పవిత్ర ప్రదేశమంటున్నావు.. అక్కడ వారి సెంటిమెంట్ కు ఏమీ ఫర్వాలేదుగా మరి” అన్నారు రాజమాత.
”ఫర్వాలేదు మాతా,.. ఏదైనా తేడా వస్తే..మరల మనం కట్టించి ఇద్దాము..”
అన్నారు యు. రా.
కిష్ట్ అందుకుని..” కావాలంటే.. మా బామ్మర్ది ఉన్నాడు.. తనదైన శైలిలో ప్రార్థనా మందిరాలు అవీ కట్టించిన అనుభవమున్నవాడు, వాడిని రప్పిస్తాన”న్నాడు.

రాజమాత గారు వెంటనే కార్య రంగంలోకి దిగారు. చిరంజీవి చెప్పిన కల ఎపిసోడ్ తనలోనే దాచుకుని, మంత్రిపుంగవులకి పనులు పురమాయించారు. అధికారులకు ఆదేశాలందాయి.. క్రింద ఉద్యోగులు అనేకానేక సాంకేతిక కారణాలు చెప్పినా.. ఎవరికీ వినపడలేదు. ప్రతి పక్షాలలో కొందరు  ఇదేమి సెక్యులర్ దేశం.. అన్నారు…మరికొందరు మేము కొత్త ఊరు కట్టుకుంటాము,మాకు మేజర్ షేర్ కావాలన్నారు. మరికొందరు, అది మాద్వారా బడుగు వర్గాలకు పంచాలి.. అది మేం నొక్కుడంటున్నాము అన్నారు.. ఇలా అనేక విధంగా ముక్త కంఠం తో అందరూ   ప్రతిఘటించారు..
ప్రజలు వంటలు, వార్పులూ చేసి నిరసనలు తెలియజేసారు. బట్టలుతికి, ఆరేసి, మిరపకాయ బజ్జీలు వేసి, అర్థ గుండులు పావు గుండులూ చేయించుకుని నిరసనలు ఉవ్వెత్తున.. తెలియపర్చారు. దిష్టి బొమ్మలు అందమైనవి తెప్పించి అంత్యేష్టి క్రియలు చేయించారు. ఈ ఉద్యమ సమయాన కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారికి తొత్తుగా కొందరు నాయకులు పుట్టారు.

రాజమాత ఆలోచించారు. వృద్ధరాజమాత ఫొటోకు దండేసి.. నమస్కారము పెట్టి.. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకున్నారు.. ఏమి స్ఫూర్తి పొందారో.. మంత్రివర్యులను కేకేసారు.. ఉద్యమాలలోకి చొచ్చుకుపొమ్మన్నారు. చొచ్చుకుపోయి విచ్చిన్నం చేయండి అన్నారు. బంగారం ఆలోచన  యువరాజా వారి డ్రీమ్ ప్రాజెక్ట్.  అని లోపాయికారీగా చెప్పారు.
వెంటనే హవేలీని నమ్ముకు బ్రతుకుతున్న  భజనపరులైన మంత్రిగణం.. “అమ్మమ్మా ..అతడే మా భావి మహరాజు.. “ అని వంగి వంగి దణ్ణాలు పెట్టారు, కళ్ల నీళ్లు కూడా పెట్టుకున్నారు..   తామూ ఉద్యమంలోకి రహస్యంగా చొరబడ్డారు..బజ్జీలు వేసే మూకుళ్ళు, చట్రాలు మాయంచేసారు. బట్టలుతికే బండలు మాయమయ్యాయి. పెద్ద నాయకులయితే లాభంలేదని, చోటా నాయకులను పిలిచారు.  సామ, ధన, లాభోపాయాలు ఉపయోగించారు..  అంతే… నిరసనకారులు ఐకమత్యంగా, మిగిలిన బజ్జీలపిండీ, ఉతకాల్సిన బట్టలు పట్టుకుని ఇళ్ళకు పోయారు.. చిరుగేతప్ప, బట్ట కనపట్టంలేదని .. బట్టలిచ్చిన ధర్మపత్నులు..పతులను .. ఉతికి ఆరేసి, ఇస్త్రీ చేసేస్తున్నారు. బొత్తిగా ఖారంలేని బజ్జీలను వేసారని పిండి తిని రుచి చూసిన  వారు  తమ అయిష్టాన్ని తెలియబరచారు.

అక్కడ కేంద్ర స్థానంలో గోతులు తవ్వడం యదేచ్చగా సాగుతోంది…బంగారు రాశులకోసం.  ఇది ఇలా ఉండగా  ఇంకా పలు ప్రాంతాలలో కళ్లు మూసుకుని సర్వసంగ పరిత్యాగులు నిద్ర పోతున్నారు… వారితో పాటు సర్వ సంగ భోగులూ కూడ నిద్ర పోడం మొదలెట్టారు, పక్కలో గునపాలు, పారలు రెడీగా పెట్టుకుని. -- బంగారు రాశులను కలలో కనడానికి. ఇక చూడండి… ఎన్నికలలో…  

Sunday, October 13, 2013

దసరా శుభాకాంక్షలు..


దసరా శుభాకాంక్షలు.. అందరికీ…


"…….విశ్వంలో మహాశక్తి పలువిదాలా వ్యక్తమవుతోంది. ఒక మహానది ఆరంభస్థానంలో సూక్ష్మంగా, క్రమంగా మహాగిరుల నుంచి దుమికే రూపంలో ఉగ్రంగా, మరొక చోట వేగంగా, ఇంకొకచోట సౌమ్యంగా, వేరొక తావున ప్రళయ భీకరంగా… ఇలా బహురూపాలతో కనబడుతున్నట్లే - ఆ శక్తి ప్రవాహం  ఉగ్ర, సౌమ్య, ఉభయ మిశ్ర రూపాలతో నిర్వహిస్తోంది. అందుకే ఆ శక్తిలో కాళీ, చండీ వంటి ఉగ్ర రూపాలు; గౌరీ, లక్ష్మీ వంటి సౌమ్య రూపాలు; వాణి, గాయత్రి వంటి జ్ఞాన రూపాలు.. ఎన్నోవైవిధ్యాలను అనేక దేవతాకృతులుగా అర్చిస్తున్నాము.

పోషించే శక్తి అన్నపూర్ణ, ప్రేమ శక్తి రాధ, రక్షించే శక్తి దుర్గ.....ఈవిధంగా మన పురాణ గ్రంధాలు, మంత్ర శాస్త్రాలు విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేశాయి........

....... - గ్రామదేవతల పూజలు, జాతరలు, బతుకమ్మ పండుగల వంటి సత్కర్మలు, చిందులు, పాటలు, సంబరాలు .. ఇవన్నీ ఒకే పరాశక్తిని ఆరాధించే అనేకమైన అందమైన పరంపరలు.

ఇన్ని వైవిధ్య భరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధంచేసుకున్న హైందవ ధర్మంలోని అద్భుతానికి జోహారులు ! శరదృతువు ఆరంభంలో తేటమనసుతో ఆ మహాచైతన్యాన్ని “అమ్మా!” అంటూ పిలిచి పూజించే నవరాత్రుల వేడుకలో, దేశమంతా పునీతమౌతున్నది.

హిమవత్పర్వతం జగదంబ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని వింధ్యవాసినికి నెలవుగా, చివరి భాగమైన మలయాళ ఖండాన్ని మలయాచల వాసిని భగవతికి తావుగా భావించిన శక్తి సంప్రదాయము… ఈ దేశపు ఆది, మధ్య. అంతాలని జగదంబ స్థానాలుగా పూజించడమే, అడుగడుగునా “శక్తి పీఠాల”ను ప్రతిష్టించుకుంది.

ఈ కారణం చేతనే ఈ దేశాన్ని తలచుకోగానే జగన్మాతృభావన పొంగుకువచ్చి ‘వందేమాతరం’ అని మోకరిల్లుతాం.

విశ్వజనీనమైన విశ్వజననీ భావానికి వందనాలు. ......."


(ఈ లోకమే అమ్మ స్వరూపం, అమ్మ స్వరూపమే ఈ లోకం.. ఎంత చక్కటి భావన;;;
ఈ సమన్వయం ..ఎవరు చేయగలరు  ఇంత చక్కగా…
సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తప్ప. ..)
[బ్రహ్మశ్రీ సామవేదం వారి ‘ఏష ధర్మః సనాతనః’ నుండి సేకరించడమైనది.]