Pages

Thursday, February 27, 2014

మహాశివరాత్రి శివా కాంక్షలు



తవ తత్త్వం నజానామి కీదృశోసి మహేశ్వర ।
యా దృశోసి మహాదేవ! తా దృశాయ నమో నమః ॥  (పుష్పదంత విరచిత శివమహెమ్నస్తోత్రం)

ఓ మహేశ్వరా ! నీ తత్త్వము ఎటువంటిదో నాకు తెలియదు. మహాదేవా ! నీ తత్త్వము ఎటువంటిదో అటువంటి తత్త్వమునకు నమస్సులు…



అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధుపాత్రే
సురతరు వర శాఖా లేఖినీ పాత్ర ముర్వీ
లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం
తదపి తవగుణానామీశ । పారం నయాతి ॥ (పుష్పదంత విరచిత శివమహెమ్నస్తోత్రం)

నల్లకొండవంటి కాటుకను సముద్రంలో కలిపి సిరాగా చేసుకొని, కల్పవృక్షపు కొమ్మను లేఖిని (కలం)గా చేసుకొని,భూమి యనే విశాల పత్రంపై సర్వకాలములలో సాక్షాత్తు శారదాదేవియే లిఖించినప్పటికీ ఈశ్వరా ! నీ గుణములను తుదముట్ట వర్ణించలేదు. (మనోవాక్కులకు అతీతమైనది శివతత్త్వం అనిభావం).

అబ్బా! నిబ్బరమన్న నీదికద, దేవాదుల్ మహాతప్తులై
బొబ్బల్ వెట్టుచు బార, సాహసిగ నీవున్నావు విశ్వాన త-
బ్బిబ్బుల్ బాపగ; లోకమెల్ల ప్రళయాభీలోద్ధతిన్ దూలుచున్
దిబ్బల్ మున్గెడి వేళ నిల్చు చిరదీప్తీ ! నీలకంఠేశ్వరా !     (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి “నీలకంఠేశ్వరా  శతకం)

అయ్యా! నిబ్బరం అంటే నీదే కదా ! దేవదానవులు గొప్పగా తపించి బొబ్బలు పెడుతూ పారిపోగా, ప్రపంచంలో తబ్బిబ్బుల్ని తొలగించడానికి నీవొక్కడివే సాహసంగా నిలబడ్డావు.. లోకాలన్నీ ప్రళయంలో లీనమౌతున్న వేళ అదే నిబ్బరంతో నిలిచావు. ఈ నిబ్బరం నీ శాశ్వతత్త్వాన్ని తెలియజేస్తుంది. నువ్వు శాశ్వత ప్రకాశానివి.  

శివరాత్రి వైశిష్ట్యం

లయకారకుడైన మహా కాలుని వలన సర్వబంధాలు సంహారమై తిరోహితమై, కేవల లీనమైన కైవల్యం లభిస్తుంది. మాసాంతానికి సంధ్య గా ఉండే బహుళ చతుర్దశి ‘మాస శివరాత్రి’గా, సంవత్సరాంతానికి సంధిగా ఉండే ‘మాఘ బహుళ చతుర్దశి’ ‘మహా శివరాత్రి’గా వ్యవహరింపబడుతున్నాయి.

కాలిఫోర్నియాకు చెందిన ఆర్నాల్డ్ లీబెర్ అనే శాస్త్రవేత్త - “సౌర కళలు, చంద్రకళల ఆధారంగా జరిగే విశ్వ చలనంలో వాటి మార్పుల ప్రభావం, స్పందనా ప్రతి ప్రాణిపై ఉంటుం”దని తెలియజేసారు. ఆ కళల మార్పులను గమనించి, వాటికి
అనుగుణంగా తమ చైతన్యాన్ని పునీతం చేసుకొని, శివచైతన్యాన్ని ఆవిష్కరించుకునేందుకు తగిన విధంగా పర్వదినాలను ఏర్పరచారు మన మహర్షులు.

యోగభూమికలో చైతన్యం స్పందించి, మన యోగసాధనలను విశ్వ చైతన్యంతో అనుసంధానం చేసే ఒక మహా యోగ తరుణం - మహా శివరాత్రి. మాఘ బహుళ చతుర్ధశి అర్థ రాత్రి సమయం.

యోగ సాధకులకు ఇది సువర్ణావకాశం. “లోకమ్ములు లోకేశులు తెగిన తుదినలోకంబగు పెంజీకటికి”ఆవల ఆవిష్కృత మయ్యే కాంతి పరమాత్మ. మహాంధకారాన్ని భేదిస్తూ, ఆవిష్కరించిన శాశ్వత జ్యోతి శివుడు.

సచ్చిదానందమయమైన శివజ్యోతిని సాక్షాత్కరించుకునేందుకు, జాగరూకులై యోగసాధన చేసే మహా శివరాత్రి పర్వదినం ఈ రోజు… నిద్రమాని-అనగా తమోగుణాన్ని విడచి - ఏకాగ్రంగా శివ ధ్యానమగ్నులై తరించడమే జీవన పరమార్థం..                                                   (బ్రహ్మశ్రీ సామవేదం వారి రచన ‘శివజ్ఞానమ్’ నుండి )



అంతా మిధ్య తలంచి చూచిన నరుడట్లౌ టెరింగిన్ సదా
కాంతల్పుత్రులు నర్థమున్ తనువు  నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతి జెంది చరించుగాని పరమార్థంబైన నీ యందు దా
జింతాకంతయు జింత నిల్పడుగదా శ్రీ కాళహస్తీశ్వరా ! (ధూర్జటి కృత ‘శ్రీ కాళహస్తీశ్వర శతకం’)
  
శ్రీ కాళహస్తీశ్వర స్వామీ ! ఆలొచించి చూడగా ఈ జగమంతయు మిథ్య అని తెలిసియు, భార్యాపుత్రులు, సంపదలు, ఈ శరీరము శాశ్వతములని భ్రాంతిని జెంది మానవుడు ప్రవర్తించును కాని, సకల సంసార విషయముల కంటెను పరమార్థంబైన నీ యందు అతడు కొంచమైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు కదా…