Pages

Tuesday, April 17, 2018


(అప్పట్లో మా మిత్రులతో కలసి రాజమండ్రిలో హాసం క్లబ్ నిర్వహించేవారం. "హా" అంటే హాస్యం, 
"సం" అంటే సంగీతం.. రెండూ కలసి హాసం.. చాలా కాలం అంటే సుమారు 10 ఏళ్ళు విజయవంతంగా 
నిర్వహించాము. ఇప్పటికీ మళ్ళీ మొదలు పెట్టండి అనేవాళ్ళు ఎక్కువ.. ఆ జ్ఞాపకాలలొంచి.....)


‘హాసం క్లబ్’ కార్యక్రమాలలో నాకో అడ్వాంటేజ్ ఉండేది..…
మైకు నా చేతిలోనే ఉండేది.. అందుకని ఎప్పుడైనా ఏ జోకైనా చెప్పొచ్చు.. అవాకులు చవాకులు పేలొచ్చు.. 
జోకుకీ జోకుకీ మధ్య  గాప్ ఫిలప్ చేయడం డ్యూటీ నాదే.. అప్పుడు చమత్కారాలు గుప్పేవాడిని..


అలాగే ఓ డిసడ్వాంటేజ్ కూడా ... ముందర నేనే సభ ప్రారంభిస్తాను, నా పేరు చెప్పుకొనే సందర్భం ఉండదు.  
అలాగే వందన సమర్పణా నాదే , అక్కడా నేనెవరో చెప్పుకోకుండానే అయిపోతుంది. 
ఇక నా పేరు ఎవరికీ పెద్దగా తెలిసే అవకాశముండేది లేదు. అంచేత .. అంటే ఉన్న పేరు ఉంది తప్ప 
నేను ఫలానా అని తెలిసేది కాదు.. అదీకాక ఎవరైనా తప్పులు మాట్లాడినా, ఎవర్నైనా పిలవడం 
నేను మర్చిపోయినా .. 
మొట్టికాయలు నాకే… సరే జోకేవాడి కష్టాలు జోకేవాడివి ఏంచేస్తాం… ఓ సారి సభలో వేసిన జోకు మీకు చెబ్దామని. ..  

‘హాసం’ బ్రెయిన్ చైల్డ్ ‘ హాసం క్లబ్ ‘ అన్నాం కదా.. అందుకని మా కార్యక్రమాల గురించి ప్రతీ పత్రికలోనూ వార్తలు, 
విశేషాలు వస్తూ ఉండేవి. మొదటి రోజుల్లో మా ప్రోగ్రాం కరపత్రాలు హైదరాబాదు ఆఫీస్ నుండి వచ్చేవి. 
ఫలానా టైముకు ఫలానా వేదికమీద కార్యక్రమం ఉంటుందని,..మా కన్వీనర్ల పేర్లు కూడా వేసేవారు.. 
ఆ కరపత్రాలు మేం ముందుగా పోస్ట్ లో అందుకుని, అందరికీ  పంచేవాళ్లం.
మొదటి రోజుల్లో శ్రీరామనగర్ లో మన అప్పారావుగారి డాబా మీద మా కార్యక్రమాలు జరిగేవి..

ఒక రోజు కార్యక్రమంలో … సాయంత్రం 6 గంటలకు సభ. అందరూ వస్తున్నారు.. 
మే ప్రారంభించడం ఒక అరగంట లేటయింది.6-30 అయిపోయింది. నేను మైకు పుచ్చుకున్నాను. 
అందరూ లేటుగా మొదలెట్తున్నందుకు తిట్టడానికి రెడీగా ఉన్నారు.. నవ్వుల కార్యక్రమంలో 
సీరియస్ గా ఉంటే ఎలా ? వీళ్లను నవ్వించాలి..
”సభా సరస్వతికి నమస్కారం ..(నా అలవాటైన బాణీ )..
“పీ.సి సర్కార్ (సీనియర్) పేరు మీరు వినే ఉంటారు. మన దేశం గర్వించదగ్గ గొప్ప ఐంద్రజాలికుడు. 
ఆయనోసారి లండన్ లో తన ఇంద్రజాలం ప్రదర్శిస్తున్నాడు. మొదటిరోజు కార్యక్రమం సాయంత్రం ఏడు గంటలకు 
ప్రారంభమవాల్సి ఉంది. పావుగంట లేట్ అయ్యింది. విదేశీయులు చాలా panic అయిపోతున్నారు.
“సర్కార్ మదలెట్టాడు. “ladies and gentlemen ! i am late to start the progm.by fifteen minutes, 
I know. Sorry, sir ..I declare that I am not late. check your watches .. it is 7-00 only” అన్నాడట. 
అందరూ వాచీలు చూసుకుంటే .. అందరి వాచీలు 7-00 చూపిస్తున్నాయిట  .. 
ఇది నా ఫస్ట్ ఐటెమ్ అన్నారుట సీనియర్ సర్కార్..

దానికీ దీనికీ ఏం సంబంధమనుకోకండి. మన హాసం కార్యక్రమం 6గంటలకు ప్రారంభించాలి, 
కాని ఇప్పుడు 6-30 అయిందనుకుంటున్నారు మీరు.. మీ చేతిలో ఉన్న కరపత్రాలు చూడండి.. 
మన కార్యక్రమం 6గంటలకే.. “ అని నేను అనగానే … కొంచెం నిశ్శబ్దం .. వెంటనే కరతాళ ధ్వనులు…

[ఇలాంటి స్పాట్ జోకులు మంచి స్పందన కలిగించేవి..]

1 comment: