Pages

Thursday, April 28, 2011

'బఫే వైరాగ్యం'




"మా మనవడి పెళ్ళి..ముందుగా వచ్చి దగ్గరుండి పెళ్ళి జరిపించాలి.."
రామారావు స్వయంగా వచ్చి పిలిచాడు.
"అలాగేరా !" అన్నా
"అలాగే అంటే కుదరదురా...మనదేనాటి స్నేహం. తప్పక రావాలి"
"అలాగేరా ! వస్తానన్నాగా ? "...
"వివాహ భోజనంబు వింతైన వంటకంబు...వియ్యాలవారి విందు...
ఓహొహ్హో నాకే ముందు" పాట ''మ్ చేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళా....
"హుఁ ...అయితే ప్రయాణానికి రెడీ అన్నమాట." అని ఆవిడ 'హు'మ్
చేసింది.
"మరి వెళ్ళాలికదోయ్.."
*****
"ఇంకా పెళ్ళి కాకుండానే దంపతుల్ని ఆశీర్వదిస్తారట...అక్షతలట..ఏమీటో
పద్ధతులు" రామారావు చిటపటలాడిపోతున్నాడు.
" ముహూర్తం అర్థరాత్రి అంటే రాలేరు కదరా మరి?" అని సర్దబోయా.
"ఏమిటిరా నువ్వుకూడాను...పెళ్ళి చూసి ఆశీర్వదించండని కదా మన
మిచ్చిన శుభలేఖల్లో వున్నది... ముందొచ్చి...తినేసి....ఇంకా దంపతులవ్వని
వాళ్ళ చేతులు పట్టుకుని, ఊపేసి వెళ్ళిపోతారా ? "--వాడు అలా అంటే ఏమీ
అనలేకపోయా.." బఫే భోజనాలొద్దు...అలా నిలబడి తినకూడదుట... తప్పుట
అన్నా.. అలాగే టేబిల్స్ వేస్తామండి అన్నారు పాపం ఆడపెళ్ళివారు..కాని మా
ప్రబుద్ధుడు ఒప్పుకోడే ?---అది ఫేషన్ . అందుకని బఫే లేపోతే కుదరదట....
నేను గట్టిగా అంటే మనవి చాదస్తాలు.." బాధ చెప్పుకున్నాడు రామారావు.
"సరే సాయంత్రం సమూహ భోజనాలన్నమాట!--సమూహ భోజనంబు..
అంతస్తులన్ని బందు.." విషయం సీరియస్ అవకూడదని నే పాటందుకున్నా....
నా (దు)స్వరగానానికి వాడు నవ్వేసాడు.
***********
నిజానికి నాకూ ఎందుకోగాని బఫే ఇష్టముండదు..వద్దనుకుంటూనే..లైనులో
నించుంటాను.. హాలు చాలా చిన్నది...కన్యాదాత పాపం చాలా గిల్టీ గా
అందరికీ సారీ చెప్తున్నాడు...సీజను మూలాన ఇంకేదీ దొరకలేదుట. ఇదైనా
ఎవరో కాన్సిల్ చేసుకుంటే దొరికిందట. రిసెప్షన్ కి చాలామంది వచ్చారు. మా
పాతమిత్రులు కొందరు కలిసారు....
కాస్త ప్లేసులోనూ... ప్రక్క మొలకలెత్తే గింజలు, పచ్చికూర ముక్కలు,
ప్రక్క ఘుమ ఘుమలాడే మషాలా వంటకాలు, అదికాక మామూలు భోజనం...
ప్రక్క ఛాట్....ఇంకో ప్రక్క పెసరట్టులు, మినపట్టులు, రవ్వట్టులు...
వేడి వేడిగా వేస్తున్నారని అట్ల లైనులో నా పా.మిలు కొందరు జొరబడ్డారు....
పెనంమీద ఆట్లు ట్రిప్పుకి నాలుగేసే రెడీ అవుతున్నాయి...సర్వర్ అట్లకాడతో
అట్లు అలా పైకెత్తగానే "నాకూ" "నాకూ" అంటూ గాలిలోకి చాలా ప్లేట్లు లేస్తున్నాయి.
'మాయాబజారు' సినీమాలో రమణారెడ్డి సృష్టికి ఎగపడే కౌరవసోదరులు
గుర్తొచ్చారు. జగన్మోహిని అమృతం దేవతలకు మాత్రమే వయ్యారంగా
పంచుతున్నట్టు అట్లకాడ ఓనర్ ప్లేట్లు ఎంచి ఎంచి మరీ పెడుతున్నాడు
అట్లను.

నేనూ కొంతమంది మిత్రులం భోజనాలలైనులో పడ్డాం...
"ఇంత కూడుంటెట్టమ్మా..ఇంత పప్పుంటెయ్యమ్మా"...నా లోపల్నించి కోరస్
వినపడుతోంది...బాబూమోహన్ చేతిలో అల్యూమినియమ్ కంచంలా నా చేతిలో
చిప్ప నాకు తెలియకుండానే కదులుతోంది. లైనయితే ఎంతకీ కదలటంలేదు.
అనుమానంవచ్చిచూస్తే కొందరు తెలివైనవారు ముందువార్ని "హలో బాగున్నారా"
అంటూపలకరించి దూరిపోతున్నారు..బఫే అంటే 'క్లాసు'..చూసీ చూడనట్టు
ఊరుకోవాలి కాని అడక్కూడదు.

సెర్వింగ్ టేబిల్ దగ్గర చాలా క్రౌడ్..సర్వర్ మా ప్లేట్స్ లాక్కుని
"టిక్కూ" "టిక్కూ" అంటూ ఏవేవో వేసి ప్లేటులు చేతిలో పెట్టాడు///సంజీవనోద్ధారక
హనుమాన్ లా విజయోత్సాహంతో నిండు ప్లేటులు పైకి పట్టుకుని...జనాన్ని
గెంటుకుంటూ కొందరివతలకి వస్తుంటే., ఐటమ్ అయిపోతే మళ్ళీ అడగడానికి
దగ్గరగా ఉంటే మంచిదని అక్కడే లాగించేస్తున్నారు మరికొందరు.. కొంచెం
ఖాళీగావున్నచోట నించున్నా....నా వెనకాలే మావాళ్ళు కూడా వచ్చారు....
అలా అలా చూస్తుండగనే ఏరియా కూడా నిండిపోయింది..
ఒకాయన గులాబ్ జాం తినడానికి చెమ్చాతో కుస్తీ పడుతున్నాడు గుండ్రంగా
వున్నఆ గడుసు గులాబ్ జాం చెమ్చాబారిపడకుండా తప్పించుకుంటూ
ప్రక్కాయన ప్లేటులోకి జారింది. ఇందాక తెచ్చుకున్నది నేనుగాని
తినలేదా ఏమిటి అని ఆలోచించినవాడై కామ్ గా తినేస్తూన్న ఆయనకి
ఈయన్ని వాచ్ చేస్తున్న ఆయన శ్రీమతి కనపడింది..చక్ మని చూపు తిప్పేసు
కున్నాడీయన. డిసైడ్ అయిపోయాడు...ముందున్నది క్రోకోడైల్ ఫెస్టివల్ అని.
ఐనా కోరివచ్చిన గులాబ్ జాంని వదల లేకపోయాడు. ఒక తప్పుకి రెండు
శిక్షలుండవని తెలిసిన ఙ్ఞాని కనుక ఇంకో స్వీట్ కూడా తెచ్చుకుని వెనక్కి తిరిగి
లాగించేస్తున్నాడు.....సుగర్ స్టాకిస్టేమో పాపం ! ఏమో పాపం.
ప్రక్క...ఒకాయన ప్లేట్ పట్టుకుని కబుర్లు చెప్తూ తింటున్నాడు.. యెత్తులలో
ఉన్న తేడాలవలన ఆయన మూతి క్రిందుగా ప్రక్కాయన ప్లేటు నీటుగా అమరింది.
సదరు మూతిగలాయన ప్లేట్--దానిక్రింద వుంది..మూతికి దగ్గరలోని ప్లేట్ తనదా
లేక దూరముగా నున్నది తనదా అన్న సందిగ్ధంలో వుండగా మరో పొట్టాయన
క్రింద ప్లేట్ తన ప్లేట్ గా భావించాడో లేక అంత ఎత్తు చెయ్యెందుకు ఎత్తడం
అనుకున్నాడో అందుబాటులో వున్న ప్లేట్ తో అడ్జస్ట్ అయిపోతున్నాడు.
ఒకావిడకి తింటుంటే ఎక్కిళ్ళు...మంచినీళ్ళక్కడెక్కడున్నాయో..దగ్గరలో కనపడటం
లేదు....అటుగా వెళ్తున్న బుడతడ్ని నీళ్ళు తెచ్చిపెట్టమంది...వాడి రెండు చేతుల
లోనూ రెండు ఐస్క్రీం గిన్నెలు...మూతినిండా ఐస్క్రీం..."అమాయకురాలా...నేనెలా
తేగలను" అన్నట్టు చూసాడు సదరు బుడతడు....
అక్కడ వున్న లావుపాటి ప్రక్కింటి (ముళ్లపూడి) పిన్నిగారి భోజనం పూర్తయిందిలా
వుంది..ఎంగిలి ప్లేట్ ఎక్కడ పెట్టాలా అనుకుంటూ పెరుగుమూతితో వస్తోంది, ఎక్కిళ్ళ
అక్కయ్యగారి కాళ్ళ దగ్గరవున్న ఖాళీలో ఎంగిలి ప్లేట్ పెట్టి హస్తశుద్ధికై నిష్క్రమించింది
పెరుగుమూతి....ఎక్కిళ్ళ బాధతో స్టెప్స్ వేస్తున్న ..గారు లా.ప్ర.ము.
పిన్నిగారి ఎంగిలి ప్లేట్ లో ఉద్ధతితో స్టెప్ వేసారు... నాట్య ఉద్ధతి యొక్క
ఉధృతానికి ప్లేట్ లోవున్న పులుసుముక్కలు ఎగిరి నీట్ గా టక్ చేసుకుని అటుతిరిగి
భోంచేస్తున్న నాజూకుగారి వైట్ షర్ట్ యొక్క తెలుపుమీద అంటుకున్నాయి...
అలికిడికి ఆయన వెనక్కి తిరిగాడుకాని..ఆయనవీపు ఆయనకి కనపడదు కదా పాపం...
ప్రక్కనున్నభోజరాజు కిసుక్కున నవ్వబోయి..గబుక్కున నవ్వుకి మూతేసి,
మూతేసిన మూతితో తను గ్రహించిన విషయాన్ని నాజూకుగారికి విశదీకరించి పుణ్యం
కట్టుకున్నాడు....
నాజూకుగారి ముఖంలో కాంతి మాయమయింది. "మరకలు చేసుకు వస్తే ఊరుకొనేది
లేదు. అసలే తెల్లషర్ట్ వేసుకెళ్తున్నారు జాగ్రత్త///ఖబడ్దార్..." అంటూ జాగ్రత్తలు చెప్పి
మరీ పంపింది...నాజుకుగారి లలితాంగి. హౌ టు ఫేస్ హెర్ ..అదీ ఆయన సమస్య....

అలా అందర్నీచూస్తూ నేను పాపం చాకచక్యంగానే తింటున్నాను...ఒక్కోప్పుడు కాలం
కలసి రాదు కదండీ ? నా ప్రక్కాయన ఎడంచేయి సరిగ్గా సడన్ గా నా కుడి మోచేతికి
తగిలింది... నోట్లోకివెళ్ళవలసిన నా చెయ్యి గురితప్పి ముక్కులోకి వెళ్ళింది...రెండు
భయంకరమైన తుమ్ములొచ్చాయి..వాటి ధాటీకి ప్లేట్ సపదార్థంగా యెగిరింది...
అందులోవున్న భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయములన్నీ యెగిరి నాకూ...నా తోటివారికి
సచేల స్నానం..తుమ్ముల ధ్వనికి పిల్ల ఏడుపులు...పెద్ద నవ్వులూ కలబోసిన
నేపధ్యంలో....'వాష్ బేసిన్' దగ్గరకి పరుగెత్తా...నాట్ టు వాష్ ది బేసిన్..
నన్ను నేను వాష్ చేసుకోడానికి. నాతో సరియెంగిలి స్నానాలు చేసిన పెద్దలు
"బొత్తిగా మేనర్సు లే" వంటూ నా వెనకాల వస్తున్నారు...
రోజే మళ్ళీ డిసైడయిపోయా...బఫే లో భోజనం చేయకూడదని...
"ఆఁ ఇది కూడా వైరాగ్యమే బాబూ....ప్రసూతి వైరాగ్యం...మరేదో వైరాగ్యం లాగా "
అని మీరు అనొచ్చు. పాపం మీరు నిజం మాట్లాడుతారు.

------oooOOOooo-----

Tuesday, April 26, 2011

కనబడుట లేదు...కనబడుట లేదు...కనబడుట లేదు











"ఏడాది వయస్సు....గుండ్రటి ముఖం....నవ్వుతూ వుండడం, నవ్విస్తూ వుండడం...అప్పుడప్పుడు రామా..కృష్ణా....వనభోజనాలప్పుడు ఒకసారి వండిన అనుభవం...పిచ్చాపాటీ....ఈ పరిచయం చాలు అనుకుంటా...కనపడ్డం లేదు."
అని ఓ ప్రకటన ఈయడానికి డిసైడయిపోయా....

ఎందుకైనా మంచిదని ముందు నాకు పరిచయమైన వార్ని అడిగిచూద్దాం అని,
సురేఖ (అప్పారావు) గార్నడిగా. ఆయన "మా వీధిలో చూసానండీ" అన్నారు....
తిరిగి రాలేదు మరి ఏమైనట్టు....మా ఫ్రెండ్ ఇంకో హనుమంతరావుగార్నడిగా..
వాళ్ళ వీధిలోకి రాలేదన్నారు..

మొన్న సీతారామ కళ్యాణం నాడు వడపప్పు, పానకం టైముకి -వెరీమచ్ హియర్.
చక్కగా హనుమస్సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని ఫోటో అడిగి తీసుకుని
ఆ తర్వాతనుంచి గైరుహాజరయితే ఏమనుకోవాలి ? కొందరు ఆ ఫోటో కూడా
చూసామన్నారు....

ఇలాంటప్పుడు జ్యోతి గారైతే మంచి సలహా ఇస్తారు..మాకు పెద్ద దిక్కు ఆవిడే...
ఆవిడ్ని మెయిల్స్ తో బాధపెట్టా...'పోలీస్ కి చెప్పమంటారా, పేపర్లలో ప్రకటనలా,
టి.విఆ...ఏంచేద్దాం...' అంటే ఆవిడ 'అదేమిటి మీ వీధిలో నాకు స్పష్టంగా కనపడుతుంటే
మీరు లేదంటారేమిటి ?'...తర్వాత ఆవిడే చెప్పారు...నా మీద కోపం వచ్చిందిట. అందుకే
నాకు కనపడకుండా అందరికీ కనపడడం...సరే సంప్రతింపులు
మొదలయ్యాయి...
ఈ మధ్య నేను యెక్కువగా తనకి పని చెప్పటం లేదట. అందువలన తాను ప్రొజెక్ట్
అవలేకపోతున్నదట..."అంటే కంప్యూటర్ కా షా టా ల లో ఇది కూడా ఒకటా" అని అడిగా....
జ్యోతి గారు నవ్వేసి "మరేమిటనుకున్నారు...ఇప్పుడు మీ రూట్ మార్చండి....
internet explorer ద్వారా కాకుండా...Firefox..ద్వారా వెళ్ళండి...తప్పిపోయిన
మీ బ్లాగు మీ ఇంటికొస్తుంది.." అన్నారు....
ఆ ప్రయత్నం ఫలించింది... నా బ్లాగు నన్ను చేరింది....
క్రొత్త క్రొత్త ఆలోచనలు కలగాలని దీవించండి....బ్లాగులో తరచూ కలుస్తాను....
ఈ విషయంలో జ్యోతివలబోజు గార్కి ప్రత్యేక కృతఙ్ఞతలు...
(వీధి అంటే బ్లాగు అని మీకీపాటికి అర్థం అయిపోయే వుంటుంది)

Tuesday, April 12, 2011

రాముడే అంతా


శ్రీ మారుతాత్మజాయనమః


రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ యంచు రేబవళ్ళు నామమును స్మరింపజాలు పూజలు జపతపాదుల ముక్తిగోర నామమే భవాబ్ధి దరింప నావ నాకు..(శ్రీ దినవహి సత్యనారాయణగారి శ్రీరామచరితమానసము )


మారుతిని చూడ మందిరానికెళ్తే స్వామి ఏడీ ? ఎందుకుంటాడు ?...


తెల్లారితే శ్రీ సీతారాముల కళ్యాణం...స్వామికెన్ని పనులెన్ని పనులు ?...


ఏ వీధిలో విన్నా రామనామమే...ఏ నోటవిన్నా శ్రీరాముని మాటే///


ఏ ఇంట చూసినా సీతా రామ కళ్యాణ సంబరమే.....ఇలాంటప్పుడు


ఆయన గుడిలో కూర్చుంటే ఎలా మరి ? ఎక్కడ రామ కీర్తన జరిగితే


అక్కడనే హనుమ తాండవం...కదా ?



శ్రీరామనామ జపసారమెరిగినవాడు కాశికాపురినిలయుడు...శ్రీ రామ సాన్నిహిత్యానికై శివాంశతో హనుమ జన్మించాడు// హనుమను పట్టుకుంటే శ్రీరాముడు దొరుకుతాడు..ఈయన్నేలాగ పట్టడం ?


కాశీనగరంలో గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసెడివారట. ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదాట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై "ఏమైనా అడుగు ఇస్తాను" అంది..మహాభక్తుడు తులసీదాసు శ్రీరామ దర్శనం కోరారు...ఆపని తనవల్లకాదంది కాని ఉపాయం చెప్పిందాభూతం...నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. ..అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు..కన్నులనీరు కారుతూవుండగా ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు...అతన్ని పట్టుకో...అంది భూతం..శ్రీరాముడు కావాలంటే హనుమను పట్టాలి..హనుమను పట్టాలంటే భక్తితో శ్రీరామగానం చేయాలి...హనుమ సాయంతో శ్రీరామదర్శనమైంది గోస్వామికి.


తులసీదాస కృత శ్రీరామచరిత మానస్ కృతిలో శివుని వల్ల శ్రీరామ కథను అమ్మ పార్వతి వింటుంది...శ్రీరాముని బాల్యలీలలు చూడ ముచ్చటపడి తాను మనుష్యరూపంలో అయోధ్యలో చరించానంటాడు ఆ కైలాసవాసి...ఆ తారకమంత్రాన్ని భవానికి ఉపదేశించాడు భవుడు.


రామాయణగాధ అంతా యఙ్ఞమయం...శ్రీరామజననానికి అశ్వమేధం..పుత్రకామేష్టి అలా ప్రారంభమై..విశ్వామిత్రుడు రామలక్ష్మణ రక్షణలో సిద్ధాశ్రమంలో చేసిన యఙ్ఞం, జనకుని యఙ్ఞం..అలా ఒకదానితర్వాత ఒకటి...ఒక ఋషిమండలి తర్వాత ఒక ఋషి మండలి.... అదీ రామాయణ క్రమం....ఎంతోమంది శ్రీరామ దర్శనంకోసం ఎదురు చూస్తున్నారు..శబరి, అహల్య ఎందరెందరో..వారందరినీ తరింపచేయటానికి కోదండ రాముని వనవాసలీల.


రామాయణ గాథ అందరికీ తెలుసు///చివరికీ ఏమవుతోందనన్న ఏ ఉత్కంఠా లేదు...అయినా అంత శ్రద్ధగానూ వింటాము..అంత రుచిగానూ వింటాము..."శ్రీరామ! నీనామ మెంతో రుచిరా.." ..."మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి..."..ఎన్ని రుచులు చెప్పారు రామదాసుగారు..."నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా" అంటారుశ్రీ త్యాగయ్య...శ్రీరాముడు మనకు ఆదర్శం...శ్రీరామకథ మనకు ఆరాధ్యం...


శ్రీరామనవమి శుభసమయాన శ్రీరామ భక్తులైన మీ అందరికీ శుభాకాంక్షలు.

Friday, April 8, 2011

దండల నిగ్గు


చిన్న కాంట్రాక్టర్: "మీకు నేనో దండేద్దామనుకుంటున్నాను..ఎంతవుద్ది ?"

పెద్దకాంట్రాక్టర్: "దాని సిగ తరగ అనుకోవడానికేమవుద్ది..ఏమీ కాదు"

చి.కాం: ఏసాననుకోండి ఎంతవుద్ది ?"

పె.కాం: ఓస్ అంతేనా?

చి.కాం: దండ కాదండి శాలువా కప్పేమనుకోండి. ఎంతవుద్ది ?

పె.కాం: అంతేనా?

చి.కాం.: సన్మానమే చేసేసామనుకోండి..ఎంతవుద్ది?

పె.కాం. ఓస్ అంతేనా?

చి.కాం. పూల కిరీటం...సమ్మానపత్రం..సన్నాయికూడా పెట్టామనుకోండి ఎంతవుద్ది?

పె.కాం. ఓస్..అంతేనా?

చి.కాం. అంతేనా అంటే ఇంకా చాలా వున్నాయండి..ముందు వీటి రేటు తేల్చండి.. దండ కెంతవుద్ది, శాలువా కెంతవుద్ది, సమ్మానానికెంతవుద్ది.

సమ్మానానికి సన్నాయికి యెంతవుద్ది..

దండకి శాలువాకి యెంతవుద్ది

శాలువకీ సన్మానానికెంతవుద్ది.

పుటోగ్రఫి..ఈడియో కలిపి యెంతవుద్ది....

లేకుండా యెంతవుద్ది.

పుటోగ్రఫికి సన్మానానికెంతవుద్ది..

పుటోగ్రఫీకి దండకీ యెంతవుద్ది.

కన్సీషన్ యేమైనావుందా.మీకూ నాకూ ఈ

యిసయంలో కాంప్రమైజేషన్ కుదిరితే

మా ఊరి సన్మాన సంఘాలన్నిటిని హోలు మొత్తంగా మీ చేతిలో పెట్తాను..

పె.కాం. ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఇసయంకాదు...

రేటు లిష్టు చూసి చెప్పాల

మా సెగట్రీ చెప్తాడండి...సెగట్రీ.......

అలో అలో అలో గుర్నాథంగారా.....


(ముళ్లపూడి రమణీయం కార్యక్రమంలో హాసం క్లబ్ లో ప్రదర్శింపబడిన స్కిట్.... నేను వ్రాసి శ్రీ నూజెళ్ళతో కలసి ప్రదర్శించాను.....ముత్యాల ముగ్గు పేరడి...మీరు కనిపెట్టేసారు.మీటేస్టే వేరు మాష్టారూ....)

(అదీ తెలిసిపోయిందా ...నిజమే ఆ ఫోటో అప్పటిదే)

Sunday, April 3, 2011

ఉగాది వచ్చేసింది



శ్రీ ఖర నామ సంవత్సరం శుభంకరమవ్వాలని


ఇందుశేఖరుని ప్రార్థిస్తూ....


ఉ గా ది శుభాకాంక్షలు.


తెలుగు వారి పండుగ చైత్ర శు.పాడ్యమి...ఉగాది.


వసంత ఋతువు..మనస్సుకు ఉల్లాసం కలిగే వసంత కాలం


క్రొత్త జీవితానికి సంకేతంగా చెట్లు పల్లవిస్తాయి. ...


ఆ పల్లవించేకాలానికి మొదటి రోజున ఉగాది జరుపుకుంటాం... ఈ క్రొత్త సంవత్సర శుభారంభవేళ ప్రతివారి మనోక్షేత్రంలో క్రొత్త సంకల్పాలు చిగురించి రూపు దిద్దుకుంటాయి..


తెలుగు సంవత్సరాలు అరవై... ఒక చక్రం...'ప్రభవ'తో మొదలై 'అక్షయ'తో ఒక ఆవృతం...మరల 'ప్రభవ'తో క్రొత్త చక్రం.... అలా అరవై పూర్తి చేసుకుని షష్టి పూర్తి సంబరం జరుపుకోవడం ఒక సంప్రదాయం...


ఐతే.....'ప్రభవ' నుంచి మొదలుపెట్టిన సంవత్సరాలలో కొన్నిపేర్లు సౌమ్యంగావుంటాయి...


'ప్రభవ, విభవ, విజయ,జయ, మన్మథ'...


కొన్ని కొంచెం తీవ్రంగానూ విపరీతంగానూ వుంటాయి....


'దుర్ముఖి, రాక్షస, ఖర, విరోధి, వికారి'....ఇలా.... మన జీవితంలో అనుకూలతలు ప్రతికూలతలు సామాన్యం.. దానికి సూచనగా దీనిని భావించవచ్చు...


స్వాభావికంగా కూడా ప్రతివ్యక్తిలోను...సాత్త్విక, రాజస, తామస లక్షణాలు వుంటాయి..కాలగమనంలో కూడా...మలయమారుతాలు, భయంకర త్సునామీలు, బాలభానుని నులివెచ్చని అరుణకిరణాలు, మధ్యాహ్న మార్తాండుని తీక్షణ వీక్షణాలు...పున్నమి వెలుగులు, అమావాస్య చీకటులు...అన్నీ చూస్తూనే వుంటాము....


అన్నీ వుండాలి...ఫెళ్ళున ఎండ కాస్తేనే కదా... చల్లటి వాన కురిసేది... సూర్యుని వెలుగేకదా చంద్రుని వెన్నెల... "అగ్ని సోమాత్మకం జగత్" అని శాస్త్ర వచనం...అంతా ఎండయినా కష్టమే..... అంతా వానైనా దుర్భరమే...జీవనయానానికి రెండూ అవసరమే


అందుకే వేప చేదైనా; మామిడి పులుపైనా; చెరుకు తీపైనా, వగరయినా, ఉప్పైనా, అరటి పండైనా, చింతపండైనా....అన్నీ వుంటేనే ఉగాది పచ్చడి మాధుర్యం.....


ఖ ర నా మ సం వ త్స ర ఉ గా ది శు భా కాం క్ష లు

Saturday, April 2, 2011

ఏమండీ ఆవిడ వచ్చింది....

"హలో రావుగారూ! చాలా కాలానికి కనపడ్డారు.....బాగున్నారా?"


"ఆఁ ! బాగున్నానండి...మీరు బాగున్నారా ?"


" రిటైరయినట్టున్నారు కదా? లైఫ్ చక్కగా ఎంజోయ్ చేస్తున్నారా ? లేదా ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా... "


ఆఁ..ఆఁ..అవునండి ఉద్యోగం చేస్తున్నా...."


"అచ్ఛా! ఏం ఉద్యోగం చేస్తున్నారు.."


"డ్రైవరుగా ఉంటున్నానండి."


" డ్రైవరుగానా ? అదేమిటి మీరు బ్యాంకులో కదా చేసేవారు."


"అవునండీ...క్లర్క్ గా చేసి...ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాను... 34ఏళ్ళ సర్వీస్ అయ్యాక చక్కగా రిటైరయ్యాను.."


"మీకు పెన్షన్ వస్తుందేమో కదా ?"


"వస్తుందండి..."


"మరి డ్రైవరంటారేమిటి"


"నిజమేనండి...అప్పుడు పార్ట్ టైమ్ డ్రైవర్ గా వుండేవాడిని. ఇప్పుడు పెర్మనెంట్." "అదేమిటండీ?...జీతం ఏ మాత్రం?"


"రెండుపూటలా భోజనం..ఉదయం రెండుసార్లు కాఫీ, టిఫిన్ సాయంత్రం టీ..."


" అయినా నాకు తెలియకడుగుతాను...ఇంత బతుకు బతికి ఇదేం ఖర్మండీ...ఇంకోళ్ళకింద పడుండం..."


"అదేమీ ఇబ్బంది లేదండీ..."


"ఎంతయినా మీ స్వేచ్ఛ ఆగిపోదుటండీ"


"నా స్వేచ్ఛకేం ఇబ్బంది లేదండీ..ముందుగానే ప్రోగ్రామ్ తెలిసి పోతుంది...హేపీగా రెడీ అయి వెళ్తాను..ఎప్పుడు వెళ్ళగలిగితే అప్పుడే..."


" ఇంతకీ ఏం పనులుంటాయి.?"


"పిల్లల్ని స్కూలుకి తీసుకువెళ్ళి తీసుకురావడం...షాపింగ్.... వారానికి ఒకసారో రెండుసార్లో ఏ సినీమాకో, బీచికో..." "వాళ్ళు తిరిగి వచ్చేదాకా మీరు కారులో కూర్చోడమా?"


"అలా అనేం లేదు..కావాలంటే మనం వాళ్ళతో వెళ్ళొచ్చు..లేదా ఏదైనా పనివుంటే మన పని చూసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు పికప్పు చేసుకుని వెళ్తామన్నమాట..."


"టాక్సీయేమో అనుకున్నాను ప్రైవేటు ఉద్యోగమా? ఏం కారు"


"కారు కాదండీ...స్కూటర్..."


"స్కూటరా..ఛా! ఛా! ఆ స్కూటర్ మీద.... మీ పొట్ట చుట్టూ చెయ్యేసి ఆవిడ పేరంటానికి వెళ్తుందా? ఇబ్బందిగా వుండదుటండీ?"


"నిజమేనండి..పొట్ట కొంచెం పెద్దదయిపోయింది..అందుకనే ఒక్కోసారి భుజం మీదే వేస్తుంది."


"మరి వాళ్ళాయన చూడడా...చూసి ఊరుకుంటాడా?"


"ఎవరి ఆయనా?"


"అదేనండీ...మీ ఆడ బాసుకి మొగుడైన మీ మగ బాసు."


"....ఆడ బాసు...మగ బాసూ అంటారేమిటి ? నేనే బాసుని...డ్రైవరంటే మా స్కూటర్ కే...."


"చంపారు కదండీ!"


"ఏఁవండీ ...ఆవిడొచ్చింది....ఇఁక నే వెళ్తానండి"


................ఆ అపార్టుమెంటు ముందువున్న చెట్ల నీడల్లోంచి రెండు మూడు స్కూటర్లు స్టార్టయ్యాయి...ముత్తైదువలు ఒకరికొకరు టా టాలు చెప్పుకుని..వెనుక సీటు యెక్కి వాళ్ళ వాళ్ళ ఆయనల పొట్టలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు....

Friday, April 1, 2011

హాసం క్లబ్ రాజమండ్రి



మేము గత ఏడు సంవత్సరాలుగా రాజమండ్రిలో నిర్వహిస్తున్న 'హాసం' క్లబ్ ఈనెలలోముళ్లపూడి రమణగారిపరంగా జరిగింది...ఆ విశేషాలు మీతో పంచుకుందామని:::::: రమణీయం హాసం క్లబ్ కార్యక్రమన్


రాజమండ్రి నగరములోని హాసాభిమానుల ప్రోత్సాహంతో హాసం క్లబ్ ఏడు సంవత్సరాలు పూర్తిచేసుకుని ఎనిమిదవసంవత్సరంలో ప్రవేశించింది. రాజమండ్రిలోని గౌతమీ గ్రంథాలయంలో మార్చి 27వ తేదీ సాయంకాలం గం.6 కు తమ 76వ కార్యక్రమాన్నివిశేషంగా హాజరైన నగర వాసుల సమక్షంలో విజయవంతంగా నిర్వహించింది హాసం క్లబ్. శ్రీ ముళ్లపూడి రమణీయం అంటూ "రమణగారి స్పెషల్" గా ఆద్యంతమూ హాస్యసంగీత భరితంగా ఈ కార్యక్రమం జరిగింది... బాపు..రమణల ఇష్టదైవం శ్రీరాముని స్తుతిస్తూ శ్రీమతి డి.విజయలక్ష్మి ప్రార్థనచేసారు. ఫిజిక్స్ లెక్చరర్ శ్రీచాగంటి శరత్ బాబు, తెలుగు ఆచార్య డా.అరిపిరాల నారాయణరావు, బహుభాషావేత్త మహీధర రామశాస్త్రి, యల్ ఐ సి డెవలెప్ మెంట్ ఆఫీసర్ యెర్రాప్రగడ ప్రసాద్.,నాట్యాచార్య సప్పా దుర్గాప్రసాద్, రాష్ట్రపతి అవార్డ్ గ్రహీత సి.బి.ఆర్.కె శర్మ, ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ మొదలైనవారు శ్రీ ముళ్లఫూడివారి వ్యక్తిత్త్వాన్ని అనేక కోణాలలో పరిశీలించి వివరించారు. బాపురమణల సినీమాల్లోని పాటలు....శ్రీమతి డి.విజయలక్ష్మి (నిదురించే తోటలోకి);శ్రీ యు.వి.సత్యనారాయణ (టా...టా...వీడికోలు); శ్రీ యస్.కృష్టారావు (ఏదో..ఏదో అన్నది ఈ మసక వెలుతురు; గోగులు పూచే.గోగులుపూచే) శ్రీ శేఖర్ (గుట్టమీద గువ్వ కూసింది)...శ్రావ్యంగా పాడి వినిపించారు. 'జ్యోతి' మాసపత్రికలోని "భామా కలాపం"...స్కిట్ శ్రీమతి శారద, శ్రీమతి విజయలక్ష్మి ప్రదర్శించారు...శ్రీ రమణగారి జోకు ఆధారంగా శ్రీమతి శారద తాను వ్రాసిన "తాళం వేసిన సంగీతం" స్కిట్ శ్రీమతి విజయలక్ష్మిగారితో కలసిప్రదర్శించారు.ముత్యాలముగ్గులో రావు గోపాలరావు,మాడా సంభాషణ ఆధారంగా వ్రాసిన "సమ్మానం" స్కిట్ శ్రీ డి.వి.హనుమంతరావు,శ్రీనూజెళ్ళ సూరిబాబు ప్రదర్శించారు.శ్రీమతి టి.సీతా మహలక్ష్మిగారు శ్రావ్యంగా పద్యాలు చదివారు.శ్రీ మంత్రి..బుడుగును ప్రదర్శించారు. శ్రీ పి.భీమన్నగారు ఒక మాజిక్ ఐటమ్ ద్వారా శ్రీ రమణ, శ్రీ బాపుల దృఢమైన స్నేహాన్ని ప్రదర్శిస్తే, శ్రీ గమిని రంగయ్యగారు తన గణితశాస్త్ర ప్రఙ్ఞతో శ్రీ రమణగారి పుట్టిన తేదీలోని చమత్కారము చెప్పారు. ఆంధ్రా బ్యాంక్ ఆఫీసర్ శ్రీ టి.హనుమంతరావు, సి.టీ.ఆర్.ఐ.సైంటిస్టు. శ్రీ సి.ఏ.రాజు మంచిజోకులు వినిపించారు. కన్వీనర్ శ్రీ అప్పారావు... శ్రీ రమణగారి రచనలలోని మాధుర్యాన్ని సమయోచితంగా చెప్తూ..తనకు శ్రీరమణగారితో గల అనుబంధాన్నినీరు నిండిన కళ్ళతో వివరిస్తుంటే ప్రేక్షకుల హృదయాలు చెమ్మగిల్లాయి.. శ్రీ రమణగారి హాస్యాన్ని మేళవిస్తూ కన్వీనర్ శ్రీ డి.వి.హనుమంతరావు ఆసక్తిదాయకంగా సభను నిర్వహించారు. ప్రముఖ గాయకుడు జిత్ మోహన్ మిత్రా, చిలకమర్తి ఫౌండేషన్ కార్యదర్శి పెరుమాళ్ళ రఘునాద్, భారత్ వికాస్ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.వి.యస్.కృష్ణారావు, స్టేట్ బ్యాంకు ఆఫ్ యిండియా రిటైర్డ్ ఆఫీసర్శ్ పి.వి.శర్మ, కె.యస్.వెంకటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ కంట్రాక్టర్ టి.విశ్వనాధం, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి.జగపతిరావు, ఫిజియో థిరపిస్ట్ జి.యస్.యన్.మూర్తి, కవి విశ్వప్రియ, డా.పి.వి.యస్.ఆర్.పంతులు, బి.జె.పి.కార్యవర్గ సభ్యులు కరటూరి శ్రీనివాసరావు, తెలుగు ఉపన్యాసకులు శ్రీమతి ఎ.యస్.వి.మహలక్ష్మి., మొ వివిధ రంగాలకు చెందిన ప్రభృతులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. బాపురమణల మిత్రులు, అభిమాని శ్రీ యమ్ యస్ మూర్తిగారు కాకినాడనుంచి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. రమణ బాపులు పుట్టినది తూ.గో.జి ప.గో.జి అయినా గోదావరి ఒకటే అయినట్టు... హాస్యం, బొమ్మా వేరైనా కార్టూన్ ఒకటే అయినట్టు....బాపూ రమణలు వేరైనా వారిద్దరూ ఒకటే రెండు కాదు....అది మా మాట మనందరి మాట..... పసుపు, సున్నం కలిస్తే పండు పారాణి అవుతుంది. బాపు రమణల స్నేహరాసిక్యత ఆంధ్ర సరస్వతి పాదాలకు ఆరని పారాణి......... ప్రముఖ రచయిత శ్రీ శ్రీరమణ చెప్పిన ఈ పలుకులు అక్షరసత్యాలు... రసవత్తరంగా రమణీయంగా సాగిన నాటి కార్యక్రమం జాతీయ గీతాలాపనతో జయప్రదంగా ముగిసింది.


(ఈ ఫోటోలు ఎక్కడివి అంటున్నారా ...అప్పు చేసానండి .. అప్పారావు దగ్గర ...అప్పారావు అప్పులు తీసుకుంటాడు కాని ఇస్తాడా...అదా మీ అనుమానం .. అప్పారావు కి ముళ్ళపూడి పేరు చెప్తే ఇస్తాడు ..అది రహస్యం. అలా తెచ్చానన్న మాట...ఎవరికీ చెప్పకండి.మా అప్పారావు గారికి అభినందనలతో...డి.వి.హెచ్ రావు.)...