Pages

Friday, January 20, 2012


ప  డి  తే      ప  డ్డా  ను     కా  ని......

మార్నింగ్ వాక్ కు వెళ్ళా... ఎర్లీ అవర్స్ లో...  ఇంకా వెలుతురు రాలేదు. చేతిలో టార్చ్ వేద్దామనుకునే లోగా స్పీడ్ బ్ర్రేకర్ కాలికి తగిలింది. ముందుకు తూలా..బోర్లా పడ్డా.. ముక్కు చితికింది...లేవడానికి ముందు కొంచెం కష్టపడ్డా...మొత్తానికి లేచా..క్రింద చూస్తే ఇంత బ్లడ్..చేత్తో ముక్కట్టుకుంటే ముక్కులోంచి చుక్కలుగా పడుతోంది బ్లడ్..తెలుస్తోంది.... ముక్కుకి అండ్ నోటికి చేతిరుమాలు అడ్డం పెట్టుకుని వెనక్కితిరిగి సుమారు రెండు మీటర్లు నడుచుకుంటూ ఇంటికి తిరిగివచ్చేసి కాలింగ్ బెల్ కొట్టా...

తలుపుతీసిన మా ఆవిడ ముందు నన్ను చూడలేదు.. తర్వాత లైట్ వేసి చూసి...
"అయ్యో..అయ్యో..ఏమైందండీ ?"
"పడ్డానోయ్ ."
"అలా ఎలా పడ్డారండీ ?"
పడి చూపెట్టబోయా...కాని వళ్ళు స్వాధీనంకావటంలేదు.
సర్లే ఎందుకులే కంగారు (పెట్టడమని) పడడమని  విషయం వివరించా..
"ఎవర్నైనా పిలవకపోయారా ?" అంది శ్రీమతి..
"పిలిచా... పలకలేదు"
"పిలిచినా పలకని ఆ త్రాష్టుడెవరండీ ?"
"...అయ్యో..త్రాష్టుడు కాదోయ్.. రాముడు... మా రాముడ్ని పిలిచా ..పలకలేదు" లెంపలు వాయించుకుందామని
చేత్తో లెంపమీద వాయిస్తే లెంప ఎదురొచ్చింది...
"అబ్బా.." అన్నా... "ఏమైందండీ..." అందిమా ఆవిడ. "లెంప వాచిపోయి ముందుకి ప్రొజెక్టై  చేతికి దగ్గరగా వచ్చింది..
దొరికింది కదా అని వాయించా... వచ్చినందుక్కాదు, రాముణ్ణి తిట్టించినందుకు...నొప్పెట్టింది."
"సర్లెండి..లంఖణాల్లో మనుగుడుపుల్లాగా..జోకులొకటి" అని క్రింద ఫ్లోర్ లో ఉన్న రాజబాబుని పిలిచింది.
"అయినా రాముణ్ణి పిలిస్తే పలుకుతాడా.. మనుష్యుల్ని పిలవాలి.." అని ముక్తాయించింది...  ఒక్కోప్పుడు మా ఆవిడ నాకు అర్థంకాదు...
సరే రాజుబాబు వచ్చాడు...చూసి
"ఏమైందంకుల్ ?" రీప్లే..పెట్టా...
"బట్టలేసుకువస్తా అంకుల్... హాస్పటల్ కు తీసుకెళ్తా..." అని వెళ్ళాడు.. బట్టలున్నాయి కదా అని నా సందేహం...మా ఆవిణ్ణడిగా...
"మీరు పేషంట్.. కుళ్ళు జోకులెయ్యకండి.. సెప్టిక్ అవుతుంది..." అంది మా ఆవిడ..
"ఈవిడ జోకు వద్దంటూ..జోకేసిందా.. ...కేస్తూ...వద్దందా...ఏమో అర్థం కాలా...
రాజుబాబు బట్టలేసుకుని వచ్చాడు.. కూడా మూర్తిగారొచ్చారు..
"ఏంటీ.. పడ్డారుట ?" అంటూ..
"అవునండీ.వాకింగ్ కు వెళ్ళి..."
"వాకింగా... వెడతారేమిటి.. అలవాటా ?" అడిగారు...
"భలేవారే.. అలవాటు లేకపోడమేంటండి.. నా చిన్నప్పుడు ఏడాదెళ్ళకుండానే అడుగులేసేసానట.. మా అమ్మమ్మ ..తన మనవడు (అంటే నేనన్నమాట) అడుగులేస్తున్నాడని  ఊళ్ళోవాళ్ళకి అరిసెలు పంచిపెట్టిందట.. మా అమ్మ చెప్పేది.. అదిగో అప్పట్నించి .. ఇప్పటిదాకా ..అంటే ఇప్పుడు నాకు 69 సంవత్సరాలు. ఇప్పటిదాకా నడుస్తూనే వున్నాను కదండీ... బాగా అలవాటు...." అని చెప్తూ మురిసిపోయా...
రాజుబాబు వచ్చాడు...
"రాజుబాబు బట్టలేసుకున్నాడే" అరవబోయా...చురుక్కుమంది నోరు...
"రండి అంకుల్" అని లిఫ్ట్ దగ్గరకివేళ్ళేటప్పటికి చలం కనపడ్డాడు...
"ఏంటిరా బాబూ ఇది."..
"ఇది సర్వనామం" అనబోయి "పడ్డానయ్యా" అన్నా...
"అలా ఎలా పడ్డావు.." అందరూ అదే ప్రశ్న...మళ్ళీ రీ>>ప్లే.
"నేను  పడ్డప్పుడు.. చాలా బాధపడ్డారా..పగవాడికి కూడా వద్దు ఆ నరకము"
"నువ్వు పడ్డావా .. ఎప్పుడు?"
"మరి పడ్డాను కదా..ఆఫీసు నుంచి వస్తుంటే రాంగ్ సైడులో సైకిల్ నడిపించుకుంటూ..వచ్చి గుద్దేసాడు>"
"నువ్వు స్కూటర్ మీదున్నావా..."
"అప్పటికింకా స్కూటర్ కొనలేదు.. నడిచే వెళ్తున్నాను.."
"చెప్పావు కాదు.. ఎన్నాళ్ళైంది.."
"జస్ట్..నాలుగేళ్ళయింది.. ఇప్పుడు బెటర్ అనుకో"
దెబ్బకి నా దెబ్బకిక్ తగ్గిపోయింది...
సరే డాక్టర్ దగ్గరకి చేరాము మొత్తానికి.. డాక్టర్ దగ్గర నే చెప్పబోయా...ఆయన చూస్తున్నాగా మళ్ళీ వినడం ఎందుకనుకున్నాడో ఏమో చెవుల్లో సెత్ స్కోప్ పెట్టుకుని ... "సిస్టర్.. క్లీన్ చేసి పిలు ..వస్తాను." అన్నాడు..
నిర్దాక్షిణ్యంగా ముక్కునీ మూతినీ కర్ర చిత్రిక పట్టినట్టు తుడిచింది ఆ సోదరి. క్యార్,,,క్యార్ మన్నాను.. డాక్టర్ గారు వచ్చారు ..
"యూ ఆర్ లక్కీ. ఆఁ....నో కుట్స్ ఆఁ....తగ్గిపోతుంది. ఆఁ. నో ప్రాబ్లమ్ ఆఁ"
కూడా వచ్చిన మా ఆవిడ అడిగింది..
"డాక్టర్ గారూ అన్నీ తినొచ్చాండీ.."
"నువ్వు తినడానేకేమమ్మాఆఁ...శుభ్రంగా తిను ఆఁ..." అని నవ్వి
"ఆంటీ బైటెక్స్ ఇచ్చాగా ఆఁ ... పాపం! ఆయనక్కూడా పెట్టండి ఫర్వాలేదు ఆఁ..." అని
"రోజూ వచ్చి డ్రెస్సింగ్ చేయించుకోండి ఆఁ.." అని చెప్పి వెళ్ళారు
ఆసుపత్రిలోనుంచి బయటికి వస్తుంటే  బాబాయి వచ్చాడు...
"ఏంటిరా పడ్డావుట ?",,,
"నీకెవరు చెప్పారు ?" అన్నా...
"శని.." అన్నాడు బాబాయి..
" ? " ఎక్స్ ప్రెషన్ మాత్రం బ్యాండేజీ చాటునుంచి..
"ఏల్నాటి శని! దాని ప్రభావం.. నీది కన్యా రాశి కదా...ఓ ఊపు ఊపితేకాని ...."
"అయితే శని ముక్కట్టుకుని ఊపాడన్నమాట. అవునా బాబాయి?" బ్యాండేజ్ వేసారని గుర్తొచ్చి మాటలు స్పష్టంగా రావడంలేదు...
"ఇది శనిగాడి పనికాదన్నయ్యా... అదే అయితే వీడికి పళ్ళు రాలాలి. ఎముకలు విరగాలి... '...ల'లేదు, '...రగ' లేదు" అన్నాడు మా ఇంకో బాబాయి.
"ఎలా విరుగుతాయి.. వీళ్ళావిడ రెండో ఇంటిలోంచి బుధుడు  చూస్తున్నాడు వాడు శనికి మిత్ర గ్రహం.అంచేత శబ్బరి ఉండదు" అన్నాడు మొదటి బాబాయి..
"మా ఆవిడ ఇంకో ఇంట్లో లేదు. మాది ఒకే రూఫ్ కింద సహజీవనం మొర్రో." అన్నా....ఈలోగా మా ఆవిడ ఆటో పిలిచి..
"మాటలాపి ఎక్కండి" అంది. ఇలాంటి సత్వర నిర్ణయాలు ఆపత్కాలంలో తీసుకోవడంలో ఆవిడ బెస్ట్. ఇంటికొచ్చేసరికి తల భారంగా ఉండి
చాలా అన్ ఈజీగాఉంది.
గుమ్మంలో ఉండగాని క్రింద ఫ్లోర్ పార్థుగారు,, కనకయ్యగారు వచ్చారు..పరామర్శకు.. తాళంతీసి లోపలికి ఆహ్వానించాము..
"అయినా మీరంత దూరాలు వెళ్ళడమేమిటండీ.. మన అపార్ట్ మెంట్ చుట్టూ తిరగచ్చుకదా.."అన్నారు పార్థుగారు.
"అలా ఎలా కుదుర్తుందండి..చిన్న ఆవరణ.. ఒక రౌండ్ కి రెండు నిముషాలు కూడా పట్టదు .  ఎన్ని రౌండులని తిరుగుతాడు" అన్నారు కనకయ్యగారు.
వీళ్ళిద్దరికీ పడదు... అపార్ట్ మెంట్ సమావేశాల్లోకూడా ఎడ్డెమంటే తెడ్డం అన్నట్టే ఉంటుంది.
"నేను చక్కగా తిరుగుతున్నా కదా ?" అన్నారు పార్థు
"మీరు తిరిగితే? మీరో పెద్ద స్టాండర్డా "" అన్నారు కనకయ్య...
"లేఫోతే మీరా స్టాండర్డ్" మాట పెరుగుతోంది...
నేను మాట్లాడాలంటే నాకు వాగ్బంధనం.. బ్యాండేజి వేసారు కదా ? అప్పటికీ మధ్యాహ్నవార్తలు చదివినట్టుగా సంజ్ఞలు చేసాను.
"లేకపోతే ఏమిటండీ.. చక్కగా గాలి పీల్చుకుంటూ.. అలా బయట తిరిగినదానికీ.. మనపైపుగొట్టాల్లోంచి వచ్చే కుళ్ళుకంపు పీలుస్తూ టీకప్పులో తిరిగినట్టు తిరగడమూ ఒకటేనా..." అన్నారు కనకయ్య..
"అవును.. ఎందుక్కొట్టవు కంపు? .. సె క్క్ర ట్ట రీ గా....రు...అస్సలు క్లీనింగ్ చేయిస్తేకదా.."అన్నారు పార్థు. "సెక్రటరీ" అన్నపదం వత్తి పలుకుతూ...
కనకయ్యగారికి వళ్ళు మండింది.. డదా మరి.. ఆయనే సెక్రటరీ కదా...
"మెయింటనెన్స్ టైమ్ కి ఇచ్చేడిస్తే సెక్రటరీ ఏమన్నాచేస్తాడు.. ఎప్పుడైనా ఇచ్చి ఏడిస్తే మాట్లాడాలి..."చురక వేసారు కనకయ్య.
"కాఫీ తీసుకోండన్నాయ్యగారూ.." అంటూ మా ఆవిడ మళ్ళీ తాజా నిర్ణయం తీసుకుంది.
చోద్యం చూస్తున్నరాజు తీసుకొచ్చాడులాఉంది పద్మనాభంగారు లోపలికొచ్చారు... వీళ్ళిద్దరూ ఒకళ్ళవెనకాల ఒకళ్ళు బయటికి దారితీసారు...ఆ ఇద్దరికీ ఈయనంటే పడదు. ఆయనికి  కూడా కాఫీ ఇచ్చింది మా శ్రీమతి..
"సుగర్ ఉందా?" పద్మనాభంగారు విచారణ ప్రారంభించారు...
"అయ్యో ఉందండీ>>తక్కువయిందా..తెస్తానుండండి అన్నయ్యగారు!" అంది లోపల్నించి మా స్త్రీమూర్తి...
"నా ఉద్దేశ్యము నా సుగర్ నా కాఫీ కాదు.  మీకు చక్కెరవ్యాధిఉన్నదా అని నా ప్రశ్న" అని విపులీకరించారు పద్మనాభంగారు.
లేదు అందామంటే మాట రాదు.. బుర్ర అటూ ఇటూ త్రిప్పాకనుక అర్థంచేసుకున్నాడా పెద్దమనిషి..
"అయితే ఫర్వాలేదు.. త్వరగా తగ్గిపోతుంది..
అయినా శీతాకాలం ...కొంచెం టైము పట్టొచ్చు..;
మనడాక్టర్ గారిదగ్గరకే గా వెళ్త? ఆయన హస్తవాసి మంచిది. తగ్గిపోతుంది...
పెద్దవయస్సుకదా..పడితే కొంచెం టైమ్ పడ్తుంది..
ఫర్వాలేదులెండి మీరు జాగ్రత్తగానే ఉంటారు..అయినా మందులు అన్నీ మందులేసి తయారు చేస్తున్నారండీ ...ఓ పట్టాన పని చేయవు.." .తగ్గుతుంది ...తగ్గదు రెండూ చెప్పాడు పెద్దమనిషి .
"అన్నయ్యగారూ... ఆయన్ని బాగా రెస్ట్ తీసుకోమన్నారు...మీరు మాట్లాడుతూ ఉండండి... ఆయన కాసేపు పడుకుంటారు..." సత్వరనిర్ణయం తీసుకొంది మా బెటర్ హాఫ్... "వస్తానమ్మా" నిష్క్రమించారు ఆయన ....సంస్కారి కదా....
"మందులు వేసి మందులు చేయడమేమిటి... పంటలకి కదా మందులు.. " నోరు తెరవబోయా...
"మూసుకు పడుకోండి..." అని బెడ్రూమ్ తలుపు మూసి.. ఆవిడ తన వంటింటి సామ్రాజ్యానికి తరలింది...ఇంటి మహారాజ్ఞి కదా....

*********                                 ***********                                    ***********                                                        

(ప్రఖ్యాత దర్శకుడు వి.శాంతారామ్ గార్కి కంటికి ఆపరేషన్ అయి రెండు కళ్ళూ మూసి బ్యాండేజ్ వేసారుట.. కళ్ళు మూసుకొని మనసు తెరిచినప్పుడు వచ్చిన భావ స్వప్నం... "నవరంగ్". ఒక అద్భుత దృశ్యకావ్యం. నాకు కన్ను మూస్తే నిద్రొస్తుంది కాని అలాంటి ఆలోచనలు ..ప్చ్....
అయితే డిశంబర్ లో వాకింగ్ కు వెళ్తూ పడ్డా. అప్పుడు నోరు మూయకతప్పిందికాదు... ఎంతో మంది అభిమానంగా వచ్చి చూసి తమ ఆందోళన వ్యక్తపరిచారు ...వారి ప్రేమకు వినయాంజలులు...కొన్ని ఎక్కువ ఊహిస్తే  వచ్చిన ఆలోచన ఇది...నిజం మాత్రంకాదు.. ఎవర్నీ నొప్పించడం ఉద్దేశ్యమూ కాదు...బాధలో ఆనందం వెతుక్కోవడం మాత్రమే...అర్థంచేసుకోగలరు...)
----oooo-----