Pages

Wednesday, May 24, 2017

బ్లాగు మిత్రులతో ముచ్చట ....


బ్లాగు మిత్రులతో ముచ్చట ....

 అందరికీ నమస్కారం. బ్లాగు జోలికి వచ్చి సంవత్సరం అయిపోతొంది. face book తో ఎక్కువ కాలం గడిపేయడం ఒక కారణం. నిజానికి face book లో ముఖం మీద లైకులు, కామెంట్ లు వెంట వెంటనే వచ్చేస్తాయి. దానితో అక్కడికి పరుగెడతాం కాని, సృజనాత్మకత బ్లాగులోనే ఉందనిపిస్తుంది. మరో కారణం దారుణమైన ఎండలు ఈ వేసవిలో  బాధ పెట్టేస్తున్నాయి. బుర్ర కొంచెం కూడా పని చేయడంలేదు. అయినా సరే ఎలాగైనా బ్లాగుకు ఎదో ఒకటి వ్రాసి బ్లాగు మిత్రులతో పంచుకోవాలని ఉంది. మంచి పోస్ట్ త్వరలో పెడతాను.. మీ అందర్నీ ముందు పలకరిద్దామని, ఇలా ఇంత రాత్రి వేళ కంప్యూటర్ ముందు కూర్చున్నాను. ofcourse, ఇవాళ చల్లగాలి ఇప్పుడే తిరిగింది. అందుకని ఈ నాలుగు ముక్కలు వ్రాయాలనిపించింది. త్వరలో బ్లాగు లో పోస్ట్ చేస్తానని చెప్పడానికి వచ్చాను. దీవించండి.

Wednesday, August 3, 2016

బ్లాగమ్మకు ఏడవ జన్మదినం… 2nd August 2016


బ్లాగమ్మకు ఏడవ పుట్టిన రోజు ... 

క్రితం పుట్టిన రోజు సెలెబ్రేషన్ లేటుగా చేశానని ముందు అలిగిందికదా చిట్టి తల్లి.. తర్వాత పుష్కరాల అందాలు చూపించ మంది…
అప్పటి విషయం గుర్తు చేసుకుంటే..
అలక తీర్చడానికి…. “పుట్టిన రోజుకి ప్రెజెంటేషన్, ఏం కావాలి నీకు తల్లీ, అడుగు” అంటే …
గోదావరి పుష్కరాలకు ముస్తాబైన కోటిలింగాల ఘాట్ చూపించమంది.
తీసుకెళ్లా… గోదావరి పుష్కరాల సందర్భంగా  కోటిలింగాల రేవును నవీకరించి,
భారత దేశంలోనే మొదటి పెద్ద ఘాట్ గా తీర్చి దిద్దారు.  
ఆ పెద్ద ఘాట్ చూసి .. చిట్టి తల్లి చాలా ఆనందపడిపోయింది. ఆ విశాలమైన రేవులో అటూ ఇటూ పరుగులు పెట్టింది. నీళ్లదాకా వెళ్లి, శిరస్సు పై పవిత్ర జలాలు జల్లుకొంది. అరచేతిలోకి నీటిని తీసుకుని భక్తితో పానం చేసింది.
గోదావరీ తీర వాసుల రచనలకు  ప్రాణం పోసే అఖండ గౌతమీ జలాలకు ప్రణమిల్లింది.. నా చిట్టి తల్లి.
“బ్లాగాభివృద్ధిరస్తు” అంటూ ఆ “నీటి సిరి” గలా గలా దీవించింది.

… సంవత్సరం గడిచింది. మా చిట్టితల్లికి ఏడు వసంతాలు నిండుతున్నాయి.  గోదావరి అందాలు చూసి గోదావరి నదిలో స్నానం చెయ్యటానికి అప్పుడే ముచ్చట పడింది.. తప్పకుండా చేయిస్తా అని అప్పుడే మాటిచ్చేసా..

ఏ నదికైనా 12ఏళ్లకోసారి పుష్కరాలొస్తాయి. గోదావరికైనా అంతే … కానీ గోదావరి తల్లి విశేషమేమంటే .. పుష్కర సంవత్సరమంతా గోదావరి పవిత్రమే … ఈ నదికి అంత్య పుష్కరాలు విశేషం… ఈ సంవత్సరం అంత్య పుష్కారాలు… 31జులై నుంచి 12రోజులపాటు గోదావరి నదిలో స్నానాలు చేయాలని ఎక్కడెక్కడినుంచో వచ్చి యాత్రీకులు వస్తారు. స్నానాలు చేస్తారు..

ఇంతటి పవిత్ర సమయంలో వచ్చిన పుట్టినరోజు సంబరం మనసు నిండగా .. చిట్టితల్లి పావన గౌతమిలో  స్నానం చేసింది.. రాజమహేంద్రవరం దగ్గర అఖండ గౌతమిని చూసి ఆనందంతో, గర్వంతో చూసి భక్తితో నమస్కరించింది.. బ్లాగు చిట్టి బొజ్జలో అక్షర సౌందర్యమంతా గోదావరి జలాలు పానం చేసిన ఫలితమే కదా.. అనుకున్నా… ఏంటి ఆలోచిస్తున్నావు అంది బ్లాగమ్మ.. “ఏం లేదమ్మా .. మన ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్య మంత్రి ..ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు..  ఎక్కడో ఒంగోలు జిల్లాలో పుట్టారు..ఆయన  చిన్నప్పుడు ఎవరో చెప్పగా విన్నారట … రాజమహేంద్రవరం కవులకు నిలయమని, ఆ గోదావరి నీళ్లు త్రాగితే ఎవరికైనా కవిత్వం వస్తుందని. ఆ మాట పట్టుకుని, చిన్నప్పుడే ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడే చదువుకుని గొప్ప ప్లీడరై .. బాగా సంపాదించారు. దేశభక్తి నిండిన మహనీయుడు తెల్లవారి తుపాకులకు భయపడకుండా ఎదురు నిల్చి .. సింహంలా పోరాడిన ధీశాలి .. ఆయన .. అది గుర్తొచ్చింది.. అన్నా.. 


నేను  టంగుటూరి గురించి చెపుతుంటే తన్మయంతో వింది చిట్టి తల్లి..”అవును ఆయనగురించి నువ్వు పద్యాలు వ్రాసావుగా”అని గుర్తు చేసుకుంది…  “అవును బ్లాగులో వ్రాయడం మానేసి పద్యాలలో పడ్డావుట” అని.. చురక వేసిందో - పొగడిందో .. గడుసుతనం చూపింది.నేను పవన తనయుని మీద శతకం వ్రాసినట్టు తెలిసిపోయింది.. “వల్లభ గణపతి పై కూడా మొదలెట్టావుట కదా..” ‘నిజమే’ అనక తప్పింది కాదు. జ్యోతి ఆంటీ వెబ్ మాగజైన్ “మాలిక” లో హాస్య కథలపోటీలో నా కథ ప్రచురణకు స్వీకరించారని చెప్తే భలే భలే అని ముచ్చట పడింది. “జ్యోతి అంటీ నన్నెప్పుడూ ఎంకరేజ్ చేస్తారు” అని కాంప్లిమెంట్ ఇచ్చింది … అప్పుడు మరొక విషయం చెప్పా… ‘తెలుగు వెలుగు’ మాస పత్రికలో ఆగస్ట్ సంచికలో నా పద్యం ప్రచురింపబడిందని… ఫెల్ట్ వెరీ హాపీ..  

నా బ్లాగు dvhrao.blogspot.com… ‘హాస్యవల్లరి’ --- 
జీవనది గోదావరిలా పది కాలాలపాటు  సజీవంగా ప్రవహిస్తూ 
పాఠకులకు ఆనందం కలిగించాలని 
బ్లాగు జన్మదిన శుభవేళ మిత్రులు దీవిస్తారు కదా…


Wednesday, June 22, 2016

మా నాన్నగారి 123వ జయంతి[22-6-1894 - 30-5-1982]

                                                            { శ్రీ దినవహి సత్యనారాయణ }             


ఈరోజు నాన్నగారి జయంతి..

నాన్నగారి గురించి   -- 
నాన్నగారికి ఆత్మీయ మిత్రులు మహా పండితులు
కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి మాటలలో --

సీ|| ఆబాల్యముగా నాంధ్రమందు గవిత్వంబు
నిర్మింప నేర్చిన నిపుణ బుద్ధి,
యాంగ్ల విద్యార్థి రాజ్యమునందు బట్ట భ
ద్రతకు భంగము గన్న రాఘవుండు,
హిందీ సరస్వతీ  సౌందర్య సింథు వా
కంఠమ్ము గోలిన కలశభవుడు
పాళీ వచోదేవతా లీల లొకకొంత
చవిచూచినట్టి విజ్ఞానశీలి

తే.గీ || దినవహి పవిత్ర వంశ మౌక్తిక లలామ
మమల చరితుండు సత్యనారాయణుండు
అస్మదాప్త సుహృద్వర్యుడగుట నా య
దృష్ట వైశిష్ట్య మనుచుగర్వింపవలదె !

చం|| అతడు కవీంద్రుడై తెలుగు, నాంగ్లము, హిందియు బ్రాకృతంబులన్
మతి గ్రహించు పుణ్య మహిమంబు ఫలింపగ, రామ మానసో
ర్జిత పరమార్థవేత్త, తులసీకవి మంజుల శారదన్, యథా
స్థితముగ నాంధ్ర శారదగ దీరిచి దిద్దెను రాము పేరనే

గోస్వామి తులసీదాసు కృత శ్రీరామచరిత మానసమును తెలుగు వచనంలో అనువదించి పండిత పామరుల అభిమానము సంపాదించారు. ఈ గ్రంథం మూడు ముద్రణలు పొందింది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన ‘షాజహాన్’ నాటకాన్ని తెలుగులో వ్రాసారు. ఇది కాక ‘ప్రేమచంద్ కథలు’, ‘మేవాడు పతనం’ అనే గ్రంధాలు వ్రాసారు పాళీ భాషలో గ్రామరు వ్రాసారు. గాంధీమహాత్ముని పిలుపుకు స్పందించి బి.ఏ చదువును మధ్యలో వదిలేసి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొని … హిందీ భాషావ్యాప్తికి విపరీతంగా కృషి చేసారు.. జాతీయ పాఠశాలలో బోధకునిగా పని చేసారు. అప్పుడే నాన్నగారికి శ్రీ వెంపరాల వారితో ఆత్మీయస్నేహం …తర్వాత గుజరాత్ విద్యాపీఠ్ వారి బి.ఏ పట్టా పుచ్చుకుని అసిస్టెంట్ పంచాయత్ ఆఫీసర్ గా, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా ఉద్యోగాలు చేసారు..

ఉన్నత వ్యక్తిత్వం..శ్రీరామ భక్తి .. మూర్తీభవించిన సౌజన్యం  అదే నాన్నగారు --- ఈ మహనీయ మూర్తికి తనయునిగా గర్వపడుతూ వారి 123వ జయంతి నాడు సభక్తికంగా వినయాంజలి ఘటిస్తున్నాను.  
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((o0o))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))


Monday, May 30, 2016

హనుమజ్జయంతి … దుర్ముఖినామ సంవత్సర విశాఖ బహుళ దశమీ భౌమవాసరం (31-06-2016)

హనుమజ్జయంతి … దుర్ముఖినామ సంవత్సర విశాఖ బహుళ దశమీ భౌమవాసరం (31-06-2016)


[హనుమజ్జయంతి శుభ పర్వదినాన బ్లాగుమిత్రులందరికీ శుభాకాంక్షలతో...]

అందరికీ ఆనందమిచ్చే ఆంజనేయ

సీ॥ రాముడానతి జేయ రయమున లంకకు
పయనమై వెడలిన వాయుపుత్ర
సీతను వెదకి జూచి, యశోక వన మంద
సురుల గూల్చితివీవు సుందరాస్య
దశకంఠు నెదురుగా దర్పముతో నిల్చి
బుద్ధి తెలిపితీవు బుద్ధిమంత
అందమైన పురము నగ్ని కాహుతిజేసి
రాముని జేరిన రామభక్త

తే.గీ. సతిని గూర్చి విన్న విభుడు సంతసించె
సీత కడగె భయము నీవు చెంతనుండ
కపులు మోదమందిరి నిన్ను గాంచినంత
హర్షమొసగితి వందరకాంజనేయ !

పంచముఖాంజనేయునికి శిరసా వందనములు

సీ॥ గరుడ జవంబున కడలిపై పయనించి
లంక జేరితీవు లాఘవమున
దంష్ట్రి తొల్లి వెదకి ధరణి జూచిన తీరు
గాలించి యవనిజ గాంచితీవు
నరహరి వైరిని నాడు చంపిన భంగి
కూల్చితి వసురుల గోళ్ల జీల్చి
వాగధి దైవమా వాజిముఖుని యట్లు
పలుకుతీరు తెలియు వాగ్మివీవు

తే.గీ. దివ్యమైన శివుని తేజమున వెలుగు
వానరకులదీప్తి వాయు సుతుడ
వేద తత్త్వ రూప విజయ హనుమ
భక్తితోడ నతులు పవన తనయ    

[ఈ రెండు కుసుమాలు స్వామి చరణాలకు సమర్పితం  … 
వీడి చేత స్వామి వ్రాయించుకున్నవీ పద్యాలు ]

Wednesday, May 11, 2016

హరాజీకా…13 -- కేశ ఖండన


              

కేశ ఖండన
                                                                            రచన:డి.వి.హనుమంతరావు.

[గుర్తుందండీ.. హరాజీకా అంటే ఏమిటో మీకు తర్వాత చెప్తానన్నాను కదా..జంధ్యాల వారు చెప్పినట్లు నేను మాట మీద నిలబడే వ్యక్తిని. తర్వాత తప్పక చెప్తాను. అయినా హరాజీకా అంటే తెలియకపోయినా చాలా మంది చదివి స్పందిస్తున్నారు కదా.. మీరు కూడా అలా స్పందించండి …స్పందిస్తారు నాకు తెలుసు.]
===========

“ప్రొద్దున్నే బయల్దేరా రెక్కడికి?”
అనుకున్నంతపనీ అయ్యింది. అర్థాంగి దృష్టిలో పడకుండానా.. అబ్బే కొస్చనే లేదు...
“ఏదో అలా వాకింగ్ కి… అయినా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని పెద్దలంటారు.”
సంజాయిషీ లా గోడకేసి చూసి చెప్పా..
“ఆ పెద్దలేం అన్నారో నే వినలేదు కాని, మీ వాటం చూస్తే వాకింగ్ లా లేదు.. అయినా రోజూ సాయంత్రం కదా వెడుతున్నారు, ఇలా  ప్రొద్దున్నే బయల్దేరారేంటా అని. .. “
కూపీ లాగుతొందిరోయ్ దేవుడా..
“నిజమే, కాని ప్రొద్దున్న వెడితే బోల్డు విటమినులు దొరుకుతాయట”
“రోడ్డు మీద రాశులు పోసి, మీకోసం పారేసుకుంటారా, దొరకడానికి …. “
“లేదోయ్ .. ఆ విటమినులు పొట్టకు మంచిదట..”
“అంటే పొట్ట పెరగడానికా.. తగ్గ డానికా … ఇంతకీ ఎవరు చెప్పారుట, గోదావరొడ్డున మూలికలమ్మే వాడేనా ?”
“ఇదిగో లక్ష్మీ .. ఇలా వెటకారం చేస్తే నాక్కోపం వస్తుంది”
నాకేం ఉద్ధరింపుట అని అనేస్తేందేమో, మీరందరూ చూస్తున్నారు కూడాను అని భయపడ్డా
అపుడే కాఫీ త్రాగి వచ్చింది కదా .. అలా అనకుండా, నవ్వుతూ, గోముగా అడిగింది..
“శ్రీవారు, ఎక్కడికమ్మా వెళ్తున్నారు “ అని.
భయపడుతూనే చెప్పా…
“కట్టింగ్ కి” …  అంతే లక్ష్మికి కోపం వచ్చేసింది.
“ఇప్పుడేమంత  పెరిగిపోయింది, అయినా మొన్నే కదా గొరిగించుకొచ్చారు.. అప్పుడే తొందరేంటి.”
“గుండైతే గొరిగించు కోడం అంటారు, క్రాఫింగ్ అయితే  కటింగ్ అనాలి”
అని చెప్దాం అనుకున్నా.. అబ్బే అనుకున్నాను. .. అంతే.
“మొన్నేమిటి లక్ష్మీ, నీకు స్నానం అయిన రోజు చేయించుకున్నాను, మరి నిన్ననే గా…  ”
మధ్యలోనే కట్ చేసి
“నోరు మూసుకోండి, వెధవ లెక్కలు మీరునూ”
సిగ్గు ప్లస్ కోపం ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.
““మీకేం మతి లేదు.. పదిరోజులలో, మా చెల్లెలింటిలో సత్యనారాయణ వ్రతం. మనం వెళ్లాలి కదా, అక్కడకీ బోడి మొహంతో వస్తారా.. ఇప్పుడొద్దు” అంది.
“దేవానంద్ కైనా, మన్మధుడికైనా హెయిర్ కట్టింగ్ చేయించుకున్న వారం రోజులదాకా బాగుండదని శాస్త్రం చెప్తోందోయ్. అంతేకాని, మరీ పదిహేనురోజులదాకా అని ఎక్కడా లేదు”
అని నాకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉటంకించాను.
“దేవానంద్ కు దేవపురుషులకూ ఆ లెక్కలు.. మీకు నెలదాకా వచ్చే సమస్యే లేదు. అందుచేత .. ససేమిరా”
“అప్పటికి.. వారం రోజుల్లో  కొత్తిమీర మడిలా జల జలా వచ్చేస్తుందోయ్ .. అయినా ముళ్ళపూడి వారన్నట్టు, (అప్పట్లో) బడిపంతులుద్యోగి జీతమా పెరక్కపోవటానికి”అని తెలుగులో అని,
మరల ఇంగ్లీషులో…
“See mrs. lakShmi rao, my experience says and also with the statistics available with me, I say…”
అని చెప్ప బోయా..
“సీ మిస్టర్ రావ్ లక్ష్మీ.. గో టూ హెల్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్,”
అని తెల్గు స్క్రిప్ట్ లో ఇంగ్లీష్ లో ఏకి పాడేసింది. అంటూ ముక్తాయిపుగా ..  
“అయినా సరే నేనొప్పుకోను… మీరు డిప్ప చేయించుకుని, ఆ డిప్ప మొహం వేసుకుని మా వాళ్లింటికొస్తారు. ఉన్న నాలుగు వెంట్రుకలూ టెలిఫోన్ స్థంభాల లాగా  లేచి నించుంటాయి, అవి మీకు దువ్వెన్నకు లొంగవు. ఆ హడావుడిలో మీ నెత్తిన చవురు పెట్టడానికి నాకు తీరికుండదు.. మా వాళ్ళందరూ .. కోరస్ లో “..సొగసైన క్రాఫు చెరిగిపోయే, నగు మోము చిన్న బోయే”అని రేలంగి పాత సినిమాలో పాడిన పాటను, క్రొత్తగా హం చేస్తున్న ఫీలింగ్, మీ కేమో…. కాని నాకు వచ్చేస్తుంది. అంచేత మళ్ళీ ససేమీరా... “అంది.
“అబ్బే అదా.. కొబ్బరి నూనె రాయడం పెద్ద సమస్యేమిటి.. వాళ్ల పని పిల్ల చేత రాయించుకుంటాను..”
“ఇలాంటి వెధవ్వేషాలేస్తారనే, మా చెల్లెలు ఆ పనిమనిషిని మాన్పించేసింది. .. ఇప్పుడున్నది వయసు మళ్లినావిడ”
అదేం పోయ్ కాలం అని అనుకోబోయా.. కాని ఈలోగా మా ఆవిడ
“అయినా ఇప్పుడు సమస్య కొబ్బరి నూనె రాయడం కాదు..”
“పోనీ మీ చెల్లెలింటికి ఈ డిప్ప మొహంతో నేనురాను లే..”
“మరి ఏ మొహం పెట్టుకొస్తారు, మీకున్నది ఆ ఒక్క మొహమే కదా “
ఇంత సీరియస్ పరిస్థితుల్లోనూ .. ఓ యబ్బో సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇదే కామోసు.
అయినా ఎవరికైనా ఏ మొహమైనా ఉండేది .. ఒక్క మొహమే కదా.. ఇది కూడా స్వగతమే …
“అదికాదోయ్ .. నువ్వెళ్లి ఎంచక్కా వ్రతం చేయించి వచ్చేస్తావని ..”
“మీరు నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నారు.. నేనెప్పుడైనా అలా వెళ్లానా.. “
అని మంగళ సూత్రాలను కళ్లకద్దుకుంది.
కళ్లల్లో నీళ్లు కూడా మెరిసాయి..
మరేం చేస్తాం … సెంటిమెంటు..
నా కర్థం కాని విషయం .. ఆవిడెప్పుడైనా నాతో వస్తుందేమో కాని,ఎప్పుడూ  పుట్టిళ్లకు ఒంటరిగా వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తుంది. ఇంత టెన్స్ గా వాతావరణం ఉన్నప్పుడు మళ్లీ ఇలా అడిగానంటే … ఆవిడ కన్నీటి మేఘాలు ఏ గంటలోనో వర్షించి, ముసురులా పట్టుకోవచ్చని గ్రహించిన వాడినై , కేశఖండన పోస్ట్ పోన్ చేసి.. తువ్వాలుచ్చుకుని, బాత్ రూమ్ లోకి కదిలా…
ఏం చేస్తాం ముచ్చటి పడి పెళ్లి చేసుకున్నాక, ముచ్చటైన మీ జుత్తు కటింగ్ చేయించుకోడానికి కూడా మీకు అధికారం లేదు. .
ooooOOOoooo