Pages

Sunday, November 28, 2010

భావగారి కబుర్లు విందామా



                           భావగారి కబుర్లు

                                                                                    


                                                                                   రచన : డి.వి.హనుమంతరావు 

                                                                                                                      9949705166




(ఆమధ్య కాలంలో రేడియోలో భావగారి కబుర్లు అని సమకాలీన రాజకీయాలమీద...అలాగే నడుస్తున్న చరిత్రమీద చమత్కారం జోడించి చక్కటి సంభాషణాకార్యక్రమంవచ్చేది...ఇప్పుడు వస్తున్నట్టులేదు....అది దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రయత్నం.)

                                                                     ***************


ఏమండోయ్ భావగారు....రండి..రండి.....యెన్నాళ్ళకెన్నాళ్ళకి?

...ఇంటి దాకా వచ్చాక ఇప్పుడు.బాహానే పలకరిస్తారు... 

బొత్తిగా నల్లపూసైపోయారు కదా?

మీరుమాత్రం మహ మణిపూసా యేమిటి?..

యెన్నాళ్ళైందండీ మనంఇలా మాట్లాడుకుని...
ఏంచేస్తాం చెప్పండీ....రోజులు మారిపోయాయి..ఇదివరకైతే మనకబుర్లకోసం నలుగురూ ఓ ఇంట రేడియో వుంటే అక్కడకు చేరిమరీ వినేవారు....యిప్పుడు ఆ రేడియో వినరు...వినడానికి టైమూలేదు..ఏమంటారు?
భావగారు చెప్పాక ఇంక నేనేమైనా అనడానికి....హార్టా--టాంకా...
బావగారూ అదేం ప్రయోగమండోయ్?
దొరల భాషలో మాట్లాడేను బావగారూ...గుండా-చెరువా అని...
బావగారు మంచి చమత్కారులుకదా మరి..
సరే కాని బావగారూ.... యేమైనా విశేషాలు చెప్పండి...వినాలని వుంది....మీకు వినాలని వున్నా నాకు చెప్పాలని లేదు
బావగారుఅదేంటి...అలా అనేసారు...
బావగారూ...రాజకీయాలగురించి...చెప్పాలంటే.... ఏముంది చెప్పడానికి....పాలన అంతా హస్తినాపుర హస్తగతం...ఎంతో గొప్పవాళ్ళని ఏదో వూడబొడుస్తారని వీళ్ళని మనం యెన్నుకున్నాం. కాని..వీరికి స్వంత తెలివి లేదు. ఆ హస్తిన చెప్తేనే వీరు పెదవి విప్పుతారు...అది వీరి ముందుచూపో లేక అతివినయమో?
మాటకడ్డొచ్చాను బావగారు...ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులుతవ్వుకోవడంలో చేయితిరిగిన యోధులు...కాదంటారా?
అంతేకాదు బావగారు...సమస్యలు తవ్వుకోవడం...సవాళ్ళు విసురుకోవడం...ఛాలెంజీలు...రాజీనామాలు...ఉప యెన్నికలు..పోయేది ప్రజలడబ్బు....ఇదేకాదుభావగారు....అసెంబ్లీలో మైకులు విసురుకోవడం...కుర్చీలు విరగ్గొట్టడం....ఎవరిసొమ్ము..ఒకసారైనా ఆలోచిస్తారా? మంత్రిపదవి...ముఖ్యమంత్రి పదవికూడా వారసత్వంగా కావాలిట అందుకని దార్పులు ఓదార్పులు.ఓ మూల గద్దె మీదున్నవాడి కుర్చీ లాగేసేవారు కొందరు...ఆ గద్దెమీదున్నవాడి పదవీ కాలం కుర్చీ కాపాడుకోవడానికే సరిపోవటం లేదు. ఇక ప్రజల గోడెవ్వరికి... సమయం యెక్కడ....
ప్రతిపక్షాలు వున్నాయి కదా భావగారూ మరి...
ఉన్నాయి భావగారు...కాని పోయిన పదవి యెలావస్తుందా అన్న ఆలోచన ఒకరిదైతే : పదవి అక్కరలేదు కాని...కనపడేవన్నీతమబోటి పేదలకే అనే సిద్ధాంతం మీద జెండాలు పాతే ప్రతిపక్షం ఒకటి. తన పరిశ్రమ అనండీ, వృత్తి అనండి వాటిలో బాగా డబ్బుచేసి...ప్రజలు సడెన్ గా గుర్తుకొచ్చి...పేదలసేవ అంటూ బయలుదేరి చతికిలబడ్డాక....నిన్నఎవర్ని దుమ్మెత్తిపోసావోవారి ప్రక్కన చేరి ప్రజా సేవకోసం పాపం తపించే అవకాశ ప్రతిపక్షం ఒకటి...ఇవన్నీ చూస్తుంటే నా కర్థం కానిదొకటే భావగారు....అందరూ వుద్ధరిద్దామనుకునే ఆ పేదవాడు ఎవ్వరు......ఎక్కడుంటాడు...అసలున్నాడా?
అదేంటి భావాజీ...పేదవాడు అంటూ మీరూ మాటలాడుతున్నారు,,,బిల్డింగు తీసి మీరు రాజకీయ అరంగేట్రం కాని చేయబోతున్నారా ఏమిటి?
ఎంత మాటన్నారు...భావగారు?
ఏదో సరదాగా అన్నానులెండి....కాని భావగారూ పేదవాడు అంటేయెవరు అన్నారు చూడండీ ..అది అంత అర్రీ బుర్రీగా తేలేవిషయంకాదు భావగారు....తీరికగా ఆలోచిద్దాం...ముందు భోజనానికి లేవండి.

Sunday, November 21, 2010

కార్తీక బ్లాగు భోజనాల స్పెషల్



ఉన్నట్లుండి ఇంట్లోంచి చమ్చా, దాని వెనకాల గ్లాసూ, తర్వాత చిన్నసైజు గిన్నెవచ్చేస్తున్నాయి..పాత అనుభవాలు చెప్పాయి...శ్రీమతి అలుకబూనింది అని...చర్చలు తప్పవు...ధైర్యము చేసి దాడిని తట్టుకుని..."ఏమిటి నీ డిమాండ్సు"..అనిఅడిగా..కాసేపు మౌనం వహించి..కొంచెం బ్రతిమాలాక పెదవి విప్పింది.."మీబ్లాగులో నాకు సమాన హక్కులు కావా"లంది..."సమానహక్కులేంఖర్మ మొత్తంహక్కులు నీవే"నన్నా..(అనువు కానిచోట అధికులమనరాదుకదా)..."అలామీరుయిచ్చేస్తే మేం యింక ఆందోళనలేం చేస్తాం..వద్దు" అంది. "సరే!నువ్వే చెప్పు యేం చేయాలో" అన్నా.."నేనూ మీ బ్లాగులో యేదో ఒకటి వ్రాస్తా"నంది...."నాలోసగం అని బ్లాగులోశీర్షిక వుంది.అందులో నీ యిష్టం"అన్నా..."అయితే నేనో మంచి వంట చెప్తాను..వ్రాసి అందులో వుంచండి" అంది...స్పెషల్ వంటలూ అవీ తనే చేస్తుంది నేను చెయ్యను లెండి...పెన్నూ కాగితం పట్టుకుని సిద్ధమయ్యాను......వంటకం పేరు: పూర్ణపొంకాయ పులుసు....అని చెప్పేటప్పటికి నాకు నోరూరిపోతోంది...."బాగుంటుంది..బాగుంటుంది..తెలుసు" అన్నా...వెంటనే ఆవిడ"యేంతెలుసు?తెలిస్తే యేంకావాలో చెప్పండి"అంది...జవాబు వెంటనేచెప్పాలి మా ఆవిడకి..లేకపోతే అదో క్రొత్తసమస్య....నేను కావలసిన వస్తువులుచెప్పా...."గాసు స్టవ్వూ,,నిండు గాస్ సిలెండరూ, మూకుడూ..."మా ఆవిడ మధ్యలోకట్ చేసి..."కంచమూ, గ్లాసూ...వండడానికి తర్వాత భోచేయడానికీ మీరూ"...అంది..."మరే!మరే! మర్చేపోయా..".అన్నానోలేదో...మీ మొహం అని తర్వాత లెంపలేసుకుంది. వ్రాయండి చెప్తా అని మొదలెట్టింది.వస్తువులు:చిన్నసైజు లేత వంకాయలు...1/2కె.జిచింతపండు ... ...25 గ్రా; ధనియాలు.. ...ఒక కప్పు; శనగ పప్పు... ... ఒక కప్పుమినప్పప్పు.. .... .. నాలుగు టేబుల్ స్పూన్స్; జీలకర్ర... ...ఒక టేబుల్ స్పూన
మెంతులు ... ...నాలుగైదుగింజలు మాత్రం; ఎండుమిర్చి.. ... ..నాలుగు(కారం యెక్కువ తినేవాళ్ళు ఎనిమిది వేసుకోవచ్చు); ఉప్పు.... తగినంత; బెల్లం కొద్దిగా యిష్టమైతేనే; పసుపు; పచ్చిమిర్చి.... నాలుగు.; తగినంత నూనె; ఆవాలు కొద్దిగా; ఇష్టమైనవారు ఇంగువ; కరివేపాకు.ఇప్పుడు చేసేవిధానం చెప్తా వ్రాయండి: ముందు చింతపండు చిక్కగా పిసికిపెట్టుకోవాలి. ధనియాలు,శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి,తగుమాత్రం నూనె వేసి ఎరుపురంగు వచ్చేదాకా వేయించి, గ్రైండుచేసి ఉప్పుకలిపి ఒకచోట పెట్టుకోవాలి.ఇప్పుడు వంకాయలు పుచ్చులులేకుండా చూసుకొని, శుభ్రంగా కడిగికాయల్లా తరుగుకోవాలి...."ముక్కల్లాగా అయితే తరుక్కోవాలి కాని...కాయల్లాగా అయితే తరగడమెందుకు" అన్నా...."పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా చెప్పింది వ్రాయండి" అని కంటిన్యూ చేసింది. ధనియాలు అవీ గ్రైండుచేసిన పొడెం ఈ కాయల్లోకి కూరాలి. కొంచెం పొడెం వుంచాలి.స్టవ్ మీద మూకుడు పెట్టి అందులోనూనె వేసి...కాగాక ఈ కాయలు అందులోవేసి సన్న సెగని మగ్గనివ్వాలి. "ఏమోయ్! ఇప్పుడు స్టవ్ వెలిగించాలి కదా మరి వ్రాయొద్దూ" అన్నా...."మహాశయా..సన్న సెగ అంటే వెలిగించమనే..నోరు మూసుకొని వ్రాయండి"....ఇంతదాకా వంకాయ కారంపెట్టిన కూరలాగానే ...అయితే కాయలు ఎర్రగా వేగిపోకుండా సగంపైగా మెత్తబడ్డాయి అనిపిస్తే...అందులో చింతపండుపులుసు, మరికొంచెంవుప్పు, ఇష్టమైతే బెల్లం, పసుపు కొంచెం, పొడువుగా రెండుగా కోసిన నాలుగు పచ్చిమిర్చివేయాలి.....ముందు గ్రైండు చేసిన పొడిలోంచి చారెడు పొడికూడా వెయ్యాలి.కాయలు ములిగాక కొంచెం పైకి వచ్చేటట్టుగా చింతపండుపులుసు వెయ్యాలి.ఇప్పుడు సన్నసెగనిమరగనివ్వాలి. అలా ఓ పది లేక పదిహేను నిముషాలుమరిగాక....ఆవాలు, ఇష్టమైన వారు కొంచెం ఇంగువ,కరివేపాకు వేయించివేసిఇంకో అయిదు నిముషాలు మరిగించి దింపాలి. దగ్గరగా మరిగి చిక్కపడ్డసాంబారులా వుంటుంది మొత్తం తయారయ్యాక.....రుచికరమై, ఘుమఘుమలాడే....పూర్ణపు వంకాయ పులుసు సిద్ధం.....'నేను ఒకటి ;ముక్తాయిస్తానే' అనగానే, 'అనుమతి మంజూరు చేయబడింది'అంది శ్రీమతి....'ఏం లేదండీ....కమ్మటి కందిపచ్చడి, ఘుమఘుమలాడేనెయ్యి కాంబినేషన్ తో పూర్ణపొంకాయి పులుసు తిన్నారంటే ... బెత్తెడేమిటికామధేనువు కొమ్ములు, కల్పవృక్షం కొమ్మలు కనపడ్తాయి" అనగానే"ఇన్నాళ్ళకి మీనోట మంచిమాట వచ్చింది.....లేవండి భోజనానికి అంది....""అయితే చేసేసావా..." అనగానే విజయ గర్వంతో చిరునవ్వు నవ్వుతూ నడిచింది మా విజయ.


Friday, November 19, 2010

పతియే ప్రత్యక్ష దైవం



(ఆలోచన ఆవిడది::అక్షరం నాది)
###

(ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. అప్పుడే భార్య వీధివైపు నుంచి లోపలకి వచ్చింది.)
భార్య: (తెచ్చిన ప్రసాదం భర్తచేతిలో పెట్టి,కుర్చీ భర్తదగ్గరకి లాక్కుంటూ)... ఏమండీ! ఇవ్వాళ గుళ్ళో వుపన్యాసం
చెప్తూ భర్తయే ప్రత్యక్షదైవం అంటూ చెప్పారండి. ప్రత్యక్షదైవం అంటే యేమిటండీ?
భర్త: ఇన్నాళ్ళకి ఓ మంచి ప్రశ్నవేసావోయ్ తాయారూ! చెప్తా విను. ప్రత్యక్షదైవం అంటే కనిపించే దేముడని అర్థం.
నిజానికి దేముడు మనకంటికి కనపడడు కదా...అంచేత కనపడే భర్తలోనే అంటే పతిలోనే దేముణ్ణి చూడమని
దాని భావం...అర్ధమయిందా?
భార్య: బాగా అర్ధమయిందండీ..నేనూ అదే అనుకున్నానండీ...రేపు యేకాదశి
కదా? రేపట్నించి మిమ్మల్నే నేను పూర్తిగా దేముడిలా కొలుచుకుంటానండీ..
భర్త: అలాగే తాయారూ! ఇన్నాళ్ళకు నీకో మంచి బుద్ధి కలిగింది. నాకు చాలా సంతోషంగా వుంది.
* * * * * * * * *
(నేపధ్యంలో తాయారు పాడుతూ వుంటుంది...
::తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మరల పరుండేవు లేరా...)
భర్త: (ప్రవేశిస్తూ..వళ్ళంతా దులుపుకుంటూ..) ప్రొద్దున్నే సుప్రభాతం పాడేవు.. అంతదాకా బాగానే వుంది...
అభిషేకమన్నావు..యేదో మామూలు స్నానమనుకున్నా..యిలా ఈ కొబ్బరి బొండాం నీల్లేమితి...తేనె యేమిటి...పాలేమిటి...పెరుగేమిటి...యిలా ఇవన్నీ పోసాసావేంటే బాబూ..అబ్బబ్బా..
వళ్ళంతా చాలా జిడ్డు జిడ్డుగావుంది...ఆ షాంపూ సీసా యియ్యి స్నానం చేసొస్తా....చాలా చిరాకేస్తోంది.
భార్య: (లెంపలేసుకుంటూ)మహాపచారం..మహాపచారం...అభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్నానమేమిటి?
'వస్త్రార్థం అక్షితాన్ సమర్పయామి' అని అక్షింతలు వేస్తానుండండి...
భర్త: ఇదెక్కడి గొడవే బాబూ,,,అక్షింతలేస్తే ఈ జిడ్డెలా పోతుందే... అయినా యింతవరకు కాఫీ కూడా యివ్వలేదు.
భార్య: అదేమిటండీ...ఇంత చదువుకున్నారు. దేవుళ్ళు కాఫీలు, టీలూ త్రాగినట్టు ఏ పురాణాలలోనైనా చదివారా?..
తప్పు తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదు...కళ్ళు పోతాయి.
భర్త: అదేమిటీ...మరి కాఫీ కూడా యివ్వవా..అయితే నేను దేముడిగా వుండను
భార్య: ఏంటమ్మా అది? సర్లెండి..కాఫీ అటుతిరిగి త్రాగుదురుగానిలెండి్--నీరాజమంత్ర పుష్పాలు అయ్యాక.
భర్త: సర్లే...అవునూ మరి నైవేద్యమెప్పుడూ? నైవేద్యానికి యేంచేసావు.?
భార్య: ఇవ్వాళ ఏకాదశి...ఈ పూట నైవేద్యానికి యేమీ వుండదు. రాత్రి ఉప్పిడిపిండి చేసి నైవేద్యం పెట్తాను...అదే ఫలహారం.
భర్త: చంపావు తల్లీ!----సర్లే యేదో సర్దుకుంటాను...కానీ తాయారూ! ఉప్పిడిపిండిలోకి వంకాయపులుసుపచ్చడి...
ఉల్లిపాయలు బాగా దట్టించి చెయ్...బాగుంటుంది. నాక్కూడా యిష్టం.
bhaarya ; (లెంపలు వాయించుకుంటుంది..) అపచారం...అపచారం...పిదపకాలం బుద్ధులు..పిదపకాలం బుద్ధులా అని...
ఉల్లిపాయలు దేముడికి నివేదించకూడదండీ..
భర్త: నాకు నివేదించవచ్చుకదోయ్..
భార్య: మీరు ప్రత్యక్షదైవం..మీకు అస్సలు కూడదు...మహా పాపం.(నిష్క్రమణ)
*********
(భర్తని శ్రీ వేంకటేశ్వరుడిలా నిలబెట్టింది..అభయహస్తం, వరదముద్ర పెట్టించింది...ఓ పెద్దపూలమాల
( వేసినట్టు అభినయించింది.)..ఆయన సీరియస్ గా నీరస్ గా నించున్నాడు...)
భార్య: (భర్త పెదాలు తన చేతివ్రేళ్ళతో సాగదీసి) ఏంటా చికాకు..మొహానికి కాస్త నవ్వు యేడవండి...
భర్త: (సీరియస్ గా ...నవ్వాడు)
భార్య: (నివేదన చేస్తూ)..ప్రాణాయస్వాహా..అపానాయస్వాహా...
భర్త: (పళ్ళెంలో చేయిపెట్టి తినబోతాడు)
భార్య: (అతని చేతిమీద ఒకటి కొట్టి)...అలా ముట్టుకోకూడదు. మంత్రం పూర్తవ్వాలి నీరాజనం
సమర్పయామి...మంత్రపుష్పం సమర్పయామి...భక్తోపచారం సమర్పయామి...హమ్మయ్య..
భర్త: హమ్మయ్య...అయిపోయిందా...
భార్య: ఊఁ...పూజ అయింది...యిక ప్రసాదం...నీరసం వచ్చేస్తోంది. ప్రొద్దున్ననించీ కటిక వుపవాసం కదా....
భర్త: మరే మరే...పెట్టేయ్..పెట్టేయ్.ఆకలి దంచేస్తోంది. ప్రొద్దుట్నించీ పచ్చిమంచినీళ్ళైనా త్రాగలేదు
....పెట్టేయ్ త్వరగా...
భార్య: ఏమిటీ..పెట్టేదీ....
భర్త: అదేనోయ్...ఫలహారం...ఉప్పిడిపిండి చేసావుకదా...
భార్య: తప్పు..ఉప్పిడిపిండి అనకూడదు...ప్రసాదం..ప్రసాదంగా నేను పుచ్చుకుంటాను.
భర్త: మరి నాకు..
bharya: మీకు నివేదన అయిపోయింది..తాంబూలం కూడా సమర్పించేసాను. నేను ప్రసాదం తీసుకుని వచ్చి,
మీకు పవ్వళింపుసేవ చేస్తాను....రేపు సుప్రభాత సేవదాకా శుభ్రంగా పడుకుందురుగాని....
పతియే ప్రత్యక్షదైవం. (సూత్రాలు కళ్ళకందుకుంటుంది)(లోపలికి వెళ్తుంది)
భర్త: ఇదెక్కడి గొడవే తాయారూ...ఓరి దేముడోయ్....అర్జంటుగా కనికరించు.. ఓ పురాణం శాస్త్రులుగారూ...
అర్జంటుగా పురాణాలు మార్చండి...మేము ఉత్తుత్తి భర్తలమే....దేముళ్ళమీ..గీముళ్ళమీ కాము..
ప్రత్యక్ష దైవాలము అస్సలు కాము.....ఆకల్రోయ్....దేముడోయ్..
(తెర)
***** ************ *****
(ఈ స్కిట్ చదివిన తర్వాత మీకు ఆనందం కలిగితే నాకూ ఆనందం. ఇందులో భార్యగా నా భార్య శ్రీమతి విజయలక్ష్మి,
భర్తగా ఆవిడ భర్తనైన నేనూ నటించి, రాజమండ్రి హాసంక్లబ్ లోనూ..ఇతరచోట్లా..family get togethers లోనూ
ప్రదర్శించాము. జీ కామెడీలో కూడా ఇదిప్రదర్శిస్తే పోటీలో పై స్థాయికి మాకు అర్హతనిప్పించింది. స్క్రూటినీకి వచ్చిన
జీ ఛానల్ వారు చాలా ముగ్ధులై గౌరవంగా మాకు వారిషోలో అర్హత కల్పించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సోత్కర్ష నేనే యెందుకు చేసుకుంటున్ననంటే-----------------మరి మీరు చేయరుగా !)
ooooOOOoooo

Saturday, November 13, 2010

ఈ నాటి బాలలు




చాచా నెహౄ పుట్టిన రోజు
చిన్నారి బాలల పండుగ రోజు

పెద్దలందరూ ముందు కొచ్చారు
ఘన కీర్తులు వల్లించుకుంటూ
వున్నవాళ్ళు క్రాఫింగులు
లేనివాళ్ళు టోపీలు సర్దుకుంటూ

చిన్నారి పసి మనస్సులకు
చెప్పారు సుద్దులెన్నో
రేపటి పౌరులు మరి మీరేనన్నారు
భావిభారత పౌరులంటూ జే జే లు పల్కారు

సుద్దులన్నీ పొందికగా సర్దారు
తమ లేత మనసుఅరల్లో నేటి బాలలు
రేపటి పౌరులయ్యాక మరి వీరే
చెప్పాలిగా రేపటిబాలలకీ సుద్దులు

Thursday, November 11, 2010

శ్రీ ఎంబి యస్ ప్రసాద్ ఇదీ అసలుకథకు (టీవీ కార్యక్రమం) అవార్డు





వనిత టి.వి లో ప్రసారమైన "ఇదీ అసలు కథ"కుగాను ఆ సంస్థవారికి నంది అవార్డువచ్చిందని తెలిసి ఆనందం కల్గింది. దాని రూపకర్త "ముళ్ళపూడి సాహిత్యసర్వస్వం" గ్రంధ సంకలనకర్త శ్రీ యమ్బీయస్ ప్రసాద్. 'హాసం' పత్రిక ద్వారా మీకూ నాకూ పరిచయమైన శ్రీ యమ్బీయస్ ప్రసాద్ గార్కి మా హాసం క్లబ్ కారణంగా నేను దగ్గరవడం నా అదృష్టం..ఇవ్వాళ అవార్డ్ వచ్చిందని చెప్తున్న మాట కాదిది. ఇవ్వాళ మనకున్న అతి కొద్దిమంది హాస్య రచయితలలో యెన్నదగిన సమర్ధత వున్న రచయిత శ్రీ ప్రసాద్. వారి రచనలన్నీ చదివానని అబద్ధమాడను..చదివిన అచలపతి కథలు, రాంపండులీలలు, పొగబోతుభార్య ..మొనవి వారి సునిశితహాస్యానికి చెప్పదగినవి. మనగురించి మనం ఆలోచించుకోవలసినఅవసరం వారి రచనల్లో కనపడ్తుంటుంది. "రేడియో, టీ.వీ ల పుణ్యమాఅని క్రికెట్ఆటను విని, చూసి తామేదో క్రీడాభిమానులనుకోవడం జనాలకి పరిపాటి అయింది. ఆరోగ్యంకోసం క్రీడలు ఆడాలికాని చర్చిస్తే సరిపోదు. ఆఫీసు పని ఎగ్గొట్టి క్రికెట్ కామెంటరీ విననివాడు "అన్ స్పోర్టివ్" అనేటంతవరకు పోయింది పరిస్థితి..." ఆలోచించాలనిపిస్తున్నది కదా...ఇది శ్ర్రీ ప్రసాద్ గారి అచలపతికథల్లో...

"ఇదీ అసలుకథ" విషయానికి వస్తే....వనిత టీవీలో...వారానికో రోజు రాత్రి10.30కి వచ్చేది...ఎన్నో మంచి మంచి సినీమాలు యెంచుకొని, వాటికి ఆధారమైనఅసలు సినీమా ఏ భాషలో వున్న అది చెప్తూ..యెక్కడ మార్చారో..దానివలనవచ్చిన స్వారస్యం చర్చిండం..ఏ నటుడు ఏ భాషలో బాగా చేసాడో సోదాహరణంగాచెప్పడం...ఆ సినిమా క్లిప్పింగులు, ఈ సినిమా క్లిప్పింగులు అన్నీ చూపడం,తన అందమైన వ్యాఖ్యానం....వాహ్...నిజంగా చాలా అద్భుతం. ఎంత శ్రమ పడ్డారోఆ కార్యక్రమం రక్తి కట్టించాలని...అదే ఆయనతో నేనన్నాను కూడా...ఏమైనా ఆయనశ్రమకు గుర్తింపు ఈ అవార్డు...శ్రీ ప్రసాద్ గార్ని మనసారా అభినందిస్తున్నాను.వనిత టీవీ వారుకూడా ఈ మహావ్యక్తిని సమ్మానించవలసినసమయం....ఇంత కష్టం పడుతున్న భర్తకు అంత శ్రమాపడి సహకరించిన వారి శ్రీమతికి కూడా అభినందనలు

నేను వ్రాసి, ప్రదర్శించిన స్కిట్స్ అవీ చూసి నన్ను హాస్య రచనలు చేయమని ప్రోత్సహించిన సౌజన్యమూర్తి శ్రీ ప్రసాద్. నేను బ్లాగులో హాస్యం వ్రాసే ప్రయత్నానికి అదో స్ఫూర్తి. ఈ హాస్యరచయితను మా హాసం క్లబ్ తన అయిదవ వార్షికోత్సవమప్పుడు ఆహ్వానించి హాసం పత్రిక వ్యవస్థాపకులు, శాంతా బయోటెక్నిక్స్ అధినేత శ్రీవరప్రసాదరెడ్డిగారి చేతుల మీదుగా సన్మానించగలగడం...హాసంక్లబ్ కు ఆనందకారణం...కన్వీనర్స్ లో ఒకడిగా నాకు గర్వకారణం. మరొకసారి వార్ని హాస్యాభిమానులైన మీ తరఫునానా తరఫునా అభినందిస్తూ... శలవు.

Thursday, November 4, 2010

ఎదుగుతూ దీపావళి



చిన్నతనంలో మా పేటలో పది పదిహేను ఇళ్ళకన్నా యెక్కువ వుండేవి కావు. కొన్ని పాకలు కొన్ని పెంకుటిళ్ళు... ఒకే ఒక్క డాబా.....దీపావళి వచ్చిందంటే యేదో థ్రిల్...


నేనూ మా ఫ్రెండూ ...చిన్న నిక్కరో/గోచీయో ధరించి....మా పాకముందు వేపచెట్టు క్రింద చేరేవాళ్ళం....మాముందు కల్వం (అంటే యేమిటో కొంచెం మీ అబ్బాయికి చెప్పండి) వుండేది.మా చేతిలో రోలూ రోకలి....అఁ అది కాదు.దీపావళి బాపతు...(రోలూ రోకలి అని అమ్మేవారు....కొంచెం లావుపాటి తీగనువంచి ఒక కొసలొ .క్రింద చిన్న సైజు రోలులా, యింకో కొసలో పైన రోకలిలా ఏర్పాటుచేసేవారు) తలనొప్పి మందు 'అమృతాంజనం' ఆ రోజుల్లో సీసాలో పెట్టి, ఆ సీసాను ఇంకో డిబ్బీలో పెట్టి అమ్మేవారు. ఆ సదరుడబ్బా సంపాయించేవాళ్ళము. అందులో పటాసు వేసుకొని, ఆ డబ్బాలో ఓ చిన్న తాటాకు బద్దముక్కవుంచుకొని...దానితో ఓ చిన్న మోతాదు పటాసు ఆ రోటిలో వేసి, దాన్ని రోకలితో మూసి, గట్టిగా పట్టుకారుతో పట్టినట్టు పట్టి, తిరగేసి, ఆ కల్వం ముక్కపై కొట్తే 'ఢాం' అని సౌండ్...ఆనందం....ఒకసారి వాడు, ఒకసారి నేనూ...దీపావళి ముందునుంచి ఈ హడావుడి....అదో థ్రిల్.
నరకచతుర్థి నాడు వుదయమే తలంటు...అమ్మ తలమీదనూనె పెట్టి 'అమ్మ కడుపు చల్లగా...అత్త కడుపు చల్లగా' అంటూ దీవించేది. ముందుగా టపకాయ కాల్పించి అప్పుడు దీవెన. మన టపాకాయే గట్టిగా పేలిందిరా అని ఎన్కరేజ్ చేస్తూ తలంటుతుంటే ఏదో థ్రిల్.
తల తుడుచుకున్నాక...అమ్మ తిలకం పెట్టాక....కుంకుడుకాయపులుసు కళ్ళల్లో పడిందమ్మా అంటే ఉప్పురాయి నోట్లో వేసుకోమనేది.కొత్తబట్టలు కట్టుకొని పెద్దవాళ్ళకి దణ్ణాలు పెట్టేసి...ఏదో ఒకటి తిని అరుగు మీద నాన్నగారు కొన్న బాణాసంచా అందంగా పేర్చి యెండబెట్టుకోవడం. చూడ్డానికి వచ్చే మిత్రులకి యేది ఎలా పేల్తుందో...మతాబులలోంచి ముత్యాలు ఎలా రాల్తాయో, అన్నీ యాక్షన్ చేస్తూ చెప్పడం...అదో థ్రిల్.
కొంచెం యెదిగాక...సిసింద్రీలు కట్టడం....ఎంతకీ తెమిలేదికాదు. అక్క ఏడిపించడం..నేను అమ్మతో కంప్లైంట్...అమ్మనవ్వుతూ అక్కను మందలించడం....అక్క ఇంకా రెచ్చిపోవడం....అదో థ్రిల్......
అమ్మ ఆ తర్వాతనుంచి మతాబులు కట్టించేది. పది రోజుల ముందునుంచే గొట్టాలు చేయడం. సూరేకారం,గంధకం, తెచ్చికొని ఎండబెట్టడం. నూరి వస్త్రకాళితం చేయడం... ఆముదం, బీడు, ముగ్గూ తెచ్చుకుని....పాళ్ళు కలిపి గొట్టాలలో కొంచెం ఇసుక ఆ తర్వాత ఈ కలిపిన మందు కూరడం....అక్కడనుంచి వెలిగించి చూడ్డం...సాంపిల్ అన్నమాట....ముగ్గు తక్కువైంది....కలపడం మళ్ళీసాంపిల్...ఆముదం తక్కువ...కలుపు...సాంపిల్ చూడు. ఇలా చాలా కాల్చేసేవాడ్ని సాంపిల్ అంటూ.. అదో థ్రిల్ ...
మా ఫ్రెండ్ 'ఉప్పు పొట్లాలు' కట్టేవాడు. దానిలో జిల్లేడుకర్ర్రల బొగ్గు, రంపం పొట్టూ, వుప్పూ...ఏదేదో చేసేవాడు...దానికో చాంతాడు....సాయంత్రమే దాంట్లో నిప్పువేసి వుంచితే రాత్రికి రాజుకొని వుండేది.దాన్ని త్రిప్పుతుంటే....రంపంపొట్టు నెరుసులు త్రిప్పేవాడి చుట్టూ కాంతివలయంలా ఏర్పడుతుంటే వాహ్! ఆ అందమే వేరు. ఉప్పు కాలి చిటపటమంటూ పేలుతుంటే అదో థ్రిల్.....ఆ వుప్పుపొట్లాలు రాత్రి తెల్లవార్లూ తిప్పినా నో ముగింపు. కాని రెక్కబలం వుండాలి....ఓ సారి ట్రై చేసి రిటైర్డ్ అన్ హర్ట్. అదోథ్రిల్.
ఆ తర్వాత పలాసాలో వుద్యోగం...జూన్ లో వుద్యోగంలో చేరాను.అమ్మా, నాన్నగారల దగ్గరకి దీపావళికి రాజమండ్రీ రావాలంటే ఒకరోజు శలవు చాలదు. ప్రొబేషన్ పేరియడ్ లో అంతకన్నాయెక్కువ కుదరదన్నారు బాస్. మధ్యేమార్గంగా అన్నయ్య వైజాగ్ లో వున్నాడని దీపావళికి అక్కడకి. అన్నయ్యగారి పిల్లలతో సరదాగా కాలక్షేపం...




వాళ్ళింటాయన మాత్రం చాలా సందడి చేసాడు..ఆయనకు అరవై దగ్గర వుంటుంది వయస్సు. పిల్లలు లేరు. ఓ మేనల్లుడు వీరి దగ్గరే వుంటున్నాడు...వాళ్ళిద్దరిదీ గొప్ప హడావుడి. దీపావళికి వాళ్ళిద్దరూ ఒక బృహత్తర కార్యక్రమం ఆలోచించారు...గేటుకి యిటూ అటూవున్న స్తంభాలపై రెండు చిచ్చుబుడ్డులు పెట్టి ముట్టిస్తే..అవి యేకకాలంలో వెలుగులు చిమ్మాలి. అయితే దగ్గరకి వెళ్ళి ముట్టించడానికి యిద్దరికీ భయమే. సరే! మేనల్లుడు ఆ చీకట్లో దొడ్డంతా వెదికి రెండు కర్రలు పట్టుకొచ్చాడు. వాళ్ళ అరుగుమీదనుంచి చిచ్చుబుడ్డి స్థానందాకా కర్ర పెట్టడానికి ట్రై చేసారు. ఓ కర్ర సరిపోయింది కాని రెండో కర్రకు సుమారు ఓ ఆడుగు తక్కువైంది. ఎలాగ? ఇంక ఏ కర్రా దొరకలేదు కాని...'యురేకా...మామయ్యా' అని అరుస్తూ ఒక బొప్పాయి గొట్టం పట్టుకువచ్చాడు. 'గ్రేట్ రా అబ్బీ' అని మామయ్య సంబరపడి పోయాడు. ఆ గొట్టాన్ని ఈ కర్రకు కట్టారు.రెండు కర్రలకీ చెరికో కాకరపువ్వొత్తూ కట్టారు. సరే మేనల్లుడు లోపలకి వెళ్ళి రెండు చిచ్చుబుడ్డులు తెచ్చాడు. రెండు స్తంభాలపైన పెట్టాడు. పెద్దాయన--ముచ్చట చూడ్డానికి లోపలున్న వాళ్ళావిడ్ని పిలిచాడు, నన్నూరమ్మన్నారు. ఆల్ సెట్ టు గొ...మామా అల్లుడూ పొజిషన్స్ లోకి వచ్చారు. కాకరపువ్వొత్తులు వెలిగించారు....' ఒరేయ్ రెడీయా?'...'రెడీ మామయ్య' ....కర్రలు జాపారు....ఆగు....ఆగు....ఊఁ....ఆఁ....కాకర పెట్టు...జాగ్రత్త....నే అంటించేస్తున్నా..నువ్వూ అంటించు.అంటూ మామయ్య వెలిగించేసాడు....మేనల్లుడి కర్రకు కట్టిన బొప్పాయిగొట్టం కట్టుకాస్తా జారిపోయింది....మామయ్య విజయగర్వంతో వెలిగిపోతున్నాడు కాని అనుకున్నట్టు వెలగలేదు. మళ్ళీ ప్రయత్నం.. ఈ సారి అంతా సెట్ చేసారు....ఆఁ....ఊఁ....పెట్టరా....రెడీయా..అంటించు....నేను అంటిస్తున్నా...అరే..అరెరే కాకరపువ్వొత్తు తగిలి మామయ్య వెలిగిస్తున్నచిచ్చుబుడ్డి క్రిందపడి పగిలి పోయింది....'చాల్లెండి సంబరం' అంటూపెద్దావిడ లోపలకి పోయింది...ఈప్రయత్నం వమ్ముకావడంతోహతాశులైపోయారు..' ఇలా కాదురా మళ్ళీసారి...ముందే పెద్ద కర్రలు రెండు సంపాయించి ఎలాగైనా రెండూ ఒకేసారి వెలిగేటట్టు చేస్తిమా..రెండు బుడ్లూ ఒకేసారి ముత్యాలు పైకిజిమ్ముతుంటే ఆ అందమే వేరురా అబ్బీ..అంటూ భవిష్యత్ప్రణాళిక ఆలోచిస్తుంటే నేను లోపలికి జారుకున్నా.
ఆ తర్వాత వేసంగులలో నా పెళ్ళి అయింది....తర్వాత అమ్మా, నాన్నగారూ ఈవిడ్ని తీసుకొచ్చి కాపురం పెట్టించి వెళ్ళారు. ఆ దీపావళిపలాసాలో మేమిద్దరమూ చేసుకోవాలి. పలాసా కొంచెం పల్లెటూరు.అందరూ ముఖాల్లో ముఖాలు పెట్టి చూస్తారు. 'పెళ్ళై, మంచి వుద్యోగంచేసుకుంటూ యిలా చిన్న పిల్లల్లా టపాసులు కాలుస్తున్నారేంటి'అనిఅంటారేమో అని ఆలోచించినవాళ్ళమై, మా బ్యాంకులో మెస్సెంజరు తమ్ముణ్ణి నువ్వొచ్చి కాల్చిపెట్టరా బాబూ అని బ్రతిమాలాము. కాసేపు మురిపించుకున్నాడు...మా ఇంట్లో కాల్చుకోవద్దా అన్నాడు. ఇంట్లో పనివుంది అన్నాడు. కాల్చిపెట్టడానికి బాణాసంచామేం రెడీగా వుంచితే వాడు వచ్చి కాల్చినందుకు అర్థరూపాయి ఇస్తానంటేమొత్తానికి ఒప్పుకున్నాడు.....బాణసంచా కొన్నా. రాత్రి ఆరున్నరైంది, ఏడైంది, ఏడున్నరా...వీడు రాలేదు...ఎనిమిదవుతుంటే వచ్చాడు...వస్తూనే గాభరా....'ఏరా ఇంత లేటూ ...అందరూ కాల్చేయడంకూడా అయిపోతోందిరా మరి'...అంటే.."ఏంచేయమంటారండీ...హెడ్ క్లార్కుగారింట్లో వాళ్ళవిడ వూరికెళ్ళారట..ఆయనా మీకుమల్లేనే బ్రతిమిలాడితే వాళ్ళింటికి వెళ్ళి కాల్చాక....సత్యనారాయణగారి యిల్లు ఒప్పుకున్నాను కదా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ టైమ్ అయింది. చంపేస్తున్నారండీ బాబూ..ఇంతకీ యిప్పుడు నన్ను కాల్చమంటారా..మీరే కాల్చేసుకుంటారా?ఏదో ఒకటి తొందరగా చెప్పండి." అని వాడే ఓ లక్ష్మీ బాంబు పేల్చాడు.ఈ వచ్చినవాడు కాస్తా పోతాడేమోనని, వాణ్ణి బ్రతిమలాడి బామాలి వాడిచేత టపాసులు కాల్పించి సంభావన సమర్పించుకొని దీపావళి అయిందనిపించాము....ఇదీ ఒక థ్రిల్లే కదా మరి!
ఉద్యోగ పర్వంలో హైదరాబాదు...దీపావళికి పిల్లలకు నా పర్స్ మేరకు కొంత ఖర్చు పెట్టి. మూడు రోజులు ముందుగానే.. సరకులు కొన్నా. నాకూ చాలా సరదా. ఆవిడ వద్దంటున్నాధైర్యం చేసా. పొడుగాటి కాకర్లు, 1000వాలాలు, పెద్ద భూచక్రాలు,యేవేవో వెరైటీగా కొన్నా. ఆ మర్నాడు మా పెద్దమ్మాయిని తీసుకొని,ఈవిడా నేనూయేదో పనిమీద బయటికి వెళ్ళాము. ఇంట్లో నాన్నగారూ, అమ్మవున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు. రెండో పాపా, మూడోదీ కూడావున్నారు.రెండో పాపకు అయిదారేళ్ళుంటాయి, దానికన్నరెండేళ్ళుచిన్న తర్వాతది. మేం బయటికి వెళ్ళి తిరిగొచ్ఛేసరికి ప్రక్క సందులో రెండోదాని నాయకత్వంలో యింట్లో పెద్దవాళ్ళకి కూడా తెలియకుండా మొత్తం బాణాసంచా కాల్చి పాడేసారు. పెద్దది చూసి గోల...మొత్తం అన్నీ కాల్చేసిందే అమ్మా అంటూ.ఇది కాల్చలేదే అమ్మ అంటూ ఓ కాకర చూపింది ఆఖరిది. పెద్దది దాన్ని ఒక్కటుచ్చుకుంది. అది కుయ్యో మంటూ ఆరున్నొక్క రాగంప్రారంభించింది. కొట్టడం అలవాటులేక రెండోదాన్ని కూకలేసా గట్టిగా.అది మౌనం వహించింది. రెండుకళ్ళూ ప్రశాంతగా మూసేసుకుంది. అటకమీద కూర్చోపెట్టా...అదే మౌనం..అదే ప్రశాంతత. అలాగే కూర్చుంది...ఏంచేస్తాం?మళ్ళీ నేనే దింపక తప్పింది కాదు.....మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కావలసినవికొని తెచ్చాననుకోండి....పిల్లలతో ఇదో థ్రిల్.....



పెద్దవాళ్ళమయ్యాము...రిటైర్డ్....అపార్ట్ మెంటు వాసం...సెల్లార్ లోనే యేం కాల్చినా....మాకు ముగ్గురూ ఆడపిల్లలు...వాళ్ళ తావుల్లో వాళ్ళు వుంటారు.అపార్ట్ మెంటులో పిల్లలు ఆప్యాయంగా అంకుల్, ఆంటీ అంటూ సందడిగా దీపావళి చేస్తుంటే చూస్తూ మనసారా ఆనందించడం ఇప్పుడు మంచి థ్రిల్......
అప్పట్నించి ఇప్పటిదాకా దీపావళి యెప్పుడూ థ్రిల్లే....ఆనందమే...ఆ రోజులు తలచుకుంటే...మనస్సు కోటి దీపాలవెలుగులతో నిండి పోతుంది......._*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_


అందరిజీవితాలలోనూ వికృతినామ సంవత్సర దీ పా వ ళి


క్రొత్తవెలుగులు నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.




_____________________________________