Pages

Saturday, December 18, 2010

శ్రీ హనుమద్ర్వతం

శ్రీ మారుతాత్మజాయనమః

శ్రీ రామచంద్రుడు దుష్ట సంహారము అయ్యాక సీతా సమేతుడై అయోధ్య చేరాడు. పట్టాభిషిక్తుడయ్యాడు..వనవాసకాలంలో పరిచయమైన తపోధనులకు కృతఙ్ఞతలు తెలపాలని జానకీ మాత సంకల్పించింది. సర్వాంతర్యామి..."సరే" అన్నాడు...ఏర్పాట్లు చక చకా జరిగిపోయాయి...అంతా తానై నిర్వహిస్తున్నాడు హనుమ......ఆ రోజు రానే వచ్చింది. శ్రీ రాముని దర్శించవచ్చునన్న కుతూహలం...ముని జనుల కోలాహలం....తపోవనం తరలివచ్చింది. ఋషులందరూ మాధ్యాహ్నిక సంధ్యావందనాదులకు సరయూనదికి తరలారు.
హనుమ వుత్సాహంగా అంతటా కలయ తిరుగుతున్నాడు....నదికి వెళ్ళిన ఋషి మండలి రాలేదు...కాలంగడుస్తున్నది...అమ్మ దృష్టి హనుమ పైననే....పుత్రవాత్సల్యము...
"ఇంకా మునిబృందము రాలేదు..వేళ మించుతున్నది...ఈ పసివానికి ఆకలౌతున్నదేమో..ముందు ఇతనికి భోజనం పెట్టేయనా" అని తర్కించుకుంటూ రాఘవుని అడిగింది..."సరే"అన్నాడు మృదుభాషి.....
"హనుమా!అన్నం పెట్టనా అమ్మా!" అంది సీతమ్మ. అమ్మ అడిగితే కాదనగలడా హనుమ...వెంటనే వచ్చి కూర్చున్నాడు. అమ్మ స్వయంగా వడ్డిస్తున్నది...హనుమ తింటున్నాడు...అమ్మ పెడ్తోంది, ఇతడు తింటున్నాడు...అన్నపురాసులు తరిగిపోతున్నాయి.అమ్మ పెట్తోంది...హనుమ తింటున్నాడు. అయ్యో ఇతని ఆకలి తీరటంలేదే అని అమ్మ కంగారు పడ్తోంది.అమ్మ పెట్తోంది కదా అని తింటున్నాడు హనుమ...మెండుగా వండిన పదార్థాలు నిండుకుంటున్నాయి...చాలు అని అతను అనడం లేదు...బిడ్డకు ఆకలి తీరడంలేదు అని గాభరా పడి శ్రీరాముని దగ్గరకు వెళ్ళి జానకి చెప్పింది
అది శివస్వరూపం...నువ్వుఎంత పెట్టినా ఆతడు వద్దనడు...లేవమని వినయంగా చెప్పు"అన్నాడు కోదండపాణి. "హనుమా! ఇక లేస్తావా నాయనా!" అమ్మ అనగానే సంతృప్తిగా త్రేన్చి "అలాగే తల్లీ!" అని లేచాడు హనుమ..
(నేను పిల్లవాడిగా వున్నప్పుడు..పిల్లల పత్రిక చందమామ లోచదివాను: గుర్తుతో వ్రాసినది కనుక యథాతధంగా వుండదు...) *****

శ్రీరాముడు అవతరిస్తున్నాడని తెలిసి తానూ హనుమగా అవతరించాడుపరమేశ్వరుడు...నేనూ వస్తానందిట ఆదిశక్తి...నువ్వెందుకు తోకలాగఅన్నాడట...సాంబశివుడు. అయితే తోకగానే వస్తానందిట...అందుకేహనుమద్వాలం అంత శక్తి సమన్వితం.
తులసీదాసు తన రామచరిత మానసంలో శివుడి రామభక్తి అద్భుతంగా ఆవిష్కరిస్తారు.
******
హనుమ సముద్రం దాటే సమయంలో వానరులతో--మనోవేగంతో శ్రీరామ బాణంలా దూసుకుపోతానంటాడు...సుందరకాండ ప్రారంభంలో...సాధనామార్గంలో ప్రవేశించేవారికి ఇంద్రియ జయంఅవసరం.అందుకే మైనాకుడిచ్చే ఆతిథ్యం సున్నితంగా తిరస్కరించాడు....సురసామాతపెట్టిన పరీక్షను బుద్ధితో గెలిచాడు...ఛాయాగ్రాహికి వజ్రఘాతం రుచి చూపాడు...రావణపాలిత లంకా నగరాన్ని...రామదూతగాప్రవేశించి ఒక వానరశ్రేష్టుడు....శ్రీరామ విజయానికి నాందీ ప్రస్తావన చేసాడు..

ఒకసారి వానరులంతా బంతిభోజనాలు చేస్తున్నారట. విస్తట్లో ఉస్తికాయలువడ్డింపబడ్డాయి...అవి వంకాయ పోలికలో రేగిపండుసైజులో వుంటాయి.అది పట్టుకొని ఒక వానరం తినబోతే పట్టుజారి పైకి యెగిరింది..అది చూసినఆ కోతి తనుకూడా చిన్నగా యెగిరింది...దాని ప్రక్కనవున్న మరోకోతిఇంకొంచెం యెగిరింది..అలాఒకదాన్ని చూసి మరొకటి, మరొకదాన్ని చూసిమరొకటీ....అందర్నీ చూసిన హనుమ తానూ వినయంగా కొంచెం యెగిరి కూర్చున్నాడట. సభామర్యాద కోసం..(ఇదీ పాత చందమామల్లోనే చదివా)

లంకలో సీతమ్మను చూసిన హనుమ, అమ్మకు ధైర్యం చెప్తాడు.".శ్రీరాముడువస్తాడమ్మా నీ చెర విడిపిస్తాడు" అంటాడు...అంతావిన్న సీతమ్మకు సందేహంకలుగుతుంది..."గరుత్మంతునితో సమానమైన నీవంటే శతయోజనవిస్తీర్ణమైనసాగరాన్ని దాటి వచ్చావు...మిగతా వానర సైన్యం అలా రాగలరా" అంటే "సుగ్రీవ సైన్యంలో నాతో సమానులైనవారు, నన్ను మించినవారేనమ్మాఅందరూ...నాకన్నా తక్కువవాడొక్కడు లేడమ్మా.."అంటాడు. "ఇలాంటి దూతకార్యాలకు నాలాంటి సామాన్యులను పంపిస్తారుకాని అధికుల్ని పంపరుకదమ్మా..." అదీ హనుమ వినయసంపద..

రామరావణ యుద్ధం జరుగుతుండగా ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతోరామ లక్ష్మణ సహా అందరూ మూర్ఛిల్లుతారు..ఆ రాక్షసమాయ విభీషణునియేమీ చేయదు..బ్రహ్మానుగ్రహము వలన హనుమనూ యేమీ చేయదు...ఆ పరిస్థితులలో యెవరు యెలా వున్నారో చూడాలని వీరిరువురూయుద్ధభూమిలో పరిశీలిస్తారు...వందలాదిగా తగిలిన బాణాల ధాటికిజాంబవంతుడు బాగా గాయపడి, మూలుగుతూ కనపడతాడు...."అయ్యా!ప్రాణాలతో వున్నావా?" అని పలకరిస్తాడు విభీషణుడు...అతని స్వరాన్నిబట్టి విభీషణుని గుర్తించిన జాంబవంతుడు---హనుమంతుడు జీవించియేవున్నాడు కదా?--అంటాడు. దానికి విభీషణుడు "రామలక్ష్మణుల సహాఇంతమంది వుండగా హనుమ క్షేమమడుగుతావేమిటి" అంటే దానికిజాంబవంతుడు---

తస్మిన్ జీవతి వీరే తు హత మప్యహతం
బలమ్హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోపి వయం హతాః----

హనుమంతుడొక్కడు జీవించివుంటే మనసేనలన్నీ మృతులైనా బ్రతికున్నట్టేఅలా కాకుండా అతడు విగత జీవుడైతే మనం బ్రతికున్నా నిర్జీవులమే" అంటాడు.అదీ హనుమ శక్తి...

అందువలననే అనితరసాధ్యమైన లంకా నగరాన్ని చేరి, సీతమ్మను చూసి,రావణబలాన్ని అంచనా వేసి, తిరిగి వచ్చి శ్రీ రామునికి సీతమ్మక్షేమం చెప్పినహనుమను చూసి...ఇంత మహోపకారము చేసిన నీకివ్వడానికి నాదగ్గరయేముందయ్యా నా కౌగిలింత తప్ప అని అక్కునజేర్చుకున్నాడు ఆజానుబాహుడు.సీతమ్మకు తక్క అన్యులకు లభ్యముకాని ఆ పరిష్వంగ భాగ్యం హనుమయ్యకుమాత్రమే లభించింది.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతాఅజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్స్మరణాద్భవేత్
(మార్గశీర్ష శుద్ధ త్రయోదశి అంటే రేపు(19.12.10) హనుమద్ర్వతం.)

Friday, December 10, 2010

హాస్య భాషణలు వారి నోటనే


బారిష్టర్ పార్వతీశం' నవల నాటకంగా రేడియోలోధారావాహికంగా వచ్చింది.. బారిష్టర్ కోర్సు చదవడానికి పార్వతీశం లండన్ వెళ్తాడు..కూడా రుబ్బురోలుతో సహా అన్నీ పట్టుకు వెళ్తాడు...ఓడలో ప్రయాణం...ముందు తనవూరినుంచి రైల్లో బయలుదేరతాడు...పట్టుకు వెళ్ళిన మడతమంచం యెక్కడ పెట్టాలా అని ఆలోచించి..అలారమ్ చైన్ కు తగిలిస్తాడు కష్టపడి..రైలాగిపోతుంది. గార్డుగారుపరుగెట్టుకొస్తారు..."ఎవరిదీ మంచం?"..పార్వతీశంఆ మంచం తీయడు,సరికదా "ఏం? అంత బాగుందేమిటి?" అంటాడు. ఈ ఆఖరి మాట పాత్రధారి శ్రీ నండూరి సుబ్బారావు గారి స్వరంలో ఎంత హాస్యభరితంగావుందో మరవలేం...ఈ హాస్యభరిత నవలారచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గార్ని ఒక సభలో సన్మానిస్తూ 'వీరి రచనలు చాలా హాస్యాస్పదంగా వుంటా' యన్నారుట.రాజమండ్రీ గౌతమీగ్రంధాలయంలో జరిగిన సభలో అనుకుంటా వారుఈవిషయం నవ్వుతూ చెప్పారు.

రాజమండ్రీలో 1962 లో అని గుర్తు..తెలుగురచయితల సభలుజరిగాయి..మా నాన్నగారికి ఆహ్వానం వచ్చింది..వారితో నన్నూతీసుకువెళ్ళారు...గొప్పగొప్ప రచయితలను చూసే అదృష్టం కలిగింది.సర్వశ్రీ విశ్వనాధ,వెంపరాల, మునిమాణిక్యం, నోరి నరసింహశాస్త్రి, గిడుగు, మొక్కపాటి,, బెజవాడ గోపాలరెడ్డి..మొదలైనవారు చాలామంది వచ్చారు...ఓ రోజు మునిమాణిక్యంగారు మాట్లాడారు.
"నేను ఈ నెల జీతం అలవాటు ప్రకారము మా ఆవిడకి యిచ్చాను. లెక్క చూసుకుని 'ఏమండీ? ఈ నెల తక్కువ యిచ్చారేమండీ?" అంది. "వాళ్ళు తీసుకున్నారే" అన్నా. "ఎవరండీ?" అంది. "అదేనే, ఆఫీసువాళ్ళు" అన్నా. "ఎందుకండీ?""యుద్ధం చేస్తున్నారు కదా? అందుకని." "ఎవరు చేస్తున్నారు ? ఎవరితోచేస్తున్నారు?దానికీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏమిటి సంబంధం?" అని ఆరా తీయసాగింది."అదేనోయ్!
మన దేశం వాళ్ళు చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా? మరి ఖర్చవుతుందికదా?" అని వివరించా. "అంత పెద్దదేశం చైనా వాళ్ళతో మనవాళ్ళు యుద్ధం చేస్తారా? దానికి ఖర్చవుతుందా? అందుకని మీ జీతం కోస్తారా?" అన్నింటికీ అవునంటూ బుర్ర వూపా...అప్పుడు
మా ఆవిడ "యుద్ధం చేయడానికి డబ్బుల్లేకపోతే మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టడమెందుకండీ...అంత డబ్బుల్లేని వెర్రిముండా గవర్నమెంట్
యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమిటిట?" మా ఆవిడ లాజిక్ కి అవాక్కయి- ఇదిగో ఇలా వచ్చేసా!" అని హర్షధ్వానాలమధ్య ముగించారు.

ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారు వారి చివరిరోజులలో జన్మస్థలమైన రాజమండ్రి వచ్చేసారు.అదే మా ఊరు కూడా. వార్ని మా హాసం క్లబ్ వార్షికోత్సవానికి అతిథిగా వుండ కోరుతూ వారి అనుమతికై వారింటికి వెళ్ళాము. 'స్నానం చేస్తున్నారు,కూర్చోండి'అని ఆహ్వానించారు వారి శ్రీమతి...ఉదయం 11-30 దాటుతోంది...ఈలోగా రా.కృ.గారు వచ్చారు. వస్తూనే...'నేను అన్ని పేపర్లూ చదివేటప్పటికి ఈ టైమవుతుంది. రోజూ పేపర్లు చదివాకనే స్నానం చేస్తా..ముందు చెయ్యను..'. మా Q మార్కు ముఖాలు చూసి...'అవునండీ..ఆ పేపర్లనిండా చావు కబుర్లేకదండీ మరి'..చిరునవ్వుతో చెప్పారు. మాకు మాత్రం నవ్వు ఆగలేదు. .
వీరి తండ్రిగారు హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారు.మనిషి కొంచెం సీరియస్ గా వుండేవారట...జోక్ వేసినప్పుడు కూడా అంతే. పైగాజోక్ వేసేవాడు జోక్ వేస్తూ నవ్వితే, వడ్డించేవాళ్ళు ఒక చేత్తో తింటూ వడ్డించినట్టు వుంటుందంటారుశ్రీ రావుగారు.
రా.కృ.గారు కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఒకసారి మునిమాణిక్యం వారు వీరింటికి వచ్చారట. టీచర్ ట్రైనింగు శ్రీ ము.నగారు
రాజమండ్రిలో చేసారు. ముందు గదిలో శ్రీ కా.గారూ ఈయనా ఏదో ముచ్చటించుకుంటున్నారు. మధ్యలోము.న.గారు బయటికి వెళ్ళబోయారుట...అప్పుడు కా.గారు వార్ని వారిస్తూ...'మేష్టారూ! మీరు సిగరెట్లకోసం అయితే వెళ్ళకండి'అన్నారు. ఆయనకు సిగరెట్
అలవాటు. 'వుండండి చెప్తాను' అని 'కృష్ణా! మేష్టారికి నీదగ్గర సిగరెట్టు ఒకటి యియ్యరా!' అని కొడుకునడిగారట రావుగారు.
'అయ్యో అలా అడిగేసారు అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో అని న.గారంటే 'అబ్బే!ఎందుకనుకుంటాడు. ఈ మధ్య..జామాకులు
అవీ నమలుతున్నాడు.' అన్నారటహాస్యబ్రహ్మ...ఈ విషయం చెప్పి'నాన్నగారి అబ్సర్వేషన్ అమోఘము.'అని తండ్రిని తలచుకున్నారు
రా.కృ గారు. రా.కృ.గారుతర్వాత మానేసారట పాపం, యేమిటీ సిగరెట్సా ? కాదట!..మరీ?...జామాకులుతినడం...
రంగస్థలంనుండి వచ్చిన ఈ నాటి నటులు చాలామంది రా.కృగారు కాని భ.కా.గారు కాని వ్రాసిన నాటికలతోనే నటప్రవేశము చేస్తూవుంటారు అనడం అతిశయోక్తి కాదు. తాను వ్రాసిన 'కీర్తిశేషులు'నాటకానికి ఉత్తమ రచనబహుమతి వచ్చిందని తండ్రిగార్కి చెప్తే...'ఒహో!
నీకన్నాచెత్తగా వ్రాసే రచయితలున్నారన్నమాట.' అన్నారట ఆయన. పిల్లల్ని ప్రత్యక్షంగా పొగడరు కొందరు తండ్రులు..
రా.కృ.గార్కి లెక్కలు ఇంట్రెస్ట్. ఆ అభిమానంతోనే లెక్కల్లో కృషి చేసారు..తెలుగు అక్షరాలలో అ మొదలుకుని క్ష వరకూ గుణింతాలు, ద్విత్వాలు,సంయుక్తాలు అన్నింటికి సంఖ్యలు ఇచ్చుకుంటూ వస్తే, క్ష పూర్తయ్యేసరికి మొత్తం 29 లక్షలు అయిందట...
వాటి ఆధారంగా మన పేరుని విశ్లేషించి భవిషత్ చెప్పేవారు రా.కృగారు..ఎందరో సినీమా వారికికూడా చెప్పారు...
మన వ్యావహారిక నామాలు కాకతాళీయంకాదని అవి భగవన్నిర్ణయాలు అంటారు రా.కృ గారు. వీరు సినీమాలకు రచనలు చేసినా ..ఆ సినీమాలోక ప్రభావం తనవారిమీద పడనీయలేదు....ఓ సారి వీరి ఇంటజరిగిన ఓ శుభకార్యానికి మహానటి భానుమతిగార్ని పిలిచారట.
ఏవో కారణాలవలన ఆమె రాలేక పోయి..తర్వాత వీరింటికి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. వీరి శ్రీమతి తలుపు తీసి
'కూర్చోండి వస్తారు' అని 'ఎవరు వచ్చారు అని చెప్పను'అని అడిగారట..తనను తెలియనివారు తెలుగునేల వుండరు అన్న తన
నమ్మకం ఈ రోజు వమ్మైంది అని రా.కృ గారితోభానుమతిగారు అన్నారట. గత మాసంలో శ్రీ రాధాకృష్ణగారి జయంతి.

హైదరాబాదులో వున్నప్పుడు ఓ ఉగాదినాడు శ్రీ దివాకర్ల వెంకటావధానిగార్కి పండితసన్మానం చేసారు..నిర్వాహకులు వారిని ఆహ్వానిస్తూ శ్రీ అవధానిగార్నిపుంభావ సరస్వతిగా ప్రస్తావించారు...వీరు మాట్లాడుతూ "ఇలాగేనండి..చాలామంది నన్ను పురుషాకృతి దాల్చిన సరస్వతీ దేవిగా సంభావిస్తారు.సంగీతం, సాహిత్యం అమ్మవారికి స్తనద్వయమండి...పురుషాకృతిలో వాటికి అభావంకదండీ..అంచేత వీరు చెప్పేది నా పట్ల నిజమే అనిపిస్తుందండి...సంగీతం,సాహిత్యం నాకు యేం వచ్చండి మరి?" నిర్వాహకులను నిరుత్సాహపరచకుండా తర్వాత మరల సర్ది చెప్పారనుకోండి.



Sunday, December 5, 2010

ఉపవాసమా? అంటే





వెంకట్రావ్! నీరసంగా కనపడుతున్నావు. ఉపవాసమా యేంటి?


అవునోయ్ గుర్నాధం? కార్తీక సోమవారం కదా...ఇదేఆఖరువారం కూడాను...మరి నువ్వు లేవా?


ఉపవాసాలా..నేనా...థ్రాష్.. మా ఆవిడవుంటుంది..వద్దన్నా వినదు. అయినా వెంకట్రావ్! అసలు


ఉపవాసమంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా వుండడం..అంతేకాని భోజనం మానేయడం కాదు.


అది తెలుసుకోరు మీలాంటి వాళ్ళు...ఏమిటో మీ ఛాదస్తం.


నిజమే! ఇలాంటి గుర్నాధాలు అలాంటి వెంకట్రావులు మనకి తారసపడుతూనే వుంటారు.... ఇంత


వేదాంతం తెలుగు వాళ్ళమేచెప్పగలము...(మిగతా వారి సంగతి అంతగా నాకు తెలియదనుకోండీ).


దేముడికి దగ్గరగా వుండాలంటే ఏమిటి ?తిరుమలే వెళ్ళామనుకుందాం! ముందు మనం చూసేది


దేముణ్ణికాదు... ముందు బస తర్వాత ఫుడ్..తర్వాత తిరుగు ప్రయాణానికి యేర్పాటు అన్నీ


అయ్యాకనే దర్శనం అంతేకదా..అప్పుడు తోసుకుంటూ..తోసుకుంటూ ఆ క్యూలంబడి పోయి పోయి


గర్భగుడిలో వాలంటీర్లు...నడవండి..నడవండి అంటూ తొయ్యడం...యిక చాలు రండమ్మాఅని లాగడం...


'నడవండీ', 'చాలురండి' .. ఈ రెండుశబ్దాల నడుమ పెరుమాళ్ళ దర్శనం..రెండు ఆలోచనల మధ్య


చిద్దర్శనంలాగా...అయిందా!... లేదా!... ఏమో!.....ఆ కాసేపూ ఓ దివ్యానుభూతి.వెంటనే మాయ


కప్పేస్తుంది..."చూడనీయవయ్యా. బొత్తిగా ఇక్కడే త్రిప్పేసారు..పాపం మూటకట్టుకుంటున్నారు "...


మన సంస్కారాన్నిబట్టి రకరకాలుగా అభిప్రాయాలని కసిగా వెడలగక్కి...హుండీలో మ్రొక్కుబడులు...


అమ్మయ్యా పాపాలు పోయాయి...(మళ్ళీ క్రొత్తవి చెయ్యొచ్చు అన్నమాట)...అందరికీ అసంతృప్తే..


వెంకన్నబాబు అంటే గుడిలో వున్న వెంకన్నబాబుదర్శనం సరిగా కాలేదని....


ఓ సారి శ్రీవారి సేవా కార్యక్రమానికి వారంరోజులు వెళ్ళాము నేనూ మా శ్రీమతీ. అక్కడుండగా మా


శ్రీమతికి జ్వరం వచ్చింది.మేమున్న 'రామ్ బగీచా' వాళ్ళకి విషయంచెప్పి ఎవరైనా డాక్టరుంటారా


దగ్గరలో అని అడిగా టిటిడి హాస్పటల్ కి వెళ్ళమన్నాడు...ఎలావెళ్ళాలి అన్నా...అదిగో అక్కడ


ఆమ్బులేన్సే వుంది వెళ్ళి చెప్పు, వస్తాడన్నాడు...ఈ చిన్నదానికి ఆంబులెన్సా.....వస్తాడో రాడో


అని సందేహిస్తూనే ఆ ఆంబులెన్స్ డ్రైవరును అడిగా! వెంటనే వచ్చాడు..మమ్మల్ని హాస్పిటల్ కి


తీసుకువెళ్ళాడు. తానే ఓ.పీ వ్రాయించాడు..డాక్టరు దగ్గరకి కూడా వచ్చాడు..ఆయన మందులు


యిచ్చి..యింజషన్ చేసేదాకా దగ్గరున్నాడు.అరగంట వుండివెళ్ళమన్నారు డాక్టరు.. అప్పుడు మళ్ళా


యెవరైనా పిలుస్తారేమో అని చెప్పి; నర్సుతో చెప్తే తిరిగి వెళ్ళడానికి యింకో ఆంబులెన్స్ యేర్పాటు


చేస్తారని కూడా చెప్పి; అప్పుడు వెళ్ళాడు ఆ డ్రైవర్. తర్వాత అక్కడవున్ననర్సు ఇంకో ఆంబులెన్స్ కు


చెప్పారు....ఎవరూ కూడా డబ్బులు ఇస్తానన్నా పుచ్చుకోలేదు......స్వామి లఘుదర్శనమా..


మహాలఘా..వాళ్ళు లాగేసారా .....వీళ్ళు తోసేసారా అన్నీ మరచిపోయాము....ఎవరు ఎవరిదగ్గర


వున్నారు..దేముడి దగ్గర మనమా...మన బాగోగులు అనుక్షణం చూస్తూమనదగ్గర ఆయనా? ..


ఉచిత భోజనాలు దగ్గర...ఎంతమందో అలా వస్తూనే వుంటారు.. సాపడుతూనే వుంటారు...ఎంత వైభవం


...మొదటి రోజు మేం సేవా కార్యక్రమంలో వుండగాఓ ఆలయ వుద్యోగి అక్కడికి వచ్చాడు.మాట తీరూ అదీ


చూస్తే ఒక ఆకర్షణ..అతడు జనాంతికంగా అన్నాడు..మీరు ఇక్కడ భక్తులకు భోజనం వడ్డించే ఈ సేవ


స్వామి అనుగ్రహం వలన దొరికింది.కాలికి చెప్పులు లేకుండా,ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి వడ్డించండి


అనిచెప్పాడు..క్రింద నిజానికి సాంబారూ అవీ పడి కొంచెం ఇబ్బందిగా వున్నా మేంఇద్దరమూ చెప్పులు


లేకుండానే వడ్డించాము పవిత్ర భావంతో...మేంవచ్చేసేరోజు అతడు మళ్ళీ వచ్చాడు...ఆ రోజు బుధవారం..


ఆ రోజు స్వామికిమూలవిరాట్ నుండి ఒక పవిత్రసూత్రం తీసుకువచ్చి ముందు మంటపంలో(రాములవారి


మేడ అంటారు)వేంచేసివున్న ఉత్సవమూర్తులకు కట్టి, ఆ ఉత్సవమూర్తులకు అభిషేకంచేస్తారట...కార్యక్రమం


పూర్తయ్యాక అపురూపమైన ఆపవిత్రసూత్రంప్రసాదభావంతో ముఖ్యులైనవారు స్వీకరిస్తారట...ఆ అభిషేకానికి


ఇందాక ప్రస్తావించిన ఉద్యోగి వెళ్ళి ఆ పవిత్ర సూత్రంముక్కతెచ్చి...మా ఇద్దర్నీ పిలిచి మాకు ఇచ్చాడు...


యెందుకంటే చెప్పులువదలి సేవ చేసామని. అంతేకాదు మూలవిరాట్ పాదాల మీది అక్షతలు మా చేతిలో


వుంచాడు...మన కదలికలు సదా కనిపెట్టే స్వామి దగ్గర మనం వుండాలా? ఉండగలమా?.


సరే పూమాలలు తయారుచేసే చోటికి సేవకై వెళ్ళాము.ఎన్ని పూలు..యెన్నెన్ని పూలు... బస్తాలతో వచ్చి


పడిపోతూనే వుంటాయి. దేశం నలుమూలలనించీ భక్తులు సమర్పించినవే స్వామి పూలవనంలోవి కావు..


ఒక్కోగజమాల ఒక గంటసేపు స్వామి గళసీమ నలంకరిస్తుందట..మేమందించే యేఒక్క పుష్పమైనా మా


కబురు స్వామి చెవిని వేసినా చాలు కదా...మనస్సులో ఏదో చెప్పలేని ఆనందం..యేదో మధురాతి


మధుర భావం ....అదంతా శ్రీనాథునివైభవమేకదా....


వైకుంఠ క్యూకాంప్లెక్సులో టిఫిన్ భక్తులకు అందించేసేవ. గోవిందుని దివ్యనామ సంకీర్తనతో పరవశించే


భక్తకోటికి సేవచేయగలిగే అవకాశము ఆస్వామి కల్పించిందే కదా..పాపనాశనం జలధారలలో,


కపిలతీర్థంలోని తీర్థజలాలలో, వికసించిన పూలతోటలలో, చెట్టుచేమలలో, కొండంతా తిరుగాడే


భక్త జనుల కోలాహలంలో....యెలుగెత్తి అరచే గోవిందనామంలో యెక్కడ లేడు - కొండంతా ఆ


యేడుకొండలవాని వైభవం కనపడుతూనే వుంటుంది..అలా చూడగలగడమే ఆయన దగ్గరగా వుండడం...


ఉపవసించడం.... కాదంటారా

Sunday, November 28, 2010

భావగారి కబుర్లు విందామా



                           భావగారి కబుర్లు

                                                                                    


                                                                                   రచన : డి.వి.హనుమంతరావు 

                                                                                                                      9949705166




(ఆమధ్య కాలంలో రేడియోలో భావగారి కబుర్లు అని సమకాలీన రాజకీయాలమీద...అలాగే నడుస్తున్న చరిత్రమీద చమత్కారం జోడించి చక్కటి సంభాషణాకార్యక్రమంవచ్చేది...ఇప్పుడు వస్తున్నట్టులేదు....అది దృష్టిలో పెట్టుకుని చిన్న ప్రయత్నం.)

                                                                     ***************


ఏమండోయ్ భావగారు....రండి..రండి.....యెన్నాళ్ళకెన్నాళ్ళకి?

...ఇంటి దాకా వచ్చాక ఇప్పుడు.బాహానే పలకరిస్తారు... 

బొత్తిగా నల్లపూసైపోయారు కదా?

మీరుమాత్రం మహ మణిపూసా యేమిటి?..

యెన్నాళ్ళైందండీ మనంఇలా మాట్లాడుకుని...
ఏంచేస్తాం చెప్పండీ....రోజులు మారిపోయాయి..ఇదివరకైతే మనకబుర్లకోసం నలుగురూ ఓ ఇంట రేడియో వుంటే అక్కడకు చేరిమరీ వినేవారు....యిప్పుడు ఆ రేడియో వినరు...వినడానికి టైమూలేదు..ఏమంటారు?
భావగారు చెప్పాక ఇంక నేనేమైనా అనడానికి....హార్టా--టాంకా...
బావగారూ అదేం ప్రయోగమండోయ్?
దొరల భాషలో మాట్లాడేను బావగారూ...గుండా-చెరువా అని...
బావగారు మంచి చమత్కారులుకదా మరి..
సరే కాని బావగారూ.... యేమైనా విశేషాలు చెప్పండి...వినాలని వుంది....మీకు వినాలని వున్నా నాకు చెప్పాలని లేదు
బావగారుఅదేంటి...అలా అనేసారు...
బావగారూ...రాజకీయాలగురించి...చెప్పాలంటే.... ఏముంది చెప్పడానికి....పాలన అంతా హస్తినాపుర హస్తగతం...ఎంతో గొప్పవాళ్ళని ఏదో వూడబొడుస్తారని వీళ్ళని మనం యెన్నుకున్నాం. కాని..వీరికి స్వంత తెలివి లేదు. ఆ హస్తిన చెప్తేనే వీరు పెదవి విప్పుతారు...అది వీరి ముందుచూపో లేక అతివినయమో?
మాటకడ్డొచ్చాను బావగారు...ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు గోతులుతవ్వుకోవడంలో చేయితిరిగిన యోధులు...కాదంటారా?
అంతేకాదు బావగారు...సమస్యలు తవ్వుకోవడం...సవాళ్ళు విసురుకోవడం...ఛాలెంజీలు...రాజీనామాలు...ఉప యెన్నికలు..పోయేది ప్రజలడబ్బు....ఇదేకాదుభావగారు....అసెంబ్లీలో మైకులు విసురుకోవడం...కుర్చీలు విరగ్గొట్టడం....ఎవరిసొమ్ము..ఒకసారైనా ఆలోచిస్తారా? మంత్రిపదవి...ముఖ్యమంత్రి పదవికూడా వారసత్వంగా కావాలిట అందుకని దార్పులు ఓదార్పులు.ఓ మూల గద్దె మీదున్నవాడి కుర్చీ లాగేసేవారు కొందరు...ఆ గద్దెమీదున్నవాడి పదవీ కాలం కుర్చీ కాపాడుకోవడానికే సరిపోవటం లేదు. ఇక ప్రజల గోడెవ్వరికి... సమయం యెక్కడ....
ప్రతిపక్షాలు వున్నాయి కదా భావగారూ మరి...
ఉన్నాయి భావగారు...కాని పోయిన పదవి యెలావస్తుందా అన్న ఆలోచన ఒకరిదైతే : పదవి అక్కరలేదు కాని...కనపడేవన్నీతమబోటి పేదలకే అనే సిద్ధాంతం మీద జెండాలు పాతే ప్రతిపక్షం ఒకటి. తన పరిశ్రమ అనండీ, వృత్తి అనండి వాటిలో బాగా డబ్బుచేసి...ప్రజలు సడెన్ గా గుర్తుకొచ్చి...పేదలసేవ అంటూ బయలుదేరి చతికిలబడ్డాక....నిన్నఎవర్ని దుమ్మెత్తిపోసావోవారి ప్రక్కన చేరి ప్రజా సేవకోసం పాపం తపించే అవకాశ ప్రతిపక్షం ఒకటి...ఇవన్నీ చూస్తుంటే నా కర్థం కానిదొకటే భావగారు....అందరూ వుద్ధరిద్దామనుకునే ఆ పేదవాడు ఎవ్వరు......ఎక్కడుంటాడు...అసలున్నాడా?
అదేంటి భావాజీ...పేదవాడు అంటూ మీరూ మాటలాడుతున్నారు,,,బిల్డింగు తీసి మీరు రాజకీయ అరంగేట్రం కాని చేయబోతున్నారా ఏమిటి?
ఎంత మాటన్నారు...భావగారు?
ఏదో సరదాగా అన్నానులెండి....కాని భావగారూ పేదవాడు అంటేయెవరు అన్నారు చూడండీ ..అది అంత అర్రీ బుర్రీగా తేలేవిషయంకాదు భావగారు....తీరికగా ఆలోచిద్దాం...ముందు భోజనానికి లేవండి.

Sunday, November 21, 2010

కార్తీక బ్లాగు భోజనాల స్పెషల్



ఉన్నట్లుండి ఇంట్లోంచి చమ్చా, దాని వెనకాల గ్లాసూ, తర్వాత చిన్నసైజు గిన్నెవచ్చేస్తున్నాయి..పాత అనుభవాలు చెప్పాయి...శ్రీమతి అలుకబూనింది అని...చర్చలు తప్పవు...ధైర్యము చేసి దాడిని తట్టుకుని..."ఏమిటి నీ డిమాండ్సు"..అనిఅడిగా..కాసేపు మౌనం వహించి..కొంచెం బ్రతిమాలాక పెదవి విప్పింది.."మీబ్లాగులో నాకు సమాన హక్కులు కావా"లంది..."సమానహక్కులేంఖర్మ మొత్తంహక్కులు నీవే"నన్నా..(అనువు కానిచోట అధికులమనరాదుకదా)..."అలామీరుయిచ్చేస్తే మేం యింక ఆందోళనలేం చేస్తాం..వద్దు" అంది. "సరే!నువ్వే చెప్పు యేం చేయాలో" అన్నా.."నేనూ మీ బ్లాగులో యేదో ఒకటి వ్రాస్తా"నంది...."నాలోసగం అని బ్లాగులోశీర్షిక వుంది.అందులో నీ యిష్టం"అన్నా..."అయితే నేనో మంచి వంట చెప్తాను..వ్రాసి అందులో వుంచండి" అంది...స్పెషల్ వంటలూ అవీ తనే చేస్తుంది నేను చెయ్యను లెండి...పెన్నూ కాగితం పట్టుకుని సిద్ధమయ్యాను......వంటకం పేరు: పూర్ణపొంకాయ పులుసు....అని చెప్పేటప్పటికి నాకు నోరూరిపోతోంది...."బాగుంటుంది..బాగుంటుంది..తెలుసు" అన్నా...వెంటనే ఆవిడ"యేంతెలుసు?తెలిస్తే యేంకావాలో చెప్పండి"అంది...జవాబు వెంటనేచెప్పాలి మా ఆవిడకి..లేకపోతే అదో క్రొత్తసమస్య....నేను కావలసిన వస్తువులుచెప్పా...."గాసు స్టవ్వూ,,నిండు గాస్ సిలెండరూ, మూకుడూ..."మా ఆవిడ మధ్యలోకట్ చేసి..."కంచమూ, గ్లాసూ...వండడానికి తర్వాత భోచేయడానికీ మీరూ"...అంది..."మరే!మరే! మర్చేపోయా..".అన్నానోలేదో...మీ మొహం అని తర్వాత లెంపలేసుకుంది. వ్రాయండి చెప్తా అని మొదలెట్టింది.వస్తువులు:చిన్నసైజు లేత వంకాయలు...1/2కె.జిచింతపండు ... ...25 గ్రా; ధనియాలు.. ...ఒక కప్పు; శనగ పప్పు... ... ఒక కప్పుమినప్పప్పు.. .... .. నాలుగు టేబుల్ స్పూన్స్; జీలకర్ర... ...ఒక టేబుల్ స్పూన
మెంతులు ... ...నాలుగైదుగింజలు మాత్రం; ఎండుమిర్చి.. ... ..నాలుగు(కారం యెక్కువ తినేవాళ్ళు ఎనిమిది వేసుకోవచ్చు); ఉప్పు.... తగినంత; బెల్లం కొద్దిగా యిష్టమైతేనే; పసుపు; పచ్చిమిర్చి.... నాలుగు.; తగినంత నూనె; ఆవాలు కొద్దిగా; ఇష్టమైనవారు ఇంగువ; కరివేపాకు.ఇప్పుడు చేసేవిధానం చెప్తా వ్రాయండి: ముందు చింతపండు చిక్కగా పిసికిపెట్టుకోవాలి. ధనియాలు,శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి,తగుమాత్రం నూనె వేసి ఎరుపురంగు వచ్చేదాకా వేయించి, గ్రైండుచేసి ఉప్పుకలిపి ఒకచోట పెట్టుకోవాలి.ఇప్పుడు వంకాయలు పుచ్చులులేకుండా చూసుకొని, శుభ్రంగా కడిగికాయల్లా తరుగుకోవాలి...."ముక్కల్లాగా అయితే తరుక్కోవాలి కాని...కాయల్లాగా అయితే తరగడమెందుకు" అన్నా...."పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా చెప్పింది వ్రాయండి" అని కంటిన్యూ చేసింది. ధనియాలు అవీ గ్రైండుచేసిన పొడెం ఈ కాయల్లోకి కూరాలి. కొంచెం పొడెం వుంచాలి.స్టవ్ మీద మూకుడు పెట్టి అందులోనూనె వేసి...కాగాక ఈ కాయలు అందులోవేసి సన్న సెగని మగ్గనివ్వాలి. "ఏమోయ్! ఇప్పుడు స్టవ్ వెలిగించాలి కదా మరి వ్రాయొద్దూ" అన్నా...."మహాశయా..సన్న సెగ అంటే వెలిగించమనే..నోరు మూసుకొని వ్రాయండి"....ఇంతదాకా వంకాయ కారంపెట్టిన కూరలాగానే ...అయితే కాయలు ఎర్రగా వేగిపోకుండా సగంపైగా మెత్తబడ్డాయి అనిపిస్తే...అందులో చింతపండుపులుసు, మరికొంచెంవుప్పు, ఇష్టమైతే బెల్లం, పసుపు కొంచెం, పొడువుగా రెండుగా కోసిన నాలుగు పచ్చిమిర్చివేయాలి.....ముందు గ్రైండు చేసిన పొడిలోంచి చారెడు పొడికూడా వెయ్యాలి.కాయలు ములిగాక కొంచెం పైకి వచ్చేటట్టుగా చింతపండుపులుసు వెయ్యాలి.ఇప్పుడు సన్నసెగనిమరగనివ్వాలి. అలా ఓ పది లేక పదిహేను నిముషాలుమరిగాక....ఆవాలు, ఇష్టమైన వారు కొంచెం ఇంగువ,కరివేపాకు వేయించివేసిఇంకో అయిదు నిముషాలు మరిగించి దింపాలి. దగ్గరగా మరిగి చిక్కపడ్డసాంబారులా వుంటుంది మొత్తం తయారయ్యాక.....రుచికరమై, ఘుమఘుమలాడే....పూర్ణపు వంకాయ పులుసు సిద్ధం.....'నేను ఒకటి ;ముక్తాయిస్తానే' అనగానే, 'అనుమతి మంజూరు చేయబడింది'అంది శ్రీమతి....'ఏం లేదండీ....కమ్మటి కందిపచ్చడి, ఘుమఘుమలాడేనెయ్యి కాంబినేషన్ తో పూర్ణపొంకాయి పులుసు తిన్నారంటే ... బెత్తెడేమిటికామధేనువు కొమ్ములు, కల్పవృక్షం కొమ్మలు కనపడ్తాయి" అనగానే"ఇన్నాళ్ళకి మీనోట మంచిమాట వచ్చింది.....లేవండి భోజనానికి అంది....""అయితే చేసేసావా..." అనగానే విజయ గర్వంతో చిరునవ్వు నవ్వుతూ నడిచింది మా విజయ.


Friday, November 19, 2010

పతియే ప్రత్యక్ష దైవం



(ఆలోచన ఆవిడది::అక్షరం నాది)
###

(ఆయన ఏదో పుస్తకం చదువుతున్నాడు. అప్పుడే భార్య వీధివైపు నుంచి లోపలకి వచ్చింది.)
భార్య: (తెచ్చిన ప్రసాదం భర్తచేతిలో పెట్టి,కుర్చీ భర్తదగ్గరకి లాక్కుంటూ)... ఏమండీ! ఇవ్వాళ గుళ్ళో వుపన్యాసం
చెప్తూ భర్తయే ప్రత్యక్షదైవం అంటూ చెప్పారండి. ప్రత్యక్షదైవం అంటే యేమిటండీ?
భర్త: ఇన్నాళ్ళకి ఓ మంచి ప్రశ్నవేసావోయ్ తాయారూ! చెప్తా విను. ప్రత్యక్షదైవం అంటే కనిపించే దేముడని అర్థం.
నిజానికి దేముడు మనకంటికి కనపడడు కదా...అంచేత కనపడే భర్తలోనే అంటే పతిలోనే దేముణ్ణి చూడమని
దాని భావం...అర్ధమయిందా?
భార్య: బాగా అర్ధమయిందండీ..నేనూ అదే అనుకున్నానండీ...రేపు యేకాదశి
కదా? రేపట్నించి మిమ్మల్నే నేను పూర్తిగా దేముడిలా కొలుచుకుంటానండీ..
భర్త: అలాగే తాయారూ! ఇన్నాళ్ళకు నీకో మంచి బుద్ధి కలిగింది. నాకు చాలా సంతోషంగా వుంది.
* * * * * * * * *
(నేపధ్యంలో తాయారు పాడుతూ వుంటుంది...
::తెల్లవారవచ్చె తెలియక నా స్వామి మరల పరుండేవు లేరా...)
భర్త: (ప్రవేశిస్తూ..వళ్ళంతా దులుపుకుంటూ..) ప్రొద్దున్నే సుప్రభాతం పాడేవు.. అంతదాకా బాగానే వుంది...
అభిషేకమన్నావు..యేదో మామూలు స్నానమనుకున్నా..యిలా ఈ కొబ్బరి బొండాం నీల్లేమితి...తేనె యేమిటి...పాలేమిటి...పెరుగేమిటి...యిలా ఇవన్నీ పోసాసావేంటే బాబూ..అబ్బబ్బా..
వళ్ళంతా చాలా జిడ్డు జిడ్డుగావుంది...ఆ షాంపూ సీసా యియ్యి స్నానం చేసొస్తా....చాలా చిరాకేస్తోంది.
భార్య: (లెంపలేసుకుంటూ)మహాపచారం..మహాపచారం...అభిషేకం అయిపోయింది. ఇప్పుడు స్నానమేమిటి?
'వస్త్రార్థం అక్షితాన్ సమర్పయామి' అని అక్షింతలు వేస్తానుండండి...
భర్త: ఇదెక్కడి గొడవే బాబూ,,,అక్షింతలేస్తే ఈ జిడ్డెలా పోతుందే... అయినా యింతవరకు కాఫీ కూడా యివ్వలేదు.
భార్య: అదేమిటండీ...ఇంత చదువుకున్నారు. దేవుళ్ళు కాఫీలు, టీలూ త్రాగినట్టు ఏ పురాణాలలోనైనా చదివారా?..
తప్పు తప్పు అలాంటి మాటలు మాట్లాడకూడదు...కళ్ళు పోతాయి.
భర్త: అదేమిటీ...మరి కాఫీ కూడా యివ్వవా..అయితే నేను దేముడిగా వుండను
భార్య: ఏంటమ్మా అది? సర్లెండి..కాఫీ అటుతిరిగి త్రాగుదురుగానిలెండి్--నీరాజమంత్ర పుష్పాలు అయ్యాక.
భర్త: సర్లే...అవునూ మరి నైవేద్యమెప్పుడూ? నైవేద్యానికి యేంచేసావు.?
భార్య: ఇవ్వాళ ఏకాదశి...ఈ పూట నైవేద్యానికి యేమీ వుండదు. రాత్రి ఉప్పిడిపిండి చేసి నైవేద్యం పెట్తాను...అదే ఫలహారం.
భర్త: చంపావు తల్లీ!----సర్లే యేదో సర్దుకుంటాను...కానీ తాయారూ! ఉప్పిడిపిండిలోకి వంకాయపులుసుపచ్చడి...
ఉల్లిపాయలు బాగా దట్టించి చెయ్...బాగుంటుంది. నాక్కూడా యిష్టం.
bhaarya ; (లెంపలు వాయించుకుంటుంది..) అపచారం...అపచారం...పిదపకాలం బుద్ధులు..పిదపకాలం బుద్ధులా అని...
ఉల్లిపాయలు దేముడికి నివేదించకూడదండీ..
భర్త: నాకు నివేదించవచ్చుకదోయ్..
భార్య: మీరు ప్రత్యక్షదైవం..మీకు అస్సలు కూడదు...మహా పాపం.(నిష్క్రమణ)
*********
(భర్తని శ్రీ వేంకటేశ్వరుడిలా నిలబెట్టింది..అభయహస్తం, వరదముద్ర పెట్టించింది...ఓ పెద్దపూలమాల
( వేసినట్టు అభినయించింది.)..ఆయన సీరియస్ గా నీరస్ గా నించున్నాడు...)
భార్య: (భర్త పెదాలు తన చేతివ్రేళ్ళతో సాగదీసి) ఏంటా చికాకు..మొహానికి కాస్త నవ్వు యేడవండి...
భర్త: (సీరియస్ గా ...నవ్వాడు)
భార్య: (నివేదన చేస్తూ)..ప్రాణాయస్వాహా..అపానాయస్వాహా...
భర్త: (పళ్ళెంలో చేయిపెట్టి తినబోతాడు)
భార్య: (అతని చేతిమీద ఒకటి కొట్టి)...అలా ముట్టుకోకూడదు. మంత్రం పూర్తవ్వాలి నీరాజనం
సమర్పయామి...మంత్రపుష్పం సమర్పయామి...భక్తోపచారం సమర్పయామి...హమ్మయ్య..
భర్త: హమ్మయ్య...అయిపోయిందా...
భార్య: ఊఁ...పూజ అయింది...యిక ప్రసాదం...నీరసం వచ్చేస్తోంది. ప్రొద్దున్ననించీ కటిక వుపవాసం కదా....
భర్త: మరే మరే...పెట్టేయ్..పెట్టేయ్.ఆకలి దంచేస్తోంది. ప్రొద్దుట్నించీ పచ్చిమంచినీళ్ళైనా త్రాగలేదు
....పెట్టేయ్ త్వరగా...
భార్య: ఏమిటీ..పెట్టేదీ....
భర్త: అదేనోయ్...ఫలహారం...ఉప్పిడిపిండి చేసావుకదా...
భార్య: తప్పు..ఉప్పిడిపిండి అనకూడదు...ప్రసాదం..ప్రసాదంగా నేను పుచ్చుకుంటాను.
భర్త: మరి నాకు..
bharya: మీకు నివేదన అయిపోయింది..తాంబూలం కూడా సమర్పించేసాను. నేను ప్రసాదం తీసుకుని వచ్చి,
మీకు పవ్వళింపుసేవ చేస్తాను....రేపు సుప్రభాత సేవదాకా శుభ్రంగా పడుకుందురుగాని....
పతియే ప్రత్యక్షదైవం. (సూత్రాలు కళ్ళకందుకుంటుంది)(లోపలికి వెళ్తుంది)
భర్త: ఇదెక్కడి గొడవే తాయారూ...ఓరి దేముడోయ్....అర్జంటుగా కనికరించు.. ఓ పురాణం శాస్త్రులుగారూ...
అర్జంటుగా పురాణాలు మార్చండి...మేము ఉత్తుత్తి భర్తలమే....దేముళ్ళమీ..గీముళ్ళమీ కాము..
ప్రత్యక్ష దైవాలము అస్సలు కాము.....ఆకల్రోయ్....దేముడోయ్..
(తెర)
***** ************ *****
(ఈ స్కిట్ చదివిన తర్వాత మీకు ఆనందం కలిగితే నాకూ ఆనందం. ఇందులో భార్యగా నా భార్య శ్రీమతి విజయలక్ష్మి,
భర్తగా ఆవిడ భర్తనైన నేనూ నటించి, రాజమండ్రి హాసంక్లబ్ లోనూ..ఇతరచోట్లా..family get togethers లోనూ
ప్రదర్శించాము. జీ కామెడీలో కూడా ఇదిప్రదర్శిస్తే పోటీలో పై స్థాయికి మాకు అర్హతనిప్పించింది. స్క్రూటినీకి వచ్చిన
జీ ఛానల్ వారు చాలా ముగ్ధులై గౌరవంగా మాకు వారిషోలో అర్హత కల్పించి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ సోత్కర్ష నేనే యెందుకు చేసుకుంటున్ననంటే-----------------మరి మీరు చేయరుగా !)
ooooOOOoooo

Saturday, November 13, 2010

ఈ నాటి బాలలు




చాచా నెహౄ పుట్టిన రోజు
చిన్నారి బాలల పండుగ రోజు

పెద్దలందరూ ముందు కొచ్చారు
ఘన కీర్తులు వల్లించుకుంటూ
వున్నవాళ్ళు క్రాఫింగులు
లేనివాళ్ళు టోపీలు సర్దుకుంటూ

చిన్నారి పసి మనస్సులకు
చెప్పారు సుద్దులెన్నో
రేపటి పౌరులు మరి మీరేనన్నారు
భావిభారత పౌరులంటూ జే జే లు పల్కారు

సుద్దులన్నీ పొందికగా సర్దారు
తమ లేత మనసుఅరల్లో నేటి బాలలు
రేపటి పౌరులయ్యాక మరి వీరే
చెప్పాలిగా రేపటిబాలలకీ సుద్దులు

Thursday, November 11, 2010

శ్రీ ఎంబి యస్ ప్రసాద్ ఇదీ అసలుకథకు (టీవీ కార్యక్రమం) అవార్డు





వనిత టి.వి లో ప్రసారమైన "ఇదీ అసలు కథ"కుగాను ఆ సంస్థవారికి నంది అవార్డువచ్చిందని తెలిసి ఆనందం కల్గింది. దాని రూపకర్త "ముళ్ళపూడి సాహిత్యసర్వస్వం" గ్రంధ సంకలనకర్త శ్రీ యమ్బీయస్ ప్రసాద్. 'హాసం' పత్రిక ద్వారా మీకూ నాకూ పరిచయమైన శ్రీ యమ్బీయస్ ప్రసాద్ గార్కి మా హాసం క్లబ్ కారణంగా నేను దగ్గరవడం నా అదృష్టం..ఇవ్వాళ అవార్డ్ వచ్చిందని చెప్తున్న మాట కాదిది. ఇవ్వాళ మనకున్న అతి కొద్దిమంది హాస్య రచయితలలో యెన్నదగిన సమర్ధత వున్న రచయిత శ్రీ ప్రసాద్. వారి రచనలన్నీ చదివానని అబద్ధమాడను..చదివిన అచలపతి కథలు, రాంపండులీలలు, పొగబోతుభార్య ..మొనవి వారి సునిశితహాస్యానికి చెప్పదగినవి. మనగురించి మనం ఆలోచించుకోవలసినఅవసరం వారి రచనల్లో కనపడ్తుంటుంది. "రేడియో, టీ.వీ ల పుణ్యమాఅని క్రికెట్ఆటను విని, చూసి తామేదో క్రీడాభిమానులనుకోవడం జనాలకి పరిపాటి అయింది. ఆరోగ్యంకోసం క్రీడలు ఆడాలికాని చర్చిస్తే సరిపోదు. ఆఫీసు పని ఎగ్గొట్టి క్రికెట్ కామెంటరీ విననివాడు "అన్ స్పోర్టివ్" అనేటంతవరకు పోయింది పరిస్థితి..." ఆలోచించాలనిపిస్తున్నది కదా...ఇది శ్ర్రీ ప్రసాద్ గారి అచలపతికథల్లో...

"ఇదీ అసలుకథ" విషయానికి వస్తే....వనిత టీవీలో...వారానికో రోజు రాత్రి10.30కి వచ్చేది...ఎన్నో మంచి మంచి సినీమాలు యెంచుకొని, వాటికి ఆధారమైనఅసలు సినీమా ఏ భాషలో వున్న అది చెప్తూ..యెక్కడ మార్చారో..దానివలనవచ్చిన స్వారస్యం చర్చిండం..ఏ నటుడు ఏ భాషలో బాగా చేసాడో సోదాహరణంగాచెప్పడం...ఆ సినిమా క్లిప్పింగులు, ఈ సినిమా క్లిప్పింగులు అన్నీ చూపడం,తన అందమైన వ్యాఖ్యానం....వాహ్...నిజంగా చాలా అద్భుతం. ఎంత శ్రమ పడ్డారోఆ కార్యక్రమం రక్తి కట్టించాలని...అదే ఆయనతో నేనన్నాను కూడా...ఏమైనా ఆయనశ్రమకు గుర్తింపు ఈ అవార్డు...శ్రీ ప్రసాద్ గార్ని మనసారా అభినందిస్తున్నాను.వనిత టీవీ వారుకూడా ఈ మహావ్యక్తిని సమ్మానించవలసినసమయం....ఇంత కష్టం పడుతున్న భర్తకు అంత శ్రమాపడి సహకరించిన వారి శ్రీమతికి కూడా అభినందనలు

నేను వ్రాసి, ప్రదర్శించిన స్కిట్స్ అవీ చూసి నన్ను హాస్య రచనలు చేయమని ప్రోత్సహించిన సౌజన్యమూర్తి శ్రీ ప్రసాద్. నేను బ్లాగులో హాస్యం వ్రాసే ప్రయత్నానికి అదో స్ఫూర్తి. ఈ హాస్యరచయితను మా హాసం క్లబ్ తన అయిదవ వార్షికోత్సవమప్పుడు ఆహ్వానించి హాసం పత్రిక వ్యవస్థాపకులు, శాంతా బయోటెక్నిక్స్ అధినేత శ్రీవరప్రసాదరెడ్డిగారి చేతుల మీదుగా సన్మానించగలగడం...హాసంక్లబ్ కు ఆనందకారణం...కన్వీనర్స్ లో ఒకడిగా నాకు గర్వకారణం. మరొకసారి వార్ని హాస్యాభిమానులైన మీ తరఫునానా తరఫునా అభినందిస్తూ... శలవు.

Thursday, November 4, 2010

ఎదుగుతూ దీపావళి



చిన్నతనంలో మా పేటలో పది పదిహేను ఇళ్ళకన్నా యెక్కువ వుండేవి కావు. కొన్ని పాకలు కొన్ని పెంకుటిళ్ళు... ఒకే ఒక్క డాబా.....దీపావళి వచ్చిందంటే యేదో థ్రిల్...


నేనూ మా ఫ్రెండూ ...చిన్న నిక్కరో/గోచీయో ధరించి....మా పాకముందు వేపచెట్టు క్రింద చేరేవాళ్ళం....మాముందు కల్వం (అంటే యేమిటో కొంచెం మీ అబ్బాయికి చెప్పండి) వుండేది.మా చేతిలో రోలూ రోకలి....అఁ అది కాదు.దీపావళి బాపతు...(రోలూ రోకలి అని అమ్మేవారు....కొంచెం లావుపాటి తీగనువంచి ఒక కొసలొ .క్రింద చిన్న సైజు రోలులా, యింకో కొసలో పైన రోకలిలా ఏర్పాటుచేసేవారు) తలనొప్పి మందు 'అమృతాంజనం' ఆ రోజుల్లో సీసాలో పెట్టి, ఆ సీసాను ఇంకో డిబ్బీలో పెట్టి అమ్మేవారు. ఆ సదరుడబ్బా సంపాయించేవాళ్ళము. అందులో పటాసు వేసుకొని, ఆ డబ్బాలో ఓ చిన్న తాటాకు బద్దముక్కవుంచుకొని...దానితో ఓ చిన్న మోతాదు పటాసు ఆ రోటిలో వేసి, దాన్ని రోకలితో మూసి, గట్టిగా పట్టుకారుతో పట్టినట్టు పట్టి, తిరగేసి, ఆ కల్వం ముక్కపై కొట్తే 'ఢాం' అని సౌండ్...ఆనందం....ఒకసారి వాడు, ఒకసారి నేనూ...దీపావళి ముందునుంచి ఈ హడావుడి....అదో థ్రిల్.
నరకచతుర్థి నాడు వుదయమే తలంటు...అమ్మ తలమీదనూనె పెట్టి 'అమ్మ కడుపు చల్లగా...అత్త కడుపు చల్లగా' అంటూ దీవించేది. ముందుగా టపకాయ కాల్పించి అప్పుడు దీవెన. మన టపాకాయే గట్టిగా పేలిందిరా అని ఎన్కరేజ్ చేస్తూ తలంటుతుంటే ఏదో థ్రిల్.
తల తుడుచుకున్నాక...అమ్మ తిలకం పెట్టాక....కుంకుడుకాయపులుసు కళ్ళల్లో పడిందమ్మా అంటే ఉప్పురాయి నోట్లో వేసుకోమనేది.కొత్తబట్టలు కట్టుకొని పెద్దవాళ్ళకి దణ్ణాలు పెట్టేసి...ఏదో ఒకటి తిని అరుగు మీద నాన్నగారు కొన్న బాణాసంచా అందంగా పేర్చి యెండబెట్టుకోవడం. చూడ్డానికి వచ్చే మిత్రులకి యేది ఎలా పేల్తుందో...మతాబులలోంచి ముత్యాలు ఎలా రాల్తాయో, అన్నీ యాక్షన్ చేస్తూ చెప్పడం...అదో థ్రిల్.
కొంచెం యెదిగాక...సిసింద్రీలు కట్టడం....ఎంతకీ తెమిలేదికాదు. అక్క ఏడిపించడం..నేను అమ్మతో కంప్లైంట్...అమ్మనవ్వుతూ అక్కను మందలించడం....అక్క ఇంకా రెచ్చిపోవడం....అదో థ్రిల్......
అమ్మ ఆ తర్వాతనుంచి మతాబులు కట్టించేది. పది రోజుల ముందునుంచే గొట్టాలు చేయడం. సూరేకారం,గంధకం, తెచ్చికొని ఎండబెట్టడం. నూరి వస్త్రకాళితం చేయడం... ఆముదం, బీడు, ముగ్గూ తెచ్చుకుని....పాళ్ళు కలిపి గొట్టాలలో కొంచెం ఇసుక ఆ తర్వాత ఈ కలిపిన మందు కూరడం....అక్కడనుంచి వెలిగించి చూడ్డం...సాంపిల్ అన్నమాట....ముగ్గు తక్కువైంది....కలపడం మళ్ళీసాంపిల్...ఆముదం తక్కువ...కలుపు...సాంపిల్ చూడు. ఇలా చాలా కాల్చేసేవాడ్ని సాంపిల్ అంటూ.. అదో థ్రిల్ ...
మా ఫ్రెండ్ 'ఉప్పు పొట్లాలు' కట్టేవాడు. దానిలో జిల్లేడుకర్ర్రల బొగ్గు, రంపం పొట్టూ, వుప్పూ...ఏదేదో చేసేవాడు...దానికో చాంతాడు....సాయంత్రమే దాంట్లో నిప్పువేసి వుంచితే రాత్రికి రాజుకొని వుండేది.దాన్ని త్రిప్పుతుంటే....రంపంపొట్టు నెరుసులు త్రిప్పేవాడి చుట్టూ కాంతివలయంలా ఏర్పడుతుంటే వాహ్! ఆ అందమే వేరు. ఉప్పు కాలి చిటపటమంటూ పేలుతుంటే అదో థ్రిల్.....ఆ వుప్పుపొట్లాలు రాత్రి తెల్లవార్లూ తిప్పినా నో ముగింపు. కాని రెక్కబలం వుండాలి....ఓ సారి ట్రై చేసి రిటైర్డ్ అన్ హర్ట్. అదోథ్రిల్.
ఆ తర్వాత పలాసాలో వుద్యోగం...జూన్ లో వుద్యోగంలో చేరాను.అమ్మా, నాన్నగారల దగ్గరకి దీపావళికి రాజమండ్రీ రావాలంటే ఒకరోజు శలవు చాలదు. ప్రొబేషన్ పేరియడ్ లో అంతకన్నాయెక్కువ కుదరదన్నారు బాస్. మధ్యేమార్గంగా అన్నయ్య వైజాగ్ లో వున్నాడని దీపావళికి అక్కడకి. అన్నయ్యగారి పిల్లలతో సరదాగా కాలక్షేపం...




వాళ్ళింటాయన మాత్రం చాలా సందడి చేసాడు..ఆయనకు అరవై దగ్గర వుంటుంది వయస్సు. పిల్లలు లేరు. ఓ మేనల్లుడు వీరి దగ్గరే వుంటున్నాడు...వాళ్ళిద్దరిదీ గొప్ప హడావుడి. దీపావళికి వాళ్ళిద్దరూ ఒక బృహత్తర కార్యక్రమం ఆలోచించారు...గేటుకి యిటూ అటూవున్న స్తంభాలపై రెండు చిచ్చుబుడ్డులు పెట్టి ముట్టిస్తే..అవి యేకకాలంలో వెలుగులు చిమ్మాలి. అయితే దగ్గరకి వెళ్ళి ముట్టించడానికి యిద్దరికీ భయమే. సరే! మేనల్లుడు ఆ చీకట్లో దొడ్డంతా వెదికి రెండు కర్రలు పట్టుకొచ్చాడు. వాళ్ళ అరుగుమీదనుంచి చిచ్చుబుడ్డి స్థానందాకా కర్ర పెట్టడానికి ట్రై చేసారు. ఓ కర్ర సరిపోయింది కాని రెండో కర్రకు సుమారు ఓ ఆడుగు తక్కువైంది. ఎలాగ? ఇంక ఏ కర్రా దొరకలేదు కాని...'యురేకా...మామయ్యా' అని అరుస్తూ ఒక బొప్పాయి గొట్టం పట్టుకువచ్చాడు. 'గ్రేట్ రా అబ్బీ' అని మామయ్య సంబరపడి పోయాడు. ఆ గొట్టాన్ని ఈ కర్రకు కట్టారు.రెండు కర్రలకీ చెరికో కాకరపువ్వొత్తూ కట్టారు. సరే మేనల్లుడు లోపలకి వెళ్ళి రెండు చిచ్చుబుడ్డులు తెచ్చాడు. రెండు స్తంభాలపైన పెట్టాడు. పెద్దాయన--ముచ్చట చూడ్డానికి లోపలున్న వాళ్ళావిడ్ని పిలిచాడు, నన్నూరమ్మన్నారు. ఆల్ సెట్ టు గొ...మామా అల్లుడూ పొజిషన్స్ లోకి వచ్చారు. కాకరపువ్వొత్తులు వెలిగించారు....' ఒరేయ్ రెడీయా?'...'రెడీ మామయ్య' ....కర్రలు జాపారు....ఆగు....ఆగు....ఊఁ....ఆఁ....కాకర పెట్టు...జాగ్రత్త....నే అంటించేస్తున్నా..నువ్వూ అంటించు.అంటూ మామయ్య వెలిగించేసాడు....మేనల్లుడి కర్రకు కట్టిన బొప్పాయిగొట్టం కట్టుకాస్తా జారిపోయింది....మామయ్య విజయగర్వంతో వెలిగిపోతున్నాడు కాని అనుకున్నట్టు వెలగలేదు. మళ్ళీ ప్రయత్నం.. ఈ సారి అంతా సెట్ చేసారు....ఆఁ....ఊఁ....పెట్టరా....రెడీయా..అంటించు....నేను అంటిస్తున్నా...అరే..అరెరే కాకరపువ్వొత్తు తగిలి మామయ్య వెలిగిస్తున్నచిచ్చుబుడ్డి క్రిందపడి పగిలి పోయింది....'చాల్లెండి సంబరం' అంటూపెద్దావిడ లోపలకి పోయింది...ఈప్రయత్నం వమ్ముకావడంతోహతాశులైపోయారు..' ఇలా కాదురా మళ్ళీసారి...ముందే పెద్ద కర్రలు రెండు సంపాయించి ఎలాగైనా రెండూ ఒకేసారి వెలిగేటట్టు చేస్తిమా..రెండు బుడ్లూ ఒకేసారి ముత్యాలు పైకిజిమ్ముతుంటే ఆ అందమే వేరురా అబ్బీ..అంటూ భవిష్యత్ప్రణాళిక ఆలోచిస్తుంటే నేను లోపలికి జారుకున్నా.
ఆ తర్వాత వేసంగులలో నా పెళ్ళి అయింది....తర్వాత అమ్మా, నాన్నగారూ ఈవిడ్ని తీసుకొచ్చి కాపురం పెట్టించి వెళ్ళారు. ఆ దీపావళిపలాసాలో మేమిద్దరమూ చేసుకోవాలి. పలాసా కొంచెం పల్లెటూరు.అందరూ ముఖాల్లో ముఖాలు పెట్టి చూస్తారు. 'పెళ్ళై, మంచి వుద్యోగంచేసుకుంటూ యిలా చిన్న పిల్లల్లా టపాసులు కాలుస్తున్నారేంటి'అనిఅంటారేమో అని ఆలోచించినవాళ్ళమై, మా బ్యాంకులో మెస్సెంజరు తమ్ముణ్ణి నువ్వొచ్చి కాల్చిపెట్టరా బాబూ అని బ్రతిమాలాము. కాసేపు మురిపించుకున్నాడు...మా ఇంట్లో కాల్చుకోవద్దా అన్నాడు. ఇంట్లో పనివుంది అన్నాడు. కాల్చిపెట్టడానికి బాణాసంచామేం రెడీగా వుంచితే వాడు వచ్చి కాల్చినందుకు అర్థరూపాయి ఇస్తానంటేమొత్తానికి ఒప్పుకున్నాడు.....బాణసంచా కొన్నా. రాత్రి ఆరున్నరైంది, ఏడైంది, ఏడున్నరా...వీడు రాలేదు...ఎనిమిదవుతుంటే వచ్చాడు...వస్తూనే గాభరా....'ఏరా ఇంత లేటూ ...అందరూ కాల్చేయడంకూడా అయిపోతోందిరా మరి'...అంటే.."ఏంచేయమంటారండీ...హెడ్ క్లార్కుగారింట్లో వాళ్ళవిడ వూరికెళ్ళారట..ఆయనా మీకుమల్లేనే బ్రతిమిలాడితే వాళ్ళింటికి వెళ్ళి కాల్చాక....సత్యనారాయణగారి యిల్లు ఒప్పుకున్నాను కదా అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి ఈ టైమ్ అయింది. చంపేస్తున్నారండీ బాబూ..ఇంతకీ యిప్పుడు నన్ను కాల్చమంటారా..మీరే కాల్చేసుకుంటారా?ఏదో ఒకటి తొందరగా చెప్పండి." అని వాడే ఓ లక్ష్మీ బాంబు పేల్చాడు.ఈ వచ్చినవాడు కాస్తా పోతాడేమోనని, వాణ్ణి బ్రతిమలాడి బామాలి వాడిచేత టపాసులు కాల్పించి సంభావన సమర్పించుకొని దీపావళి అయిందనిపించాము....ఇదీ ఒక థ్రిల్లే కదా మరి!
ఉద్యోగ పర్వంలో హైదరాబాదు...దీపావళికి పిల్లలకు నా పర్స్ మేరకు కొంత ఖర్చు పెట్టి. మూడు రోజులు ముందుగానే.. సరకులు కొన్నా. నాకూ చాలా సరదా. ఆవిడ వద్దంటున్నాధైర్యం చేసా. పొడుగాటి కాకర్లు, 1000వాలాలు, పెద్ద భూచక్రాలు,యేవేవో వెరైటీగా కొన్నా. ఆ మర్నాడు మా పెద్దమ్మాయిని తీసుకొని,ఈవిడా నేనూయేదో పనిమీద బయటికి వెళ్ళాము. ఇంట్లో నాన్నగారూ, అమ్మవున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు. రెండో పాపా, మూడోదీ కూడావున్నారు.రెండో పాపకు అయిదారేళ్ళుంటాయి, దానికన్నరెండేళ్ళుచిన్న తర్వాతది. మేం బయటికి వెళ్ళి తిరిగొచ్ఛేసరికి ప్రక్క సందులో రెండోదాని నాయకత్వంలో యింట్లో పెద్దవాళ్ళకి కూడా తెలియకుండా మొత్తం బాణాసంచా కాల్చి పాడేసారు. పెద్దది చూసి గోల...మొత్తం అన్నీ కాల్చేసిందే అమ్మా అంటూ.ఇది కాల్చలేదే అమ్మ అంటూ ఓ కాకర చూపింది ఆఖరిది. పెద్దది దాన్ని ఒక్కటుచ్చుకుంది. అది కుయ్యో మంటూ ఆరున్నొక్క రాగంప్రారంభించింది. కొట్టడం అలవాటులేక రెండోదాన్ని కూకలేసా గట్టిగా.అది మౌనం వహించింది. రెండుకళ్ళూ ప్రశాంతగా మూసేసుకుంది. అటకమీద కూర్చోపెట్టా...అదే మౌనం..అదే ప్రశాంతత. అలాగే కూర్చుంది...ఏంచేస్తాం?మళ్ళీ నేనే దింపక తప్పింది కాదు.....మళ్ళీ వెళ్ళి వాళ్ళకి కావలసినవికొని తెచ్చాననుకోండి....పిల్లలతో ఇదో థ్రిల్.....



పెద్దవాళ్ళమయ్యాము...రిటైర్డ్....అపార్ట్ మెంటు వాసం...సెల్లార్ లోనే యేం కాల్చినా....మాకు ముగ్గురూ ఆడపిల్లలు...వాళ్ళ తావుల్లో వాళ్ళు వుంటారు.అపార్ట్ మెంటులో పిల్లలు ఆప్యాయంగా అంకుల్, ఆంటీ అంటూ సందడిగా దీపావళి చేస్తుంటే చూస్తూ మనసారా ఆనందించడం ఇప్పుడు మంచి థ్రిల్......
అప్పట్నించి ఇప్పటిదాకా దీపావళి యెప్పుడూ థ్రిల్లే....ఆనందమే...ఆ రోజులు తలచుకుంటే...మనస్సు కోటి దీపాలవెలుగులతో నిండి పోతుంది......._*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_*_


అందరిజీవితాలలోనూ వికృతినామ సంవత్సర దీ పా వ ళి


క్రొత్తవెలుగులు నింపాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.




_____________________________________


Saturday, October 30, 2010

పెసరట్టు పై కందట్టు


పెసరట్టు పై కందట్టు
పన్నాల భట్టుగారూ
ఎన్నాళ్ళకు పెట్టినారు ఈ మీ స్పెషరట్
తిన్నట్టి ముళ్ళపూడి-క
తిన్న-ట్టును మరచిపోడు ఎన్నేళ్ళయినా.
ఇందులో పన్నాల భట్టుగారెవరు?
శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, నేనూ కళాశాల చదువులనుంచి స్నేహితులము.
శ్రీ భట్టు--ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో వుద్యోగించి...ప్రస్తుతము
విశ్రాంతజీవనం... కనకదుర్గమ్మ క్షేత్రంలో గడుపుతున్నారు. ఎప్పుడూ
నవ్వుతూ మాట్లాడే ఆయన సంభాషణలలో హాస్యం తొణికిసలాడుతూ
వుంటుంది. అందుకే భట్టు అంటే నా కిష్టం. 1974 ప్రాంతంలో ఆకాశవాణి
విజయవాడ కేంద్రంనుండి రేడియో కార్ట్యూన్స్...చెళుకులు అని ఓ కార్యక్రమం
వచ్చేది. హాస్యం, వ్యంగ్యం జోడించి వచ్చే ఈ చిట్టి చిట్టి శ్రవ్య రూపకాలు
శ్రోతజనరంజకంగావుండేవి. ఆ శ్రవ్యరూపక రచయితలలో శ్రీ భట్టు ఒకరు.
వీరి ఆ రచనలను కొన్నింటిని ఏప్రిల్, 1975లో నవోదయ పబ్లిషర్స్,
విజయవాడ వారు పుస్తకరూపంలో తీసుకువచ్చారు. 'భలే చౌక టోకు
బేరము' అంటూ మంచి ముఖచిత్రం....బాపూ గారి గీత. అదిగో ఆ పుస్తకము
లోనిదే ఈ క్రింద కనపడే 'చౌకరాజ్యం'....ఇది వ్రాసింది భట్టు...వుంటుంది విట్టు...
నిజం ఒట్టు.
సరే పై పజ్జెం యేమిటట స్పెషరట్టూ కందట్టూ అంటూ?
ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి మీరు ఆడే వుంటారు......అదేనండీ..
చదివే వుంటారు....అందులో తరచు కనపడిన భట్టుగారునున్నూ...
నేను ఇప్పటిదాకా మీ దివ్యచిత్తమునకు నివేదించుకున్న
భట్టుగారునున్నూ ఒకటే. ఆ సదరు శ్రీభట్టుగారు శ్రీముళ్ళపూడివారికి -
శ్రీ పెసరట్టును స్వయంగా, యే మాయింటివంట
కార్యక్రమములు చూడకుండా చేసి, వేసి, పెట్టి ఆనందింపజేసారు. తిన్న
రమణగార్కి ... చిన్న 'కంద'ట్టు తన్నుకొచ్చింది. అదే బ్లాగు మొదట
గ్లామరుగా పెట్టినది....భట్టుగారి అట్టు తిని (శ్రీ రమణ)పలికిన మరో ఆటవెలది:::
పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ
శ్రీ రమణ వ్రాసిన ఆ కందట్టుకి బాపూగారు బొమ్మగీసారు
ఆ బాపుగారి అందం మీద రమణగారి కందం..లామినేషన్
చేయబడిన చందం...భట్టుగారింట అలంకరింపబడింది.
ఇక చౌకరాజ్యం...కానీ
మళ్ళీ కానీ అర్థణా అంటూ ఆ నసుగుడేమిటండీ?
ఇంత రచనకు కారకుడిగా, ఈ బ్లాగు
ఓనరుగా, నా కోటాలో ఓ చిన్న.......చెప్పను....చూడండి.
పెనం మీద 'పెసరట్టు'
రమణ 'పూరి'oచిన కందట్టు
వేసిన బొమ్మ బాపూ'గారి'కేతట్టు
ఇదంతా ఎక్కడ.... భట్టుగారి వీట్టు
ఏ'దోస'రదాకి నే పట్టిన ఓ పట్టు


వీట్టు అంటే ఇల్లు....అరవం...తెలుసుకదా
అరవం.....అంటే...భాష...మళ్ళీ తెలుసుకదా.


టట్టటాం.....చౌక రాజ్యం....భట్టు స్కిట్టు.
(దేశకాలపరిస్థితులను దృష్టిలో వుంచుకొని విజ్యులైజ్ చేయండి.)


వెంకట్రావు :: అబ్బాయ్! అన్ని రాజ్యాలు చిన్న..పెద్ద ఏకమవుతే
కాని మన దరిద్రం తీరదురా..
శంకరం:: రోడ్డుమీద ఎందుకు బాబూ! ఈ కబుర్లు ? పాతిక
సంవత్సరాలు ఐక్యరాజ్యసమితిలో పనిచేసావు.
ధరల నిలకడ సంఘం నిపుణిగా వున్నవు. ఒక్క
పని చేయగలిగావా? చౌకరాజ్యం తేవడమే
ధ్యేయమన్నావు కుదిరిందా?
వెంక:: ప్రచ్ఛన్నయుద్ధంవచ్చి మా పథకాలని పాడు చేసిందిరా శంకరం...

అయినా వుప్పు ధరని అదుపులో పెట్టింది
మేము. గాలిని అమ్మే ప్రయత్నాలను వమ్ము చేసింది
మేము.
శంక:: ఊఁ..ప్రస్తుతం ధరలని అరికట్టలేం...ఎందుకు వచ్చిందిలే
బాబూ...ఇదంతానూ?
వెంక:: ఆఁ అలా అనకు శంకరం! పెద్దా చిన్నా దేశాలు కలిస్తే
ధరలు పడిపోతాయి. కట్ట చుట్టలు పైసా...వంద పెసరట్లు
రెండు పైసలు. నా కళ్ళలో చూడు నువ్వు..
శంక:: విదేశీ సుందరులు కనపడతాయా...వెంకట్రావుబావా?
వెం:: మహా సంక్షేమరాజ్యం కనబడుతుంది. కారు చౌకరాజ్యం
కనబడుతుంది. నేను కలలుకన్న రాజ్యం. అతిచౌకరాజ్యం
కనబడుతుంది చూడు. చూడు నా కళ్ళతో చూడు.
(చూస్తున్నట్లు దృశ్యం.)
దండోరా::: రండిసార్ రండి కొనండి. మంచి దుస్తులు సార్ !
మంచి మంచి వస్త్రాలు సార్ ! మీటరు క్లాతు రెండు పైసలు.
ఓన్లీ టు పైసే. ఫారిన్ నైలక్స్ చీర అర్థరూపాయి. పిల్లల
డ్రాయర్లు వంద మూడు పైసలు. పది జేబురుమాళ్ళూ ఒక్క
పావలా సార్ ! ట్వినుఫూల్సు వెడ్డింగు సూటింగ్ మీటరు
పదిపైసలు సార్ ! ఓన్లీ పదిపైసలు సార్ ! బెనారస్ పట్టుచీర
ఒకేఒక్క రూపాయి.....ఇంకా ఆరణి పావలా...ధర్మవరమ్ దస్
పైసా......అమ్మా ! రండి ... అయ్యా ! రండి. కారు చౌక ... కారు
చౌక........
(కారు స్పీడు తగ్గి ఆగుతుంది)
శంకరం: ఒరేయ్ అచ్యుతం..ఆరు రూపాయలు తగలేసి ఈ పెయ్యమూతి
చిన్నకారు కొనేకంటే పదిరూపాయలు తగలేసి పందిమూతి
కారు కొంటే బాగుంటుందికదరా.?
అచ్యుతం:: ఇంకా ధరలు తగ్గుతాయిరా....ఆ పెద్దకారు మూడురూపాయలకే
వస్తుందట. అదిసరేకాని ముందు ఈ రెండుపైసలు పెట్టి రెండు
బాల్కనీ టిక్కట్లు కొను.
ప్యూన్:: సార్! బియ్యం నాలుగు బస్తాలు ఇంటిదగ్గర వేయించాను సార్!
నాలుగు రూపాయలు అయింది. అర్థరూపాయి పెట్టి బస్తా పంచదార
కొన్నానండి. అయిదు పైసలు పెట్టి ఇరవై కేజీల కాఫీగుండ
కొన్నానండి. పదిపైసలు పెట్టి వెయ్యి బత్తాయిలు కొన్నాను సార్!
అచ్యుతం:: మిగిలిన ఇరవై పైసలు బ్యాంకులో వెయ్యి. నువ్వు పో....
ఆనందం:: హల్లో అచ్యుతం..ఇల్లు కొన్నావటగా? ఎంతయింది.
అచ్యుతం:: అవును ఆనందం...గవర్నర్ పేటలో ఒక మేడ కొన్నాను. వంద
రూపాయలు. రెండువేల గజాల స్థలం. మేము వుండగా రెండు
రూపాయలు వస్తుందనుకో.
ఆనందం:: అబ్బా..అంత పెద్దదా?
అచ్యుతం:: ఆఁ సరేకాని మీ అమ్మాయి పెళ్ళి
కుదిరిందటగా. ఎంత కట్నం?
ఆనందం:: అవును బ్రదర్..కుర్రాడు డాక్టరు.పది రూపాయలు కట్నం.
ఆఁ కొంచెం యెక్కువే అనుకో. పై ఖర్చులు మరో అయిదు
రూపాయలు వేసుకొంటే నీ ధర్మమా అని గట్టెక్కి పోతము.
అచ్యుతం:: మంచివాడవే..ఆఁ అవునుకానీ...ఈ బొమ్మ యెలా వుందంటావు.
ఆనందం:: పిక్చర్ కలర్ లో తీసారు. అంతా కలిపి రెండు వేలయిందట.
బంపర్ కలక్షన్. రోజుకి పద్దెనిమిది రూపాయలు. హౌస్ ఫుల్.ఆఁ..
(కల అయిపోయిన ధ్వనులు)
వెంక:: నాలోకం అంత కారు చౌకగా వుంటుంది. ఆఁ ఎండ ఎక్కువగా
వుంది గొంతు తడారిపోయింది. కాస్త బత్తాయి రసం త్రాగుదాం.
ఆ కొట్టుకు పద...
శంక:: పదమరి....
వెంక:: రెండుగ్లాసులు బత్తాయి రసం ఇయ్యి నాయనా!
కొట్టువాడు: మూడురూపాయలు సార్ !
శం:: అదేమిటయ్యా?
కొ.వా:: బత్తాయిలు దొరకటంలేదండీ
వెంక:: అయితే రెండు కూల్ డ్రింకులీయి పోనీ..
కొ.వా:: అయిదు రూపాయలు సార్
శం:: ఏమిటయ్యా
వెంక:: పోనీ గ్లాసెడు మంచినీళ్ళియ్యి.
కొ.వా. దొరకవండి...పొరుగువారికి ఎగుమతి చేయాలని
వాడకం ఆపేసారండి.
-----ooooOOOoooo-----
నీతి: {నాకు తోచినది:} నిన్న అయినా, నేడయినా, రేపు అయినా;
అక్కడయినా, ఇక్కడయినా, మరెక్కడయినా
అప్పుడయినా, ఇప్పుడయినా, మరెప్పుడయినా
మనందరికీ ధరలు ప్రి య ము.
------

Tuesday, October 26, 2010

అంతటా వున్న చైతన్యస్వరూపం


ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమౌతుంటే...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....

అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.
మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....
మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...

ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....
దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....
तेरे साई तुझ मे जो पुहुपन मे भास
कस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास
పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.
ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం.అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..
నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు...కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.
భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.
భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...
అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.

ఆత్మా - పరమాత్రం

ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమవుతుంటే ...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....
అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక ...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.



***మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....****** ************ ************** ************ ********** ************ ******** మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...



ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....तेरे साई तुझ मे जो पुहुपन मे भासकस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం .అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు. ..కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.

Wednesday, October 20, 2010

                                పొట్టాటోపం
                                                                                       ---డి.వి.హనుమంత రావు

చాలామంది నన్ను బాలూలా వుంటానని అంటూ వుంటారు.
అదేనండీ యస్ పి గారిలాగా అనే. నా మానరిజమ్స్ అలా వుం
టాయని కొందరు మిత్రులు, బంధువులూ కూడా అంటూ
వుంటారు. ఇది తెలియని వారికెవరికైనా యిది చెప్తే అయితే ఓ పాట
పాడమంటారు. ఆ పాడు మాటలేమిటి చెప్పండి. (తప్పట్టుకోకండి.)
అపాటగాడ్ని పాడమనడం, జ్వరబాధితుడ్ని విందుభోజనం
చేయమనడం లాంటివి యిబ్బందికరం కదండీ. బాలూలా
వున్నానని అన్నారంటే బాలూ లావున్నానని అన్నది కూడా వారిభావమై
వుండవచ్చు. చాలా సందర్భాలలో అంటే 'పాడుతా తీయగా' లాంటి
కార్యక్రమాలలో బాలూగారు తనమీద తానేజోక్ చేస్తూ చాలా
చమత్కారంగా మాటలాడుతూవుండడం మనం చూస్తూనే
వున్నాము. ఆయన గొప్పపాటకారే కాదు మాటకారి కూడా.
అంచేత నే చెప్పొచ్చేదేమంటే ఆయన గాత్రం కాదు కాని ఆయన
గాత్రంతో కొంచెం సామ్యం నా పట్లకొందరి పరిశీలన అనికూడా అనుకోవచ్చు.
నా ఈ లావు తీయనిది...తీయలేనిది. 'లావొక్కింతయు లేదు'
అనే పద్యాలు రాగయుక్తంగా పాడే మాట దేవుడెరుగు ..మరే
యుక్తంగానూ పాడేసాహసం చేయను. ఒక విషయం మాత్రం నిఝం.
'అన్యథా శరణం నాస్తి...యస్ పీ గారూ! త్వమేవశరణం మమ'.
నేను కూడా నామీద జోకులు వేసుకుని,అప్పుడప్పుడు కోపం
వస్తున్నా నిగ్రహించుకుని, ఆ యాపరిస్థితులనించి బయట పడే
ప్రయత్నం యథాశక్తి చేస్తున్నాను....కొంచెం వివరిస్తాను, అవధరించండి...

"ఏంటి గురూగారూ పొట్ట అలా పెంచేస్తున్నారు" అని చాలామంది
ప్రశ్నిస్తూ వుంటారు. "పొట్ట యిలాగేకదండీ మరి పెంచాలి" అని నా
సమాధానం. అదేమిటో కడవంత పొట్ట కూసింతవాడిక్కూడా లోకువండి.
ఏంచేస్తాం చెప్పండి...ఒక్కోప్పుడు వేదాంతం చెప్పేస్తా...."అయినా నే పెంచే
దేముందండీ, అదే పెరుగుతుంది పిచ్చిముండ. నేను నిమిత్తమాత్రుణ్ణి"
అంటా. కొన్ని సందర్భాలలో చిన్న సైజు లెక్చరు యిచ్చేస్తూ వుంటా...
మీరూ చదవక తప్పదు. (నా పొట్టమీద సానుభూతితో మరి యింత
దూరం వచ్చిన సహృదయులు మీరు.) -- "బుర్రలు తీసి బుర్రలు పెట్టి
రాజకీయాలలోకి వచ్చి చెలామణీ అవుతూ, అడ్డమైనదారులూ త్రొక్కి
డబ్బుసంపాయించినా; పగలంతా గొడ్డు చాకిరీ చేసి (పోనీ అలా
తృప్తిపడి) సాయంవేళ, అదే స్వర్గమనుకుంటూ మద్యంలో పరవళ్ళు
త్రొక్కినా; కూర్చొని బంతి భోజనాలుచేసినా, నిలబడి బఫే(లో)భోజనాలు
చేసినా..... వీడి జుట్టుముడి వాడికి, వాడి జుట్టు ముడి వీడికి వేసి
మంత్రాంగాలు చేసినా: ఆ మాట కొస్తే ఏ గడ్డి కరచినా, ఏ నడ్డి వంచినా
ఈ పాడు(పాటల 'పాడు' కాదని మనవి)పొట్ట కోసమే కదండీ.
అలాంటప్పుడు నా యీ పొట్టపై మీకేల(మీకంటే మీకని కాదండీ)
అంత అసూయ ఈర్ష్య, జుగుప్స,యెన్వీ, మత్సరం" అని
ఆవేశంగా చెప్పి ఆయాస పడి పడీ, వూగిపోయి పోయి,
నిలబడిపోతాను.

నాలా పొట్టలతో భారపడేవార్ని చూస్తే నాకు బోల్డుపొట్టానుభూతి.
కొందరు పొట్టల స్వంతదారులు నా ముహం చూసో, నా పొట్ట
చూసో (అనుమానంగా యెందుకు చెప్తున్నానంటే, వారు ఏమీ
తెలియని అమాయకత్వం ముఖానికి పులుముకునివుంటారు
అన్నమాట)... 'ఏమిటోనండీ, ఈ మధ్య లావెక్కిపోతున్నాను.
చాలామంది పొట్ట పెంచేస్తున్నావ్ అంటున్నారు.' అంటారు.
అలాంటివార్ని 'నా ప్రక్కన నిలబడండి,యిప్పుడు చూడండి,
కావాలంటే ఫోటోలు తీయించుకోండి.' అనిఆహ్వానిస్తాను.
ఇలా చేయడంవలన, నా పొట్ట ముందు వారి పొట్ట చిన్నది అని
తాత్కాలికంగానైనా ఆనందం కలుగుతుంది.ఫలితంగా యింకొంచెం
ఆస్తి అదేనండి పొట్ట పెంచుకునే ధైర్యం తెచ్చుకుంటారు.

పొట్టలలో కూడా కొన్ని అంతర్ముఖాలు, కొన్ని బహిర్ముఖాలు. మొదటి
రకం యెంతతిన్నా కనపడవు. అదే రెండోరకమైతే కొంచెం తింటేనే
ఆయాసమూ ఆకారమూ రెండూ పెరుగుతాయి. ఓ యింత
తినేసాడేమో అనిచూసేవారికి అపోహకూడా కలగవచ్చు....
పోనీ తినేసాక ఓ మూల నిశ్శబ్దంగా కూర్చుంటారా అంటే...సంగీతఙ్ఞానం
ఒకటి వీరికి.....సరళీస్వరమో జంట స్వరమో(యిద్దరూ or plus
ఒకచోట చేరితే) వారి వారి స్థాయిలబట్టి స్థాయీబేధాలతో
సహా నిద్రాకచ్చేరీతో అలవోకగా విందు చేసేస్తారు. సంగీతానికి
గురకకూ పోలికేమిటనకండి...కావాలంటే యిద్దర్ని కాని యెక్కువకాని
గురకవిద్వాంసుల్ని ఓ గదిలో పరుండబెట్టి అప్పుడు వినండి....
వారి వారి గురకల్లో ఓ క్రమం, ఓ లయ,ఓ రిథమ్...అనుమానముంటే
ప్రయోగించండి.

పొట్టలవల్ల అన్నీ కష్థాలేనా...కాదు, కొన్ని వుపయోగాలు
కూడా వున్నాయి. జంతికలో చేగోడీలో పళ్ళెంలో పెట్టుకుని,
ఆ పళ్ళెం పొట్టమీద పెట్టుకుని, ఓ పడక్కుర్చీలో పవ్వళించి,
యెక్కువదూరం ప్రయాణశ్రమ లేకుండా వంగకుండా యిట్టే అలా నోటిలో
వేసుకోవచ్చు.... ఆ పళ్ళెం తీసేసి... యింట్లో పేచీ పెడ్తున్న
మనవడ్ని పొట్టమీదపడుకోబెట్టుకుని, ఇన్ నో టైమ్, నిద్రపుచ్చి
అంతఃపురస్త్రీల మెప్పుపడయవచ్చు.(మీరు ఆ సమయంలో
నిద్రలోకి జారుకుంటే...మీ సంగీతకచేరీ పిల్లవానికి నిద్రాభంగం
కలిగితే, ఆ సదరు పిల్లవాడు పాతబకాయిలతో సహా రోదించవచ్చు.
ఫలితంగా మరి.....తస్మాత్ కొంచెం జాగ్రత్త అవసరం). ఏదైనా రష్ గా
వున్నబస్సులో యెక్కి నించోవలసివస్తే మీ పొట్టయిచ్చేకుషన్ యెప్ఫెక్ట్ తో
మీ ముందువాడు స్టాప్ వచ్చినా రిలాక్స్ అవుతూనేవుండవచ్చు.
ఆలోచనలు తట్టాలంటే గోక్కోడానికి మీకు బుర్ర. మాకు బొర్ర(తెలంగాణా).

కొన్ని సంఘటనలు...నేను ఎంజాయ్ చేసినవి...
ఓ సారి ఓ ప్రయాణంలో నేనూ, శ్రీమతీ, మా తోడల్లుడూ, మరదలు
కాకినాడ వెళ్తున్నాము. దారిలో ఓ జంట కలిసారు. వారూ కాకినాడ
వచ్చి పనిచూసుకుని మరల సామర్లకోట వచ్చి వైజాగ్
వెళ్ళాలి. దానికివీలుగా సామర్లకోటలో కారు చేయించుకున్నాము.
భోజనాల టైమ్ కదా ...యింకొకాళ్ళని యేం యిబ్బంది పెట్తామని
కాకినాడలో హోటల్లో భోంచేసి మళ్ళీ కారెక్కాము గమ్యం చేరడానికి.
అప్పుడు నాకు ఆ భగవంతుడెంత కరుణామయుడో అనిపించింది.
అన్నంతిన్నాక పొట్టలు ముందుకే పెరిగే యేర్పాటు చేసాడా
శక్తిమంతుడు....అలా కాకుండా ప్రక్కలకు పెరిగివుంటే కారు
సరిపోకపోనుకదా....ఆ విషయమే కూడావున్నవారికి చెప్తే--
క్రొత్తవారిద్దరికీ నవ్వాపుకోలేక పొలమారింది. ఆవిడైతే
'అన్నయ్యగారూ! యింక జోకులొద్దండి...నవ్వాపుకోవడం
చాలా కష్టమయిపోతోంది.' నవ్వులోకలిపి
మరీఅంది. వారి సెన్సాఫ్ హ్యూమర్ కి హాస్యాంజలి.... ఆ సందర్భాన్ని
మీరూ భావిస్తే యెంజాయ్ చేయగలరని నేను భావిస్తూ మీతో
ప్రస్తావిస్తున్నానిక్కడ.
బొజ్జదేముడు మనందరికీ దేముడు. ఈ మధ్యనే బొజ్జగణపయ్యకు
పూజలు చేసి ఆయన అనుగ్రహం పొందాం కూడా. గతంలో
ఓ వినాయక చవితి ముందరి రోజు నేనూ మా ఆవిడా ఓ మిత్రు
డింటికి వెళ్ళాము. మా ముగ్గురాడపిల్లలకూ పెళ్ళిళ్ళై వారి వారి
అత్తారిళ్ళల్లో వున్నారు. అంచేత యేపండుగయినా మేమిద్దరమే...
ఆ నేపధ్యంలో.... ఆ మిత్రుడికి నలుగురు మగపిల్లలు. పెద్దాడికి
పదేళ్ళుంటాయేమో. అతడు నన్నడిగాడు...
"అంకుల్! వినాయకచవితి సామాన్లు కొన్నారా?"
"కొన్నానయ్యా, కాని బొమ్మ యింకా కొనలేదు."
"ఇంకా కొనలేదా! రేపేకదా వినాయకచవితి? యింకెప్పుడు
కొంటారు?"
"ఫర్వాలేదులే, రేపు కొంటాను"
"రేపైతే బొమ్మలు దొరకవేమో అంకుల్"
అతని కుతూహలంలోని అమాయకత్వానికి నవ్వుకుంటూ
"దొరకవంటావా...సరే యేంచేస్తాం...దొరికితే కొంటాను...లేకపోతే
బనీనువిప్పేసి పూజామందిరంలో నేనే కూర్చుంటాను....."అన్నా
బొజ్జ నిమురుకుంటూ.
ఆ చిరంజీవి యిక నవ్వాడూ....తలచుకు తలచుకు ...నే వూహించిన
దానికన్నా యెక్కువ నవ్వాడు. ఇప్పటికీ గుర్తువచ్చినప్పుడు
నవ్వుకుంటూనే వుంటాడట.. ఇపుడు అతను యస్.సి.రైల్వేలో
టికెట్ కలక్టర్.

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు

...........మన పురాణ గ్రంథాలు, మంత్రశాస్త్రాలు
విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేసాయి.
వాటిని ఆరాధించే పద్ధతుల్లోనూ మహాశాస్త్రవేత్తలు
మొదలుకొని, సామాన్యులవరకు అన్నివర్గాల
వారికీ, వివిధ బౌద్ధికస్థాయులు కలవారికి తగినట్లుగా
సాంప్రదాయాలు ఏర్పడ్డాయి.

యఙ్ఞయాగ మంత్రదీక్షలేకాక--గ్రామదేవతల పూజలు,
జాతరలు, బతుకమ్మ పండుగలువంటి సత్కర్మలు,
చిందులు, పాటలు, సంబరాలు....ఇవన్నీ ఒకే పరాశక్తిని
ఆరాధించే అనేకమైన అందమైన పరంపరలు.
ఇన్ని వైవిధ్యభరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధం
చేసుకున్న హైందవధర్మంలోని అద్భుతానికి
జో హా రు లు.తేటదనానికి సంకేతమైన శరదృతువు
--- ఆరంభంలో --తేటమనస్సుతో ఆ మహాచైతన్యాన్ని
'అమ్మా' అంటూపిలిచే నవరాత్రి వేడుకలలో
...దేశమంతా పునీతమవుతున్నది.
హిమవత్పర్వతం జ గ దం బ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని
విం ధ్య వా సి ని కి నెలవుగా, చివరి భాగమైన మలయాళ
ఖండాన్ని మ ల యా చ ల వా సి ని - భగవతికి తావుగా
భావించిన శక్తి సాంప్రదాయం.....ఈ దేశపు ఆది, మధ్య, అంతాలను
జ గ దం బ స్థానాలుగా పూజించడమేకాక, అడుగడునా
"శక్తి పీఠాల"ను ప్రతిష్ఠించుకుంది. ఈ కారణంచేతనే ఈ
దేశాన్ని తలచుకోగానే జగన్మాతృ భావన పొంగుకువచ్చి
'వం దే మా త రం' అని మోకరిల్లుతాం. విశ్వజనీనమైన
వి శ్వ జ న నీ భావానికి వం ద నా లు....
(శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
'ఈనాడు' అంతర్యామిలో విజయదశమి నాడు వ్రాసిన దానినుండి.)

Thursday, October 14, 2010

పండగ స్పెషల్

దసరా కోసం ఓ స్కిట్టు.

అన్నయ్య యిచ్చిన వంద


లక్ష్మి: ఏమండీ....

రావ్: ఏమిటి లక్ష్మీ...

లక్ష్మి: వరలక్ష్మీ వ్రతానికి కుదరదన్నారు... పోనీ దసరా నాటికైనా....

రావ్: ఏమిటోయ్ ?

లక్ష్మి: అదేనండీ..ఓ కాసు బంగారం...

.రావ్: అమ్మో ! బంగారమా ! --- కాసా.....

లక్ష్మి: పోనీ....ఓ తులం...తులం చాల్లెండి, సర్దుకుంటాను.

రావ్: బాగుందోయ్--బాగుంది. తులమంటే కాసు కన్న యెక్కువ తెలుసా ? యేమిటో ... నీకంతా వేళాకోళంగా వుంది....

లక్ష్మి: (కళ్ళల్లో నీళ్ళు)..పోనీలెండి, నే నేమన్నా మీకలాగే వుంటుంది.

రావ్: నేనేమన్నానోయ్ ?

లక్ష్మి: మొన్నటికి మొన్న, మా అన్నయ్య వచ్చి వెళ్తూ.. "చెల్లీ ! గాజులేయించుకో" అని వంద రూపాయలిచ్చాడు.---యిచ్చాడా? - అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను, వడ్డీ వస్తుంది' అని పట్టికెళ్ళారు. పట్టికెళ్ళారుకదా ? పోనీ..చెప్పినట్టు బ్యాంకులో వేసారా ? లేదే..."వచ్చేవి శ్రావణ భాద్రపదాలు..అప్పుడు పనికొస్తుంది" అంటూ గొడుగు కొన్నారు. అది కొని వూరుకున్నారా... లేదే....అది పట్టుకుని సిటీబస్సేక్కారు. - దిగేటప్పుడు ఆ గొడుగుకాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని రానూ పోనూ ఎనభై...ఎనభై రూపాయలు యిచ్చి, ఆ బస్సు డిపోకు ఆటోలో వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు....(ముక్కు చీదుకుంటూ).. అన్నయ్య యిచ్చిన ఆ వందా నా చేతిలోనే వుంటే... తులం బంగారంకోసం మిమ్మల్నీ మిమ్మల్నీ అడిగే బాధ తప్పేది కదా...(నిష్క్రమణ)

*********

లక్ష్మి: (పాట)

రావ్: యేమిటోయ్...హుషారుగా వున్నావు?... ఓ కప్పు కాఫీ యిస్తావేంటి ?

లక్ష్మి: ఎందుకివ్వనూ..(లోపలికి వెళ్ళింది)

రావ్: లక్ష్మీ! యిక్కడ బ్యాంకు పాస్ బుక్ వుండాలి, నువ్వు కాని చూసావా?

లక్ష్మి: (కాఫీ కప్పుతో వస్తూ) ..ఏమిటండీ..

రావ్: అదేనోయ్ ... బ్యాంకు పాస్ బుక్...

లక్ష్మి: ఏమో నాకేం తెలుసు... అప్పట్నించీ కనపడలేదా ?

రావ్: ఎప్పట్నించి...

లక్ష్మి: అదేనండి...ఆ మధ్య మా అన్నయ్య వచ్చి, వెళ్తూ వెళ్తూ 'గాజులేయించుకో చెల్లీ' అని వంద రూపాయలు యిచ్చాడు... యిచ్చాడా? ..అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను వడ్డీ వస్తుంది' అని పట్టుకెళ్ళారు. పోనీ బ్యాంకులో వేసారా...లేదే...'వచ్చేవి శ్రావణ భాద్రపదాలు అప్పుడు పనికొస్తుంది' అనిచెప్పేసి గొడుగు కొన్నారు. పోనీ కొని వూరుకున్నారా లేదే... అదిపట్టుకుని సిటీ బస్సెక్కారు....దిగేటప్పుడు ఆ గొడుగు కాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని, రానూ పోనూ ఎనభై....ఎనభై రూపాయలు యిచ్చి ఆటోలో బస్సుడిపోదాకా వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు..... ఆ వందా నా చేతిలోనే వుంటే తులం బంగారం కోసం మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించే బాధ నాకూ తప్పివుండేది....ఈ రోజు పాసుబుక్కు కోసం మీ బుర్రమీద వున్న ఆ కాసిని వెంట్రుకులూ పీక్కునే బాధ మీకూ తప్పివుండేది. ఇదంతా నా ఖర్మండీ...ఖర్మ.....ఖర్మ....

రావ్: అబ్బబ్బా...మళ్ళీ మొదలెట్టావ్...చంపేస్తున్నావోయ్...

లక్ష్మి: అవున్లెండి...నే నేమన్నా మీ కలాగే వుంటుంది..

రావ్: సర్లే, నే నేదో మేనేజ్ చేస్తాను కాని...యేమన్నా డబ్బులుంటే జేబులో పెడ్తావా?

లక్ష్మి: డబ్బులా? నాకు డబ్బులేమన్నా వుంచుతున్నారా యేమిటి మీరు....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ...గాజులేయించుకో చెల్లీ అంటూ ఓ వంద రూపాయలు యిచ్చాడు...యిచ్చాడా?...అది కాస్తా...

రావ్: తల్లీ యిక ఆపు....అరే! ఏం మాట్లాడినా-ఆవు కాంపోజిషన్ లా మళ్ళీ అన్నయ్య యిచ్చిన వందకే వచ్చేస్తావ్....సర్లే జీతం రాగానే నీ వందా నీకిచ్చాస్తానులే....నన్ను చంపకు.

లక్ష్మి: వున్న విషయం చెప్తే మీ కలాగే వుంటుంది....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ 'గాజు లేయించుకో చెల్లీ' అంటూ వంద రూపాయలిచ్చాడు....యిచ్చాడా...అది కాస్తా బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుందని పట్టికెళ్ళారు.....ఆ వందా నా దగ్గరే వుండి వుంటే...మీరిచ్చే వందతో రెండొందలయ్యేది...మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించకుండా యెంచక్కా నాలుగైదు తులాల బంగారం కొనుక్కునేదాన్ని..ఏంచేస్తాం... అంతా నా ఖర్మండీ...ఖర్మ...ఖర్మ...

రావ్: హతోస్మి....

------------


( మా హాసం క్లబ్ కార్యక్రమాలలో ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆమోదం పొందింది. ఇందులో మాశ్రీమతి.. విజయలక్ష్మి, నేనూ నటించాము.)

Saturday, October 9, 2010

దసరా కదండీ

శరదృతువు. ప్రకృతిలో ఓ పులకరింత. వసంతంలో పల్లవించిన జగత్తు, గ్రీష్మంలో తపించి, వర్షర్తువు ప్రభావంతో జలదరించి, శరత్తులో పులకరిస్తుంది. నిన్నటిదాకా వరదల బురదతో నిండిన జలాశయములలోని నీరు విరిగి, తేటపడి, స్వచ్ఛమై, స్వాదు జలాలతో ఆహ్లాదం కలిగించే ఋతువీ శరదృతువు. అంతా నిర్మలమే. నిర్మలమైన నీలి ఆకాశం. పిండి ఆరబోసినట్లు తెల్లని శరత్కాలపు సిరి వెన్నెల. వికసించిన పూల సౌరభాలు. ఏదో తెలియని ఆనందంతో పులకరించిపోయే నిండు మనస్సుతో శరదృతువుకు స్వాగతమందాము.
నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్వని. అది పూర్ణిమతో కూడిన మాసం ఆశ్వీయుజం. ఆ కారణంచేత ఈ పాడ్యమితోనే సంవత్సరారంభమనే ఆచారముంది. మాసాలలో మొదటిది చైత్రము కనుక చై.శు.పాడ్యమి సంవత్సరాది అనడం కూడా మనకు తెలుసు. అప్పుడు వసంత నవరాత్రులు, యిప్పుడు శరన్నవరాత్రులు జరపడం సాంప్రదాయంగా వస్తున్నది. పంచభూతాత్మికమైన ప్రకృతితో - పంచభూత తత్త్వాలతో కూడిన మన ఈ శరీరాన్ని సరిపోల్చుకుంటూ - ప్రకృతినే పరమాత్మగా ఆరాధించడం మన హైందవ సాంప్రదాయం. అవే యీ నవరాత్రి సంబరాలు. ఆశ్వీయుజం, కార్తీకం - ఈ రెండూ మనకు పవిత్రమైనవే.

దసరాలో అమ్మను పూజిస్తాము. దసరా అనడంలోనే ఒక సరదా. పట్టు పరికిణీలతో, విరిసిన పూలతో చక్కగా సింగారించిన వాలుజడలతో ఘల్లు ఘల్లుమంటూ మువ్వల సవ్వడితో తిరిగే బాలా స్వరూపిణిగా.... పసుపుపారాణితో, రంగురంగుల గాజులతో శోభించే కోమల హస్తాలతో, చంద్రుని బోలు నిండు మోము పై యెర్రని కుంకుమ బొట్టుతో, కురుల విరులు అలంకరించి మందగమనంతో నిండుముత్తైదువగా శోభించే సువాసినీ రూపంగా ..... మంజీరధ్వనులు వేదధ్వనులు తలపిస్తుండగా భవునితో కూడి ఆనందంగా నడయాడే భవాని......అంతటా దర్శనమిస్తుంది.

మునుపటి రోజులలో .. దసరా అంటే పిల్లలకి గొప్ప సరదా. వేడినీళ్ళ పొయ్యిలు,,,, వాటి చుట్టూచేరి వేడి నీళ్ళకోసం అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో పోటీపడుతూ చేసే తలంటుస్నానాలు,పండుగనాటికి నాన్న కొన్న క్రొత్తబట్టలు, అమ్మచేతి కమ్మటి భోజనాలు,.....ఇవి యిప్పుడులేవా అంటే వున్నాయి... గీజరు నొక్కితే వేడి నీళ్ళు, బాత్రూములలో షాంపూలతో మూగ స్నానాలు. క్రొత్త బట్టలు యిప్పుడు నిత్యం. అంచేత ఆ ఆనందం క్షణికమే....బర్గర్లూ,పిజ్జాల కమ్మతనంఅలవాటుపడ్డాక అమ్మతనం యెంతమందికి కావాలి? ఇప్పటివారు యిదిఆనందదాయకమే అనవచ్చు.....కాని పండుగ ప్రత్యేకత లేదేమో అని మా భావన....అయ్యో! మన అభిమాన హీరో హీరోయిన్లు బుల్లితెర పై చెప్తారుగా పండగల గురించి ముద్దు ముద్దు మాటలతో...వారి మాటాలే మనకి విఙ్ఞాన సర్వస్వం....కదా?

అప్పట్లో రేడియోలో ...'శారద రాత్రులు వచ్చాయి-పండు వెన్నెలలు తెచ్చాయి' అంటూ ఓ పాట వచ్చేది.(నాకు పాట సరిగా గుర్తు లేదు). అందులోనే 'అట్లతద్దోయ్...ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్...పిల్లల్లారా,జెల్లల్లారా! లేచిరండోయ్ !'....అట్లతద్ది అనగానే మా బాబాయి గారి పిల్లలూ, మేమూ, పేటలో పిల్లలూ అంతా తెల్లారగట్టే లేవడం... మా పిన్ని గోంగూర పచ్చడి+పేరిననెయ్యి, నూపొడి, వుల్లిపాయ పులుసు, గడ్డపెరుగు వేసి చద్దన్నాలు పెడ్తే లాగించేసి.....పుచ్చపూవులాంటి వెన్నెలలో తెల్లారేదాకా ఆటలే. కొంచెం వయస్సువచ్చిన మగ పిల్లలు చిలిపి అల్లర్లు చేసేవారు. సెలూన్ బోర్డు లాయరు గారింటికి...డాక్టర్ గారి బోర్డ్ లాండ్రీ షాపుకీ ,,, అలా. ఆ వెన్నెలలో ఆ ప్రకృతి మాత ఒడిలో ఆ ఆనందానుభవం ప్చ్! అమ్మఒడి ఒక రక్షణ...ఓ భద్రత....ఈ కాంక్రీట్ జంగిల్లో ఆకాసమే కనుమరుగై పోయింది. చూడాలంటే ప్లానిటోరియంకు వెళ్ళాలి. తారలతో నిండిన ఆకాశం చెప్పేపాఠాలు...పండువెన్నెలలు పలికించే కవితావేశాలు...మనసును రసప్లావితం చేసే పిల్లతెమ్మెరలు...యే కోనసీమల్లోనో....యేకొబ్బరిఆకుల చాటునో...యే పంటకాలువల నీటి తరగల్లోనో....యింకా వున్నయేమో...ప్రగతిగా భావించే నాగరికతల ప్రభావం ఆ పల్లెలలోపడనంతకాలం రసహృదయాలు స్పందిస్తూనేవుంటాయి.

జయీ భవ! దిగ్విజయీ భవ...అంటూ...విల్లంబులు ధరించి.... ఆ బాణాలలో పూవులు పెట్టి...యింటింటికీ మేష్టరుగారి సారధ్యంలో వెళ్ళి దసరా పద్యాలు పాడి అక్కడ తలిదండ్రుల మీద పూలు జల్లి బహుమానాలు తెచ్చుకొనే సరదాలు చరిత్రలో కలసిపోయాయి...."దసరాకు వస్తిమని రుసరుసలు పడక..బహుమానముల నిచ్చి పంపండి వేగా..." అని "యేదయా మీ దయా మా మీద లేదూ...పావలా యిస్తే పట్టేది లేదు, అర్థరూపాయి అయితేను అంటేది లేదు" అని కండిషను పెట్టి "అయ్యవారలకు చాలు అయిదు వరహాలు..పిల్లవారికి చాలు పప్పుబెల్లాలు." అంటూ గురువుగారి పట్లగల భక్తి ప్రపత్తులనీ, తమ నిర్మలప్రేమనూ వ్యక్త పరుస్తారు. అలాంటి దసరా పద్యాలు యిప్పుడు కనుమరుగై పోయాయి.కార్పరేట్ స్కూల్స్....ఎ.సి.బస్సులు....ఎ.సి.క్లాసులు....అంతా క్లాస్....
గతం కొద్దో గొప్పో చూసాము కనుక మారే కాలంలో వున్నాము కనుక ఏదో వ్రాయడం....మార్పు అనివార్యం. ఏదీ తప్పుకాదు. యాంత్రికజీవనంలో మమతానురాగాలు దూరమై పోతున్నాయేమో అని ఆవేదన. అయితే ఆలోచించేవాళ్ళను కోరేది ఒకటే మనదైన సంస్కృతిని రాబోవుతరాలకు అందీయవలసిన పవిత్రబాధ్యతను మరచిపోకండి. మనవంతు కృషి మనం చేద్దాం.
దసరా పండుగ శుభాకాంక్షలు ....
మీకూ మీ కుటుంబములోని వారికీ.
............ది న వ హి

Friday, August 20, 2010

విరోధాభాసం

విరోధాభాసము.....ఒక అలంకారము. (రచన:దినవహి వేంకట హనుమంత రావు.

విరోధముగా నున్నట్లుగాన్పించి విరోధము లేకుండుట "విరోధాభాసము" అని నిఘంటువు

ఉదాహరణ: మిత్ర తేజోహారి యయ్యు నా రాజమిత్ర తేజో హారి యయ్యె.

మిత్ర తేజోహారి===సూర్యునివంటి తేజస్సుచే మనస్సు హరించువాడు.

అమిత్రతేజోహారి===శత్రువులతేజస్సునుహరించువాడు.

__________________________________________________________________________________________
భార్యా............భర్త.

ఆవిడకి కాల్గేట్ ఫ్రష్ ఆయనకి బినాకా కూల్.

ఆవిడకి యే కాలమైనా చన్నీటి స్నానం యిష్టం

ఆయనకి యెండాకాలమైనా వేణ్ణీళ్ళే కావాలి.

ఈవిడకి వయస్సు పెంచని సంతూర్ సబ్బు

ఎక్కడ ఆరోగ్యం వుందో అక్కడ ఈయన.

పాండ్స్ మేజిక్ ఆవిడకైతే కూటికురా ఈయనకిష్టం.

ఆవిడకి బ్రేక్ ఫాస్ట్ అక్కర లేదు

కాని చెయ్యడం పాపం తప్పదు

ఎందుకంటే ఈయనికి కావాలి కనుక.

న్యూస్ పేపరు ఈయనకి నల్లమందు

ఆ టైముకి లోకాభిరామాయణం

ఆయనతో ముచ్చటించటం ఆవిడకి ముద్దు.

వేసవి కాలంలోనైనా ఫ్రిజ్ లో నీళ్ళు పెట్టవోయ్ అంటాడాయన

ఏ కాలమైనా క్రొత్త కుండ నీళ్ళు మంచిదంటుందావిడ.

ఆవిడకి స్వీటిష్టం.......ఆయనికి మిర్చి బజ్జీ ప్రాణం.

భోజనంలో కూర కంపల్సరీ ఆవిడకి

పచ్చడి లేకపోతే ముద్ద దిగదీయనికి.

చిరుపులుపు మజ్జిగ యిష్టం ఆయనికి

పులుపంటే గిట్టదావిడకి.

మధ్యాహ్నం ఓ చిన్న కునుకు...లేచాక ఓ స్ట్రాంగు టీ

ఆ రిటైర్డ్ ప్రాణి కావాలంటాడు పాపం

ఎంత టైరయినా ఆవిడకి కునుకూ అక్కర్లేదు .... టీ కూడా అక్కర్లేదు.

ఖర్చులు హమేషా లెక్కలు పెట్తూ వుంటాడీయన

నెల ఫించను...నెల బజెట్ కు సరిపెట్టాలి కనుక

అస్తమానూ లెక్కలంటారేమిటి...కక్కుర్తి బుద్ధి అంటుందావిడ.

బెడ్ రూమ్ లైటు వద్దంటుందావిడ నిద్ర పోయేటప్పుడు

అమ్మో అది లేకపోతే పీడకలలంటాడీయన.

సౌండ్ స్లీప్....నిశ్శబ్దంగా పడుకోవాలంటుందావిడ

సౌండ్ లేకుండా స్లీపెలాగం టాడీయన.

అటుదిటూ యిటుదటూ అయినా

యింటింటా యిది నిత్యమూ...సత్యమూ...

తెలుగు గ్రామరుకే కాదు...సంసారంలో గ్లామరుకి కూడా ..

విరోధాభాసం ఒక అలంకారము.....కాదంటారా???

Monday, August 16, 2010

కంప్యూటర్ కా షా టా లు





ఈ వయస్సులో కంప్యూటర్ అవసరమని పించింది. ( వయస్సు ఎంత అని అడక్కండి ప్లీజ్.) సరే కొన్నా. మా ఆవిడ కూడా అప్రూవ్ చేసింది.(అఫ్ కోర్స్ ఆవిడకు పాటలూ సినీమాలు అవీ వినొచ్చు.. చూడొచ్చని చెప్పా). కంప్యూటర్ లో చిప్పులు పెట్టి చేతికి యెలుక నిచ్చి వెళ్ళాడు కంప్యూటర్ ఆసామీ. ఇక కంప్యూటర్ తెరిచినదే తడవు ఈ ఎలుక ఆ చిప్పులకోసం పోతుంది. కావలసినవి అక్కర్లేనివీ అన్నీ తెచ్చేస్త్తుంది. తెలుగులో తెగ వ్రాసేద్దామని వుబలాటంతో ’అను’ తెలుగు యెక్కింపించా. అందులో ’ఆపిల్’ కి ’కీ’ బోర్డ్ నకలు యిచ్చాడు కంప్యూటర్ ఆసామీ. కొట్టడం మొదలెట్టా ఆసామీ యిచ్చిన సూచనల మేరకు. ఐతే నాకు ఇంగ్లీష్ కీ బోర్డ్ A S D F మాత్రం వచ్చు. ఏదో కొట్టడం యేదో పడ్డం. పిచ్చి పిచ్చిగా వస్తున్నాయి. ఈ లోగా ఓ మిత్రుడినడిగితే DOE చూడండన్నారు. అది కొంచెం బెటర్.


ఇదిలావుండగా
మామిత్రులు సురేఖగారు(అమ్మాయి కాదు అబ్బాయే) ఆయన అస్తమానూ బ్లాగులు బ్లాగులు అంటూ వుంటారు. ఆ బ్లాగుల బ్లాగోగులు చూద్దామని ఇంటర్నెట్ పెట్టా. మళ్ళీ కా షా టా లు. జి మెయిల్ క్రియేట్ చేద్దామని నెమ్మదిగా అది ట్రయ్ చేస్తే this page cannot be shown అని దానికింద భయంకరంగా యేదేదో వ్రాసి వుండేది. వెనక్కి వెళ్ళక పోతే కడప బాంబ్ పేలుతుంది జాగ్రత్త. ఏం చేయాలి? ’x’ కొట్టేసి పారిపోవడమే... ఏదో స్టేట్ మెంట్ దాని కింద మూడు ఆప్షన్స్ యస్, నో, మోర్ ఇన్ఫర్ మేషన్. ఏది క్లిక్ చేసినా అది పోదే! పోనీ ఆఫ్ చేసి పోదామని x నొక్కినా యిది పోదు.ఈ సమయంలో మా ఆవిడ లోపల్నించి కేక పెట్టింది. "యెన్ని కూతలు వచ్చాయి. స్టవ్ ఆపారా?". "యేం స్టవ్? యేం కూత"లన్నాపరాకుగా. "అదేంటండీ? సెల్లార్ లో కూరలవాడొచ్చాడూ- నే వెడుతున్నామూడు కూతలొచ్చాక స్టవ్ ఆపమని చెప్పాగా". "యే సెల్లార్? యేకంప్యూటర్?......" మా ఆవిడకి వళ్ళు మండింది..."నా ఖర్మ..ఖర్మ" అనుకుంటూ ఎక్జిట్ తీసుకొంది. ’నీ ఖర్మ’ అనలేదు....పాతివ్రత్యం కాబోలు.... ఇక్కడ పవర్ ఆపేద్దామంటే బోల్డు డబ్బెట్టి కొన్న కంప్యూటర్.....కంప్యూటర్ ఆసామీ దగ్గరకి పరిగెత్తా. ఏవో సూక్ష్మాలు చెప్పాడు. మళ్ళీ జీ మెయిల్ try చేసా. అంత డేటా కష్టపడి యిచ్చాక యేదో మిస్సింగ్ అంటుంది. అది యిచ్చాక అదేదో వర్డ్ అర్ధం కాకుండా యిచ్చి అది క్రింద గది లో కొట్టమంటుంది( ఈ గది గొడవ అన్ని చోట్లా తగులుతూనే వుంటుంది.)కొంచెం ఆలోచిస్తున్నా...


మా
ఆవిడ యేదో అంటోంది. "ఇదివరకు యింట్లో సాయం చేసేవారు.... కూరలు తొక్కలు తీయడమో...గిన్నెలు సర్దడమో....ఆ కంప్యూటర్ వచ్చింది ప్రాణానికి....కనీసం పాలు పొంగి పోతూవున్నా పట్టదు అవి కాస్తా మాడి తగలడ్డాయి...రేపు మజ్జిగ అన్నారు అంటే అప్పుడు చెప్తా" నన్ను కాదులే అన్నట్టు నా పనిలో నే వున్నా. ఆ వర్డ్ యెన్ని సార్లు చేసినా దీం దుంప తెగ(సారీ) యిది మళ్ళీ మళ్ళీ ఆ వర్డ్ మార్ఛేస్తూ కొట్టమంటూవుంటుంది. మొత్తానికి పాపం కంప్యూటర్ మహాశయుడు తృప్తిపడి కంగ్రాట్యులేషన్స్. కావలిస్తే చూసుకో అన్నాడు. సరే ఎలుకను పంపిస్తే యెంతకీ చూపెట్టదే. వళ్ళు మండి మళ్ళీ మొదలెట్టా. ఫలితంగా నీవు ఆల్ రెడీ వున్నావంది. హమ్మయ్యా....సాధించానన్న మాట...


ఇక బ్లాగు...కొంచెం అనుభవం వచ్చింది కదా...మొత్తం మీద సృష్టించ గలిగా.....సందేహాలు వచ్చేవి...కం.మీ ని అడిగితే కంప్యూటర్ నాలెడ్జే కాని ఇంటర్నెట్ నాలెడ్జ్...ప్చ్. అన్నాడు. కొన్ని మా సురేఖ గారు సాల్వ్ చేసారు. వారి ద్వారానే పరిచయం అయిన ఓ సహృదయం నా వివరాలు తీసుకొని నా బ్లాగు కి రంగవల్లులు కూర్చి చూడబుల్ గా చేయడమే కాకుండా- కూడా గైడ్ చేస్తున్నారు. థాంక్స్ మాత్రమే చెప్పగల మెయిల్ దూరం లో వున్న ఆ సహృదయానికి థాంక్స్... మొన్న నా బ్లాగు కోసం క్లిక్ చేస్తే screen అంతా నల్లగా అయిపోయింది....లోపలికీ కాని బయటికి కాని దారి లేదు. మళ్ళీ ఆపా. మళ్ళీ తెరిచా....వుహూ .. మళ్ళీ ఆ స్జ్రీనే...ఆ నలుపే....యేం చేయనూ....ఆ సహృదయము వెంట పడ్డా....శ్రమ తీసుకుని అభయ హస్తం చూపారు....ఈ లోగా కూడలి లో వుంది నాబ్లాగు బందీ గా. (ఖైదీ) నెం.115 ప్రస్తుతం అని గుర్తించా... హాస్యవల్లరి..dvhrao.blogspot.com...మీరూ చూడండి...సలహాలివ్వండి...నన్ను బ్లాగుగా చెయ్యండి. కష్టాల తో కంప్యూటర్ అదో అందం. కదా! ఈ బ్ల్లాగు బ్లాగుడు మీ రందరూ భరిస్తారు పాపం అని అనుకుంటూ శలవు...దినవహి.

Thursday, August 12, 2010

చీమ కుట్టింది

అనగా ఓ రాచగద్దె ...
ఆ రాచగద్దెకు ఏడుగురు పోటీ .....
ఏడుగురు పోటీలు దేశంమీద పడ్డారు.......
ఏడు డబ్బుసంచీలు తెచ్చారు......
అందులో ఓ డబ్బు సంచీ నిండలేదు......
సంచీ! సంచీ! ఎందుకు నిండలేదు?నీతి అడ్డమొచ్చింది.....
నీతీ! నీతీ! ఎందుకు అడ్డమొచ్చావు?ఆశ మేయలేదు......
ఆశా! ఆశా! ఎందుకు మేయలేదు?పాలకుడు వదలలేదు......
పాలకుడా! పాలకుడా! ఎందుకు వదలలేదు?పదవి పోతానని బెదరిస్తోంది......
పదవీ! పదవీ! ఎందుకు పోతానంటున్నావు?ఓటరు ఏడుస్తున్నాడు.......
ఓటరూ! ఓటరూ! ఎందుకు ఏడుస్తున్నావు?పెరిగే ధరలు కుట్తున్నాయి.....
ధరలూ! ధరలూ! ఎందుకు కుట్తున్నారు?
బుర్రవున్నా ఉపయోగించకుండా....తప్పుడు బాక్సులో ఓటేస్తే మరి కుట్టనా?????
(స్థానిక దినపత్రిక "సమాచారం"లో ముద్రితము)

Tuesday, August 10, 2010

జై హనుమాన్





ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయవిగ్రహమ్పారిజాత తరు మూలవాసినం భావయామి పవమాననందనమ్...


మీకు మల్లేనే నాకు కూడా పవమాననందనుడంటే చాలా యిష్టం. ఎందుకంటారా?మీకు తెలుసు అయినా అడుగుతున్నారంటే మీ గొప్పతనం....చాలా చోట్ల స్వామి మనం వందనం చేస్తుంటే ప్రతివందనం చేస్తూవుంటాడు. అందరిలోనూ శ్రీ రాముణ్ణి చూస్తూవందనం చేస్తున్నాడు స్వామి. తానే పరబ్రహ్మ అయినా అంతటా వున్న ఆ పరబ్రహ్మనుఅంతటా చూస్తూనే వుంటాడు. ఆయన మనకి ఆదర్శమే? కాదా మరి.... అందుకేసదా భావయామి పవమాననందనం.


చిన్న చమత్కారమ్:ఆలి వుప్పు వేస్తే పప్పూ రుచి కూరా రుచి......వుప్పు మరస్తే పప్పూ కూరా ఒకటే రుచిఆలి ఆదమరస్తే ఆశు కవిత్వం....చేయి విదిలిస్తే మౌన గీతం!!!

Wednesday, August 4, 2010

హాసం క్లబ్ రాజమండ్రి


ఇక్కడ రాజమండ్రి లో హాసం క్లబ్ అనే సంస్థ గత ఏడు సంవత్సారాలుగామాచే నిర్వహింప బడుతున్నది . నేను మరియు నా మిత్రుడు శ్రీ అప్పారావు కలసి ౨౦౦౪లో హాసం పత్రిక వారి ప్రోత్సాహం తో రాజమంద్రిలో ప్రారంభించాం. ప్రతి మూడవ ఆదివారం (అప్పుడప్పుడు ఒకటి రెండు నెలలు తప్పినా) ఇప్పటికి ౭౩ కార్యక్రమాలు చేసాం. అందులో జోకులు, మెలోడి పాటలు , హాస్యప్రధానమైన పేరడీలు చిన్న చిన్న స్కిట్స్ ఇలా చెస్తూ వుంటాం. వచ్చిన వారమ్దరూ హేపిగా రెండు గంటలపాటు ఏమ్జోయి చేసి వెళ్తారు. మిమ్మల్ని నవ్వించడానికి ఏదైనా మంచి స్కిట్ తో త్వరలో మీ ముందు వుంటాను..........శలవు....దినవహి.

Monday, August 2, 2010

కొత్త మిత్రుడు

శీర్షికలోనే చెప్పేగా కొత్తని..అందుకే తప్పులు వుంటే మన్నించండి . నా పేరు దినవహి వెంకట హనుమంత రావు.
వుద్యోగం : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా చేసి రిటైరయ్యా.
ప్రస్తుతం: భారత్ వికాస్ పరిషద్, భారత్ సాహిత్య పరిషద్ సంస్థలలో సభ్యుణ్ణి.
హాసం క్లబ్ కన్వీనర్ని కూడా.
కుటుంబం: నేను నా భార్య యిక్కడ. ముగ్గురు పిల్లలూ అత్తవారిల్లలో ... పెల్లిల్లై పోయాయి (ఆడపిల్లలు కదా)
నాకు: హాస్యం అంటే, నటనంటే చాలా ఇష్టం. మా ఆవిడ పాడుతుంది..నాకు ఇష్టం. ఆధ్యాత్మిక విషయాలు చాలా ఇష్టం.
ఇంకా : ఇంకోసారి .....