Pages

Sunday, August 24, 2014

టంగుటూరికి కవితాంజలి


నేను పాల్గొన్న కవి సమ్మేళనం...

మా రాజమహేంద్రవరములోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఆంధ్ర సెంటినరీ జూనియర్ కళాశాల’ వారు 23-8-2014 నాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 142వ జయంత్యుత్సవం చేసారు… జూనియర్ కళాశాల చైర్మన్ శ్రీ జమ్మి రామారావు గారి ఆధ్యక్షాన ఒక సభ జరిగింది.. 11మంది కవులు ఈ సందర్భంగా ఆంధ్రకేసరికి ‘కవితాంజలి’ ఘటించారు.. పాల్గొన్న పేరెన్నికగన్న కవులు …  

‘శతావధాని .. శ్రీ డా॥అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు
‘సరస కవి’ శ్రీ డా॥ యస్.వి.రాఘవేంద్ర రావు
‘విశ్రాంత ఉపాధ్యాయులు’ శ్రీ డా॥డి.యస్.వి.సుబ్రహ్మణ్యం
‘ఆదిత్య డిగ్రీ కాలేజీ ఉపాధ్యాయురాలు’ శ్రీమతి బి.హెచ్.వి. రమాదేవి
విశ్రాంత రైల్వే ఉద్యోగి.. శ్రీ చిరువోలు విజయ నరసింహరావు,
‘నీలోత్పల కవి’ శ్రీ యార్లగడ్డ మోహన రావు
తెలుగు ఉపాధ్యాయులు శ్రీ యం.వి.యస్ మూర్తి
తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కర్రా కార్తికేయ శర్మ
విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ పీసపాటి నరసింహమూర్తి
యువ కవి, విద్యార్థి… శ్రీ సందీప్

పరిమళభరిత సాహిత్య కుసుమాలు వెదజల్లే ఈ లబ్ధప్రతిష్టులైన కవులతో పాటు తుమ్మి పూవు పాటి కూడా  చేయని నాకుకూడా  అవకాశం ఇచ్చారు….

ప్రకాశం పంతులుగార్కి రాజమండ్రి అంటే చాలా అభిమానమట.. ఆయన తన జీవిత చరిత్రలో అదే వ్రాసారు..
“రాజమహేంద్రవరము విద్యా వంతులకు నిలయమని, మహా పండితులకు ఆస్థానమని,గోదావరి బ్రహ్మాండమైనదనీ, ఆ దేశం వెళ్ళినవారంతా పండితులవుతారనీ చెప్పుకుంటూ ఉంటారు..”
ఆ గోదావరీ మాత  ఒళ్లో పెరిగి, ఆ అమృతధారలు త్రాగినందువలన కాబోలు నేను కూడా నాలుగు అక్షరాలు కూర్చగలుగుతున్నాను …

--------
సభాసరస్వతికి వందనమాచరించి.. నేను కవితాంజలి ఘటించాను ఈవిధంగా…

“ఒంగోలు ప్రాంతంలో పుట్టి
గోదావరీ తీరానికి తరలి వచ్చిన మేటి, మన టంగుటూరి
తాత ముత్తాతలది తరగని ఆస్తి,

తనకందినది మాత్రం పేదరికం…
బాధ్యతలు మోయలేని పసి వయసులో
తల్లిపై కుటుంబ భారముంచి
గతించాడు తండ్రి..
ఎవరేమన్నా .. కాదని తల్లి ఎత్తిన
అవతారం - పూటకూళ్లమ్మ .
ఆమె పేదరికంతో ప్రేమ, ధైర్యం కలిపి పెట్టిన
ముద్దలు తిని పెరిగాడు ప్రకాశం …
అందుకే ఆయన గుండె
చెదరలేదు - జీవితాంతం ..
కనపర్తిగ్రామంలో పుట్టి
రాజమహేంద్రికి కదలి వచ్చాడు
తన లెక్కల మాష్టారు
ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గారితో కలసి…
నాయుడుగారు, ఆయన సతీమణీ పంచినప్రేమ
ప్రకాశం జీవితాన్ని తీర్చి దిద్దాయి..
చిన్ననాడు చిలిపి అల్లరులు చేసినా
మెట్ కాఫ్ వంటి విద్యావేత్తల పర్యవేక్షణలో
ఎదిగి - ప్లీడరై
రెండు చేతులా సంపాదించాడు టంగుటూరి
సంపాదనపై మమకారము లేని స్థిత ప్రజ్ఞుడు
ప్లీడరు వృత్తి వదలి లీడరయ్యాడు
రాజకీయంలో జేరి..
బ్రిటిష్ వారి నెదిరించిన సమరయోధుడు
గుండుకు బదులుగా గుండె చూపాడు ఆంధ్రకేసరి …
రాజకీయ మేధావుల నెదిరించి నిల్చిన జోదు
కనుకనే .. రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి అయ్యాడు..
నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం
ఆంధ్రదేశ చరిత్రగా నిలుస్తుంది భావితరాలకు …
నీతి, నిజాయితీ.. నిరాడంబరత, నిస్వార్థం ..
నిండిన ఆంధ్ర కేసరి జీవితం … ఎవరికైనా ఆదర్శం…
అది మనిషిని మనీషిని చేస్తుంది  .. ఇది నిజం.”

[ఆ తర్వాత ప్రకాశంగారి దివ్య స్మృతికి రెండు  తుమ్మి పూలు సమర్పించుకున్నాను..…]
 (1)సీ॥ కనపర్తి గ్రామాన కంఠీరవ మొకటి
కన్ను తెరచి వేగ కదలి వచ్చె
కోరిక తీరగా కొదమ సింగము జేరె
రస చిత్తముల తావు రాజమంద్రి
వాదములో ప్రతివాదములో న్యాయ
సిద్ధికై గర్జించె సింహమట్లు
తొడకొట్టి లంఘించె తోటి వస్తాదుల
మీదకు కరి జీరు మెకము కరణి

తే॥గీ॥ గుండునకు బదులు పలికె గుండె జూపి
తెగువ నిల్చిన ఆంధ్రుల తేజమీవు
ఆంధ్రకేసరి నీవెగా అవని లోన
దండము లివియె కొనుమయ్య ధన్యచరిత

(2)సీ॥ వయ్యారపు నడక, వంకీల జుత్తుతో
వల్లెవాటు భుజాన వనిత తీరు
తరుణి పాత్రల నెన్నొ ధరియింప గాబోలు
తాదాత్మ్య భావము తనను నింపె
పేదవానిగ పుట్టి ప్లీడరై రాణించె
ధనము సంపాదించె తనివితీర
వీరు వారనిలేక వితరణ చేసె, నా
ర్జించిన విత్తము రేయి బవలు

తే॥గీ॥ ఏకవచనాన బిల్చు తా నెవరినైన
పదవి యున్నను లేకున్నను బాధలేదు
ధనము లేకున్ననేమాయె ధనదుడతడు
సత్యమిది టంగుటూరికి సాటి లేరు

మా అందరినీ పుష్పమాలలతోనూ,జ్ఞాపికలతోనూ, దుశ్శాలువాలతోనూ సత్కరించారు నిర్వాహకులు.. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు సభలో పాల్గొన్నారు..

Saturday, August 2, 2014

బ్లాగు పుట్టిన రోజు..(2010 టు 2014)


ఈ రోజుకి (2-8-2014) నాలుగెళ్లి ఐదు వచ్చాయి.. నా బ్లాగుకి.


“హాయ్ అంకుల్”... “హాయ్ ఆంటీ”
అనుకుంటూ నా వెనకాలే వచ్చేసింది నా బ్లాగ్ ..
“ఏంటా పలకరింపు?  వచ్చిన వాళెవరో చూసావా ?” అన్నాను.
“ఎవరూ” అని - ‘?’ మార్క్ ఫేస్ పెట్టింది..
“ఇంతకీ ఎందుకొచ్చారు?” అని మళ్లీ అడిగింది.
“తప్పమ్మా - అలా మొహమ్మీద అడక్కూడదు.” అని బుద్ధులు చెప్పా …
“రహస్యంగా అడగనా? ఐతే  నువ్వు చెప్పు, రహస్యంగా అడుగుతా” అని చెవులో గట్టిగా అడిగింది.
వచ్చిన వాళ్లందరూ ఘొల్లున నవ్వారు..
“‘హేపీ బర్త్ డే ’హాస్య వల్లరి” అంటూ బ్లాగుకి షేక్ హాండ్ ఇచ్చారు.
“ఓ .. ఈ రోజు నా బర్త్ డే ..” అని సిగ్గుతో మెలికలు తిరిగింది బ్లాగ్.
“చూసావా .. నువ్వు మరచిపోయావు, నీకు సర్ప్రైస్ చేద్దామని వీళ్లందరినీ పార్టీకి పిలిచా..”అన్నా..
“నేనేం మరచిపోలేదు.. చాక్లెట్స్ ఇద్దామని వెళ్తున్నాను .. నువ్వు పిలిచావు..” అంది బ్లాగ్.
“నీ పుట్టిన రోజు ఫంక్షన్ చేద్దామని - చాలామందికి రమ్మని చెప్పాను.. కొందరొచ్చారు.. కొందరు ఫోన్ లో నీకు గ్రీటింగ్స్ చెప్పమన్నారు.. రా వీళ్లందరి బ్లెస్సింగ్స్ తీసుకో” అని   మా బ్లాగును  అభిమానుల దగ్గరికి తీసుకు వెళ్లా ..

m.v.apparao(surekha) with sir Bapu.






“ముందర ఈయన బ్లెస్సింగ్స్ తీసుకో”
“ఎవరీయన ?”
“ఈయన ప్రఖ్యాత కార్టూనిస్ట్, ‘సురేఖ’ -  కార్టూన్స్ వేస్తారు..”
“తెలుసు తెలుసు, నమస్తే అప్పారావు అంకుల్. ఈయన చెప్తేనేగదా .. నువ్వు నన్ను క్రియేట్ చేసావు” అని అప్పారావుగారికి పాద నమస్కారము చేసింది..
నాకు చాలా సంతోషం వేసింది..



“ఈవిడ …” నే చెప్పబోతున్నాను..
“ఆంటీ ! ఎలా ఉన్నారు” అంటూ జ్యోతిగారి దగ్గరికి పరుగెట్టింది.
jyoti valaboju 
“జ్యోతి వలబోజుగారు నీకు గుర్తున్నారా ..” అని అడిగా..
“అయ్యో.. ఆంటీ తెలియక పోవడమేంటి, నేనో సారి తప్పిపోతే నన్ను వెతికి పట్టుకున్నారు. చిన్నప్పట్నించి నా ఆలనా పాలనా చూస్తున్నారు.. అంతే కాదు .. మీ గురువుగారు కదా..” అని నాతో అని,
“ఏంటాంటీ .. ఈ మధ్య నన్ను మరచిపోయారు.. అస్సలు నన్ను పలకరించడం లేదు” అని గారాం చేసింది..
“నే మరచిపోలేదు, నువ్వే నన్ను మరచిపోయావు,, ఒక్కసారి కూడా మా ఇంటికి రాలేదు ఈ మధ్య” అన్నారు జ్యోతి.
అనగానే బ్లాగ్ నా కేసి తిరిగి “... చూడు, అంతా నీ మూలాన్నే  .. నువ్వే నన్నసలు ఎక్కడకీ తీసుకెళ్లటం లేదు .. చూడు పాపం, ఆంటీ ఎంత ఇదవుతున్నారో” అని నామీదకు యుద్ధానికొచ్చింది..
“సారీ జ్యోతి గారు,, ఏమిటో అసలు ఈ మధ్య మీ బ్లాగ్  చూడలేదు.. ఫేస్ బుక్ లోకి వెళ్తే, వెనక్కి రాలేము. అది అలవాటై పోయింది. అక్కడ అప్పుడప్పుడు మీరూ కనపడుతున్నారు..” అని సంజాయిషీ ఇచ్చుకున్నాను..
జ్యోతి గారు హుందాగా ఓ నవ్వు నవ్వేసారు..
“ఎలా ఉంది మీ బ్లాగ్ .. ఏవో వ్రాస్తున్నట్టున్నారు.” గంభీరంగా పలకరించారు..
“ప్రతి నెలా ఒకటో రెండో వ్రాస్తున్నానండి.. “
“ఎలా ఉంది ఫీడ్ బాక్ ?”
“ఫర్వాలేదండి.. ఈ మధ్య “హరాజీకాలు” అని ఓ ఆరు ఎపిసోడ్స్ వ్రాసాను.. చూసినవారు బాగుందని మెచ్చుకుంటున్నారండి.
“అదేమిటి “హరాజీకాలా” - అంటే?”
బ్లాగ్  కలగజేసుకుని “అంటే ఏమిటో  నాక్కూడా చెప్పటంలేదాంటీ .. సస్పెన్స్ ట.” అంది..
“ఓ .. సరే సరే  … బాగానే చూస్తున్నారన్నమాట.. కాని ఇవ్వాళ చూసాను, రీడర్ షిప్ బొత్తిగా 18000 కూడా లేదు..”అన్నారు జ్యోతి గారు..
నన్ను మాట్లాడనీకుండా బ్లాగే అందుకుంది.. “అంటేనండి, అప్పుడెప్పుడో నేను తప్పిపోయాను కదండీ, అప్పుడేమో మీరు పట్టుకుని తీసుకొచ్చారు కదండీ .. అప్పుడు మీటర్ ఆగిపోయిందండి..”
“అవునండి, నిజానికి దగ్గర దగ్గర 40వేలైందండి ..”అన్నాను నేను.
“గుడ్.. అయినా నాలుగేళ్ళు పూర్తయింది కదా.. ఈ పాటికి సంవత్సరానికి పాతిక వేలు చూసుకున్నా, లక్ష దాటాలి. మీరు వ్రాస్తారు  కదా .. బాగా వ్రాయండి మరి ..”
జ్యోతిగారిలో ఆ బూస్టింగ్ .. ఆ ఎంకరేజ్ మెంట్ .. అవే ఆవిడ స్పెషాలిటీ…

సరే వచ్చిన వాళ్ళదగ్గరకి తీసుకెళ్లి, ఒక్కొక్కరినే చూపించా ..
“ఈయన జోస్యుల, జర్నలిస్ట్” అన్నా
“తెలుసు, నీ పోస్ట్ బాగుందని చెప్పి చాలామందిని పరిచయం చేసారు కదా” అంది..
“ఈయన డి.యస్. సుబ్రహ్మణ్యం గారు, ఈయనా ఒక జర్నలిస్ట్”
“మీ రామాయణం చదివాను అంకుల్  .. చాలా చాలా బాగుంది..”అందరూ తెలిసినట్టే మాటాడుతోంది.  
“ఈయన రామనారాయణ గారు, మరో జర్నలిస్ట్”
“నీకు ఆపరేషన్ అయినప్పుడు గొప్ప కవరేజ్ ఇచ్చారు ఈయనే కదా, కదా అంకుల్” అంది.
“అవును.”అనక తప్పింది కాదు.. 
చిన్నారి  బ్లాగు మెమరీ నాకుకళ్లు చెమరుస్తున్నాయి  ..
“ఈయన వేపా, సుభాష్, పఠానేని, జనార్దన్,”
అంటుండగానే.. “నమస్తే అంకుల్స్, మీరందరూ వెంట వెంటనే మీ వ్యాఖ్యలు పెడ్తారు, దాంతో నాకు వెయ్యేనుగుల బలం వచ్చేస్తుంది.” మా బ్లాగుకి కవిత్వం కూడాను ..
“మాధురీ ఆంటీ ! మీరూ వచ్చారా ?” నే చెప్పకుండానే పలకరించేసింది బ్లాగ్..
తర్వాత శ్రీనివాస రెడ్డిగార్ని చూపించాను ..
“ఏంటి అంకుల్ .. బోస్టన్ నుంచి నా పుట్టిన రోజు కోసం వచ్చారా” .. అని
“అంకుల్ మీ తొలిపూజ పుస్తకం చాలా బాగుంది. తిరుపతి వెంకన్న బాబు గురించి చాలా బాగా వ్రాసారు.. వింటుంటే ఏడుపొచ్చేసింది..” అని కళ్ళు తుడుచుకుంది.
“చూడు ఈయన శివకుమార్, లండన్ నుంచి వచ్చారు.. అలాగే మాచిరాజు లలితా ఆంటీ సింగపూర్ నుంచి వచ్చారు.
అదిగో గీతా, భాస్కర్, న్యూ జర్సీ నుంచి వచ్చారు.వాళ్లు కూడా  చిన్న బాబుని, పాపను తీసుకొచ్చారు. ”
బ్లాగు అందరికీ వినయంగా నమస్కారాలు చేసి పలకరించింది.      
“గీతా ఆంటీ మీ పాప చాలా క్యూట్ గా ఉంది.. ఏం పేరు ?” అడిగింది బ్లాగు..
“శ్రీ హసంతిక” అని చెప్పారు గీత ..
“నవ్వుల పాప కదా? సరిగ్గా సరిపోయింది” అని నవ్వుతూ చెప్పింది.
ఈలోగా కె.వి. శాస్త్రి గారొచ్చారు.. “ఏంటంకుల్ ..ఇంత లేటా ?” అంటూ ,
“నా బ్లాగు చూసి వెంటనే పలకరిస్తారు మీరు, మీరే ఫంక్షన్ కు లేట్ గా వస్తే ఎలా అమ్మా..”
“లేదమ్మా, పూనే నుంచి ఫణిబాబుగారొస్తానన్నారు.. మళ్లీ ఆయనే  ఫోన్ చేసి రావటం లేదన్నారు.. ఆయనకోసం వెయిట్ చేసి చేసి, చివరికి లేట్ గా బయల్దేరా..”
“ఇక మొదలెట్టేదామమ్మా.. ఇప్పటికే ఆలస్యమయింది..” అన్నాను..
“మరి బులుసు అంకుల్ రాలేదు .” అంది బ్లాగు..
“కాని ఆయన ఫోన్ కు కూడా దొరకలేదు.. ఇండియాలో ఉన్నారో లేదో మరి ?”
బులుసు సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య కలవటంలేదు.. అప్పట్లో మా ఇంటికి కూడా వచ్చారు.. మంచి మిత్రులు..
“ప్రసాద్ గారు అమెరికాలో ఉన్నారు .. గ్రీటింగ్స్ పంపారు”.. అనిబ్లాగ్ తో  చెప్పా.
“విజయవాడ అంకులే కదా, నాతో ఫోన్ లో మాట్లాడారు”అని బ్లాగ్ అనగానే, అవాక్కయ్యాను.  
“అదిగో సుబ్బారావు అంకుల్ వచ్చారు.. మంచి పద్యం వ్రాయండి అంకుల్” అని ఆయనదగ్గరికి పరుగెత్తింది బ్లాగు..
(ఇంకా చాలామందిని ప్రస్తావించాలి అని ఉంది.. కాని స్థలాభావం..)
“రండి పార్టీ స్టార్ట్ చేద్దాం” అంటూ కేక్ కట్ చేయాడానికి కదిలింది, ఐదో ఏడాదిలోకి ప్రవేశించిన నా  బ్లాగ్..