Pages

Tuesday, November 29, 2011

కాశీ ప్రయాణం - ముందు బృందావనం !









ఈ సంవత్సరం కూడా కాశీ యాత్ర చేసివచ్చాము... ఆ కారణం చేత బ్లాగులోకి రాలేదు... తిరిగి వచ్చాక బ్లాగు కోసం వెతికా. ""నీ బ్లాగు తీసివేయబడినది"" అని గూగులమ్మ ఉవాచ.. ఇది అన్యాయం అని ఆక్రోశించా... ఆక్రందనకు జాలిపడినదై... పాపం మళ్ళీ గూగులమ్మే..."ఇలా రా అబ్బీ" అంటూ వెతుక్కునే మార్గం దగ్గరుండి చూపించింది ఆ దారమ్మట వెళ్ళి మరల బ్లాగు పునరుద్ధరించుకున్నా ...మీతో మరల ఇలా ముచ్చటించుకునే భాగ్యం పొందా...

యాత్ర ఎందుకు ? అంటే కారణాలు చాలా ఉంటాయి. మీకు మల్లేనే నాకూ ఏవేవో చూడాలని ఉంటుంది. ....డా లని ఉంటే సరిపోదుకదా, సరిప డా టైమ్ ఉండాలి ...సరిప డా పింగులుండాలి ...నాలాంటి వాడికైతే సరిప డా ఓపికా ఆరోగ్యమూకూడా ఉండాలి ...అవన్నీ సరిప డా సర్దుకుని బయలుదేరాము.
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారు "నారద భక్తి సూత్రాలు" విషయంగా బృందావనంలోనూ, "సూతసంహిత" విషయంగా కాశీలోను ప్రవచనాలు ఇస్తున్నట్టు తెలిసింది. అలాంటి పవిత్ర క్షేత్ర నేపథ్యంలో ఆ విషయాలు బాగా ఒంట పడతా యేమో ...ఏమో అని బయల్దేరాము.. నేను మా ఆవిడాను. మాతో పాటు మా బంధువులు కొందరు మాతో రావడానికి ఇష్ట పడి వస్తామన్నారు.. దానివలన మేం కష్ట పడేదేముంది అని సరే అన్నాము.. ఎలాగా అటే వెడ్తున్నాం కదా అని ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం కూడా మా దర్శనక్షేత్రాల లిష్టులో కలిపాము ...సరే రాజమండ్రినుంచి, వైజాగ్ నుంచి, హైదరాబాదునుంచి విజయవాడ జేరి కనక దుర్గమ్మను దర్శించాము.. విజయదుర్గ "విజయోస్తు" అని దీవించింది.. ఆ దివ్యానుభూతితో మా యాత్ర శుభారంభించాము. మా బ్యాచి పన్నెండుమంది గ్రాండ్ ట్రంకు ఎక్స్ ప్రెస్ లో మధుర బయల్దేరాం.....

ముందు బృందావనం... 29 అక్టోబర్, నుండి 2 నవంబర్, 2011 వరకు "నారద భక్తిసూత్రాలు" గురువుగారి ప్రవచనం.. ఈ కార్యక్రమాలు వనమాలి ట్రస్టు, తిరుపతి వారు ఏర్పాటు చేసారు. అక్కడ వసతి భోజన సదుపాయాలు కూడా వారి నిర్వహణే... వారు వందమంది పైనవచ్చారు. అందరమూ హితాశ్రమంలో బస చేసాము.. గురువుగారి ప్రవచనాలు అక్కడే... ప్రవచనాలతో తడిసిన మనస్సులతో బృందావనవిహారిని అన్వేషిస్తూ బృందావనంలో తిరిగేవాళ్లం. "ఆయన ఈ చర్మ చక్షువులకు కనపడడు లోపల చూడండిరా" అన్నట్టుగా అక్కడ కోతులు కళ్ళజోడులు పట్టుకుపోతాయి... వాటిని సంరక్షించుకుంటూ తిరగడం. ... పరమ భక్తుడైన నారదమహర్షి ఈ భక్తి సూత్రాలను - భక్తి రూపమైన బృందావనంలో వ్రాసారట.. భక్తి ఎక్కడ ఉంటుందో రాధమ్మ అక్కడ ఉంటుంది. బృందావనంలో ఎక్కడ చూసినా రాధే... రాధే....రాధే.... ఏ గోడమీద చూసినా "రాధే....రాధే.... ఏ వాహనం వెనుక చూసినా రాధే....రాధే.... ఎవరు పలకరించినా రాధే....రాధే.... రిక్షావాలా తప్పుకోండి అనడు రాధే....రాధే.... బృందావనవాసులకు అలవాటైనది ఒక్కటే రాధే....రాధే.... కృష్ణుని ప్రేమ రాధ.. బాంకీ బిహారీ ఆలయంలో మూర్తి రాధాకృష్ణుల ఏక స్వరూపం... అక్బర్ ఆస్థానంలో ఉన్న అద్భుత గాయకుడు తాన్ సేన్... తాన్ సేన్ సంగీతాస్వాదనలో ములిగిన అక్బర్ చక్రవర్తి "మీ గురువుగార్ని చూడాలని ఉంది" అన్నాడట. "ఆయన ఎక్కడకీ రారు. నిరంతరం బృందావనంలో కృష్ణ భక్తిలో మునకలువేస్తూ ఉంటారని చెప్తే చక్రవర్తి తానే బృందావనం వచ్చి ఆ మహానుభావుని గానామృతానికి ముగ్ధుడయ్యాడట... తాన్ సేన్ గురువుగారి సమాధి "నిధువన్" అనే వనంలో ఉంది. రాధకృష్ణులా సంగీత చక్రవర్తి సంగీతానికి ముగ్ధులై ఏక మూర్తిగా ఈయన ఒళ్లో పడ్డారుట. అదే ఇప్పుడు ఆలయంలో అర్చిస్తున్న బాంకీ బిహారి. ఆ నిధువన్ లో ఇప్పటికి రాసలీల జరుగుతూ ఉంటుందట... రాత్రి ఎనిమిది తర్వాత ఆ వనం తలుపులు మూసివేస్తారు. ఈ లోగా అక్కడ రాధాకృష్ణుల శయనమందిరాన్ని భక్తి నిండిన హృదయాలతో చక్కగా అలంకరిస్తారు... సుగంధాలీనే పన్నీరు అత్తరులతో పరిమళింపజేస్తారు.... చక్కటి మిఠాయిలు పళ్ళెరాలలో ఉంచుతారు. ఆ చుట్టూ ఉన్న భవనాలలోని కిటికీలు ఎనిమిది తరవాత మూసి మరునాటి ఉదయంవరకు తెరవరు... మరునాటి ఉదయం నాలుగున్నరకు భక్తులతో సహా అందరూ వచ్చి చీపుళ్ళతో ఆ తోటంతా శుభ్రపరుస్తారట.. మిఠాయిలు ఎవరో తిన్నట్టు, పక్క నలిగినట్లు, భక్తులకు గోచరమవుతుందట. అక్కడ కృష్ణ సాన్నిధ్యంలో తిరిగిన గోపికల శరీరంనుండి జారిన ఆభరణాదులు కూడా చూసినవారున్నారట.... మరొక వనం "సేవాకుంజ్".. ఆ లీలా మానుషవిగ్రహుడు రాధమ్మకు అక్కడ సేవ చే్స్తాడట..అలాగే "వంశీ వట్".. ఆ చెట్టుక్రింద మురళిగానం విన్నవారున్నారట ..మాకు ఇంకా బాగా నచ్చినది మరింతగా మనస్సు కరగింపజేసినది--- "తటియాస్థల్".. మహర్షులు అక్కడ మహావృక్షాలుగా వేల వేల సంవత్సరాలనుండి తపస్సు చేసుకుంటూ ఉన్నారుట. ఆ ప్రాంతానికి ఇప్పటికీ విద్యుచ్ఛక్తి లేదు.. నూనె పోసిన ప్రమిదలు వెలిగిస్తారు.. మేము చీకటి పడ్తున్న సమయానికి వెళ్ళాం.. శుక్లపక్షం ... అష్టమి తిధి.... ఆ వెన్నెల వెలుగులో,,దీపాల కాంతుల్లో ఆ వృక్షాల నడుమ తిరుగాడడం ఒక ఆనందానుభూతి... మహర్షులు ధ్యానంలో దర్శించే పరమాత్మ ఉనికితో ఓ అద్భుత వాతావరణం అక్కడ నెలకొన్న అనుభూతి అది. అక్కడ ఉండే స్వామీజీ ఆ నిశ్శబ్ద వాతావరణంలో ధ్యానం చేసుకుంటున్నారు.. ఆ చీకటివెలుగుల్లో స్వామీజీ దృశ్యాదృశ్యంగా కనపడుతుంటే వారి సన్నిధిలో భగవన్నామం మననం చేస్తూ ఉంటే ఏదో తెలియని ఆనందం... "బర్సానా".. రాధమ్మ పెరిగిన చోటు చూసాం.. "నందగాఁవ్ - దాన్నే రమణ రేటీ".అంటారు. రమణ్ రేటీ అంటే రమణీయమైన మట్టి అని అర్థంచెప్పారు ..అక్కడ కృష్ణుడు గోపబాలురతో కలసి ఆటలాడే వాడు., చల్దులు పంచేవాడు.. ఆ అద్భుత భావంతో భక్తులు తన్మయులై ఆటలాడారు.. పాటలు పాడారు,, నృత్యం చేసారు.. మట్టిలో పొర్లారు.. ఆబాల గోపాలం అక్కడ తమని మరచిన తమకంతో కేరింతలు కొట్టారు... మధురానగరంలో దురాక్రమణలకు గురై కొంత మిగిలిన బాలకృష్ణుని జన్మ స్థలి ... చూసాము... కారులో కూర్చుని గోవర్థన గిరి పరిక్రమ చేసాము.. కొండ ముందు భాగం "ముఖారవిందం" కూడా చూసాము. అక్కడ ఎంతోమంది మట్టిలో పొర్లుతూ ప్రదక్షిణ చేయడం చూసాము.. వారి భక్తికి చేతులు జోడించక ఉండగలమా ? భావనా గమ్యుడు భగవంతుడు... "కలడు కలండనువాడు కలడో లేడో " అంటే దొరకడు.. "నీవే తప్ప ఇతఃపరంబెరుగ"నంటే కనికరిస్తాడేమో... ఏమో....... బృందావన విహారిని మనసారా సేవించుకొని 4వ తేదీ పాట్నా ఎక్స్ ప్రెస్ లో కాశీ బయల్దేరాం...



Monday, November 21, 2011

about maalika the web magazine

magazine.maalika.org క్లిక్ చేయండి... ఒక ఆసక్తికరమైన పత్రిక చూడొచ్చు...హాస్యం, రాజకీయం, ఆధ్యాత్మికం,అవీ ఇవీ అంటూ అనేక అంశాలపై చాలా రచనలతో ఇప్పటికి మూడు సంచికలు వచ్చాయి... అయ్యో చూడలేదే అని ఇది అవకండి... ఈ మధ్యనే దీపావళి సంచిక వచ్చింది. మరి వెంటనే చూడండి. చక్కగా స్పందించండి... ఇదంతా మీరెందుకు చెప్తున్నారా అనా మీ సందేహం. అవునా? అమ్మో మీరు చాలా తెలివైనవారు. ఇట్టే ఆలోచించేస్తారు... అసలు విషయమేమిటంటే నా రచనలు కూడా ఉన్నాయండి... అంచేత ప్లీజ్ చదవండి.. నా నటనతో వీడియో కూడా ఉంది.. చూడండి,, చూసి స్పందించండి.. అన్నట్టు మీరూ వ్రాయొచ్చు... ఆ వివరాలు కూడా కావాలంటే మాలిక ఆమూలాగ్రం చదవాల్సిందే... సో స్టార్ట్.