Pages

Friday, February 24, 2012

రాజమండ్రి గురించి... నాకు తెలిసినంతా కాదు; నేను చూసినంతా కాదు.. కూసింత

   
రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం... ఎందుకు ?
ఆదికవి నన్నయ్యకు ఇష్టం, మొదటి తెలుగునవల వ్రాసిన కందుకూరికిష్టం, కథాచక్రవర్తి శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రికిష్టం, గయోపాఖ్యానం వ్రాసిన చిలకమర్తికి, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరివారికి, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగార్కి, వారబ్బాయీ - మరో హాస్యరచయిత రాధాకృష్టగారికి, ఆంధ్రపురాణ గ్రంధ రచయిత, మరో నన్నయ్య అనదగ్గ మొన్నమొన్నటి మా మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారికి... ఇంకా... ఇంకా.... ఇంకా,,,,,,
ఎంతమందికండీ వీరందరికీ ఇష్టం కదా...అందుకనో ......... ఇక్కడివాడినే కనకనో--- నాకు మా రాజమహేంద్రవరం మీద మక్కువ... ఇక్కడివాళ్ళు కానివాళ్ళు కూడా ఇక్కడికొచ్చి .. నచ్చి.... ఇష్టపడి సెటిల్ అయిపోయినవాళ్ళున్నారు. ...వాళ్ళు కూడా ఇష్టపడ్తారు మా రాజమండ్రిని ..... మీకూ ఇష్టమే అయి ఉంటుంది...లేపోతే ఇంతదూరం వచ్చి ఇది చూస్తారా..?
ఆ నన్నయ్యగారి దగ్గరనుంచి... మా మధునాపంతులవారిదాకా ఈ నగరం అనేక మార్పులు చెందినా... ఆరుద్రగారు చెప్పినట్టు వేదంలా ఘోషించే గోదావరి శృతిపేయంగా ఇప్పటికీ తన వేదనాదంతో  విందు చేస్తోంది... అమరధామంలా శోభించే     రాజమహేంద్రి నయనానందకరంగా ఇప్పటికీ భాసిస్తోంది.ముందు నేను విన్నవి కొన్ని... ఇక్కడి మార్కండేయస్వామి వారి ఆలయం పురాణప్రసిద్ధి గల ఆలయం.. అక్కడి నుంచి చూస్తేగోదావరి     గట్టుకన్నా ఊరే ఎత్తుగా ఉండేదట.. ధాన్యం బస్తాలతో నిండిన ఎడ్లబండిమీద బస్తాల పైన కూర్చున్న చిన్నవాడికన్న ఎత్తట... నాకు తెలిసి     మార్కండేయుని గుడి ఎత్తుగానే     ఉండేది.. అప్పుడు ఎక్కి వెళ్ళేవాళ్ళం--ఇప్పుడు దిగి వెడ్తున్నాముకదా?
1 టౌన్ పోలీసు స్టేషన్ ఉన్న సెంటర్ అప్పట్లో అదే  నగరానికి వ్యాపార కేంద్రం.. కూరలగాయల మార్కెట్ కూడా అప్పట్లో ఇక్కడనే ఉండేది..         ఇప్పుడున్న ఊర్వశీ ధియేటర్ సెంటరులో చాలాకాలం గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది.. ఆ హాస్పిటల్ జైలున్నచోటకి మారాక   కూరలమార్కెట్ ఆ స్థలంలోకి మారింది.. ఆ పోలీస్ స్టేషన్ ప్రక్కనున్న పెద్దమసీదు ఉన్నచోట వేణుగోపాలుని ఆలయం ఉండేదట.
పెద్ద ఆనపకాయకు ఒక ఏగాని ఇస్తే తిరిగి ఆ కూరల ఆసామీ మనకు ఒకటో రెండో గవ్వలిచ్చేవాడట ..అంటే గవ్వకు కూడా అంత విలువ.. "గుడ్డి     గవ్వ విలువ చేయవనే" నానుడి తెలుసుకదా..  మూడు గవ్వలు ఒక ఏగాని లేదా పైస (ఇప్పటి నయా పైసలు కావు.) మూడు పైసలు ఒక     "కాని"/"డబ్బు". "డబ్బు" అంటే గుండ్రంగా ఉండే రాగి నాణెం.. "కానీ" అన్నదానికి చిల్లుకూడా ఉండేది.. ఆ చిల్లువల్ల రాగి ఆదా చేయాలనేమో.     దాన్నిబట్టే మినప్పిండి ఆదా చేయడానికి చిల్లుగారె సృష్టించారేమో.. ఏమో మరి...రెండు కానులు ..అర్థణా; రెండు అర్థణాలు ఒక అణా... పదహారు     అణాలు ఒక రూపాయి...
 గాంధీగారి చితాభస్మాన్ని రాజమండ్రి తీసుకువచ్చినప్పుడు, ఆ ఊరేగింపులో నాన్నగారు, చండ్రుపట్ల హనుమంతరావుగారు, మార్ని  నరసన్నగారు ఇంకా పెద్దలు చాలామంది ముందు వరసలో ఉన్నారు... ఐదేళ్ళున్న నేను మా సందు మొగదల నించుని చూడ్డం ఇంకా లీలగా గుర్తు.
 రాజమండ్రి అనగానే అప్పట్లో చాలామంది వరదరావు ఇడ్లీ అనేవారు..  - ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు కమలాకరరావు గారి తండ్రి..వరదరావుగారు. హోటల్ ఇండస్ట్రీ. మాడర్న్ హిందూ హోటల్ గా ప్రారంభించి... శాంతి నివాస్, శ్రీ నివాస్ హోటల్స్, కోర్టుల్లో కాంటీన్, రెండు రైల్వేస్టేషన్స్ లోనూ కాంటీనులు.... సుఖనివాస్ అని ఓ లాడ్జ్ వారి యాజమాన్యంలో అలా అలా వచ్చాయి.వారు వారి కుటుంబ సభ్యులు స్వయంగా పర్యవేక్షించేవారు.. వరదారావుగారి ప్రోత్సాహంతో కర్ణాటక దేశంలోని వారి బంధువులుకూడా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డారు.  దామోదరరావు హోటల్ అని కోటగుమ్మం సెంటర్ లో ఒక హోటల్ ఆ బంధువులదే.
రాజమండ్రిలో శ్రీ వరదరావుగారు ఒక ప్రముఖ వ్యక్తి.. వారి గురించి నే విన్న ఓ సంఘటన. ఒకసారి విద్యార్థులుగా కనపడ్తున్న ఇద్దరు చిన్నవయస్కులు వీరి హోటల్ కు వచ్చి భోంచేస్తున్నారుట. కౌంటర్ లో శ్రీ వరదరావుగారు ఉన్నారు.. అందులో ఒక కుర్రవాని భోజనమైంది కాని రెండవ కుర్రవాడు కావలసివన్నీ అడిగి వేయించుకుని చాలా సేపు తిన్నాడట..  తృప్తిగా భోంచేసాక వెళ్ళిపోతుంటే వరదరావుగారు పిలిచారు.
"ఎవరు బాబూ మీరు ?"
"వేదపాఠశాలలో చదువుకోడానికి వచ్చాము"
"ఎక్కడ ఉంటున్నారు..భోజనం సంగతేమిటి ?"
"మకాము స్థిరమైంది.. భోజనానికి #వారాలకి చెప్పుకోవాలి"
"అక్కరలేదు...మీరున్నన్నాళ్ళూ మా హోటల్ కి వచ్చి భోంచేయండి.. ఏమీ ఈయనక్కరలేదు." అని చెప్పి వరదరావుగారు నమ్మకమైన తన సర్వర్స్ లో ఒకర్ని పిలిచి
"వీరెప్పుడు వచ్చినా భోజనం నువ్వే వడ్డించి పెట్టు.. నలుగురిలోనూ పెట్టకు, లోపలి గదుల్లో పెట్టు.." అని చెప్పారట... అదీ రాజమండ్రిలో కనపడే అమ్మగుండె...
    (#అప్పటి రోజుల్లో వారానికి ఒక ఇంట్లో చొప్పున ప్రతిరోజు ఎవరో ఒకరు పేదవిద్యార్థులకు భోజనం పెట్టే సంస్కృతి ఉండేది.. మా ఇంటికి కూడా     రావడం నాకు గుర్తు.. ఇప్పుడు ఎక్కడా కనిపించటంలేదు...)
పుష్కరాలు వస్తే ప్రతి ఇంట్లోనూ వారి వారి స్తోమతలకు మించి కనీసం రోజుకి పదిమందికైనా ఆతిథ్యం ఈయడం రాజమండ్రిలో చూస్తాము..     డొక్కా సీతమ్మగారు...మా గోదావరి జిల్లా ఆడపడుచు ... ప్రాతః స్మరణీయురాలు  ఆవిడకు తెలిసినది ఒకటే... వచ్చినవాళ్ళకి నిత్యమూ     లేదనకుండా వండి తృప్తిగా భోజనం పెట్టడం.. అదీ ఇక్కడి సంస్కృతి...
   
 రాజమండ్రిలో నాకుతెలిసిన రోజుల్లో అంటే 1955 నుంచి గుర్తుచేసుకుంటే చాలామందికి కూడా గుర్తొచ్చేవి ముచ్చటించుకుందాం...
   
 అప్పట్లో శెట్టి అని పేరుగల కానిస్టేబుల్. (పేరు అదే అని విన్నాను). కానిస్టేబుల్ కి కాకీ నిక్కరు, కాకి సగంచేతులచొక్కా నెత్తిమీద టోపీ   అవి  యూనిఫాం.. టోపీ అయితే రకరకాల షేపులు మారి ప్రస్తుతం ఉన్న దశకు చేరింది.. ఆ రంగు ఎరుపు.. ఇప్పటి రంగు ..వదిలేయండి. ఈ శెట్టి గారి కాకీ యూనిఫాం గంజిపెట్టించేవాడేమో స్టిఫ్ గా ఉండేది.. కాలికున్న బూట్స్ చక్కగా పాలిష్ చేయబడి నిగనిగలాడుతూ ఉండేవి..     ఆతడు టక టకానడుస్తుంటే పరిగెత్తినట్టే... విజిల్ నోటిలో సైడుగాపెట్టి తమాషాగా ఊదేవాడు.. ఆతడు డ్యూటీలో ఉంటే సందడే సందడి..  రిక్షాల  వాళ్ళు రూల్ కు వ్యతిరేకంగా తిప్పుతున్నారంటే ఒక్కటే పరుగు.. వెళ్ళి సీట్స్ తీసి పట్టుకుపోయేవాడు... మాటలాడ్డం లేదు... వెనకాల ఆ రిక్షా     డ్రైవరు     పరుగెత్తేవాడు..     వాడి తప్పు తీవ్రతను బట్టి కొంచెం దూరం పరుగెత్తించడమో... కాసేపు ఉంచడామో చేసి అప్పుడు ఇచ్చేవాడు.. కేసులు     సాధారణంగా వ్రాసేవాడు     కాదు.. శెట్టిగారి మాటలు తమాషాగా ఉండేవి.. మా కుర్రకారుకి అతను పట్టుకుంటే బాగుణ్ణు అనుకోవడం ఉండేది.. ఓ     సారి ఒక హైస్కూల్ విద్యార్థి రాంగ్ సైడులో సైకిలు త్రొక్కుతున్నాడని పట్టుకున్నాడు..
    "చదువుకుంటున్నవానిలా ఉన్నావు... రాంగ్ సైడులో వెళ్ళెదవేమి ?"
    "లేదండీ వెళ్ళలేదు..."
    "ఏమేమీ.. వెళ్ళలేదా... చూస్తే బ్రాహ్మణకుమారునిలా ఉన్నావు.. మీరే అబద్ధమాడితే లోకం తలక్రిందులైపోతుంది నాయనా!" అని తను ఉన్న     టాఫిక్ ఐలాండ్ చుట్టూ మూడుసార్లు పరుగెత్తి... అప్పుడు సైకిల్ తీసుకువెళ్ళమన్నాడు.. ఆ కుర్రాడు ఆనందంగా శిక్ష పూర్తిచేసి సైకిల్ పట్టుకు     వెళ్ళాడు..
 చీకటిపడ్డాక ఓ సారి మా ఫ్రండూ నేనూ చెరో సైకిల్ పై వస్తున్నాము... ఒక సైకిల్ కు లైటు ఉంది, ఒకదానికి లేదు. మమ్మల్ని ఆపాడు.  కాసేపు  ఎగాదిగా చూసి.." ఏమండీ.. రెండు సైకిళ్ళకు ఒక లైట్ చాలనుకున్నారా ?
అట్లు కుదరదే ?".  చేసినతప్పుకన్నా ఆతడు పట్టుకున్నాడనే     ఆనందం     మాకు ఎక్కువగా ఉంది.. నిజం.. ఓ వార్నింగ్ ఇచ్చి సైకిళ్ళు నడిపించుకు  పొమ్మన్నాడు.
    ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యాలి కాని చీటికిమాటికీ శిక్షించడం సరికాదనే ఆ శెట్టిగారిలోని భావన అభినందనీయం.. కదా ?

    రాజమండ్రిలో గుర్తించదగ్గ మరో వ్యక్తి... కిళ్ళీ అమ్మే అతడు.. కోటగుమ్మందగ్గరనుండి బయలుదేరి ఆ చివరదాకా ఒక లుక్కేస్తే ఎక్కడో అక్కడ     ఇతడు తారసపడేవాడు. ముతక ఖద్దరు బట్టలు భుజాన ఒక ప్రక్క ఖండువా  ఇంకో భుజంపై గుడ్డ సంచి, దానిపై శివ పరివారం బొమ్మ..     ఎడమచేతిలో ఒక పెట్టె.. ...అదో చిన్నసైజు పాన్ షాపు.  అది కొంచెం ఎత్తుగానే ఉండేది.. దానికి పైభాగంలో     మూడు ప్రక్కల అద్దం.. క్రింద    భాగంలో ఒకటో రెండో సొరుగులు.. ఆ అద్దాల వెనుక ముందు సగంలో తమలపాకులు... వెనుక సగభాగం     కిళ్ళీలు తయారు చేయడానికి     కౌంటర్     అన్నమాట. క్రింద సొరుగులు స్టాక్ కోసం... గులాబులు చల్లేవాడు.. అగరొత్తులు వెలిగించేవాడు...  ఆ కౌంటర్ పై, నిలుచుని చక్కగా     తయారుచేసిన ఆ కిళ్ళీఇంచుమించు అన్ని షాపులవాళ్ళూ కొనేవారు.. ఆ కిళ్ళీ; అతడి మాటలు ఒకదానికన్నా ఒకటి రుచిగా ఉండేవి..
    "వాగ్భూషణం భూషణం అన్నారు పెద్దలు...మన మాట్లాడుతుంటే పరిమళాలు గుభాళించాలండి.. అంతేకాని దుర్గంధం రాకూడదండి.. అంచేత     మా కిళ్ళీతో నోరు పరిమళింప జేసుకోండి.. ఇది మామూలు కిళ్ళీ కాదండీ... ...(తన చంక సంచి అలవోకగా ముందుకు వచ్చేట్టుచేసి అంది     మీదున్న శివ పరివారపు బొమ్మను చూపి...యాక్షన్ అన్నమాట) సాక్షాత్తూ ఆ పరమశివుని ప్రసాదమండి..ఇలా నోటిలో వేసుకుంటే     అలా     కరిగిపోతుందండి... అందరూ     అర్థణాకిస్తుంటే నీ కిళ్ళీ     ఖరీదు ఎక్కువంటారండి చాలామంది.. మా కిళ్ళీలో వేసే సరుకులు చాలా     ఖరీదైనవండి.. తుని నుంచి వచ్చిన లేత     తమలపాకులండి ఇవన్నీ వాడడం వలన ఎక్కువఖరీదు .. అలా కొందరన్నా నేను     పట్టించుకోనండి..     ఎందుకంటే మీ వంటి విజ్ఞులు (ఎదురుగుండా నోరెళ్ళబెట్టి చూస్తున్న మనల్ని చూపేవాడు) అలాంటి మాటలు     పట్టించుకోరండి..     ఎందుకంటే ఇది కైలాసనాథుని ప్రసాదమండి...". ఇలా సాగేది అతని ప్రసంగం.. ఆ మాటలు యథాతథంగా వ్రాయలేను... కానిఅందర్నీ     ఆకర్షించేవాడు... అతని దగ్గర కిళ్ళీ కొనడమంటే అతని మాటల రుచి వలననే.

    మరో వ్యక్తి... గోసేవా పరాయణ రామేన ఆదినారాయణగారు... ఇతను చిన్నపిల్లలకు వచ్చే అనాస వ్యాధికి మందులు కూడా ఇచ్చేవారు...     గోదావరి స్టేషన్ సమీపంలో ఉన్న తెల్లటి శివుని విగ్రహం (అప్పట్లో లేదా విగ్రహం) దగ్గరనుంచి కళా నికేతన్ కు వెళ్ళే రోడ్ మొదట్లో..  రోజూ రిక్షా     మీద పచ్చగడ్డి మోపులు తెచ్చి.. అక్కడ నిలబడి ..."దాఁ...దాఁ..." అనిపిలిస్తే ఆవులు పరుగెత్తుకొచ్చేవి... వాటికి ఈ గడ్డి వేసేవాడాయన... అవి     ఆనందంగా గడ్డి తింటూ ఉంటే చూడ ముచ్చటగా ఉండేది... తర్వాత కుక్కలకు రొట్టెలు వేసేవాడు... బోల్డు కుక్కలు.. అక్కడున్న యాచకులకి     పైసలిచ్చి, తినడానికేమైనా ఇచ్చేవాడు... ఈ దృశ్యం నేను హైస్కూల్లో చదువుకునే రోజుల్లో తరచు చూసేవాడ్ని...

    అప్పుడూ ఇప్పుడూ కూడా రాజమండ్రిలో ఆధ్యాత్మిక భావన వెల్లివిరుస్తూ ఉండడం కనిపిస్తుంది... గిన్నెలకు మాటులు వేసే అతను వచ్చేవాడు..     అతనిపేరు రామదాసు... "మాట్లోయ్"   అని రెండుసార్లు అరచి నాలుగుసార్లు "హరేరామ హరే కృష్ణ" అని గట్టిగా అరచేవాడు... "మధుకరం"     అని రాత్రిళ్ళు వచ్చే యాచకులు,  తెల్లగా తోమిన ఇత్తడి పాత్రలకు విబూతి, కుంకుమ అలది యాచనకువచ్చే  కాశీ కావడివాళ్ళు హరిలో రంగ     హరి అని వచ్చే హరిదాసులు.. అందరూ భగవన్నామ స్మరణే...
    మాదిరెడ్డి నరసింహారావు & సన్స్ అని ఫర్నిచర్ షాపు.. వీరు అప్పట్లో ఆంధ్రా యూనివర్సిటీ పరిథిలోని కాలేజీలకు, అలాగే స్కూల్స్ కు     ఫర్నిచర్ సప్లై చేసేవారు.. ఆ ప్ర్రొప్రయిటర్ పెద్దాయన.. కుమారులు షాపు చూసుకుంటుంటే ఆయన ఓ పడక్కుర్చీలో కూర్చుని ... తన దగ్గరకు     వచ్చిన చిన్నపిల్లలచేత రామనామం చెప్పించి... ఏ శనగపప్పో, చాకలెట్టో     ఇచ్చేవారు.
    శివరాత్రికి, కార్తీక మాసం, గ్రహణ సమయాలలోను.. గోదావరి ఘాటులదగ్గర సందడే సందడి... ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసంకాని, ఒక సంగీత     కచేరిగాని, ఒక సాహిత్య సభకాని... రాజమండ్రిలో చాలా అద్బుతంగా జరుగుతాయి...
    ఆధ్యాత్మిక భావాలతో, సాహిత్య సంగీత హృదయాలతో భాసించే రాజమండ్రి... అందరికీ ఆమోదకరమైన వాణిజ్యవ్యాపారలతో విలసిల్లే రాజమండ్రి     అంటే నాకు చాలా ఇష్టం...
    నేను చెప్పగలిగినవి కొన్ని వ్రాసాను... గోదావరి అంత విశాలంగానూ, పొడవుగానూ, లోతుగానూ, గంభీరంగానూ, గలగలమంటూ సందడిగానూ     ఉన్న రాజమండ్రి చరిత్ర... ఎంత వ్రాసినా తక్కువే..."జననీ జన్మభూమిశ్చ .... ఏదో అభిమానం... నా రాజమండ్రి     గురించి నాదనుకున్న బ్లాగులో     నాకోసం వ్రాసుకుంటున్నాను... మన రాజమండ్రి గురించి అనుకునేవాళ్ళకు నచ్చినా చాలు... ధన్యుణ్ణి....