చదివినతర్వాత ......
హాసం క్లబ్, హైదరాబాదు వారి కార్యక్రమానికి హాజరై రాగానే పెట్టె తెరిచి మా ఆవిడ అక్కడ నేనందుకున్న మెమెంటో అవీ చూడ్డం మొదలెట్టింది. మరో కవరుచ్చుకుని లోపల అల్మారాలో పెడ్దామని నేను తీసుకెళ్తుంటే...
"అదేమిటి ?" అంది..
"పూతరేకులు"అన్నా..
"ఎక్కడివి ?"
"మా మీటింగు ప్లేస్ కు వచ్చి పాపం అభిమానంగా మన సుధామ ఇచ్చారు"
"ఎవరు ? ఆ రేడియో ఆయనా... మీకు సుగర్ అని ఆయనకు తెలియదా ?"
"ఈమధ్య ఇంటర్నెట్ ద్వారానే కాని ఇంటికెళ్లడాలు లేవు కదా.. బహుశా తెలిసుండదు."
"అయితే అవన్నీ లాగించేస్తారా ?"
"కావాలంటే నీకూ ఇస్తాలేవోయ్..."
"చాలు సరసం.. మీరు వాసనకూడా చూడొద్దు..."
అప్పటికింక చాలనిపించింది.. సరసంకాదు.. సరససంభాషణ... "సుధామగారు వ్రాసిన "పూతరేకులు" సర్దిన జోక్స్ బాక్స్ అమ్మా.. ఇది.. ముందు నేను చదివి తరువాత నీకు ఇస్తాను.. .." అన్నా ... పాత మూడ్ లోనే ఉందికనుకేమో నా ప్రతిపాదన వీటో చేయలేదు..
ఏక బిగిని చదివాను...
పడి పడి నవ్వించే జోకులు లేవన్నారు.. కాని కొన్నింటికి బాగా నవ్వుకున్నాను. అయినా ముళ్లపూడి వారన్నట్టు జోకులు నలుగురులో ఉన్నప్పుడు ఒకలా నవ్విస్తే .. ఒక్కరం ఉన్నప్పుడు ఒకలా నవ్విస్తాయి కదా...
"పెళ్ళికి ముందు.. తర్వాత" పైనుంచి క్రిందకి , క్రిందనుంచి పైకి చదివించారు.. చాలా బాగుంది.
"లేట్ కమర్ ", "పర్లేదు",.. "మాటమారింది" ఇలా ఎన్నని చెప్పను..ఎన్జాయ్డ్.. క్షీరాయనమః.. ఎక్కువ నవ్వించింది.,,
ప్రశ్న: సగం యాపిల్ పండులాగా ఆమె దగ్గర కనిపించేది ఏది ?
జవాబు: మిగతా సగం యాపిల్ పండు
(లౌక్యంగా ఉంది జోక్)
మీరు ముందు మాటల్లో చెప్పినట్టు కొన్ని యస్సెమ్మెస్ లుగా సర్కులేట్ అయ్యాయి.. మళ్లీ ముళ్లపూడినే కోట్ చేస్తే జోకులు ఒరిజినల్ గా కొన్నే మిగతావి వాటి ఎక్స్టెన్షన్ అంటారు కదా ?
సజెస్టివ్ జోకులు నాకు చాలా ఇష్టం. అవి మీ పూతరేకుల్లో పుష్కలంగా కనపడ్డాయి. "బిల్డింగ్" "ఆలస్యం" "పర్లేదు" "సెంటేన్సు". "ఆఫీసు" ఇలా చాలా ఉన్నాయి. ఆలస్యం మరీ బావుంది.
"అయిపోయింది కదా అని ఏడవకు. అయిపోయింది కదా అని సంతోషించు.." మాటల మతలబు గొప్పగా ఉంది.
చిన్న సోత్కర్ష: ఈ మధ్య శశికళగారి బ్లాగు పోస్ట్ కు నా అభిప్రాయం రాసా..." మొదట్లో మగాళ్లు సాధించినట్టు కనిపించినా చివరికి సాధించేది ఆడవాళ్లే"నని.. మాటల మడత అనొచ్చేమో కదా. ?
"పెయింటింగ్" కార్టూనిస్టులను బాగా పరిచయం చేసారు. అలాగే హింగ్లీషు: ముఖారి మొదలైన రాగాలను బాగా వాడారు...
పూతరేకుల్లో... రేకుల కోమలత్వం, జీడిపప్పు కమ్మతనం, పూసకట్టిన నేతి ఘుమ ఘుమ.. గట్టిబెల్లం మాధుర్యం అన్నీ కలిపి వండిన అందం కనపడ్తున్నది. తినే ఉబలాటంలో పెదవి కొరుక్కునే చురకలూ ఉన్నాయండోయ్...
బియ్యంప్పిండి పల్చగా ఉడికించి నిప్పుల్లో బాగా కాలిన గుండ మీద పల్చాతి పల్చగా పరిచి... ఆ రేకుల్లొ సున్నితంగా (లేకపోతే విరిగిపోతాయి) కూర్చి మడతలు పెట్టి.. పొరల మధ్యలో తేనె పూత, బెల్లప్పొడి చేర్పు, జీడిపప్పు పొడి. జల్లి.. తినడానికి కష్టం తెలియకుండా రెడీ చేస్తే.. అవి ఎవరైనా తిని ఎంజాయ్ చేస్తే చేసినవారు కష్టాన్ని మరిచిపోతారు. అవునా...
అంచేత పూతరేకులు కొనుక్కోండి... తెచ్చుకు మనసారా ఆస్వాదించండి...ఫోన్ నెం: 9848276929 కు ఫోన్ చేసి యాభైరూపాయలు మీవి కాదనుకుంటే మీరు తినగలిగినన్ని పూతరేకులు మీకు చేరతాయి.. సుగర్ ఉన్నవాళ్లుకూడా హాయిగా తినవచ్చు.. ఆనందంగా నవ్వుకోవచ్చు.
అక్కడక్కడ కనపడిన కోటబిల్ కోట్స్ అనదగ్గ ఓ కోట్ తో ముగిస్తాను..
"గొప్ప స్నేహితులు జ్ఞాపకాల్లో భాగం
చెరిపేయలేదు ఎప్పుడూ కాలం
నీలాంటి స్నేహితానికి వేసిన గాలం
తీపిజ్ఞాపకాల అదృష్టజాలం."
శలవు.