Pages

Tuesday, October 22, 2013

గురువయ్యూర్



క్షేత్ర దర్శనం - మూడవ (ఆఖరి) భాగం


గురువయ్యూర్ చుట్టుప్రక్కల
నమో నారాయణాయ నమః
గజ కేసరి అనేఏనుగు గురువాయురప్ప ఊరేగింపులో సేవ చేసేది. అది మరణించాక దానిని సమాధి చేసారు.. అక్కడ ఆ ఏనుగు విగ్రహం...

ఎన్నిసార్లు చూసినా తనివితీరని స్వామిని మళ్లీ మళ్లీ చూసాము. ఇక గురువాయుర్ లోను .. ఆ చుట్టుప్రక్కల ఉన్న విశేషాలను కూడా చూసాము..’

దగ్గరలోనే పునత్తూర్ కొట్ట .. మా తావునుండి సుమారు 3 కి.మీ.లో ఉంది. అక్కడ గురువాయుర్ దేవస్వాం వారి నిర్వహణలో ఒక ఏనుగులశాల ఉంది. విశాలమైన తోటలో సుమారు 60 లేక 70 ఏనుగుల సంరక్షణ అక్కడ జరుగుతున్నది. ఏనుగుల సంరక్షణకై సలహా సంప్రతింపులకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఆఫీస్ ఒకటి  ఆ లోపల ఉంది. ప్రత్యేక ఉత్సవాలలో .. కేరళలో ఏనుగులను అలంకరించి ముందు నడిపిస్తారు.. అలాగే నిత్యమూ గురువాయురప్ప మూడు నాలుగు సమయాలలో శ్రీ వెల్లి అనే తిరువీధి ఉత్సవంలో ఏనుగు మీదనే కదులుతాడు కదా. అలా గురువాయుర్ దెవస్వాంలోనూ, ఇతర ఆలయాలకు ఈ గజరాజులు వెళ్తూ ఉంటాయి. అలా స్వామి సేవ చేసిన ఒక గజరాజు చనిపోతే దానికి గురువాయుర్ లో ఆలయానికి దగ్గర్లో సమాధి కట్టి ..  పెద్ద ఏనుగు విగ్రహం పెట్టారు.  ప్రతి సంవత్సరము ఏనుగులకు పరుగు పందాలు పెట్టి నెగ్గిన ఏనుగుకు ఈ గజరాజు పేర అవార్డ్ ఇస్తారట.

గురువాయుర్ ఆలయానికి ఒక కి. మీ. దూరంలో మమ్మియూర్ శివాలయం ఉంది. అది చూసాం.. ప్రాచీనమైన ఆలయం. చక్కటి దీపాలంకరణతో శోభిస్తున్నది. కేరళలో దీపానికి చాలా ప్రత్యెకత. సాయం సంధ్యలో నియమంగా ప్రతి ఇంట్లోనూ దీపం పెట్తారు. ప్రతి ఆలయం లోనూ ఎత్తైన దీపం కుందెలు, వరుస దీపాలకు ఏర్పాటు- విధిగా ఉంటుంది. నేను చూసిన ఆలయాలలో సభావేదికలు కనపడ్డాయి.  ఆ వేదికల మీద ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిత్యమూ జరుగుతూ ఉంటుంది. మేము వెళ్ళిన శివాలయం లో  అవకాశం ఇస్తే మా ఆవిడ  రెండు పాటలు పాడింది .. సంస్కృత పదాలతో ఉన్న ఒక పాటను పాడినప్పుడు వారు  ఆస్వాదించారు. కాని తెలుగు పదాలతో పాడిన  పాటకు వారి బుర్రలు ఊగలేదు.

3 కి. మీ దూరంలో ఉన్న అతి ప్రాచీనమైన చౌయల్లుర్  ఆలయం చూసాం. కేరళ బాలాజీ గా చెప్పబడే వేంకటాచలపతి ఆలయం, పార్థసారథి ఆలయం, నారాయణి ఆలయం చూసాం. మహా మహిమగల చాముండేశ్వరి ఆలయం చూసాం. బలరామునికి కట్టిన  గుడి చూసాం. అది ప్రస్తుతం పునర్నిర్మాణం చేస్తున్నారు.

మరో ప్రముఖ దేవాలయం… వడక్కునాథన్ శివాలయం.. ఇది త్రిసూర్ లో ఉంది. సాధారణంగా రైలులో ప్రయాణం చేసేవారు త్రిసూర్ లో దిగి అక్కడనుంచి బస్సులో నలభై అయిదునిముషాల ప్రయాణ దూరంలో గురువయ్యూర్ చేరుకోవచ్చు. .  మొన్న వచ్చినప్పుడు మేమూ త్రిసూరులో దిగి గురువయ్యూర్ వెళ్లాము..ఒకరోజు గురువయ్యూర్ నుంచి త్రిసూర్ వచ్చి మేము స్వామిని దర్శించుకున్నాము. ఈ ఆలయం ఒక ఎత్తైన గుట్టపై, ఊరుకి మధ్యస్తంగా ఉంది. చుట్టూ చక్కని ఆకుపచ్చదనం అందంగా కనపడుతుంది. పరశురామ క్షేత్రంగా ఈ ఆలయం చెప్పబడుతున్నది. అలాగే శంకరాచార్యుల తల్లి ఆర్యాంబ ఈ స్వామిని సేవించి, పుత్రుని బడసినట్లు చెప్తారు. ఆమె కాలడి నుండి ఈ క్షేత్రానికి నడచి వచ్చెడిదట. ఈ ఆలయ ప్రాంగణంలో .. వడక్కునాథుడు, విష్ణుమూర్తి, హరిహరుడు .. ఆలయాలు కలిగి ఉన్నారు. ప్రధాన ఆలయమైన వడక్కునాథుడు.. శివలింగం.. దానిపై నిత్యము ఆవునెయ్యి అభిషేకం చేస్తారు.. అది తీయరు.. అలా గడ్డకట్టుకుపోయి ఉంటుంది. శతాబ్దాలుగా ఆ శివలింగ మూర్తిని చూసినవారు లేరు. ఘనీభవించిన నేతి పిరమిడ్ లా ఉన్నది మాత్రము చూడగలము .. నిత్యమూ గర్భగుడిలో వెలుగుతున్న దీపాల వేడికి కాని, తీవ్రవేసవిలోని ఎండవేడికి గాని ఆ నేయి కరగదట. పైనుంచి గోకిన నేయినే ప్రసాదంగా ఇస్తారు. అంత నేయితో కప్పబడినా.. అక్కడెక్కడా చీమలు చేరవు. అది మరో విశేషం.. తెల్లవారుఝామున అయితే నేతితో కప్పబడిన మూర్తిని చూడగలమట. మేము పొద్దెక్కి వెళ్ళాము, అంచేత భూషణాలంకృతుడయినాడు వడక్కునాథుడు దర్శనమిచ్చాడు, అక్కడ ప్రసాదంగా నేతి అప్పాలు అమ్మారు. చూడ్డానికి అంత బాగో లేదు కాని తింటే బాగానే ఉన్నాయి..

ఆ మరునాడు సుమారు వారం రోజులుగా సాగిన మా గురువయ్యూర్ యాత్ర పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం .. గురువయ్యూర్ నుంచి ట్రైన్ లో త్రిసూర్ 35 నిముషాలు … దారి పొడుగుతా చక్కని పచ్చటి తోటలు.. త్రిసూర్ లో మద్రాసు ఎక్స్ ప్రెస్ ఎక్కి చెన్నై చేరాము అక్కడనుంచి రాత్రి,  సర్కార్ లో బయల్దేరి మరునాటికి రాజమండ్రి చేరాము. .

మంజీరం ముంజనాదైరివ పదభజనం  శ్రేయ ఇత్యాలపంతం
పాదాగ్రం భ్రాంతి మజ్జత్ ప్రణతజన మనోమందరోద్ధార కూర్మమ్।  
ఉత్తుంగాతామ్రరాజ న్నఖరహి మకర జ్యోత్స్నయా చాశ్రితానాం
సంతపధ్వాంత హంత్రీం తతిమనుకలయే మంగళామంగుళీనామ్ ॥

గురువాయురప్పా ! నీ చరణములను సేవించుటవలన ఎల్లరకును మోక్షముతో కూడా .. సర్వశ్రేయస్సులు కలుగును-  
అని తెలుపునట్లు నీ కాలి అందెలు సవ్వడిచేయుచున్నవి. అజ్ఞానమనెడి మహాసముద్రమున మునిగియున్ననీ సేవకులను ఉద్ధరించుటయందు నీ పాదాగ్రభాగము పరమసాధనముగా విలసిల్లుచు, క్షీరసాగరమును మధించు సమయమున మందర పర్వతమును ఉద్ధరించిన కూర్మమును తలపింప జేయుచున్నది. నీ చరణ నఖ శోభలనెడి అరుణకాంతులు చంద్రకాంతులవలె నిన్ను ఆశ్రయించెడి వారియొక్క సంతాపములనెడి చీకట్లను పోద్రోలునవియై విలసిల్లుచున్నవి. అట్టి నీ పాదములను నేను భక్తి పూర్వకముగా సేవించుచున్నాను… (నారాయణీయము నుండి)



Monday, October 21, 2013

ఎన్ని కలలో … ఎంతెంత కలలో



 ఎన్ని కలలో … ఎంతెంత కలలో
                                              ----------------------------------------

                                                                                     రచన: డి.వి. హనుమంత రావు.


ఒక సర్వ సంగ పరిత్యాగి కి కల వచ్చింది.
ఆ కలలో ఆ సాధు మహారాజ్ కు బంగారు రాశులు కనపడ్డాయి..
ఏంచేసుకుంటాడు ఆయన సర్వ సంగ పరిత్యాగి కదా.
కలలో కూడా అంతంత బంగారు రాశులను చూడని ఆ సర్వ సంగ పరిత్యాగి,
కలలో చూసిన ఆ బంగారు రాశులను
కలలో కూడా   ముట్టుకోకుండా లోపాయికారీగా యువరాజావార్కి  కబురు చేరవేసాడు.

అప్పటికే హస్తినాపురి గద్దె నెలా ఎక్కాలా అని ఆలోచిస్తూ, కలలు కంటున్నారు యువరాజా వారు.  
యు.రా. వార్కి బంగారం(లాంటి) కబురు అందింది… ఆ బంగారు కల తనకెందుకు రాలేదా అని కొంచంసేపు సోచాయించి, ఇదేమైనా ప్రతిపక్షాల కుట్రా అని కూడా ఆలోచించిన వారై, ఎందుకైనా మంచిది అని లోపాయికారీగానే వెళ్లి బంగారు రాశులు ఎక్కడ ఉన్నట్టు కలవచ్చిందో తెలుసుకున్నారు.. అది ఏదో ఆలయ ప్రాంతం. అక్కడ తవ్వితే ఆ బంగారు రాశులు స్వంతమవుతాయి. కాని  గునపాలు,పారలు ఉపయోగించాలి,...
గుడి ప్రాంతం అంటే   .. మడిగా వుండాలి కదా .. తను సెక్యులర్.. పాపం  మడికి పనికి రాడు..
అదీ కాక, తనకు పెళ్ళంటే ఖర్మ కాలి అవలేదు కాని,  తను అప్పుడే తాత వయసుకు వచ్చేస్తున్నాడు. ఆ గునపాలు, పారలు పట్టుకుని శారీరక శ్రమ అంటే కష్టం.. అందుకని రాజమాతకు చెబ్తే సరి. ఆమె చూసుకుంటుంది..
ఆవిడదగ్గర ఎంత అడ్డమైన పనులున్నా చెప్పండమ్మా చేస్తామంటూ జుత్తూడిపోయినవారు, గెడ్డాలు మీసాలు పెంచుకున్నవారు  చాలా మంది ఉన్నారు… వాళ్లకి తనంటే కూడా చాలా వినయమూ భక్తీ కలవారు. .. అని బంగారం కబురు  రాజమాతకు చెప్పడానికి వెళ్లారు  యువరాజా వారు..  

అక్కడకు వెళ్లేటప్పటికి అక్కడ జైలు నుంచి వచ్చిన కిష్టన్నయ్య ఉన్నాడు..
” ఏంటన్నయ్యా ఇలా వచ్చావు.” అన్నారు  యు. రా.
“తమ్మూ ! నీ మీద నాకు చాలా కోపం గా ఉంది. “ అన్నాడు కిష్ట్
“ఏమైంది ?”
“ఎప్పటికైనా మనం మనం ఒకటి.. అలాంటప్పుడు ఎవరికో తిండి లేదని రాజమాత ఏడిచినారట  ?”
“అవును.. నేను.. అక్కడెక్కడో చెప్పాను కదా ?”
“అదే.. అదే… ఎక్కడో చెప్పడమేమిటి , నాకు చెప్పొచ్చుకదా ? ఎప్పటికైనా మనం మనం ఒకటి కదా?”
“నువ్వేం చేస్తావన్నయ్యా”
“ఏడుస్తుంటే ఓదార్చడంలో నేను చాలా పరిశోధన చేసాను, నేనొచ్చి క్షణంలో ఓదార్చగలను..ఆమాత్రం అమ్మని ఓదార్చలేనా.. ఎప్పటికైనా మనం మనం ఒకటి. నీకు తెలియదా?  “
“నిజమే అన్నా .. నువ్వెంతోమందిని  ఓదార్చావు కదా.. మరచిపోయాను, సారీ…”
“ఇక ఎప్పుడూ అలా చేయకు తమ్మూ,నా దగ్గర ఎప్పుడూ బిక్క మొహం రెడీగా ఉంటుంది. అదేసుకుని వెంటనే వచ్చెయ్యగలను.. ఎంత చెడ్డా మనం మనం ఎప్పటికైనా ఒక్కటే కదా..  “ అన్నాడు క్రిష్ట్.

సరే తాను విన్న బంగారు కల, ఆ అన్న ముందు చెప్పడమా మానడమా.. అని ఆలోచించారు యు. రా. వారు. లక్షలకోట్లు సునాయాసంగా  లాగడానికి ఎన్నో ఉపాయాలు తెలుసున్నవాడు, అనుభవజ్ఞుడు, కనుక చెప్తేనే మంచిది అని నిర్ణయించుకుని, రాజమాతకు  బంగారు రాశులు గురించి చెప్పారు.. యు.రా వారు…
“పవిత్ర ప్రదేశమంటున్నావు.. అక్కడ వారి సెంటిమెంట్ కు ఏమీ ఫర్వాలేదుగా మరి” అన్నారు రాజమాత.
”ఫర్వాలేదు మాతా,.. ఏదైనా తేడా వస్తే..మరల మనం కట్టించి ఇద్దాము..”
అన్నారు యు. రా.
కిష్ట్ అందుకుని..” కావాలంటే.. మా బామ్మర్ది ఉన్నాడు.. తనదైన శైలిలో ప్రార్థనా మందిరాలు అవీ కట్టించిన అనుభవమున్నవాడు, వాడిని రప్పిస్తాన”న్నాడు.

రాజమాత గారు వెంటనే కార్య రంగంలోకి దిగారు. చిరంజీవి చెప్పిన కల ఎపిసోడ్ తనలోనే దాచుకుని, మంత్రిపుంగవులకి పనులు పురమాయించారు. అధికారులకు ఆదేశాలందాయి.. క్రింద ఉద్యోగులు అనేకానేక సాంకేతిక కారణాలు చెప్పినా.. ఎవరికీ వినపడలేదు. ప్రతి పక్షాలలో కొందరు  ఇదేమి సెక్యులర్ దేశం.. అన్నారు…మరికొందరు మేము కొత్త ఊరు కట్టుకుంటాము,మాకు మేజర్ షేర్ కావాలన్నారు. మరికొందరు, అది మాద్వారా బడుగు వర్గాలకు పంచాలి.. అది మేం నొక్కుడంటున్నాము అన్నారు.. ఇలా అనేక విధంగా ముక్త కంఠం తో అందరూ   ప్రతిఘటించారు..
ప్రజలు వంటలు, వార్పులూ చేసి నిరసనలు తెలియజేసారు. బట్టలుతికి, ఆరేసి, మిరపకాయ బజ్జీలు వేసి, అర్థ గుండులు పావు గుండులూ చేయించుకుని నిరసనలు ఉవ్వెత్తున.. తెలియపర్చారు. దిష్టి బొమ్మలు అందమైనవి తెప్పించి అంత్యేష్టి క్రియలు చేయించారు. ఈ ఉద్యమ సమయాన కొత్త కొత్త నాయకులు పుట్టుకొచ్చారు. వారికి తొత్తుగా కొందరు నాయకులు పుట్టారు.

రాజమాత ఆలోచించారు. వృద్ధరాజమాత ఫొటోకు దండేసి.. నమస్కారము పెట్టి.. కళ్లు మూసుకుని ధ్యానం చేసుకున్నారు.. ఏమి స్ఫూర్తి పొందారో.. మంత్రివర్యులను కేకేసారు.. ఉద్యమాలలోకి చొచ్చుకుపొమ్మన్నారు. చొచ్చుకుపోయి విచ్చిన్నం చేయండి అన్నారు. బంగారం ఆలోచన  యువరాజా వారి డ్రీమ్ ప్రాజెక్ట్.  అని లోపాయికారీగా చెప్పారు.
వెంటనే హవేలీని నమ్ముకు బ్రతుకుతున్న  భజనపరులైన మంత్రిగణం.. “అమ్మమ్మా ..అతడే మా భావి మహరాజు.. “ అని వంగి వంగి దణ్ణాలు పెట్టారు, కళ్ల నీళ్లు కూడా పెట్టుకున్నారు..   తామూ ఉద్యమంలోకి రహస్యంగా చొరబడ్డారు..బజ్జీలు వేసే మూకుళ్ళు, చట్రాలు మాయంచేసారు. బట్టలుతికే బండలు మాయమయ్యాయి. పెద్ద నాయకులయితే లాభంలేదని, చోటా నాయకులను పిలిచారు.  సామ, ధన, లాభోపాయాలు ఉపయోగించారు..  అంతే… నిరసనకారులు ఐకమత్యంగా, మిగిలిన బజ్జీలపిండీ, ఉతకాల్సిన బట్టలు పట్టుకుని ఇళ్ళకు పోయారు.. చిరుగేతప్ప, బట్ట కనపట్టంలేదని .. బట్టలిచ్చిన ధర్మపత్నులు..పతులను .. ఉతికి ఆరేసి, ఇస్త్రీ చేసేస్తున్నారు. బొత్తిగా ఖారంలేని బజ్జీలను వేసారని పిండి తిని రుచి చూసిన  వారు  తమ అయిష్టాన్ని తెలియబరచారు.

అక్కడ కేంద్ర స్థానంలో గోతులు తవ్వడం యదేచ్చగా సాగుతోంది…బంగారు రాశులకోసం.  ఇది ఇలా ఉండగా  ఇంకా పలు ప్రాంతాలలో కళ్లు మూసుకుని సర్వసంగ పరిత్యాగులు నిద్ర పోతున్నారు… వారితో పాటు సర్వ సంగ భోగులూ కూడ నిద్ర పోడం మొదలెట్టారు, పక్కలో గునపాలు, పారలు రెడీగా పెట్టుకుని. -- బంగారు రాశులను కలలో కనడానికి. ఇక చూడండి… ఎన్నికలలో…  

Sunday, October 13, 2013

దసరా శుభాకాంక్షలు..


దసరా శుభాకాంక్షలు.. అందరికీ…


"…….విశ్వంలో మహాశక్తి పలువిదాలా వ్యక్తమవుతోంది. ఒక మహానది ఆరంభస్థానంలో సూక్ష్మంగా, క్రమంగా మహాగిరుల నుంచి దుమికే రూపంలో ఉగ్రంగా, మరొక చోట వేగంగా, ఇంకొకచోట సౌమ్యంగా, వేరొక తావున ప్రళయ భీకరంగా… ఇలా బహురూపాలతో కనబడుతున్నట్లే - ఆ శక్తి ప్రవాహం  ఉగ్ర, సౌమ్య, ఉభయ మిశ్ర రూపాలతో నిర్వహిస్తోంది. అందుకే ఆ శక్తిలో కాళీ, చండీ వంటి ఉగ్ర రూపాలు; గౌరీ, లక్ష్మీ వంటి సౌమ్య రూపాలు; వాణి, గాయత్రి వంటి జ్ఞాన రూపాలు.. ఎన్నోవైవిధ్యాలను అనేక దేవతాకృతులుగా అర్చిస్తున్నాము.

పోషించే శక్తి అన్నపూర్ణ, ప్రేమ శక్తి రాధ, రక్షించే శక్తి దుర్గ.....ఈవిధంగా మన పురాణ గ్రంధాలు, మంత్ర శాస్త్రాలు విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేశాయి........

....... - గ్రామదేవతల పూజలు, జాతరలు, బతుకమ్మ పండుగల వంటి సత్కర్మలు, చిందులు, పాటలు, సంబరాలు .. ఇవన్నీ ఒకే పరాశక్తిని ఆరాధించే అనేకమైన అందమైన పరంపరలు.

ఇన్ని వైవిధ్య భరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధంచేసుకున్న హైందవ ధర్మంలోని అద్భుతానికి జోహారులు ! శరదృతువు ఆరంభంలో తేటమనసుతో ఆ మహాచైతన్యాన్ని “అమ్మా!” అంటూ పిలిచి పూజించే నవరాత్రుల వేడుకలో, దేశమంతా పునీతమౌతున్నది.

హిమవత్పర్వతం జగదంబ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని వింధ్యవాసినికి నెలవుగా, చివరి భాగమైన మలయాళ ఖండాన్ని మలయాచల వాసిని భగవతికి తావుగా భావించిన శక్తి సంప్రదాయము… ఈ దేశపు ఆది, మధ్య. అంతాలని జగదంబ స్థానాలుగా పూజించడమే, అడుగడుగునా “శక్తి పీఠాల”ను ప్రతిష్టించుకుంది.

ఈ కారణం చేతనే ఈ దేశాన్ని తలచుకోగానే జగన్మాతృభావన పొంగుకువచ్చి ‘వందేమాతరం’ అని మోకరిల్లుతాం.

విశ్వజనీనమైన విశ్వజననీ భావానికి వందనాలు. ......."


(ఈ లోకమే అమ్మ స్వరూపం, అమ్మ స్వరూపమే ఈ లోకం.. ఎంత చక్కటి భావన;;;
ఈ సమన్వయం ..ఎవరు చేయగలరు  ఇంత చక్కగా…
సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు తప్ప. ..)
[బ్రహ్మశ్రీ సామవేదం వారి ‘ఏష ధర్మః సనాతనః’ నుండి సేకరించడమైనది.]

Saturday, September 28, 2013

గురువయ్యూర్



   గురువయ్యూర్....2.


 క్షేత్రదర్శనం-2


  ( రెండవ భాగము. )
(తృప్తిగా స్వామి దర్శనము.)



పఠంతో నామాని - ప్రమదభరసింధౌ
స్మరంతో రూపం తే - వరద ! కథయంతో గుణకథాః
చరంతో యే భక్తా - స్త్వయి ఖలు రమంతే పరమమూ -
నహం ధన్యాన్ మన్యే - సమధిగత సర్వాభిలషితాన్.
 
గురువయ్యూర్ దేవుడు.. గురువాయురప్ప.
చతుర్భుజుడైన నారాయణుడు. చిన్న విగ్రహము.
ఈ అర్చామూర్తిని స్వయముగా వైకుంఠనాధుడే బ్రహ్మదేవుని కోరికమేరకు, బ్రహ్మకు  ఇచ్చాడని ఐతిహ్యం.
బ్రహ్మదేవుని నుండి సుతపుడు అను మహర్షికి, తర్వాత కశ్యప ప్రజాపతికి ఆయనద్వారా క్రమంగా వసుదేవునికి వచ్చి .. 
ఆయా కాలాలో అర్చించబడింది. 
శ్రీ కృష్ణుడు ద్వారకలో ప్రతిష్టించి అర్చించాడు.

యుగాంతంలో ద్వారక మునిగిపోయే సమయంలో ఈ అర్చామూర్తిని ఉద్ధవునికిచ్చి “దేవగురువు బృహస్పతి ద్వారా దీనిని ఒక పవిత్ర క్షేత్రంలో ప్రతిష్టింపజేయమని” శ్రీకృష్ణుడు ఆదేశించాడు.
గురుడు వాయుదేవుని సహకారముతో, పరమేశ్వరుని సూచనమేరకు, పరశురామ క్షేత్రమైన అప్పట్లో అంబాపురం గా పిలువబడే ఈ క్షేత్రంలో ప్రతిష్ట చేసారు.

గురువు, వాయువు ప్రతిష్ట చేయుటచే స్వామి ‘గురువాయురప్ప’ గా పిలవబడుతున్నాడు. క్షేత్రం గురువాయుపురమయింది. అదే ఈ గురువయ్యూర్..
ప్రక్కన ‘రుద్రతీర్థం’ అనే పుష్కరిణి. అందులో శివుడు చాలా కాలము తపస్సు చేసాడట. ఈ పుష్కరానికి ఈ ప్రక్క గురువాయురప్ప, ఆ తీరాన మమ్మియూర్ లో పరమశివుడు కొలువైనారు. మమ్మియుర్ లోని  శివుని చూడకుండా గురువయ్యూర్ యాత్ర పూర్తికాదని చెప్తారు. అవకాశము లేనివారు గురువయ్యూర్ దేవళములో ఉన్న భగవతి అమ్మ ఆలయమునుండి ఈశాన్యదిశగా తిరిగి మమ్మియూర్ శివునికి భక్తితో అంజలి ఘటిస్తారు. అక్కడ ఆ సూచనతో  బోర్డ్ కూడా పెట్టారు.

అశ్వద్ధామ వేసిన బ్రహ్మశిరోనామాస్త్రం ఉత్తర, గర్భవిచ్చిత్తి చేయబోతుంటే ..
‘గతాగత ప్రాణుండై శిశువు చింతించు సమయాన’....  “గదజేబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని దుత్తుమురుగా భంజించి రక్షించు సదయుడు..”... అలా పరీక్షిత్తును రక్షించిన వాసుదేవుడు. దేవకీ, వసుదేవులకు జన్మించి దర్శనమిచ్చిన “...శంఖ చక్ర పద్మ విలాసుడు,  గంఠ కౌస్తుభ మణి కాంతి భాసుడు, కృపావిశాలుడూ ….” ఆ చతుర్భుజుడైన శ్రీ మన్నారాయణమూర్తియే ..

ఇప్పుడు  “శిరమున రత్న కిరీటము, కరయుగమున శంఖచక్ర ఘన భూషణములు, ఉరమున వజ్రపు బతకము దాల్చిన” గురువాయూర్ పురనాథునిగా గురువయ్యూర్ లో దర్శనమిస్తున్నాడు.

రూమ్ లో స్నానాదికములు  పూర్తి చేసుకుని, స్వామి దర్శనానికి లైనులో నించున్నాము. జనం బాగానే ఉన్నారు. మడత మడతలుగా వరుసలు, మొదట ఒక వైపుకి, మరల రెండో వైపుకి అలా అటూ ఇటూ కదులుతూ, మహా ద్వారము గుండా, లోపలకి ప్రవేశించాము. పద్దతిగా జనాన్ని వదలడమువలన ఎక్కడ తోసుకోవడం, తొక్కుకోవడం అనుభవమవలేదు. లైనులో వున్నవారు - విష్ణుసహస్రము కాని, నారాయణీయము కాని, ఇంకా ఏవేవో పుస్తకాలు చదువుతున్నారు. కొందరు “నమో నారాయణా “ అంటూ భక్తి ప్రకటిస్తున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న నారాయణీయము ఒక్కొక్క శ్లోకము అర్థంతో చదవడము మొదలెట్టాము .. రెండుగంటలకన్నా తక్కువ వ్యవధిలో దర్శనము పూర్తి చేసుకుని బయటికి వచ్చాము. దర్శనము తృప్తిగా లేదు. “ఇన్ని ఏర్పాట్లు చేసుకుని మేం వస్తే ఇంతేనా మాకు ప్రాప్తం” అని స్వామితో మౌనంగా చెప్పుకున్నాము.. విన్నాడా అన్నట్టుగా తర్వాత దర్శనాలు ఒకదానికన్నా ఒకటి ఆనందాన్ని కలిగించాయి.

గురువయ్యూర్ లో ’నిర్మాల్య దర్శనము’ చాలా ముఖ్యమని చెప్పారు. తెల్లవారఝామున మూడుగంటలకు ఆ దర్శనానికి అనుమతిస్తారు. ఆ దర్శనం చేసుకోవడానికి  ఒంటిగంటకే వరసలు కట్టేస్తారు. మేము వెళ్లిన మూడో రోజు ఆ నిర్మాల్య దర్శనానికని మేమిద్దరమూ తెల్లవారుఝాము ఒంటిగంటకు లేచి, ఒంటిగంటన్నరకు స్నానాలు చేసేసి లైనులోకి వెళ్లాము. మేము వెళ్లేటప్పటికే యాభై అరవై మంది అప్పటికే లైనులో ఉన్నారు.. ఆడవారికి  (బహుశా ఒంటరిగా వచ్చినవారు అయి వుంటారు) వేరే లైను ఉంది. కుటుంబాలతో వచ్చిన వారు మా లైనులో ఉన్నారు. రెండు గంటలు దాటుతుంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన నారాయణీయం శ్లోకాలు స్పీకర్ లో శ్రవణానందముగా  వినిపిస్తుండగా లైనులు కదిలాయి .. “శ్రీ కృష్ణం శరణం మమ” అని వినిపిస్తుండగా మహా ద్వారం సరిగా మూడు గంటలకు తెరిచారు..క్రమంగా గర్భాలయము చేరి,  స్వామిని దగ్గరనుంచి చూసాము. అదొక అద్భుత దర్శనము,
ఆనందమై పోయింది. నిర్మాల్యమంతా తీసేసిన మూల విరాట్టు.. స్నానానికి సిద్ధమైన పసిపిల్లవాని రూపంలో నేత్రానందముగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయన్న మాట. ఈ స్వామికి తైలాభిషేకం కూడా రోజూ చేస్తారట.

గురువయ్యూర్ ఆలయంలో పరిశుభ్రత, ఆచారము చక్కగా పాటిస్తారు. ప్రధాన అర్చకుణ్ణి ‘మేల్ శాంతి’ అంటారు. ఆ తర్వాత హోదాలవారిగా మిగతా అర్చకులు ఉంటారు. ‘మేల్ శాంతి’ మాత్రమే మూలవిరాట్ కు అర్చన చేస్తారు. ఆయన ఆరు నెలలకోసారి మారతారు. కావాలంటే కొన సాగవచ్చునట. అర్చనచేసిన కాలములో అంటే ఆరునెలలు ఆయన ఆలయములోనే ఉండాలి. కఠిన బ్రహ్మచర్యదీక్షలో ఉండాలి. ఆ యా సేవల నడుమ ఆలయ ప్రాంగణంలో ఓ మూల ఆయన విశ్రాంతిగా కూర్చుని ఉంటారు.. మన గమనించి చూడవచ్చు. సన్నగా ఎర్రగా, తెల్లటి పంచె పొందిక గా కట్టుకుని, చూడగానే నమస్కరించాలనిపించే విధంగా ఉన్నారు ఆ ‘మేల్ శాంతి’.

ఆలయ ప్రవేశము హిందువులకు మాత్రమే. మగవారు విధిగా ధోవతి కట్టుకోవాలి, పైన ఉత్తరీయము ఉండవచ్చు. పాంటులూ, బనీనులు చొక్కాల వంటివి అనుమతించరు. లుంగీలాగా పంచె కట్టవచ్చు కాని, గళ్లలుంగీలు పనికి రాదు. ఆడవారు సాంప్రదాయ దుస్తులనే ధరించాలి. ప్యాంటులు పైన లుంగీలు కట్టుకున్నవారు, తెల్లదొరలు ఎక్కడా కనపడలేదు.

‘శ్రీ వెల్లి’ .. స్వామి ఊరేగింపు. చాలా బాగుంటుంది. ఇక్కడ తిరువీథి ఉత్సవమది. ఆ ఉత్సవాన్ని మూడు సార్లు చూసే అదృష్టం కలిగింది.ఆ ఊరేగింపు ముందు “మేల్ శాంతి” నడుస్తారు. ఆయన మడికి భంగముకలుగకుండా రక్షణ వలయముగా అర్చకులు చుట్టూ ఉంటారు. ఆయన   ముందు పవిత్రజలాలను బలిపీఠంపై జల్లి నివేదన చేస్తారు. ఆలయం నలుమూలలా ఉన్న బలి పీఠాలపై జలం జల్లి పూలు పెడ్తారు . ఆయన వెనక నాదస్వరాది వాద్యములు వాయిస్తూ కళాకారులు. వారి తర్వాత ఆంగ్ల అక్షరము z ఆకారములో వంచబడిన వెండి ఊచలకు, వెండి జ్యోతులు తగిలించుకుని ఆ దీపాలతో మడిగా పది పదిహేను మంది బ్రాహ్మణులు.. ఆ వెనుక రాచ ఠీవితో .. మందగమనంతో స్వామి ఆస్థాన కరీంద్రుడు కదలుతాడు. . దానిపై ఉప పురోహితులు  స్వామి బంగారు ఉత్సవ మూర్తి ని పట్టుకుని, కూర్చుని ఉంటారు. చిన్న విగ్రహము. చూడముచ్చటగా ఉంటుంది. ఆ మదగజము ముచ్చటగా కదులుతుంటే “హరే రామ, హరే కృష్ణ” అంటూ వెనుకగా భక్తజనము కదులుతారు. ముమ్మారు ప్రదక్షిణాగా సాగిన తర్వాత ఆలయ ప్రవేశ ద్వారంవద్దకు రాగానే, ఆ మహా గజము వినయంగా కాళ్ళు మడచి కూర్చుంటుంది. స్వామి  ఏనుగుమీద నుంచి దిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఊరేగింపు పూర్తిఅయ్యేవరకూ  లోపలకి ఎవరినీ అనుమతించరు.
ఈ శ్రీవెల్లి ఉత్సవంలో   --హరే రామ, హరే కృష్ణా అంటూ ఒకసారి భక్తజనంలో కలిసి గజేంద్రుని అనుసరించాము. , మరొకసారి ముందునుంచి చూసాము, ఇంకొకసారి ఉత్సవమూర్తి ఆలయ ప్రవేశంచేస్తుంటే .. ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఉండడంవలన స్వామిని దగ్గరనుంచి చూసే అదృష్టం కలిగింది.

తులాభారము.. కోరికసిద్ధించిన భక్తులు వివిధ వస్తువులతో తులాభారము చేసుకుని స్వామికి సమర్పించుకుంటారు.. చాలా మట్టుకు వస్తువులు నిర్ణయించిన ధరకు దేవస్థానం ఏర్పాటుచేస్తుంది. పసి వారికి  అన్నప్రాసన చేసే పధ్ధతి కూడా ఉంది.

ఈ స్వామి అనుగ్రహముంటే ఎలాంటివ్యాధిఅయినా నయమవుతుందన్నది సత్యము. నారాయణ భట్టాద్రి అనే ఒక మహానుభావుడు పది హేనవ శతాబ్దంలో తన గురువుగారికి కర్మవశాత్తు కలిగిన పక్షవాతరోగాన్ని తనకు సంక్రమింప జేసుకుని, తననుండి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ స్వామిని ఆశ్రయించాడు. రోజూ ఇక్కడ “రుద్రతీర్థం”లో స్నానంచేసి, స్వామి ఎదురుగా కూర్చుని భాగవత కథను వేయి శ్లోకాలలో వ్రాసి స్వామికి వినిపించేవాడు. పూర్తయ్యేటప్పటికి నారాయణాద్రి రుగ్మత పూర్తిగా తగ్గిపోయింది. గర్భాలయములో నారాయణాద్రి కూర్చుని భాగవతం వ్రాసిన పదేశాన్నిసూచిస్తూ ఒక శిలాఫలకము కనబడుతుంది. అతడు వ్రాసిన గ్రంధము “శ్రీమన్నారాయణీయం”. వివిధ భాషలలో వ్రాసిన భావార్థంతో అది లభ్యమవుతున్నది.
నారాయణాద్రి అనే మహాకవి నారాయణుని గురించి వ్రాసి ఆ నారాయణీయునికే వినిపించిన మహా మహిమాన్విత గ్రంధమది. నిత్యమూ అది పారాయణచేసేవారెందరో ఉన్నారు. ఒకరోజు, నేనూ, మా శ్రీమతీ చెరో పుస్తకమూ పట్టుకుని ఆసాంతమూ చదివి స్వామికి నివేదించుకున్నాము.

ప్రాంగణంలోనే ఒక చోట బల్లపై శరీరంలోని వివిధ అంగముల వెండి రూపులు  ఉంచారు. ఏ అవయవమునకైనా అనారోగ్యము కలిగితే, దానికి సంబంధించిన రూపు  అడిగితే అక్కడ ఉన్న ఆసామీ మనకు ఇస్తాడు. అది తీసుకుని మన సమస్య స్వామికి నివేదించుకుని మనకి తోచిన సంభావన అక్కడున్న హుండీలో వేస్తే చాలు.  ఇంత ఇవ్వాలి -- ఇంతే   ఇవ్వాలి--- అనే ప్రశ్నలేదు. అక్కడేకాదు ఆ ఆలయములో ఎక్కడా “డబ్బు” పెట్టమనే  వారెవ్వరూ కనపడలేదు. వి.ఐ.పి.లు - ప్రత్యేక దర్శనాలు లేవు.. స్వామికి అర్చనలు అవుతూ ఉంటాయి, దర్శనాలు అవుతూ ఉంటాయి.

ఒకరోజు ఆయన ఎదురుగా కాస్సేపు నిలబడాలనే కోరిక బలంగా కలిగి,  అలాంటి సేవ ఉందా అని అడిగితే లేదన్నారు.. ఆ మర్నాడు మేము సీనియర్ సిటిజన్స్ లైనులో లోపలకి వెళ్లాము. ప్రత్యేక సమయాలలో సీనియర్ సిటిజన్స్ ను అనుమతిస్తారు. ఆ లైనులోకి వెళ్లడమే, వయస్సు ప్రూఫ్ పట్టుకెళ్లాంగాని, ఏ చెకింగూ లేదు. ఆ నిజాయితీ మనకుండాలి. ఆ లైనులో గర్భగుడిలోకి వెళ్ళాము . అప్పుడే తిరువీధి నుండి స్వామి వేంచేసారు.వెండి జ్యోతులు పట్టుకు ముందునడచిన వారిని ముందు దర్శనానికి అనుమతించారు.. ఆ సమయానికి మేము స్వామికి ఎదురుగా వచ్చాము. మా ముందు ఒక మంటపము, అక్కడనుంచి స్పష్టంగా స్వామి కనపడుతూ ఉంటారు.  అక్కడ మమ్ము నిలబెట్టేసారు.. ముందువారు కదిలెదాకా..కుడి వైపు తిరిగి,అలా ఎడమ వైపు,మళ్లీ ఎడమవైపు వెళ్తే స్వామికి ఎదురుగా దగ్గరగా వెళ్తామన్నమాట. అదేకదా నిన్న మేము కోరుకున్న దర్శనం. ఎంత దయ స్వామిది అనిపించింది. ఆయన అనుగ్రహముతో పది పదిహేను నిముషాలు ఆయన్ని ఆనందంగా చూసే భాగ్యం కలిగింది, కోరుకున్న విధంగా.. తీరుబడిగా… తృప్తిగా దర్శించుకున్నాము.


(మూడో భాగం త్వరలో )













Saturday, September 21, 2013

హింది-తెలుగు హాస్య యుగళ,,,



రాజమండ్రిలో హింది-తెలుగు హాస్య యుగళ కవితా సమ్మేళనం.


నిన్న అంటే 20-9-2013 న రాజమండ్రీలో హిందీ,తెలుగు యుగళ హాస్య కవితా సమ్మేళనం జరిగింది.. చాలా బాగా జరిగింది. అక్కడ చాలా హాస్యం పండింది. హైదరాబాదు వాసులకు సుపరిచితులైన… నరేంద్రరాయ్ (చిత్రకారులు కూడా), వేణుగోపాల్ భట్టర్ , పండిట్ రామకృష్ణపాండే, వహీద్ పాషా ఖాద్రీ పాల్గొన్నారు.  ఇందులో భట్టార్ గార్కి
ఫేస్ బుక్ ఉందట.  అందులో వారు జోకులు పెడ్తూ ఉంటారట. స్థానికులైన కొందరు తెలుగు కవులు వారితో కలసి, హిందీ తెలుగు యుగళ హాస్య కవి సమ్మేళనం  జరిపారు. విని కొన్ని పాయింట్స్ లా వ్రాసుకుని కూర్చుకున్నా..వారి భావాన్ని, వారి భాషాసౌందర్యాన్ని పట్టుకునేటంత భాష నాకు రాదు. నాకొచ్చిన కొద్దిపాటి హిందీ పరిచయంతో అర్థంచేసుకునే ప్రయత్నం చేసా.. పట్టుకోగలిగిన పంచ్ కి రూపకల్పన చేసి హాస్యం ఆవిష్కరించబోయా.. ఇందులో  అంటె నేనందించే ప్రయత్నంలో చేసిన తప్పులు నావి .. హాస్యం వారు పండించిన తీరు అభినందనీయం.. ఆ జోకులు మీతో పంచుకోవాలని..

ఒక పిల్లికి ఎలుకల మంద ఒకటి కనపడింది. పిల్లికి అమితానందం అయిపోయింది. ఒక్కదాన్నైనా పట్టి విందు చేసుకోవాలని వాటి వెంట పడింది.పిల్లీ, అండ్ ఎలుకలు - టామ్ అండ్ జర్రీల్లా - పరుగెత్తాయి. అందులో వయోభారంతో ఒక ఎలుక వెనుకబడింది.. ప్రాణభయం ఎక్కువయింది. తెగించింది. వెనక్కి తిరిగి పిల్లిని చూసి కుక్కలా భౌ భౌ అని మొరిగింది.  నోటిదాకా వచ్చేసిన కూడు పట్టుకోబోతున్న పిల్లి ఖంగు తింది.. ఆగింది .. తటపటాయించింది.. వెనక్కి తిరిగి పరుగో పరుగు.. ఊహించని ఈ పరిణామానికి వృద్ధ మూషికానికి మతి పోయింది. పారిపోయిన మిగతా మూషికాలు వెనక్కి వచ్చి ఈ ముసలి ఎలుకను అభినందించాయి.. అప్పుడు ఆ వృద్ధ మూషికం …”ఇతర భాషలు నేర్చుకోవడం వలన ఆపదలనుండి గట్టెక్కొచ్చు.. తెలుసా”... అని పెద్ద కన్నంలోంచి కలుగులోకి పోయింది.

మారిపోతున్నాయి ఫేషన్లు. ఒక ఆధునిక యువతి జేబురుమాలు అంత సైజు చక్కని గుడ్డ తెచ్చి దర్జీకి ఇచ్చి జాకెట్ కుట్టమంది. ఆ దర్జీ అడిగాడు “అమ్మా మిగిలిని ముక్క ఏం చేయమంటారు “ అని…

నెమలి కన్ను నెత్తికెక్కినా శ్రీ కృష్ణుడు అందగాడే…

ఇదివరలో గడియారాలు లేవు.. అయినా మంచి పనులు చేయడానికి సమయముండేది..
ఇప్పుడు అందరికీ గడియారాలున్నాయి.. సమయం మాత్రం లేదు..

హాస్య కవులు ఒక పిచ్చాసుపత్రిలో కార్యక్రమం చేస్తున్నారు. కవి తన కవితలు  వినిపిస్తున్నాడు. వేదికమీదనున్న మరియొక కవి దగ్గరకొచ్చి ఒక పిచ్చాడు చెవి కొరికేస్తున్నాడు. ఏదో చెప్పేస్తున్నాడు. ఏమిటంటే.. “నేనూ చెప్పగలను.. కాని నన్నిక్కడ బంధించి లోపల పెట్టారు. వీణ్ణిలా బయటొదిలేసారు.”

ఒక బిజీ రోడ్. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఆగమని రెడ్ సిగ్నల్ పడింది. ఒక యాచకుడు కారుదగ్గరికి వచ్చాడు. ముష్టి కోసమా కాదండీ బాబూ…  “ఒన్ డే మాచ్ స్కోర్ ఎంత” తెలుసుకోడానికి .. అది క్రికెట్ ఫీవర్.

ఎప్పుడూ టి.వి.కి అతుక్కుపోతున్న గృహిణి తో విసిగెత్తి భర్త టి.వి. అమ్మేస్తానన్నాడుట. అయితే నిన్నొదిలేస్తున్నానందావిడ.

కవి సమ్మేళనానికి బయల్దేరుతున్న ప్రేక్షకునికి ఒక సాధువు దర్శనమిచ్చాడు. ‘“అక్కడ చక్కగా తప్పట్లు కొట్టు.. అలా కొట్టలేకపోతే వచ్చే జన్మలో ప్రతి ఇంటిముందునుంచుని తప్పట్లు చరుస్తూ అడుక్కునే జన్మఎత్తాల్సి వస్తుంది.. చూసుకో” అని హెచ్చరించాడు. ఇక కొట్టక చస్తారా..

ఒక తెలుగు కవి చెప్పింది.. “హిందీవాళ్లకు ముందు చూపెక్కువ.. హిందిలో చదువుకు “శిక్ష” అంటారు. తరగతికి “కక్ష” అంటారు. ఇప్పుడు నిజంగా అదే జరుగుతోంది.”

“ఆ దరిద్రపు సీరియల్.. ఆ అమ్మాయికి కడుపొచ్చింది అని సంవత్సరమయింది చెప్పి. ఇప్పాటి దాకా పురుడు రాలేదు.. వింతకదా “ఒక బుల్లితెర ప్రేక్షకుని ఆవేదన.

“राज नीति तॊड्ती.. साहित्य जॊड्ती” … అంటే రాజకీయం తెంపుతుంది, సాహిత్యం కలుపుతుంది.

ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. అందులో ఒక చిత్రకారుని చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఆ చిత్రకారుని మిత్రుని చూడబోయాడు. కొన్ని చిత్రాలు అర్థంకావటంలేదు. అది మాడర్న్ఆర్ట్  అన్నాడు మిత్రుడు. ఒక చిత్రం చూపించి ఇదేమిటి. అని అడిగాడు ఈ అజ్ఞాని.
అది “సీతాపహరణం”.
ఇక్కడేమీ కనపడటం లేదు.. రాముడేడి ?”
“మాయ లేడిగా వచ్చిన మారీచుని వెనక వెళ్లాడు”
“లక్ష్మణుడేమయ్యాడు “
“అన్నగారి ఆర్తనాదం వినపడి వెతుక్కుంటూ పోయాడు.”
“మరి సీత”
“రావణాసురుడు ఎత్తుకుపోయాడు”
“రావణుడు కూడా కనపట్టంలేదు”
“”లంకకు పోయాడు”
“అయితే నువ్వు గీసిన చిత్రమేంటి. ఒక గీత గీసి రామాయణం అంతా అంటున్నావు.”
“ఆ గీత లక్ష్మణరేఖ అర్థం చేసుకో.. అదే మాడర్న్ఆర్ట్. “
ఆ ఆర్టిస్ట్ అంతర్జాతీయ ఖ్యాతి వహించిన చిత్రకారుడట.  

తమాషా ఏమిటంటే పాండే, భట్టర్ ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నట్టు జోకులు పండించారు. చాలా బాగుంది.

ఒక విమాన ప్రయాణంలో భారతీయుని ప్రక్కన చైనా వాసి. దోమ చైనా వానిని కుట్టబోయింది. ఒక దెబ్బ కొట్టి చచ్చిన దోమని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత భారతీయుని పై వాలింది. అతన్ని కుట్టగానే…

ఇలా భట్టర్ చెప్పగానే పాండే “ఈయన మార్వాడీ అండి. అందుకని ఆ దోమను చంపి .. ఆ చైనా వానికి అమ్మేశాడు” అని కొస మెరుపు ఇచ్చాడు.

అనగానే భట్టర్ “ఒకసారి మిత్రుడు పాండే ముఖం మీద వాలిందండి ఒక దోమ. అది చూసి అతని భార్య లాగి లెంపకాయ కొట్టింది. ఉలిక్కి పడి ..
” ఎందుక్కొట్టావు” అన్నాడు..
“దోమ” అంది భార్య ..
” అయినా అంత గట్టిగా కొట్టవెందుకు “అన్నాడు పాండే..
“నే త్రాగావలసిన నెత్తురు మరొకరు త్రాగితే ఊరుకుంటానా మరి ?” అది ముక్తాయింపు.

దంపతులకు ఫస్ట్ నైట్.. అమ్మాయి తెల్ల చీర కట్టుకుని, తలనిండా పూలు తురుముకుని, వచ్చి కూర్చుంది,మల్లెలపరుపుపైన.. పెళ్లికొడుగ్గారు.. గ్లాక్సో పంచె కట్టుకుని విలాసంగా లోపలికి వచ్చాడు. తలుపు గడియ పెట్టాడు. మధుర క్షణాలకు తెరలేస్తోంది.. ఉత్కంఠ అమ్మాయి మదిలో.. సడన్ గా ఇద్దరు పిల్లగాళ్ళు మంచక్రిందనుంచి వచ్చారు. “కళ్యణరామ్ శోభనం .. కెమెరామాన్ రాంబాబుతో నారాయన్.. తమాషా టి.వి. అంటూ వస్తే టి.వి. ఉద్యోగి అయిన పెళ్లికొడుకు ఖంగు తిని.. వాళ్లను తరిమి కొట్టాడు.

హింది భాషా పదాలకు, డు, ము, ఉ లు జేరితే తెలుగైపోతుంది.. మేము మీ భాషకు అంత దగ్గర.”  అదీ హింది కవుల హృదయ వైశాల్యం.
మధ్యప్రదేశాది రాష్ట్రాలలో తెలుగు సెకండ్ లాంగ్వేజిగా ఉందని హిందీ కవులు చెప్పారు.

సాయంత్రం ఏడుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం పదిన్నరవరకు నవ్వుల కోలాహలంగా సాగింది..