Pages

Tuesday, July 30, 2013

అది ఒక ‘బూతు’ కథ


అది ఒక ‘బూతు’ కథ

అర్థరాత్రి మా ఆవిడ ఒక్కటేసింది. . దెబ్బకి లేచి కూర్చున్నాను.
“అర్థరాత్రి మద్దిల దరువన్నట్టు ఏంటండీ ఆ పిచ్చి కేకలు” అంది శ్రీమతి.  
“ముఖ్యంగా ఎన్నికల రోజుల్లో ఆ పేపర్లన్నీ ముందరేసుక్కూర్చుని చదవద్దంటే వినరు..
అర్థ రాత్రి అంకమ్మ శివాలు. బూతు బూతు అంటూ ఏంటా వెధవగోల? లేవండి, లేచి ఆ అలమార్లో విభూతి కాస్త పెట్టుకుని, ఇంక పడుకోండి.” అని తాను అటు తిరిగి పడుకుంది శ్రీమతి.  

నా బ్యాంకు సర్వీస్ లో ఒకే ఒక్కసారి ఎలక్షన్ డ్యూటీ పడింది.. దశాబ్దం దాటినా,  ఆ చేదు అనుభవము ఒక తీపి గుర్తు. ఆ డ్యూటీలో నన్ను  ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నారు.  ముందు బ్రీఫింగ్, అక్కడ బోల్డు రూల్స్ చెప్పారు...అన్నీ బాగా ఒంటపట్టాయి. రేపు ఎలక్షన్ అనగా మెటీరియల్ కలక్ట్ చేసుకోడానికి ఇంజనీరింగ్ కాలేజీకి రమ్మన్నారు. రెండు బాలట్ బాక్స్ లు, బాలట్ పేపర్లు, ఇంకా ఏవేవో కవర్లు, కాగితాలు.. ఇది కాక వెదురు కర్రలు, గుడ్డలు, పురికొస ముక్కలు.. ఇవన్నీ పట్టుకెళ్లడానికి రెండు గన్నీ బ్యాగులు...సంతకం పెట్టించుకుని ఇవన్నీ  లెక్కప్రకారం అప్పచెప్పారు. తిరిగి అన్నీ లెక్క ప్రకారము వాపసు ఇవ్వాలి అని మరీ మరీ, మళ్లీ మళ్లీ చెప్పారు.  నాకు అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అక్కడ కలిసాడు. అతడు స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగి. మునిసిపల్ స్టేడియం అవతల ఉన్న ప్రభుత్వ దృష్టిలో బలహీన వర్గాలుగా భావించబడే ప్రజలు నివసించే ఒక పేట. అక్కడ   ఒక స్కూల్ దగ్గర మమ్మల్ని దింపేసి, ఇదే  మీ సెంటర్  అని చెప్పేసి  మేము ఎక్కి వచ్చిన బస్సు చక్కా పోయింది.  

ఆ స్కూల్ లో మరో మూడు బూతులున్నాయి. దానికి సంబంధించిన పోలింగ్ స్టాఫ్ కూడా వచ్చినట్టున్నారు సందడిగానే ఉంది..  తలుపుమీద నెం 2 అని అంటించి ఉన్న..మా గది దగ్గరికి వెళ్ళాము, లగేజీతో సహా.   ఆ గదిలో చిన్న బూతు రెడీ చెయ్యాలన్నాడు మా ఎ.పి.ఓ. అతనికి బూతుల గొడవ బాగా అనుభవముంది అని చెప్పాడు.బూతంటే పవిత్ర ఓటు హక్కు వినియోగించికోడానికి ఒక మరుగు ప్రదేశము అన్నమాట. అక్కడున్న ఒక స్కూల్ బల్ల మోపు చేద్దామని చూస్తే,వయసులో ఉన్నప్పుడు అది నలుచదరముగా చక్కగా ఉండేదేమో కాని ప్రస్తుతం ఒక కార్నర్  విరిగిఉంది.  తెచ్చిన వెదురు బద్దలు, పురికొస, గుడ్డలు .. వీటి సాయంతో,  నాలుగు ప్రక్కల కట్టి గదిలా చేద్దామని శ్రద్ధగా ప్రయత్నించాము.మా ఆస అడియాస అయింది. చివరికి గుడారానికి ఎక్కువ, గదికి తక్కువ అన్నట్టు అది తయారైంది.

“బాగుంది సార్, బాగా చేసారు.” అంటూ ఒక ఆగంతుకుడు మా బూతులోకి వచ్చేడు. అతని వెనకగా ఒక స్త్రీ మూర్తి దర్శనమైంది.‘ఎవర’ రన్నట్టు చూసా. ‘మీరేనా సార్,ప్రిసైడింగ్ ఆఫీసర్ ?’ అని ప్రశ్నించి, ‘మా మిసెస్ ను ఇక్కడ మీ బూతులో పోలింగ్ అసిస్టెంట్ గా వేసారు’ అని కూడా ఉన్న  స్త్రీ మూర్తిని పరిచయం చేసాడు ఆ ఆగంతకుడు. ‘గ్లాడ్ టు మీట్ యు’ అని నన్ను పరిచయము చేసుకుని, ఎ.పి.ఓ గార్ని కూడా పరిచయము చేసా. కాసేపటికి, మరో ఆగంతకుడు మరో ఆడకూతుర్ని తీసుకువచ్చి అసిస్టెంట్ అంటూ పరిచయము చేసాడు.  మొగుళ్ళను వెళ్ళమని, కవర్లు అవీ రెడీ చేయండి అని వారికి పని పురమాయించి, చుట్టూ ఉన్న వాతావరణము ఒక సారి బ్రీఫింగ్ క్లాసులో చెప్పిన ప్రకారము సర్వే చేద్దామని బయటికి వచ్చా. 

అప్పటికే ప్రక్క బూతు వాళ్లు కూడా బయటికి వచ్చారు. వాల్పోస్టర్లు గట్రా పీకేసినట్టు తెలుస్తోంది. కాని అక్కడ ఉన్న ఓ విగ్రహానికి, గోనె చుట్టారు.. ఆ విగ్రహం చాచిన చెయ్యి గోనెలోకి ఇమడక పోవడం వల్ల “టా టా” చెప్తున్నట్టు కనపడ్తున్న ఆ చెయ్యి , ఫలానా నాయకునిదని  చెప్పకనే చెప్తున్నట్టు ఉంది అని ఒకరి కామెంట్. ఆ చెయ్యికి ఏంచుట్టినా ఆ  సజెషన్ వస్తూనే ఉంటుంది అని, ఆ ప్రక్కనున్న ఒక గుడ్డ కప్పే ప్రయత్నం చేసాం.  ఆ పచ్చటి గుడ్డమీద ఎలక్షన్ గుర్తు బెల్ కొట్టింది. “అమ్మో ఇది మరీ ప్రమాదం” అని అవన్నీ దూరంగా విసిరేసి, ఏంచెయ్యలేక వెనుదిరిగాము.   

బూతుకు వస్తుండగానే మా  పోలింగ్ అసిస్టెంట్స్ భర్తలు ఎదురొచ్చారు. ‘అయ్యో మీరు వెళ్లిపోలేదా,’ అని పరామర్శిస్తే … “మా ఫామిలీస్ ఆడ కూతుళ్ళు కదండీ, ఇక్కడ బూతులో ఉండలేమంటున్నారండీ, ..పొద్దున్నే,అంటే చీకటుండగానే.. వచ్చేస్తారండి... మీరు పెర్మిషన్ ఇస్తేనే అనుకోండి.. మీరు పెర్మిషన్ ఇస్తారు కదండీ, పెర్మిషన్ ఇప్పించండి..” అని వాపోయారు. “రాత్రి వేళ,ఈ గొడవల్లో బూత్ లో ఆడకూతుళ్లు ఎక్కడ ఉండగలరు” అని ఆలోచించి, ఉదయం అయిదున్నర కల్లా ఇక్కడుండాలి అని మరోసారి గట్టిగా చెప్పి పెర్మిషన్ ఇచ్చేసా.. ఆ క్షణం నుంచి మా ఎ.పి.ఓగారి సణుగుడు ప్రారంభమైంది... కాసేపటికి  మా చుట్టాలబ్బాయి ద్వారా మా శ్రీమతి రాత్రి తినడానికి ఏదో టిఫిన్ పంపింది. మర్నాటి సంగతేమిటని కబురు పంపింది.  నాకు మాత్రం ఏం తెలుసు. ఏదో ఏడుస్తాలే అని రిటర్న్ కబురు పంపా.. 

ఆ రాత్రి అక్కడ పడుకోవాలి. మర్నాడు స్నానాదులెలా ? అని ఒక సర్వే చేసా.. కొంచెం దూరంగా ఒక సులభ్  కాంప్లెక్స్ కనపడింది. ఏదో ఒకటి అనుకున్నా. ఎదురుగా ఏదో స్కూల్ అనుకుంటా .. అక్కడ కుళాయి ఉంది అని ఎవరో చెప్పారు. సరే అనుకున్నా.. కొంత హోమ్ వర్క్, బాలట్ పేపర్లకు స్టాంపులు, కవర్లలో పెట్టాల్సినవి అవీ రెడీ చేసే ప్రయత్నం చేసా. “కంగారు పడకండి సార్, ప్రొద్దున్నకన్నీ రెడీ అయిపోతాయి..”  ధైర్యం చెప్తున్నాడులే అనుకుంటూంటే “అయినా మీరు ఆ అమ్మాయిల్నీ అలా పంపేయకూడదు సార్..” అని ముక్తాయించాడు. దోమల్ని తోలుకుంటూ, రాత్రి గడిపాం. 

నాలుగు అయ్యేటప్పటికి లేచాము. కూడా తెచ్చుకున్న టార్చ్ సాయంతో , ఎదర స్కూల్లో ఆ కుళాయి దగ్గర మొహాలు తోమి, సులభ్ కాంప్లెక్స్ కు బయల్దేరా.. రాత్రి దగ్గరనిపించినా, ఇప్పటి పరిస్థితిలో చాలా దూరమనిపించింది. తీరా అక్కడికి వెళ్తే … ఇంకా తెరవబడలేదు ఆ సౌలభ్యం. మళ్ళీ వెనక్కి వచ్చి ఎదురుగా ఉన్నస్కూల్  చీకటిలోకి వెళ్ళా.. ఇలాతిరిగి  అలా తిరిగితే ఒక లెట్రిన్ కనపడింది.. చూస్తే తలుపులు లేవు. ఈ అవసరము ముందు---తలుపులు పెద్ద అవసరమా అని సమాధానపడి, నా ప్రయత్నంలో పడ్డా.. ఈ లోగా మరొక బాధితుని ప్రవేశము.. ఒక దగ్గు దగ్గి ‘ఉన్నా’ నన్నా.. ‘సారీ’ చెప్పాడు, అతడూ మా పక్షే.. సరే పని కానిచ్చి  ఆ కుళాయి దగ్గర రెండు చెంబులు పోసుకుని.. కనపడని ఆ చీకట్లోంచే ఆ కనపడని వానికి మ్రొక్కి... మా బూతుకు చేరి.. అలంకారం పూర్తి చేసుకున్నా.. 

చక్కగా ముస్తాబై మా పోలింగ్ అసిస్టెంటులు వచ్చారు.. పార్టీ వాళ్లు పంపిన ఒక కుర్రాడు వచ్చి కాఫీ కావాలా సార్ అన్నాడు. పార్టీలకతీతంగా ఆలోచించా.. కాఫీకదా.. లేపోతే ఆ దరిదాపుల్లో కాఫీ చాయల్లేవు. వాడిచేత తెప్పించుకున్న రెండు ఇడ్డెన్లూ కాఫీ సేవించి ..  ఏడవకుండా.. అదేనండీ టైమ్ ఏడు అవకుండా..  ఎన్నికలకు సిద్ధమయ్యాము. తిన్నపుడు తెలియలేదు-- ఇక ఆ రోజుకు నేనేమీ తినలేనని.   పోలీసులు, హడావుడి, ప్రారంభమయింది. లైను కట్టారు ఓటర్లు. సరిగా టైముకు---, మేము రెడీ, రండి అని స్వాగతించాము. 

లైనులోని ఏ ఓటరూ  కదలలేదు. ఏమర్రా...  రండమ్మా అన్నాము.. ఆ పేటకు పెద్ద ముత్తైదువ ఉన్నదట. ఆవిడ మొదటి ఓటు వెయ్యాలట. అది అన్ని పార్టీలవాళ్లకి అంగీకారమేనట ... సరే ఆవిడ గారు  తలనిండా స్నానంచేసి, ముఖంనిండా పసుపు రాసుకుని,తలనిండా పూలు తురుముకుని, పెద్ద బొట్టుతో వచ్చి నిదానంగా ఓటు హక్కు వినియోగించుకున్నాక.. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది..

మా వాళ్లకి ముందే చెప్పా .. ఎక్కడా రాజీ పడకండి, చక్కగా డ్యూటీచేద్దాము అని. అరగంట గడిచింది. ఎంతమంది అయ్యారు సార్.. అని వెనకనుంచి పోలీస్ ఆయన అడిగాడు.. ఇతగాడికేమిటీ ఇంట్రెస్ట్ అనుకుంటూంటే మా ఎపిఓ చెప్పాడు, ‘వీళ్లు ఎప్పటికప్పుడు పై వాళ్లకి పొజిషన్ చెప్పా’లని. వార్తల్లో గంట గంటకీ  పెర్సెంటేజ్ చెప్తూ ఉంటారు.. ఇదన్నమాట. నాకు జ్ఞానోదయం అయిపోయింది. సార్.. కొత్త బాలట్ పేపర్లు స్టాంపెయ్యండి అన్నాడు ఏ.పి.ఓ. ‘అవి వేస్ట్ అవకూడదు. అందుకని ఎప్పటికప్పుడు రెడీ చేసుకోవా’ లని రూల్.. 

నేను ఆ పనిలో ఉండగా మా ఎ.పి.ఓ ఏదో గొడవ పడ్తున్నాడు. ఏమిటంటే ఈవిడ చెప్తున్న వివరాలు సరిపోటం లేదండి అన్నాడు. నేను వెళ్లా.. ఒక ఆడ ఓటరు ఆడ నుంచుంది. విషయం తెలుసుకునే ప్రయత్నంలో.. ‘ నీ పేరు ఏమిటమ్మా’ అని అడిగా..చెప్పింది.. అడ్రస్ అవీ సరిపోతున్నాయి. భర్త పేరు సరిపోవటం లేదు. .. “అమ్మా … మీ పేరు సరిపోవటంలేద”న్నా.. ఈ లోగా వెనకాలనుంచి..ఎవరో  ఏదో గొణిగాడు.. “ఆ మొగుడు పేరేం చెప్పాలో ముందే ఏడవచ్చు కదా .. చెప్పేటప్పుడు సరిగా చెప్పరు.. ఇప్పుడీ గొడవ..” అని వెనక్కి వెళ్లిపోయింది. 

తర్వాత ఒక అంధుడు ఇంకోరిసాయంతో ఓటేస్తానన్నాడు. ఆ వివరాలు రికార్డ్ చేసి, ఓటువేయడానికి అనుమతించా.. అన్ని రకాలు మా బూతులోనే వచ్చాయి.. ఇక లంచ్ బ్రేక్ లేదు.. మధ్యలో పార్టీ నాయకులు.. వచ్చి వెళ్లారు. మీడియా వాళ్లు..వచ్చి వెళ్లారు. అయిదైనా ఓటర్లు వస్తూనే ఉన్నారు. ఎలక్షన్ స్టాఫ్ కు ఈయవలసిన డబ్బులు  అధికారులు  వచ్చి నాకు ఇచ్చి వెళ్లారు. “మీకు బాలట్ పేపర్లు బాలన్స్ అయ్యేదాకా మీ వాళ్లెవ్వరికీ డబ్బులు ఇవ్వకపోతే మంచిది.” అని చెప్పి వెళ్లారు. వాళ్ల పనైపోయింది.
పోలింగ్ టైమ్ అయిపోయిందని చెప్పాం.. పార్టీ ఏజంట్స్ లోపలకి వచ్చేసారు. మిగిలిపోయిన ఓట్లు ఇచ్చేస్తే మేము సర్దుకుని వేసేసుకుంటామ్ సార్ అంటూ షంటింగ్..నాకర్థంకాలేదు.. జోకేమో అనుకున్నా.. అయినా కుదరదన్నా.. 

ఇంక బాలన్సింగ్.. కవర్లలో అన్యోన్య సాయంతో వేసినవి.. చాలెంజ్డ్ ఓట్స్ ఇలా ఏవో రిటర్న్స్ ..వాళ్లు చెప్పిన ఫారాలలోనే నింపాలి..ఆ కవర్లు ఫారాలు వెతుక్కోవడం చాలా టైమ్ పట్టింది.  ఇవన్నీ చేసేటప్పటికి వాన్ వచ్చేసింది. బుర్ర వేడెక్కిపోతోంది.. ఈలోగా మా పోలింగ్ అసిస్టెంట్ ల మొగుళ్ళు వచ్చేసారు.. అసిస్టెంటులు మా డబ్బులిస్తే మేం పోతామంటారు.. నాకు చికాకు ఎక్కువైపోతోంది... బాలట్స్ బేలన్స్ చేయడానికి ఒక తమాషా ఫార్ములా ఉంటుంది.. అది ముందర ఈ హడావుడిలో సరిగా గుర్తురాలే.  ఓ పట్టాన బాలన్స్ అవలేదు.. మొగుళ్ళని ప్రక్కన పెట్టుకుని డబ్బులు అంటారు వీళ్లు.. చిర్రెత్తింది..  ఇచ్చేసి పంపించేసా.. ఎ.పి.ఓను కాకా పట్టి  మొత్తానికి బాలన్స్ చేసాం.. 

వ్యాన్లో పడ్డాం... సకాలములో చేసి వ్యానెక్కిన వాళ్లు మాకేసి గుర్రుగా చూసినట్టనిపించింది.. “సారీ సర్ మా వల్ల మీకు లేట్ అయింది” అన్నా.. వాళ్లెవ్వరూ స్పందించలేదు. నా తర్వాత ఇంకో రెండు సెంటర్ల వాళ్లు ఎక్కారు. నేనూ వాళ్ళకేసి గుర్రుగా చూడబోయా.. మనసు ఒప్పలేదు.   మళ్లీ ఆ పురికోసలు, పాత గుడ్డలు, వెదురు పుల్లలు అన్నీ మోసుకొచ్చాము. అందరూ అలాగే తెచ్చారు.. అర్థరాత్రి అయింది.. మా బాలట్ బాక్స్ వాళ్లకి ఇచ్చి వచ్చేటప్పటికి. వెదురు పుల్లలు, గుడ్డలు, పురికొస అక్కడ పాడేయండి అన్నారు.. లెక్కా గట్రా ఏమీ లేదు.
ఒక బాలట్ బాక్స్ లో సర్దొచ్చుకదా, రెండెందుకు వాడావు అని చీవాట్లు, అన్ని రిటర్న్స్ ఏమిటి అని అదో తప్పు.. పోలింగ్ అసిస్టెంట్స్ ను ముందే ఎందుకు పంపావు అంటాడు.. మొత్తానికి బయటికి వచ్చా .. 

అక్కడే టెంట్ లో అన్నాలు డ్యూటీ చేసొచ్చిన వారికి పెట్తున్నారు... అర్థరాత్రి తినడానికి అంత ఇష్టపడను.. కాని అడుగుపడడమే కష్టంగా ఉంది.. వేడి వేడి సాంబారు, పెరుగూ అన్నం తినగానే పోయాయనుకున్న ప్రాణాలు తిరిగొచ్చాయి.. చాలా దూరం నడిస్తేకాని ఆ అర్థరాత్రి ఆటో దొరకలేదు.. ఇంటికి చేరి తలుపు కొడ్తే, తలుపుతీసి నన్ను చూసి, మా శ్రీమతి జాలిపడి ఆహ్వానించింది.. టార్చ్ లైటు, ముందురోజు పంపిన టిఫిన్ బాక్స్ పోయినందుకు మర్నాడు  క్లాసు పీకింది. వాళ్లిచ్చిన కూలీ పోయినవాటికి  సరిపోయింది. 

తమాషా ఏంటంటే మాకందరికీ కూలీ డబ్బులు సమానమే..పి.ఓకి,ఎ.పి.ఓకి,అసిస్టెంట్స్ కీ అందరికీ... ఒకటే …  కాని నాకు చీవాట్లు, అవమానాలు అధికం. నిజానికి అన్నీ  నిల్ అని ఫారాలు ముందే కవర్లో పెట్టేస్తే సరిపోను. చాదస్తం.  వెదురుపుల్లలు,గుడ్డలు అవీ సిన్సియర్ గా తేకపోయినా నష్టం లేదేమో అనిపించింది. అందరిలానేను వచ్చేద్దును. కాని దేనికైనా అనుభవము రావాలి. సౌకర్యం కోసం ఆ ఓటు  వేయించే వారిని ఇలా  వేయించడం.. ...అంతా బూత్ మహాత్మ్యం.   

మా ఆవిడ చెప్పినట్టు ఏదో డెబిటూ, క్రెడిటూ అని ఆ లెక్కలు వేసుకోక, ఈ ఎలక్షనులు, డ్యూటీలు ఎందుకు చెప్పండి. ఆ మాటే .. పరధర్మో భయావహ అని గీతాచార్యుడు చెప్పాడుగా..

Sunday, July 21, 2013

వేడి వేడిగా....................



 


  రచన: డి.వి.హనుమంత రావు.

వర్షాలు పడుతున్నాయి... అలా వాన పడుతుంటే, పై మేడమీద గదిలో, కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని, కిటికీలోంచి వాన వైపు చూస్తూ,పచ్చటి చెట్లపై వాన చేసే విన్యాసాలు పరికిస్తూ, చేతిలో ప్లేటుపెట్టుకుని, అందులో వేడి,వేడిగా, ఖారం ఖారంగా, కర కర లాడుతూ అపుడే వేసిన పకోడీలు పెట్టుకుని, ఒక్కటొక్కటే ఊదుకుంటూ తింటుంటే అడక్కండి  మరి..    మ్ము....  మ్మూ...  ఎంత బాంటుందో కదా ?
అందుకనే మీ టేస్ట్ తెలుసుకనక పట్టుకొచ్చా... ….

రాజమండ్రిలో ‘హిందూ సమాజం’ ఒక సమావేశ మందిరం. చాలా పురాతనమైంది. ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఓపెన్ ఆడిటోరియం ఉంది.  ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాన్ని
‘ఆంధ్ర భీష్మ’ గా ప్రసిద్ధి పొందిన నగర ప్రముఖులు న్యాపతి సుబ్బారావు పంతులుగారు  నిర్మింపజేసారు. స్వామీ వివేకానంద చికాగో ఉపన్యాసమునకు వెళ్లనున్నప్పుడు జరిగిన సభలో  వేదికపై శ్రీ సుబ్బారావు పంతులుగారు కూడా ఉన్నారు.

పైన చెప్పిన హిందూసమాజ ప్రాంగణములో ఒక గంగ రావి చెట్టు ఉండేదట.
సాయంకాలమయ్యేసరికి దానిక్రింద లోకాభిరామాయణమునకు చేరు ఉద్ధండులు ఎవరయ్యా అంటే.... ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావుపంతులుగారు,ఆంధ్రప్రభుత్వ ఆస్థాన కవి, బహుగ్రంథ  కర్త, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు, హాస్య ప్రథానంగా “గణపతి”,  అనేక హాస్య ప్రహసనాలు, ప్రముఖ పౌరాణిక నాటకం “గయోపాఖ్యానం” మొదలైనవి వ్రాసి  కవి చక్రవర్తి బిరుదును ప్రదానంచేస్తామంటే  ఇచ్చగింపని చిలకమర్తివారు, టంగుటూరి ప్రకాశంపంతులుగార్ని రాజమండ్రి తీసుకువచ్చి ఆదరించిన ఇమ్మనేని హనుమంత రావు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్య మంత్రి, అంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు,ఇంకా శివరాజు రామారావుగారు,పాలకోడేటి గురుమూర్తిగారు, లంక బ్రహ్మన్న సోమయాజులుగారు, రాచకొండ సుబ్బారావుగారు వంటి ప్రముఖ పెద్దలే కాకుండా సోమశేఖరరావుగారు, గాడేపల్లి కృష్ణమూర్తిగారు, తాళ్లూరి,  నేట్రకంటి శేషగిరిరావు మొదలైన చిన్నవయసువాళ్లు ... వీరికి నాయకుడు శ్రీ వేమూరి విశ్వనాథశర్మగారట.(మచిలీపట్టణంలోని ఆంధ్రా సైటిఫిక్ కంపెనీ స్థాపనకు కారణమైనవారు, ఈ శర్మగారు).  గంగరావి చెట్టుక్రింద రోజూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఈ సభ్యులు  మూడు నిముషములలో ముల్లోకములను చుట్టివచ్చెడివారట.

ఒకసారి హనుమంతరావు నాయుడుగారు మిత్రుల కాలక్షేపానికి పకోడీలు తెప్పిస్తున్నానని ప్రకటించారు. ఆనంద పడ్డ మిత్రులలో ఒకరు చిలకమర్తి వారిని “మీరు పకోడీ మీద పద్యం చెప్పవచ్చుగా”అన్నారు. “అలా మీరు పద్యం చెప్తే పద్యానికి ఒక పకోడీ ఇస్తా”మని భూరి విరాళం ప్రకటించారు మరో వదాన్యులు. “హతవిధీ! పద్యములోని  అక్షరమునకు లక్షలిచ్చు కాలము గతించి, పద్యమునకు  పకోడీలిచ్చు కాలము దాపరించినది” అని చమత్కరిస్తూ,  చిలకమర్తి వారు పకోడీపై కొన్ని  పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.    

వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె  నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.

 

Thursday, July 18, 2013


గతం లోకి తంతి

“సార్ ! టెలిగ్రామ్ !”

అర్థరాత్రి టెలిగ్రామ్ ఎక్కడనుంచబ్బా...
ఆయనకూ, ఆవిడకు టెన్షన్..

“your daughter-in-law blessed with a male child” అని వియ్యంకుడుగారి  దగ్గరనుంచి...

“నువ్వు బామ్మవయిపోయావుటోయ్” అని సరసుడైన ఆయన భార్యామణితో సరసాలు..

సిగ్గూ , ఆనందమూ కలసిన ముసి ముసి నవ్వులతో తన ప్రయోజకత్వానికి సంబరపడుతూ ప్రక్కగదిలోంచి విన్న
న్యూ పేరెంట్., వెంటనే తన శ్రీమతిని అభినందిస్తూ గ్రీటింగు టెలిగ్రాం ఇవ్వడానికి సన్నాహం. .
( ఆ రోజుల్లో వెంటనే సంతోషాన్ని పంచుకోవాలంటే ఫోనులు లేవుగా మరి)..

ఎన్ని అనుభవాలో....
టెలిగ్రామ్ చరిత్రలోకి వెళ్లి పోయింది. ఎన్ని వార్తలు మోసుకొచ్చేది. ఎన్ని ఆనందాలు పంచేది. ఎన్ని విషాదాలకు సానుభూతులు చూపేది. .. ఇక ఆ టెలిగ్రాం ఇక కనపడదు. నిజం చెప్పాలంటే మనం ఎప్పటినుంచో మరచిపోయాము అది వేరే విషయము. ఇప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేసారు. అంతే ….

బిడ్డనెత్తుకుని ఫలానా ట్రెయిన్ కు వస్తున్నామని టెలిగ్రాం … ఉత్సాహంగా గంతులేసే తండ్రి హృదయం.
ట్రైన్ టైమ్ కన్నా ముందే స్టేషన్ కు చేరి, పదే పదే వాచీని, పట్టాలను మార్చి మార్చి చూసిన ఆ రోజులు  గుర్తుకొస్తున్నాయి కదూ.

మీ వాడు ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు అని యూనివర్సిటీలో తెలుసున్నవారు టెలిగ్రాంఇస్తే,.
తండ్రికి ఆనందాన్ని, తనయునికి ఉత్సాహాన్ని పట్టుకొచ్చిన టెలిగ్రాము

“may heaven’s choicest blessings be showered on the young couple’
“convey our blessings to the newly wedded couple”
ఒక నెంబర్ టెలిగ్రాఫ్ ఫారంపై నింపితే చాలు అందమైన కవరులో, అందంగా ముద్రించి పెళ్లి పందిట్లో టెలిగ్రాఫ్ మెస్సెంజర్ ఇస్తే .. వధువుకు కాని, వరుడుకీ కాని, కన్యాదాతకు కాని, పిల్లాడి తండ్రికి కాని ఎంత గర్వం.. ఆ టెలిగ్రాములను అలా భద్రంగా దాచుకుని, మళ్ళీ చూడడము, ఎంత గర్వం.. కాదంటారా..
‘ఏమోయ్ మీ మాధవన్నయ్య పెళ్ళికి రావటం లేదట టెలిగ్రాం పంపాడు.” ఆలి వంకవారి నైజం ఇదీ అన్నట్టు ఆయన చెప్తే … “రావటం లేదా .. అయినా ఎందుకొస్తాడూ, మా బాబాయి షష్టిపూర్తికి మనం వెళ్లలేదుగా.. పైగా బాబాయికదా అని తీసి పారేసారు. . అవన్నీ మనసులో పెట్టుకోరా ఏంటి.” త్రిప్పికొట్టే అర్థాంగి.
‘అబ్బాయి పెళ్లి చేస్తున్నారు సార్ .. మాకేమన్నా బహుమానం ఇయ్యరా సార్..” అని నసిగే మెస్సెంజర్ కు, చుట్టూ ఉన్నవారు చూసేటట్టు క్రొత్త నోటులు తళుక్కు మనిపించడం.. ఇవన్నీ ఆ టెలిగ్రామ్స్ వల్లనే కదా..

ఇప్పుడు అమెరికా క్షేమంగా చేరేరన్న వార్త, క్షణాలమీద తెలుస్తుంది, కాని అప్పుడు కేబుల్, బొంబాయి వచ్చి అక్కడనుంచి టెలిగ్రాం ద్వారా రావలసినదేగా .. ఆ టెలిగ్రాము వచ్చేదాకా ఎంత ఆందోళన, వచ్చాక ఎంత ఆనందం.

వచ్చిన టెలిగ్రాములు తెచ్చిన వార్తలకు ఆనందంతో గంతులేయడం ఉండేది. కొన్ని వార్తలకు దుఃఖంతో ఘొల్లుమనడం ఉండేది. ఆనంద సందర్భాలలో ఆనందాన్ని, దుఃఖ సమయాలలో విచారాన్ని మనతో పంచుకునే ఆ టెలిగ్రామ్ వాలా ఆత్మీయతకు దూరమయ్యాంకదా..

మేమున్న పేట అప్పట్లో పెద్దగా డెవలప్ కాలేదు. కొద్దిగానే ఇళ్ళుండేవి. అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా టెలిగ్రాం అతను, మా ఇంటిదగ్గర బెల్ కొట్టి లేపేవాడు. ఇంక మా నాన్నగారి హడావుడి.నిజానికి  టెలిగ్రాం మాక్కాదు. అడ్రస్సు తెలుసుకోవడానికి నాన్నగారిని లేపేవాడు. నాన్నగారు విసుక్కోకుండా, ఆ అడ్రస్ అనలైజ్ చేసి, ఆవసరమైతే మమ్మల్ని కూడా లేపి.. మా సాయం తీసుకుని, ఆ అడ్రస్ చెప్పి పంపేవారు. దాని ఫలితంగా మాకు ఎప్పుడూ టెలిగ్రాం రాకపోయినా వాళ్ల దసరా మామూళ్ల లిస్టులో మా పేరు ముందు ఉండేది. అదో సరదా..

ఆఫీసుల్లో చేరాక టెలిగ్రాం పాత్ర చాలా ఉండేది. క్రొత్తగా చేరిన క్లార్క్ ను సాధారణముగా  డిస్పాచ్  సీట్ కు వేసేవారు.  దానిలో భాగం అన్ని సెక్షన్స్ నుంచి వచ్చిన టెలిగ్రాములూ సకాలంలో టెలిగ్రాఫ్ ఆఫీస్ కు పంపడం.  అలసత్వం చూపాడా--- మరునాడు వార్నింగో, మెమోయో తప్పదు. బ్యాంకుల్లో టీ.టీ లు డబ్బులొచ్చిన వార్తలు పట్టుకొచ్చేవి .. వాటికోసం కస్టమర్స్ డిస్పాచ్ క్లార్క్ చుట్టూ తిరగడం. అవి రిజిస్టర్ లో ఎంటర్ చేసి ఆఫీసర్ కు పంపే లోపు నానా హడావుడి చేసేసేవారు.. అదో సందడి.

పెద్ద పెద్ద మెసేజెస్ పంపేటప్పుడు క్లుప్తీకరించడం ఒక ఆర్ట్ .  గ్రీటింగ్ టెలిగ్రాములు అలాంటివే. పంపదలచుకున్నవారు ఆ మెసేజ్ నెంబర్ వేస్తే , ఆ నెంబరు టెలిగ్రాంగా ఇస్తారు. కాని రిసీవ్ చేసుకున్న టెలిగ్రాం ఆఫీస్ వారు తర్జుమా చేసి కస్టమర్ కు పంపాలి.. కాని ఒక్కోప్పుడు ఆ నెంబరే పంపేసేవారు.. అదో తమాషా..

అర్జంట్ అని టెలిగ్రాం ఇస్తే ఆర్నెల్ల తర్వాత అందడం ఒక జోక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండేవి.  అది పేపర్ న్యూస్ కూడా అయిపోయేది. ఒక సారి హైదరాబాదు నుంచి మా అన్నయ్యకు టెలిగ్రాం ఇచ్చా “మరునాటి ఉదయానికి వస్తున్నామని .. ఇంటి దగ్గర ఉండమని..” . ఆ టెలిగ్రాం హైదరాబాదులో నేనే ఇచ్చి, రాజమండ్రి వచ్చాక నేనే రిసీవ్ చేసుకున్నా. అప్పటికి అన్నయ్య తన కాంప్ కు వెళ్లిపోయాడు. అతన్ని వెనక్కి రప్పించడానికి టాక్సీ పంపాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోడానికి బాగున్నా అప్పుడది బాధే కదా.

నా చిన్న తనములో టెలిగ్రాఫ్ ఆఫీస్ లోపలకు చూడ్డం ఒకసరదా.. “టక్ .. టక్.. టాక్ … టాక్  టక్కు “ అంటూ తమాషాగా సౌండ్ చేసే మిషన్స్ ఉండేవి.. ఆ సంకేతాలే అన్ని వార్తలకు ఆధారం. తర్వాత్తర్వాత మార్పులు వచ్చాయి. కొన్నాళ్ళు కార్బన్ పెట్టి వ్రాసి, కార్బన్ కాపీ మనకి వచ్చేది. సరిగా అర్థంకాక విపరీత అర్థాలు వచ్చిన సందర్భాలు ఊండేవి. కొన్నాళ్ళు ప్రింట్ అయిన ముక్కలు అతికి పట్టుకొచ్చేవారు. అలా ఎన్నో మార్పులు చెంది మనుగడ సాగించిన ఆ టెలిగ్రాము నిత్యమూ మారే ప్రపంచపు ఆధునిక పోకడల ధాటీకి ఆగలేక తెరవెనక్కి పోయింది.

ఆ అనుభవం పొందిన మన తరాలవారికి ఇది బాధ...  ప్రగతి పథంలో దూసుకుపోతున్న నవతరానికి ఇది AFTERALL.