హరాజీకాలు - 4
[ఇది హరాజీకా మొదలుపెట్టినప్పుడు వ్రాసిన మొదటి మాట.. ఎందుకు ఇవి వ్రాస్తున్నానో తెలిసినవారు ఇది స్కిప్ చేసినా ఫర్వాలెదు..]
మీ జీవితంలో ఏవో సంఘటనలు మీకు నచ్చుతాయి. అలాగే పాపం నాకూ నచ్చుతాయిగా, అబ్బా మీ జీవితంలోవి నాకు నచ్చడం కాదండి బాబూ, నా జీవితములోనివి, నాకూ నచ్చుతాయిగా అని నా భావమ్. .. అవి గుర్తొచ్చినప్పుడు నాకు ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి .. అలాంటివి, అందులోని పంచ్ మీతో పంచుకోవాలనిపించింది. నేననుకున్న ‘పంచ్’ నాకు నవ్వు తెప్పించికదా అని మీకూ నవ్వు పుట్టించాలని రూలేం లేదుగా…అని మీరనొచ్చు.. మీరు నిజం మాట్లాడుతారు . అందుకే మీరంటే నాకు చాలా ఇదన్నమాట … వీడేం రాస్తాడులే అనుకోకుండా వీడూ రాస్తాడు అని చదవండి .. స్పందించండి .. మీ స్పందన తెలియజేయండి.. కొన్నాళ్ళు నా బ్లాగులో ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను... .. పాపం మీకు తప్పదు.. స్పందన పోస్ట్ చేయడం.....
కోడి కూత
శ్యామ్ నా చిన్ననాటి మిత్రుడు .. యూనివర్శిటీ చదువుకోసం వాడు వైజాగ్ వెళ్లాడు.. నేను డిగ్రీలో డింకీలు కొడ్తూ రాజమండ్రిలోనే ఉండిపోయాను.. వీడు వెళ్లాక నాకు ఒంటరితనం ..చదువా అబ్బలేదు.. భవిష్యత్తు చూస్తే భయంకరంగా కనపడ్తోంది. జీవితం మరీ బోర్ అనుకునే .. టీన్ ఏజ్ .. ఎవరితోనూ పడదు.. నామీద నాకే కోపం.. అలాంటప్పుడు వీడు అప్పుడప్పుడు రాజమండ్రి వస్తుంటే అదో రిలీఫ్ .. వాడున్న నాలుగురోజులూ ఆనందంగా గడిపేవాళ్లం.
అలా వాడు ఒకసారి వచ్చినప్పుడు నేనూ,వాడూ గోదావరి స్టేషన్ ఎదురుగా నిలబడి కబుర్లు చెప్పుకుంటున్నాము.. ఆ రోజుల్లో అంటే 1962 - 63 మధ్య రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడు శివలింగం దగ్గరున్న ఓవర్ బ్రిడ్జి దాకా ఒక రోడ్ ఉండేది. ఇప్పుడు కళానికేతన్ ఉన్న రోడ్డుకి-స్టేషన్ కి మధ్య ఆ రోడ్ ఉండేదన్నమాట. నెం 1 సిటీ బస్సు అలాగే స్టేషన్ కు వెళ్లేది. ఆ రోడ్ ప్రక్కన రైలింగ్స్ పై కూర్చుని కబుర్లు చెప్పుకుంటుండగా ఓ ఆగంతకుడు మాదగ్గరకి వచ్చాడు..
“బాబో.. ఇప్పుడు అనకాపల్లి ఎల్లిపోయొచ్చాయడానికి ఏదన్నా బండి ఉందా బాబూ ?”
శ్యామ్ సీరియస్ గా మాట్లాడుతున్నాడు. ఈ ఆగంతకుని మాటకు తిక్క రేగింది.
“పోవయ్యా.. పో అలా స్టేషన్ లో పోయి ఆడుగు..”
నేను వాణ్ని పాపం హర్ట్ చేయడమెందుకని
“రాత్రి 7-30కు ఉందనుకుంటాను.. స్టేషన్ లో అడుగు చెప్తారు” అన్నా..
“సరే బాబు .. ఆడడుగుతాను” అని నాలుగడుగులు వేసి మళ్ళీ వెనక్కొచ్చాడు ..
శ్యామ్ చాలా సీరియస్ గా ఏదో విషయం చెప్తున్నాడు.. నేనూ సీరియస్ గానే వింటున్నాను..
“బాబో .. మీరు చెప్పిన బండి రేపు కోడి కూతకు అనకాపల్లి చేరుతుందా బాబూ ?”
“ఏంటయ్యా.. ఏంటి ? ఇందాకట్నించీ దొబ్బుతున్నావు .. కోడి కూతకెల్తుందా .. ఆవు మేతకెల్తుందా అంటూ .. వెధవ ప్రశ్నలూ నువ్వూనూ.. అక్కడకి పోయి అడుగు అని చెప్పాంగా .. పో .. పోయి అక్కడడుగు. మమ్మల్ని దొబ్బకు….”
ఇంకా గట్టిగానే తిట్టాడేమో కూడా ..వయస్సుకదా ?
వాడు ఖంగుతిన్నాడు.
“అదేంటి బాబూ అలా అయిపోతారు.. నేనేటన్నాను..”
నేను కట్ చేసి, సిట్యుయేషన్ లైట్ చేస్తే బాగుంటుందని..
“అదేం లేదు.. పెద్దాయనా ! మాది పట్నం కదా. మా పట్నం కోడి… బాగా ప్రొద్దెక్కేదాకా తొంగొని, అప్పుడు లేచి బద్ధకంగా ‘కొక్కొరోకో’ అని కూస్తుంది.. మీ కోడైతే ప్రొద్దు పొడవకుండానే, చీకటుండగానే కూసేద్ది. అంచేత కోడి కూతంటే మా లెక్కలో చెప్పాలా , మీ లెక్కలో చెప్పాలా అని తెలియక మా వాడు ఇదవుతున్నాడు. అంతే ! ఇంతకీ ఏ లెక్కలో చెప్పమంటావు.. మీ లెక్కలోనా మాలెక్కలోనా..”
ఆ ఆగంతకునికి నా లెక్కల లెక్క తెలిసినట్టు లేదుకాని.. ప్రశాంతంగా అక్కణ్ణుంచి కదిలాడు.