--డి.వి. హనుమంతరావు
1943లో ఒక పుష్కరం వచ్చిందనుకుంటా.. అది నే పుట్టిన సంవత్సరం. అదయ్యాక అయిదు పుష్కరాలయ్యాయి .. ఇంత ఎండలు నాకు ఎప్పుడూ అనుభవం అయినట్లు లేదు.. అఫ్ కోర్స్ నాదగ్గర గణాంకాలు లేవు. కాని ఇలా జూన్ అయిపోతున్నా, జ్యేష్ట మాసం వెళ్ళిపోతున్నా .. రోహిణీ కార్తిని మించిన ఎండలు ఈ అయిదారు పుష్కరాల కాలంలోనూ నాకనుభవం కాలేదు. .. సాధారణంగా హైదరాబాదులో చేపల మందిస్తున్నారంటే, ఓహో మృగశిర కార్తి వచ్చింది.. వానా వానా చెల్లప్ప అంటూ డాన్స్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాను. కాని ఆ వానలు పేపరు చూడవో, లేక ఈ ఎండలు ఎలాంటి మీడియాలను అనుమతించవో తెలియదు కాని..ఎండలు పోలేదు.. వానలు రాలేదు…
మేమూ బాధ పడ్డాము కదా ..నీకేమిటి స్పెషల్ బాధ అని మీరనొచ్చు .. మిమ్మల్ని అనొద్దని నేనెందుకు అంటాను.. అయితే నా బాధ నాకే స్పెషల్, మీతో పంచుకుంటే అదో రిలీఫ్ .. పెరిగిన వయస్సు, తరిగిన రెసిస్టన్స్ ..జూన్ ఒకటవ తారీఖు మొదలు చాలా బాధ పడ్డాను.. జ్వరం, నీరసం.. సెలైనులు, మందులు .. బంధువు + మిత్రుడు అయిన రామనారాయణ్ ఆ సమయంలో నా బాధ చూసాడు .. ఎంతో సాయంగా ఉన్నాడు. అప్పుడు కంటి ఆపరేషనప్పుడూ అతనే సాయం...భగవంతుడు కొలువై ఉన్న అతని మంచి మనస్సుకు శుభం కోరుతున్నాను.
కంప్యూటర్ దగ్గర కూర్చుందామని ఎన్నోసార్లు ప్రయత్నించా.. మూడ్ లేక .. ఎండ వేడిమి తట్టుకోలేక కూర్చో లేకపోయేవాడిని .. ఈ రోజు .. లేస్తూనే మా ఆవిడ ఆనందంగా చెప్పింది.. వీధిలో నేల తడిసిందండోయ్ అని.. బాల్కనీలో నిల్చుని చల్లగాలి, కురిసీ కురవని వానా ఎంజోయ్ చేసి, ఆనందంగా ఇప్పుడే కంప్యూటర్ ముందుకొచ్చాను.
ఎండలకు సాయం కరెంట్ కోతలు, ఇన్వర్టర్స్ ఉన్నాయి కనుక కాని అదీ లేనివాళ్ళ పరిస్థితేమిటి ?
గవర్నమెంట్ లెవెల్ లో కొన్ని ప్రాక్టికల్ జోకులు వింటే .. ఎండ వేడి మరచిపోతాం. ..
ఏప్రిల్ మే నెలల్లో వాతావరణ శాఖ ఇచ్చిన ప్రకటన అంటూ పత్రికలొక వార్త వేస్తాయి. ..పెట్టేబేడా సర్దుకుని నైరుతి ఋతు పవనాలు బయల్దేరాయి, జూన్ ఒకటి కన్నా చాలా ముందే కేరళ రాష్ట్రాన్ని ఫట్ మని తాకుతాయి .. ఇంకేముంది అక్కడి నుంచి రెండు, మూడు నాలుగు రోజుల్లో మన రాష్ట్రంలోకి వచ్చేస్తాయి.. ఇక వానలే వానలు .. గొడుగులు అవీ రెడీ చేసుకోండి అంటూ … తర్వాత .. సదరు పవనాలు ఒబామాగారి దేశంలో సముద్రాలు వేడెక్కాయని అందుకని ప్రయాణంలో అంత రాయం కలిగిందని అని.. మరల పత్రికలు అంతారాయం అంటూ కొంత వ్రాస్తాయి. సముద్రం వేడెక్కడమేంటో, ప్రయాణం మొదలెట్టిన ఆయొక్క ఋతుపవనాలు టికట్ ఎందుకు కాన్సిల్ చేసుకుంటున్నాయో, నా మట్టి బుర్రకు అర్థంకాదు..
తర్వాత బలహీన పడ్డ ఋతుపవనాలు, వెనక్కి పోతున్న ఋతుపవనాలు, సముద్రంలో కురుస్తున్న వానలు…వరుసగా రోజుకో వార్త కురిపిస్తాయి పత్రికలు కాని హోల్ మొత్తం టోటల్ గా మనకి వర్షాలు--- పడుతున్నాం పడుతున్నాం అంటూ ఊరిస్తాయే కాని.. పడవు.. వెంటనే వర్షాభావం, కుదేలైన రైతన్న .. వర్షాలు పడక పోడానికి ప్రభుత్వం వైఫల్యమే కారణమన్న ప్రతిపక్షం, వానశాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ .. (కొంచెం చల్లబడ్డప్పుడు) ఆందోళనలు, దిష్టి బొమ్మల దహనాలు .. వార్తలే వార్తలు.. కదిలిన ప్రభుత్వం అఫీషియల్ ప్రొసీజర్స్ అన్నీ అయ్యాక హెలికాప్టర్ ఫాను క్రింద కూర్చుని ఏరియల్ సర్వే.. తమాషా అప్పటికి వర్షాలు బాగాపడి మునిగిన పంటపొలాలు దర్శనమిస్తాయి.[అయితే ఈ ఏడాది అంత పెద్ద వర్షాలు పడే సూచనలు ఇప్పటిదాకా లేవు.] తడిసిన పంట పొలాలు సర్వే చేయకుండా దానిక్రిందున్న బీడువారిన నేల తల్లి గురించి బోల్డు జాలిపడి రిపోర్ట్ ఇస్తాయి.. ఏంచేస్తాం .. రూల్స్ ఆర్ సచ్చీ .. కరువు బారిన రాష్ట్రానికి, వర్షాలు బాగా పడ్డాక కేంద్రం నుంచి నిధులు వస్తాయి.. అటు ప్రభుత్వ పక్షం, ఇటు ప్రతి పక్షం మనసు కుదుటబడి హాయిగా ఉంటారు ఎ.సి రూముల్లో .. రైతన్నకూడా హాయిగా ఉంటాడు చెమట చిందిస్తూ పంట పొలాల్లో …
ఇంకో గవర్న్మెంట్ జోకు అలాంటిదే .. కరెంటు కోత ఈ సంవత్సరం లేదంటూ వర్షాలు బాగా పడుతున్నప్పుడే చెప్తారు. అయితే వర్షం పడుతున్నప్పుడు కరెంట్ ఆగిపోతుంది, ప్రమాదాలు నివారించడం కోసం.
వర్షం వెలిసాక గాలికి పడిపోతున్న చెట్లు క్లియర్ చేయడం కోసం, కరెంట్ ఆపుతారు.
వర్షాలు బాగా తగ్గాక .. కరెంట్ షట్ డౌన్ .. రిపేర్లు ..
ఎండలు పెరుగుతున్న కొద్దీ ..కరెంట్ కోత పెరుగుతూనే ఉంటుంది ..
కరెంట్ వాడలేదు, బిల్లు తగ్గుతుందని మనం అనుకుంటాం, కాని కరెంట్ ఏమీ కోయబడలేదు అని .. మూడంకెల్లో ఉన్న బిల్లు చెప్తుంది. రైలు పట్టాల్లా ఖర్చు పెట్టిన కరెంటూ .. వచ్చిన బిల్లు చార్జీలు ఎప్పుడూ కలుసుకోవు … మూడు సంవత్సరాల క్రితం వాడిన కరెంట్ పైకూడా ఇప్పుడు అదనంగా కట్టించడం కొసమెరుపు …
ఎండలుంటేనే బాగుంటుందేమో ఈ ఆవేశాలు ఉండవు.. చినుకు పడగానే ఓ రెచ్చిపోతున్నాడంటారేమో అందుకని ఇక గమ్మునుంటా.. శలవు.