నేను పాల్గొన్న కవి సమ్మేళనం...
మా రాజమహేంద్రవరములోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ‘ఆంధ్ర సెంటినరీ జూనియర్ కళాశాల’ వారు 23-8-2014 నాడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 142వ జయంత్యుత్సవం చేసారు… జూనియర్ కళాశాల చైర్మన్ శ్రీ జమ్మి రామారావు గారి ఆధ్యక్షాన ఒక సభ జరిగింది.. 11మంది కవులు ఈ సందర్భంగా ఆంధ్రకేసరికి ‘కవితాంజలి’ ఘటించారు.. పాల్గొన్న పేరెన్నికగన్న కవులు …
‘శతావధాని .. శ్రీ డా॥అబ్బిరెడ్డి పేరయ్యనాయుడు
‘సరస కవి’ శ్రీ డా॥ యస్.వి.రాఘవేంద్ర రావు
‘విశ్రాంత ఉపాధ్యాయులు’ శ్రీ డా॥డి.యస్.వి.సుబ్రహ్మణ్యం
‘ఆదిత్య డిగ్రీ కాలేజీ ఉపాధ్యాయురాలు’ శ్రీమతి బి.హెచ్.వి. రమాదేవి
విశ్రాంత రైల్వే ఉద్యోగి.. శ్రీ చిరువోలు విజయ నరసింహరావు,
‘నీలోత్పల కవి’ శ్రీ యార్లగడ్డ మోహన రావు
తెలుగు ఉపాధ్యాయులు శ్రీ యం.వి.యస్ మూర్తి
తెలుగు ఉపాధ్యాయులు శ్రీ కర్రా కార్తికేయ శర్మ
విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ పీసపాటి నరసింహమూర్తి
యువ కవి, విద్యార్థి… శ్రీ సందీప్
పరిమళభరిత సాహిత్య కుసుమాలు వెదజల్లే ఈ లబ్ధప్రతిష్టులైన కవులతో పాటు తుమ్మి పూవు పాటి కూడా చేయని నాకుకూడా అవకాశం ఇచ్చారు….
ప్రకాశం పంతులుగార్కి రాజమండ్రి అంటే చాలా అభిమానమట.. ఆయన తన జీవిత చరిత్రలో అదే వ్రాసారు..
“రాజమహేంద్రవరము విద్యా వంతులకు నిలయమని, మహా పండితులకు ఆస్థానమని,గోదావరి బ్రహ్మాండమైనదనీ, ఆ దేశం వెళ్ళినవారంతా పండితులవుతారనీ చెప్పుకుంటూ ఉంటారు..”
ఆ గోదావరీ మాత ఒళ్లో పెరిగి, ఆ అమృతధారలు త్రాగినందువలన కాబోలు నేను కూడా నాలుగు అక్షరాలు కూర్చగలుగుతున్నాను …
--------
సభాసరస్వతికి వందనమాచరించి.. నేను కవితాంజలి ఘటించాను ఈవిధంగా…
“ఒంగోలు ప్రాంతంలో పుట్టి
గోదావరీ తీరానికి తరలి వచ్చిన మేటి, మన టంగుటూరి
తాత ముత్తాతలది తరగని ఆస్తి,
తనకందినది మాత్రం పేదరికం…
బాధ్యతలు మోయలేని పసి వయసులో
తల్లిపై కుటుంబ భారముంచి
గతించాడు తండ్రి..
ఎవరేమన్నా .. కాదని తల్లి ఎత్తిన
అవతారం - పూటకూళ్లమ్మ .
ఆమె పేదరికంతో ప్రేమ, ధైర్యం కలిపి పెట్టిన
ముద్దలు తిని పెరిగాడు ప్రకాశం …
అందుకే ఆయన గుండె
చెదరలేదు - జీవితాంతం ..
కనపర్తిగ్రామంలో పుట్టి
రాజమహేంద్రికి కదలి వచ్చాడు
తన లెక్కల మాష్టారు
ఇమ్మనేని హనుమంతరావు నాయుడు గారితో కలసి…
నాయుడుగారు, ఆయన సతీమణీ పంచినప్రేమ
ప్రకాశం జీవితాన్ని తీర్చి దిద్దాయి..
చిన్ననాడు చిలిపి అల్లరులు చేసినా
మెట్ కాఫ్ వంటి విద్యావేత్తల పర్యవేక్షణలో
ఎదిగి - ప్లీడరై
రెండు చేతులా సంపాదించాడు టంగుటూరి
సంపాదనపై మమకారము లేని స్థిత ప్రజ్ఞుడు
ప్లీడరు వృత్తి వదలి లీడరయ్యాడు
రాజకీయంలో జేరి..
బ్రిటిష్ వారి నెదిరించిన సమరయోధుడు
గుండుకు బదులుగా గుండె చూపాడు ఆంధ్రకేసరి …
రాజకీయ మేధావుల నెదిరించి నిల్చిన జోదు
కనుకనే .. రాష్ట్రానికి ప్రథమ ముఖ్యమంత్రి అయ్యాడు..
నాలుగు దశాబ్దాల ఆయన రాజకీయ జీవితం
ఆంధ్రదేశ చరిత్రగా నిలుస్తుంది భావితరాలకు …
నీతి, నిజాయితీ.. నిరాడంబరత, నిస్వార్థం ..
నిండిన ఆంధ్ర కేసరి జీవితం … ఎవరికైనా ఆదర్శం…
అది మనిషిని మనీషిని చేస్తుంది .. ఇది నిజం.”
[ఆ తర్వాత ప్రకాశంగారి దివ్య స్మృతికి రెండు తుమ్మి పూలు సమర్పించుకున్నాను..…]
(1)సీ॥ కనపర్తి గ్రామాన కంఠీరవ మొకటి
కన్ను తెరచి వేగ కదలి వచ్చె
కోరిక తీరగా కొదమ సింగము జేరె
రస చిత్తముల తావు రాజమంద్రి
వాదములో ప్రతివాదములో న్యాయ
సిద్ధికై గర్జించె సింహమట్లు
తొడకొట్టి లంఘించె తోటి వస్తాదుల
మీదకు కరి జీరు మెకము కరణి
తే॥గీ॥ గుండునకు బదులు పలికె గుండె జూపి
తెగువ నిల్చిన ఆంధ్రుల తేజమీవు
ఆంధ్రకేసరి నీవెగా అవని లోన
దండము లివియె కొనుమయ్య ధన్యచరిత
(2)సీ॥ వయ్యారపు నడక, వంకీల జుత్తుతో
వల్లెవాటు భుజాన వనిత తీరు
తరుణి పాత్రల నెన్నొ ధరియింప గాబోలు
తాదాత్మ్య భావము తనను నింపె
పేదవానిగ పుట్టి ప్లీడరై రాణించె
ధనము సంపాదించె తనివితీర
వీరు వారనిలేక వితరణ చేసె, నా
ర్జించిన విత్తము రేయి బవలు
తే॥గీ॥ ఏకవచనాన బిల్చు తా నెవరినైన
పదవి యున్నను లేకున్నను బాధలేదు
ధనము లేకున్ననేమాయె ధనదుడతడు
సత్యమిది టంగుటూరికి సాటి లేరు
మా అందరినీ పుష్పమాలలతోనూ,జ్ఞాపికలతోనూ, దుశ్శాలువాలతోనూ సత్కరించారు నిర్వాహకులు.. విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, సాహిత్యాభిమానులు సభలో పాల్గొన్నారు..