హరాజీకా - 11
చేజారని శీలం
రచన : డి.వి.హనుమంతరావు
యస్.యస్.యల్.సీ (ఇప్పటి యస్.యస్.సి.కన్నా ఒక క్లాసు ఎక్కువ ఇది) మాత్రం ఫస్ట్ చాన్స్ లో పాసయ్యాను. ఆ ఏడాదే ఇంట్రడ్యూస్ చేసిన పి.యు.సి - ఫస్ట్ బాచ్ లో చేరి, డింకీ కొట్టాను. సెప్టెంబర్ లో వ్రాయకుండా, మార్చిలో పరీక్షలు వ్రాసాక.. కొత్తావకాయ, మామిడి పళ్లు పట్టుకుని అన్నయ్యగారి ఊరు వెళ్లి ఇచ్చి రమ్మని నాన్నగారు నన్ను చిట్టివలస పంపారు. నేను వెళ్లిన వారానికి మా మేనల్లుడు(నాకన్నా పెద్ద) వాడికి అక్కడేదో పని ఉందని వచ్చాడు. వీడుకూడా నా ఈ కథనంలో పాత్రధారి. అందుకని పరిచయం చేస్తున్నాను. చదువరులు గ్రహింతురుగాక.
మా అన్నయ్యగారి ఊరిలో ఉండగానే మా పరీక్షాఫలితాలు వచ్చాయి. అప్పట్లో ఇంటర్నెట్ లో చూడడం లేదు కదా.. న్యూస్ పేపర్లకు డిస్ట్రిక్ట్ ఎడిషన్స్ కూడా లేవు. అన్నిచోట్లా అన్ని పేపర్లలోనూ రిజల్ట్స్ లాంటివి వచ్చేవి. సరే!అలా చూసిన ఒక పేపర్లో నా నంబర్ ఉంది. అంటే పాసయ్యాను అన్నమాట. అన్నకామాట చెప్పగానే ఆనందించాడు. ఎందుకంటే నా చదువుకు అన్నయ్య ఆర్థికంగా నాన్నగారికి వెసులుబాటు కలిగించేవాడు. సరే నాన్నగారు కూడా ఉత్తరం వ్రాసారు… ‘రిజల్ట్స్ వచ్చాయి కనుక ఇంటికొచ్చేయ’ మని.’తర్వాత చదువులగురించి ఆలోచించాలి కదా’ అని.
అన్నయ్యగారి ఊరు వచ్చిన మా మేనల్లుడుకూడా తన పని అయిపోయిందని తిరుగు ప్రయాణానికి నాతో రెడీ అయ్యాడు. అన్నయ్య గారి చిట్టివలసనుంచి రాజమండ్రి రావాలంటే వైజాగ్ వచ్చి రైలు కాని బస్సు కాని ఎక్కాలి. బస్సులు కూడా ఆ రోజుల్లో డైరెక్ట్ గా లేవు. వైజాగ్ టచ్ చేయకుండా డైరెక్ట్ అనకాపల్లి అలా రాజమండ్రి వెళ్లడానికి .. లారీలు అవీ వెళ్తుంటాయని. అలా వెళ్తే డబ్బులు, టైము కలసొస్తాయని - మా మేనల్లుడికి ఎవరో చెప్పారట. ఇంకేముంది సెంటర్ లో నుంచుని, రాజమండ్రి వెళ్లే లారీకోసం ప్రయత్నం మొదలెట్టాడు,. చివరకు తుని దాకా వెళ్లేలారీ దొరికింది. లారీ అనకాపల్లి నుంచి లోడ్ తో వచ్చింది. ఇప్పుడు ఖాళీగా పోతోంది. మా మేనల్లుడు లౌక్యమంతా ఉపయోగించి వాడితో మేటర్ సెటిల్ చేసాడు. భోంచేసి మేం పన్నెండింటికి బయల్దేరితే సాయంత్రానికి తుని చేరతాము. అక్కడున్న మా పిన్నిగారింట రాత్రికి ఆగి, మర్నాడు ఉదయమే అన్నవరం వీరవేంకటసత్యనారాయణస్వామి వారి దర్శనం చేసుకుని, మధ్యాహ్నానికి ఇంటికి చేరొచ్చు. అదీ ఆలోచన. ఎలాగా దేవుని దయవలన పరీక్ష పాసు అయ్యాను కదా, స్వామికి కృతజ్ఞతాపూర్వక నమస్కారములు సమర్పించుకోవచ్చు అని … మనం అనుకున్నట్టు అన్నీ అవాలనేముంది ?
లారీ బయల్దేరింది.. మేమనుకున్నట్టు పన్నెండుకి కాదు, నెమ్మదిగా రెండింటికి హుషారుగా బయల్దేరింది. కొంచెం దూరంపోయాక, మా రూట్ మార్చి, ప్రక్కకు తిరిగి కొంచెం దూరం పోయి .. అక్కడ ఓ షాప్ ముందు, లారీలో ఉన్న లోడ్ దింపాడు. అంటే బయల్దేరేటప్పటికే ఈ లోడ్ చిట్టివలసలో లోడ్ చేశాడన్నమాట.. సరే అక్కడనుంచి ప్రక్క ఊరు .. అక్కడ మళ్లీ లోడ్ ఎక్కింది. అది పుచ్చుకుని ఇంకో చోట. ఇలా అటూ ఇటూ తిరుగుతూ లారీ ఇంకా సబ్బవరం కూడా రాకుండా మధ్యలో ఆగిపోయింది. అటూ ఇటూ తిరగడంలో ఆయిల్ అయిపోయింది. అప్పటిదాకా పడుకునిఉన్న క్లీనర్ ను లేపి ప్రక్కఊళ్లో ఆయిల్ పట్టుకురమ్మని డబ్బా, డబ్బులూ ఇచ్చి పంపి, డ్రైవర్ గారు పైకెక్కి పడుకున్నాడు. మమ్మల్ని కాబిన్ లో కునకమన్నాడు. అప్పటికి రాత్రి సుమారు తొమ్మిది దాటిందేమో. ఎలాగా అనకాపల్లి చేరిపోతామని ఏమీ తినలేదు. ఆకలి మొదలైంది. ఈ వెళ్లిన క్లీనర్ మహాశయుడు వచ్చేటప్పటికి చాలా సేపు పట్టింది. వాడు వచ్చి ఆయిల్ పోసి, వాడి గురువుగార్ని లేపకుండా తానే లారీ నడపి నెమ్మదిగా అనకాపల్లి చేర్చాడు. ఇక్కణ్ణించి బోల్డు రైళ్లుంటాయి పొమ్మన్నాడు. రాత్రి పన్నెండవుతోంది. లారీ దిగినదగ్గర్నుంచి ఒక రిక్షామాట్లాడుకుని, అందులో స్టేషనుకి చేరాము. ఆకలి చచ్చింది. దాహమేస్తోంది. స్టేషన్ లో ఏదో కుళాయి ఉంది కాని అందులోంచి, సౌండ్ తప్ప నీళ్లు రావటం లేదు. “ఒరేయ్ రాజూ, దాహమేస్తోందిరా” అంటే మా మేనల్లుడు “ఒరేయ్ . వచ్చేదారిలో ఏదో సినీమాహాల్ ఉంది, అక్కడ ఏ సోడాయో తాగి, నాకు బిస్కట్లేమైనా ఉంటే పట్రా” అని పంపాడు.
సరే అని బయల్దేరా… స్టేషన్ బయటికి వచ్చా. వేసవి కాలం. అర్థరాత్రి. చల్లటి గాలులు నెమ్మదిగా వీస్తున్నాయి. స్టేషన్ బయట ఓ ప్రక్క కొన్ని ఇళ్లున్నాయి. బయట మంచాల మీద ఆ అర్థరాత్రి, మగాళ్ళు ఆడాళ్లూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ముందు నేనంతగా గమనించలేదు. వాళ్లున్న మంచాల ముందర్నించి వారిని దాటి రెండడుగులు వేసా.. ఓ స్త్రీ కంఠం వినపడింది. “ఏయ్ బాబూ… ఇలా రామ్మా” అంటూ … ఎందుకో పిలుస్తోందని ఆ కంఠం వైపుకు రెండడుగులు వేసా… ఆ స్త్రీని చూడబోయా .. ఒక్కసారి గతుక్కుమన్నా… ఆ అమ్మాయి చేతిలో సిగరెట్ కాలుతూ కనపడింది. పైగా అక్కడ మగాళ్ళు కూడా ఉన్నారు. అమ్మో! ఏదో తేడాగా ఉంది వ్యవహారం -ఎలాగరా భగవంతుడా ! క్రొత్త చోటు.. అప్పటికి నా వయస్సు 16ఏళ్లు. ఆ సంవత్సరమే నాకు ఒడుగు చేసారు. ఒడుగులో నన్ను దీవించి వీళ్లూ వాళ్లూ పెట్టిన ఉంగరాలు చేతికున్నాయి. ఉంగరాలకున్న రాళ్లు బాగా మెరుస్తున్నాయి. బొటనవ్రేళ్లతో మెరుస్తున్న రాళ్లను పైకి కనిపించకుండా చేతి లోపలకి జరిపేసా. తెలివితేటలెక్కువగా మరి. ఈ లోగా ఆ అమ్మాయి మళ్లీ పిలిచింది. “దామ్మా ఇలా దగ్గరకి రా, ఇలా కూర్చో” అంటూ… నా ప్రాణాలు పైకి పోవడానికి దారి వెతుక్కుంటున్నాయి అనిపిస్తోంది. వెనక్కి స్టేషన్ కు పోవాలంటే వీళ్ళని దాటి వెళ్లాలి. అందుకని.. ఇప్పుడే వస్తా .. అంటూ రెండోవైపు పరుగో నడకో తెలియని అయోమయంతో సాగిపోయాను. వెనకాలనుంచి .. ఆడ,మగ నవ్వులు కోరస్ గా వినపడుతున్నాయి.. కొంపదీసి వచ్చేస్తున్నారేమో పట్టుకుపోతారేమొనన్నభయంతో సినీమా హాల్ దగ్గరకి చేరాను. సోడాకొట్టుదగ్గరకొచ్చాక ఊపిరి పీల్చుకున్నాను. ఓ సోడా తాగా… ఏదో బిస్కట్ ప్యాకెట్ కొన్నా.. డబ్బులిస్తూ ఆ సోడా అబ్బినడిగా.. “స్టేషన్ కు పోవాలంటే ఇంకో దారేమన్నా ఉందా..”అని. “మీరు వచ్చిన దారినే వెళ్లిపోండి, ఇదేదగ్గర” అన్నాడతడు. “అలా అని కాదు, అక్కడెవరో అమ్మాయి, సిగరెట్ త్రాగుతూ నన్ను పిలుస్తోంది, భయమేస్తోంది” అన్నా భయం భయం గా.. ఆ సోడా కొట్టువాడు, సోడా కొట్టినట్టు గట్టిగా నవ్వాడు, నవ్వి.. “ఏయ్ పంతులు, ఇంకోదారి ఉంది.. అలా వెళ్తే … చెయ్యట్టుకు లోపలకి లాగేసి తలుపేసేస్తారు.. వెళ్తావా ?” అన్నాడు... “అమ్మో తలుపేసేస్తే ఇంకేమన్నా ఉందా?” అని జరగనిదేదో జరిగినట్లు ఊహించేసి.. సోడావాడికేసి చూసి, ఓ వెర్రినవ్వు నవ్వి… వచ్చినదారినే వెనక్కి మళ్లి … “దేవుడా … దేవుడా ..” అనుకుంటూ స్టేషన్ వైపుకి నడిచా… ఈసారి ఎవరూ పిలవలేదుకాని… “రా రో యి మాఇంటికి” లాంటి ఆడపాటలు.. కవ్విస్తున్న మగనవ్వులు - ఈ నేపథ్యంలో స్టేషన్ లో పడ్డా .. నాకన్నా పెద్దవాడయిన మేనల్లుణ్ణి పట్టుకుని భోరుమందామని.. నిద్రలోంచే వాడు “ఏమిటిరా ఇంతసేపు జేసావు?” అంటూ అటు తిరిగి పడుకున్నాడు.. నాగోడువినకుండా….