రాజమహేంద్ర"వరం"
---డి.వి.హనుమంతరావు.
స్కూలుకి శలవులొస్తే కాకినాడ వెళ్ళాలనిపించేది. ఎందుకంటే అక్కడ పిన్నిగారిల్లు చాలా పెద్దది. మామయ్యగారి పిల్లలు అక్కడ ఉండేవారు. వాళ్ల పెద్ద కాంపౌండ్ లో నాలుగైదు కుటుంబాలలో మా ఈడు పిల్లలతో సరదాగా గడుస్తుంది. అప్పట్లో తలిదండ్రుల చాటు బిడ్డలం కదా.. అమ్మా నాన్నగారు యస్ అనాలి. యస్ అన్నారంటే ఇక పరుగో పరుగు.
ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులో గంటంపావులో కాకినాడ చేరుతున్నాము కాని అప్పట్లో రెండున్నర గంటలు పట్టేది. దారిలో .. రాజానగరం, నల్ల చెరువు, సామర్లకోట అలా అన్నిచోట్లా కనీసం పది నిముషాలు చొప్పున ఆగేది. అప్పుడేమీ విసుగనిపించేది కాదు. అలా అలవాటు పడిపోయాం.
బస్సులో కాకినాడ చేరుతుంటే, ముందుగా అప్పటి కోటిపల్లి రైలు వంతెన తాలూకు శిధిలాలు …అ రాతిస్తంభాలకు చేతనత్వం వచ్చి స్వాగతం పలికినట్టుండేవి.. ఇటువైపు రాజమండ్రి చేరేటప్పుడైతే .. రాజానగరం రూట్ లో -- ఇటూ అటూ పెద్ద పెద్ద మర్రి చెట్లు.. మర్రి పళ్లు రాలుతుంటే ఆవి ఏరుకొని తింటూ కోతులు బస్సుల కడ్డంగా వచ్చేవి.. బస్సు దగ్గరవగానే పరుగెత్తి చెట్లెక్కేసేవి.. మా చిన్నతనంలో ఆ కోతుల గంతులు చూడ్డం భలే సరదాగా ఉండేది. ఇప్పుడు.. ఆ చెట్లు లేవు, ఆ కోతులూలేవు .. ఆ చిన్నతనమూ లేదు… ఆ సరదా లేదు. కాని ఈమధ్య ఆ రూట్ లో వెళ్తుంటే గ్రీనరీ బాగా కనిపించింది.
జనరల్ గా రాజమండ్రి గొప్ప సిటీయా, లేక కాకినాడా ? అన్న సబ్జెక్ట్ మీద కాకినాడలో పిల్లలదగ్గర హాట్ హాట్ గా చర్చలు జరిగేవి. అక్కడ వాళ్లందరూ కాకినాడ వాళ్లే.. నేనొక్కడినే రాజమండ్రి.. వాళ్లకి బోల్డ్ పాయింట్స్..బోల్డు గొంతుకలు .. సిటీ ప్లాన్డ్, సెకండ్ మద్రాస్ అని కాకినాడకు పేరు.. రోడ్లన్నీ వెడల్పుగా నీట్ గా ఉంటాయి అన్నది పాయింట్..
రాజమండ్రి చూస్తే .. అప్పటి మెయిన్ రోడ్ గురించి ఏం చెప్తాం.. ఇప్పుడున్న వెడల్పుకి సగం ఉండేది మా చిన్న తనంలో .. ఈ షాప్ నుంచి, ఒక్క దూకు దూకితే అవతల వైపు షాపులోకి పడతాం. అంత నేరో. నిజం. అందులో ఫ్లోటింగ్ పాపులేషన్.సముద్ర ప్రవాహంలా ఉండేది ట్రాఫిక్. ప్రక్క పల్లెటూళ్లనుంచి, రైళ్లలోనూ, బస్సుల్లోనూ… ప్రొద్దున్నే వచ్చేసి, బజారు పనులు చూసుకుని సాయంత్రం వెళ్లేవారు. ఫోర్ట్ గేట్ సెంటర్ లో నిల్చుంటే మన ప్రమేయం లేకుండా ఆ చివరకు వెళ్ళిపోతాం ... అందులోనూ ఊళ్లోవారికి ఏం కావాలన్నా అక్కడకు రావల్సిందే. ఇప్పటి లాగా ఎక్కడ పడితే అక్కడ అందుబాటుగా కొట్లుండేవి కాదు కదా…అస్తవ్యస్తమైన ట్రాఫిక్.
ఈ పాయింట్ మీద వాళ్లు విజృంభించేవారు. నా డిఫెన్స్… జనం లేనప్పుడు ఎంత రోడ్దుంటేనేమిటి కళా కమామీషు లేకుండా వెల వెల బోతూ ఏం బావుంది అనే వాణ్ణి.. పైగా ఒక బానర్ కట్టాలంటే ఆ మూలనుంచి ఈ మూలకు బోల్డుపురికోస. అసలు బానర్ తక్కువ, అక్కరలేని పురికొస ఎక్కువ. అసహ్యంగా, పైగా అదంతా వేస్ట్. .. మాకైతే అటో ముక్కా, ఇటో ముక్కా .. చక్కగా బానర్ కనపడుతుంది.. అందంగా ఉంటుంది అనేవాణ్ణి.
అప్పటికే సిటీ బస్సులు తిరిగేవి కాకినాడలో… మనకైతే వచ్చాయి కాని అంత పద్దతిగా లేవు. అదో పాయింట్. నా డిఫెన్స్ … మీరు నడక మానేసారు. అది మీ ఆరోగ్యానికి దెబ్బ.. మేం చక్కగా నడుస్తాం.. అందుకనే బస్సులు ఉన్నా మేం ఎక్కం అనేవాణ్ణి. అంటే .. బస్సు ఉంటే కదా ఎక్కడానికి… ఉన్నా ఎక్కం.. అలా సాగేది.
మాకు గోదావరి ఉందంటే.. మాకు సముద్రం ఉంది, అందులోనే కలవాలి మీ గోదావరి అనేవాళ్లు. మా గోదావరి నీళ్లు తియ్యగా ఉంటాయి, మీ నీళ్లు ఉప్పగా ఉంటాయి అని దాడి చేసేవాణ్ణి.. ఇంక
రాజమండ్రికి ఉన్న మంచి పాయింట్ అప్పట్లో మనకు 7 సినీమా హాల్స్ ఉన్నాయి. వాళ్ళకు మనకన్నా ఒకటి తక్కువ .. అయితే అక్కడ అన్ని హాల్సు ఒకే రోడ్ లో ఉన్నాయి. ఇక్కడ తలో చోటా ఉన్నాయి. ఆ మూల అశోకా పిక్చర్ పేలస్. ఇప్పుడైతే దాన్ని 1.అశోక మహల్ అంటున్నారనుకుంటా.. మొదట్లో గజలక్ష్మి అనేవారుట. మంచి పిక్చర్స్ వచ్చేవి. బాల్కనీ ఉండేది.. మా భాషలో మేడ టిక్కట్ .. పైన కాంటీన్ కౌంటర్…. క్రిందకు కనిపించేది. పాత ఇంగ్లీష్ పిక్చర్స్ లో బార్ కౌంటర్ లా ఉండేది.అంటే ఎత్తు కుర్చీలు, పొడుగు బల్లా… బ్రెడ్ జామ్ లాంటి బేకరీ స్టఫ్ ఉండేది. ఆ హాలు మేనేజర్ గొప్ప పెర్సనాలిటీ.. అచ్చు యస్.వి.రంగారావుగారిలా ఉండేవారు. అలా అంటే ఆయనకిష్టాముండదట. ఎందుకో మరి. అయినా మనకెందుకు ? సరే ఇలా గోకవరం బస్టాండ్ వైపుకొస్తే .. 2.రామా టాకీస్. ఇప్పుడు దానిపేరు నాగదేవి. ఆ ఎదురుగా ఉన్న వీధిలో మేం కొన్నాళ్లు కాపురం ఉన్నాం. ఆ హాలు ప్రక్కనే జిత్ మోహన్ మిత్రా గారిల్లు. అప్పట్నించి ఇప్పటిదాకా అక్కడే మిత్రుడు మిత్రా ఉండేది. ఆ పాటలు విని విని వారికి బాగా పాడడం వచ్చేసింది. అద్భుతమైన సింగర్. పేటెంట్ ఫర్ కిషోర్ కుమార్ సాంగ్స్. దాని ఎదురుగా ఉన్న రోడ్ లో 3.హనుమాన్ టాకీస్ .. అది జయశ్రీ గారూపాంతరం చెంది, ఇప్పుడు సూర్యా .. సూర్యా మినీ పాలస్ గా చలామణీ అవుతోంది. ఈ హనుమాన్ టాకీస్ ఎదురుగా బోల్డు ఖాళీ స్థలం. చర్చ్, పోలీస్ గస్ట్ హౌస్ అప్పుడు ఇవేవీ లేవు. సాయంత్రమయ్యేటప్పటికి సినీమా పాటలు గ్రామఫోన్ రికార్డులు వేసేవారు. ఆ ఆరుబయట ఎంతోమంది కూర్చుని వినేవారు. అప్పట్లో అన్ని సినీమా హాల్స్ లోనూ నేల టిక్కట్ (వీపులేని బెంచీలు వేసేవారండోయ్) పావలార్థణా ఉండేది. -- బెంచీకి వీపా అనకండి. అర్థం చేసుకోండి. మీరర్థం చేసుకుంటారు నాకు తెలుసు.--- సరే ! ఇతర థియేటర్స్ లో ఆడినంత కాలం ఆడి,, అలా ఆడిన సినీమాలు ఈ హాల్ కి వచ్చేవి .. ఇక్కడ నేల మూడణాలు. వాల్ పోస్టర్ మీద 0-3-0 అని వ్రాసేవారు. కొన్ని సినీమాలకైతే బేడా కానీ కూడా ఉండేది. అంటే సగం రేటన్నమాట. పావలార్థణాలో సగం ‘బేడా కాని’ కదా.. అలా ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ వైపుకొస్తే ఆ ఎదురుగా ఉన్న సందులో లోపలికి వెళ్తే 4.మినర్వా టాకీస్ . అది తర్వాత అన్నపూర్ణ అయింది. ఈ మినర్వా టాకీస్ ఓనర్స్ నిడమర్తి వారనుకుంటా. వైజాగ్ లో ఉన్న మినర్వా టాకీస్ కూడా వీరిదే అనేవారు. అక్కడ నుంచి దక్షిణంగా వెళ్తే 5.కృష్ణా. అది కూడా నిడమర్తివారిదే అప్పట్లో… ఈ నిడమర్తివారికి దుర్గా సినీటోన్ అని ఒక స్టుడియో ఉండేది. మొట్ట మొదటి తెలుగు ఫిల్మ్ స్టుడియో అదే .. అందులో సంపూర్ణ రామాయణం షూటింగ్ జరిగింది. ఇప్పుడు కృష్ణా థియేటర్ సాయీ కృష్ణ అయి మరల పేరు మార్చుకుంది. ఈ హాలు రోడు మీదకి వీధిగుమ్మం, పెరట్లోనుంచి టిక్కట్లు ఇస్తారు. కొన్నాళ్లు సైడులోంచి ఇచ్చేవారు.అప్పట్లో కృష్ణా టాకీస్ లో రఘురామయ్య వాళ్లూ నటించిన శ్రీ కృష్ణ తులాభారం సినీమా వేసారు. మా ఇల్లు పేపర్ మిల్లు దగ్గర. సుమారు అయిదు మైళ్లు. నడకలే. అప్పుడు సైకిల్ రిక్షాలు గట్రా లేవు. కొద్దిగా లాగుడు రిక్షాలు ఉండేవి. మా అమ్మగారు పేటలో వాళ్లను పోగేసి మాపిల్లలను తీసుకుని ఆ పౌరాణిక సినీమా చూడ్డానికి తీసుకెళ్లింది. మేం వెళ్లేటప్పటికి కొంత సినీమా అయిపోయింది. సినీమా అయిపోయాక తర్వాత ఆటలో ముందు మేం చూడలేకపోయిన సినీమా చూస్తానంటుంది ఈవిడ. అలా కుదరదంటాడు హాలు. అంత దూరం నుంచి ఈ కాస్త ముక్క కోసం మళ్ళీ ఏం వస్తాం.. చూడాల్సిందే అని ఈవిడా…. మొత్తానికి ఒప్పుకున్నాడు. అది కాస్తా చూసి, నెమ్మదిగా ఇంటికి చేరాం. అక్కడనుంచి మెయిన్ రోడ్ మీదకొస్తే 6.జయా టాకీస్. తర్వాత అది విజయా టాకీస్ అయింది. దీని వొనర్ వోల్టా ప్రొడక్షన్స్ బేనర్ మీద సినీమా కూడా తీసారు. ఇందులో హిందీ సినీమాలు ఆడేవి. దుబాసీలు ఉండేవారు. అంటే హిందీకి తెలుగు చెప్తారు. వారి వారి చమత్కారాలు కూడా జోడించి సరదాగా చెప్పేవారు. ఒకసారి విన్న గుర్తు. 7. శ్యామలా .. అది అన్నింటికన్నా లేటెస్ట్ అన్నమాట. అన్ని థియేటర్స్ లోనూ నాలుగణాలన్నర నేల టిక్కట్ అయితే ఇక్కడ అయిదణాలు. దాన్ని బట్టే మిగతా టికట్స్ ధరలు అని పాఠకులు గుర్తించాలి. చాలా కాలం ఇవే హాల్స్. నగరంలో సినిమాలు అని ప్రతీ హాల్ లోనూ బోర్డ్ ఉండేది. నగరం కంప్లీట్ చేయడం అంటే ఒక రౌండ్ అన్ని సినీమాలు చూడగలగడం మా వయసు వారికి ఓ అచీవ్ మెంట్. తర్వాత స్వామి,కుమారి.. కేవలం ఇంగ్లీష్ సినీమాల కోసం లక్ష్మీ, గంగ, యమునా,సరస్వతి, వీరభద్రా (తర్వాత అదే శివజ్యోతి అయింది.)నటరాజ్, జయరాం .. ఇలా చాలా వచ్చాయి. సినీమాలు చూడ్డం తగ్గిపోయిన నాకు కొన్ని హాల్స్ పేర్లు కూడా ఇప్పటివాటివి తెలియదు. తర్వాత్తర్వాత రాజమండ్రికి ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ వచ్చి ఆఫీసులు తెరచి,
ఇన్నీస్ పేట పేరును, టి.నగర్ గా మార్చారు. మద్రాసులో టి. నగర్ లో సినీమా ఆఫీసులు, స్టూడియోలు ఉంటాయిష ..
అప్పుడు బస్సులన్నీ గోకవరం స్టాండ్ నుంచి బయల్దేరేవి. కాంప్లెక్స్ కాని కోటిపల్లి బస్టాండ్ కానీ లేవసలు. అయినా ఊరిపేర్లతో బస్ స్టాండ్ కొంచెం కన్ఫ్యూజన్ కదా. గోకవరం బస్టాండ్ అంటే గోకవరంలో ఉన్న బస్టాండా లేక గోకవరం వెళ్ళడానికి రాజమండ్రిలోని బస్టాండా. రెండూ కాదు, రాజమండ్రిలో ఆ పేరుమీద పిలవబడే ఒకానొక బస్టాండ్ .. mutatis mutandis.. కోటిపల్లి బస్టాండ్ కూడా అంతే.
మొట్ట మొదట వైజాగ్ కు ఇక్కడనుంచి ఎక్ష్ప్రెస్స్ బస్ వేసారు. ఆ బస్సుల వాళ్లు భలే టైమింగ్స్ మెయింటైన్ చేసేవారు. ఉదయం సరిగా 6గంటలు బయల్దేరి 11 అయ్యేటప్పటికి వైజాగ్. అలాగే ఉదయం 6గంటలకి వైజాగ్ లో .. 11కల్లా రాజమండ్రి. మధ్యాహ్నం ఒంటిగంటకో బస్సు అట్నుంచీ, ఇట్నించీ కూడా ఉండేవి. కొత్తలో లోపల ప్రయాణీకులకు పెప్పర్ మెంట్స్ పెట్టేవారు. రాజమండ్రి మీదుగా హైదరాబాదుకు బస్సులుండేవి. అయితే అప్పుడు రోడ్ కం రైలు బ్రిడ్జ్ లేదు. అందుకని గౌతమీ జీవకారుణ్య సంఘం ఎదురుగా లాంచీ ఎక్కి అటు ఇంకో బస్సు ఎక్కేవారు. ఆ బ్రిడ్జ్ లేకపోవడం వలన, అలాగే రావులపాలెం దగ్గర సిద్దాంతం దగ్గర బ్రిడ్జ్ లు లేకపోవడం వలన .. కోనసీమ పంటలకు రాజమండ్రీయే పెద్ద మార్కెట్. అరటి పళ్లు, కొబ్బరి ఇలాంటివన్నీ ఇక్కడకొచ్చేవి. చవకగా కూడా ఉండేవి.
జీవనది గోదావరివలన రాజమండ్రి ఉనికి. ఎంతో మందికి ఈ పావన గౌతమి జీవనాధారం. ఒకప్పుడు గోదావరి మూలాన రాజమండ్రిలో కలప వ్యాపారం బాగా సాగింది. గోదావరి పరీవాహక ప్రాంతం కావున ఇక్కడ దొరికే మట్టి .. గ్రాఫైట్ క్రుసిబుల్స్ కు ఉపయోగపడుతుంది కనుక ఇక్కడ ఎన్నో క్రుసిబుల్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ నదీ జల పానం వలన కవిత్వం వస్తుందని చెప్తారు. టంగుటూరి ప్రకాశంగారు తన జీవిత కథలో వ్రాసారు కూడా . అందుకనే ఆయన రాజమండ్రి పై మక్కువ పెంచుకుని ఇక్కడకు మకాం వచ్చేసారు.
ఎంతైనా మన రాజమండ్రీ ... రాజమండ్రియే
భగవంతుడిచ్చిన వరం …
మన రా జ మ హేం ద్ర "వ రం" ….