Pages

Friday, June 22, 2012

పన్ డిత ప్రజ్ఞ

{ఉపోద్ఘాతం: నిత్యజీవితంలో చాలా చోట్ల చూస్తూ ఉంటాము. ఉపన్యాసాలలో మాట్లాడేటప్పుడు కొందరు విషయము చక్కగా మాట్లాడుతారు.. కాని కొందరు విషయాన్ని వదిలేసి తమకు వచ్చిన విషయాన్నంతా చెప్పేయాలనే ఉబలాటం చూస్తూ ఉంటాము.  పత్రికలలో సమాధానాలు శీర్షికల్లోకూడా ఈ అసాధరణ ప్రజ్ఞ కనపడుతూ ఉంటుంది.. ఆ నేపథ్యంలో ఈ పన్ డిత ప్రజ్ఞ... అవధరించండి.}
                          ---------------

ప్రశ్న:         నమస్కారమండీ... ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్యం అంటే మీకేమనిపిస్తున్నది ?
జవాబు:     నమస్కారమండి. 1847-లో ఒక ప్రఖ్యాత రచయిత తన నవల "క్రిస్ట్ కా  జీన్" లోని నాయకుడు       హస్నాహెంపా "మా ముగ్గురితో   సమానమైన వ్యక్తులు లే" రంటాడు. "ప్రజాస్వామ్య భవిష్యత్తు చూసేటందుకు భాష రావాలా" అంటాడు మర్స్ కాడింగా అనే ఫ్రెంచి  శాస్త్రజ్ఞుడు.  పదిహేడవ దశాబ్దపు తొలిదశకంలో పాస్లీ యుద్ధ
వాతావరణ నీడలో......
ప్రశ్న:        ఒక్క ముక్క అర్థం అవటం లేదు... అయ్యా మరొక ప్రశ్న.. కులవ్యవస్థ ఇంత భయంకరంగా వేళ్లూనుకు పోతున్నదికదా .. దీనిపై మీ   అభిప్రాయం శలవీయండి.
జవాబు:     మొదటి ప్రపంచ యుద్ధమయ్యాక, ఒక నాటి సూర్యాస్తమయ సమయంలో, ఇంకా పూర్తిగా సూర్యుడు పశ్చిమ కనుమలలోకి కృంగక  మునుపు, ప్రశాంత, నిశ్చల, నిశ్శబ్ద గంభీర వాతావరణంలో నైలునదీ పరీవాహక ప్రాంతంలో ... బోగన్ విల్లాయో లేక మజ్జీకారానోయో  చెట్టు నీడలో.. ద్రవిడజాతికి చెందిన ఒక యువకిశోరం చేపలు పట్టుకుంటూ ఉంటే ఒక ఉత్తమజాతికి చెందిన చేప ... చక్కటి వర్ణంగల చేప దొరికింది. అది తిందామనుకుంటున్న సమయంలోనే హరప్పా నాగసాకీ పై బాంబుదాడి జరిగి.....
ప్రశ్న: అయ్యా! నేనడిగినదానికీ, దీనికీ సంబంధం ఏమిటో నాకైతే అర్థం కావటంలేదు.
 సరే ! ముచ్చటగా మూడో ప్రశ్న.. మన ప్రాంతంలో ఈ మధ్య హ్యూమరు క్లబ్బులూ, లాఫింగు క్లబ్బులూ అంటూ, అలాగే కామెడి  సినీమాలు, కామెడీ కథలు అంటూ ఇలా హాస్యానికి పెద్దపీట వేస్తున్నారు కదా..అసలు నవ్వు జనానికి అంత అవసరమా... దాని గురించి  కొంచెం వివరిస్తారా ?
జవాబు: ఐశ్వర్యవంతులకీ ... అతి సామాన్యులకూ మధ్య ఎన్నో మెట్లు ఉన్నాయని పద్ధెనిమిదవ శతాబ్దపు తొలిరోజులలో ఒక పరిశోధన జరిగింది. దానికి వాసిన సిద్ధాంత వ్యాసం 1854 పేజీలపైన ఒక బ్రహ్మాండమైన గ్రంథం అయింది. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుగా చరిత్రకు  ఎక్కిద్దామంటే... అప్పటికి ఇంకా గిన్నీస్ బుక్ గురించి ప్రపంచ మేధావులకు తెలియదు. అప్పటికింకా తాజ్ మహల్ కట్టబడలేదు,  సరికదా కట్టడానికి రాళ్లెత్తేకూలీలనుకూడా కుదుర్చుకోలేదు. ఎవరు వచ్చి రాళ్లెత్తుతారో తెలియని పరిస్థితి.. వాళ్లెవరో తెలిస్తేకదా పాటలు  పద్యాలు వ్రాయడానికి. అలాంటి అయోమయ పరిస్థితిలో అలాంటి లౌకిక జీవన విధానంలో.....
ప్రశ్న:  అయ్యా...అయ్యా....నాకు మెంటలెక్కిపోతోంది.. అయినా కార్యక్రమం చెయ్యక తప్పదు.. ఇంకొక్క ప్రశ్న... ఇది ఆఖరిది... చాలా సింపుల్ గా  అడుగుతాను.. డైరెక్ట్ గా జవాబు చెప్పండి. మనిషికీ మనిషికీ మధ్య ఇప్పుడు ప్రేమాభిమానాలు తగ్గుతున్నాయని అందరూ    అంటున్నారు కదా... ఎందువల్ల నంటారు.
జవాబు: 1757లో దేశాన్ని ఏలిన స్వార్థపూరిత రాజుల రాజ్యపటిష్టత పేకమేడలా కుప్పకూలిపోతున్న తరుణంలో, రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండునుంచి   పొగ బండిలో మనదేశానికి వస్తూఉంటే "జ్యుయల్ ఇన్ ది బ్రిటిష్ క్రౌన్" గురించి అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో డార్జిలింగు నదీ తీరంలో రాజ్యాధికారుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారము....
ప్రశ్న:  అయ్యా ! మీ సమాధానాలు వినే ఓపిక నాకు లేదు.ప్రోగ్రాం టైము కూడా అయిపోతోంది. పిల్లి అంటే మార్జాలంలాగా సాగే ఈ జవాబులతో.....
జవాబు: సరేగాని యాంకరుగారూ ! పిల్లి అంటే మార్జాలం అంటూ ఉంటారు కదా.. అంటే ఏమిటో కాస్త వివరిస్తారా ?
ప్రశ్న: ఏమిటా... వినండి... కళ్లికోట యుద్ధానికి ముందు ప్లాస్లా యుద్ధంలో...అంటే పదిహేడవ శతాబ్దపు తొలి దశకంలో ఔరంగజేబు కోటగోడమీదనుంచి పసిఫిక్ మహా సముద్ర మధ్య ప్రాంతంలో గన్స్ ఆఫ్ టుటికోరన్ అనే యుద్ధ నౌక జండా కొయ్య మీద వ్రాలిన మార్జాలన్నిపిల్లి అంటారు. తెలిసిందా...?
జవాబు:  అర్థం కాలే....

                        ---------------------

Monday, June 4, 2012

మా శ్రీమతి రచన "భక్తి విజయ గీతిక" .....


నా శ్రీమతి .. దినవహి విజయలక్ష్మి భగవద్దత్తముగా కలిగిన స్ఫురణతో సుమారు 200 పాటలు భగవత్పరముగా వ్రాసి పరాత్పరునికి సమర్పించుకున్నది. పాట సాహిత్యము దానితో పాటు సంగీత స్వరమూ ఆమెకు స్ఫురణ కు రావడము విశేషము. మీదు మిక్కిలి భగవదనుగ్రహము. అందులోని 108 పాటలు ఎంచి "భక్తి విజయ గీతిక" అనే చిన్ని పుస్తకము ప్రచురించడము జరిగింది. ఆ పుస్తకము మా గురుదేవులు, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు తమ పవిత్ర హస్తములతో ఆవిష్కరించారు. శ్రీ శర్మగారు  ముందు మాట కూడా వ్రాసారు. ఆ పాటలను నా బ్లాగుద్వారా మనవారందరికి పరిచయము చేయాలనే ఉత్సాహము ... వీటి స్వరము తెలుసుకోవాలంటే
www.yourlisten.com ద్వారా ఆవిడ పాడిన పాట వినవచ్చు. dvhrao.blogspot.com లో కూ డా ఆ లింకు దొరుకుతుంది. సాహిత్యము, గానము వినగోరుతున్నాను. మీస్పందన తెలియజేయండి .. మిత్రులకు చెప్పి ప్రోత్సహించండి.  



మేలుకో శ్రీ మాతా మేలుకోవమ్మా
మేలుకొని ఈ జగము నేలుకోవమ్మా   |మేలుకో|

బ్రహ్మాండధారిణీ కనులు తెరవకవుంటే
దివ్యలోకములన్నీ తల్లడిల్లేనమ్మా
మేలుకో శ్రీమాతా మేలుకో.....

1, వేదమాతలు నీకు సుప్రభాతము పాడె
ముక్కోటి దేవతలు నిను పూజించె 
సకల కుసుమములు నీకై ఎదురు చూసెనమ్మ
సువాసనల నర్పించి  నీ పాదాల ఒదుగుటకై   |మేలుకో|


2. సంధ్యా గాయత్రి ఎదురు చూసెనమ్మ
ప్రణవనాదము నీకు ఆలపింపగా 
సకల నదీ జలము గజములూ వేచేను
నిన్ను అభిషేకించి తరియించగా      |మేలుకో|


3. వాయిద్యాలు వేచే శుకపికాదులు వేచె
నిన్నుల్లాసకేళిలో తేలింపగా
నీ పాపలము మేమువేచి చూసేమమ్మ 
ఈనాటి నీ ఆట శిరసావహింపగ        |మేలుకో శ్రీమాతా||