Pages

Tuesday, August 27, 2013

శ్రీ కృష్ణ జన్మాష్టమి

యద్యపాశసుగమో విభో భవాన్ ! 
సంయతః కిము సపాశయానయా |
ఏవమాది దివిజైరభిష్టుతో 

వాతనాధ పరిపాహి మాం గదాత్ ||

"ప్రభూ ! నీవు ఎట్టి ఆశల బంధములు లేకయున్న సత్పురుషులకు సులభముగా లభించువాడవు. ఐనప్పటికినీ నీ తల్లి యొక్క బంధనములకు (త్రాళ్లకు) కట్టబడితివి." అని  ఈ విధముగా దేవతలందరూ నిన్ను స్తుతింపసాగిరి. అట్టి గురువాయూర్ పురాధీశా... పాహి .. పాహి......
(నారాయణ భట్టాద్రి కృత శ్రీమన్నారాయణీయమ్ నుండి..)


                                                శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు

Saturday, August 24, 2013

నా బ్లాగు నాలుగులోకి అడుగెట్టింది.


ముద్దు ముద్దుగా -- గబ గబా నడుచుకుంటూ, నడకలాంటి పరుగు, పరుగు లాంటి నడక.. ..
కేకేసాను. వెనక్కి చూసీ చూడనట్టు చూసి, ఆగకుండా ఆ నడకలాంటి పరుగు, పరుగులాంటి నడక, ఏదో పని వున్నట్టు.
బుడుగు… బుడుగు  ఫ్రెండ్ సీగాన పసూనాంబ ,,,,ఆ వయస్సుకు దగ్గరగా వచ్చేసిందేమో…  నేను గ బా , గ బా పరుగెత్తికెళ్లి పట్టుకున్నా.

“ఆగమ్మా.. పిలుస్తున్నా గా “ అని ముద్దుగా అడిగా.. ఎంతైనా కాకిపిల్లా, తల్లికాకి కదా…
“నీతో మాట్టాడను ఫో” అంది బుంగ మూతి పెట్టి…
నాకు విషయం అర్థమైపోయింది.. ఫేస్ బుక్ సందడిలో తనని పట్టించుకోవటంలేదని అలక..
“అంతేనా ?” అన్నా..

తలూపింది.. అవునంటోంది  అనుకున్నా…

నిజమే ! ఫేస్ బుక్ లో ఎక్కువ టైము గడిపేస్తున్నాను. ఎంతోమంది పోస్ట్ చేస్తున్న ఎన్నో విషయాలు, సరదాగా, సీరియస్ గా , రాజకీయ సెటైర్ లు, షేర్ లు, లైకులు, కామెంటులు అదో హడావుడి. నిజానికి క్రియేటివిటీ తక్కువే. ఎవరో గీసిన కార్టూనో, ఎవరో వేసిన జోకో, ఎవరో తీసిన ఫోటోనో .. షేర్ చేస్తారు. మనం ఒక లైక్ కొట్టడం. ఏదో కామెంట్ పెట్టడం. మన స్పందనకు స్పందించాడా లేదా అని కాస్సేపాగి మళ్లా చూస్తాం. వాడో లైక్ కొడ్తాడు .. పెద్ద అఛీవ్ మెంట్. స్వంతంగా వ్రాసేవాళ్ళు చాలా తక్కువ. దాన్ని దుర్వినియోగం చేస్తున్నవారూ ఉన్నారు.. అయినా అదో కిక్.. అక్కడకే పోతాం.
బ్లాగు అందుకు భిన్నం. కొద్దో గొప్పో మన అక్షరాలు, ఆలోచనలూ, వ్యక్తీకరణలు ఉంటాయి. దానికి సహృదయంతో స్పందిస్తారు. ఆ స్పందనలు మళ్లీ మళ్లీ వ్రాయాలనే ఉత్సాహాన్నిస్తాయి. ఒక్కోప్పుడు ఎవరూ మాట్లాడరు.. అప్పుడు నిరుత్సాహం ఎక్కువగా ఉండి, కొన్నాళ్లు వ్రాయలేకపోవడం ఉంటుంది.ఆ కంట్రీ వాడు, ఈ కంట్రీ వాడూ చూసారని అంకెలు. వాళ్లు చదవక్కరలేదు, చూస్తే చాలు మనకి రికార్డయిపోతుంది. అది నిజమని అపోహేమో కాని, ఒక ఆనందము.  ఫేస్ బుక్ కాఫీ లా వెంటనే కిక్కిస్తే, బ్లాగు బార్నవీటాలా బలమిస్తూ కిక్కిస్తుంది. రెండూ కూడా స్నేహితులను కలుపుతాయి…

“ఆ సోదంతా ఎందుకు… బ్లాగుని కూడా కాస్త చూడు.. అసలు కంప్యూటర్ ప్రవేశము నా ద్వారానే కదా.. “ చెప్పాగా బుడుగు.. చిచ్చర పిడుగు.. సలహాలొకటి.

‘సరేలే కోపం పోయిందా’.. అన్నా..

నవ్వేయబోయి, ఆపేసి..’ ఊహూ’ అంది..

‘అదేం.. అసలు కోపం ఎందుకమ్మా..’ అన్నా..

‘ఈసారి కూడా మరి పుట్టిన రోజు మరచిపోయావు కదా.. అందుకని.’

‘ఓ సారీ. ఆదే చెప్దామనుకున్నా… ఫేస్ బుక్ విషయం చెప్పడములో మరచిపోయా.. రెండవ తారీకు కదా.. గుర్తుంది.. ఆవేళ అప్పుడు గురువాయూర్ లో బాల కృష్ణుని చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు.. అప్పుడే నీతో చెప్దామనుకున్నా .. కాని కుదరలేదు.’ అని సంజాయిషీ ఇచ్చా.  

‘తెలుసు..’ అంది బ్లాగు.  

‘తెలుసా.. నీకెలా తెలుసు…’ ఆశ్చర్యంగా అడిగా…  

“మరి నేను నీతోనే ఉన్నాగా.. కన్నయ్య నన్ను చూసాడు, వెన్న పెట్టాడు… అల్లరి చేయకమ్మా అన్నాడు… బోల్డు 
 కబుర్లు చెప్పాడు…’ అని మురిసిపోతూ చెప్పింది.. చెప్పి మురిసిపోతోంది..

“అయితే నువ్వు హేపీ.. అవునా”

“హేపీ !”

“సరే అయితే గురువాయూర్ కబుర్లు చెప్పుకుందామా.. కన్నయ్యగురించి చెప్పుకుందామా” అన్నాను..

“సరే!” అని వెంటనే  “వద్దు” అంది..

“మళ్లీ ఏం వచ్చింది.” అన్నా..

"నా పుట్టిన రోజు అని చెప్తూ,  అది చెప్తే.. నాకు గ్రీటింగ్స్ చెప్తారు, కాని అది చదవరు.. ముందర నా పుట్టిన రోజు చెప్పేద్దాము.. అందరూ దీవిస్తారు.. ఆ తర్వాత అది చెప్దాం.. కన్నయ్య మెచ్చుకుంటాడు…

“బ్లాగు, నీ తెలివే తెలివి” అన్నా..

“నా తెలివి నీ తెలివి, నీ తెలివి నా తెలివి” అంటూ గీతోపదేశము చేసి అర్జునిణ్ణి యుద్ఢోన్ముఖుణ్ణి చేసిన శ్రీ కృష్ణపరమాత్మలా నిష్క్రమించింది నా మూడేళ్ల బ్లాగు.

కనపడని రికార్డులో 28000, కనపడే రికార్డులో 11000 దాటిన వీక్షణలతో , మీ అందరి అభిమానంతో నిర్వహింపబడుతున్న నా బ్లాగుకు 3 సంవత్సారాలు దాటి నాలుగులో అడుగుపెట్టింది.. (dvhrao.blogspot.com...హాస్యవల్లరి). మంచిమనస్సుతో దీవించండి.. గురువాయూర్ విశేషాలతో త్వరలో కలుస్తాను…
 

Friday, August 16, 2013

వరలక్ష్మీ వ్రత శుభదినాన



 సిరుల వరాల దేవి.


(‘ఈనాడు’ఆగష్టు పదారు ‘అంతర్యామి’ లో
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రత్యేక రచన. )






ఈ అనంత విశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి.  లక్షించడమంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ‘కనిపెట్టుకుని’, ‘గమనించి’ ‘పాలించే’ శక్తి అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, మూయడాన్ని లయగా సంకేతిస్తే - ఆ రెంటి నడుమ ఉన్నది ‘స్థితి’గా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి, స్థితి, లయలే - ‘ఈక్షణ శక్తి’ గా వేదర్షులు అభివర్ణించారు........
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. …

వరలక్ష్మి :‘వర’ శబ్దానికి ‘కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకునే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేది, వాటి రూపంలో ఉన్నదీ  వరలక్ష్మి. ....కోరినవేవి కావాలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేము. అసలు ఆనందమూ, సంపదా లేని వస్తువును మనం కోరుకోము. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో, మిగిలిన అయిదు లక్ష్ములనూ (సిద్ధలక్ష్మి,మోక్షలక్ష్మి,జయలక్ష్మి లేదా విజయలక్ష్మి,సరస్వతి, శ్రీ లక్ష్మి )సమన్వయించి చరమనామంగా చెప్తారు.

‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించడం - ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం....