
దసరాకు హైదరాబాదు వచ్చాడు....ప్రసాదరావు. పేరు పూర్తిగా చెప్పకపోతే ప్రసాదరావుకు చాలా కోపం వస్తుంది. ఎంచేతనంటే బామ్మ స్వయంగా రికమెండు చేసి ప్రసాదరావు వాళ్ల నాన్నచేత ఆ పేరు పెట్టించింది. పూర్తి పేరు ఏమిటంటే సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద రావు. ఇందులో బామ్మ దర్శించిన పుణ్యక్షేత్రాలలో వేంచేసివున్న ముక్కోటి దేవతల పేర్లూ..అన్నీ కాకపోయినా కొంతవఱకైనా వున్నాయి అంటే అలా పొందుపఱచిన ఘనత బామ్మకే దక్కుతుంది. అంతేకాదు..శ్రీ వెంకటప్పయ్యగారు కూడ కొంతవఱకు చోటు చేసుకున్నారు. శ్రీ వెంకటప్పయ్యగారంటే గం.భా.స.బామ్మగారి పెనిమిటి. శ్రీ వారు మనకిప్పుడు లేరు. ఆయన పూర్తిపేరు పెట్టలేదన్న విషయంలో మాత్రం బామ్మకు కొంచెం అసంతృప్తి వుంది.
బామ్మగారంటే ప్రసాదరావుకు బాగా గురి. ఎంచేతనంటే చిన్నప్పటి నుంచి ఆమె పెంపకంలోనే పెరిగాడు..అలా అని ఆవిడ ఏమీ తేడాగా పెంచలేదు. బి.ఏ వఱకు చదువుకున్నాడు. ఎటొచ్చీ శకునంచూస్తేకాని క్షవరం చేయించుకుందుకుకూడా ప్రసాదరావుని పంపేది కాదు బామ్మ. బామ్మకు రొంపపట్టినప్పుడు మాత్రం ప్రసాదరావుకు కాలేజీకి వెళ్లడం చాలా కష్టమయ్యేది. వాల్తేరునుంచి విజయవాడదాకా ఆగని కోరమాండల్ ఎక్స్ ప్రెస్సులాగా అడ్డూ ఆపూ లేకుండా అరగంటవఱకు తుమ్ముతూ ఉండడం బామ్మ స్పెషాలిటీ..బామ్మని కాదని వెళ్లినా ఫర్వాలేదుకాని ఆమె తుమ్మునీ, ఆ ప్రభావాన్ని కాదని వెళ్లడం ఇష్టంలేని పని ప్రసాదరావుకి. ప్రసాదరావు కాలేజీకివెళ్తున్నప్పుడుకాని, ఆ మాటకొస్తే మఱెప్పుడైనా సరే...ఎవరైనా "ఎక్కడికి ?" అని అడిగారంటే ఇంతే సంగతులు....ప్రసాదరావైతే మామూలుగానే ఆగిపోతాడు కాని అలా అడిగిన సదరు వ్యక్తి బామ్మగారి ధాటికి రెండుమూడు రోజులుదాకా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేవాల్సిందే...
పరీక్షల్లో మాత్రం ప్రసాదరావు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు.. ముందరి రోజునుంచి బామ్మను కాకా పట్టేవాడు..అందుబాటులో విక్స్ ఇన్హేలర్ ఒకటి బామ్మకోసంఉంచేవాడు, అత్యవసర పరిస్థితినుంచి కాపాడ్డానికి. బామ్మకూడా ముందఱిరోజే ఓ బిందె నిండా నీళ్లు పట్టి ఉంచేది. ఆ నీళ్లబిందె తీసుకుని కోడలు (అంటే ప్రసాదరావు వాళ్ల అమ్మ) ప్రసాదరావుకి ఎదురు వచ్చేది.. అప్పుడు ప్రసాదరావు, బామ్మ చెప్పినట్టు కుడికాలు ముందు పెట్టి, ఠీవీగా పరీక్షలకు వెళ్లేవాడు. మఱీ కాలేజీకి ఫస్టు అవీ వచ్చేయలేదుకాని మంచి మార్కులతోనే బి.ఏ పాసయ్యాడు...
మఱీ బామ్మ వెనకాల తిరిగే కూచి ప్రసాదరావు అనుకుంటున్నారా ? చాలా పొరపాటండి...బాల్ బ్యాట్ మెంట్ లో రైటుఫ్రంట్ బాగా ఆడ్తాడు... ఎటొచ్చీ బంతి కొట్టేటప్పుడు ముందర ఆంజనేయుణ్ణి తర్వాత
బామ్మను తలచుకున్నాకనే బంతికొడ్తాడు... బ్యాట్ మెంట్ కోర్టులోకి వెళ్లేటప్పుడు ముందు కుడి కాలు పెట్టడం తప్పనిసరి..అన్ని రకాల పుస్తకాలు చదువుతాడు...అందఱితోనూ చక్కగా మాట్లాడతాడు... ఎవరైనా తుమ్మితే మాత్రం అసంకల్ప ప్రతీకార చర్యలాగా కాసేపు ఆగిపోతాడు...తర్వాత మళ్లీ పుంజుకుంటాడు....
దసరాకు రైల్లో హైదరాబాదు వచ్చేటప్పుడు పరుగెడ్తున్న రైల్లోకూడా గుమ్మం దగ్గఱ కాసేపు నించున్నాడు ధైర్యంగా...ఇంకాసేపు నించునును కాని ఎవరో ముసలాయన "ఎందుకు బాబూ ? అక్కడ నుంచుంటావు..లోపలికి వచ్చేయమ్మా!" అన్నాడు..ఆయన ముఖంలో బామ్మో, వెంకటప్పయ్యగారో కనపడ్డారులా వుంది..వెంటనే వెనక్కి వచ్చేసాడు..
స్టేషనుకు మామయ్యగారబ్బాయి సారథి వచ్చాడు...ఇద్దరూ ఆటోలో మామయ్యగారింటికి వెళ్ళారు..మామయ్య "కొన్నాళ్ళుండరా..ఏదైనా ఉద్యోగం చూద్దాం " అన్నాడు.. సారథితో ఊరంతా చూడ్డం మొదలెట్టాడు ప్రసాదరావు...
బస్సులూ---ఆటోలు; రిక్షాలు---అమ్మాయిలూ అన్నీ కొంచెం వింతగా వున్నాయి ప్రసాదరావుకి. పరుగెత్తే బస్సు వెనకాల పరిగెత్తి బస్సెక్కడం, కదుల్తున్న బస్సుల్లోంచి స్టాపు కానిచోట కూడ దిగడం వింతల్లోకి వింతగా కనిపించింది ప్రసాదరావుకి.
"ప్రసాదూ! గమ్మున ఇక్కడ దిగరా, ఇక్కడనుంచి హాలు దగ్గర.." అని కదుల్తున్న బస్సులోంచి సారథి బస్సు దిగేస్తున్నాడు. వెనకాలే ముందు ఆంజనేయస్వామినీ, తర్వాత బామ్మనీ, తలచుకుని కుడికాలు ముందు పెట్టి, పరుగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేసాడు సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాదరావు...ఆ కాలు చుక్కల అరటిపండు తొక్కమీద పడింది. అది వేరే విషయం.
తర్వాత ఆసుపత్రినుంచి నర్సుచేత బామ్మకి నీతి వాక్యం రాయించాడు ప్రసాదరావు....
"పరిగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేటప్పుడు కుడికాలు ముందు పెట్టకే బామ్మా!!!!"
*******
[ఆకాశవాణి, హైదరాబాదు'బి' నుండి...'యువభారతి' (జంటనగరాల సాహితీ సంస్థ) వారి సాహిత్యకార్యక్రమంలో 1981 అక్టోబర్, 7 న ఈ స్వీయ రచన ప్రసారం చేయబడింది...నేనే చదివా... ]