Pages

Friday, October 12, 2012

తీసినా స్నేహం తీయనిదే !



friend ship redefined.

we two with jahnavi
with bulusu subrahmanyam garu .. blog friend

"సృష్టిలో స్నేహం తీయనిది"  అని పెద్దలు అన్నారు..
"ఎవరన్నారు.. మేం తీసాంగా" అన్నారు పెద్దలు రమణగారు, బాపు గారూనూ...
నిజమే బాపుగారు, రమణగారు స్నేహం తీసారు.. తీయక ముందు.. తీయని స్నేహం రుచి రమణగారు, బాపుగారు.చూసారు కదా ?.. రుచి తెలిసాక కదా స్నేహం చేసారు... అప్పుడు కదా స్నేహం తీసారు...తీసిన ఆ (తీయని) స్నేహం అప్పుడు కదా వేసారు...  వేసారు కనుకనే కదా  ఆ స్నేహం ఎంతో మంది చూసారు... గొప్పగా ఉంది కనుకనే కదా  అదీ స్నేహంఆంటే  అనేసారు...  తీసినా స్నేహం , తీయనిదే కదా..అన్నారు అందరూ....అంచేత చూసినా, చేసినా, తీసినా, వేసినా...ఏంచేసినా, ఎన్ని అనేసినా స్నేహం తీయనిది..
.

నేను పలాసాలో ఉద్యోగిస్తున్నప్పుడు... మా అన్నయ్యను చూడ్డానికి పార్వతీపురం వెళ్తూ ఉండేవాణ్ణి.. అన్నయ్య అక్కడుండేవాడు.. పలాసానుంచి శ్రీకాకుళం బస్సులో వెళ్లి అక్కడనుంచి పార్వతీ పురం మరో బస్సెక్కి వెళ్లాలి.. అప్పుడు ప్రైవేట్ బస్సులుండేవి. ఆర్.టి.సి కాదు. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వెళ్లే అలాంటి ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవరు రామారావు.. శ్రీకాకుళం నుంచి పార్వతీపురం చేరడానికి మూడుగంటల సమయం పట్టేదనుకుంటా... ఈ బస్సు వెడుతుంటే రోడ్డుకిరుప్రక్కల చిన్నపిల్లలు చేరిపోయేవారు.. తమాషా ఏంటంటే ఈ బస్సు డ్రైవరు రామారావుకి వాళ్ళందరూ దారిపొడుగునా నమస్కారములు చెప్పేవారు.. హలో అనేవారు... పిలిచేవారు... రామారావు కూడా అందరినీ పలకరిస్తూ బస్సు నడిపేవాడు. హలో అనేవారిని హలో అనేవాడు. నమస్కారములు చెప్పేవారికి నమస్కారమనేవాడు... పలకరించేవారిని నవ్వుతూ పలకరించేవాడు.. అలా పలకరించడానికి అవసరమనిపిస్తే బస్సు స్లో కూడా చేసేవాడు.. "ఒరేయ్... ప్రక్కకుండండిరా.. వెహికల్స్ వస్తాయి." అని హెచ్చరించేవాడు... ఇతడి పలకరింపుతో పులకరించిపోయి ఆనందంతో గంతులేసేవారు ఆ పిల్లలు... నేను ఎప్పుడువెళ్లినా ఈ దృశ్యం తప్పక కనిపించేది.. రామారావు ముఖాన ఎప్పుడూ విసుగూ కోపం చూడలేదు.. ఆ పిల్లలు ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు.. అదీ స్నేహమే కదా....

రాజమండ్రిలోని పుష్కరఘాట్ కు దగ్గరగా ఉన్న మునిసిపల్ హైస్కూలులో చదువుకునే వాణ్ణి.. పేపరుమిల్లు నుంచి ఆర్యాపురం మీదుగా స్కూలుకు వెళ్లే వాళ్లం.. ఆర్యాపురం మధ్య వీథిలో చివర కుడి ప్రక్కగా కొణితివాడ జమీందార్ గారిల్లు.. ఎర్రరంగు శరీర చ్చాయ, తెల్లటి పంచె, తెల్ల చొక్కా.. తెల్ల జుత్తు... నవ్వు పులిమిన ముఖము.. స్కూలుకెళ్లే పిల్లలందరూ ఆయనకు నమస్కారము పెట్టి స్కూలుకి వెళ్లేవారు... నేనూ అంతే... అందర్నీ నవ్వుతూ పలకరించే ఆ పెద్దల స్నేహం ఓ తీపి జ్ఞాపకం...

అప్పుడెప్పుడో 1977-78 మధ్య మా అమ్మను తీసుకుని, మా దంపతులం మా ఆఖరి పాపతో సహా రామేశ్వరం వెళ్లాము.. మా అమ్మ అప్పటికే డెబ్భై సంవత్సరాల పైబడి వయస్సు. ఏవో కారణాల వలన నడుము బాగా వంగిపోయింది.... మనోబలంతో వచ్చి యాత్రలు చేస్తున్నది... సరే ! సాయంత్రానికి రామేశ్వరము చేరి మరునాడు ఆ క్షేత్రంలో చేయవలసిన కార్యక్రమములు జరిపించుటకు పురోహితుని మాట్లాడుకుని, రాత్రి ఫలహారానికి హోటల్ కు వెళ్తే... మమ్ములను వెతుకుతూ ఒక యువకుడు, తన తలిదండ్రులను వెంటబెట్టుకుని  మా దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు...  మేము కుదుర్చుకున్న పురోహితులే వారికీ కుదిరారట... వారికి మా గురించి ఆయనే చెప్పారట. ఆ పెద్దాయన ఆర్.టి.సిలో ఇన్స్పెక్టరుగా ఉన్నారట.. రెండేళ్లలో రిటైర్ కానున్నారట....అంతవరకు బాగానే ఉన్నది.. కాని, ఆఫీసు ట్రైనింగుకని దగ్గర ఉన్న గ్రామానికి వచ్చిన ఆ యువకుడు.. తాను ట్రైనింగుకు వెళ్లిపోతున్నానని, తన తలిదండ్రులు మాతో వస్తారని... మీతోపాటు మీరేమేమి చూస్తే అవి చూడ్డానికి వస్తారని, వారి ఖర్చులు వారే పెట్టుకుంటారని చెప్పి ... ఫైనల్ గా వారిని మద్రాసులో వదిలేస్తే వారు హైదరాబాదు చేరతారు అని చెప్పాడు.. వారిని ఒక్కరినీ పంపించాలంటే కొంచెం భయంగా ఉంది అన్నాడు.. దానికేం పంపించండి..మాకూ తోడుంటుంది అన్నాము... మా యాత్ర రామేశ్వరములో మరునాడు ప్రారంభమైంది.. అక్కడ వివిధ రకాలు తీర్థాలు అంటే పుష్కరిణులు, నూతులు వాటిలో స్నానాలు.. దర్శనాలు అవీ  అయ్యాక.. రామేశ్వరమునుంచి ప్రక్కనున్న మండపం అనే ఊరు చేరి ఆ ఊరికి దగ్గరలో ఉన్న దేవీ పట్నం వెళ్లాము.. అక్కడ నవ పాషాణాలు... పురాణకథ ప్రకారము. శ్రీరామచంద్రుడు ప్రతిష్టించబోయిన నవగ్రహాలను సముద్రుడు ముంచ బోయాడుట..శ్రీరాముడు కన్నెర్రజేసాడు.. సముద్రుడు అణిగాడు... ప్రతిష్టించిన తొమ్మిదింటిలో కొన్నిఅప్పటికే ములిగాయి కాని కొన్ని నీటి మట్టానికి పైకే ఉంటాయి.. సముద్రంలోకి వెళ్లి అక్కడ నవగ్రహార్చన చేయాలి.. కాని  అక్కడకు కొంచెం దూరంగా లక్ష్మణ తీర్థం అని ఒక పుష్కరిణి ఉంది..  ముందు అందులో స్నానం చేద్దామని వెళ్లాము.. పాపకు స్నానం చేయించాము,..మా అమ్మ స్నానం చేసి పాపను ఒళ్లో కూర్చో బెట్టుకుని గట్టు మీద ఉంది.. నా స్నానం అయి అటు తిరిగి తుడుచుకుంటున్నాను.. ఇంతక్రితం పుష్కరిణిలలో చేపలకు భయపడి స్నానం మ్రొక్కుబడిగా పూర్తిచేసిన మా శ్రీమతి కొంచెం ఉత్సాహంగా స్నానానికి దిగింది.. కంగారులో మెట్టు తప్పింది.. మధ్యకు వెళ్లి పోయింది.. ఒక ములక..మరల ములకవేస్తూ చేయి పైకెత్తిందట, రామేశ్వరంలో పరిచయమైన ఆ పెద్దాయన ఒక్క సారి నీళ్లలోకి దిగి ఆవిణ్ణి గట్టుకు లాగేసారు.. ఇదంతా క్షణాలలో జరిగిపోయింది.. అటు తిరిగిఉన్న నాకు ఆవిడ గట్టుమీదకు లాగబడ్డాక అమ్మ కంగారుగా మాట్లాడినప్పుడు విషయం తెలిసింది.. ఆయనను అడిగా "మీకు ఈత వచ్చునా" అని రాదన్నారు... ఆవిడ ములిగిపోతోంది లాగేయలనిపించింది, లాగేసాను అన్నారు.. నేను తనకి సాయం ఉంటానని ఆ అబ్బాయి ఈయన్ని నాకప్పజెప్పాడు, కాని ఇప్పుడెవరికెవరు సాయం...ప్రాణానికి తెగించి మా కుటుంబానికి ప్రాణం పోసిన ఆ భగవత్ప్రసాదితమైన స్నేహ మాధుర్యం మరవగలమా....


ఇది జరిగిన ఇరవై ఏళ్ల పైన గడిచాక నా అడ్రస్సు .. ఎలాగో సంపాదించి ఆయన ఉత్తరం వ్రాసారు... తన భార్య గతించిందని, తాను ప్రస్తుతం హైదరాబాదులోనే ఉన్న తన కొడుకు దగ్గర ఉన్నానని... శ్రీరామునికోసం ఎదురు చూస్తున్న శబరిలా మృత్యువుకోసం ఎదురుచూస్తున్నానని వ్రాసి... మా పరిచయాన్ని గుర్తుచేస్తూ... వీలైతే ఆ ఉత్తరానికి జవాబు వ్రాస్తే ఆనందిస్తానని వ్రాసాడు.. మా ఇద్దరికీ కన్నీరు ఆగలేదు.. అప్పటికే హైదరాబాదు ప్రయాణమున్నది కనుక, హైదరాబాదు చేరగానే వారుంటున్న bhel క్వార్టర్స్ కు వెతుక్కుంటూ వెళ్లి ఆ ప్రాణదాతకు ప్రణతులు సమర్పించుకున్నాము.. వృద్ధాప్యము, చెవులు వినపడవు, చూపు మందగించింది.. కొడుకూ, కోడలూ ఉద్యోగానికి వెళ్లడం వలన ఇంటిలో లేరు.. స్వయంగా మేము వచ్చామన్న ఆనందం ఆయన మాటలోనూ.. సజల నయనాలలోను ప్రస్ఫుటమైంది.. ఏ.. టీ కాఫీ ఈయలేకపోతున్నానని బాధ పడ్డారు.. అది ఆయన సంస్కారము.. ఇప్పటికే ఎంతో ఋణపడ్డ మాకు ఇంకా ఏదో ఇద్దామనే ఆయన ప్రేమ... కన్నీటితో సాగనంపారు... నేనూ మా ఆవిడా...నీరు నిండిన కళ్లతో గృహోన్ముఖులమయ్యాము.. ఆయనగురించి మరల తెలియలేదు......ఇది జరిగి పదేళ్లయింది... ఈ స్నేహానికి విలువ కట్టగలమా ?

చదువుకునే రోజుల్లో స్నేహాలు ఉంటాయి.. అవి మరల కొనసాగే అవకాశము తక్కువ. ఉద్యోగంలో స్నేహాలు  అన్నీ ఆత్మీయమనలేము కాని, మనల్ని బట్టి దగ్గరౌతాయి.. కొనసాగుతాయి.. అలా రిటైర్ అయ్యాక కూడా రోజూ పలకరించే స్నేహితులు ఉండడం నాకో అదృష్టము...  ఓ కార్యక్రమంలో నిర్వహణలో ఒకనిగా నా ఫోను నెంబరు ఋషిపీఠంలో చూసి ఒక వ్యక్తి పరిచయం చేసుకున్నారు.. ఆతడు మద్రాసులో ఉంటారు.. ఆత్మీయత పెంచుకున్నారు.. శ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు కంచిలో జరిగినప్పుడు  చాలాకాలం తర్వాత ఈ మిత్రుడు నేనూ కలసుకోవడం జరిగింది.. ఎంత అభిమానము చూపారో చెప్పలేను.. నేను వయస్సులో పెద్దవాణ్ణనే గౌరవంతో అక్కడక్కడ నా లగేజీ కూడా తాను అందుకోబోయేవారు.. నాకేవేవో పుస్తకాలు బహూకరించారు... ఇప్పటికీ ఫోనులో పలకరిస్తూనే ఉంటారు.... అలాగ్గానే బ్లాగులు, ఫేస్ బుక్ లు వచ్చిన తర్వాత ఎంతో మంది మిత్రులవుతున్నారు.. బ్లాగులో మిత్రులైన శ్రీ బులుసువారు సతీ సమేతంగా రాజమండ్రి వచ్చి  మా ఇంటికి వచ్చిన ఆ సౌజన్యానికి విలువ కట్టగలమా ?


సుమారు ఎనిమిదేళ్లకు ముందు తిరుపతి వెళ్లి నేనూ మా శ్రీమతీ రాజమండ్రి వస్తున్నాము.. మా బర్త్ కు ఎదురు బర్తులమీద ఒక ఫామిలీ.... దంపతులు, ఒక చిన్న పాప (సుమారు నాలుగైదు సంవత్సారాలుంటాయి), చిన్న బాబు... ఎక్కారు.. ఆ పాప చాలా కళగా ఉంది.. మాట్లాడే తీరు మా దంపతులను ఆకర్షించింది... "నాన్నగారూ ", " అమ్మా" అనే తలిదండ్రులను సంబోధిస్తున్నది.. మమ్మీ డాడీ క్లల్చరు కాదు..దారి పొడుగుతా కుతూహలంతో ఎన్నో ప్రశ్నలు..ఆయా స్థల విశేషాలు తండ్రిగారిని అడిగి తెలుసుకుంటున్నది.. నేను ఆ అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరడిగా.. "జాహ్నవి" అంది. "అంటే ?".... "గంగ" అని తానే చెప్పింది..అడిగిన వాటికి చక్కటి సంస్కారముతో జవాబులు చెప్పింది.. మా ఆవిడ ఆ అమ్మాయి చేత పాడించుకుంది.. తను ఓ పాట ఆ అమ్మాయికి నేర్పింది... వాళ్లు బిలాస్ పూర్ లో ఏదో చిన్న బిజినెస్ చేస్తున్నారు.. మరునాడు కనకదుర్గమ్మ దర్శనానికని  విజయవాడలో వాళ్ళు దిగారు, మేము రాజమండ్రి వచ్చేసాము.. తర్వాతరోజు విజయవాడలో దేవి దర్శనం అయ్యాక అక్కడనుంచి బిలాస్ పూర్ వెళ్తూ రాజమండ్రి దాటుతుండగా నేనిచ్చిన ఫోన్ కు ఫోను చేసి...."తాతయ్యా... మీ ఊరు గోదావరి ఇప్పుడే దాటుతున్నాము.. మీరు  బాగున్నారా ?" అంటూ పలకరించింది... తర్వాత రెండు మూడుసార్లు ఆ తండ్రిగారు ఫోను చేసారు... తర్వాత మేము ఇల్లు మారడం, సెల్లు మారడం... నెంబరు మిస్సయింది.. కొంత కాలం తర్వాత... ఆయనకు ఫోన్ నెంబరు దొరికిందట ఆయన ఫోన్ చేసి ... జాహ్నవి తాతగారిదగ్గర సబ్బవరంలో చదువుకుంటోంది.. ఫోన్ చేయమని ఫోన్ నెంబరు ఇచ్చారు.. రాత్రి పదిగంటల వేళ ఫోన్ చేసాను.. వాళ్ల అమ్మమ్మగారు ఫోన్ తీసారు.. జాహ్నవి ఉందా... అంటే పడుకుందండీ, మీరెవ్వరు... అన్నారు.. నేను రాజమండ్రి నుంచి అన్నా.. ఆవిడ రాజమండ్రియా అండీ అంటున్నారు.. ఆ మాట విన్నవెంటనే నిద్రలేచిన జాహ్నవి "రాజమండ్రీ తాతయ్యా..." అంటూ అమితోత్సాహంతో ఫోన్ తీసుకుని మాట్లాడింది... ఆ తర్వాత తరచు మాట్లాడటం... ఈ మధ్య ఆ ఫామిలీ మరల తిరుపతి వెళ్లారు... వెళ్లి తిరుగు ప్రయాణంలో విజయవాడలో దిగవలసిఉన్నా దిగకుండా రాజమండ్రి వచ్చి మా ఇంటికి వచ్చారు.. ఎనిమిదేళ్ల క్రితం పరిచయం... మధ్యలో మరల కలవలేదు... మన ఊరు కాదు... కానీ ఏమిటో ఆ ఆత్మీయత... సాయంత్రందాకా ఉన్నారు.. మా జాహ్నవి ఇప్పుడు సెవెన్త్ క్లాస్.. మార్కులు 98 %  దాకా వస్తాయిట.. ఎంత సంస్కారమో.. తనకి వచ్చినవి... అడిగితేనే కాని ప్రకటించుకోదు.. ఆ వయస్సు పిల్లల అల్లరి లేదు.. అలా అని ముంగిలా కూచోదు.. నవ్వుతూ పలకరిస్తుంది.. ఆప్యాయంగా ఉంటుంది.. "తాతయ్యా .. మీకోసం తిరుపతిలో కొన్నాను" అంటూ రాగానే అన్నమయ్య కీర్తనలకు పద్య రూపంగా ఉన్న ఓ పుస్తకం బహూకరించింది... ఆ అమ్మాయి అభిరుచులు నాకు తెలియవు. ఎవరికైనా ఉపయోగమే కదా అని ఇంగ్లీష్..టు..ఇంగ్లీష్...తెలుగు డిక్షనరీ కొని ఉంచాను. అది ఇచ్చాను... నీకు ఉపయోగమని ఇది నీకోసం కొన్నానంటే .. నవ్వుతూ తీసుకుంది.. నీ దగ్గర ఏదైనా ఉందామ్మా.. అని అడిగాక... "ఆక్స్ ఫర్డ్" ఉంది తాతయ్యా అని అప్పుడు చెప్పింది.. "పెద్దవారు కూడా మనమేదైనా ఇస్తే .. ఓస్ ఇదా ఇది నేనెప్పుడో కొన్నాను" అనే సంస్కారులను చూస్తూనే ఉంటాము... ఆ అమ్మాయి.. హుందాతనానికి ముగ్ధులమైనాము మా దంపతులము.. జాహ్నవి తండ్రిగారు మాతో పరిచయానికి ఎంతో మురిసిపోతూ మాట్లాడారు.. ఎక్కడో ఎప్పుడో రైల్లో కలసిన ఈ పసి స్నేహం... ఏమని నిర్వచించగలము..?

అంచేత చూసినా, చేసినా, తీసినా, వేసినా...ఏంచేసినా, ఎన్ని అనేసినా స్నేహం తీయనిది... తియ్యనిది..