
వెంకట్రావ్! నీరసంగా కనపడుతున్నావు. ఉపవాసమా యేంటి?
అవునోయ్ గుర్నాధం? కార్తీక సోమవారం కదా...ఇదేఆఖరువారం కూడాను...మరి నువ్వు లేవా?
ఉపవాసాలా..నేనా...థ్రాష్.. మా ఆవిడవుంటుంది..వద్దన్నా వినదు. అయినా వెంకట్రావ్! అసలు
ఉపవాసమంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా వుండడం..అంతేకాని భోజనం మానేయడం కాదు.
అది తెలుసుకోరు మీలాంటి వాళ్ళు...ఏమిటో మీ ఛాదస్తం.
నిజమే! ఇలాంటి గుర్నాధాలు అలాంటి వెంకట్రావులు మనకి తారసపడుతూనే వుంటారు.... ఇంత
వేదాంతం తెలుగు వాళ్ళమేచెప్పగలము...(మిగతా వారి సంగతి అంతగా నాకు తెలియదనుకోండీ).
దేముడికి దగ్గరగా వుండాలంటే ఏమిటి ?తిరుమలే వెళ్ళామనుకుందాం! ముందు మనం చూసేది
దేముణ్ణికాదు... ముందు బస తర్వాత ఫుడ్..తర్వాత తిరుగు ప్రయాణానికి యేర్పాటు అన్నీ
అయ్యాకనే దర్శనం అంతేకదా..అప్పుడు తోసుకుంటూ..తోసుకుంటూ ఆ క్యూలంబడి పోయి పోయి
గర్భగుడిలో వాలంటీర్లు...నడవండి..నడవండి అంటూ తొయ్యడం...యిక చాలు రండమ్మాఅని లాగడం...
'నడవండీ', 'చాలురండి' .. ఈ రెండుశబ్దాల నడుమ పెరుమాళ్ళ దర్శనం..రెండు ఆలోచనల మధ్య
చిద్దర్శనంలాగా...అయిందా!... లేదా!... ఏమో!.....ఆ కాసేపూ ఓ దివ్యానుభూతి.వెంటనే మాయ
కప్పేస్తుంది..."చూడనీయవయ్యా. బొత్తిగా ఇక్కడే త్రిప్పేసారు..పాపం మూటకట్టుకుంటున్నారు "...
మన సంస్కారాన్నిబట్టి రకరకాలుగా అభిప్రాయాలని కసిగా వెడలగక్కి...హుండీలో మ్రొక్కుబడులు...
అమ్మయ్యా పాపాలు పోయాయి...(మళ్ళీ క్రొత్తవి చెయ్యొచ్చు అన్నమాట)...అందరికీ అసంతృప్తే..
వెంకన్నబాబు అంటే గుడిలో వున్న వెంకన్నబాబుదర్శనం సరిగా కాలేదని....
ఓ సారి శ్రీవారి సేవా కార్యక్రమానికి వారంరోజులు వెళ్ళాము నేనూ మా శ్రీమతీ. అక్కడుండగా మా
శ్రీమతికి జ్వరం వచ్చింది.మేమున్న 'రామ్ బగీచా' వాళ్ళకి విషయంచెప్పి ఎవరైనా డాక్టరుంటారా
దగ్గరలో అని అడిగా టిటిడి హాస్పటల్ కి వెళ్ళమన్నాడు...ఎలావెళ్ళాలి అన్నా...అదిగో అక్కడ
ఆమ్బులేన్సే వుంది వెళ్ళి చెప్పు, వస్తాడన్నాడు...ఈ చిన్నదానికి ఆంబులెన్సా.....వస్తాడో రాడో
అని సందేహిస్తూనే ఆ ఆంబులెన్స్ డ్రైవరును అడిగా! వెంటనే వచ్చాడు..మమ్మల్ని హాస్పిటల్ కి
తీసుకువెళ్ళాడు. తానే ఓ.పీ వ్రాయించాడు..డాక్టరు దగ్గరకి కూడా వచ్చాడు..ఆయన మందులు
యిచ్చి..యింజషన్ చేసేదాకా దగ్గరున్నాడు.అరగంట వుండివెళ్ళమన్నారు డాక్టరు.. అప్పుడు మళ్ళా
యెవరైనా పిలుస్తారేమో అని చెప్పి; నర్సుతో చెప్తే తిరిగి వెళ్ళడానికి యింకో ఆంబులెన్స్ యేర్పాటు
చేస్తారని కూడా చెప్పి; అప్పుడు వెళ్ళాడు ఆ డ్రైవర్. తర్వాత అక్కడవున్ననర్సు ఇంకో ఆంబులెన్స్ కు
చెప్పారు....ఎవరూ కూడా డబ్బులు ఇస్తానన్నా పుచ్చుకోలేదు......స్వామి లఘుదర్శనమా..
మహాలఘా..వాళ్ళు లాగేసారా .....వీళ్ళు తోసేసారా అన్నీ మరచిపోయాము....ఎవరు ఎవరిదగ్గర
వున్నారు..దేముడి దగ్గర మనమా...మన బాగోగులు అనుక్షణం చూస్తూమనదగ్గర ఆయనా? ..
ఉచిత భోజనాలు దగ్గర...ఎంతమందో అలా వస్తూనే వుంటారు.. సాపడుతూనే వుంటారు...ఎంత వైభవం
...మొదటి రోజు మేం సేవా కార్యక్రమంలో వుండగాఓ ఆలయ వుద్యోగి అక్కడికి వచ్చాడు.మాట తీరూ అదీ
చూస్తే ఒక ఆకర్షణ..అతడు జనాంతికంగా అన్నాడు..మీరు ఇక్కడ భక్తులకు భోజనం వడ్డించే ఈ సేవ
స్వామి అనుగ్రహం వలన దొరికింది.కాలికి చెప్పులు లేకుండా,ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి వడ్డించండి
అనిచెప్పాడు..క్రింద నిజానికి సాంబారూ అవీ పడి కొంచెం ఇబ్బందిగా వున్నా మేంఇద్దరమూ చెప్పులు
లేకుండానే వడ్డించాము పవిత్ర భావంతో...మేంవచ్చేసేరోజు అతడు మళ్ళీ వచ్చాడు...ఆ రోజు బుధవారం..
ఆ రోజు స్వామికిమూలవిరాట్ నుండి ఒక పవిత్రసూత్రం తీసుకువచ్చి ముందు మంటపంలో(రాములవారి
మేడ అంటారు)వేంచేసివున్న ఉత్సవమూర్తులకు కట్టి, ఆ ఉత్సవమూర్తులకు అభిషేకంచేస్తారట...కార్యక్రమం
పూర్తయ్యాక అపురూపమైన ఆపవిత్రసూత్రంప్రసాదభావంతో ముఖ్యులైనవారు స్వీకరిస్తారట...ఆ అభిషేకానికి
ఇందాక ప్రస్తావించిన ఉద్యోగి వెళ్ళి ఆ పవిత్ర సూత్రంముక్కతెచ్చి...మా ఇద్దర్నీ పిలిచి మాకు ఇచ్చాడు...
యెందుకంటే చెప్పులువదలి సేవ చేసామని. అంతేకాదు మూలవిరాట్ పాదాల మీది అక్షతలు మా చేతిలో
వుంచాడు...మన కదలికలు సదా కనిపెట్టే స్వామి దగ్గర మనం వుండాలా? ఉండగలమా?.
సరే పూమాలలు తయారుచేసే చోటికి సేవకై వెళ్ళాము.ఎన్ని పూలు..యెన్నెన్ని పూలు... బస్తాలతో వచ్చి
పడిపోతూనే వుంటాయి. దేశం నలుమూలలనించీ భక్తులు సమర్పించినవే స్వామి పూలవనంలోవి కావు..
ఒక్కోగజమాల ఒక గంటసేపు స్వామి గళసీమ నలంకరిస్తుందట..మేమందించే యేఒక్క పుష్పమైనా మా
కబురు స్వామి చెవిని వేసినా చాలు కదా...మనస్సులో ఏదో చెప్పలేని ఆనందం..యేదో మధురాతి
మధుర భావం ....అదంతా శ్రీనాథునివైభవమేకదా....
వైకుంఠ క్యూకాంప్లెక్సులో టిఫిన్ భక్తులకు అందించేసేవ. గోవిందుని దివ్యనామ సంకీర్తనతో పరవశించే
భక్తకోటికి సేవచేయగలిగే అవకాశము ఆస్వామి కల్పించిందే కదా..పాపనాశనం జలధారలలో,
కపిలతీర్థంలోని తీర్థజలాలలో, వికసించిన పూలతోటలలో, చెట్టుచేమలలో, కొండంతా తిరుగాడే
భక్త జనుల కోలాహలంలో....యెలుగెత్తి అరచే గోవిందనామంలో యెక్కడ లేడు - కొండంతా ఆ
యేడుకొండలవాని వైభవం కనపడుతూనే వుంటుంది..అలా చూడగలగడమే ఆయన దగ్గరగా వుండడం...
ఉపవసించడం.... కాదంటారా
