నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Sunday, January 26, 2014
Wednesday, January 22, 2014
invitation to all people
ప్రవచన మహా యజ్ఞం
బ్రహ్మశ్రీ
సామవేదం షణ్ముఖ శర్మగారిచే
29-01-2014 నుండి 08-02-2014 వరకు,
ప్రతి రోజు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం ..
వేదిక: విరించి వానప్రస్థ ఆశ్రమం,
యల్.బి.శాస్త్రి రోడ్, శ్రీ రామ నగర్,
బి.వి.యమ్ స్కూల్ వద్ద.
రా జ మం డ్రి …
అందరూ ఆహ్వానితులే ….
వివరములకు : 9949705166
వివరములకు : 9949705166
Sunday, January 12, 2014
ఋషి పీఠం ఛారిటబుల్ ట్రస్ట్,
రాజమహేంద్రవర శాఖ…
ఏజెన్సీ గ్రామంలో ఒక రోజు
రచన: డి.వి. హనుమంత రావు
రాజమండ్రీకి 90 కి.మీ దూరంలో ‘అడ్డతీగల’ ఒక ఏజెన్సీ గ్రామం. ఊరు పెద్దదే. ఊరులోకి ఎడమవైపు తిరగ్గానే మొదటనే కుడి ప్రక్కగా ‘పవనగిరి ఆలయ సముదాయం’ బోర్డ్ దర్శనమిస్తుంది. పవన గిరి ఒక చాలా ఎత్తైన చిన్న కొండ. కొండ మొదట్లో చిన్న శివాలయం, అందులో పెద్ద శివ లింగం, దాన్ని ఆనుకొని చిన్న మందిరంలో పార్వతీ పరమేశ్వర విగ్రహం. అక్కడ దర్శనం చేసుకుని, కొండ పైకి వెళ్తుంటే మీ కుడి చేతి పక్క పెద్ద రాయిపై తమాషాగా చెక్కిన గజాననుని మూర్తి యొక్క విస్తారంగా ఉన్న ముఖం మాత్రం ఆశీర్వాదిస్తుంది. . ఇంకొన్ని మెట్లు ఎక్కి ఎడమ వైపు తిరిగితే ముందు దత్తాత్రేయుని శిలా విగ్రహం, తర్వాత సాయిబాబా, తర్వాత అయ్యప్ప.. అవి అన్ని ఒక టెంపుల్ కాంప్లెక్స్ లో ఉంటాయి.. ఆ ఆలయాలు ప్రదక్షిణగా తిరిగి మరల మెట్ల మీదికి వచ్చి రెండు మెట్లు ఎక్కగానే “సదానంద గురు పీఠం”. అక్కడ దర్శించుకుని రెండు మెట్లు ఎక్కి ఎడమవైపుకు వెళ్తే తిరుమల వారు ఇచ్చిన మూర్తి.. కలియుగ దైవం వెంకన్న సామి. దానికి ఎదురుగా గరుడాళ్వార్ మూర్తి ఈ మధ్యనే ప్రతిష్టించారు.
మళ్లీ వెనక్కి రండి.. ఆ కుడి వైపు ఉన్న నివాసం .. ఎవరిది.. క్రిందకొచ్చేటప్పుడు చెప్తా..
అక్కడ నుంచి మరల పైకి వెళ్లి కుడి వైపుకి తిరిగితే మీ ఎడమ చేతి వైపు రాతిలో ‘పవన గిరి’ అని సిమెంట్ అక్షరాలతో అమర్చబడి ఉంటుంది.. మీ కుడి చేతివైపుగా క్రిందకు చూస్తే చిన్న వంటశాల.. (రేకుల ఆచ్చాదన మాత్రం).
కుడివైపు తిరిగి వెళ్తే ఊరు వైపుకు చూస్తూ ఎత్తుగా పవనగిరి నాథుడు.. ఆంజనేయ స్వామి చక్కటి మూర్తి దర్శనమిస్తాడు. దాని ముందు భక్తులు నిలబడడానికి వీలుగా చిన్న ప్లాట్ ఫాం నిర్మించ బడింది. ఆ ఎత్తైన కొండమీద నుంచి.. ప్రకృతి సోయగాలు చాలా బాగా కనపడతాయి.. చెట్ల మధ్యనుంచి ఊరు, రహదారులు, వాగులు,, ఓహ్ ఏమందం? దర్శించుకుని మరల పైకి బయల్దేరుదాం. కొంచెం వెళ్లాక కుడి వైపు గాయత్రీ మాత.. ఎదురుగా హోమ గుండం.. దాని దగ్గర గురువుగారిద్వారా అందిన త్రిశూలం గుచ్చ బడి ఉంటుంది.కొంచెం పైకి వెళ్తే ఎడమవైపు కోదండరామస్వామి ఆలయం, దాని ఎదురుగా గ్రామ దేవత గంగాలమ్మ. కొంచెం ముందుకెళ్తే సువర్చలా సమేత ఆంజనేయస్వామి.. ఇంకా పైకే వెళ్తే కుడివైపు సరస్వతీ దేవి.. దానికి ఈ మధ్యనే రేకులతో షెడ్ వేసారు.. అక్కడనుంచి ఇంకా పైకి పది పదిహేను మెట్లు ఎక్కితే పరమశివుని ఆలయం.. పురాతనమైన శివ లింగం.. ఆ రోజుల్లో ఇక్కడ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అర్చన చేసేవారట. శివాలయం ముందర రాళ్లూరప్పలు, లోతుగా ఉండి శివాలయం ఎత్తుగా ఉంటుంది...
ఇప్పటిదాకా వర్ణించిన ఈ కొండా , ఆలయాలు 2003వ సంవత్సరానికి ముందు లేవు. అప్పుడు ఇది చెత్త మొక్కలు, రాళ్లూరప్పలూ నిండిన ఒక కొండ మాత్రమే. ఇందాకా ఆలయాలు చూసుకుంటూ వెళ్తుంటే ఒక నివాసం చూపించాను. పేరుకు అది నివాసం అంతే .. చాలా సింపుల్ గా రెండు గదులు అనబడే వాటితో కేవలం స్లాబు వేసి నిర్మించారు.. చాలాకాలం క్రితం అది ఒక పూరి పాక. దాని యజమాని శ్రీ తణుకు వేంకట్రామయ్య గారు. ఏదో అంతరాత్మ ప్రబోధంలా , రాజమండ్రి పేపర్ మిల్లులో తను చేసే చక్కని ఉద్యోగం అర్థాంతరంగా వదిలేసి, భార్యా సమేతంగా 2003లో ఇక్కడకు వచ్చి, తనకి వచ్చిన పి.యఫ్ మొత్తాన్ని ఈ కొండ అభివృద్ధికి ఖర్చుపెట్టి ఇదే స్థిరనివాసముగా చేసుకున్న వ్యక్తి. అంతటితో ఊరుకోలేదు.. మన్యం ప్రజలతో మమేకమై వారికి వ్యక్తిత్వమీయడంలో అహరహము కృషి చేస్తున్నారు. తిరుపతి దేవస్థానం వారితో చర్చలు జరిపి మన్యగ్రామాలలో వ్యక్తులకు టి.టి.డి వారిద్వారా శిక్షణ ఇప్పించి వారిని మన్య గ్రామాలలోని గ్రామదేవతల ఆలయాలలో అర్చకులుగా నియోగింపజేసారు.. వారందరికీ సమాజంలో చక్కటి గుర్తింపు ఉంది. సీతా రామ కళ్యాణంలాంటివి వారే చక్కగా చేయిస్తారు. అడపా తడపా వారిని పరిసర ప్రాంతాలలో జరిగే దైవ కార్యక్రమాలలో పాల్గొన జేసి, అవసారాన్ని బట్టి వారికి ఊహించని విధంగా అన్ని సదుపాయాలూ గల హోటల్స్ లో బసదగ్గరనుంచి ఏర్పాటు చేయిస్తారు. మన్యజనాలకు హిందూ ధర్మం యొక్క వైశిష్ట్యాన్ని సవివరంగా వివరిస్తూ..ఎవరి ధర్మం వారికి అనుసరణీయం, పరధర్మం గౌరవించదగినది మాత్రమే అని ఎరుక పరుస్తున్నారు. ఏడు మండలాల జనాభా అంతటికీ ఆయన కేవలం గురువు.. అంత మాత్రమే కాదు, వారి కుటుంబ పెద్ద, వారితో.. వారి కష్టసుఖాలు పంచుకుంటూ సహజీవనం చేసే కొండంత అండ.. .. పెద్దలు చెప్పే ధర్మ శాస్త్రాల సారాన్ని చేతల్లో చేసి చూపిస్తున్నారు.. వేంకట్రామయ్యగారు… ఇప్పుడు ఆ మన్య ప్రజలకు మన ధర్మం తెలుసు. ఏది మంచో , ఏది చెడ్డో తెలుసు.. వేదికలమీద చక్కటి మాటలతో నిజాయితీగా, స్పష్టంగా తమ మనస్సులను వివరించగలరు. పెద్దలను గౌరవిస్తారు... గురువుగారిపట్ల పూర్తి నమ్మకం కలవారు.
గత సంవత్సరం బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు ఈ ఆలయసముదాయం చూసి ముచ్చటపడ్డారు.. మన సంస్కృతిని తమ కట్టు బొట్టుతో కాపాడుతున్న స్త్రీ మూర్తులను చూసారు. మన్యవాసుల నిష్కల్మషమైన ప్రేమాభిమానాలకు ముగ్ధులయ్యారు. శివాలయం ముందర ఒక సభా మంటపం కట్టించడానికి ఋషిపీఠం పక్షాన
ఆర్ధిక సహాయం ఆనాడు వాగ్దానం చేసారు.. ఋషిపీఠం రాజమహెంద్రవరశాఖ ఆ సహాయాన్ని అందించింది. ఆ సభా మంటపం పూర్తయింది. ఈ రోజు 12-1-13 ఉదయం ఋషిపీఠం రాజమహేంద్రవర శాఖలో ముఖ్యులైన డా॥టి.వి.నారాయణ రావుగారు ఆ సభా మంటపాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. “ప్రజా సేవ అంటే నారాయణ సేవ” అని చాటి చెప్పిన స్వామీ వివేకానంద 150వ జయంతి ఈ రోజు.. ఈ ముహూర్తం యాదృచ్ఛికం.
డా॥ నారాయణరావుగారు వివేకానందస్వాముల జీవిత చరిత్రలోని సంఘటనలను, మరికొన్ని పురాణ కథలను ఉదహరిస్తూ గురువు గొప్పతనాన్ని, గురువు గారిని కొలిచే ఆవశ్యకతను చక్కగా వివరించారు..
అక్కడనుంచి అడ్డతీగలకు 20 కి.మీ దూరంలో ఉన్న మర్రిపాలం గ్రామానికి ఋషిపీఠం వెళ్లింది. ఈ గ్రామంలో పరమతస్థులు తమ నీచబుద్ధితో చాలా మతమార్పిడులు చేయించారు . వెంకట్రామయ్య గారి కృషివలన, ఆ గ్రామస్తుల అవగాహన, అంకిత భావంవలన మొత్తం గ్రామం.. ఒక కుటుంబం మినహా.. మరల హిందూ ధర్మంలోకి వచ్చేసింది. అక్కడ కోదండరామ స్వామి ఆలయంలో డా॥ నారాయణరావు గారు ప్రసంగించారు.. శ్రీ మద్రామయణంలోని ఆటవిక కాంత శబరి చేసిన గురుశుశ్రూష.. ఆమెకు కలిగిన రామానుగ్రహం గురించి చక్కటి ప్రసంగం చేయగా.. ఆ గిరిజనులు సజల నయనాలతో ఎంతో ఆసక్తిగా విన్నారు..
చక్కటి కోలాట నృత్యంతో ఆ మన్యవాసులు ఋషిపీఠానికి చక్కని వీడ్కోలు పలికారు…ఋషిపీఠం తరఫున ఐదుగురు సభ్యులం ఈ కార్యక్రమాలలో పాల్గొన్నాం. వేంకట్రామయ్యగారి పిల్లలు చక్కగా సెటిల్ అయ్యారు. తలిదండ్రులపట్ల గౌరవం కలవారు.. అయినా వారికి దూరంగా అరవై దాటిన వయస్సులో ఆ దంపతులు చేసే నిస్వార్థమైన నారాయణ సేవ స్వయంగా చూసినవారెవ్వరైనా అభినందించకుండా ఉండలేరు శ్రీవెంకట్రామయ్యగారి కమిట్ మెంట్ మెచ్చుకోదగింది. అనుసరణీయం కూడా .. వారు చేస్తున్న మహత్కృషికి మరికొంత ఆర్ధిక సహాయం ఋషిపీఠం ఈ సందర్భంగా వాగ్దానం చేసింది.
Thursday, January 9, 2014
హరాజీకాలు - 2 - పంచి ఉండీ… ఊడీ
హరాజీకా - 1 (బాల వాక్కు) .. చదివి చాలామందే స్పందించారు. మీ స్పందన అక్షరబద్ధం చేసి బ్లాగులోనే పోస్ట్ చేస్తే బాగుంటుందని మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఇక ఇది రెండోది. 2004లో హాసం క్లబ్ రాజమండ్రిలో ప్రారంభించి దిగ్విజయంగా చాలాకాలం నడిపాము. ఇప్పటికీ, “మరల హాసం క్లబ్ ఎప్పుడుంటుంది” అని అడుగుతూనే ఉన్నారు. ఇవ్వాళ కూడా ఎవరో ఆడిగారు.. ..ప్చ్..
అలా హాసం క్లబ్ సమావేశాలలో పుట్టినదీ జోకు..
హరాజీకా .. 2
పంచి ఉండీ… ఊడీ
హాస్యం అనగానే ముళ్లపూడి వారి పేరు మనకు స్ఫురణకొస్తుంది. ఆయన ఒక చోట చెప్పారు. నాక్కాదండీ.. ఒక రచనలో చెప్పారు అని అర్థం. ఒరిజినల్ గా జోకులు కొద్దిగానే ఉన్నాయట. మనకు వినపడే జోకులన్నీ వాటికి పొడిగింపులట.. దానికి ఉదాహరణగా :
రాము అలా వెళ్తుంటే సోము ఆడిగాడట..
“రామూ, రామూ! నువ్వు పరగడపున ఎన్ని ఇడ్లీలు తింటావురా” అని
“మూడు తింటానురా” అన్నాడుట రాము
“మొదట ఇడ్లీ కొరగ్గానే పరగడుపు పోతుంది. ఇక మూడు ఎలా తింటావురా” అని కిసుక్కున నవ్వేడట సోము.. .. నాలిక్కరచుకున్నాడు రాము.. నాలుక తెగిందా, రక్తం వచ్చిందా లేదా అదికాదు ప్రశ్న .. ఇక్కడికి జోకు నిజానికి అయిపోయిందికదా.. కాని కాదంటారు ముళ్లపూడి..
దానికి కొనసా...........గింపు..
పై ఎపిసోడ్ లో ఉన్న జోకు బాధితుడు.. అంటే రాము, భీము దగ్గరకి వెళ్లి
“భీమూ, భీమూ.. నువ్వు పరగడపున ఎన్ని ఇడ్లీలు తింటావురా” అని అడిగాడు.
“అయిదు తింటానురా” అన్నాడు భీము.. గతుక్కుమన్నాడు రాము…
...క్కుమన్న రాము “చంపావురా భీము.. నువ్వు మూడు అని ఉంటే భలే జోకు చెప్పేవాణ్ణిరా”అని చక్కాపోలేక .. వెళ్ల లేక వెళ్లాడు..
రాము లాంటి వాడు ఇడ్లీ బదులు, పూరియో, చపాతియో చెప్పినా సోము చెప్పిన జోకు చెప్పలేకపోయేవాడు.. అది ప్రస్తుతం.. అప్రస్తుతం.
ముళ్లపూడి వారి జోకు మీరు కాపోతే మరొకరు చెప్తారు.. దానికి ఇంత బిల్డప్ ఏంటి అనకండి.. ఇది కేవలం నేపథ్యం…
అప్పట్లో హాసం క్లబ్ జరిగేరోజుల్లో విషయం ఇది.. మన వాళ్లు అంటే మీరేనండి, మీలాంటి హాస్యప్రియులు, హాసం క్లబ్ వేదిక మీదకు వచ్చి మంచి మంచి జోకులు చెప్పేవారు. వారిని వేదికమీదకు నేను పిలిచేవాడిని. అలా పిలిచేటప్పుడు
“మీకు తారసపడ్డ జోకు, మీరు వ్రాసిన జోకు ఏదైనా వచ్చి చెప్పవచ్చు” అనేవాణ్ణి..
“మాకు తెలిసిన జోకు చెప్పొచ్చా”
“చెప్పొచ్చు”
“పాతదైనా చెప్పొచ్చా?”
“పాతదైనా చెప్పొచ్చు”
“బాగా పాతదైనా చెప్పొచ్చా?”
“చెప్పొచ్చండీ బాబూ,, ఎలాంటి జోకైనా చెప్పొచ్చు. సభా మర్యాదకు భంగంకలుగకుండా, నవ్వు పుట్టించేది ఏదైనా చెప్పొచ్చు.. ఎటొచ్చీ పంచ్ ఉండాలి. పాతదైనా, కొత్తదైనా సరే చక్కని పంచ్ ఉండాలి.. చెప్పేటప్పుడు ఆ పంచ్ కనుక ఉంటే జోకు బాగా పేలుతుంది. అంచేత మంచి జోకులు పంచ్ తో చెప్పండి…” అని చెప్పడం కద్దు.
నా అభ్యర్ధనమేరకు మిత్రులు వచ్చి జోకులు చెప్పి వెళ్తూండేవారు.. నవ్వులు పండేవి.. ఒకసారి ఒక కార్యక్రమం అయ్యాక, ఒకాయన వచ్చి
“నేను జోకు చెప్దామనుకున్నానండీ”అన్నాడు.
“అయ్యో చెప్పలేకపోయారా?”
“మీరు పంచి, పంచి అంటున్నారు.. నాది పాంటు మరి” అన్నాడు .. అది వేదిక జోకు కాకపోయినా.. వేడి జోకు కనుక నవ్వులు పూయించింది..
హాసం క్లబ్ లో పురుడుపోసుకున్న ఆ జోకును మా అప్పారావుగారు (సురేఖ) తన "సురేఖార్టూన్స్" పుస్తకం అట్టమీద గీసారు కూడాను...
ముళ్లపూడి వారి ఫార్ములా ప్రకారం దీని కొనసాగింపు. మరొకసారి మా కార్యక్రమం జరుగుతోంది. ఓ పెద్దాయన
“నేనూ ఓ జోక్ చెప్తా”నన్నారు. సరే అన్నాం.
“ఇక్కడ జోక్ చెప్పే అధికారం నాకొక్కడికే ఉంది. ఎందుకంటే నాకొక్కడికే పంచుంది. మిగతావన్నీ పాంటులే” అనగానే నవ్వులు విరబూసాయి..
<<<<<<<<<<>>>>>>>>>>
మళ్లీ హారాజీకా -3 లో కలుద్దాము.. హరాజీకా అంటే చెప్తానన్నాను కదూ.. తప్పక చెప్తానండీ..తర్వాత దాంట్లో..
Tuesday, January 7, 2014
హరాజీకాలు -1 - బాల వాక్కు
మీ జీవితంలో ఏవో సంఘటనలు మీకు నచ్చుతాయి. అలాగే పాపం నాకూ నచ్చుతాయిగా, అబ్బా మీ జీవితంలోవి నాకు నచ్చడం కాదండి బాబూ, నా జీవితములోనివి, నాకూ నచ్చుతాయిగా అని నా భావమ్. .. అవి గుర్తొచ్చినప్పుడు నాకు ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి .. అలాంటివి, అందులోని పంచ్ మీతో పంచుకోవాలనిపించింది. నేననుకున్న ‘పంచ్’ నాకు నవ్వు తెప్పించికదా అని మీకూ నవ్వు పుట్టించాలని రూలేం లేదుగా…అని మీరనొచ్చు.. మీరు నిజం మాట్లాడుతారు . అందుకే మీరంటే నాకు చాలా ఇదన్నమాట … వీడేం రాస్తాడులే అనుకోకుండా వీడూ రాస్తాడు అని చదవండి .. స్పందించండి .. మీ స్పందన తెలియజేయండి.. కొన్నాళ్ళు నా బ్లాగులో ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను... .. పాపం మీకు తప్పదు.. స్పందన పోస్ట్ చేయడం.....
హరాజీకా .. 1
బాల వాక్కు
మన మనవలు (అంటే మీ మనవలు మీకు, నా మనుమలు నాకూ) కొంచెం మాటలు నేర్చాక, పెద్దవాళ్ల మాటలని గమనిస్తూ ఉంటారు కదా.. .. సందర్భం కాకపోయినా ఏదో మాట్లాడేస్తూ ఉంటారు కదా.. అవి ఒకసారి మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు.. వారి అమాయకత్వానికి నవ్వూ పుట్టించవచ్చు.
మా మనుమడికి అప్పుడే రెండు నిండి మూడో ఏడులోకి అడుగుపెడ్తున్నాడు. వాళ్ల అమ్మ ఏదైన పని పూర్తిచేసాక ‘అమ్మయ్యా’ అనుకోవడం వింటూ ఉంటాడు. ఒకసారి వాళ్లింటికి వాళ్ల పెదనాన్న వచ్చారు. . రెండు రోజులుండి మూడో రోజు పొద్దున్నే వెళ్లిపోయారు. ఆయన వెళ్లే సమయానికి వీడు లేవలేదు. వీడు లేచాక పెద్దనాన్న కనపడలేదు.. తండ్రిని అడిగాడు
“నాన్నా పెదనాన్న ఏరి ?” ..
“వెళ్లి పోయారురా, నువ్వు అప్పటికి లేవలేదు”అన్నాడు తండ్రి..
“అమ్మయ్యా” అని నిట్టూర్చాడు.. వీడు…
“వెధవా.. మా అన్నయ్య వెళ్లిపోవడం, నీకు అంత రిలీఫా” అని నవ్వుతూ ఒకటేశాడు తండ్రి .. లౌక్యాలు తెలియని వయస్సది..
>>>>>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<
బ్యాంకులో పనిచేసే రోజుల్లో మా ఫ్రెండూ నేనూ జోకులు పంచుకునే వాళ్లం.. అంటే అతడి అబ్జర్వేషన్ లో దొరికిన జోక్ నాకు చేప్పేవాడు, నేనూ అలాగే నాకు దొరికిన జోక్ అతనికి చెప్పడం అలా సాగేది. …
తన మూడేళ్ల కొడుకుని స్కూటర్ మీద ముందు నిలబెట్టుకుని అలా బయల్దేరేడు. పోస్టాఫీస్ ముందు నుంచి వెడుతున్నారు.. ఆఫీస్ ముందు ఎర్రగా ఎత్తుగా వింతగా కనపడింది ఈ చిరంజీవికి. అది చూపించి నాన్నని అడిగాడు.
“అది ఏమీ”టని…
వాడు అడిగింది పోస్ట్ బాక్స్ గురించి.. తనయుని ఎడుకేట్ చెయ్యాలని
“దాన్ని పోస్టాఫీస్ అంటార్రా.. అక్కడ …”
ఇంకా పూర్తి చెయ్యలా..
వెంటనే
“ఎవరిది ?” అని సందేహం వెలిబుచ్చాడు చిరంజీవి..
(నిక్కర్ కు ముందు బొత్తాలు పెట్టుకోపోతే.. పోస్టాఫీస్ అంటాంగా… )
>>>>>>>>>> <<<<<<<<<>>>>>> >>>>>>>>>>
ఉద్యోగరీత్యా కొన్నాళ్లు ఓ పల్లెటూరిలో పని చేయాల్సి వచ్చింది. మేం ఉన్న అద్దె ఇంటికి పెద్ద పెరడుండేది. నూతిలోంచి నీళ్లు తెచ్చుకుని వాడుకోవడం, స్నానాలు నూద్దగ్గరనే.. … మా రెండవ అమ్మాయికి అప్పుడు రెండేళ్లుంటాయేమో.. వర్షాకాలం .. మట్టిలో రక రకాల పురుగులూ అవీ పుట్టి పెరుగుతూ ఉండే రోజులు. ఇప్పుడీ కాంక్రెట్ జంగిల్ లో ఇందులో చాలా మాటలు ఇప్పటివాళ్లకి అర్థం కావు. మా అమ్మాయి వెనకవైపు వెళ్లి, వెంటనే గబ గబా లోపలికి వచ్చి వాళ్ల అమ్మతో “అమ్మా! అమ్మా! దొడ్లో ఇన్ని తేళ్లున్నాయి” అంటూ చేతులు, కళ్ళు చక్కగా త్రిప్పుతూ చెప్పింది.. వాళ్లమ్మ తేళ్లు అనగానే విషయం ఊహించింది. ఏవో పురుగుల్ని చూసి ఉంటుంది అని తెలిసి..
“తేళ్లంటున్నావు, తేళ్లు ఎలా ఉంటాయి” అని అడిగింది..
మా అమ్మాయి వాళ్ళమ్మకేసి ఒకసారి చూసింది.. ఇక మాట్లాడలేదు.
“చెప్పు తేళ్లు ఎలా ఉంటాయి” అని వాళ్లమ్మ రెట్టించి అడిగింది.
మా అమ్మాయి డ్రమెటికల్ గా నవ్వుతూ “హుం మనమేమన్నా తింటామా ఏంటి” అని అక్కడనుంచి వెళ్లిపోయింది.
(కూర చేసి ఎలా ఉంది అంటాం కదా .. అది దాని ఆలోచన..)
[ ‘హరాజీకా’ అంటే ... తర్వాత పోస్ట్ లో వివరింప బడును….]
Subscribe to:
Posts (Atom)