Pages

Monday, August 1, 2011

నే పుత్తిన లోజు లేపే...




నన్ను చూడగానే మా "బుజ్జి బ్లాగు" తప్పటడుగులతో పరిగెత్తుకు వచ్చింది.

"ఏంతమ్మా కన్నా..ఏంకావాలమ్మా?" అని ముద్దుచేసా..


"నే పుత్తిన్ లోజు చెయ్యవా ?" అని గారాలు పోయింది... "

అప్పుడే నీ పుట్టిన రోజు వచ్చేసిందా అని ఆశ్చర్యపోతూ..ఏం చెయ్యాలమ్మా?"
ముద్దుగా అడిగా..

"పండగ చెయ్..అందర్నీ పిలు,,కేకు కొయ్,,స్వీట్ పెట్టు..హాట్ పెట్టు..."

పెద్ద ప్రోగ్రామే చెప్పింది బుజ్జి బ్లాగు.
"ఎందుకమ్మా అంత హడావుడి...నువ్వేం చేసావని..నీకెవ్వరు తెలుసని?" నాకేదో బెరుకు.

"అదేంటోయ్..నేనూ అందరిలాగే పుత్తాను కదా..క్రితం సంవత్సరం ఆగస్ట్ రెండు నుంచి నేనందర్నీ చూస్తున్నా కూడా.." చిన్న వయస్సు ఉత్సాహం మరి..

"నిజమే అనుకో.."
"మరి మా బ్లాగుంటలు, బ్లాగుమ్మలు అందరూ చేసుకుంటున్నారుగా...మరి నే చేసుకోకూడదా.." బుజ్జి బ్లాగు రీజనింగ్ అది.

"అవుననుకో..వాళ్ళందరూ..ఎన్నో మంచి మంచి విషయాలు చెప్పారు. ఎంతో మంది
ఆనందించారు కూడానూ.." అని నసిగా.

"నేనూ చెప్పాగా...నవ్వులు చెప్పా, వేదాంతం చెప్పా, మీ నాన్నగారి గురించి చెప్పా
కార్తీక భోజనాలు చేసా, కంప్యూటర్ కా షా టా లు వివరించా.. సంసారాల్లో సరిగమలు పాడా మరేమో" చాలా పకడ్బందిగా మాట్టాడుతోంది.

"చాల్లే..చాలు చాలు. చాలానే చెప్పావు ఒప్పుకుంటా.."

"చిన్న చితకా స్కిట్స్ ప్రదర్శించా...ఇవన్నీ ఒకరా ఇద్దరా 3442 మంది చూసారు
తెలుసా.." సాక్ష్యాలతో ఆర్గూ చేస్తోంది.

"అదేం పెద్ద గిన్నీస్ రికార్డా ఏమిటి.."


"ఎందుక్కాదు...feedjit..చూడు అంతర్జాతీయంగా ఎంతమంది చూస్తున్నారో తెలుస్తుంది...అన్ని దేశాలవాళ్ళూ చూస్తున్నారు ఏంటనుకున్నావో"

"చూడరంటంలేదు.. "ఆగాగు...నేను నచ్చానని ఎప్పటికప్పుడు మెచ్చుకుంటూ ఎన్నో వ్యాఖ్యలు వున్నాయి తెలుసా.."

"దాందేముంది.. వాళ్ళు వ్రాసిన బ్లాగు(లు)---మనం బాగుంది(న్నాయి) అంటామో లేదో అని..."


"తప్పుడు కూతలు కుయ్యకు...న్యూ జెర్సీ నుంచి, దుబాయ్ నుంచి, జర్మనీ నుంచి
'కేక', 'కేక' అన్నవారున్నారు...వాళ్ళకే బ్లాగులు లేవు కదా.."

"కరెక్టే ! కాని నువ్వు చూపే వాటిలో మాంచి రుచి ఉండాలి..అందరికీ నచ్చాలి..గొప్పగా ఉందనాలి..అలా వుందా అని.."నసిగా

"అమాయకుడా..నే వనభోజనాలు చేసి పెడ్తే చాలా బాగున్నాయ్ అని 32 మంది కామెంటారు..తెలుసా ఇంకా చెప్పాలంటే చాలా విషయాలకి చాలా సార్లు మెయిల్స్ వచ్చాయ్ కూడాను...ఏంటనుకొన్నావో?" ధీమాతో అంది.


"సరేలే నీమాట నేను కాదనలేను. మన ఓపిక మేరకు మనం చేద్దాం సరేనా?.....ఎవరెవర్ని పిలుద్దాము చెప్పు..ఎలా సెలబ్రేట్ చేద్దాం?"


"ఎవర్నంటే....ముందు సురేఖని పిలుద్దాం."


"ఆవిడెవరు.."


"కృతఘ్నుడా...బ్లాగు ఐడియా ఇచ్చిందావిడే కదా..సారీ ఆయనేకదా? మన యమ్.వి.అప్పారావుగారు."


"నిజమే.రోజూ బ్లాగు బ్లాగు అంటూ ఏదేదో చెప్తూ ఉండేవారు..అది విని విని నేను బ్లాగులకి డిసైడయిపోయాను నిజమే. ఆయనకి కృతఙ్ఞతలు చెప్పాలి.. నెక్స్ట్ ఎవరు చెప్పు."

"బ్లాగురువు...జ్యోతి గారు ఆవిడ్ని పిలవ్వా?"

"అమ్మో ఆవిడ్ని తప్పకుండా రమ్మనాలి..బ్లాగు పాఠాలు చెప్పడమే కాదు..ఎన్నో కష్ట సమయాల్లో ఆదుకున్నారు." గురుభక్తి చూపా..

"ఓ సారి నే తప్పిపోతే ఆవిడ ద్వారానే మళ్ళీ దొరికానన్నావు..మరచిపోయావా?" బుజ్జి ఙ్ఞాపకశక్తికి జోహార్లు. "అలా ఎలా మరిచిపోతాను..ప్రకటన కూడా ఇచ్చాను.."

"వనభోజనాలు, మేగజైన్ కాన్సెప్ట్..ఆవిడ మస్తిష్క జనితాలే కదా?"

"..ఇంకా చాలా ఉన్నాయి..ఆవిడని తప్పక గౌరవిద్దాం. బులుసువారిని కూడా పిలుద్దాము. మనమంటే పాపం చాలా ఇదిగా ఉంటారు" అన్నా

"మిస్సన్న గారిని కూడా ఆహ్వానించు..ఏదైనా పద్యం వ్రాసినా వ్రాయొచ్చు."అంది బుజ్జి బ్లాగు..

"లండన్ నుంచి శివకుమార్, దుబాయ్ సుభద్ర గారు ఇలా చాలామంది ఉన్నారు....నేనందరినీ పిలుస్తాను.."

"ముఖం పుస్తకంలో కూడా చాలామంది స్నేహితులున్నారు కదా వాళ్ళనికూడా పిలు." లిష్టు కూడా పెద్దదే...పిలుస్తాను. అందర్నీ పిలుస్తాను ...కాని ఓ కండిషన్" బుజ్జి బ్లాగుకి కొంచెం సుద్దులు చెప్దామనిపించింది.

"కండిషనా..అదేమిటీ?"

"ఏం లేదు..ఇక ముందు ముందు మంచి మంచి రచనలతో అందర్నీ అలరించాలి. ఇంకా ఎక్కువమంది నిన్ను సెహభాష్ అనాలి..అప్పుడు నాకు చాలా గర్వంగా ఉంటుంది....ఓ కే నా? అప్పుడే నెక్స్ట్ పుట్టినరోజు చేసేది..ఇష్టమేనా" అడిగా బుజ్జి బ్లాగుని..

"వెఱ్ఱివాడా..బ్లాగుని మాత్రమే నేను...నువ్వు ఆక్కడ పెట్టిందే ఇక్కడ నీకు దక్కుడు. ఈ బ్లాగు బ్లాగోగులుకి కర్తవి నీవే! కర్మా క్రియా కూడా నీవే.....నేను సాక్షిని మాత్రమే........"
గ్లీతోపదేశం చేసి బుడి బుడి నడకలతో దర్జాగా హాస్యవల్లరికి చుట్టుకుంది బుజ్జి బ్లాగు...


"ఏడాదిలో ఈ వల్లరి ఎంత ఎదిగిపోయింది.." అయోమయంగా అటే చూస్తూ వేలు క్రింద ముక్కేసుకున్నాను.


(షరా:::తాపేశ్వరం మడత కాజాలు, కజ్జికాయలు, పిండి పులిహోర ...భోంచేసి వెళ్ళండి)

Friday, July 1, 2011

ప్రపంచ జోకుల దినోత్సవం

రండి...రండి...ఇవ్వాళ ప్రపంచ జోకుల దినోత్సవమట..చివరికొచ్చేసింది.
అందరు జోకులు చెప్పి నవ్వుకోవాలిట. అలా మా అప్పారావుగారి
బ్లాగులోకి వెళ్తే తెలిసింది..
సరే ! మీరు చెప్తారా ? ..(చిన్ననవ్వుతో) నన్నే చెప్పమంటారా?
నే చెప్తాననుకోండి మరి మీరు నవ్వుతారా?...ఆఁ నవ్వుతారులెండి.
మీది మా దొడ్డ టేస్ట్..నాకు తెలియదా ఏంటి?
ఔనండీ ? నాకు తెలిసుండి అడుగుతాను సంవత్సరానికి ఒక్కసారి
నవ్వుకోవాలని అండం ఏమిటండీ అసలు ? ఇదెలా ఉందంటే
మా ఇళ్ళల్లో 'నందికేశ్వరుడి నోము' అని ఆడంగులు చేస్తూ ఉంటారు..
ఆ నోముకి ఒకటో రెండో ఐటమ్స్...లైక్--చలివిడి, సాతాళించిన శనగలు,
పులగం,ఉండ్రాళ్ళు, అట్లు, అన్నప్పరమాన్నం ఎట్సెట్రా ఎట్సెట్రా చేస్తారు.
అఫ్ కోర్స్...అన్నీ ఒకరోజేకాదు.రెండు రెండు కాంబినేషన్ కూడా ఉంటాయి..
దాందుంపతెగ ఒక్కొక్కప్పుడు ఆ చలిమిడి తెమలదు. ఇక మొగుళ్ళు
(ఇక్కడ బహువచనానికి కొత్తర్థాలు తీయవద్దు ప్లీజ్)ఊరు మీద పడతారు.
ఎందుకంటే అవి సూర్యాస్తమయానికి ముందుగా తినాలి. చిన్న పిసరు కూడా
పాడేయకూడదు..అది కండిషను .టైము దాటితే నోము ఫెయిల్..
అలా వుంది... సంవత్సరానికి ఓ సారి జోకేయాలిట...అందరూ నవ్వాలిట...
నవ్వడానికి కండిషన్ ఏంటండీ బాబు ?... "ఎందుకీ సోదంతా? జోకేసిది
ఉందా లేదా" అని మీ ప్రశ్న. అవునా ? మీరేంటి మీ పొజిషన్ లో నేనున్నా
అలాగే అడుగుతాను... అదీకాక పాపం. మీరప్పుడే నవ్వడం మొదలెట్టేసారు
కూడాను.నేనూ అంతే మా ఆవిడ జీడిపప్పు ఉప్మా చేస్తున్నానంటుంది. నేను
తినడానికి ప్రిపేర్ అయిపోయి నవలడం మొదలెట్టేస్తా..తీరా ప్లేట్ లో
చూస్తే పోపన్నం "అన్నం మిగిలి పోయిందని పోపు తగిలించాను..
నోరు మూసుకుని తినండి.." అంటుంది.. నా టాలెంట్ పై అంత నమ్మకం
ఆ ఇల్లాలుకి. సరే నండి మొదలెట్టేస్తా....
అసలు జోకులు ఒకటో రెండో పుంజీలేట ! వాటి ఎక్స్టెన్షన్ మిగతా జోకులట.
మన రమణ గారు చెప్పారట !
ఉదాహరణకు: రాముకి ఓ సారి సోము కనపడ్డాడు.
"ఒరేయ్ సోమూ నువ్వు పరగడుపుని ఎన్ని ఇడ్డెనులు తింటావురా ?"
" అయిదు తింటానురా " అన్నాడు సోము.
"తప్పురా--మొదటిది తినగానే పరగడుపు పోతుందిగా"
"అవునుకదూ? బాగా చెప్పావురా" అన్నాడు సోము.
ఇది అసలు జోకు...ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్:

సోము ఆ జోకు విన్నాక భీముని కలిసినప్పుడు:
"ఒరేయ్ భీమూ..పరగడుపుని నువ్వు ఎన్ని ఇడ్డెనులు
తింటావురా ?" అని అడిగాడు
దానికి భీము.."ఓ నాలుగు తింటారా" అన్నాడు
వెంటనే సోము
"చంపావురా..అయిదు అని ఉంటే భలే జోకు చెప్పేవాడిని..".
ఇక మీరు నవ్వొచ్చు...నవ్వు రాలేదా...
అయితే మళ్ళీ చదవండి..రా లే దా... మళ్ళీ..మళ్ళీ
నవ్వొచ్చే దాకా చదవండి...
ఎందుకు రాదో చూద్దాం..నవ్వినట్టు వచ్చి తీరుతుంది.

Tuesday, June 28, 2011

ముళ్ళపూడి వారి జయంతి....


గత సంవత్సరము ఆయనకు జన్మదినమన్నాము..
ఏడాది తిరగకుండా జయంతి అంటున్నాము..
నేను ఆయన ఇంకా మనల్ని నవ్వించడానికి
ఆ చెన్నై నగరంలో ఉన్నట్టే అనుకుంటాను
అందుకే ఈ రోజు --------

శ్రీ ముళ్లపూడి వేంకటరమణ గారి జన్మదినం (హాస్యానికి పండుగ రోజు)


ఆ ఇంటి ముందర "ముత్యాల ముగ్గులు." ముందు గదిలో బాపుగారుతీర్చిదిద్దిన
"శ్రీరామ పట్టాభిషేకం" నిలువెత్తు చిత్రం.
"ఎందరో మహానుభావులు" అంటూ త్యాగరాజు కీర్తన బ్యాక్ గ్రౌండు మ్యూజిక్కుతో వినపడుతోంది. అతిథులంతా లోపలికి వస్తున్నారు. అప్పటికే యేదో "ఋణగుణ" ధ్వనితో, "కొత్త రూపాయిలా పెళపెళ లాడుతూ" "బాకీలవాళ్ళకి కోపిష్టివాడి జవాబులా పొట్టిగా,టూకీగా" వున్న ఓ శాల్తీ ఆ జనాల మధ్య కలయతిరుగుతూ, అభిమన్యుడు పద్మవ్యూహంలోకి చొరబడినట్టు చొరబడి, ఒక్కొక్కళ్ళనే 'హలో' (రెండు రూపాయలు),
'హలో' 'హలో' (నాలుగు), 'హలో కులాసా' (ఆరు) - అంటూ పలకరించి పోతూ, జేబునిండా అప్పులతో
నింపేస్తోంది.
అటుచూడండి - బద్దీల లాగు - చింపిరిజుత్తుతో, బుడి బుడి నడకలతో, బుడుగులా వుంది వచ్చేస్తున్నాడు.
అతగాడి చెయ్యిపట్టుకుని, రెండు పిలక జెళ్ళతో సీగాన పెసూనాంబ - వెనకాలరెండు జెళ్ళ సీత, బాబాయి,
లావుపాటి పక్కింటి పిన్నిగారు, ఆవిడ కొంగట్టుకొని - ఆవిడ మొగుడుగారు యింకా యింకా బోల్డు
చాలా మంది వస్తున్నారు.
వీళ్ళని చూడగానే ముళ్ళపూడివారు గుర్తొచ్చారా - అదిగో చూడండి మరి ! తెల్లటి లుంగీ పంచె - తెల్ల చొక్కాతో వీళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. ముళ్ళపూడి వారి పుట్టినరోజు సంబరం - బాపుగారు డిజైన్ చేసి తీసుకువచ్చిన కేకు- దాని మీద జీవితంలో వెలుగులు నింపిన 79 జ్యోతులు వెలుగుతున్నాయి. మిణుకు మిణుకుమంటున్న
జ్యోతులు కష్టాలు గుర్తు చేస్తున్నా-- "కష్టపడ్డ ఆ కష్టాలు కూడా చాలా రుచిగా వుంటాయి.
మామూలుగా అనుభవించే సుఖాలకన్న అవే మధురంగా తీపి గుర్తులుగా ఉండిపోతాయి ." అన్న
ముళ్లపూడి మాటల్ని గుర్తుచేస్తున్నాయి.
"డామిట్ ! జనం అడ్డం తిరుగుతున్నారేమిటి, మైడియర్ వెంకటేశం...?" అంటూ "గురజాడ
నించి వచ్చిన విశిష్ట అతిథి గిరీశం ముందుకొచ్చి, వెంకటరమణ గారి ప్రక్కన నిలబడ్డాడు. అక్కడ
ఋణగ్రహణ చేసిన రుణదత్తుడు జ్యోతుల వెలుగులో నొల్లుకోవడానికి ముందుకు రాబోతే -
అప్పారావుని చూసిన సీగాన పెసూనాంబ 'కెవ్వు'మంది. - బుడుగు నేను రక్షిస్తాడు అని
ముందుకు వచ్చి అప్పారావుకి ప్రైవేటు చెప్పాడు. సీగాన పెసూనాంబ 'బలే' 'బలే' అని చంకలు కొట్టుకుంది.
"రమణ గారూ ! అందరూ వచ్చారు. ఇంక కేకు కోయండి" అన్నారు ఎవరో. రమణగార్కి బాపుగారు
వెండి చాకు అందిస్తే ఇద్దరూ కలిసి కేకు కోసాడు. వారు రెండు కాదు..ఒకటే..పుట్టింది రెండు జిల్లాలలో
తూగోజి-పగోజి అయినా "గోదావరి" ఒకటే అయినట్టు, హాస్యం- బొమ్మ రెండైనా "కార్టూన్"
ఒక్కటే అయినట్టు బాపు రమణలు వేరుగా కనిపిస్తున్నా వారు ప్రసరించే "వెలుగులు" ఒకటే.
ఇక స్పీచ్ లు ప్రారంభమయ్యాయి..
"సాహిత్యపరంగా చిన్న చిన్న పద్యాలు వ్రాసారు ముళ్లపూడి. మా ఇంట్లో నేను వేసిన పెసరట్టు తిని -
'కంద'(పద్య)ట్టు పెట్టారు" అన్నారు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు.
"చీకటి- రాధ కంటి కాటుకలా, కృష్ణుడి వంటి నలుపులా, నందుడి ఇంటి చల్లలా చిక్కబడింది
అని రాసారు ఓ కథలో" అని ఉటంకించారు శ్రీ శ్రీరమణ.
తను మాట్లాడక పోతే బాగోదేమోనని బుడుగు గొంతు సవరించుకున్నాడు.
ఈలోగా "ఆయన మంచి కథలకుడు" అనేసింది సీగాన పెసూనాంబ.--బుడుగుకి మరి
కోపమొచ్చింది. "కథకుడు అనాలేమో" అన్నాడు పెసూనాంబతో.. "కథకాదు ఆయన
రాసింది కథలు కదా? అంచేత కథలకుడే రైట్" అన్నాడు బాబాయి - రెండు జెళ్ళసీత కేసి
చూస్తూ కాలరెగరేసి.
"మరే! మరే! మంచి విమర్శకులుడు కూడా" అన్నారు లావుపాటి ప్రక్కింటిగారి
మొగుడుగారు. వెంటనే లా.పి.గారు ఆయన కాలుతొక్కి "ఆయన వేదాంతి కూడా...
కావాలంటే కోతికొమ్మచ్చి ఆడండి." అన్నారు.
"ఎంత అందమైన సినీమాలు తీసాడు." అన్నాడు అందాలరాముడు. "నిజమే -
విదేశీయులు కూడా ముక్కు మీద వేలేసుకునేలా "సీతా కళ్యాణం"ఇంకా మరేమో
సంపూర్ణరామాయణంలాంటి సినీమాలు అందుకు "సాక్షి" అంది బంగారు పిచుక.
"మరి టి.వి.భాగవతం" అన్నాడు బాలరాజు అప్పుడే మహాబలిపురం నుంచి వచ్చి.
"భక్తకన్నప్ప" వచ్చి, "నా కన్ను పొడుచుకున్నానంటే నేను కిరాతకుణ్ణి - మరీ ఇంత కిరాతకమా ?"
అని వాపోయాడు...అతడి చేతిలో కో..కొ..ఉంది.
విషయం తెల్సిన గిరీశం "తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత దాఋణాలు కూడా ఉన్నాయా? బార్బేరియస్ !" అంటూ లెక్చర్ ఒకటి అందుకున్నాడు.
'స్వాతి' బలరామ్ గారు ముందుకొచ్చి...."కష్టాలు తాను పడ్డాడు-- సుఖాలు మనకి అందించాడు.
అపార్థసారథి బాపు, అప్పార్థసారధి రమణ--ఇద్దరూ ఎంతో క్షమాగుణమున్న దయామూర్తి--
లోతుగుండె ఉన్న వేదాంతి." అనగానే బాపురమణలు చొక్కాల బొత్తాము విప్పబోతే
"మా ఎదురుగుండా తప్పు" అంది Mr.పెళ్ళాం.
మంత్రిగారి వియ్యంకుడు ఖండువా సవరించుకుంటూ "ఇక భోజనాలకి లేవండి" అనగానే....
"సమూహ భోజనంబు - సంతోషమైన విందు
అంతస్తులన్ని బందు - అహహ ఏమనందు"
అందరూ కోరస్ పాడుకుంటూ కదిలారు భోజనాలకి.
______________________________________________________________
నాలోని భావలాను అక్షరబద్ధంచేస్తే అది గత సంవత్సరం జూన్ 28న స్థానిక దినపత్రిక
"సమాచారమ్"లో వెలుగుచూసింది. ఆ కాపీ ఒకటి శ్రీ ముళ్లపూడి వార్కి పంపాను. వారు
స్పందించి వ్రాసిన ఉత్తరము కాపీ ఇది.నా పట్ల ఇంత ప్రేమ పంచిన ఆ హృదయ సంస్కారానికి
మవునంగా అంజలి ఘటిస్తున్నాను.
ఇది వారు నాకు వ్రాసిన ఆఖరు ఉత్తరం........
"ఔరా..మొత్తం ఎన్నివ్రాసారేమిటి" అనకండి...
ఇది నాకు వారు వ్రాసిన మొదటి ఉత్తరం కూడా ...
శ్రీరామ
శ్రీ దినవహి వేంకట హనుమంతరావు గార్కి
రమణ నమస్కరించి వ్రాసేది.
తేనెలూరే మాటలతో మీరు పంపిన సుధలేఖకు
నా సుధాకాంక్షలు. ధన్యవాదాలు తప్ప-"పొగడు పూల"
దండకు అన్యవాదాలుండవుగదా!
'గట్లు రెండయినా గోదారి ఒకటే
బొమ్మలు రెండయినా వాక్యం ఒకటే'
లాటి వాక్యాలు కావ్యాల్లా చవులూరిస్తున్నాయి
శుభాశీస్సులతో...
(సం) ముళ్లపూడి వెంకట రమణ
02-07-2010
--------------------------------------------------------------------------------------------------

Friday, June 24, 2011

"చు క్కో ప ని ష త్"


ఖగపతి యమృతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్ !
పొగచెట్టై జన్మించెను
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్ !!

ఇది మన గిరీశంగారు శిష్యుడు వెంకటేశానికి చెప్పిన పద్యం.. బృహన్నారదీయం నాలుగవ ఆశ్వాసంలో వుందని సదరు గిరీశంగారే ఉవాచ.."మీతో వుంటే నాకు పొగచుట్ట త్రాగడం తప్ప చదువేం రావటంలేదట" అని వెంకటేశం వాపోతే చుట్ట మాహాత్మ్యం పైవిధంగా చెప్తారు గురువుగారు.
ఇప్పుడు మనకు కావలసినది -- ఆ పద్యంలో పాయింటేమిటని? దున్నపోతు, పొగచుట్ట కాదండి-- 'చుక్క'. అది మనపాయింట్... భుగ భుగ పొంగుతోందట.. అమృతంపు చుక్క..ఆ అమృతం ఖగపతి అంటే గరుత్మంతుడు తెచ్చాడు.. "నా దగ్గర దాస్యం చేస్తున్ననీ తల్లికి విముక్తికావాలంటే నాకు అమృతంకావాలి..అమరపురికి వెళ్ళి అమృతం తెచ్చి ఇయ్యి..." అని సవతితల్లి కండిషన్ పెట్టింది...వెంటనే వైనతేయుడు సురపురికి వెళ్ళి, దేవతా వీరులనోడించి.. అమృతభాండము గ్రహించి, చేతిలో ఉన్న అమృతాన్ని కనీసం వాసనకూడా చూడకుండా, సవతితల్లికి సమర్పించి, అక్కడున్న దర్భలపై వుంచాడు వినతాసూనుడు. అఫ్ కోర్స్ అలా పెట్టించడం దేవతల ప్లానే అనుకోండి తల్లికి దాస్యవిముక్తి అయిందని కద్రువ ఇలా డిక్లేర్ చేయగానే; రెడీగా ఉన్నదేవతలు అలా అమృతభాండాన్నికాస్తా తన్నుకు పోయారు... కద్రువ సంతానమైన నాగులు పాపం ఆ దర్భల్ని నాకాయట అమృతపు చుక్కలు ఏమైనా అక్కడ పడ్డాయేమోనని...'చుక్క' అమృతంకూడా పడలేదు సరికదా నాలుకలు నిలువుగా చీలాయి మాగాయి ముక్కల్లా ... పాములకు రెండు నాలుకలు అప్పట్నించీ....
అక్కడ పడని ఆ యొక్క అమృతపు చుక్క భూమి మీద పడి పొగచెట్టై కనపడింది గిరీశానికి. ఆ అమృతం భుగ భుగ పొంగుతోందట.. విషానికి తోబుట్టువుకదా.. అదీకాక పొంగితే కాఫీకూడా గొప్ప రుచిగా వుంటుంది... పొంగు రుచి మరి...

బాపు రమణలకు "సాక్షి" లో కనపడింది అదే....హీరోయిన్ 'చుక్క' కొబ్బరి పీచు కొట్తూ వుంటుంది.. ఆ శ్రమకు వంటినంటిన వలువల అస్తవ్యస్తమైన పరిస్థితి.. అది చూసిన మునిసిబు "చుక్క వళ్ళు దాచుకోకుండా పనిచేస్తుందయ్యా" అని ప్రక్కనే ఉన్న కరణంతో అంటాడు, "మరే! మరే!" దాగీ దాగని వళ్ళుచూసి పరవశుడై పళ్ళికిలిస్తాడు కరణం. 'చుక్క' విలువకు "సాక్షి" ఆ సినీమా. అందుకే ఆ కారెక్టరుకి బాపు,రమణలు పెట్టిన పేరు "చుక్క"

ఋషులకాలంలో ఆకాశంవైపు అలా చూసి, చుక్కని బట్టి టైము చూసేవారు...వేగుచుక్క పొడిస్తే తెలవారే టైము...తూర్పువెళ్ళేరైలు సినీమాలో అనుకుంటా 'వేగుచుక్క పొడిచింది' అంటూ పాటకూడా ఉందండోయ్...అదీ బాపుగారిదే...కోడికూతతో కూడా టైము చూసేవారనుకోండి...అది అంత స్టాండర్డు కాదేమో...ఎందుకంటే గౌతమ మహర్షి దెబ్బతిన్నాడుకదా... అయినా పరాయి వాళ్ళ ఫామిలీ గొడవలు మనకెందుకులెండి...?

మనజీవితాలు చుక్కలోంచే పుట్టాయి. "అణురో రణూయాన్..." అణువు అంటే చుక్క..
అది అలా ఉంచితే అసలు సృష్టిక్రమం చూడండి... పైనుంచి ఓ నీటి చుక్క పడుతుంది....తన చిరునామా తెలియని ఆ చుక్క-- చిన్న చెలమవుతుంది.. అందులో ఓ పసితనం... తర్వాత గలగలపారే ఏరవుతుంది...అది గంతులేసే బాల్యం... గట్టులనొరిసిపారే చెరువవుతుంది నిండు యవ్వనంతో....స్వాదుజలాల్ని అందించే తల్లి గోదావరిగా మారుతుంది... ఆ తర్వాత నిండుగంభీర సాగరాన్ని చేరుతుంది... ఆ రత్నగర్భకు ప్రారంభం ఆ యొక్క నీటిచుక్కే కదా..

చిన్నప్పుడు స్కూల్ రోజుల్లో అనేవారు... శ్రీ----చుక్క-----బొల్లిమేక అని. టైముకన్నా ముందు స్కూలుకెళ్తే...చేతిలో 'శ్రీ' వ్రాసేవారట...అదిగొప్ప; టైముకెళ్తే 'చుక్క' పెట్టేవారట... మరీ ఆలస్యంగా వెళ్తే వాడు 'బొల్లిమేక'గా పరిగణింపబడేవాడు. ఇది వినడమేకాని నాకు అంతకన్నా తెలియదు.
అంచేత స్కూల్ రోజులు 'చుక్క'తోనే ప్రారంభం.. చుక్కలాట ఆడేవాళ్ళం వెనకాల బెంచీల్లోకూర్చుని... కాగితం మీద వరుసగా చుక్కలు పెట్టి, ప్రక్క చుక్కలు, తడవకు ఒకరు చొప్పున, కలుపుతూ... నాలుగు చుక్కలు కలిసి స్క్వేర్ అవగానే మనకొక పాయింట్... మధ్యలో మేట్టారు చూస్తే "మేట్టారండీ..మేట్టారండీ..కొట్టకండి మేట్టారండీ".
పద్యానికి చుక్క మార్కు ఉంటే అవి కంఠతా పట్టాలి....తప్పదు. ఎందుకంటే అవి పరీక్షల్లో అడుగుతారు మరి.

ధనుస్సంక్రమణం ప్రారంభమవగానే ముగ్గులు ప్రారంభం...నెలపట్టు అనేవారు...వేకువనే చక్కని చుక్కలు ఇంటిముందు కళ్ళాపు చల్లి, జారిపోతున్న పమిట (ఒకప్పటి డ్రస్సులెండి) సర్దుకుంటూ చుక్కలు పెట్టి...(ముగ్గు డిజైన్ ని బట్టి చుక్కల లెక్క ఉంటుంది).. ఆ చుక్కలు కలుపుతూ రక రకాల ముగ్గులు పెట్టే చక్కని చుక్కలు మనకి తెలుసు...వారి ఓరచూపులు కేచ్ చేస్తూ చుక్కల్లో చంద్రుడిలా కొంటె కుర్రాళ్ళు.

వయసువచ్చిన నవవధువులు బుగ్గమీద చుక్క పెట్టుకుని "బుగ్గమీద పెళ్ళి బొట్టు ముద్దులాడ" సిగ్గులమొగ్గలై పెళ్ళిమంటపంలో కూర్చుంటే ఆ చుక్క ఠీవి వరుని బుగ్గపై ప్రతిఫలించడం చూస్తూనేవున్నాంగా...

ఎన్నికలొస్తే చుక్కతో ప్రారంభమై..చుక్కతో ముగుస్తుంది ఎలక్షన్... ముందు చుక్క పోస్తేనే బూతు చేరతాడు విలువైన ఓటరు, చేతిపై చుక్కపెట్టింఛుకున్నాకనే చుక్క మత్తులో ఓటు వేస్తాడు.. అప్పుడు ఎలక్షన్ పూర్తయినట్టు... ఎన్నికైన ప్రభుత్వం గద్దెనెక్కాక...కుళాయిల్లో నీటిచుక్కలు లేక కన్నీటిచుక్కలతో గొంతు తడుపుకొంటే వాళ్ళకేం పట్టింది... కన్నీరు అలా చుక్కలుగా ఉండక ప్రవాహంగా మారితే ఆ కన్నీళ్ళు కూడా జాతీయంచేసీయగలదు ప్రభుత్వము. అప్పోజిషన్ వాళ్ళు రంగు జెండాలు పాతినా పాతీయొచ్చు. తస్మాత్..జాగరత!...

మన భాగ్యనగరంలో చుక్కల అరటి పళ్ళు ..అబ్బా ఏం రుచండి... చుక్కంటే అంతేమరి..
మనం నిత్యావసరాల ధరలు చుక్కల్ని తాకుతున్నాయని గగ్గోలుచేస్తాం...ఆ బాధ పోగొట్టడానికి ముందుచూపుతో వాడ వాడలా చుక్కల దుకాణాలు తెరచారు దయగల ప్రభుత్వంవారు. పవిత్రమైన ఓటువేసే వాడిపై
(చుక్కవేసుకుని మరీఓటు వేసేవాడిపై) అంతప్రేమ.

అసలీ చుక్కగొడవ నీకెందుకయ్యా అని మీరనొచ్చు. చుక్కమీది మక్కువ ఎందుకంటే మేమున్నది..చుక్క అప్పల స్వామి రెడ్డి గారి మేడ ప్రక్క వీధిలో...
మీరుమాత్రం తక్కువ తిన్నారూ..? ఏం చేసానంటారా... అంతర్జాలంతో ఆడుకుంటున్నారా? అదంతా మరి చుక్కలే కదండీ... సో అండ్ సో చుక్క బ్లాగ్ స్పాట్(అదీ చుక్కే) తర్వాత చుక్క ఆ తర్వాత కామ్..
సో అండ్ సో జిమెయిల్ చుక్క కామూ.,
చుక్క కో;
చుక్క ఇన్నూ.
ఈ జగమంతా చుక్కల మయమూ...
ఇతి . . . .చుక్కోపనిషత్ సర్వం సంపూర్ణం... ఏతత్ ఫలం మీకే సమర్పయామి.
____________________________________________________________________________________________________________________________________________________________________
{మిత్రులు శ్రీ కె.వి.శాస్త్రిగారు వైజాగ్ నుంచి మాట్టాడుతూ..."శ్రీ రమణ ఏదో మేగజైనులో చుక్కమీద వ్రాసారండి బాగుంది..చూసారా" అని అడిగారు. అది నేను చూడలేదు..కాని నా కొచ్చిన ఆ చుక్క ఆలోచన పైవిధంగా రూపొందింది... సారూప్యాలుండవచ్చు, నిజాలు కదా.
చిన్నమనవి.. చుక్క ఆలోచనంటే అపార్థం చేసుకోకండి ప్లీజ్.....}
--- ---- ----- ------- ------ ------ ------- ------- - ------- ---

Wednesday, June 22, 2011

మా నాన్న గారి జయంతి ఈ రోజు

మధ్యలో నాన్నగారు దారా వేషం లో...ఆయనప్రక్కన జహానారా గా ఒక జడ్జీ గారు ఆడ వేషం వేసారు.

(కూర్చున్న వారిలో ఎడమ చివర నాన్నగారు..పాత ఫోటో అర్థం చేసుకోండి.)




గాయత్రీ మంత్ర దీక్ష ప్రేమనొసంగినట్టి
గురు నుత్తమజనకు
సత్యనారాయణాఖ్యు
తలతు గురుండని ఎల్లవేళలన్

గాయత్రీ మంత్రోపదేశము చేసిన గురువు... ఒక చిరునామా ఇచ్చినన్ను లోకానికి పరిచయం చేసిన మహావ్యక్తి, ...ఇంకెవరు మా నాన్నగారు...
సాధారణంగా ప్రతి వ్యక్తికి కూడా తమ తలిదండ్రులు గొప్పవారే..
ఏ తలిదండ్రుల ప్రత్యేకతలు ఆయా తలిదండ్రులవే..
మా తండ్రిగారు శ్రీదినవహి సత్యనారాయణగారు. వారి పుట్టినరోజు ఈ రోజు (ఇంగ్లీషు కాలండర్ ప్రకారము..22-6-1894).
జీవితంలోని కష్టసుఖాలను భగవత్ప్రసాదంగా స్వీకరించి ఆనందంగా జీవనయానంచేసిన మా నాన్నగారు
నాకు ఆదర్శమూర్తి...
ఆయన దేశభక్తులు, తెలుగు,హిందీ,వంగ భాషలలో పాండిత్యం కలవారు. అభినయదక్షులు.,సహృదయులు.
1921లో గాంధీమహాత్ముని పిలుపుమేరకు చదువుతున్న బి.ఏ క్లాసులను వదలి జాతీయోద్యమంలో చేరిన మా నాన్నగారు కాకినాడలో స్థాపింపబడిన జాతీయ పాఠశాలలో అధ్యాపకునిగా పనిచేసారు. చుట్టుప్రక్కల ఉన్న పల్లెలలో ఒకచేత్తో హరికేన్ లాంతరు పట్టుకుని ఇంటింటికీ వెళ్ళి జనాల్ని ప్రోత్సహించి హిందీ భాష నేర్పెడివారట. నిర్వాహకులైన నాయకులు జైలుపాలవుతుంటే పాఠశాల నిర్వహణ కష్టదశలో ఉన్నప్పుడు విద్యార్థులనుత్సాహ పరుస్తూ వారితో కలసి నాటకాలు ప్రదర్శించి నిధులు సేకరించెడివారు....జాతీయపాఠశాలలో విద్యార్థినిగా దుర్గాబాయ్ (దేశముఖ్) నాన్నగారిదగ్గర హిందీ నేర్చుకున్నారు.. అది తన జీవితచరిత్రలో ఆమె ప్రస్తావించారు కూడా..చురుకుగా ఉండే దుర్గాబాయ్ విద్యార్థినిగా ఉన్నప్పుడే నాన్నగారి ప్రోత్సాహంతో జాతీయ పాఠశాలకు ప్రిన్సిపల్ గా పరిచయంచేయబడ్డారు
స్వాతంత్ర సముపార్జన తర్వాత వీరు గుజరాత్ విద్యాపీఠ్ వారి బి.ఏ పూర్తిచేసారు కాని ఆ డిగ్రీ మన ప్రభుత్వము గుర్తించని కారణంగా సరియైన ఉద్యోగం లేదు.. ఏలూరులో ఉండగా అక్కడ ఉన్నవిద్యాధికులతో కలసి హిందీలో వీరు నటించిన షాజహాన్ నాటకం మద్రాసులో పురస్కారములందుకుంది. పై ఫోటోలో దారా వేషంలో ఉన్నది నాన్నగారు. మొదటి ఫోటోలో వేషాలు వేసినవారే క్రింద ఫోటోలో వున్నవారు. lచంద్రగుప్త నాటకంలో చాణక్యుడిగా వీరి పాత్రధారణ బహుథా ప్రశంసింప బడింది.. తణుకు టౌన్ హాల్ లో వీరికి సన్మానం జరిగిందని వారి పంచాయతీ సావనీర్ లో వుంది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన "షాజహాన్" నాటకాన్ని తెలుగులోకి అనువదించి, ముద్రింపించారు.. అది బహుళ ప్రజాదరణ పొందింది. కలకత్తాలో ఉండగా విద్యార్థులకు అర్థమయ్యేరీతిలో పాలీ భాషకు గ్రామరు వ్రాసారు. ప్రేమచంద్ కథలు, మేవార్ రాజ్యపతనం వీరు తెలుగు అనువాదాలు... వీరికి బాగా పేరు తెచ్చినది... తులసీదాస కృత శ్రీరామ చరితమానస్ గ్రంధానికి వీరి తెలుగు వచనానువాదం.. 1962లో వీరు ముద్రించిన ఈ గ్రంధానికి మొత్తం మూడుముద్రణలు జరిగాయి.
అయితే వీరికి బెంగాలి,పాలీ,హిందీ,తెలుగు భాషలలో ఏ విధమైన డిగ్రీలూ లేకపోవడం
ఆశ్చర్యకరం.
స్వాతంత్రోద్యమంలో నిర్మాణాత్మక కార్యక్రమాలలోనే ఉండమన్న నాయకుల ఆదేశాలు కారణంగా వీరు జైలుకి వెళ్ళే సందర్భం రాలేదు.. ఫలితంగా వీరు స్వాతంత్ర సమరయోధులుగా గుర్తింప బడలేదు. ఏ విధమైన ప్రభుత్వ సాయమూ అందలేదు. అదీ భగవంతుని ప్రసాదమనే భావించారు... అప్పటి రెవెన్యూశాఖామాత్యులు శ్రీ కళా వెంకటరావుతో వీరికి సాన్నిహిత్యముంది. సాయంచేయమని అర్థించడం చేతకాని విద్య నాన్నగారికి...
శ్రీరాముని హృదయంలో ప్రతిష్టించుకుని శ్రీరాముని బిగ్గరగా స్మరిస్తూ తన 88వ ఏట సునాయస మరణాన్ని పొందిన
మా నాన్నగారు ధన్యజీవి అని నే నెప్పుడూ భావిస్తాను. ఈ జన్మదినం సందర్భంగా వారికి వినయాంజలులు....

(నాన్నగారు పై పద్యం రోజూ చదివేవారు...కాని వేంకట్రామాఖ్యు అని తాతగారి పేరు అనేవారు.. గణ యతి దోషాలు ఉంటే అవి నావి ..విన్నది గుర్తు చేసుకోవడం..)