Pages

Saturday, May 7, 2011

విశేషం వైశాఖం



ఆధ్యాత్మిక జీవనం గడిపేవారికి వైశాఖమాసం చాలా విశేషమైన మాసం....ఎందరో మహనీయులు ఈ మాసంలో జన్మించారు....ఎందరో దేవతలకు సంబంధించి అర్చనాదులు ఈ మాసంలో జరుపుతారు...
మే నెల 4వ తేదీ ప్రారంభమై జూన్ నెల 1వఱకు సాగే ఈ నెలలో


5వ తేదీ....శ్రీ సింహగిరి నాథునికి చందనోత్సవం...సంవత్సరమంతా చందనపూతతో అలరారుతూ శివలింగాకృతిలో దర్సనమిచ్స్ నృసింహ స్వామి., పూసపాటి రాజవంశీయుల ఆధ్వర్యవంలో జరిగే చందనవలుపు తర్వాత భక్తులకు ఓ రోజంతా నిజరూప దర్శనం అనుగ్రహిస్తాడు.. మరునాటినుంచి మూడు తడవలుగా చందనపూతతో శ్రీ నృసింహస్వామి చల్లబడతాడు..విష్ణు రూపాయ నమశ్శివాయ...

6వ తేదీ..పరశురామ జయంతి...రేణుకా జమదగ్నుల పుత్రునిగా, శ్రీహరే, జన్మించి దుష్టశిక్షణచేసిన క్షాత్రతేజం పరశురాముడు...కోదండరాముని అవతారం జరగగానే తన అవతార ప్రయోజనం పూర్తి చేసిన పరశురాముని... ధ్యానించడం ఈ రోజు విశేష ఫలాన్నిస్తుంది. అదీకాక ఈ రోజు అక్షయ తృతీయ...ఈ రోజు చేసిన
ఏ ఆధ్యాత్మిక సాధనయైనా అక్షయ ఫలాన్నిస్తుందని శాస్త్రవచనం...

8వ తేదీ..శ్రీ శంకర జయంతి...అద్వైత మతావలంబికులకు ఆదిగురువు ఆది శంకరులు... వైదిక మతాలన్నింటిని సమన్వయపఱచి వేదాంత మతాన్ని ప్రతిష్టించిన అపరశంకరులు బ్రహ్మసూత్రాది విషయాలకు వారు వ్రాసిన
భాష్యాలు పండిత ప్రకాండులకు సహితం శిరోధార్యాలు...స్తోత్ర వాఙ్మయం ఎంతోమందికి నిత్య పఠనీయం

సదాశివ సమారంభం..వ్యాస శంకర మధ్యమం...
అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం..

ఆది శేషుని అంశావతారంగా కీర్తించబడే శ్రీ రామానుజాచార్యుల జయంతి కూడా ఈరోజే..
విశిష్టాద్వైత మత సంస్థాపకులు శ్రీ రామానుజులు హరిభక్తి తత్పరులు.

9వ తేదీ..త్యాగయ్యగారి జయంతి....ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానం చేస్తూ 95కోట్ల రామనామాన్ని జపించిన నాద బ్రహ్మ....శ్రీరాముని సన్నిధిని మించిన పెన్నిధిలేదని చాటిచెప్పిన వాగ్గేయకారుడు...

10వ తేదీ...విద్యారణ్య జయంతి..హరిహర బుక్కరాయలద్వారా విద్యానగర(విజయనగర) రాజ్యనిర్మాణ శిల్పి...."శంకర విజయం"..ఆది శంకరుల చరిత్రను మనకందించిన మహనీయులు;...వేదాలకు భాష్యం వ్రాయడమేకాదు.....సనాతనధర్మాన్ని మ్లేచ్ఛుల దురాక్రమణనుండి రక్షించిన సిద్ధపురుషులు...
గంగాదేవి జన్మించిన తిథి కూడా ఇదే...గంగపూజ,,గంగా స్నానం...విశేష ఫలితాన్నిస్తుంది.

అస్మద్ గురుదేవులు....అభినవ షణ్మతాచార్య, సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి జన్మదినం కూడా ఈ రోజే.... వ్యవస్థాపక సంపాదకులుగా తమ మానసపత్రిక ఋషిపీఠం ద్వారా, తమ శాస్త్రబద్ధ ప్రసంగాలద్వారా సనాతన ధర్మ సమున్నతికి వీరు చేస్తున్న కృషి బహుథా శ్లాఘనీయం...శ్రీశర్మగార్కి పరమేశ్వరుడు ఆయురారోగ్యైశ్వర్యములు కలుగ జేయాలని ప్రార్థిద్దాము..

16వ తేదీ శ్రీనృసింహ జయంతి.....సంధ్యా తత్త్వం..హరి ఎక్కడున్నాడో చెప్పు అని ప్రశ్నించే తండ్రి....హరి
లేనిదెక్కడనే తనయుడు....హిరణ్యకశిపుని కోరిక మేరకు....ప్రహ్లాదుని విశ్వాసం మేరకు...తనని తాను
రూపకల్పన చేసుకుని నారసింహునిగా ఆవిర్భవించిన శ్రీ హరి ...రెండు ఆలోచనల మధ్య
ఆలోచనారహితస్థితి సంధ్య....లోపల వెలుపలాకాకుండా, రాత్రి పగలు కాని సంధ్య స్థితిలో, ప్రాణముండీ
లేని గోళ్ళే ఆయుధంగా, క్రిందా పైనా కాని తన ఒడిలో, నరుడు మృగమూకాకుండా ఆవిర్భవించిన ఆ
శ్రీ హరి దుష్టశిక్షణ ...శిష్ట రక్షణ ఏకకాలంలో పూర్తిచేసిన పరిపూర్ణావతారం శ్రీ నృసింహస్వామి...

17వ తేదీ హనుమత్ జయంతి....భక్తుడూ అతడే, భగవంతుడూ అతడే.....తాను నమ్మిన శ్రీరాముని
మనసావాచా సేవించే మహాభక్తుడు....నీవే శరణని భక్తిగా కొలచే భక్తులకు సకల కామితములు
అనుగ్రహించే భక్తజన సులభుడు...శ్రీరామానుగ్రహం హనుమత్ కృపవల్లనే
లభ్యమౌతుంది....

బుద్ధిర్బలం యశో ధైర్యం::
నిర్భయత్వమరోగతా:

అజాడ్యం వాక్పటుత్వంచ::
హనుమాన్ స్మరణాత్ భవేత్||

ఇన్ని విశేషాలుకలిగిన ఈ నెలలో దాహార్తులకు మజ్జిగ, మంచినీరు అందీయడం యెంతో
తృప్తిని కలిగిస్తుంది......చలివేందరలు ప్రారంభించాలి...మూకుళ్ళతో డాబాలమీద నీరు పెట్టడం ద్వారా ...
వీధుల్లో నీళ్ళ తొట్టెలు పెట్టడం ద్వారా పశుపక్ష్యాదులకు దాహార్తి పోగొట్టడం మంచిపని..ఆ మూగ జీవాలు
మౌనంగా మనకు మంచిని ఆకాంక్షిస్తాయి...ప్రయత్నిద్దామా!!!

Thursday, April 28, 2011

'బఫే వైరాగ్యం'




"మా మనవడి పెళ్ళి..ముందుగా వచ్చి దగ్గరుండి పెళ్ళి జరిపించాలి.."
రామారావు స్వయంగా వచ్చి పిలిచాడు.
"అలాగేరా !" అన్నా
"అలాగే అంటే కుదరదురా...మనదేనాటి స్నేహం. తప్పక రావాలి"
"అలాగేరా ! వస్తానన్నాగా ? "...
"వివాహ భోజనంబు వింతైన వంటకంబు...వియ్యాలవారి విందు...
ఓహొహ్హో నాకే ముందు" పాట ''మ్ చేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళా....
"హుఁ ...అయితే ప్రయాణానికి రెడీ అన్నమాట." అని ఆవిడ 'హు'మ్
చేసింది.
"మరి వెళ్ళాలికదోయ్.."
*****
"ఇంకా పెళ్ళి కాకుండానే దంపతుల్ని ఆశీర్వదిస్తారట...అక్షతలట..ఏమీటో
పద్ధతులు" రామారావు చిటపటలాడిపోతున్నాడు.
" ముహూర్తం అర్థరాత్రి అంటే రాలేరు కదరా మరి?" అని సర్దబోయా.
"ఏమిటిరా నువ్వుకూడాను...పెళ్ళి చూసి ఆశీర్వదించండని కదా మన
మిచ్చిన శుభలేఖల్లో వున్నది... ముందొచ్చి...తినేసి....ఇంకా దంపతులవ్వని
వాళ్ళ చేతులు పట్టుకుని, ఊపేసి వెళ్ళిపోతారా ? "--వాడు అలా అంటే ఏమీ
అనలేకపోయా.." బఫే భోజనాలొద్దు...అలా నిలబడి తినకూడదుట... తప్పుట
అన్నా.. అలాగే టేబిల్స్ వేస్తామండి అన్నారు పాపం ఆడపెళ్ళివారు..కాని మా
ప్రబుద్ధుడు ఒప్పుకోడే ?---అది ఫేషన్ . అందుకని బఫే లేపోతే కుదరదట....
నేను గట్టిగా అంటే మనవి చాదస్తాలు.." బాధ చెప్పుకున్నాడు రామారావు.
"సరే సాయంత్రం సమూహ భోజనాలన్నమాట!--సమూహ భోజనంబు..
అంతస్తులన్ని బందు.." విషయం సీరియస్ అవకూడదని నే పాటందుకున్నా....
నా (దు)స్వరగానానికి వాడు నవ్వేసాడు.
***********
నిజానికి నాకూ ఎందుకోగాని బఫే ఇష్టముండదు..వద్దనుకుంటూనే..లైనులో
నించుంటాను.. హాలు చాలా చిన్నది...కన్యాదాత పాపం చాలా గిల్టీ గా
అందరికీ సారీ చెప్తున్నాడు...సీజను మూలాన ఇంకేదీ దొరకలేదుట. ఇదైనా
ఎవరో కాన్సిల్ చేసుకుంటే దొరికిందట. రిసెప్షన్ కి చాలామంది వచ్చారు. మా
పాతమిత్రులు కొందరు కలిసారు....
కాస్త ప్లేసులోనూ... ప్రక్క మొలకలెత్తే గింజలు, పచ్చికూర ముక్కలు,
ప్రక్క ఘుమ ఘుమలాడే మషాలా వంటకాలు, అదికాక మామూలు భోజనం...
ప్రక్క ఛాట్....ఇంకో ప్రక్క పెసరట్టులు, మినపట్టులు, రవ్వట్టులు...
వేడి వేడిగా వేస్తున్నారని అట్ల లైనులో నా పా.మిలు కొందరు జొరబడ్డారు....
పెనంమీద ఆట్లు ట్రిప్పుకి నాలుగేసే రెడీ అవుతున్నాయి...సర్వర్ అట్లకాడతో
అట్లు అలా పైకెత్తగానే "నాకూ" "నాకూ" అంటూ గాలిలోకి చాలా ప్లేట్లు లేస్తున్నాయి.
'మాయాబజారు' సినీమాలో రమణారెడ్డి సృష్టికి ఎగపడే కౌరవసోదరులు
గుర్తొచ్చారు. జగన్మోహిని అమృతం దేవతలకు మాత్రమే వయ్యారంగా
పంచుతున్నట్టు అట్లకాడ ఓనర్ ప్లేట్లు ఎంచి ఎంచి మరీ పెడుతున్నాడు
అట్లను.

నేనూ కొంతమంది మిత్రులం భోజనాలలైనులో పడ్డాం...
"ఇంత కూడుంటెట్టమ్మా..ఇంత పప్పుంటెయ్యమ్మా"...నా లోపల్నించి కోరస్
వినపడుతోంది...బాబూమోహన్ చేతిలో అల్యూమినియమ్ కంచంలా నా చేతిలో
చిప్ప నాకు తెలియకుండానే కదులుతోంది. లైనయితే ఎంతకీ కదలటంలేదు.
అనుమానంవచ్చిచూస్తే కొందరు తెలివైనవారు ముందువార్ని "హలో బాగున్నారా"
అంటూపలకరించి దూరిపోతున్నారు..బఫే అంటే 'క్లాసు'..చూసీ చూడనట్టు
ఊరుకోవాలి కాని అడక్కూడదు.

సెర్వింగ్ టేబిల్ దగ్గర చాలా క్రౌడ్..సర్వర్ మా ప్లేట్స్ లాక్కుని
"టిక్కూ" "టిక్కూ" అంటూ ఏవేవో వేసి ప్లేటులు చేతిలో పెట్టాడు///సంజీవనోద్ధారక
హనుమాన్ లా విజయోత్సాహంతో నిండు ప్లేటులు పైకి పట్టుకుని...జనాన్ని
గెంటుకుంటూ కొందరివతలకి వస్తుంటే., ఐటమ్ అయిపోతే మళ్ళీ అడగడానికి
దగ్గరగా ఉంటే మంచిదని అక్కడే లాగించేస్తున్నారు మరికొందరు.. కొంచెం
ఖాళీగావున్నచోట నించున్నా....నా వెనకాలే మావాళ్ళు కూడా వచ్చారు....
అలా అలా చూస్తుండగనే ఏరియా కూడా నిండిపోయింది..
ఒకాయన గులాబ్ జాం తినడానికి చెమ్చాతో కుస్తీ పడుతున్నాడు గుండ్రంగా
వున్నఆ గడుసు గులాబ్ జాం చెమ్చాబారిపడకుండా తప్పించుకుంటూ
ప్రక్కాయన ప్లేటులోకి జారింది. ఇందాక తెచ్చుకున్నది నేనుగాని
తినలేదా ఏమిటి అని ఆలోచించినవాడై కామ్ గా తినేస్తూన్న ఆయనకి
ఈయన్ని వాచ్ చేస్తున్న ఆయన శ్రీమతి కనపడింది..చక్ మని చూపు తిప్పేసు
కున్నాడీయన. డిసైడ్ అయిపోయాడు...ముందున్నది క్రోకోడైల్ ఫెస్టివల్ అని.
ఐనా కోరివచ్చిన గులాబ్ జాంని వదల లేకపోయాడు. ఒక తప్పుకి రెండు
శిక్షలుండవని తెలిసిన ఙ్ఞాని కనుక ఇంకో స్వీట్ కూడా తెచ్చుకుని వెనక్కి తిరిగి
లాగించేస్తున్నాడు.....సుగర్ స్టాకిస్టేమో పాపం ! ఏమో పాపం.
ప్రక్క...ఒకాయన ప్లేట్ పట్టుకుని కబుర్లు చెప్తూ తింటున్నాడు.. యెత్తులలో
ఉన్న తేడాలవలన ఆయన మూతి క్రిందుగా ప్రక్కాయన ప్లేటు నీటుగా అమరింది.
సదరు మూతిగలాయన ప్లేట్--దానిక్రింద వుంది..మూతికి దగ్గరలోని ప్లేట్ తనదా
లేక దూరముగా నున్నది తనదా అన్న సందిగ్ధంలో వుండగా మరో పొట్టాయన
క్రింద ప్లేట్ తన ప్లేట్ గా భావించాడో లేక అంత ఎత్తు చెయ్యెందుకు ఎత్తడం
అనుకున్నాడో అందుబాటులో వున్న ప్లేట్ తో అడ్జస్ట్ అయిపోతున్నాడు.
ఒకావిడకి తింటుంటే ఎక్కిళ్ళు...మంచినీళ్ళక్కడెక్కడున్నాయో..దగ్గరలో కనపడటం
లేదు....అటుగా వెళ్తున్న బుడతడ్ని నీళ్ళు తెచ్చిపెట్టమంది...వాడి రెండు చేతుల
లోనూ రెండు ఐస్క్రీం గిన్నెలు...మూతినిండా ఐస్క్రీం..."అమాయకురాలా...నేనెలా
తేగలను" అన్నట్టు చూసాడు సదరు బుడతడు....
అక్కడ వున్న లావుపాటి ప్రక్కింటి (ముళ్లపూడి) పిన్నిగారి భోజనం పూర్తయిందిలా
వుంది..ఎంగిలి ప్లేట్ ఎక్కడ పెట్టాలా అనుకుంటూ పెరుగుమూతితో వస్తోంది, ఎక్కిళ్ళ
అక్కయ్యగారి కాళ్ళ దగ్గరవున్న ఖాళీలో ఎంగిలి ప్లేట్ పెట్టి హస్తశుద్ధికై నిష్క్రమించింది
పెరుగుమూతి....ఎక్కిళ్ళ బాధతో స్టెప్స్ వేస్తున్న ..గారు లా.ప్ర.ము.
పిన్నిగారి ఎంగిలి ప్లేట్ లో ఉద్ధతితో స్టెప్ వేసారు... నాట్య ఉద్ధతి యొక్క
ఉధృతానికి ప్లేట్ లోవున్న పులుసుముక్కలు ఎగిరి నీట్ గా టక్ చేసుకుని అటుతిరిగి
భోంచేస్తున్న నాజూకుగారి వైట్ షర్ట్ యొక్క తెలుపుమీద అంటుకున్నాయి...
అలికిడికి ఆయన వెనక్కి తిరిగాడుకాని..ఆయనవీపు ఆయనకి కనపడదు కదా పాపం...
ప్రక్కనున్నభోజరాజు కిసుక్కున నవ్వబోయి..గబుక్కున నవ్వుకి మూతేసి,
మూతేసిన మూతితో తను గ్రహించిన విషయాన్ని నాజూకుగారికి విశదీకరించి పుణ్యం
కట్టుకున్నాడు....
నాజూకుగారి ముఖంలో కాంతి మాయమయింది. "మరకలు చేసుకు వస్తే ఊరుకొనేది
లేదు. అసలే తెల్లషర్ట్ వేసుకెళ్తున్నారు జాగ్రత్త///ఖబడ్దార్..." అంటూ జాగ్రత్తలు చెప్పి
మరీ పంపింది...నాజుకుగారి లలితాంగి. హౌ టు ఫేస్ హెర్ ..అదీ ఆయన సమస్య....

అలా అందర్నీచూస్తూ నేను పాపం చాకచక్యంగానే తింటున్నాను...ఒక్కోప్పుడు కాలం
కలసి రాదు కదండీ ? నా ప్రక్కాయన ఎడంచేయి సరిగ్గా సడన్ గా నా కుడి మోచేతికి
తగిలింది... నోట్లోకివెళ్ళవలసిన నా చెయ్యి గురితప్పి ముక్కులోకి వెళ్ళింది...రెండు
భయంకరమైన తుమ్ములొచ్చాయి..వాటి ధాటీకి ప్లేట్ సపదార్థంగా యెగిరింది...
అందులోవున్న భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయములన్నీ యెగిరి నాకూ...నా తోటివారికి
సచేల స్నానం..తుమ్ముల ధ్వనికి పిల్ల ఏడుపులు...పెద్ద నవ్వులూ కలబోసిన
నేపధ్యంలో....'వాష్ బేసిన్' దగ్గరకి పరుగెత్తా...నాట్ టు వాష్ ది బేసిన్..
నన్ను నేను వాష్ చేసుకోడానికి. నాతో సరియెంగిలి స్నానాలు చేసిన పెద్దలు
"బొత్తిగా మేనర్సు లే" వంటూ నా వెనకాల వస్తున్నారు...
రోజే మళ్ళీ డిసైడయిపోయా...బఫే లో భోజనం చేయకూడదని...
"ఆఁ ఇది కూడా వైరాగ్యమే బాబూ....ప్రసూతి వైరాగ్యం...మరేదో వైరాగ్యం లాగా "
అని మీరు అనొచ్చు. పాపం మీరు నిజం మాట్లాడుతారు.

------oooOOOooo-----

Tuesday, April 26, 2011

కనబడుట లేదు...కనబడుట లేదు...కనబడుట లేదు











"ఏడాది వయస్సు....గుండ్రటి ముఖం....నవ్వుతూ వుండడం, నవ్విస్తూ వుండడం...అప్పుడప్పుడు రామా..కృష్ణా....వనభోజనాలప్పుడు ఒకసారి వండిన అనుభవం...పిచ్చాపాటీ....ఈ పరిచయం చాలు అనుకుంటా...కనపడ్డం లేదు."
అని ఓ ప్రకటన ఈయడానికి డిసైడయిపోయా....

ఎందుకైనా మంచిదని ముందు నాకు పరిచయమైన వార్ని అడిగిచూద్దాం అని,
సురేఖ (అప్పారావు) గార్నడిగా. ఆయన "మా వీధిలో చూసానండీ" అన్నారు....
తిరిగి రాలేదు మరి ఏమైనట్టు....మా ఫ్రెండ్ ఇంకో హనుమంతరావుగార్నడిగా..
వాళ్ళ వీధిలోకి రాలేదన్నారు..

మొన్న సీతారామ కళ్యాణం నాడు వడపప్పు, పానకం టైముకి -వెరీమచ్ హియర్.
చక్కగా హనుమస్సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుని ఫోటో అడిగి తీసుకుని
ఆ తర్వాతనుంచి గైరుహాజరయితే ఏమనుకోవాలి ? కొందరు ఆ ఫోటో కూడా
చూసామన్నారు....

ఇలాంటప్పుడు జ్యోతి గారైతే మంచి సలహా ఇస్తారు..మాకు పెద్ద దిక్కు ఆవిడే...
ఆవిడ్ని మెయిల్స్ తో బాధపెట్టా...'పోలీస్ కి చెప్పమంటారా, పేపర్లలో ప్రకటనలా,
టి.విఆ...ఏంచేద్దాం...' అంటే ఆవిడ 'అదేమిటి మీ వీధిలో నాకు స్పష్టంగా కనపడుతుంటే
మీరు లేదంటారేమిటి ?'...తర్వాత ఆవిడే చెప్పారు...నా మీద కోపం వచ్చిందిట. అందుకే
నాకు కనపడకుండా అందరికీ కనపడడం...సరే సంప్రతింపులు
మొదలయ్యాయి...
ఈ మధ్య నేను యెక్కువగా తనకి పని చెప్పటం లేదట. అందువలన తాను ప్రొజెక్ట్
అవలేకపోతున్నదట..."అంటే కంప్యూటర్ కా షా టా ల లో ఇది కూడా ఒకటా" అని అడిగా....
జ్యోతి గారు నవ్వేసి "మరేమిటనుకున్నారు...ఇప్పుడు మీ రూట్ మార్చండి....
internet explorer ద్వారా కాకుండా...Firefox..ద్వారా వెళ్ళండి...తప్పిపోయిన
మీ బ్లాగు మీ ఇంటికొస్తుంది.." అన్నారు....
ఆ ప్రయత్నం ఫలించింది... నా బ్లాగు నన్ను చేరింది....
క్రొత్త క్రొత్త ఆలోచనలు కలగాలని దీవించండి....బ్లాగులో తరచూ కలుస్తాను....
ఈ విషయంలో జ్యోతివలబోజు గార్కి ప్రత్యేక కృతఙ్ఞతలు...
(వీధి అంటే బ్లాగు అని మీకీపాటికి అర్థం అయిపోయే వుంటుంది)

Tuesday, April 12, 2011

రాముడే అంతా


శ్రీ మారుతాత్మజాయనమః


రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ యంచు రేబవళ్ళు నామమును స్మరింపజాలు పూజలు జపతపాదుల ముక్తిగోర నామమే భవాబ్ధి దరింప నావ నాకు..(శ్రీ దినవహి సత్యనారాయణగారి శ్రీరామచరితమానసము )


మారుతిని చూడ మందిరానికెళ్తే స్వామి ఏడీ ? ఎందుకుంటాడు ?...


తెల్లారితే శ్రీ సీతారాముల కళ్యాణం...స్వామికెన్ని పనులెన్ని పనులు ?...


ఏ వీధిలో విన్నా రామనామమే...ఏ నోటవిన్నా శ్రీరాముని మాటే///


ఏ ఇంట చూసినా సీతా రామ కళ్యాణ సంబరమే.....ఇలాంటప్పుడు


ఆయన గుడిలో కూర్చుంటే ఎలా మరి ? ఎక్కడ రామ కీర్తన జరిగితే


అక్కడనే హనుమ తాండవం...కదా ?



శ్రీరామనామ జపసారమెరిగినవాడు కాశికాపురినిలయుడు...శ్రీ రామ సాన్నిహిత్యానికై శివాంశతో హనుమ జన్మించాడు// హనుమను పట్టుకుంటే శ్రీరాముడు దొరుకుతాడు..ఈయన్నేలాగ పట్టడం ?


కాశీనగరంలో గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసెడివారట. ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదాట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై "ఏమైనా అడుగు ఇస్తాను" అంది..మహాభక్తుడు తులసీదాసు శ్రీరామ దర్శనం కోరారు...ఆపని తనవల్లకాదంది కాని ఉపాయం చెప్పిందాభూతం...నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. ..అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు..కన్నులనీరు కారుతూవుండగా ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు...అతన్ని పట్టుకో...అంది భూతం..శ్రీరాముడు కావాలంటే హనుమను పట్టాలి..హనుమను పట్టాలంటే భక్తితో శ్రీరామగానం చేయాలి...హనుమ సాయంతో శ్రీరామదర్శనమైంది గోస్వామికి.


తులసీదాస కృత శ్రీరామచరిత మానస్ కృతిలో శివుని వల్ల శ్రీరామ కథను అమ్మ పార్వతి వింటుంది...శ్రీరాముని బాల్యలీలలు చూడ ముచ్చటపడి తాను మనుష్యరూపంలో అయోధ్యలో చరించానంటాడు ఆ కైలాసవాసి...ఆ తారకమంత్రాన్ని భవానికి ఉపదేశించాడు భవుడు.


రామాయణగాధ అంతా యఙ్ఞమయం...శ్రీరామజననానికి అశ్వమేధం..పుత్రకామేష్టి అలా ప్రారంభమై..విశ్వామిత్రుడు రామలక్ష్మణ రక్షణలో సిద్ధాశ్రమంలో చేసిన యఙ్ఞం, జనకుని యఙ్ఞం..అలా ఒకదానితర్వాత ఒకటి...ఒక ఋషిమండలి తర్వాత ఒక ఋషి మండలి.... అదీ రామాయణ క్రమం....ఎంతోమంది శ్రీరామ దర్శనంకోసం ఎదురు చూస్తున్నారు..శబరి, అహల్య ఎందరెందరో..వారందరినీ తరింపచేయటానికి కోదండ రాముని వనవాసలీల.


రామాయణ గాథ అందరికీ తెలుసు///చివరికీ ఏమవుతోందనన్న ఏ ఉత్కంఠా లేదు...అయినా అంత శ్రద్ధగానూ వింటాము..అంత రుచిగానూ వింటాము..."శ్రీరామ! నీనామ మెంతో రుచిరా.." ..."మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి..."..ఎన్ని రుచులు చెప్పారు రామదాసుగారు..."నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా" అంటారుశ్రీ త్యాగయ్య...శ్రీరాముడు మనకు ఆదర్శం...శ్రీరామకథ మనకు ఆరాధ్యం...


శ్రీరామనవమి శుభసమయాన శ్రీరామ భక్తులైన మీ అందరికీ శుభాకాంక్షలు.

Friday, April 8, 2011

దండల నిగ్గు


చిన్న కాంట్రాక్టర్: "మీకు నేనో దండేద్దామనుకుంటున్నాను..ఎంతవుద్ది ?"

పెద్దకాంట్రాక్టర్: "దాని సిగ తరగ అనుకోవడానికేమవుద్ది..ఏమీ కాదు"

చి.కాం: ఏసాననుకోండి ఎంతవుద్ది ?"

పె.కాం: ఓస్ అంతేనా?

చి.కాం: దండ కాదండి శాలువా కప్పేమనుకోండి. ఎంతవుద్ది ?

పె.కాం: అంతేనా?

చి.కాం.: సన్మానమే చేసేసామనుకోండి..ఎంతవుద్ది?

పె.కాం. ఓస్ అంతేనా?

చి.కాం. పూల కిరీటం...సమ్మానపత్రం..సన్నాయికూడా పెట్టామనుకోండి ఎంతవుద్ది?

పె.కాం. ఓస్..అంతేనా?

చి.కాం. అంతేనా అంటే ఇంకా చాలా వున్నాయండి..ముందు వీటి రేటు తేల్చండి.. దండ కెంతవుద్ది, శాలువా కెంతవుద్ది, సమ్మానానికెంతవుద్ది.

సమ్మానానికి సన్నాయికి యెంతవుద్ది..

దండకి శాలువాకి యెంతవుద్ది

శాలువకీ సన్మానానికెంతవుద్ది.

పుటోగ్రఫి..ఈడియో కలిపి యెంతవుద్ది....

లేకుండా యెంతవుద్ది.

పుటోగ్రఫికి సన్మానానికెంతవుద్ది..

పుటోగ్రఫీకి దండకీ యెంతవుద్ది.

కన్సీషన్ యేమైనావుందా.మీకూ నాకూ ఈ

యిసయంలో కాంప్రమైజేషన్ కుదిరితే

మా ఊరి సన్మాన సంఘాలన్నిటిని హోలు మొత్తంగా మీ చేతిలో పెట్తాను..

పె.కాం. ఇది అంత అర్రీ బుర్రీగా తేలే ఇసయంకాదు...

రేటు లిష్టు చూసి చెప్పాల

మా సెగట్రీ చెప్తాడండి...సెగట్రీ.......

అలో అలో అలో గుర్నాథంగారా.....


(ముళ్లపూడి రమణీయం కార్యక్రమంలో హాసం క్లబ్ లో ప్రదర్శింపబడిన స్కిట్.... నేను వ్రాసి శ్రీ నూజెళ్ళతో కలసి ప్రదర్శించాను.....ముత్యాల ముగ్గు పేరడి...మీరు కనిపెట్టేసారు.మీటేస్టే వేరు మాష్టారూ....)

(అదీ తెలిసిపోయిందా ...నిజమే ఆ ఫోటో అప్పటిదే)