
శ్రీ రామచంద్రుడు దుష్ట సంహారము అయ్యాక సీతా సమేతుడై అయోధ్య చేరాడు. పట్టాభిషిక్తుడయ్యాడు..వనవాసకాలంలో పరిచయమైన తపోధనులకు కృతఙ్ఞతలు తెలపాలని జానకీ మాత సంకల్పించింది. సర్వాంతర్యామి..."సరే" అన్నాడు...ఏర్పాట్లు చక చకా జరిగిపోయాయి...అంతా తానై నిర్వహిస్తున్నాడు హనుమ......ఆ రోజు రానే వచ్చింది. శ్రీ రాముని దర్శించవచ్చునన్న కుతూహలం...ముని జనుల కోలాహలం....తపోవనం తరలివచ్చింది. ఋషులందరూ మాధ్యాహ్నిక సంధ్యావందనాదులకు సరయూనదికి తరలారు.
హనుమ వుత్సాహంగా అంతటా కలయ తిరుగుతున్నాడు....నదికి వెళ్ళిన ఋషి మండలి రాలేదు...కాలంగడుస్తున్నది...అమ్మ దృష్టి హనుమ పైననే....పుత్రవాత్సల్యము...
"ఇంకా మునిబృందము రాలేదు..వేళ మించుతున్నది...ఈ పసివానికి ఆకలౌతున్నదేమో..ముందు ఇతనికి భోజనం పెట్టేయనా" అని తర్కించుకుంటూ రాఘవుని అడిగింది..."సరే"అన్నాడు మృదుభాషి.....
"హనుమా!అన్నం పెట్టనా అమ్మా!" అంది సీతమ్మ. అమ్మ అడిగితే కాదనగలడా హనుమ...వెంటనే వచ్చి కూర్చున్నాడు. అమ్మ స్వయంగా వడ్డిస్తున్నది...హనుమ తింటున్నాడు...అమ్మ పెడ్తోంది, ఇతడు తింటున్నాడు...అన్నపురాసులు తరిగిపోతున్నాయి.అమ్మ పెట్తోంది...హనుమ తింటున్నాడు. అయ్యో ఇతని ఆకలి తీరటంలేదే అని అమ్మ కంగారు పడ్తోంది.అమ్మ పెట్తోంది కదా అని తింటున్నాడు హనుమ...మెండుగా వండిన పదార్థాలు నిండుకుంటున్నాయి...చాలు అని అతను అనడం లేదు...బిడ్డకు ఆకలి తీరడంలేదు అని గాభరా పడి శ్రీరాముని దగ్గరకు వెళ్ళి జానకి చెప్పింది
అది శివస్వరూపం...నువ్వుఎంత పెట్టినా ఆతడు వద్దనడు...లేవమని వినయంగా చెప్పు"అన్నాడు కోదండపాణి. "హనుమా! ఇక లేస్తావా నాయనా!" అమ్మ అనగానే సంతృప్తిగా త్రేన్చి "అలాగే తల్లీ!" అని లేచాడు హనుమ..
(నేను పిల్లవాడిగా వున్నప్పుడు..పిల్లల పత్రిక చందమామ లోచదివాను: గుర్తుతో వ్రాసినది కనుక యథాతధంగా వుండదు...) *****
శ్రీరాముడు అవతరిస్తున్నాడని తెలిసి తానూ హనుమగా అవతరించాడుపరమేశ్వరుడు...నేనూ వస్తానందిట ఆదిశక్తి...నువ్వెందుకు తోకలాగఅన్నాడట...సాంబశివుడు. అయితే తోకగానే వస్తానందిట...అందుకేహనుమద్వాలం అంత శక్తి సమన్వితం.
తులసీదాసు తన రామచరిత మానసంలో శివుడి రామభక్తి అద్భుతంగా ఆవిష్కరిస్తారు.
******
హనుమ సముద్రం దాటే సమయంలో వానరులతో--మనోవేగంతో శ్రీరామ బాణంలా దూసుకుపోతానంటాడు...సుందరకాండ ప్రారంభంలో...సాధనామార్గంలో ప్రవేశించేవారికి ఇంద్రియ జయంఅవసరం.అందుకే మైనాకుడిచ్చే ఆతిథ్యం సున్నితంగా తిరస్కరించాడు....సురసామాతపెట్టిన పరీక్షను బుద్ధితో గెలిచాడు...ఛాయాగ్రాహికి వజ్రఘాతం రుచి చూపాడు...రావణపాలిత లంకా నగరాన్ని...రామదూతగాప్రవేశించి ఒక వానరశ్రేష్టుడు....శ్రీరామ విజయానికి నాందీ ప్రస్తావన చేసాడు..
ఒకసారి వానరులంతా బంతిభోజనాలు చేస్తున్నారట. విస్తట్లో ఉస్తికాయలువడ్డింపబడ్డాయి...అవి వంకాయ పోలికలో రేగిపండుసైజులో వుంటాయి.అది పట్టుకొని ఒక వానరం తినబోతే పట్టుజారి పైకి యెగిరింది..అది చూసినఆ కోతి తనుకూడా చిన్నగా యెగిరింది...దాని ప్రక్కనవున్న మరోకోతిఇంకొంచెం యెగిరింది..అలాఒకదాన్ని చూసి మరొకటి, మరొకదాన్ని చూసిమరొకటీ....అందర్నీ చూసిన హనుమ తానూ వినయంగా కొంచెం యెగిరి కూర్చున్నాడట. సభామర్యాద కోసం..(ఇదీ పాత చందమామల్లోనే చదివా)
లంకలో సీతమ్మను చూసిన హనుమ, అమ్మకు ధైర్యం చెప్తాడు.".శ్రీరాముడువస్తాడమ్మా నీ చెర విడిపిస్తాడు" అంటాడు...అంతావిన్న సీతమ్మకు సందేహంకలుగుతుంది..."గరుత్మంతునితో సమానమైన నీవంటే శతయోజనవిస్తీర్ణమైనసాగరాన్ని దాటి వచ్చావు...మిగతా వానర సైన్యం అలా రాగలరా" అంటే "సుగ్రీవ సైన్యంలో నాతో సమానులైనవారు, నన్ను మించినవారేనమ్మాఅందరూ...నాకన్నా తక్కువవాడొక్కడు లేడమ్మా.."అంటాడు. "ఇలాంటి దూతకార్యాలకు నాలాంటి సామాన్యులను పంపిస్తారుకాని అధికుల్ని పంపరుకదమ్మా..." అదీ హనుమ వినయసంపద..
రామరావణ యుద్ధం జరుగుతుండగా ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతోరామ లక్ష్మణ సహా అందరూ మూర్ఛిల్లుతారు..ఆ రాక్షసమాయ విభీషణునియేమీ చేయదు..బ్రహ్మానుగ్రహము వలన హనుమనూ యేమీ చేయదు...ఆ పరిస్థితులలో యెవరు యెలా వున్నారో చూడాలని వీరిరువురూయుద్ధభూమిలో పరిశీలిస్తారు...వందలాదిగా తగిలిన బాణాల ధాటికిజాంబవంతుడు బాగా గాయపడి, మూలుగుతూ కనపడతాడు...."అయ్యా!ప్రాణాలతో వున్నావా?" అని పలకరిస్తాడు విభీషణుడు...అతని స్వరాన్నిబట్టి విభీషణుని గుర్తించిన జాంబవంతుడు---హనుమంతుడు జీవించియేవున్నాడు కదా?--అంటాడు. దానికి విభీషణుడు "రామలక్ష్మణుల సహాఇంతమంది వుండగా హనుమ క్షేమమడుగుతావేమిటి" అంటే దానికిజాంబవంతుడు---
తస్మిన్ జీవతి వీరే తు హత మప్యహతం
బలమ్హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోపి వయం హతాః----
హనుమంతుడొక్కడు జీవించివుంటే మనసేనలన్నీ మృతులైనా బ్రతికున్నట్టేఅలా కాకుండా అతడు విగత జీవుడైతే మనం బ్రతికున్నా నిర్జీవులమే" అంటాడు.అదీ హనుమ శక్తి...
అందువలననే అనితరసాధ్యమైన లంకా నగరాన్ని చేరి, సీతమ్మను చూసి,రావణబలాన్ని అంచనా వేసి, తిరిగి వచ్చి శ్రీ రామునికి సీతమ్మక్షేమం చెప్పినహనుమను చూసి...ఇంత మహోపకారము చేసిన నీకివ్వడానికి నాదగ్గరయేముందయ్యా నా కౌగిలింత తప్ప అని అక్కునజేర్చుకున్నాడు ఆజానుబాహుడు.సీతమ్మకు తక్క అన్యులకు లభ్యముకాని ఆ పరిష్వంగ భాగ్యం హనుమయ్యకుమాత్రమే లభించింది.
బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతాఅజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్స్మరణాద్భవేత్
(మార్గశీర్ష శుద్ధ త్రయోదశి అంటే రేపు(19.12.10) హనుమద్ర్వతం.)