Pages

Friday, December 10, 2010

హాస్య భాషణలు వారి నోటనే


బారిష్టర్ పార్వతీశం' నవల నాటకంగా రేడియోలోధారావాహికంగా వచ్చింది.. బారిష్టర్ కోర్సు చదవడానికి పార్వతీశం లండన్ వెళ్తాడు..కూడా రుబ్బురోలుతో సహా అన్నీ పట్టుకు వెళ్తాడు...ఓడలో ప్రయాణం...ముందు తనవూరినుంచి రైల్లో బయలుదేరతాడు...పట్టుకు వెళ్ళిన మడతమంచం యెక్కడ పెట్టాలా అని ఆలోచించి..అలారమ్ చైన్ కు తగిలిస్తాడు కష్టపడి..రైలాగిపోతుంది. గార్డుగారుపరుగెట్టుకొస్తారు..."ఎవరిదీ మంచం?"..పార్వతీశంఆ మంచం తీయడు,సరికదా "ఏం? అంత బాగుందేమిటి?" అంటాడు. ఈ ఆఖరి మాట పాత్రధారి శ్రీ నండూరి సుబ్బారావు గారి స్వరంలో ఎంత హాస్యభరితంగావుందో మరవలేం...ఈ హాస్యభరిత నవలారచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గార్ని ఒక సభలో సన్మానిస్తూ 'వీరి రచనలు చాలా హాస్యాస్పదంగా వుంటా' యన్నారుట.రాజమండ్రీ గౌతమీగ్రంధాలయంలో జరిగిన సభలో అనుకుంటా వారుఈవిషయం నవ్వుతూ చెప్పారు.

రాజమండ్రీలో 1962 లో అని గుర్తు..తెలుగురచయితల సభలుజరిగాయి..మా నాన్నగారికి ఆహ్వానం వచ్చింది..వారితో నన్నూతీసుకువెళ్ళారు...గొప్పగొప్ప రచయితలను చూసే అదృష్టం కలిగింది.సర్వశ్రీ విశ్వనాధ,వెంపరాల, మునిమాణిక్యం, నోరి నరసింహశాస్త్రి, గిడుగు, మొక్కపాటి,, బెజవాడ గోపాలరెడ్డి..మొదలైనవారు చాలామంది వచ్చారు...ఓ రోజు మునిమాణిక్యంగారు మాట్లాడారు.
"నేను ఈ నెల జీతం అలవాటు ప్రకారము మా ఆవిడకి యిచ్చాను. లెక్క చూసుకుని 'ఏమండీ? ఈ నెల తక్కువ యిచ్చారేమండీ?" అంది. "వాళ్ళు తీసుకున్నారే" అన్నా. "ఎవరండీ?" అంది. "అదేనే, ఆఫీసువాళ్ళు" అన్నా. "ఎందుకండీ?""యుద్ధం చేస్తున్నారు కదా? అందుకని." "ఎవరు చేస్తున్నారు ? ఎవరితోచేస్తున్నారు?దానికీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏమిటి సంబంధం?" అని ఆరా తీయసాగింది."అదేనోయ్!
మన దేశం వాళ్ళు చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా? మరి ఖర్చవుతుందికదా?" అని వివరించా. "అంత పెద్దదేశం చైనా వాళ్ళతో మనవాళ్ళు యుద్ధం చేస్తారా? దానికి ఖర్చవుతుందా? అందుకని మీ జీతం కోస్తారా?" అన్నింటికీ అవునంటూ బుర్ర వూపా...అప్పుడు
మా ఆవిడ "యుద్ధం చేయడానికి డబ్బుల్లేకపోతే మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టడమెందుకండీ...అంత డబ్బుల్లేని వెర్రిముండా గవర్నమెంట్
యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమిటిట?" మా ఆవిడ లాజిక్ కి అవాక్కయి- ఇదిగో ఇలా వచ్చేసా!" అని హర్షధ్వానాలమధ్య ముగించారు.

ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారు వారి చివరిరోజులలో జన్మస్థలమైన రాజమండ్రి వచ్చేసారు.అదే మా ఊరు కూడా. వార్ని మా హాసం క్లబ్ వార్షికోత్సవానికి అతిథిగా వుండ కోరుతూ వారి అనుమతికై వారింటికి వెళ్ళాము. 'స్నానం చేస్తున్నారు,కూర్చోండి'అని ఆహ్వానించారు వారి శ్రీమతి...ఉదయం 11-30 దాటుతోంది...ఈలోగా రా.కృ.గారు వచ్చారు. వస్తూనే...'నేను అన్ని పేపర్లూ చదివేటప్పటికి ఈ టైమవుతుంది. రోజూ పేపర్లు చదివాకనే స్నానం చేస్తా..ముందు చెయ్యను..'. మా Q మార్కు ముఖాలు చూసి...'అవునండీ..ఆ పేపర్లనిండా చావు కబుర్లేకదండీ మరి'..చిరునవ్వుతో చెప్పారు. మాకు మాత్రం నవ్వు ఆగలేదు. .
వీరి తండ్రిగారు హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారు.మనిషి కొంచెం సీరియస్ గా వుండేవారట...జోక్ వేసినప్పుడు కూడా అంతే. పైగాజోక్ వేసేవాడు జోక్ వేస్తూ నవ్వితే, వడ్డించేవాళ్ళు ఒక చేత్తో తింటూ వడ్డించినట్టు వుంటుందంటారుశ్రీ రావుగారు.
రా.కృ.గారు కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఒకసారి మునిమాణిక్యం వారు వీరింటికి వచ్చారట. టీచర్ ట్రైనింగు శ్రీ ము.నగారు
రాజమండ్రిలో చేసారు. ముందు గదిలో శ్రీ కా.గారూ ఈయనా ఏదో ముచ్చటించుకుంటున్నారు. మధ్యలోము.న.గారు బయటికి వెళ్ళబోయారుట...అప్పుడు కా.గారు వార్ని వారిస్తూ...'మేష్టారూ! మీరు సిగరెట్లకోసం అయితే వెళ్ళకండి'అన్నారు. ఆయనకు సిగరెట్
అలవాటు. 'వుండండి చెప్తాను' అని 'కృష్ణా! మేష్టారికి నీదగ్గర సిగరెట్టు ఒకటి యియ్యరా!' అని కొడుకునడిగారట రావుగారు.
'అయ్యో అలా అడిగేసారు అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో అని న.గారంటే 'అబ్బే!ఎందుకనుకుంటాడు. ఈ మధ్య..జామాకులు
అవీ నమలుతున్నాడు.' అన్నారటహాస్యబ్రహ్మ...ఈ విషయం చెప్పి'నాన్నగారి అబ్సర్వేషన్ అమోఘము.'అని తండ్రిని తలచుకున్నారు
రా.కృ గారు. రా.కృ.గారుతర్వాత మానేసారట పాపం, యేమిటీ సిగరెట్సా ? కాదట!..మరీ?...జామాకులుతినడం...
రంగస్థలంనుండి వచ్చిన ఈ నాటి నటులు చాలామంది రా.కృగారు కాని భ.కా.గారు కాని వ్రాసిన నాటికలతోనే నటప్రవేశము చేస్తూవుంటారు అనడం అతిశయోక్తి కాదు. తాను వ్రాసిన 'కీర్తిశేషులు'నాటకానికి ఉత్తమ రచనబహుమతి వచ్చిందని తండ్రిగార్కి చెప్తే...'ఒహో!
నీకన్నాచెత్తగా వ్రాసే రచయితలున్నారన్నమాట.' అన్నారట ఆయన. పిల్లల్ని ప్రత్యక్షంగా పొగడరు కొందరు తండ్రులు..
రా.కృ.గార్కి లెక్కలు ఇంట్రెస్ట్. ఆ అభిమానంతోనే లెక్కల్లో కృషి చేసారు..తెలుగు అక్షరాలలో అ మొదలుకుని క్ష వరకూ గుణింతాలు, ద్విత్వాలు,సంయుక్తాలు అన్నింటికి సంఖ్యలు ఇచ్చుకుంటూ వస్తే, క్ష పూర్తయ్యేసరికి మొత్తం 29 లక్షలు అయిందట...
వాటి ఆధారంగా మన పేరుని విశ్లేషించి భవిషత్ చెప్పేవారు రా.కృగారు..ఎందరో సినీమా వారికికూడా చెప్పారు...
మన వ్యావహారిక నామాలు కాకతాళీయంకాదని అవి భగవన్నిర్ణయాలు అంటారు రా.కృ గారు. వీరు సినీమాలకు రచనలు చేసినా ..ఆ సినీమాలోక ప్రభావం తనవారిమీద పడనీయలేదు....ఓ సారి వీరి ఇంటజరిగిన ఓ శుభకార్యానికి మహానటి భానుమతిగార్ని పిలిచారట.
ఏవో కారణాలవలన ఆమె రాలేక పోయి..తర్వాత వీరింటికి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. వీరి శ్రీమతి తలుపు తీసి
'కూర్చోండి వస్తారు' అని 'ఎవరు వచ్చారు అని చెప్పను'అని అడిగారట..తనను తెలియనివారు తెలుగునేల వుండరు అన్న తన
నమ్మకం ఈ రోజు వమ్మైంది అని రా.కృ గారితోభానుమతిగారు అన్నారట. గత మాసంలో శ్రీ రాధాకృష్ణగారి జయంతి.

హైదరాబాదులో వున్నప్పుడు ఓ ఉగాదినాడు శ్రీ దివాకర్ల వెంకటావధానిగార్కి పండితసన్మానం చేసారు..నిర్వాహకులు వారిని ఆహ్వానిస్తూ శ్రీ అవధానిగార్నిపుంభావ సరస్వతిగా ప్రస్తావించారు...వీరు మాట్లాడుతూ "ఇలాగేనండి..చాలామంది నన్ను పురుషాకృతి దాల్చిన సరస్వతీ దేవిగా సంభావిస్తారు.సంగీతం, సాహిత్యం అమ్మవారికి స్తనద్వయమండి...పురుషాకృతిలో వాటికి అభావంకదండీ..అంచేత వీరు చెప్పేది నా పట్ల నిజమే అనిపిస్తుందండి...సంగీతం,సాహిత్యం నాకు యేం వచ్చండి మరి?" నిర్వాహకులను నిరుత్సాహపరచకుండా తర్వాత మరల సర్ది చెప్పారనుకోండి.



4 comments:

astrojoyd said...

keka

మిస్సన్న said...

గురువుగారూ రాధాకృష్ణగారి చతురోక్తులు భలే గుర్తు చేసారు. ఆయనింకా అన్నారు:మునిమాణిక్యం గారు
అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో అని అంటే వాళ్ళ నాన్నగారు అన్నారట 'ఏం వాడు నాజేబులోని నాడబ్బుల్తో సిగరెట్లు కొని తాగుతోంటే నేనొకటి అడగడం తప్పా' అని. అలాగే జామాకులు నమలడం మానేసానని ఇంకా చతురోక్తిగా ఇలా చెప్పారు: 'ఆనాటినుంచి ఈనాటిదాకా మళ్ళీ నేను ముట్టుకొంటే ఒట్టు' అని, అందరం పాపం సిగరెట్లు మానేసారేమో అనుకునేంతలో ఆయన టక్కున 'జామాకులు' అని అందర్నీ కడుపుబ్బా నవ్వించారు.

హనుమంత రావు said...

astrojoyd గార్కి, మీ కేక కెలాగ ప్రతిధ్వనించాలో
తెలియటంలేదు...థాంక్స్......

మిస్సన్నగారు, నిజమే! నా డబ్బులతో....ఇప్పుడు
గుర్తొచ్చింది...వయస్సు కొంచెం యిబ్బంది పెడ్తుంది.
చూసీ చూడనట్టు వదిలేయ్ కాని మంచి విషయాలు
చెప్పడం మానొద్దు...చాలా చాలా థాంక్స్.

బులుసు సుబ్రహ్మణ్యం said...

బాగుందండి మీ కవితా గోష్టి. భమిడిపాటి కామేశ్వర రావు గారి,మునిమాణిక్యం గారి చతురోక్తులు చాలానే విన్నాము. ఎప్పుడు విన్నా,ఎన్ని మాట్లు విన్నా నిత్య నూతనంగా ఉంటాయి. మొదటి మాటు విన్నంత నవ్వూ తెప్పిస్తాయి. తెలుగు వాడు చేసుకొన్న అదృష్టం భమిడిపాటి,మునిమాణిక్యం, ముళ్ళపూడి.

థాంక్యూ, మంచి గా నవ్వించినందుకు.