పద్మ: వదిన గారూ..ఏవో యాత్రలట, క్యాంపులట యెపుడు వచ్చారు. ఏ యే చోట్లకు వెళ్ళారు..ఏమిటి విశేషాలు...చెప్పండి--చెప్పండి...
శారద: వరుసగా ప్రశ్నలేమిటి వదినా..రండి..ముందు కూర్చోండి అన్నీ చెప్తా!
పద్మ: చెప్పండి మరి..
శారద: రామేశ్వరము వెళ్ళామొదినా...అక్కడనుంచి కన్యాకుమారి వెళ్ళాము. వచ్చేటపుడు దారే కదా అని తిరుపతికూడా వెళ్ళి వచ్చాము.
పద్మ: ఢిల్లీ కూడా వెళ్ళారని విన్నాను.
శారద: అది రెండు నెలల క్రింద వెళ్ళామొదినా!
పద్మ: వదినగారు బాగానే వెళ్ళి వచ్చారు...రామలింగేశ్వరుణ్ణి చూసారన్నమాట! దర్శనం బాగా అయిందా? ఏమన్నా కొన్నారా?
శారద: దేముడినెక్కడ వదినా? లోపలెక్కడో చీకటిలో గర్భగుడిలో సరిగా కనపడనే కనపడడు...కాని అక్కడ ఆల్చిప్పలూ, గవ్వలూ చాలా బాగున్నాయి. వదినా ఊరుగాయల సీజనులో పనికొస్తాయని ఓ నాలుగు డజన్లు పట్టుకొచ్చా! మాగాయకాయ గీసుకోవడం కష్టమౌతోంది కదా?
పద్మ: మరి రామేశ్వరంలో కారిడార్స్ చూసారా వదినగారూ ? వాటికి ప్రపంచంలోనే గొప్ప పేరుందికదా?
శారద: నాకు కనపళ్ళేదు వదినా--ఆ వేళ శలవేమో? అన్నట్టు శంఖాలు కొన్ననొదినా! మనవాళ్ళందరి పేర్లూ వేయించా..మీక్కూడా తెచ్చా..యిస్తా!
పద్మ: వదినగారూ కన్యాకుమారిలో సూర్యోదయం చూసారా? అద్భుతమని విన్నాను.
శారద: ఈ మధ్య సూర్యోదయం మరీ యర్లీగా అయిపోతోంది వదినా..మేం నిద్ర లేచేసరికి బాగా పైకి వెళ్ళిపోయాడు ఆయనగారు.
పద్మ: అస్తమయం చూసారా? సముద్రంలోకి జారుతున్న సూర్యబింబందృశ్యం ఓ వింత అనుభూతినిస్తుందికదా?
శారద: చూద్దామనే అనుకున్నానొదినా! కాని ఆ వూళ్ళో ఋషికపూర్ చేసిన 'బాబీ' సినీమా ఆడుతోంది..ఆ వేళ ఆఖరి రోజట. మేం భలే లక్కీ...నాకు ఆ సినీమా భలే యిష్టం..దానికి వెళ్ళాం వదినా!
పద్మ: సరేలెండి వదినగారు...ఢిల్లీ వెళ్ళానన్నారు కదా..ఆగ్రా కూడా వెళ్ళారా? తాజ్ మహల్ చూసేవుంటారు.
శారద: ఆగ్రా వెళ్ళానొదినా! అక్కడ తాజ్ మహల్ కు వెళ్ళేదారిలో అప్పడాలు,పూరీలు వత్తడానికి పాలరాతి పీటలు ..
యెంత బాగున్నాయో..మనవాళ్ళకి వుపయోగమని రెండు డజన్లు పుచ్చుకున్నాను...అమాన్ దస్తాలు పాలరాతివి...
బుజ్జిముండలు... యెంత ముద్దొస్తున్నాయో... కావాలంటే అదికూడా ఒకటి యిస్తాలే...యింకా కొందును వొదినా...
లగేజీ యెక్కువయిపోతోందంటూ మీ అన్నయ్యగారు ఒకటే గొడవ.
పద్మ: మరి ప్రపంచ వింత తాజ్ మహల్ చూడలేదా?
శారద:ఏదీ? మేము యింకా షాపింగు చేస్తుండగానే టూరిస్టు బస్సు వాడు"టైమయిపోయిం" దంటూ విజిల్ వేసేసాడు
వదినా..ఇంకేం చూస్తాం తాజ్ మహల్...అసలు షాపింగే పూర్తవలేదు...అయినా తాజ్ మహల్ చూడాలంటే ఆగ్రాయే
వెళ్ళాలావదినా...మన పిచ్చిగాని...మన వంటింటిలో టీ ప్యాకెట్టు మీద రోజూ చూస్తూనే వుంటాంగా "తాజ్ మహల్ "
పద్మ:ఆఁ!...అవును స్మీ! ! !
౦౦౦~~~౦౦౦
(నేను వ్రాసిన ఈ స్కిట్టు "హాసం" క్లబ్ కార్యక్రమాల్లో రాజమండ్రిలోనూ,
యితర చోట్లాచాలాసార్లు ప్రదర్శించబడింది. అందరూ నచ్చిందన్నారు మరి.)
8 comments:
:)
Chala bagundi andi ..ee article
విజయగార్కి, శరత్ గార్కి,
నా బ్లాగు పట్ల సంతోషం ప్రకటించిన
మీకు చాలా చాలా థాంక్స్.
మాకు కూడా ఇల్లాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. ఎవరికి చెప్పుకోలేము. నవ్వుతారని భయం. మీరు ఎంచక్కగా ఓ నాటికే వ్రాసేశారు. నన్ను చూసి కాదు కదా.
బాగుందండీ మీ కధనం.
సుబ్రహ్మణ్యంగార్కి:
"నవ్వుతారని భయం"..ఈ మాటకు పేటెంటు
నాదీ, నాబోటులది..మీరు వాడకూడదు......
మీ ప్రోత్సాహానికి కృతఙ్ఞుడ...
CHALA BAGUNDHI MASTARU. MEERU ILANE MEE HASYA RACHANALATHO NAVVISTHU UNDALANI MAA KORIKA.
పాతబడిన పోస్ట్ అయినా ఎంతో ప్రేమతో మీరు చూసి అభినందించారు.. చాలా సంతోషము.. మీరు సూచించిన ప్రకారము మరలమరల వ్రాస్తాను, మీ బోంట్లు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే....
పాతబడిన పోస్ట్ అయినా ఎంతో ప్రేమతో మీరు చూసి అభినందించారు.. చాలా సంతోషము.. మీరు సూచించిన ప్రకారము మరలమరల వ్రాస్తాను, మీ బోంట్లు ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే....
Post a Comment