Pages

Thursday, January 13, 2011

సంక్రాంతి పండుగ ... నాడూ నేడూ

కృష్ణార్పణం...


నాడు.... ప్రభాతాన హరిదాసు పాటలు
శ్రీహరి నామ సంకీర్తనలు
నేడు మారిన అలవాటులు
నోరు పెగలని వింత ఆలాపనలు.

అప్పటి... వాలుజడల వయ్యారాలు
తీరుగా అమరిన ముద్ద బంతి పువ్వులు
ఇప్పటి కట్టడి లేని కురుల సోయగాలు
చోటు కానని పూబాల దీనవదనాలు

నాడు పట్టుపరికిణీలలో మొగ్గలైన సిగ్గులు
కొత్త అల్లుళ్ళ కొంటె చూపుల చిలిపి అల్లర్లు
నేడు జీన్స్ నాగరికతలో బిగిసిన అందాలు
గ"మ్మత్తు"గా ఊగించే పాప్ సంగీతాలు

ఆనాడు ముంగిట దిద్దిన రంగుల రంగవల్లులు
శుభ స్వాగతాలు పలికే పచ్చ తోరణాలు
ఈనాడు ఆగంతకుల వివరాలు నమోదు చేసే సెల్లార్ లు
లోపలికి అనుమతించే రక్షక ప్రతినిధులు

అప్పుడు పసుపు గడపలు
ముత్యాల లోగిళ్ళు
ఇప్పుడు గడపల అడ్డాలే లేని
అప్పార్టుమెంటు వాటాలు

ఆ సిరులు పొంగే పాల పొంగళ్ళు
బామ్మ చేతి సున్నుండల ఘుమఘుమలు
మరి మరో సీమనుండి దిగిన బర్గర్లూ పిజ్జాలు
ఊదుకుంటూ దిగమ్రింగే నూడుల్స్ మషాలాలు

ఙ్ఞాపకాలలో లయ తప్పని గొబ్బిళ్ళ పాటలు
ముచ్చటలు వెలిగే భోగి మంటలు
వాస్తవములో నగరపు సెంటరులో పెత్తందారు ప్రగల్భాలు
నడి బొడ్డులో రగిలే టైరు వాసనల చలిమంటలు

ఆనాటి క్రమంతప్పని సంక్రాంతి సంబరాలు
తెలుగింటి సంస్కృతికి నిలువెత్తు దర్పణాలు
ఇక అవి కాలంలో కలసిన ఙ్ఞాపకాలు
తెలుగునాట ఆ సంస్కృతి మరి ఇప్పుడు............
కృష్ణార్పణం


(స్థానిక దినపత్రిక "సమాచారం"లో ప్రచురితమయినది.)

4 comments:

మిస్సన్న said...

గురువుగారూ నాటి మన మధురమైన అనుభవాలు ఈనాటి తరం వారికి లేకపోవడం చాల బాధాకరం. కాలధర్మం. మీ విశ్లేషణ చాలా బావుంది.

బులుసు సుబ్రహ్మణ్యం said...

గతం మర్చిపోలేక, ప్రస్తుతం లో ఇమడలేక అప్పుడప్పుడు అయ్యో ఎక్కడికి వెళుతున్నాం అనుకుంటాం. అప్పుడెప్పుడో సి.నా.రె గారు అన్నారు.
.........
గొర్రెలా తలవంచుకు పోయే మనిషికి
కొత్తరకం కుదుపులు పండగలు
స్తబ్దంగా ముడుచుకున్న సంఘానికి
చలిమంటల చిదుకులు పండగలు
పండగలు కడుపు నింపుకోడానికే కాదు
గుండెల్ని ఉతికి ఆరెయ్యడానికి
ఆశయాల వాసాలకు పట్టుకున్న బూజును
ఆంగణం అవతలికి విసిరి పారెయ్యడానికి.
...........

we move on

మైత్రేయి said...

సుబ్రమణ్యం గారి వాఖ్య, సినారె గారి కవిత చదివి ఇక్కడకు పరిగెత్తుకు వచ్చానండి. చక్కటి కవిత దొరికింది.
ఏదో తంటాలు పడుతూ సిటీల్లోకూడా కొందరు పండగలు చేస్తున్నారు లేండి. సినారే గారు చెప్పినట్లు రొటీన్ గొర్రె బతుకులకు కొద్ది కుదుపులు పండగలు.
మీరు ఇచ్చిన పోలికలు అద్దినట్లుగాఉన్నాయి.
సుబ్రమణ్యంగారు, వీలైతే సినారె గారి పూర్తి కవిత మాతో పంచుకోరూ..

జ్యోతి said...

హనుమంత్ రావుగారు,

హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు..