"హలో రావుగారూ! చాలా కాలానికి కనపడ్డారు.....బాగున్నారా?"
"ఆఁ ! బాగున్నానండి...మీరు బాగున్నారా ?"
" రిటైరయినట్టున్నారు కదా? లైఫ్ చక్కగా ఎంజోయ్ చేస్తున్నారా ? లేదా ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా... "
ఆఁ..ఆఁ..అవునండి ఉద్యోగం చేస్తున్నా...."
"అచ్ఛా! ఏం ఉద్యోగం చేస్తున్నారు.."
"డ్రైవరుగా ఉంటున్నానండి."
" డ్రైవరుగానా ? అదేమిటి మీరు బ్యాంకులో కదా చేసేవారు."
"అవునండీ...క్లర్క్ గా చేసి...ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యాను... 34ఏళ్ళ సర్వీస్ అయ్యాక చక్కగా రిటైరయ్యాను.."
"మీకు పెన్షన్ వస్తుందేమో కదా ?"
"వస్తుందండి..."
"మరి డ్రైవరంటారేమిటి"
"నిజమేనండి...అప్పుడు పార్ట్ టైమ్ డ్రైవర్ గా వుండేవాడిని. ఇప్పుడు పెర్మనెంట్." "అదేమిటండీ?...జీతం ఏ మాత్రం?"
"రెండుపూటలా భోజనం..ఉదయం రెండుసార్లు కాఫీ, టిఫిన్ సాయంత్రం టీ..."
" అయినా నాకు తెలియకడుగుతాను...ఇంత బతుకు బతికి ఇదేం ఖర్మండీ...ఇంకోళ్ళకింద పడుండం..."
"అదేమీ ఇబ్బంది లేదండీ..."
"ఎంతయినా మీ స్వేచ్ఛ ఆగిపోదుటండీ"
"నా స్వేచ్ఛకేం ఇబ్బంది లేదండీ..ముందుగానే ప్రోగ్రామ్ తెలిసి పోతుంది...హేపీగా రెడీ అయి వెళ్తాను..ఎప్పుడు వెళ్ళగలిగితే అప్పుడే..."
" ఇంతకీ ఏం పనులుంటాయి.?"
"పిల్లల్ని స్కూలుకి తీసుకువెళ్ళి తీసుకురావడం...షాపింగ్.... వారానికి ఒకసారో రెండుసార్లో ఏ సినీమాకో, బీచికో..." "వాళ్ళు తిరిగి వచ్చేదాకా మీరు కారులో కూర్చోడమా?"
"అలా అనేం లేదు..కావాలంటే మనం వాళ్ళతో వెళ్ళొచ్చు..లేదా ఏదైనా పనివుంటే మన పని చూసుకుని తిరిగి వెళ్ళేటప్పుడు పికప్పు చేసుకుని వెళ్తామన్నమాట..."
"టాక్సీయేమో అనుకున్నాను ప్రైవేటు ఉద్యోగమా? ఏం కారు"
"కారు కాదండీ...స్కూటర్..."
"స్కూటరా..ఛా! ఛా! ఆ స్కూటర్ మీద.... మీ పొట్ట చుట్టూ చెయ్యేసి ఆవిడ పేరంటానికి వెళ్తుందా? ఇబ్బందిగా వుండదుటండీ?"
"నిజమేనండి..పొట్ట కొంచెం పెద్దదయిపోయింది..అందుకనే ఒక్కోసారి భుజం మీదే వేస్తుంది."
"మరి వాళ్ళాయన చూడడా...చూసి ఊరుకుంటాడా?"
"ఎవరి ఆయనా?"
"అదేనండీ...మీ ఆడ బాసుకి మొగుడైన మీ మగ బాసు."
"....ఆడ బాసు...మగ బాసూ అంటారేమిటి ? నేనే బాసుని...డ్రైవరంటే మా స్కూటర్ కే...."
"చంపారు కదండీ!"
"ఏఁవండీ ...ఆవిడొచ్చింది....ఇఁక నే వెళ్తానండి"
................ఆ అపార్టుమెంటు ముందువున్న చెట్ల నీడల్లోంచి రెండు మూడు స్కూటర్లు స్టార్టయ్యాయి...ముత్తైదువలు ఒకరికొకరు టా టాలు చెప్పుకుని..వెనుక సీటు యెక్కి వాళ్ళ వాళ్ళ ఆయనల పొట్టలు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు....
3 comments:
హహ్హహహ్హహా.. నవ్వకుండా ఉండగలరుటండీ..?!!
bagundhandi.....:)
ప్రియగారికి, కావ్య గారికి ధన్యవాదములు.. దసరా పండుగ శుభాకాంక్షలు.
Post a Comment