శ్రీ మారుతాత్మజాయనమః
రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ రామ జయరామ జయ జయ రామ యంచు రేబవళ్ళు నామమును స్మరింపజాలు పూజలు జపతపాదుల ముక్తిగోర నామమే భవాబ్ధి దరింప నావ నాకు..(శ్రీ దినవహి సత్యనారాయణగారి శ్రీరామచరితమానసము )
మారుతిని చూడ మందిరానికెళ్తే స్వామి ఏడీ ? ఎందుకుంటాడు ?...
తెల్లారితే శ్రీ సీతారాముల కళ్యాణం...స్వామికెన్ని పనులెన్ని పనులు ?...
ఏ వీధిలో విన్నా రామనామమే...ఏ నోటవిన్నా శ్రీరాముని మాటే///
ఏ ఇంట చూసినా సీతా రామ కళ్యాణ సంబరమే.....ఇలాంటప్పుడు
ఆయన గుడిలో కూర్చుంటే ఎలా మరి ? ఎక్కడ రామ కీర్తన జరిగితే
అక్కడనే హనుమ తాండవం...కదా ?
శ్రీరామనామ జపసారమెరిగినవాడు కాశికాపురినిలయుడు...శ్రీ రామ సాన్నిహిత్యానికై శివాంశతో హనుమ జన్మించాడు// హనుమను పట్టుకుంటే శ్రీరాముడు దొరుకుతాడు..ఈయన్నేలాగ పట్టడం ?
కాశీనగరంలో గోస్వామి తులసీదాసు నిత్యము రామాయణ ప్రవచనము చేసెడివారట. ప్రతిదినము కాలకృత్యములకొరకు దగ్గరలోనున్న అడవికి పోయి పాత్రలోనున్న శేష జలమును ఓ రావిచెట్టు మొదాట్లో పోసెడివారు. ఆ చెట్టుపైనున్న భూతము ఓ రోజు ప్రత్యక్షమై "ఏమైనా అడుగు ఇస్తాను" అంది..మహాభక్తుడు తులసీదాసు శ్రీరామ దర్శనం కోరారు...ఆపని తనవల్లకాదంది కాని ఉపాయం చెప్పిందాభూతం...నీ రామాయణ ప్రవచనానికి రోజూ హనుమ వస్తున్నాడు. ..అందరికన్నా ముందు వచ్చి అందరూ వెళ్ళినతర్వాత వెళ్తాడు..కన్నులనీరు కారుతూవుండగా ఆనందంగా రామాయణం వింటూ వుంటాడు...అతన్ని పట్టుకో...అంది భూతం..శ్రీరాముడు కావాలంటే హనుమను పట్టాలి..హనుమను పట్టాలంటే భక్తితో శ్రీరామగానం చేయాలి...హనుమ సాయంతో శ్రీరామదర్శనమైంది గోస్వామికి.
తులసీదాస కృత శ్రీరామచరిత మానస్ కృతిలో శివుని వల్ల శ్రీరామ కథను అమ్మ పార్వతి వింటుంది...శ్రీరాముని బాల్యలీలలు చూడ ముచ్చటపడి తాను మనుష్యరూపంలో అయోధ్యలో చరించానంటాడు ఆ కైలాసవాసి...ఆ తారకమంత్రాన్ని భవానికి ఉపదేశించాడు భవుడు.
రామాయణగాధ అంతా యఙ్ఞమయం...శ్రీరామజననానికి అశ్వమేధం..పుత్రకామేష్టి అలా ప్రారంభమై..విశ్వామిత్రుడు రామలక్ష్మణ రక్షణలో సిద్ధాశ్రమంలో చేసిన యఙ్ఞం, జనకుని యఙ్ఞం..అలా ఒకదానితర్వాత ఒకటి...ఒక ఋషిమండలి తర్వాత ఒక ఋషి మండలి.... అదీ రామాయణ క్రమం....ఎంతోమంది శ్రీరామ దర్శనంకోసం ఎదురు చూస్తున్నారు..శబరి, అహల్య ఎందరెందరో..వారందరినీ తరింపచేయటానికి కోదండ రాముని వనవాసలీల.
రామాయణ గాథ అందరికీ తెలుసు///చివరికీ ఏమవుతోందనన్న ఏ ఉత్కంఠా లేదు...అయినా అంత శ్రద్ధగానూ వింటాము..అంత రుచిగానూ వింటాము..."శ్రీరామ! నీనామ మెంతో రుచిరా.." ..."మిసిమి చెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి..."..ఎన్ని రుచులు చెప్పారు రామదాసుగారు..."నిధి సుఖమా రాముని సన్నిధి సుఖమా" అంటారుశ్రీ త్యాగయ్య...శ్రీరాముడు మనకు ఆదర్శం...శ్రీరామకథ మనకు ఆరాధ్యం...
శ్రీరామనవమి శుభసమయాన శ్రీరామ భక్తులైన మీ అందరికీ శుభాకాంక్షలు.
2 comments:
chala baagundhi daddy....hanumanthudu raama kathani vintunna ghattam chaduvutunte kallalo neellu thirigai
చాలా అద్భుతంగా రాశారు మావయ్యగారు, తెలియని విషయాలు చెప్పారు. నిజం గానె రామ నామం లోని రుచి చుపించారు..
Post a Comment