Pages

Friday, August 5, 2011

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి నూరు పుట్టిన రోజుల వేడుక

జంధ్యాల పాపయ్య శాస్త్రిగారి శతజయంతి ఉత్సవాలని తలచుకోగానే
నా డైరీలో భద్రపరచుకున్న పద్యాలు కొన్ని పలకరించాయి.
మనస్సును పలకరించే తియ్యటి పద్యాలు ... చదివినప్పుడల్లా
ఏదో తీయటి అనుభూతి...

ఆయువు గల్గు నాల్గు గడియల్ కని పెంచిన తీవతల్లి జా
తీయత దిద్ది తీర్తుము - తదీయ కరమ్ములలోన స్వేచ్చమై
నూయల లూగుచున్ మురియుచుందుము - ఆయువు దీరినంతనే
హాయిగ కన్ను మూసెదము - ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై.

సృష్టంతా నిండియున్న ఆ పరమాత్మను నిత్యము తమ సుగంధ భరిత
కుసుమాలతో నిస్వార్థంగా అలంకరించి సేవించే తీవతల్లికి
తన బిడ్డల వేరుచేస్తే మనసు బావురుమంటుంది ... అదే పుష్ప విలాపమైంది,

శివధనుస్సు తీసాడు సాకేతరాముడు.. పైకెత్తాడు.. నారి తగిలించబోయాడు.
ఆ ముక్కంటి విల్లు రెండు ముక్కలైంది...ఆ దృశ్యం మనకనుల ముందర

"ఫెళ్ళుమనె విల్లు - గంటలు "ఘల్లు"మనె - "గు
భిల్లు"మనె గుండె నృపులకు - "ఝల్లు" మనియె
జానకీదేహ - మొక నిమేషమ్మునందె
నయము జయమును భయము విస్మయమ్ము గదర... ....(ధనుర్భంగము)

పద్మనయనమ్ముల వాని తలచుకుని రక్తనయనమ్ములవానిని
చూస్తే యమబాధ ఇంకెక్కడ??....

నల్లనివాడు రక్తనయనమ్ములవాడు - భయంకర స్వరూ
పోల్లసనమ్మువాడు - గదనూని మహామహిషమ్ముపై ప్రవ
ర్తిల్లెడి వాడు - నా ప్రణయదేవుని జీవధనమ్ము తెచ్చె - నో
భిల్లపురంధ్రులారా! కనిపింపడుగా ? దయచేసి చెప్పరే!... .... ...(సతీ సావిత్రి)

ఇక గౌతమబుద్ధుడు మహాభినిష్క్రమణ చెప్పేతీరు ఎంత హృద్యం ..

కాంతిలో నుండి కటికి చీకటులలోన
కలసిపోవుచున్నాడు కరుణమూర్తి
కటికి చీకట్లులోనుండి కాంతులలోన
పతిత పావనుడై బయల్పడగనేమొ....(ఉదయశ్రీ)

"ఉదయశ్రీలో..పారవశ్యం అనే ఖండికలో నచ్చిందని నోట్ చేసుకున్న
విధమిది...
రాధ కృష్ణుని కోసం ఎదురుచూస్తున్నది...
"..సరస శారద చంద్రికాస్థగిత రజిత
యమునా తరంగ నౌకావిహారము"
చేద్దామన్నాడుట ఆ కృష్ణుడు. కాని చెప్పిన
సమయానికి రాలేదు ఆ పెద్దమనిషి...
ఈలోగా ..
"చిచ్చు వలె చందురుడు పైకి వచ్చినాడు
పెచ్చరిలినాడు గాడుపు పిల్లవాడు
రాడు మోహన మురళీస్వరాలవాడు
తప్పకేతెంతునని మాట తప్పినాడు."
సరే! వచ్చాడండీ...
"అల్లనల్లన పుడమిపైనడుగులిడుచు
వెనుకగా వచ్చి తన ముద్దువ్రేళ్లతోడ
గట్టిగా మూసె నామె వాల్గన్నుదోయి"
"తరుణి తన్మృదులాంగుళుల్ తడివిచూచి
"కృష్ణుడో ,,కృష్ణుడో" యంచు కేకవేసె"...

రాధకు కోపంవచ్చింది..కినుక వహించింది.
"ఎంత తడవయ్యె నే వచ్చి - ఎంతనుండి వేచి యుంటిని"
కలికి - పేరలుకకు -
"రాధికా మానస విహార రాజహంస
మందహాసమ్ము కెమ్మోవి చింద పలికె"
ఏమని ?
"ఆలసించుట కాగ్రహమందితేని
వెలది ! విరిదండ సంకెలలు వేయరాదా?
ముగుద! పూబంతితో నన్ను మోదరాదా?
కలికి ! మొలనూలుతో నన్ను కట్టరాదొ?"

ఎంత కఠిన శిక్షలు కోరుకున్నాడో పాపం ఆ 'అమాయకుడు.'
ఆ అల్లరివాని అమాయకత్వపు నటన చూచి:-

"రాధికా క్రోధ మధురాధరమ్మొకింత
నవ్వెనో లేదో ! పకపక నవ్వె ప్రకృతి
నవ్వుకున్నది బృందావనమ్ము! యమున
నవ్వుకున్నది. చంద్రుడు నవ్వినాడు-
విరుగబడి తమపొట్టలు విచ్చిపోవ
నవ్వినవి రాధ తలలోని పువ్వులెల్ల!!!"

సరే - రాధ
"పారవశ్యమ్మున మునిగి వ్రాలె మాధవు స్నేహార్ద్ర వక్షమందు.."
అన్నారు జంధ్యాల..అని..
"రాధపై ప్రేమ అధికమో మాధవునకు
మాధవునిపైన రాధ ప్రేమయె ఘనమ్మొ"
ఈ రహస్యము నెఱుగలేరెవరుకూడ...
ప్రణయమయ నిత్యనూత్న దంపతులువారు."
అని ముక్తాయిస్తారు పాపయ్య శాస్త్రిగారు..

జంధ్యాల వారి దివ్య స్మృతికి నివాళి.....

3 comments:

యమ్వీ అప్పారావు (సురేఖ) said...

జంధ్యాల వారిని గుర్తు చేసి అమూల్య పద్యాలను పొందుపరచి మా ముందు వుంచినందుకు ధన్యవాదాలు

బులుసు సుబ్రహ్మణ్యం said...

జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు చాలా సరళంగా అందరికీ అర్ధం అయేటట్టు ఉంటాయి. పుష్ప విలాపం, కుంతీకుమారి, తెలుగుతల్లి ఇత్యాదులు తెలుగు భాష ఉన్నంతకాలం ఉంటాయి.
అంతటి మహానుభావుడిని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

మిస్సన్న said...

అయ్యా! పులకించే పద్యాలు గుర్తు చేశారు.
పాపయ్య శాస్త్రిగారు చిర స్మరణీయులు.