
"సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి
కతలాయ నడురేయి కలిగె శ్రీ కృష్ణుడు||"
"సువ్వి సువ్వి సువ్వాలమ్మా
నవ్వుచు దేవకి నందను గనియె||"
అష్టమితిథినెంచుకుని; దేవకి అష్టమగర్భాన
అష్టాక్షరీ మంత్రవాచ్యుడు; శ్రీ కృష్ణునిగా జన్మించాడు.
నాలుగు భుజాలతో - శంఖం, చక్రం, గదా, పద్మం ధరించి శ్రీవత్సలాంఛనంతో దర్శనమిచ్చిన కృపావిశాలు చూసి వసుదేవుడు పులకించిపోయాడట.
అంతలోనే జగన్నాటక సూత్రధారి పొత్తిళ్ళలో పాపడైపోయాడు ...ఆ పాపణ్ణి నందగోకులంలో్ యశోద ప్రక్కలో జేర్చాడు వసుదేవుడు...ప్లానింగ్ అంతా ఆ లీలా మానుషవిగ్రహునిదే... అంతా సెట్ అయ్యాక వ్రేపల్లెలో 'కేర్' మన్నాడు తన ఉనికి తెలియజేస్తూ.....
ఎన్నెన్నో జన్మలనుండి ఎదురుచూస్తున్న గోపికలలోని జీవునికి ఆ పసి రోదన ప్రణవనాదమై హృదయాన్ని మృదువుగా తాకింది.
ఉన్నవాళ్ళు ఉన్నట్టుగా అత్యుత్సాహంగా పరుగులుపెట్టారు.
"చిన్ని మగవాని" కి స్వాగతం చెప్పడానికి
ఏమి నోము ఫలమొ యింత ప్రొద్దొక వార్త
వింటి మబలలార! వీను లలర
మన యశోద చిన్ని మగవాని గనెనఁట
చూచి వత్తమమ్మ! సుదతులార!
అనన్య భక్తి నిండిన మీరాబాయి హృదయానికి ఈ సృష్టిలో పురుషుడంటే కన్నయ్యే....అదే భావం వ్రేపల్లె వాసులకు....ప్రేమ స్వరూపునిపై ప్రేమ ముప్పిరిగొన్నవేళ ఏ భక్తునికైనా కట్టెదుట నిలిచేది కరుణాంతరంగుడే కదా...
"కొదదీర మరి నందగోపునకు యశోదకు
ఇదివో తా బిడ్డడాయె నీ కృష్ణుడు"
దేవకీవసుదేవుల సుతుడైనప్పటికి చిన్ని కృష్ణుని చిలిపి అల్లరులు చూసి తరించే అపురూపభాగ్యం యశోదానందులకే స్వంతం.
అందెలు గజ్జెలు మ్రోయగ
చిందులు ద్రొక్కుచును వేడ్క చెలువారంగా
నందుని సతి యా గోపిక
ముందర నాడుదువు మిగుల మురియుచు కృష్ణా !
"..రామా నిను రారా అని పిలువ దశరథుడు తపమేమి చేసెనో" అంటూ ఆశ్చర్యపోయాడు - 95కోట్ల రామనామం చేసి తరించిన త్యాగబ్రహ్మ.
ఆ గొల్లపడుచు తల్లియై కన్నయ్యను లాలించింది..పాలిచ్చింది..చిన్ని కృష్ణుని అల్లరికి విసిగి మందలించబోయి అంతలో అక్కున జేర్చుకునేది...ఒకసారి పట్టబోయింది. పట్టి కట్టబోయింది..పరుగులెత్తించేడు పరంధాముడు..అలసిన అమ్మను చూసి జాలిపడ్డాడు. దొరికి పోయాడు.
లక్ష్మీదేవి కౌగిటలో చిక్కనివాడు, సనకాది యోగుల మనసులకు అందనివాడు , వేదమంత్రాలతో పొందలేనివాడు... "జననీ బంధంబున గట్టువడియెఁ...".
చిన్ని పిల్లడై యశోదమ్మకు దొరికిపోయాడు..దామోదరుడు
అల్ల జగన్నాథుకు వ్రే
పల్లియ క్రీడార్థమయ్యె పరమాత్మునకున్
గొల్లసతి యా యశోదయు
తల్లియునై చన్నుగుడిపె దనరగ కృష్ణా !
బృందావనంలో గోపబాలురతో మేతకు దూడలను తోలుకువెళ్తాడు అది స్వామి దినచర్య. అలా ఆడుతూ పాడుతూ వారితో వెళ్తున్నా జగద్రక్షకుడైన స్వామికి జతగాళ్ళ ఆకలి దప్పులు తెలియవా? ...సమయంకనిపెట్టి.... ఒక అనువైన స్థలం చూసి "...రండో బాలకులార ! చల్దిగుడువన్ రమ్యస్థలం బిక్కడ..." అంటూ తనవార్ని పిలచాడు. ...చుట్టూ సావాసగాళ్ళు కూర్చున్నారు ..ఆ మధ్య తాను ....నడుముకు గట్టిగా వస్త్రం..పట్టుదట్టి... దాంట్లో వేణువు .. చంకలో పశువులనదలించడానికి ఉపయోగించే కొమ్ముబూర, ఛర్నాకోలా .చేత చల్దిముద్ద. మీగడా పెరుగు కలిపింది. బుల్లి కన్నయ్య బుజ్జి చేతుల చిన్ని వ్రేళ్ళ నడుమ నోరూరించే ఊరుగాయ. అది నంజబెట్టి జతగాళ్ళకు చల్దులు పంచుతున్నాడు......యాగ భోక్త . బాలకృష్ణుడై సంగటిగాళ్ళతో చల్ది ముద్దలు తింటూ ఉంటే దేవతలు ముక్కుమీద వ్రేళ్ళేసుకున్నారట.. మాగాయి పెరుగు మీగడలతో మన తెలుగు రుచి ఎలా తెలిసిందో ఆ మాధవయ్యకు..అంత దగ్గరివాడు ఆ సర్వాంతర్యామి అందరికీ...
...
నల్లనివాఁడు పద్మనయనంబుల వాఁడు కృపారసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళి పరిసర్పిత ఫించమువాఁడు నవ్వురా
జిల్లెడు మోమువాఁడు....
చేతిలో మురళి ఏ అమృతధారలలో మునిగి వచ్చిందో ..ఆ మధుర
స్వర ధ్వనులు లోకాన్నే బృందావనం చేస్తున్నాయి...ఆ మురళిగానం
లోకాన్ని పరవశింప జేస్తోంది.
మధురమైన తన అధరాన్ని సోకిన ఆ మురళిలోకి ప్రాణశక్తినూదుతున్నాడు విశ్వనిర్వాహకుడు .. జీవులు చైతన్య వంతులవుతున్నారు ఆ వంశీ నాదానికి... ప్రకృతి పల్లవిస్తోంది. జగత్తు పరవశిస్తోంది.
అగణిత వైభవ ! కేశవ !
నగధర! వనమాలి ! యాదినారాయణ ! యో
భగవంతుడ శ్రీమంతుడ !
జగదీశ్వర ! శరణు శరణు శరణము కృష్ణా !
----------
||||స్మార్త మాధ్వ కృష్ణాష్టమి 21-08-2011|||||||
|||||||||||||||శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు||||||||||||
4 comments:
చిన్నికృష్ణుడు ముద్దుల దేముడు. వెన్నముద్దల దేముడు. ఆయన లీలలు అర్ధం చేసుకోవడం అవలీల కాదు సుమా ! ఆ మహానుభావుని
గురించి చక్కగా చెప్పారు, మిత్రమా!
చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొల తాడు పట్టు దట్టి
సందిట తాయెత్తు సరి మువ్వ గజ్జెలు
చిన్ని కృష్ణు లీల లెన్న తరమె?
అప్పారావుగారు, మీ వ్యాఖ్య కవితాత్మకం...కృతఙ్ఞతలు.
మిస్సన్నగారు,
పద్యంలో పదం కలిపి కృష్ణ లీల చూసి చూపించారు.
చేరి కొలవాలంటే లీలలే మననం చేయాలి...బాగుంది.
పదార్ధాన్ని కూడా పరవశింప చేసే తత్వం బాలకృష్ణుని తత్వం. వెన్నముద్దకి విలువచ్చింది ఆబాల గోపాల కృష్ణుని వల్లే... పుట్టక అంటే వెన్నముద్దదే,మురళీదే,అటుకులవే, రోలుదే, పూతన దే చనుబాలు ఇచ్చింది...ముక్తినందింది.. ఎన్నెన్ని లీలలు... ఆ సొగసు చూడ తరమా... ఆ సొగసులు విన్నతరము అప్పుడు. ఇప్పుడు విన తరము శ్రీ సామవేదం వారి అమృతవాక్డ్ ధార , వాక్ ద్వారా..., అతిశయం కాదు... చూడతరము కూడా... ఈ రోజే వానప్రస్థా శ్రమం లో... @ యర్రాప్రగడ ప్రసాద్, Rjy
Post a Comment