Pages

Friday, September 30, 2011

పో.... నో.... ఉ....


(కొంత కాలం క్రితం ETV లో "నవ్వితే నవరత్నాలు" అని ఓ హాస్య కార్యక్రమం వచ్చేది..రాత్రి పదిన్నరకు వచ్చేది..ఈ తరహా కార్యక్రమాలకు అది మొదలేమో కూడా...ఇప్పటిలా సినీమా ఓరియంటేడ్ గా కాకుండా ప్రేక్షకశ్రోతలను కూడా పాల్గొనేలా చేస్తూ ఆసక్తిదాయకంగా సాగేదా కార్యక్రమం..మొదట్లో అశోక్ కుమార్ (టి.వి ఆర్టిస్ట్, సినీమా ఆర్టిస్ట్ ) నిర్వహించేవారు. తర్వాత ఎ.వి.యస్ లాంటి వారు నడిపారు...ప్రేక్షకులవ్రాసిన జోకులు చెప్పేవారు...స్పందించి వ్రాస్తే బాగున్నవి తీసి చదివేవారు.. దానికోసం వ్రాసిన నా ఈ స్పందన...మీ ముందుంచుతున్నాను.. మీరు చదవాలని..మీ టేస్ట్ చాలాగొప్పది... మీరు చదువుతారు... చదవండి మరి... ఇంకో విషయం:: ఇది చదివాక మీరు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు నా బ్లాగులో పోస్ట్ చేయండి...1) ఇది అశోక్ కుమార్ గారు చదివారా, ఎలా స్పందించారు ? 2) అసలు ఈ పోస్ట్ టైటిల్ పో.నో.ఉ అంటే ఏమిటి?.... త్వరలో మీ జాబుకోసం ఎదురుతెన్నులు...)


హలో అశోక్ కుమార్ గారూ !
న మ స్తే !!!

ఏమిటి - ఏమిటి - ఏమ్టి బాబూ ?
మేము ఉత్తరాలు రాయాలా? అవి మీరు చదువుతారా ? మాకందరికీ నవ్వులు రాలాలా?
అందులోంచి క్రొత్త క్రొత్త రత్నాలు మీరు ఏరుకుంటారా ?
అబ్బా ! ఎంత ఆశ?
అయినా...ఇది నవ్వుల టైముటండీ...

హౌస్ వైవ్స్ అందరూ పగలంతా
అలసి అలసి సొమ్మసిలిపోయే వేళ

హౌస్ హస్బెండ్స్ అంతా ఆఫీసుల్లో
పగలంతా సొలసి సొలసి - ఆ టెన్షన్ తో
ఇంటికొచ్చి - ముద్దులొలికే చిన్నపిల్లల
చిలిపి అల్లరికి ఆఫీసు కోపంతో అరచేవేళ

అప్పటిదాకా సశేషమే కాని శు భ మ్ ఎప్పుడో తెలియని
బుల్లితెర సీరియల్స్ చూ సి .... చూ సి....
విసిగి వేసారి ఇల్లాళ్ళు జుత్తు పీక్కొనేవేళ

అలవోకగా ఆవులింతలు కమ్ముకొనే వేళ
మ ము నవ్వింపగ న డ చీ వచ్చితివా ...అ శో కా....

మేం గిలిగింతలు పెట్టాలిట.... గొడవ గొడవ చేయాలిట.... ఈ.టి.వితో పాటు ఈ నవ్వితే నవరత్నాలు ప్రోగ్రామ్ కూడా మాదేనట.. బాగుంది కాని బాబూ..అశోకా..."ఈ గొడవకి ప్రక్క ఇళ్ళవాళ్ళు ...కళ్ళెర్రజేస్తే, భాగ్యనగరాన ఉన్న మీకు ..మా ఈ అభాగ్యుల గోడు పట్టేనా ?" అని మేం అంటే ..."ఏం ఫర్వాలేదు, అందరూ ప్రోగ్రామ్ చూస్తూ సందడిగానే ఉంటారు...సందట్లో సడేమియా" అంటారు మీరు ...నాకు తెలుసు.
అయితే జోకుల పాడి ముళ్లపూడి వారన్నట్టు జోకులకు కూడా వేళా పాళా ఉన్నాయి కదా మరి....
శ్రీ ఆయన ఏమన్నారంటే...."ఆ యొక్క వానచినుకు..కాలే పెసరట్ల పెనంమీద పడితే ఇగిరి ఆవిరి అయిపోతుంది, అంతూ దరిలేని సముద్రంలో పడితే అడ్రస్సులేకుండా పోతుంది... అదే ఆ యొక్క వానచినుకు.. తామరాకు మీద పడితే ముత్యంలాగ ప్రకాశిస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యమే అయిపోతుంది.... ఓ చదువరీ ! జోకులు కూడా అంతేస్మీ.." అని.
అలాగే మీ జోకు కూడా.... అలసిపోయిన హౌస్ వైఫ్ వింటే వారి నిద్రలో కలసిపోతుంది: ఆఫీస్
హేంగోవర్ తో వచ్చిన హౌస్ హబ్బీస్ వింటే వళ్ళు మండిస్తుంది; పొరపాటున ముగింపుకొచ్చిన
సీరియల్ చూసి ఆనందించబోయే బుల్లితెర ప్రేక్షకుడుచూస్తే ముద్దు ముద్దుగా నవ్వేస్తుంది.,
నవ్వులతో నవనవలాడే నవ్యదంపతులు చూస్తే నవరత్నాలే రాలుస్తుంది... ఇంతకీ "మీ సొమ్మేంపోయింది..ఉచిత సలహాలు ఎన్నైనా ఇస్తారు" అని మీరు అనుకోదలస్తే... అంత
లేట్ నైట్ కాకుండా కొంచెం ముందుకు ప్రోగ్రామ్ జరపమని మనవి....

ఈ గొడవంతా ఎందుకు ...మాకో జోక్ చెప్పగలిగితే చెప్పండి... ఆర్ రాయగలిగితే రాయండీ...
అంటారా ? ఓ.కే. ఈ ఉత్తరం చివరన ఓ పెద్దజోకుకి బాక్స్ కట్టాను. చూడండి.....అరెరె...ఏంటా తొందర... నాఉత్తరం ఇంకా పూర్తవలేదు...కొంచెం ఆగండి.....
ఎందుకంటే పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టాలి...ప్రేక్షకుడు దొరికినప్పుడే సీరియల్ లాగాలి.,
పాఠకుడు దొరికినప్పుడే అక్షరాలు పెంచాలి.
అయినా అశోక్ కుమార్ గారు!..మీకు అన్నింటికీ తొందరే..అందుకే మిమ్మల్నిచూస్తే అందరికీ జాలి....ఆ సత్యనారాయణ పొమ్మన్నాడు, ఆ వర్షంలో ఆ రాత్రివేళ ఆవిడ్ని ఒదిలేసి పోయారు..ఏమైంది ... కొంప మునిగింది... వాహ్ ఏం చేసారండి బాబు? స్క్రీన్ మీద వర్షం, కళ్ళల్లో జడివాన...మూర్తీభవించిన సశోకుడే....
అన్నట్టు నేను కూడా నటుడ్నేనండోయ్... అదే మరి ? నట్టులా అంటూ "టు" మీద అంత స్ట్రెస్ అక్కరలేదు. ఆఁ నిజంగా నటులమే. మాలోని నటుడికి మరీ గెడ్డాలు, మీసాలు లేకపోయినా రవీంద్రభారతి స్టేజి లాంటి స్టేజ్ మీద నటించానని గర్వంగా తలచుకున్నప్పుడు..లేని మీసాల
స్థానంలో ఓ ముద్ర వేస్తాడు.. గడ్డాలు మీసాలు పెంచుకుని ఎదిగిన మీ నటన "పెళ్ళిపుస్తకం"లో ఓ ఓపెన్ పేజీ.. (సీక్రెట్ పేజీలు మనవికాదుకదా).
మీతో మాట్లాడుతుంటే కవిత్వం పొంగుకొచ్చేస్తోంది...హేమిటో..... నాలోని కవి మీసాలు గడ్డాలు పెంచుకోవడానికి అవకాశంలేక....ఎందుకంటే కవులకు మీసాలు గెడ్డాలు ఉన్నట్టుగా సినీమా చారిత్రిక ఆధారాలు లేవు...(గమనిక: "కాళిదాసు"పాత్రలో శ్రీ నాగేశ్వరరావు గారు భోజరాజు ఆస్థానంలోకివెళ్ళాక అప్పటిదాకా వున్న అవన్నీ తీసేసారు.) వీరవిజృంభణ చేసేస్తున్నాడు...అవకాశమొస్తే మళ్ళీఛాన్సు తీసుకుందువుగానిలే అని "జోకె"డ్తున్నా.. ఇదిగో నండి పెద్ద జోకు బాక్స్ కట్టి మరీ చెప్తానన్నాను కదా.... ఈజిగా మీరు ఈ జోకు తయారు చేయొచ్చు...తెల్లకాగితం మీద పెద్ద జోకు అని మీ ఇష్టమైన భాషలో వ్రాయండి...దానికి బాక్స్ కట్టండి...అంతే

ఇంతకీ ఈ గెడ్డాలు మీసాలు రాని రచయిత ఎవరా అనా....నేనే. నా హాబీలు:: ఏముందండీ "హాస్యం" అని వినిపిస్తే చాలు చెవిమీద చెయ్యి వేస్తాను... కొయ్యడానికి కాదండీ.... వినడానికి....విని ఎన్జోయ్ చెయ్యడానికి... అలాగే...వినేవారుంటే హాస్యంగా మాట్లాడాలి అని ఓ సరదా....
ప్రస్తుతానికి మరి శలవు...హాస్యాభినందనలతో......

Sunday, September 11, 2011

అసలు పాయింట్


కాలేజీలో చదువుతున్న రోజుల్లో...సైన్సు విద్యార్థులకు వాల్యుమెట్రిక్ అనాలిసిస్ అనేది ఒక ప్రయోగం. పైన బ్యూరెట్ లో పొటాషియమ్ పెర్మాంగనేట్ (రంగు ద్రవం)నింపి, క్రింద గాజుకుప్పెలో ఆక్సాలిక్ ఆసిడ్(తెలుపు రంగు) నింపి...చేసే ప్రయోగం... ఒక్కొక్క చుక్కా బ్యూరెట్ లోంచి గాజుకుప్పెలో పడుతుంటే క్రమంగా తెలుపు రంగులో మార్పు వచ్చి ఒక పాయింట్ దగ్గర పింక్ కలర్ వస్తుంది. ఇంక ఒక చుక్క వేసినా ఆక్సాలిక్ ఏసిడ్ ద్రవంయొక్క తెలుపు రంగు మొత్తం పొటాషియం పెర్మాంగనేట్ కలర్ లోకి మారిపోతుంది.. అప్పుడు ఇంక ఎక్స్ పెరిమెంట్ గోవిందా! గోవింద !! అదిగో సరిగ్గా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర రీడింగు తీసుకుని ప్రయోగం పూర్తి చేస్తారు...

ప్రయోగం గురించి చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యంకాదు... ఆ టర్నింగ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కోసం మనం పడే కష్టాలు.. పింక్ కలర్ వచ్చేసినట్టే ఉంటుంది.. నమ్మకం కలగదు ప్రక్క వాడిని అడుగుతాం... ఎండ్ పాయింట్ వచ్చిందా అని...వాడు ఆ గాజుకుప్పెను పైకెత్తి, ట్రైను/విమానం మిస్సవడంవల్ల నోబెల్ బహుమానం తనకు మిస్సయి పోయింది తప్ప మరో కారణం కాదు అన్నట్టుగా, ఆర్కిమెడిసో, ఆర్థర్ ఎడిసనో అన్నట్టుగా ఓ పోజు కొట్టి... కూసింత మౌనం పాటించి .. ఆ తర్వాత...... అప్పుడంటాడు..."రీడింగ్ నోట్ చేసుకుని ఓ డ్రాపు వేయండి" అని ఇప్పటిదాకా చాలాసేపట్నుంచి మనం చేసేదదే ! కాని శంఖువులో పోసే తాపత్రయం... ఎండ్ పాయింట్ కోసం.....


కట్ చేస్తే...."డాక్టర్ గారు ! ఎడమ భుజం లాగుతోందండి...చాలా బాధపెడ్తోంది". "ఎప్పట్నించి.." మొట్టమొదటగా డాక్టర్ ప్రశ్న..."అంటేనండీ.." ఈలోగా డాక్టరు గారు నొక్కి చూస్తారు. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా..అంటూ...నొప్పి వచ్చిన క్షణం మనం చెప్పగలిగితే, ఏ పాయింట్ లోనొప్పిఉందో వివరించగలిగితే వైద్యానికి సహకారం... మందు కూడా పని చేస్తుంది...అదిగో ఆ పాయింట్ కావాలి.

ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాము...అది కట్టెల వ్యాపారం కావచ్చు..పువ్వుల వ్యాపారం కావచ్చు. వేలల్లోనూ లక్షల్లోనూ కావచ్చు, కోట్లలో కావచ్చు...అది ప్రారంభించినప్పుడు అన్నీ ఖర్చులే ఉంటాయి. అది ఉత్పత్తి ప్రారంభించాలి ...జనానికందాలి.. అప్పుడు ప్రోడక్ట్ అమ్మకం పెరుగుతూ ఉంటే క్రమంగా నష్టాలు తగ్గి లాభాల వైపు సాగుతుంది వ్యాపారం. అదిగో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలి...వ్యాపారం యొక్క ఆరోగ్యంకరమైన అభివృద్ధికోసం...ఆ బి.ఇ.పి ఇవతలే స్తిరపడిపోయామా ఇక వ్యాపారం దివాలా అని అర్థం. అంచేత వ్యాపారం యొక్క జాతకం ఆ పాయింట్ మీద ఆధారపడి ఉంది.

వాఘా సరిహద్దు అవతల తస్మదీయుడు, ఇవతల అస్మదీయుడు...ఆ సరిహద్దు ఇంపార్టెంట్.

వివాహముహూర్తం..నెత్తిమీద జీలకర్ర పెట్టాడా గృహస్తు, పెట్టకపోతే బ్రహ్మచారి. అప్పటిదాకా వధువు 'ఆడ' పిల్ల .. ముహుర్తం అయ్యాక 'ఈడ' గృహిణి.


ఇలా నిత్యజీవితంలో బాగుపడ్డానికైనా పాడవడానికయినా ఓ పాయింట్, ఓ క్షణం ఉంటుంది...అది చాలా విలువైనది. ఆ పాయింట్ చేరేదాకా నిరాశాజనకంగా సాగే జీవితం, ఆశావహం అయ్యేది ఆ పాయింట్ చేరాకనే...


ఆధ్యాత్మిక జీవనయానంలో కూడా చేసే సాధన సిద్ధి పొందాలంటే ఒక పాయింట్. ఆ పాయింట్ దగ్గరనే మన సాధన జరగాలి అంటారు విఙ్ఞులు.. రాత్రంతా అలసి నిద్రపోయిన మన బాహ్యేంద్రియాలు ఉదయ రాగాలతో నెమ్మదిగా జాగృతమయ్యే సమయం... తమస్సులోంచి వెలుగులోకి ప్రవేశించే సంధ్యా సమయం... ఆ ఉదయ సంధ్య చాలా విలువైనది.. ఆ సమయంలో మన మేధస్సు నిశితంగా ఉంటుంది... మనం చేసే పనికి సత్ఫలితాలను ఇస్తుంది... విద్యార్థిదశలో విద్యనభ్యసించేందుకు అనువైన సమయం బ్రాహ్మీముహుర్తమే...ఆధ్యాత్మిక జీవనంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉపాస్య దైవాన్ని ఉపాసించాలి...ఆ ప్రశాంత సమయంలో సాధన చేస్తే గొప్ప ఆనందం అనుభవమౌతుంది...అదే ప్రాతఃకాల సంధ్యావందనం. సవితృ మండల మధ్యస్థ అయిన గాయత్రీ ఉపాసన.

అలాగే బాహ్యజగత్తుతో సంబంధం ఏర్పరచుకొని లోకవ్యవహారంలో కొట్టు మిట్టాడుతున్న జీవుల భౌతిక దృష్టి తగ్గి అంతఃచ్ఛక్షువులు తెరచుకోడానికి - తొలి గడప -- సాయంసంధ్య... అది దాటితే నిర్మల నిశ్శబ్ద నిశాసమయంలోకి జారుకుంటాం. - అంతఃమధన ప్రారంభమౌతుంది...ఆ మథనం ఆధ్యాత్మిక విషయంగా అయితే ఆనందమే మరి.


యా నిశా సర్వ భూతానాం, తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని, స నిశా పశ్యతో మునేః

(భూత జాలములన్నింటికీ యేది రాత్రియో అది జితేంద్రియుడగు యోగికి పట్టపగలు,
సనస్త భూతములకు ఏది పగలో అది విఙ్ఞుడగు ద్రష్టకు రాత్రి....అని గీతా వాక్యం.)


అగ్ని సోమాత్మకమైన జగత్తులో సోముని చల్లదనం ఆస్వాదించగలిగే తరుణసమయం.... సాయంసంధ్య....ఆ సమయంలో ఉపాసన అవసరమంటున్నది శాస్త్రం. అలాగే మరో రెండు సంధ్యలు....ఉదయం నుంచి భాను ప్రతాపం పెరిగి పెరిగి ..ఒక దశనుంచి తగ్గడం ప్రారంభించే మధ్యాహ్న సంధ్య; అలాగే అర్థరాత్రి... ఇలా నాలుగు సంధ్యలు ఉపాసనా సమయాలు అని ఋషివాక్యం... ఒక దశనుంచి రెండవ దశకు మారే పాయింట్... ఏ దశాలేనిది ఆ మధ్యపాయింట్.....అదే ఇక్కడ పాయింట్.


పాపం...మన హిరణ్యకశిపులవారు.... నూరు దివ్యసంవత్సరాలు తపస్సుచేసి...ఈ పాయింట్ మరచిపోయి... బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏమడిగారు ?

"గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం ........" అంటూ గాలిలోనూ, నేలలోనూ, అగ్నిలోనూ నీటిలోనూ, ఆకాశంలోను...రాత్రి పగలు, లోపల బయట అంటూ పెద్దలిష్టిచ్చి ఇందులో ప్రాణం ఉన్నవాటిచే
కాని, ప్రాణం లేని వాటిచేత కాని ... మరణం ఉండకూడదు అన్నారు...అదికాని ఇదికాని అంటూ ద్వంద్వాలే చెప్పాడు కాని...ద్వందాలమధ్యన ఉండే పాయింట్ గమనించలేదు పాపం.
...ఇక్కడా అక్కడా అంటావేమిటయ్యా వెర్రినాన్నా కాలస్వరూపుడైన ఆ పరమాత్మ "కలడంబోధి గలండు గాలి..." అంతటా ఉన్నాడు అని క్లారిఫై చేస్తూనేవున్నాడు తనయుడు- తలకెక్కలేదు, బ్రహ్మవరప్రసాద గర్వం తలకెక్కింది.. వరాలు పుచ్చుకున్న పెద్దరాక్షసుడు గమ్మునుండకుండా "... దిక్పాలుర పట్టణముల గొనియె నతడు బలమున నధిపా...". దాంతో... ఆ దైత్యుని శిక్షించడానికి, తన భక్తుని రక్షించడానికి అవతారమెత్తక తప్పలేదు ఆ శ్రీమన్నారాయణునికి... హిరణ్యకశిపుని కోరిక, బ్రహ్మ యిచ్చిన వరాలు దృష్టిలో ఉంచుకుని ఆ సర్వాంతర్యామి తన ఆహార్యాన్ని డిజైన్ చేసుకున్నాడు.
"శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులనన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్."--- "ఇట్లు కేవలపురుష రూపంబును మృగరూపంబునుంగాని నరసింహరూపంబున, రేయునుం బవలునుంగాని సంధ్యా సమయంబున..." ఆ పాయింట్ లో పరతత్త్వం...
"ద్వంద్వాలు మరచిపో...ఆ పాయింట్ లో ఉన్న నన్ను పట్టుకో" ...అని హెచ్చరిస్తున్నది...అది
"....హరిమాయారచిత మగు యదార్థము సూడన్" అది నరసింహ తత్త్వం...అది సంధ్యోపాసన.


జరిగిపోయినకాలం ఇక రాదు... రాబోయేకాలం తెలియదు... నిరంతరంగా సాగిపోయే
అనుభవమయ్యేది ఒకే ఒక్క క్షణం....ఒక చిన్న బిందువు...పాయింట్ అదే...

బ్రహ్మ, విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటుంటే మధ్యలో పొడసూపింది ఓ జ్యోతి స్వరూపం...
ఎక్కడో పాతాళంనుంచి అనంతాకాశంలోకి జాజ్వల్యమానంగా ఎదిగిపోతోంది...స్తంభాకారంగా ఉన్న ఆ అఖండజ్యోతి... ఆద్యంతాలు చూడాలనిపించింది ఈ గొప్పవాళ్ళకి... ఎంతవరకు ఎదుగుతోందో చూడాలని ఊహలరెక్కలతో
భవిష్యత్ లోకి పయనించాడు బ్రహ్మ-హంస రూపంలో ...
ఎక్కడనుంచి వచ్చింది అని చరిత్ర తవ్వడం మొదలెట్టాడు విష్ణువు - వరాహరూపంలో.

ఎరగని భవిష్యత్తులో కాదు...తిరిగి పొందలేని భూతకాలంలో కాదు ఎదురుగా వాస్తవంగా ఉన్న జ్యోతిని చూడగలగాలి ... ఉపాసించాలి.... అదీ...పాయింట్.


నిర్మల ఆకాశంలో ప్రాభాత సమయాన మారే వెలుగుల జిలుగులు... సాయంసంధ్యలో దర్శనమిచ్చే అరుణిమలు... ఆ సంజె వెలుగులలో దేశ కాల పరిస్థితుల కతీతంగా ఉండే ప్రత్యక్ష నారాయణుని.....విశ్వనట చక్రవర్తిని భావిద్దాము... ఆనందస్వరూపుని అనుభవంలోకి తెచ్చుకుందాం.

Friday, September 2, 2011

కావుడింటి గృహ ప్రవేశానికి బామ్మ గారు

గౌతమీ ఎక్స్ ప్రెస్ లో బయల్దేరి బామ్మగారూ, ప్రసాదరావు ఉదయాన్నే
రాజమండ్రి స్టేషన్ లో దిగారు... బస్టాండుకెళ్తే రామనారాయణ పేటకు
పదింటిదాకా బస్సులేదన్నారు...ఎలాగ వెళ్ళడం అనిఅనుకుంటూంటే ఒక
ఆటో్ ఆసామీ డ్రాపింగ్ కి ఏడువందలడిగాడు. ప్రసాదరావు
బేరమాడేలోపు బామ్మగారు "ఆరువందలిస్తానబ్బాయ్ వస్తావా" అని
అడిగేసారు. "సరే!" అన్నాడు . "సరే అంటే కాదబ్బీ మా కావుడింటి
గృహప్రవేశం ఉదయం తొమ్మిదింటికే లోగా తీసుకెళ్ళాలి. తెలిసిందా?"
నిజానికి పదీ నలభైకి ముహూర్తం.. బామ్మగారు తెలివితేటలు
ఉపయోగించారన్నమాట. ఇంతలో బామ్మ చేతిలో సెల్ మ్రోగింది.."హలో..
హలో...ఎవరు కాముడూ...హల్లో..వినపడటంలేదు..
"ఆటో ఆపు!" అన్నారు
బామ్మగారు. ఆటో ఆగింది
మాట్లాడారు అయ్యాక
ఒరేయ్ ఆటో! తొందరగా పోనీ..
మళ్ళీ సెల్ "హలో! హలో...."
"ఆటో ఆపు" అన్నారు
బామ్మగారు. ఆటో ఆగింది.
"ఆఁ చెప్పు కామూ ఆటోకా ? ఆరువందలు...
అంతక్కరలేదా...హలో హలో....అయ్యో! కట్ అయిపోయింది."
అయ్యాక ఒరేయ్ ఆటో! తొందరగా పోనీ నాయనా.."అని
"ఒరేయ్ ప్రసాదూ ..ఎక్కువ పెట్టామంటున్నాడురా కాముడు మామయ్య.
దిగేటప్పుడు అంత ఇవ్వకురోయ్." బామ్మగారు రహస్యంగా చెప్పినా
చెప్పిన రహస్యం . కి కనపడింది ప్రక్క అద్దంలోంచి ..
మళ్ళీ బామ్మగారి ఫోన్ రింగయింది.
"ఆటో ఆపు" అన్నారు బామ్మగారు.
ఆటో ఆగింది...
ప్రసాదరావుకి చిరాకేస్తోంది
"నువ్వు పోనీయ్" అన్నాడు . ని ప్రసాదరావు.
కొంచెందూరం కూడా వెళ్ళకుండానే
"ఆటో ఆపు" అనలేదు బామ్మగారు
అయినా ఆటో ఆగింది...ఈసారి . ఫోన్.
అతగాడు మాట్లాడాక ఎవరూ చెప్పకుండానే ఆటో బయల్దేరింది.
ఆటో ఆపు" సారి ప్రసాదరావు అడిగాడు
ఆటో మళ్ళీఆగింది.
"ఏంటి?" అన్నారు బామ్మగారు.
చిటికిన వ్రేలు చూపించాడు ప్రసాదరావు. "బామ్మా! అర్జంటే" అంటూ
"ఒరేయ్..బాబూ ఇలా అయితే కాముడి గృహప్రవేశం అయిపోతుంది..
త్వరగా కానీయ్ " మళ్ళీ బామ్మ ఔదార్యం ప్రకటించారు.
అప్పటిదాకా ఉగ్గపట్టుక్కూర్చున్న ప్రసాదరావు గబుక్కున ఆటో దిగి
చెట్టు చాటుకి పరుగెత్తాడు..
"ఇంతసేపేమిటిరా" అని గావుకేక పెట్టారు..పొలం పనులు చేసుకునే స్త్రీ మూర్తులు
ఉలిక్కిపడి...తమాయించుకుని ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ మళ్ళీ పనిలో
పడ్డారు. పని ముగించుకుని ప్రసాదరావు వచ్చాడు.
."కాసేపు ఆగలేవట్రా ?"అని గదమాయించారు బామ్మగారు.
"ఇప్పటిదాక చేసినదదేకదే"
అని ఆటో ఎక్కాడు ప్రసాదరావు. ఆటో పరుగెత్తింది...ఆరి వెలిగే సీరీస్ బల్బుల్లా
ఆగుతూ నడుస్తూ మొత్తానికి రామనారాయణ పేటలోని గృహప్రవేశ గృహానికి చేరింది ఆటో
"ఒరేయ్ బామ్మ వచ్చిందిరా".....గృహప్రవేశం వేదిక దగ్గర కోలాహలం ప్రారంభమైంది..
"ఎవరో వి పి కవర్ చెయ్యకపోతే ఎలా?" అని వీడియో ఇటు కళ్ళు తిప్పింది..//
"అమ్మో ఎవరో వి..పి వాయించకపోతే ఎలా?"..తూతూ వాళ్ళు గట్టిగా వాయించారు..
"డోలైనా పగలాలి, చేతిలో కర్రైనా విరగాలి వచ్చింది వి..పి" అనుకుంటూ
ఫుల్ బ్యాండువాళ్ళు జబ్బ సత్తా చాటుతున్నారు.
హడావుడికి పొత్తిళ్ళలో పిల్లలు కేర్ మన్నారు... గందరగోళానికి
నూతన గృహంలో ప్రథమ ప్రవేశం సాంప్రదాయ బద్ధంగా చేయడానికి వచ్చిన గోమాత బెదిరింది..
తోక పైకెత్తింది.. అవిశ్రాంత ఊపిరులు లోపలికి బయటికీ ...దానివల్ల వచ్చేధ్వనులతో ఊగిపోతోంది.
కొమ్ములు పొజిషన్ లో పెట్టింది. గింజుకుంది..ఇలాంటి గృహప్రవేశాలు పాపం గోమాతకు
అరంగేట్రమట.. గింజులాటలో దాని తాడు తెగింది... దాని రక్షకుడు విషయం అర్థం చేసుకునేసరికి
అది జనం మధ్యలోకి దూసుకు వెళ్ళింది...ఎదురుగా ఎర్రరంగు ఆడ పట్టుచీరలు, అదేరంగు పిల్లఆడ
పట్టుపరికిణీలూ, అదేవిధమైన ఓణీలు చూసి మరీ రెచ్చిపోయింది...కంగారుకి గోమూత్రం, గోమయం
గోమాత నుండి బయలు వెడలాయ్..."ఒరేయ్ కాముడూ.. గోమూత్రం చాలా శుభప్రదమురా..మార్జనం
చేసుకో" అంటూ బామ్మగారు గోమూత్ర సేకరణకు ఆవు వెనకాల స్టెప్పులు వేస్తున్నారు...
"నేనిక్కదున్నానే బామ్మా"... భయంతో మేడ ఆఖరి మెట్టుమీదున్న గృహప్రవేశంకొడుకు కేకపెట్టాడు.
"ఓరేయ్ గోరక్షకా దాన్ని అదుపు చేయరా...పశుపాలకా పట్టుకోరా..."అని కొంటె
కుర్రాళ్ళు తెలివిగా అంటున్నామనుకుంటూ తెలియకుండా కృష్ణ స్తోత్రం చేస్తున్నారు...
గోపాలుడు... ఆవును అనునయిస్తూ, బుజ్జగింపు మాటలతో ముందుకు ఒక అడుగు,
వెనక్కి మూడడుగులూ వేస్తూ బెదురుతూ బెదురుతూ దానివెంట పరుగెత్తడ మారంభించాడు....
గోమూత్ర సేకరణలోనున్నబామ్మగారుక్రింద చూసుకో లేదేమో...దఢేలుమని గోమయంలో కాలు జారారు...
సారీ పడ్డారు... వెనకనే వస్తున్న పశుపాలకుడు చూసుకోలేదేమో, అంత శాల్తీ కాళ్ళకడ్డం పడేసరికి
ముందుకు దాటబోయి...టలేక బోరగిల పడ్డాడు...అతడు కట్టుకున్న లుంగీ పట్టు సడలింది...
బామ్మగారి పరిస్థితి ఇరకాటంలో పడింది..వెనక్కెడితే అసహ్యంగా పవిత్రమైన గోమయం..ముందు
అంతకన్నా అసహ్యంగా దిగంబరం..."ఒరేయ్..అలా చూస్తూనించోకపోతే వాడి మానం కాపాడొచ్చుగా..."
అథారిటీ...సిగ్గు కలసిన ఎక్స్ ప్రెషన్ తో, సప్రెస్డ్ వాయిస్ తో అన్యాపదేశంగా ఒక్కసారి
అరిచారు బామ్మగారు...పశుపాలకుడు దెబ్బకి ఉలిక్కిపడి లేచి పరిస్థితినర్థం చేసుకున్నవాడై లేచి
పరుగే పరుగు......అఫ్ కోర్స్ లుంగీ పట్టుకునే........

********************