Pages

Friday, September 30, 2011

పో.... నో.... ఉ....


(కొంత కాలం క్రితం ETV లో "నవ్వితే నవరత్నాలు" అని ఓ హాస్య కార్యక్రమం వచ్చేది..రాత్రి పదిన్నరకు వచ్చేది..ఈ తరహా కార్యక్రమాలకు అది మొదలేమో కూడా...ఇప్పటిలా సినీమా ఓరియంటేడ్ గా కాకుండా ప్రేక్షకశ్రోతలను కూడా పాల్గొనేలా చేస్తూ ఆసక్తిదాయకంగా సాగేదా కార్యక్రమం..మొదట్లో అశోక్ కుమార్ (టి.వి ఆర్టిస్ట్, సినీమా ఆర్టిస్ట్ ) నిర్వహించేవారు. తర్వాత ఎ.వి.యస్ లాంటి వారు నడిపారు...ప్రేక్షకులవ్రాసిన జోకులు చెప్పేవారు...స్పందించి వ్రాస్తే బాగున్నవి తీసి చదివేవారు.. దానికోసం వ్రాసిన నా ఈ స్పందన...మీ ముందుంచుతున్నాను.. మీరు చదవాలని..మీ టేస్ట్ చాలాగొప్పది... మీరు చదువుతారు... చదవండి మరి... ఇంకో విషయం:: ఇది చదివాక మీరు ఈ రెండు ప్రశ్నలకు సమాధానాలు నా బ్లాగులో పోస్ట్ చేయండి...1) ఇది అశోక్ కుమార్ గారు చదివారా, ఎలా స్పందించారు ? 2) అసలు ఈ పోస్ట్ టైటిల్ పో.నో.ఉ అంటే ఏమిటి?.... త్వరలో మీ జాబుకోసం ఎదురుతెన్నులు...)


హలో అశోక్ కుమార్ గారూ !
న మ స్తే !!!

ఏమిటి - ఏమిటి - ఏమ్టి బాబూ ?
మేము ఉత్తరాలు రాయాలా? అవి మీరు చదువుతారా ? మాకందరికీ నవ్వులు రాలాలా?
అందులోంచి క్రొత్త క్రొత్త రత్నాలు మీరు ఏరుకుంటారా ?
అబ్బా ! ఎంత ఆశ?
అయినా...ఇది నవ్వుల టైముటండీ...

హౌస్ వైవ్స్ అందరూ పగలంతా
అలసి అలసి సొమ్మసిలిపోయే వేళ

హౌస్ హస్బెండ్స్ అంతా ఆఫీసుల్లో
పగలంతా సొలసి సొలసి - ఆ టెన్షన్ తో
ఇంటికొచ్చి - ముద్దులొలికే చిన్నపిల్లల
చిలిపి అల్లరికి ఆఫీసు కోపంతో అరచేవేళ

అప్పటిదాకా సశేషమే కాని శు భ మ్ ఎప్పుడో తెలియని
బుల్లితెర సీరియల్స్ చూ సి .... చూ సి....
విసిగి వేసారి ఇల్లాళ్ళు జుత్తు పీక్కొనేవేళ

అలవోకగా ఆవులింతలు కమ్ముకొనే వేళ
మ ము నవ్వింపగ న డ చీ వచ్చితివా ...అ శో కా....

మేం గిలిగింతలు పెట్టాలిట.... గొడవ గొడవ చేయాలిట.... ఈ.టి.వితో పాటు ఈ నవ్వితే నవరత్నాలు ప్రోగ్రామ్ కూడా మాదేనట.. బాగుంది కాని బాబూ..అశోకా..."ఈ గొడవకి ప్రక్క ఇళ్ళవాళ్ళు ...కళ్ళెర్రజేస్తే, భాగ్యనగరాన ఉన్న మీకు ..మా ఈ అభాగ్యుల గోడు పట్టేనా ?" అని మేం అంటే ..."ఏం ఫర్వాలేదు, అందరూ ప్రోగ్రామ్ చూస్తూ సందడిగానే ఉంటారు...సందట్లో సడేమియా" అంటారు మీరు ...నాకు తెలుసు.
అయితే జోకుల పాడి ముళ్లపూడి వారన్నట్టు జోకులకు కూడా వేళా పాళా ఉన్నాయి కదా మరి....
శ్రీ ఆయన ఏమన్నారంటే...."ఆ యొక్క వానచినుకు..కాలే పెసరట్ల పెనంమీద పడితే ఇగిరి ఆవిరి అయిపోతుంది, అంతూ దరిలేని సముద్రంలో పడితే అడ్రస్సులేకుండా పోతుంది... అదే ఆ యొక్క వానచినుకు.. తామరాకు మీద పడితే ముత్యంలాగ ప్రకాశిస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యమే అయిపోతుంది.... ఓ చదువరీ ! జోకులు కూడా అంతేస్మీ.." అని.
అలాగే మీ జోకు కూడా.... అలసిపోయిన హౌస్ వైఫ్ వింటే వారి నిద్రలో కలసిపోతుంది: ఆఫీస్
హేంగోవర్ తో వచ్చిన హౌస్ హబ్బీస్ వింటే వళ్ళు మండిస్తుంది; పొరపాటున ముగింపుకొచ్చిన
సీరియల్ చూసి ఆనందించబోయే బుల్లితెర ప్రేక్షకుడుచూస్తే ముద్దు ముద్దుగా నవ్వేస్తుంది.,
నవ్వులతో నవనవలాడే నవ్యదంపతులు చూస్తే నవరత్నాలే రాలుస్తుంది... ఇంతకీ "మీ సొమ్మేంపోయింది..ఉచిత సలహాలు ఎన్నైనా ఇస్తారు" అని మీరు అనుకోదలస్తే... అంత
లేట్ నైట్ కాకుండా కొంచెం ముందుకు ప్రోగ్రామ్ జరపమని మనవి....

ఈ గొడవంతా ఎందుకు ...మాకో జోక్ చెప్పగలిగితే చెప్పండి... ఆర్ రాయగలిగితే రాయండీ...
అంటారా ? ఓ.కే. ఈ ఉత్తరం చివరన ఓ పెద్దజోకుకి బాక్స్ కట్టాను. చూడండి.....అరెరె...ఏంటా తొందర... నాఉత్తరం ఇంకా పూర్తవలేదు...కొంచెం ఆగండి.....
ఎందుకంటే పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టాలి...ప్రేక్షకుడు దొరికినప్పుడే సీరియల్ లాగాలి.,
పాఠకుడు దొరికినప్పుడే అక్షరాలు పెంచాలి.
అయినా అశోక్ కుమార్ గారు!..మీకు అన్నింటికీ తొందరే..అందుకే మిమ్మల్నిచూస్తే అందరికీ జాలి....ఆ సత్యనారాయణ పొమ్మన్నాడు, ఆ వర్షంలో ఆ రాత్రివేళ ఆవిడ్ని ఒదిలేసి పోయారు..ఏమైంది ... కొంప మునిగింది... వాహ్ ఏం చేసారండి బాబు? స్క్రీన్ మీద వర్షం, కళ్ళల్లో జడివాన...మూర్తీభవించిన సశోకుడే....
అన్నట్టు నేను కూడా నటుడ్నేనండోయ్... అదే మరి ? నట్టులా అంటూ "టు" మీద అంత స్ట్రెస్ అక్కరలేదు. ఆఁ నిజంగా నటులమే. మాలోని నటుడికి మరీ గెడ్డాలు, మీసాలు లేకపోయినా రవీంద్రభారతి స్టేజి లాంటి స్టేజ్ మీద నటించానని గర్వంగా తలచుకున్నప్పుడు..లేని మీసాల
స్థానంలో ఓ ముద్ర వేస్తాడు.. గడ్డాలు మీసాలు పెంచుకుని ఎదిగిన మీ నటన "పెళ్ళిపుస్తకం"లో ఓ ఓపెన్ పేజీ.. (సీక్రెట్ పేజీలు మనవికాదుకదా).
మీతో మాట్లాడుతుంటే కవిత్వం పొంగుకొచ్చేస్తోంది...హేమిటో..... నాలోని కవి మీసాలు గడ్డాలు పెంచుకోవడానికి అవకాశంలేక....ఎందుకంటే కవులకు మీసాలు గెడ్డాలు ఉన్నట్టుగా సినీమా చారిత్రిక ఆధారాలు లేవు...(గమనిక: "కాళిదాసు"పాత్రలో శ్రీ నాగేశ్వరరావు గారు భోజరాజు ఆస్థానంలోకివెళ్ళాక అప్పటిదాకా వున్న అవన్నీ తీసేసారు.) వీరవిజృంభణ చేసేస్తున్నాడు...అవకాశమొస్తే మళ్ళీఛాన్సు తీసుకుందువుగానిలే అని "జోకె"డ్తున్నా.. ఇదిగో నండి పెద్ద జోకు బాక్స్ కట్టి మరీ చెప్తానన్నాను కదా.... ఈజిగా మీరు ఈ జోకు తయారు చేయొచ్చు...తెల్లకాగితం మీద పెద్ద జోకు అని మీ ఇష్టమైన భాషలో వ్రాయండి...దానికి బాక్స్ కట్టండి...అంతే

ఇంతకీ ఈ గెడ్డాలు మీసాలు రాని రచయిత ఎవరా అనా....నేనే. నా హాబీలు:: ఏముందండీ "హాస్యం" అని వినిపిస్తే చాలు చెవిమీద చెయ్యి వేస్తాను... కొయ్యడానికి కాదండీ.... వినడానికి....విని ఎన్జోయ్ చెయ్యడానికి... అలాగే...వినేవారుంటే హాస్యంగా మాట్లాడాలి అని ఓ సరదా....
ప్రస్తుతానికి మరి శలవు...హాస్యాభినందనలతో......

4 comments:

Anonymous said...

HANUMANTHA RAO GARU EEE PO......NO.....VU.....EMITANDEE.ARDHAM KALEDU .KASTA VIDAMARCHI TELIYACHEYANDI.(ANTE VIPPI CHEPPANDI ANI NAA BHAVAMU)MEE HASYAVALLARI KI MEE ANDARAKU VIJAYA DASAMI SUBHAKANKSHALU.

MEE

SHASTRI@ VIZAG

మిస్సన్న said...

చాలా బాగుందండీ! హ్హాహ్హాహ్హా !
అంత పేద్ద ఏనుగు యెంత హడావిడి
చేస్తుందో అనుకున్నారట.
కడకి పేద్ద జోక్ బాక్స్ తయారు చెయడం అలానా!

పో అంటే ఫోను, ఉ అంటే ఉత్తరం నో అంటే ????????
నో నో నో తెలియడంలేదు.

హనుమంత రావు said...

డియర్ సుబ్బారావుగారు, శాస్త్రిగారు... ---- నా పో... నో.... ఉ చూసారు స్పందించారు. ఎవరూ స్పందించకపోతే అందరికీ తెలిసినదేమో అనుకున్నా ....ఇక నా రెండు ప్రశ్నలు----1.ఇది అశోక్ కుమార్ గారు చదివారా, ఎలా స్పందించారు.
2. అసలు పో...నో...ఉ...అంటే ఏమిటి? దానికి సమాధానాలు....1. అశోక్ కుమార్ గారు స్పందించలేదు.. స్పందించాలంటే
చదవాలి కదా....చదవాలంటే--ఉత్తరం అందుకోవాలి కదా.. అందుకోవాలంటే నేను పోస్ట్ చెయ్యాలి కదా.. అదే రెండవప్రశ్నకు జవాబు...... 2. పో.. నో... ఉ.... అంటే పోస్టుకు నోచుకోని ఉత్తరం ..... ఇలాంటి పో.. నో.. ఉ... లు మీ ఇంట్లోనూ ఉంటాయి.. గమనించి... ప్రకటిస్తే... మనం నవ్వులు పంచుకోవచ్చు...

మిస్సన్న said...

పో... నో.... ఉ బలే ఉందండీ! మళ్ళా నా పై కామెంటే!