నవ్వడం ఒక భోగం, నవ్వకపోడం ఒక రోగం........ఈ వల్లరికి మరికొన్ని చిగుళ్ళు. నా లోకి నేను, నా తో నా సగం, నాడూ నేడూ రేపూ మీతో నేను.
Friday, December 9, 2011
కాశీ ప్రయాణం ... కాశీ - 2
సంకట మోచన హనుమాన్ ఆలయం.. తులసీదాస్ నిర్మించిన ఆలయం.. శైవ వైష్ణవ బేధాలు విపరీతంగా ఉన్నప్పుడు జన్మించిన తులసీదాస్ కారణ జన్ముడు... హనుమ సాక్షాత్కారంపొంది ఆ స్వామి సహాయంతో శ్రీరామదర్శనం పొందిన గోస్వామి తులసీదాస్ శ్రీరామచరితమానస్ గ్రంథం వ్రాసారు.. అందులో సాక్షాత్తూ శివుడు శ్రీరామకథను పార్వతికి వినిపిస్తాడు.. స్థానికులు మాటలాడే అవధీ భాషలో ఆ గ్రంథాన్ని వ్రాయడం ఒక విశేషం. అది ఆ మహనీయుని సామాజిక స్పృహ..అక్కడ పండితపామరులు సైతం శ్రీరామచరితమానస్ నిత్యం పఠిస్తారు... అలవోకగా గానంచేస్తారు...బిల్వదళాలపై సిందూరంతో "శ్రీరామ" అని వ్రాసి కాశీవిశ్వనాథుని పూజిస్తారు ఈ నాటికీ.. కార్తీక శుద్ధ చతుర్థినాడు బిందుమాధవుని బిల్వదళాలతోనూ, కాశీవిశ్వనాథుని తులసీదళాలతోను అర్చించడం శివునికి విష్ణువుకీ అబేధమని చెప్పడానికే.. ఆ పూజ బిందుమాధవుని ఆలయంలో చూసే భాగ్యం కలిగింది. సంకటమోచన హనుమాన్ ఆలయం లోపలకి వెళ్తుంటే కిష్కింధలోంచి ప్రయాణమే. కోతులు ఆప్యాయంగా పలకరిస్తూనే ఉంటాయి. ఓ కోతి నా అంత ఎత్తుగా లేచి నాదగ్గరగా వచ్చి నా చేతిలో స్వామికోసం తీసుకెడుతున్న దండ లాక్కోబోయింది.. నే నివ్వనని పెనుగులాడా.. ఆ దండలోని ఓ పుష్పాన్ని పట్టుకు పోయింది...ఆ కోతి. కాశీలో శివునితో సమానంగా హనుమ విగ్రహాలు ప్రతిష్టింప బడ్డాయేమో అనిపిస్తుంది... మణికర్ణికా ఘట్టంలో దేవతలు సయితం మధ్యాహ్న సమయంలో గంగా స్నానం చేస్తారుట. ఆ సమయంలో అక్కడ స్నానం చేసాము.. తిలభాండేశ్వరుని, గౌడీ మాతను దర్శించాము. ఎవరో ఇల్లాలు వంగనారు పోస్తే లింగనారు వచ్చింది అని చెప్పబడే జంగంబాడీలోని శివమూర్తులను చూసాము ... లోలార్క కుండ్ లో స్నానం ఓ ఆనందానుభూతి. అక్కడకు దగ్గరలోని అస్సి ఘాట్ లో తులసీదాసుకు హనుమ దర్శన మిచ్చినచోటు, గోస్వామి పాదుకలు మొ.నవి చూసాను. హనుమాన్ ఘాట్ దగ్గర కంచి పీఠానికి దగ్గరలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితార్ యొక్క గురువుగారి సమాధి ఉంది. ఆ గురువుగారు దీక్షితార్ చిన్నవయసులో ఉన్నప్పుడు వారుండే గ్రామానికి వెళ్ళి తలిదండ్రులను అడిగి దీక్షితార్ ను తనతో తీసుకువచ్చారట.. తన దగ్గర సంగీతం నేర్పడమే కాకుండా శిష్యునిచేత శ్రీచక్రార్చన చేయించెడివారు.. ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి తనకు అమ్మ దర్శనభాగ్యం లేదా అని గురువుగార్ని అడిగారు.. సాధన చెయ్యరా అన్నారుట గురువుగారు.. ఒక రోజు గంగాస్నానం చేస్తూ ముత్తుస్వామి దీక్షితార్ రెండు మునకలు వేసి మూడవ మునక వేసి లేచే టప్పటికి అతడి చేతిలో ఒక వీణ ఉన్నదట.. ఆశ్చర్యచకితుడయి శిష్యుడు పైకి చూసేసరికి మెట్లమీదుగా గురువుగారు దిగుతూ "ఏరా అమ్మ అనుగ్రహించిందా" అన్నారుట.. అద్భుతమైన వీణను చూపించాడు శిష్యుడు పరవశంతో... (కమాను సాధారణంగా క్రిందభాగానికి వంగి ఉంటుందట కాని ఆ వీణకమాను పైకి ఒంగి ఉందట.. ఆ వీణ ఇప్పుడు చెన్నైలో ఉన్నదట..) గురువుగారు నవ్వి శిష్యుని భుజం ఆప్యాయంగా తట్టి నదిలో స్నానానికని దిగారు... "వస్తానురా" అని శిష్యునికి అక్కడినుంచే చెప్పి జలసమాధిలో తనువు చాలించారు.. ఆయన పార్థివ శరీరాన్ని కాశీలో తర్వాత సమాధి చేసారు. కార్తీక పున్నమి ఉత్తరాదిని "దేవదీపావళి"గా జరుపుకుంటారు...గంగానదీ తీరంలో ఉన్న ప్రతి ఘాట్ లోనూ దీపాలు పెట్తారు.. విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. బాణసంచా విపరీతంగా కాలుస్తారు... ఆ వెలుగుల ఉత్సవాన్ని పడవ చేసుకుని గంగానదిలో తిరుగుతూ చూసి ఆనందించాము. "కాశీలో ప్రతి ఇసుకరేణువూ శివలింగమే" అంటారు గురువుగారు... నేను ఇక్కడ వ్రాసిన కాశీ విశేషాలు శ్రీశర్మగారి నోట విన్నవే.. శివుడుకూడా లెక్కించలేడట కాశీలో ఉన్న శివలింగాల్ని... "కాశీ" అని అంటే చాలు కైవల్యమే,,,,పరమ శివునికి ఈ క్షేత్రమంటే పరమప్రీతి.. ప్రళయకాలంలో కూడా తన త్రిశూలంతో ఈ క్షేత్రాన్ని పైకెత్తి పట్టుకుంటాడట...కాశీలో మరణం జన్మరాహిత్యమే.. ఇక్కడ మరణించిన జీవులకు పరమేశ్వరుడు కుడి చెవిలో తారకమంత్రం ఉపదేశిస్తాడట.. అమ్మ తన పమిటతో ఆ జీవునికి విసురుతుందట.. గణపతి, కుమారస్వామి పరిచర్యలు చేస్తారట.... కాశీ మరణంవలన సంసార పాశబద్ధులై జననమరణచక్రంలో పడికొట్టుకునే ఆ జీవుల పాశాలను అమ్మ విప్పేస్తే పరమేశ్వరుడు వారికి కైవల్యప్రాప్తి కలిగిస్తాడు... తన అంతర్ దృష్టి తో ఆ విషయం చూసి గ్రంథస్థం చేశారు రామకృష్ణపరమహంస. కాశీ ఒక్కటే మహా శ్మశానంగా చెప్పబడుతున్నది... ఆనందంగా శివుడు ఇక్కడ విహరిస్తూ ఉంటాడు.. ప్రతి పూజాసంకల్పంలోనూ, స్నాన సంకల్పాలలోనూ "ఆనందకాననే మహా శ్మశానే" అని పండితులు అదే చెప్తారు.. అలా వింటూ ఉంటే ఏదో ఆనందానుభూతి... ఈ యాత్రలో సన్యాసి జీవనం గడుపుతున్న ఒక స్వామి ఓరోజు కనపడ్డారు. అప్పుడు నేను గురువుగారితో ఉన్నాను. గురువుగారు వారికి తెలుసు. ఆయన గత చాలా కాలంగా కాశీలో ఉంటున్నారు. ఆయన ప్రసంగ వశాత్తు చెప్పారు. కాశీలో ఎన్నో రహస్యాలున్నాయిట. లలితాంబ ఆలయం గంగ ఒడ్డున ఉన్నది.. అక్కడ రాత్రిళ్ళు ధ్యానం చేస్తే విశ్వనాథుని సేవించడానికి గంగానదిలోంచి వచ్చే దివ్యయోగినులు దివ్యలోకాలనుంచి రావడం దృశ్యమౌతుందట. నాగకన్యలు నిత్యమూ ఓంకారేశ్వరుని అర్చిస్తారట... దత్తాత్రేయులవారు ఆ పుణ్యభూమిలో నిత్యమూ విహరిస్తారట.. భావజగత్తునుండి చూస్తే ఇలాంటి అద్భుతాలు కన్నులకు గోచరమవుతాయట. ఏవిధమైన నమ్మకంలేకుండా ఆ దివ్యక్షేత్రంలో దేశదిమ్మరిలా తిరిగినా జన్మరాహిత్యం తధ్యం.. అన్నారాయన...మనకి కనపడవేమిటి అనే ప్రశ్న సహజం. కాని మనకున్న అర్హత ఏమిటి? అని అనిపించదు..... తపించాలి.. తపిస్తే.... తపిస్తే....ఆయన అనుగ్రహం.... మనక్షేత్రాలు కేవలం విహార ప్రదేశాలు కాదు... అవి దివ్యానుభూతులు కలగజేసే దివ్యధామాలు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ దివ్యక్షేత్ర దర్శనం పూర్తి చేసుకుని గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారిదగ్గర శలవు తీసుకుని 15వతేదీ ఉదయం పన్నెండుమంది గల మా చిన్నిబృందం traveller van లో ప్రయాగ బయల్దేరింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment