Pages

Saturday, March 31, 2012

శ్రీ రా మ న వ మి

         
అమ్మ ,  నాన్నగారు  రామభక్తి రుచి చూసారు.. చూపారు....అదే అందిందేమో

"శ్రీపతియు దశర థాత్మజుఁ    డా పలువేలుపులు, నొక్క టం చెంచియు, సీ
తాపతి మా యిలువేల్పు, గృ   పాపరుఁ డౌట,మదిఁ గొల్తు భక్తిన్, రామున్! "
(నాన్నగారు, దినవహి సత్యనారాయణగారు,  తులసీ రామాయణానికి
తెలుగు వచనానువాదం చేసారు. అందులోని ముందు పద్యమిది.)

శ్రీ  రా మ   న వ మి... 'రామ' అంటేనే ఒళ్ళు ఝల్లు మంటుంది..

తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా
నిను తలచినంతనే నా తనువేమో ఝల్లుఝల్లనేరా!.....    ..... ..   ...( త్యాగరాజ స్వామి)

శ్రీరామ భక్తితో నిండి పోయిన మనస్సు పలికే గానమెలా ఉంటుంది అంటే ...
కేరళరాష్ట్రంలోని  కన్హన్ గాడ్లో ఆనందాశ్రమం ఉంది. . దాని వ్యవస్థాపకులు శ్రీ రామదాసు. పూర్వాశ్రమంలో 
ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాతాధికారి. తన మనసు రామునికి అప్పజెప్పి.. రామాజ్ఞగా దేశమంతా తిరిగారు.. జేబులో డబ్బులు తస్కరింపబడినా అది రామాజ్ఞగా భావించారు.. యాచకుడిగా భావించి మరో యాచకుడు తనతో భిక్షాటనకు తీసుకు వెళ్తే రామాజ్ఞగా భావించారు. రాముడే రాముడే  రాముడే . తన  అనుభవాలన్నీ  In search of  Truth అనే తన పుస్తకంలో అద్భుతంగా వ్రాసారు.  ఆయనకు అంతా శ్రీ రాముడే. ఆయన ఆశ్రమం చూడడానికి మన రాష్ట్రంలోని గుంటూరుప్రాంతానికి చెందిన ఒక స్వామిజీ వెళ్ళారుట. ఆ రామదాసుగారు మన ప్రాంత స్వామిజీకి తన ఆశ్రమంలో ఉన్న తోటను చూపిస్తూ...  పళ్ళతో నిండిన టమోటా మొక్కను చూపి, ఈ పళ్ళను మీ తెలుగుభాషలో ఏమని అంటారు అని అడిగారట. గుంటూరు ప్రాంత స్వామి తనప్రాంతంలో టమోటాను "రామములక్కాయ" అంటారని చెప్పారట. "రామ" శబ్దంవినగానే  ఆ రామదాసుగారు పులకరించిపోయారు... ఆనందాశ్రువులు రాలుస్తూ ఆ టమోటా పండును చూస్తూ..తన శ్రీరాముని ఎర్రటి కపోలాలను, నిగనిగలాడే మేని ఛాయను, నయనానందకరరూపాన్ని ఆ ఎర్రటి పండులో  చూస్తూ ఆనందంతో పొంగి పోతూ నృత్యం చేసారట... అదే తలచినంతనే నా తనువేమో ఝల్లు ఝల్లుమనేరా.....ఆ ఆనందానుభవం భక్తుడి స్వంతం. 

కౌసల్యా సుప్రజా రామా" అంటూ మేలుకొలిపి ..
"రామా లాలి-మేఘశ్యామా లాలి"  అని బజ్జో పెట్టేదాకా రామునితోనే ఊసులాడతాడు భక్తుడు. 

"ఉల్ల మలరించు కౌసల్య పిల్లవాడు, కూర్మి చెలువారు దశరథు కుఱ్ఱవాడు
అరసి జనకుని నచ్చిన యల్లువాడు, సీత మనసార వలచిన చెలువు వాడు" ... 
(స్వర్గీయ గుడిపూడి ఇందుమతీ దేవిగారు)
అంటూ తన చిన్ని రామప్పను తనివితీరా ... మనస్సునిండా ... ప్రేమమీరా పలకరిస్తే 

"ధరకేతెంఛిన విష్ణురామ !  వరసీతారామ ! దైత్యాళి సం
హరరామా ! రఘురామ ! వందనమయోధ్యారామ ! సర్వజ్ఞస
ద్గురు రామా ! ఋషివంద్యరామ ! నతులో కోదండరామా ! పరా
త్పరరామా ! వనవాసరామ ! హనుమద్రామా ! మహానందని
ర్భరరామా ! మునివేషరామ ! వరదా ! పట్టాభిరామా ! వసుం
ధరభారోద్ధరరామ ! మ్రొక్కులివి యాత్మారామ ! నా గుండెలో
దరిసింతున్ శివరామ ! యేలుకొనరాదా ! రామ చన్ద్ర ప్రభూ !"        .... ("రామచన్ద్ర ప్రభూ" శతకం--శ్రీ సామవేదం)
అని కీర్తిస్తూ మురిసిపోతారు. 

"సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాదు తండ్రి
వాతాత్మజ సౌమిత్రి వైనతేయ రిపుమర్దన
తాత భరతాదులు సోదరులు.... "
ఎంత దగ్గరైపోయామో చూసావా..  ఓ వెర్రి మనసా .. అంతేకాదు

"పరమేశ వసిష్ఠ పరాశర నారద శౌనక శుక
సురపతి గౌతమ లంబోదర గుహ సనకాదులు
ధర నిజ భాగవతాగ్రేసరు లెవరో వారెల్లను
వర త్యాగరాజునికి పరమబాంధవులు మనసా !"...        ....       .....( త్యాగరాజ స్వామి)
రాముడే కావాలనుకుంటారు వీరు.  వీరందరూ ఇప్పుడు నా వారయి పోతారు కదమ్మా.... 

మేము రామునివారము.. 
వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదలయో ర్వాయ్వాదికోణేషు చ,
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీల సరోజ కోమల రుచిం రామం భజే శ్యామలమ్....
ఇంత రక్ష .. ఇంక మాకేల విచారము.   

అందుకనే
మ్రొక్కిన నీకె మ్రొక్కవలె.. మోక్షమొసంగిన నీవ ఈవలెన్
దక్కిన మాటలేమిటికి దాశరథీ!  కరుణాపయోనిథీ...!

అంతా రామ మయం.. జగమే రామమయం.. 
ఇన్ని భాషలేల, ఇన్ని వర్ణములేల 
"రా"యు - "మ"యును, చాలు "రామ"యనగ
"రామ" యనుచు పిలువ "రామా"యను జగతి
రాముడేలు జగము రమ్యముగను ... 
ఆ   
" - రా మా .... ఆ నామం ఎంత శక్తిమంతమో కదా !
"రా".. కలుషంబులెల్ల బయలంబడద్రోచిన "మా"కవాటమై
డీ కొని బ్రోచు...

ఎంత గొప్ప మంత్రమది... 
"మహా మంత్ర జొయి జపత మహేసూ | కాసీ ముకుతి హేతు ఉపదేసూ||
మహిమా జాసు జాన గన రావూ| ప్రథమ పూజిఅత నామ ప్రభావూ ||" ......              
"ఆ మహా మంత్రమును శివుఁడు జపించును. అద్దానినే కాశిలో ముక్తిహేతువుగ నాతఁ డుపదేశించును. అద్దాని మహిమను గణనాయకుఁ డెఱుంగును. ఆ నామప్రభావముననే యాతఁడు తొలుదొల్త పూజింపఁబడుచున్నాఁడు." (తులసీదాసు)

"సలలిత రామనామ సార జపము" ఆ మంచుకొండవాడికే తెలుసట..
అందుకే "శ్రీరామ రామ రామేతి" అంటూ అమ్మకు చెవిలో చెప్పాడు.. శ్రీరాముని నామ విశేషం చెప్పి 
ఊరుకున్నాడా? లేదే ?
"బంటురీతి కొలువీయవయ్యా రామా" అంటూ దిగి వచ్చేయలేదా....

"చిక్కని పాలపై మిసిమి జెందిన మీగడ పంచదారతో  మెక్కిన భంగి...." 
ఏలాగు  వివరింతురా నీ నామ రుచి,, 
నీ విమలమేచక రూపాన్ని
"అలక లల్లలాడగ గని ఆ రాణ్ముని ఎటు పొంగెనో.." ...రామా !

నీల మేఘ శ్యాముడు.... శ్రీరాముని......పోతనగారు చూసారు మనకోసం పోత పోసారు.

సీ|| మెఱుఁగు చెంగట నున్న మేఘంబు కైవడి నుగిద చెంగటనున్న నొప్పువాఁడు
చంద్రమండల సుధాసారంబు పోలిక ముఖమునఁ జిరునవ్వు మొలచువాఁడు
వల్లీ యుతతమాల వసుమతీజము భంగి బలువిల్లు మూఁపునఁ బరఁగువాఁడు
నీల నగాగ్ర సన్నిహితభానుని భంగి ఘనకిరీటము దలఁ గల్గువాఁడు

ఆ|| పుండరీకయుగముఁబోలు కన్నులవాఁడు, వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁడొక్కరుఁడు నా, కన్నుఁగవకు నెదురఁగానఁబడియె....     .....    ....(పోతనగారి భాగవతం)

రామా! నిన్ను,...
"కన కన రుచిరా కనకవసన నిన్ను....
పాలుగారు మోమున శ్రీ యపారమహిమ దనరు నిన్ను... కన కన రుచిరా.."....

రామో విగ్రహవాన్ ధర్మః .....  ధర్మమే తనువైన ఓ రామా....
"నాల్గు పాదాల ధర్మంబు నడుపువాడు ... నాల్గు పురుషార్థముల వెంట నడుఛువాడు
నాల్గు వేదాలు మెచ్చెడి నడకవాడు.... భూమిభారంబు వహించె మోదమలర"....(మావుడూరు రఘురామయ్య - రఘురామ రామాయణం)

మా కోసం వచ్చావా రామయ్యా.....
"మాకొఱకు జననమొందితి....రాకాసుల రాజుఁ జంపి రక్షించితి వౌ
లోకంబు లెల్లఁ గృపతో ... సాకేతపురాథినాథ ! సజ్జన వినుతా !"....     ...   ....      (మొల్ల రామాయణం)

రామా ... ఆదుకో తండ్రీ.....
"కరములు నీకు మ్రొక్కులిడ, కన్నులు నిన్నునె చూడ, జిహ్వ నీ
స్మరణ దనర్ప, వీను భవత్కథలన్ వినుచుండ, నాస నీ
యరుతను బెట్టు పూసరులకాసగొనన్, బరమార్థసాధనో
త్కరమిది చేయవే కృపను దాశరథీ ! కరుణాపయోనిధీ !"...     .....     .....    .....( రామదాసు-దాశరధీ శతకం)

మనస్సంతా నిండిన మంగళమూర్తీ.....మనస్సు దివ్వెలతో మంగళమయ్యా కళ్యాణ రామయ్యా.... హే! సీతాపతే !
నీ నామ రూపములకు - నిత్య జయ మంగళం.. 
పవమాన సుతుడు బట్టు - పాదారవిందములకు ....  |నీ|
ఓం శాంతిః..... శాంతిః .... శాంతిః
            ______()()()()()()()()()()()()()()()()()()()()()()()()()()______

[ఈ దేహము  సేకరించిన పుస్తకాలయంలో కొలువైన శ్రీరాముని ఊసులు ఇవి.....
 ఎందరో మహనీయులు అనుభవంతోపలికినవి ఆ  శ్రీరాముని ఊసులు ఇవి.....
పుంసా మోహనరూపుడు శ్రీరామునికి  మనసా, శిరసా నమస్కరించి...
హృద్యంగా చెప్పిన మహనీయులకు అంజలిఘటిస్తూ చెప్పుకుంటున్న ఆ శ్రీరాముని ఊసులే ఇవి ...]


                ~~~~~~~~()()()~~~~~~~

Sunday, March 25, 2012

రాజమండ్రి-2


 

రాజమండ్రి... మొదటిది.
రాజమండ్రి గురించే.... మరికొంచెం
                                                    .... డి.వి.హనుమంతరావు
నా బ్లాగులో రాజమండ్రి అని కనపడగానే  చాలామంది నా బ్లాగు చూసారు.. అంతమంది చూడ్డం నా బ్లాగు జీవితకాలంలో ఓ రికార్డ్. చాలా ఆనందమైంది.. "ఇంకా వ్రాస్తే బాగుంటుంది కదా" అని అభిమానం చూపారు... అందుకనే ఈ ప్రయత్నం.. రాజమండ్రి గురించే మరి కొంచెం.....

గోస్టేషన్...వహొ...రాస్టేషన్...కరాఆ...పవీబ్ర...ధనకట్టా....
మీకు గుర్తొచ్చేఉంటుంది.. కాని దీని గురించి తరవాత మాట్లాడుకుందాం..


1950..51 ప్రాంతంలో నా హైస్కూల్ ప్రవేశం.. "ఫస్ట్ ఫారం" అంటే ఇప్పటి "ఆరవ క్లాసు".. అనుకోవచ్చుకాని.. చిన్న తేడా ఉంది. మాకు ఇంగ్లీషు ఆల్ఫబెట్ ఫస్ట్ ఫారంలో చెప్పేవారు. ఇలా అని  నేను ఇప్పుడు నిజం చెప్పినా మా మనుమడు నవ్వుతాడు.. కాని అది నిజం... సరే ఈ ఫస్ట్ ఫారంలో చేరాలంటే "ఇంటూ ఫస్ట్ ఫారం" అని ఒక ఎంట్రన్స్ టెస్ట్ వ్రాయాలి.. అది నేను వ్రాసినప్పుడు, నా ప్రక్క మరో అబ్బాయి పరీక్ష వ్రాసాడు.. వాడికి నేనో, వాడు నాకో ఒక తెల్లకాగితం అప్పు ఇచ్చుకోవడమో - పుచ్చుకోవడమో జరిగింది..... ఆ ఋణానుబంధం - ఇప్పుడు నాకు వాడు వియ్యంకుడు.. ఇంక 'వాడు' అనకూడదు.. నేను ఆడపిల్లను ఇచ్చుకున్నవాడిని కదా... సరే ! స్ట్రెయిట్ లైనులోకి వద్దాం...
 పేపరుమిల్లు ఎదురుగా ఉన్న మా శ్రీరామనగర్ కు గోదావరి ఒడ్డున  పుష్కరఘాట్ దగ్గరగా ఉన్న ఆ మునిసిపల్ హైస్కూలు దగ్గర. అందుకని నన్ను అక్కడ చేర్పించారు..  ఆ స్కూలుకు ఎంత అందమైన ప్లేగ్రౌండో.. నిజానికి ఆ రోజుల్లో చాలా స్కూల్స్ కు చక్కని ప్లేగ్రౌండులు ఉండేవి. అక్కడక్కడ చెట్లు కూడా ఉండేవి.. మంచి మంచి మేష్టరులు.. రోజూ స్కూలుకి నడిచేవెళ్ళేవాళ్ళం. సుమారు అయిదారు కిలోమీటర్లుంటుందేమో... పుస్తకాలతో నిండిన సంచి ఒక చేతిలోనూ, రెండు గిన్నెల ఇత్తడి కారియర్ ఒకచేతిలో..మధ్యాహ్నం అన్నంతిన్నాక ఆ కారియర్లు కబుర్లు చెప్పుకుంటూ గోదావరికి తీసుకువెళ్ళి ఇసుక పెట్టి తోమి మరీ కడిగేవాళ్ళం.. ఇంటికొచ్చాక మళ్ళీ అమ్మ కడిగితేనే కాని ఆ ఎంగిలీ, మేము పట్టించిన ఇసుకమట్టి వదిలేవి కావనుకోండి ! వర్షాకాలమైతే చిన్నగొడుగు... అలా పొలో మంటూ పోవడమే. ఉదయం తొమ్మిదింటికి బయల్దేరి వెళ్తే సాయంత్రం పెత్తనాలు చేసుకుంటూ ఇంటికొచ్చేసరికి అయిదు అయ్యేది.. 
లాగుడు రిక్షాలుండేవి.. అప్పుడప్పుడు ఆ రిక్షా ఎక్కేవాడ్నండోయ్ !..మనల్ని కూచోపెట్టి డ్రైవరు రిక్షా ఎత్తితే ఆకాశం కనపడేది...  పొట్టప్పన్న ఉండేవాడు.. హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ రిక్షా లాగేవాడు. నలుగురం ఎక్కి నాలుగణాలు ఇస్తే చాలు... నోటితో కారు ధ్వని చేస్తూ...బ్ర్..బ్ర్...బ్ర్.. అంటూ పరుగెత్తేవాడు... ఎప్పుడయినా రిక్షా ఎక్కినా ఎక్కువగా నడిచే...స్కూలుకి వెళ్ళేటప్పుడు కాతేరు రోడ్డులో వచ్చి ఆర్యాపురం మధ్యవీధిలోకి తిరిగే వాడ్ని..ఆ వీధి చివర కొణితివాడ జమీందారు గారి ఇల్లు వుండేది.. ఆయన కొంచెం పొట్టిగా ఉండేవారు.. గులాబిపూవులా..ఎర్రగా ఉండేవారు... తెల్లది కాని, గులాబి రంగుదికాని, పంచె కట్టుకుని నవ్వుతూ ఉండేవారు. ఆయన్ని చూసి నమస్కారం పెట్టి స్కూలుకి వెళ్ళడం ఒక అలవాటు.. ఎందుకు పెట్టేవాడ్నో తెలియదు.. ఆ రోడ్ మీద వెళ్ళే స్కూలు పిల్లలందరూ ఆయనికి నమస్కారం పెట్టి మరీ వెళ్ళేవారు..  నవ్వుతూ లోపల్నించి వచ్చి ఆయన అందర్నీ పలకరించేవారు.. అప్పుడప్పుడు ఏ పండో ..చాకలెట్టో ఇచ్చేవారు. దానికోసమేమో తెలియదు.. స్కూలుకి ఆలస్యమవుతున్నా ఈయన్ని చూడ్డంమాత్రం మానేవాళ్ళం కాదు.. తరువాత ఫైర్ ఆఫీసుదగ్గర కిటికీలోనుంచి గోడ గడియారం చూడ్డం..అదో రొటీన్ లాగా...

గోదావరికి జులైనుంచి సెప్టంబరు వరకూ వరద రోజులు.. ఇప్పుడు మూలపడిన రైలు బ్రిడ్జి మీద నీటిమట్టం తెలిపే స్కేలు ఉంది..ఏదో పని ఉన్నట్టు అక్కడికి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడు వెళ్ళి వరద మట్టం చూసే వాళ్ళం.  ఏమాత్రం గోదావరికి నీరు తగిలినా రోడ్డుమీదకి వచ్చేసేది. ఇంటికెళ్ళి ఆ న్యూస్ ఆనందంగా అమ్మకు చెప్పడం...మోకాళ్ళలోతు నీళ్ళలో స్కూలుకి పోయేవాళ్ళం. నిక్కర్లేకదా ...పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు .. సరదా కూడాను. 1953 ఆగష్ట్ 15, మామూలుగా మేం జండావందనానికి వెళ్ళాము. ఫంక్షన్ అయిపోయింది.. హెడ్ మాష్టారు (శ్రీ కొఠే నరసింహరావుగారు) అనౌన్స్ మెంట్ చేసారు.. "ఇక్కడ్నించి మీరంతా తిన్నగా ఇళ్ళకు పొండి.. దారిలో పెత్తనాలు చేసారా.. నేను వచ్చి చూస్తాను... తాట వలుస్తాను.. గోదావరి ప్రమాదం కరంగా ఉంది" అని చెప్పారు. స్కూలుకి తూర్పు గోడ అవతల పెద్ద ఆంజనేయస్వామి గుడి.. అప్పట్లో అక్కడ రోడ్ వెడల్పు తక్కువ.. అక్కడ గోడకి స్కూలువైపు, గుడివైపు రెండు బల్లలు వేసి పెద్ద క్లాసు కుర్రాళ్ళని పెట్టి మమ్మల్నందర్నీ బల్లలమీద ఎక్కించి గోడ దాటించారు.. మేమలా కోటగుమ్మంవైపు నుంచి ఇళ్ళకు జేరాము.. ఆ రాత్రి కర్రల అడితీ ఉన్నచోట పెద్ద గండి పడింది.. ఇటు సీతంపేట నుంచి అటు ఆర్యాపురం వరకూ ములిగిపోయింది. ఇళ్ళ కప్పుల పైన రెండు మూడు నిలువుల ఎత్తుగా నీరు ప్రవహించింది. గండి పడింది - కర్రల అడితీలో అని చెప్పాకదా.. అక్కడ పెద్దపెద్ద మోకులతో కట్టిన వెదురు కట్టలు, దుంగలు ఆ తాళ్ళు తెగిపోయి ప్రవాహవేగానికి ఊళ్ళోకి మరఫిరంగుల్లా వచ్చి ఇళ్ళను కొట్టుకోడం.. ఇళ్ళు నేలమట్టమయిపోవడం. ఆర్యాపురంలో గాంధిగారి బొమ్మ ఉండేది.. పెద్దగాంధిబొమ్మ సెంటరు అని దానికి పేరు అదికూడా పడిపోయింది.. ఇప్పుడు చిన్నగాంధీ బొమ్మ ఉందికాని.. ఈ చిన్నగాంధీగారికి అంత పేరురాలేదు...పాపం. పేపరుమిల్లు దగ్గర ఉన్న మాకు నగరానికి లింకు కట్... మా అన్నయ్య రామాటాకీసులో సినీమాకు సెకండుషోకి వెళ్ళాడు.. కుర్చీల క్రిందకు నీళ్ళు వచ్చేసాయి.. ఆ ప్రక్కనున్న ఎవరింట్లోనో తలదాచుకుని మర్నాడు ప్రొద్దెక్కాక వచ్చాడు. ఊళ్ళోకి వెళ్ళాలంటే వీవర్స్ కాలనీ వైపున ఉన్న కోరుకొండ రోడ్ మీద వెళ్ళాలి. అయితే అప్పటిదాకా ఆ రోడ్ కు జనసంచారం అంతంత మాత్రం. అదీ కాక మా శ్రీరామనగర్ లో కూడ ఇరవై లోఫునే ఇళ్ళు.. మిగతా భాగం అంతా చెట్లూ మొక్కలూనూ..అటు తొర్రేడు, కాతేరు గ్రామాలు... ఇన్నీస్ పేట అన్నీ జలమయం అని చెప్పారు... మరి రెండు మూడు చోట్ల గండి పడిందని చెప్పారు..అసలు నాకు గండి అంటే తెలియదు.. పదేళ్ళకుర్రాడిని.అప్పుడంతా అమ్మచాటే కదా..... 16వ తారీఖు ఉదయం నాన్నగారితో కలసి సీతంపేట వెళ్ళి ఆ నీరంతా  చూసాము.. వీధుల్లో లాంచీలు, పడవలూ తిరిగాయి...మునిగిపోయిన ఇళ్ళల్లో మా భావి వియ్యంకుని ఇల్లు కూడా ఉంది.. వాళ్ళారాత్రి అక్కడే ఉన్న కృష్ణనగర్ కొండమీద (చిన్న గుట్ట) ఉన్నారుట. వాళ్ళని పడవల్లో మా ఇంటికి తీసుకువచ్చాము.. వాళ్ళేకాకుండా మా ఇంట్లో .. చాలా కుటుంబాలవారు తలదాచుకున్నారు.. మా పేటలో ఉన్నవారందరూ చాలామందికి ఆశ్రయాలు  కలిపించారు... అదో విచిత్రానుభూతి. డా.ఎ.బి.నాగేశ్వరరావుగారు అప్పుడు మునిసిపల్ చైర్మన్.. ఆయన తన ఇల్లు ములిగిపోతున్నా పట్టించుకోకుండా అందర్నీ ముందర్నించీ హెచ్చరిస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో చాలా సేవ చేసారు.. ఆ సేవ మరవలేనిదని ఇప్పటికీ చెప్పుకుంటారు.. ఈయన ఆంధ్రరాష్ట్రప్రభుత్వంలో టంగుటూరివారి నేతృత్వంలో స్వపరిపాలనశాఖామాత్యులుగా బాధ్యతలు నిర్వహించారు.. మంత్రిగా ఉన్నప్పుడుకూడా రాజధాని కర్నూల్ చుట్టుపట్ల గ్రామాల్లో స్వంతఖర్చులమీద వైద్య సేవలందించిన మహావ్యక్తి.. నిరాడంబరుడు.. ప్రాతః స్మరణీయుడు.
ఇప్పుడు గట్లు పటిష్టం చేసారు. పెద్ద ప్రమాదాలు తగ్గాయి.. ఇప్పటికీ వరదరోజుల్లో గోదావరి అందమే అందం.  మహరాష్ట్రలో వర్షాలు బాగా పడితే మా గోదావరికి వరదొస్తుంది.. దండకారణ్యంలోనుండి ప్రవహించుకుంటూ తనతోపాటు బోల్డు చెట్లను, విలువైన దుంగలనూ  తీసుకువస్తుంది. అవి పట్టుకోవడానికి ఈతగాళ్ళు ప్రవాహంలో ఈదుకుంటూ వెళ్తారు.. పనికొచ్చే దుంగలు కనుగొనడంలోనూ, ఎంతదూరంలో దాన్ని పట్టుకోగలరో, ఇవన్నీ అంచనా వేసి రేకు దొన్నెలమీద (వాటిని గుర్రాలంటారు) వాలుగా వెళ్ళి.. దుంగ పట్టుకుని ఎదురీదుతూ ఒడ్డుకు వస్తారు..తమాషాగా ఉంటుంది.. పాములు అవీ ఆ దుంగలమీద ఉండొచ్చు.. చాలా రిస్క్ తీసుకుంటారు. మరీ పెద్దవాళ్ళూ, ఆడవారు, పిల్లలు గట్టుప్రక్కన నిలబడి పెద్ద వెదురుకర్రతో చిన్నసైజు కంపల్నీ పొయ్యిలోకని సేకరిస్తారు... ఇదంతా తీరంవెంట కాపురాలుండే కొన్ని కులాలకు చెందినవారు చాకచక్యంగా చేస్తారు. గోదావరి  శాంతంగా ఉంటే పెరుగుతుందని.. గలగల పారుతూ ఉంటే తగ్గుతుందని .. అలాగ్గానే నిన్న ఎక్కడదాకా ఉంది.. ఈ రోజు ఎలా ఉంది.. ఇలా గట్టుమీదున్న నా లాంటివాళ్ళు అంచనాలు వేస్తూ ఉంటారు.. అదో తమాషా..... 

ఆ స్కూలులో నేను యస్.యస్.యల్.సీ దాకా చదివాను.. ఈ క్లాసు ఇప్పుడు ఇంటర్ లో కలిసిపోయింది.. స్కూలునించి వస్తూ నెమ్మదిగా,, వచ్చేవాళ్ళం. ఇప్పుడు అండర్ గ్రౌండ్.. అంటే రైలు ట్రాక్ అడుగున నడుస్తున్న మార్కెట్ స్థానంలో రైలు గేట్ ఉండేది.. ఆ గేటు దాటి మున్సిపల్ ఆఫీసు ముందరినుంచి వెడ్తూ ఉంటే గొప్ప సందడి.. రైలు గేటు దాటాక పెద్ద పోస్టాఫీసు వుండేది.. నిజంగా అది పెద్ద పోస్టాఫీసే .. పెద్ద బిల్డింగ్. బ్రిటిష్ వాళ్ళ టైములో దనుకుంటాను.. మోళీ సాయిబులు, చిలకప్రశ్నవాళ్ళు, జ్యోతిష్కులు, మూడుముక్కలాట్లవాళ్ళు.. అంతా కాలక్షేపమే.. మూడుముక్కలాళ్ళు మమ్మల్ని దగ్గరకి రానీయకుండానే పొమ్మనేవారు.. ఒక చోట మోళీ సాయిబు మోళీ చేసేవాడు.. చుట్టూ జనం... జనంకోసం మద్దెలవాయిస్తూ హడావుడి చేస్తూ ఉంటాడు..అందులో దూరేవాళ్ళం.. డప్పుకొడుతూ కొడుతూ...ఏవేవో మాట్లాడేవాడు...కూర్చుని ఉన్నవార్ని చేతులు కట్టుకోవద్దనేవాడు.. మధ్యలో వెళ్ళకూడదనేవాడు.. వాడి మాట వినని వాళ్ళు నెత్తురు కక్కుకొని చస్తారనేవాడు.. అంటూ చెప్పు తీసి నేలమీద గట్టిగా అరుస్తూ కొట్టేవాడు.. మా ప్రక్కనున్నవాడు దఢేలు మని మధ్యలో పడిపోయేవాడు.. నోట్లోంచి రక్తం.. మాకు భయం.. వెళ్ళలేము. ఉండలేము.. ఏదేదో చేసేవాడు.. కొంచెం పెద్దయ్యేదాకా వాడు వాళ్ళ మనిషే అని, ఇదంతా గొప్పనాటకమని మాకు తెలిసేది కాదు...ఇంకో చోట వెయింగ్ మెషీన్.. అర్థణాకు బరువుచూసుకుంటే ఓ గిప్ట్ ప్యాకు ఇచ్చేవాడు.. దానికి చాలా న్యూస్ పేపర్లు చుట్టేవాడు.. దానిలో చాలా గొప్ప బహుమతి ఉందనేవాడు... విప్పగా, విప్పగా,విప్పగా... ఓ పిన్నీసో, చంపపిన్నో ఉండేది.. పెన్సిల్ ఉంటే గొప్ప ప్రైజు అన్నమాట.. మరో చోట సైకిలు స్టాండు వేయకుండా సైకిలుకి తమాషాగా జేర్లబడి, ఓ ఈవినింగ్ క్యాపు, చేతిలో ఓ పెన్సిలు హస్తసాముద్రికమనేవాడు. ఇంగ్లీషు,తెలుగు కదంబం మాట్లాడేవాడు.. మేం కాలేజీలోకి వచ్చాకకూడా ఇతగాడ్ని చూసేవాళ్ళం.. రాజమండ్రి చుట్టుపట్ల ఊళ్ళకు కూడా వెళ్ళేవాడట...ఇంకో ప్రక్క చిలకప్రశ్నలవాళ్ళు.. ఓ గొడుగు, రెండొమూడో చిలకలున్న ఒక పంజరం, ముందు కార్డులు, భూతద్దం... పెట్టుకుని వచ్చేపోయేవాళ్ళకి జాతకాలు చెప్పేవాడు.. ఎంతోమందికి జాతకంచెప్పినా అతని జాతకం మారలేదు.. చాల కాలం కనపడేవాడు.. ఇవన్నీ చూసుకుంటూ.. గోకవరం బస్టాండు డౌనులో ఉన్న పంజాబీ మిఠాయికొట్టులో ఓ అర్థణాకి వేయించిన శనగపప్పు కొనుక్కొని ఒక్కో బద్దే తింటూ ఇంటికి చేరేవారం.

1951 కి అటూ ఇటూగా రాజమండ్రిలో సైకిలు రిక్షాలు ప్రవేశించాయి.. అప్పటిదాకా లాగుడు రిక్షాలే.. మరీ మొదట్లో నే ఎక్కలేదుకాని నెమ్మదినెమ్మదిగా అలవాటుపడ్డాం.. అప్పుడు సైకిలురిక్షా డ్రైవరుకి లైసెన్స్ వుండేది.. ఆ లైసెన్స్ పెద్ద ఇత్తడి బిళ్ళపై ఇచ్చేవారు,..అది చేతికి కట్టేవాడు. పాత సినీమాల్లోఈ లైసెన్స్ ఉన్న రిక్షావాళ్ళను చూడొచ్చు...ఓ సారి మేం స్కూలునించి వస్తుంటే ఓ రిక్షా వేగంగా వచ్చి రోడ్డుమీదున్న ఓ లావుపాటాయన్ని గుద్దింది. ఆయనకేమీ అవలేదు కాని రిక్షా ముందుచక్రం వంకర్లు పోయింది.. ఆయన రిక్షావాలా చెయ్యి పట్టుకుని, లైసెన్స్ లాక్కుని ఆ ఇత్తడి బిళ్ళను గట్టిగా నొక్కాడు.. అది అప్పడంలా అయిపోయింది.. ఆయన ఆ రిక్షా అతన్ని గట్టిగా చివాట్లు పెట్టాడు..పిల్లలు స్కూళ్ళనుంచి వచ్చేటైములో ఆ స్పీడేమిటని. ఆ తమాషా మేం చాలా ఆసక్తిగా చూసాము... అమ్మకి వర్ణిస్తూ చెప్పాము.

ఆ తర్వాత సంవత్సరమనుకుంటాను.. రాజమండ్రిలో సిటీ బస్ చూసాను.. నెం.1 తర్వాత నెం.2 వచ్చాయి.. ముందు ట్రైల్ నెం.1 పేపరుమిల్లుదగ్గరనుండి గోదావరీ స్టేషన్ దాకా వేసారు..  తర్వాత అది సాగి ధవళేశ్వరం ఆనకట్ట దాకా పొడిగింపబడింది.. పేపరుమిల్లు దగ్గరనుండి గోదావరీ స్టేషనుకు అణాన్నర పుచ్చుకునేవారు.. సీతంపేట అంటే మాతర్వాత ఉన్న పేటనుంచయితే అణా మాత్రమే.. 
ఆ సిటీ బస్సుమీద మొదట్లో నేను చెప్పిన "గో.స్టేషన్ వహో రా.స్టేషన్ కరాఆ పవీబ్ర ధనకట్టా అని రాసిఉండేది.. అంటే  హాల్ట్స్ అన్నమాట. గోదావరి స్టేషన్, వరదరావు హోటల్, రాజమండ్రి స్టేషన్, కర్నల్ రాజుగారి ఆసుపత్రి, పప్పువీరన్న బ్రదర్స్, ధవళేశ్వరం ఆనకట్ట.." వీటికి అది క్లుప్తీకరణ టికట్టు పైన కూడా అలాగే ఉండేది. అలా చదవడం ఓ సరదా... మన సోషల్ రికార్డులో వర్షపాతం నెలవారి నమోదు ఎక్సర్ సైజులో "జఫిమా ఏమే జూజులై ఆసె అనడి"..అన్నట్టు.. (జనవరినుంచి నెలలు సరిపెట్టుకోండి..). 
రాజమండ్రిగురించి ఇంకా చెప్పాలని వుంది.. ఇది బోర్ కొట్టలేదని మీరంటే మరో సారి.. ఈసారికి శలవు.

Thursday, March 22, 2012

ఉగాది శుభాకాంక్షలు

శ్రీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు

మాటలలో శుభం, మనసులో స్నేహం, ఆచరణలో హితం ... ఈ మూడూ కలిగినవాడే "మనిషి" అనిపించుకుంటాడు. ఈ మనిషితనాన్ని బతికించే విధంగా ధర్మవేత్తలు, గుంపుల్ని నడిపే నేతలు ప్రవర్తించినప్పుడు ప్రపంచశాంతి సుసాధ్యం.
అలాంటి సౌమనస్య భావన విశ్వంలో వ్యాపించాలని ఈ కాలం మలుపులలో నిలబడి వైదిక సూక్తులతో శుభాలను కాంక్షిద్దాం..

                               
                                    -----------శ్రీ సామవేదంవారి రచన " ఏషః ధర్మ సనాతనః " నుండి

Tuesday, March 20, 2012

హాసంక్లబ్... రాజమండ్రి... పుట్టి ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలయింది.

హాసంక్లబ్... రాజమండ్రి... పుట్టి ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలయింది..


2004వ సంవత్సరంలో మార్చి నెల వచ్చింది.. వచ్చిందా అండి ? ఆ నెలలో 20 వ తారీఖు... అదో విశేషమా ఇప్పటిలాగానే వచ్చిందికదా .. అనకండి.. ఆ రోజు ఇండియా పాకిస్థాన్ క్రికెట్ ఒన్ డే మాచ్ .. ఫైనల్స్... మరి ? అంతే కాదు తారణ నామ సంవత్సర తొలి రోజు... అంటే ఉగాది అన్నమాట... ఉదయమప్పుడు... స్త్రీమూర్తులు పండుగ వంటలు చేసే ఘుమ ఘుమల సమయం.. మగమూర్తులు వారి చేతి కాఫీ చప్పరిస్తూ టి.వీలకు హత్తుకు పోయే సమయం...ఆ సమయంలో.... ఆగండాగండి... కెమేరా వాళ్ళూ ! కెమేరా వాళ్ళూ ! కెమేరా అటు తిప్పండి ప్లీజ్ ! ! !

అక్కడ చూడండి.. ఆ డాబాఇంటి - డాబా మీద... షామియానా... మామిడి తోరణాలు... హలో హలో అంటూ మైకు టెస్ట్ లు...ఖాళీ కుర్చీలు.... అక్కడ అదిగో ఆయన సురేఖ ఎలియాస్ అప్పారావు... ఏ ఎలియాస్ అక్కరలేని సీదా సాదా హనుమంత రావు అనే నేను ... (అదేనండీ బాబూ... ఈ సోది కర్తను... ) ఆ హనుమంతరావు అప్పారావూ ఎందుకక్కడున్నారా అని మీరు అడగరు కాని నే చెప్పాలిగా ఆ డాబా ఆ డాబాక్రింద ఇల్లు మన అప్పారావుగారివి... ఆయన ఫ్రెండ్ కదా నేను....హనుమంతరావు.. అదన్నమాట... వాళ్ళ ముఖాలలో టెన్షన్.. వాళ్ళిద్దరూ నిమిష నిమిషానికీ  వీధి గుమ్మంవైపు ఆశగా చూడ్డం... చెవుల్లో మనకి వినపడకుండా గుస గుస గుస గుసలు... గుసగుసలు అంటే మనక్కూడా సరదాయే కదా..మనంకూడా విందాం .. కెమేరా వాళ్ళ మనసుల్లోకి తిప్పమ్మా.. కుదరదా ? సర్లే.. నేనే చూసి చెప్తాను... ఆ మధ్య అంటే ఆ మార్చి ..ఆ సంవత్సరం... ఆ ఇరవయవ తారీఖుకి ముందు అన్నమాట.. అ.గారు, హ.రావు గారు ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు.. "రాజమండ్రిలో మేమిద్దరమూ మిమ్మల్ని ప్రతినెలా నవ్విద్దామనుకుంటున్నాము.. ఓక్లబ్ పెట్టాలనుకుంటున్నాము...దానికింకా బొడ్డు కోయలేదు... అందుకని పేరుపెట్టలేదు...మా సంకల్పం నచ్చితే తెలియజేయండి... వెంటనే బొడ్డుకోసి పేరెట్టేస్తాం.." అని... స్పందనలేదే. ఏంచేస్తాం.. ఎలా కోస్తాం...ఎలా పెట్తాం...// అలా అనుకుంటూంటే వారం తర్వాత  ఒక రోజు ఒక స్త్రీమూర్తి అ.రావుగారికి ఫోన్ చేసి, "ఎప్పుడునవ్వులు, ఎక్కడ నవ్వులు, ఎన్ని నవ్వులు, ఎందరు నవ్వులు" అంటూ ప్రశ్నించింది.. అ.రావుగారు ఉబ్బి..తబ్బిబ్బయిపోయి "హనుమంతరావుగారోయ్ ! !  !" అని కేక పెట్టారు... గమనిక::మేమిద్దరమూ జోకు వేటు దూరంలోనే ఉంటాము.. "ఓహో! ! ! ! " అన్నారు హ.రావు గారు విషయం విని... కాని వాళ్ళ అమ్మాయి ఇక సస్పెన్స్ పాడి(ఉచితం)కాదని... "అది కాదంకుల్ ! నాన్నగారు నాతో "మేము చాలా నిరుత్సాహంగా ఉన్నాము.. నువ్వే ఒక నవ్వేజన ప్రతినిధిగా ఒక ఫోన్ చెయ్యమ్మా" అంటే చేసాను అంకుల్ .. సారీ " అంది.. నిండు మనస్సుతో నవ్వేసారు...అ.రావుగారు.. జత కలిపారు హ.రావుగారు.. ఇరువురూ అ.హ.అనుకున్నారు...... ఎవరూ స్పందించకపోయినా మిత్రులు నవ్వుల"పాల"య్యారేమో కాని..(నవ్వుల)"నీరు"కారిపోలేదు.. ఆల్ రైట్.. నవ్వులపాలయినా అందరికీ నవ్వులుపోల్ చేద్దాం అనే దృడ సంకల్పంతో ఉండగా... హాసం మేనేజింగ్ ఎడిటర్ యమ్బీయస్ గారితో పరిచయం.. హాసం సూచనమేరకు హాసం క్లబ్ (మొత్తానికి కోసేసాం...పెట్టేసాం) ఆవిర్భావం... ఆ సందడే అది.. అయితే నవ్వుల మనస్సుల్లో దిగుళ్ళెందుకూ అంటే గత అనుభవ భయం.... ఎవరూ రారేమోనని... దిగుళ్ళ మనస్సుల్లోంచి కెమేరా బయటికి వచ్చేసింది.. ఓ కెమేరా లేదుకదూ....నేను బయటికి వచ్చా... కెమేరా షామియానా క్రిందకి త్రిప్పితే... అప్పటికే దాదాపు, సుమారు, దగ్గరదగ్గర వందమంది... సినీ నటుడు, గాయకుడూ జిత్ మోహన్ మిత్రా అతనితో మిత్రులు.. యమ్బీయస్ ప్రసాద్ గారు, యస్వీ రామారావుగారు హైదరాబాదునుంచి... ఊళ్ళో పేరున్నవారు... పేరులేనివారు... కుర్చీలు నిండాయి... రాష్ట్రం లోని హాసం క్లబ్బులలో మొట్టమొదటి క్లబ్... రాజమండ్రిలో తారణ నామ సంవత్సర ఉగాది నాడు... అంటే 20-3-2004 నాటి ఉదయం ప్రారంభమైంది...
అంటే ఈ ఇరవయవ తారీఖునాటికి.... అంటే ఇవ్వాళ్టికి....ఎలియాస్ తెలుగు పంచాంగ ప్రకారము...నందన నామ సంవత్సర ఉగాది నాటికి.... ఎనిమిదేళ్ళూ పూర్తయ్యాయన్నమాట...
అందరికీ నవ్వే విధంగా కార్యక్రమాలు చేసాము.. అందరూ నచ్చే విధంగా హాసం క్లబ్ నడిపించాము... (నవ్వుల సందడిలో వ్యాకరణ దోషాలు మీరు పట్టలేదు.. వెనక్కి చూసి... నవ్వాలనిపించకపోతే నవ్వండి).. భమిడిపాటి రాధాకృష్ణగారు, యమ్బీయస్ ప్రసాద్ గారు, రావికొండలరావుగారు మొదలైన హాస్య రచయితలను సత్కరించాము... హాస్య సదస్సులు., కార్టూన్ ప్రదర్శనలు చేసాము... జైళ్ళలో ఖైదీలదగ్గర ప్రోగ్రాములు చేసాము. రామచంద్రపురం, అనకాపల్లి,జగ్గంపేట, రావులపాలెం లాంటి ప్రాంతాలకు స్వంత ఖర్చులపై వెళ్ళి ప్రోగ్రాములు ఇచ్చాము.. స్థానికంగా చాలా చోట్ల ప్రోగ్రాములు చేసాము.. అందరూ మనసారా (ప్రొహిబిషన్ సారా కాదు బాబోయ్) నవ్వుకున్నారు.. మమ్మల్ని తలుచుకుని నవ్వుకుంటున్నారు... అన్ని ప్రముఖ దినపత్రికలు మాగురించి వ్రాసాయి.. మీ అనుమానం నవ్వా... మంచిగానేనండీ బాబూ)..

ఇవ్వాళ మా క్లబ్... మన నవ్వుల సంస్థ వార్షిక్... ఉత్సవం చెయ్యటంలేదు.. అందుకని అక్కడ కట్ చేసాను.. కాని ఉండబట్టలేక మేం వార్షికోత్సవాల సందర్భంగా విడుదల చేసిన ఆహ్వాన కరపత్రాలను ఇక్కడ ఉంచాను... (వీటి రచయితను నేనే) చూసి ఆశీర్వదించండి.. మళ్ళీ మళ్ళీ ఉత్సవాలు చెయ్యాలని దీవించండి.. మీరంతా సంకల్పించుకుంటే అదేమంతా కష్టం కాదు... సో ...నవ్వేజనా సుఖినోభవంతు.......

please sort the different papers to get the correct one... a practical joke ....ha...haa...haaaa