హాసంక్లబ్... రాజమండ్రి... పుట్టి ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలయింది.
హాసంక్లబ్... రాజమండ్రి... పుట్టి ఈరోజుకి ఎనిమిది సంవత్సరాలయింది..
2004వ సంవత్సరంలో మార్చి నెల వచ్చింది.. వచ్చిందా అండి ? ఆ నెలలో 20 వ తారీఖు... అదో విశేషమా ఇప్పటిలాగానే వచ్చిందికదా .. అనకండి.. ఆ రోజు ఇండియా పాకిస్థాన్ క్రికెట్ ఒన్ డే మాచ్ .. ఫైనల్స్... మరి ? అంతే కాదు తారణ నామ సంవత్సర తొలి రోజు... అంటే ఉగాది అన్నమాట... ఉదయమప్పుడు... స్త్రీమూర్తులు పండుగ వంటలు చేసే ఘుమ ఘుమల సమయం.. మగమూర్తులు వారి చేతి కాఫీ చప్పరిస్తూ టి.వీలకు హత్తుకు పోయే సమయం...ఆ సమయంలో.... ఆగండాగండి... కెమేరా వాళ్ళూ ! కెమేరా వాళ్ళూ ! కెమేరా అటు తిప్పండి ప్లీజ్ ! ! !
అక్కడ చూడండి.. ఆ డాబాఇంటి - డాబా మీద... షామియానా... మామిడి తోరణాలు... హలో హలో అంటూ మైకు టెస్ట్ లు...ఖాళీ కుర్చీలు.... అక్కడ అదిగో ఆయన సురేఖ ఎలియాస్ అప్పారావు... ఏ ఎలియాస్ అక్కరలేని సీదా సాదా హనుమంత రావు అనే నేను ... (అదేనండీ బాబూ... ఈ సోది కర్తను... ) ఆ హనుమంతరావు అప్పారావూ ఎందుకక్కడున్నారా అని మీరు అడగరు కాని నే చెప్పాలిగా ఆ డాబా ఆ డాబాక్రింద ఇల్లు మన అప్పారావుగారివి... ఆయన ఫ్రెండ్ కదా నేను....హనుమంతరావు.. అదన్నమాట... వాళ్ళ ముఖాలలో టెన్షన్.. వాళ్ళిద్దరూ నిమిష నిమిషానికీ వీధి గుమ్మంవైపు ఆశగా చూడ్డం... చెవుల్లో మనకి వినపడకుండా గుస గుస గుస గుసలు... గుసగుసలు అంటే మనక్కూడా సరదాయే కదా..మనంకూడా విందాం .. కెమేరా వాళ్ళ మనసుల్లోకి తిప్పమ్మా.. కుదరదా ? సర్లే.. నేనే చూసి చెప్తాను... ఆ మధ్య అంటే ఆ మార్చి ..ఆ సంవత్సరం... ఆ ఇరవయవ తారీఖుకి ముందు అన్నమాట.. అ.గారు, హ.రావు గారు ఓ పత్రికా ప్రకటన ఇచ్చారు.. "రాజమండ్రిలో మేమిద్దరమూ మిమ్మల్ని ప్రతినెలా నవ్విద్దామనుకుంటున్నాము.. ఓక్లబ్ పెట్టాలనుకుంటున్నాము...దానికింకా బొడ్డు కోయలేదు... అందుకని పేరుపెట్టలేదు...మా సంకల్పం నచ్చితే తెలియజేయండి... వెంటనే బొడ్డుకోసి పేరెట్టేస్తాం.." అని... స్పందనలేదే. ఏంచేస్తాం.. ఎలా కోస్తాం...ఎలా పెట్తాం...// అలా అనుకుంటూంటే వారం తర్వాత ఒక రోజు ఒక స్త్రీమూర్తి అ.రావుగారికి ఫోన్ చేసి, "ఎప్పుడునవ్వులు, ఎక్కడ నవ్వులు, ఎన్ని నవ్వులు, ఎందరు నవ్వులు" అంటూ ప్రశ్నించింది.. అ.రావుగారు ఉబ్బి..తబ్బిబ్బయిపోయి "హనుమంతరావుగారోయ్ ! ! !" అని కేక పెట్టారు... గమనిక::మేమిద్దరమూ జోకు వేటు దూరంలోనే ఉంటాము.. "ఓహో! ! ! ! " అన్నారు హ.రావు గారు విషయం విని... కాని వాళ్ళ అమ్మాయి ఇక సస్పెన్స్ పాడి(ఉచితం)కాదని... "అది కాదంకుల్ ! నాన్నగారు నాతో "మేము చాలా నిరుత్సాహంగా ఉన్నాము.. నువ్వే ఒక నవ్వేజన ప్రతినిధిగా ఒక ఫోన్ చెయ్యమ్మా" అంటే చేసాను అంకుల్ .. సారీ " అంది.. నిండు మనస్సుతో నవ్వేసారు...అ.రావుగారు.. జత కలిపారు హ.రావుగారు.. ఇరువురూ అ.హ.అనుకున్నారు...... ఎవరూ స్పందించకపోయినా మిత్రులు నవ్వుల"పాల"య్యారేమో కాని..(నవ్వుల)"నీరు"కారిపోలేదు.. ఆల్ రైట్.. నవ్వులపాలయినా అందరికీ నవ్వులుపోల్ చేద్దాం అనే దృడ సంకల్పంతో ఉండగా... హాసం మేనేజింగ్ ఎడిటర్ యమ్బీయస్ గారితో పరిచయం.. హాసం సూచనమేరకు హాసం క్లబ్ (మొత్తానికి కోసేసాం...పెట్టేసాం) ఆవిర్భావం... ఆ సందడే అది.. అయితే నవ్వుల మనస్సుల్లో దిగుళ్ళెందుకూ అంటే గత అనుభవ భయం.... ఎవరూ రారేమోనని... దిగుళ్ళ మనస్సుల్లోంచి కెమేరా బయటికి వచ్చేసింది.. ఓ కెమేరా లేదుకదూ....నేను బయటికి వచ్చా... కెమేరా షామియానా క్రిందకి త్రిప్పితే... అప్పటికే దాదాపు, సుమారు, దగ్గరదగ్గర వందమంది... సినీ నటుడు, గాయకుడూ జిత్ మోహన్ మిత్రా అతనితో మిత్రులు.. యమ్బీయస్ ప్రసాద్ గారు, యస్వీ రామారావుగారు హైదరాబాదునుంచి... ఊళ్ళో పేరున్నవారు... పేరులేనివారు... కుర్చీలు నిండాయి... రాష్ట్రం లోని హాసం క్లబ్బులలో మొట్టమొదటి క్లబ్... రాజమండ్రిలో తారణ నామ సంవత్సర ఉగాది నాడు... అంటే 20-3-2004 నాటి ఉదయం ప్రారంభమైంది...
అంటే ఈ ఇరవయవ తారీఖునాటికి.... అంటే ఇవ్వాళ్టికి....ఎలియాస్ తెలుగు పంచాంగ ప్రకారము...నందన నామ సంవత్సర ఉగాది నాటికి.... ఎనిమిదేళ్ళూ పూర్తయ్యాయన్నమాట...
అందరికీ నవ్వే విధంగా కార్యక్రమాలు చేసాము.. అందరూ నచ్చే విధంగా హాసం క్లబ్ నడిపించాము... (నవ్వుల సందడిలో వ్యాకరణ దోషాలు మీరు పట్టలేదు.. వెనక్కి చూసి... నవ్వాలనిపించకపోతే నవ్వండి).. భమిడిపాటి రాధాకృష్ణగారు, యమ్బీయస్ ప్రసాద్ గారు, రావికొండలరావుగారు మొదలైన హాస్య రచయితలను సత్కరించాము... హాస్య సదస్సులు., కార్టూన్ ప్రదర్శనలు చేసాము... జైళ్ళలో ఖైదీలదగ్గర ప్రోగ్రాములు చేసాము. రామచంద్రపురం, అనకాపల్లి,జగ్గంపేట, రావులపాలెం లాంటి ప్రాంతాలకు స్వంత ఖర్చులపై వెళ్ళి ప్రోగ్రాములు ఇచ్చాము.. స్థానికంగా చాలా చోట్ల ప్రోగ్రాములు చేసాము.. అందరూ మనసారా (ప్రొహిబిషన్ సారా కాదు బాబోయ్) నవ్వుకున్నారు.. మమ్మల్ని తలుచుకుని నవ్వుకుంటున్నారు... అన్ని ప్రముఖ దినపత్రికలు మాగురించి వ్రాసాయి.. మీ అనుమానం నవ్వా... మంచిగానేనండీ బాబూ)..
ఇవ్వాళ మా క్లబ్... మన నవ్వుల సంస్థ వార్షిక్... ఉత్సవం చెయ్యటంలేదు.. అందుకని అక్కడ కట్ చేసాను.. కాని ఉండబట్టలేక మేం వార్షికోత్సవాల సందర్భంగా విడుదల చేసిన ఆహ్వాన కరపత్రాలను ఇక్కడ ఉంచాను... (వీటి రచయితను నేనే) చూసి ఆశీర్వదించండి.. మళ్ళీ మళ్ళీ ఉత్సవాలు చెయ్యాలని దీవించండి.. మీరంతా సంకల్పించుకుంటే అదేమంతా కష్టం కాదు... సో ...నవ్వేజనా సుఖినోభవంతు.......
please sort the different papers to get the correct one... a practical joke ....ha...haa...haaaa
1 comment:
అయ్యా మీ బ్లాగులోకి ఇప్పుఢే ప్రవేశించాము. త్వరలో చక్కని వ్యాఖ్య వ్రాసి పెట్ట గలను...దన్యవాదములు.
Post a Comment