అభిమాన నటుని సినీమా రిలీజు... అంటే .... భారీ కటౌట్లకు అతి భారీ దండలూ... సినీమా హాల్స్ ముందు హల్ చల్... స్క్రీన్ మీద అభిమాన హీరో కనపడగానే ఈలలు, కేకలు, ... టపాసులు...
పేరు తెచ్చుకున్న నటుని జన్మదినం... అంటే అభిమాన సంఘాల హడావుడి. అన్న సంతర్పణలు, రక్త దానాలు, పేదలకు పళ్ళు..
అభిమాన సంఘాలు మా చిన్నతనాల్లో ఉండేవో లేదో గుర్తులేదు కాని, కాలేజీలో ఉన్నప్పుడు...అలాగే నేను ఉద్యోగంలో చేరిన క్రొత్తలోనూ అగ్రశ్రేణి హీరోలకు అభిమానులు మాత్రం ఉండేవారు...అలా ఉండడం తెలుసు..
నేను రెగ్యులర్ సినీమా గోయర్ ని కాను.. కాని నేను హైస్కూలులో చదివేరోజుల్లో... పరీక్షల ఆఖరి రోజు మా ఫ్రెండ్స్ చాలామంది సినీమాలకు వెళ్లాం అని చెప్తూ ఉండేవాళ్లు.. తర్వాత కలిసినప్పుడు వాళ్లు చూసిన సినీమాలలోని విషయాలు వర్ణించి చెప్తుంటే కొంచెం ఈర్ష్యగా ఉండేది.. థర్డ్ ఫారమో, ఫోర్తుఫారమో చదివినప్పుడు అనుకుంటా...పరీక్షలప్పుడు, ఆఖరి పరీక్ష వ్రాసాక, ఇంట్లో గొడవచేసాను.. సినీమాకు వెళ్తానని. నాన్నగారు ఒప్పుకుని మా అన్నయ్యతో నన్ను సినీమాకు తీసుకెళ్లమని చెప్పారు.. ఆరోజుల్లో ఒక్కడినీ పంపేవారు కారు...ఇంతోటి పరీక్ష వ్రాసాక సినీమా ఏమిటి అని అన్నయ్య ఎద్దేవా చేసాడు. అలా అంటే ఏడుస్తానన్నాను.. నాతో సినీమాకు రావడం వాడికి పాపం చిన్నతనం....మొత్తానికి వాహినీవారి "పెద్ద మనుష్యులు" సినీమాకు వెళ్లాము.. ఆ కథ ఇప్పటికీ గుర్తు ఉంది కాని, నటనా సామర్థ్యాలు అర్థంచేసుకోగలిగిన జ్ఞానం అప్పట్లో సున్నా... రేలంగి మాత్రం బాగా నచ్చాడు...
కాలేజీలో మరీ తమాషా.. మా క్లాస్ మేట్ ఒకతను ఉండేవాడు.. అతను దేవానంద్ కు పిచ్చి అభిమాని. దేవానంద్ లాగా ఎర్రటివి, పసుప్పచ్చవి ప్లేన్ కలర్ షర్టులు... క్రాఫింగ్ ముందు భాగంలో చిన్న బఫ్ ..అంటే కొంచెం జుత్తు ఎత్తుగా వచ్చేట్టు దువ్వేవాడు.. దేవ్ అని పిలిపించుకోవడం సరదా....అఫ్ కోర్స్ బాగా చదివేవాడు.. ఒక ప్రక్కకు వంగి నడక, స్టైలు అంతా దేవానంద్ లాగానే మెయిన్ టైన్ చేసేవాడు...
తర్వాత బ్యాంక్ లో ఉద్యోగానికి ముందు ఫారెస్ట్ ఆఫీసులో చేసినప్పుడు మా హెడ్ క్లర్క్ ఉండేవారు .. ఆయన శనివారం ఖచ్చితంగా సినీమాకు వెళ్లేవారు. రిటైర్ మెంట్ కు దగ్గర వయస్సు వచ్చినా ఆయన పద్ధతి అది.. అల్లాగే నేను బ్యాంక్ లో చేరాకకూడా మిగతా ఫ్రెండ్స్ మాట ఎలాగున్నా మా కొలీగ్ తన భార్యతో తప్పకుండా శనివారం సినీమాకు వెళ్లేవాడు. ఉద్యోగంలో చేరిన క్రొత్తలో శ్రీకాకుళం జిల్లా పలాసాలో ఉన్నప్పుడు సినీమాలు ఎక్కువ చూసే వాణ్ణి.. అప్పుడు బ్రహ్మచారి జీవితం... అందరూ వెళ్తుంటే నేనూ వెళ్లక తప్పేది కాదు.. సినీమా అంటే ఎవర్షన్ అని కాదు.. ఏమిటో.? .. ఒక్కోసారి ఆదివారం ఉదయానికి శ్రీకాకుళం వెళ్లిపోయి మేటనీ, ఫస్ట్ షో చూసి రాత్రికి పలాస చేరేవాళ్లం...ఇంకో బ్రహ్మచారి ఫ్రెండ్ ఉండేవాడు.. ఆ మూల ప్రకాశం జిల్లా నుంచి ఈ మూల శ్రీకాకుళంజిల్లాకు వచ్చాడు... అతనికి రామారావంటే పిచ్చి అభిమానం... పలాసాలో అప్పుడు రెండు హాల్స్ ఉండేవి... రామారావు పిక్చర్ వచ్చిందంటే ఒకసారి ఎలాగా చూసేవాడు.. వారం తిరక్కుండా మళ్లీ మళ్లీ చూసేవాడు.. ఓ సారి మేము సినీమాకు రామారావు సినీమా వస్తే సెకండ్ షోకి బయల్దేరాము... ఇతగాడు ఆ సినీమాకు ఫస్ట్ షోకు నాలుగోసారి వెళ్లి వస్తున్నాడు...దారిలో కనబడ్డాడు..సెకండ్ షోకు వెళ్తున్నాము, వస్తారేంటి... అన్నాము.. అతని భోజనం ఇంకా అవలేదు.. వచ్చేదాక హోటల్ ఉండదు కట్టేస్తారు...అయినా సరే మా గురువు సినీమా వచ్చేస్తాను.. ఈ భోజనం ఎప్పుడూ ఉండేదే...అంటూ మాతో బయల్దేరాడు..... ఇంకో సీనియర్ కొలీగ్.. అతను అక్కినేని వారి అభిమాని.. పైకి హుందాగానే ఉండేవాడు.. రామారావు అభిమానులతో వాదనకు దిగేవాడు.. మేం అప్పుడు సుబ్బమ్మా క్వార్టర్స్ అని ఓ పెద్ద హౌసింగ్ కాంప్లెక్స్ లో ఉండేవారము.. క్రింద ఆరు ఫామిలీ పోర్షన్స్. అందులో మూడు పోర్షన్స్ మా బ్యాంకు వాళ్లమే....రెండు పోర్షన్స్ లో మా బ్యాంక్ వాళ్లు ఫామిలీస్ తో ఉండేవాళ్లు..మూడో దాంట్లో బాచిలర్స్ ముగ్గురం కలసి ఉండేవాళ్లం.. మిగతా మూడింటిలోనూ వ్యాపారాలు చేసుకునేవారుండేవారు.. వీటికి పైన పన్నెండు సింగిల్ రూమ్స్. అందులో ఒక రూమ్ లో ఇందాక చెప్పిన ప్రకాశం జిల్లా రామారావు అభిమాని అయిన మా బ్యాంక్ కొలీగ్, అతని ప్రక్కన డిగ్రీ చదువుకోసం దగ్గర ఊరునుంచి వచ్చిన స్టూడెంట్ ఒక రూములో ఉండేవాడు.. ఇతను నాగేశ్వర్రావభిమాని...
భోజనాలయ్యాక క్రింద అందరూ మా రూమ్ లో సమావేశం.. ప్రొద్దుపోయేదాకా వాదోపవాదాలు. రామారావభిమాని పాపం ఆ ప్రకాశం జిల్లా అతను ఒక్కడే.. హుందా నాగేశ్వారావ్వభిమాని, స్టూడెంటూ కలసి అతన్ని వాయించేసేవాళ్లు.. నాగేశ్వర్రావు ద్విపాత్రాభిమానంతో "బుద్ధి మంతుడు" అప్పుడే వచ్చింది.. రామారావు ద్విపాత్రాభినయంతో "భలే తమ్ముడు" వచ్చింది... ఏ సినీమా బాగుంది అన్న దానిమీద చర్చ.. హుందా అభిమాని, అతని మిత్రులు "కాకి కోకిల అవుతుందా" అని అటాక్.. "రహస్యంలో" జానపద హీరోగా నాగేశ్వర్రావును ఆక్షేపిస్తూ డిపెన్స్...., దెబ్బకి ఓ డిస్ట్రిబ్యూటర్ బోర్డ్ తిప్పేసేడని ఆర్గుమెంట్. రామారావుకి చారిటీ ఎక్కువని ఒకళ్లంటె... కాదు కాదు నాగేశ్వర్రావుకే అని మరొకరు...రామారావుకి భోజనం సీను లేకపోతే ఆక్ట్ చెయ్యడు, నాగేశ్వరరావు థరో జెంట్ల్ మన్ అని ఒకరు.. నాగేశ్వరరావుకి తింటే పడదని డిఫెన్స్. "మారువేషములు కలవా" అని ప్రొడ్యూసర్ ని ఆడిగి ఉంటేనే వేస్తాడు అంటే... ఏ వేషం వేయాలన్నా నప్పాలి కదా .. అందుకనే వాటి జోలికి పోడు మీ వాడు అని వీళ్ళు....చేతనైతే కృష్ణుడి వేషం వేయమనండి మీ వాణ్ణి.... వీరి రివర్స్ వాదన.. అలాంటి పాత వేషాలు మా వాడు ఎందుకు వేస్తాడు అని వాళ్ల డిఫెన్స్..ఇలా సాగేవి వాద ప్రతివాదాలు...మేము తటస్థ విధానం.. లైవ్ లీ గా ఉండడానికి సందర్భాన్ని బట్టి అటూ ఇటూ కూడా ఉండే వాళ్లం.. మాది లౌక్యమే అనిపించినా అదో సరదా కదా... రామారావాభిమానికి కళ్లనీళ్ల పర్యంతం అయ్యేది.. అప్పుడు వాదనలు క్లోజ్ చేసి .. అందరం కలసి మా రూమ్ లో వేడి వేడి పాలు త్రాగి.... డిస్బర్స్ అయ్యేవాళ్లం...
అప్పుడు పైకి వెళ్లాక ఈ ప్రకాశం ఊరుకునేవాడా అంటే స్టూడెంట్ నాగేశ్వరరావున్నాడు కదా .. అతనిమీద అట్టాక్.. అతను మరునాడొచ్చి... అయ్ బాబోయ్..వాయించేసాడండి బాబూ అంటూ గోల.. .
ఆదివారాలు మాతో చేరే మిత్రులలో ట్రాన్స్ పోర్ట్ ఉద్యోగి ఒకతనుండేవాడు...మాకందరికీ మిత్రుడు. కొంచెం జంటిల్ మన్..బ్యాంక్ వాళ్లం అని మాతో స్నేహానికి ఇష్ట పడేవాడు..అతను హిందీ పాటలు బాగా పాడేవాడు. అతనికి రామారావంటే ఇష్టం.. అలా అని పోట్లాట వేసుకునేవాడు కాదు. .. ట్రాన్స్ పోర్ట్ అతను చక్కగా పాడుతుంటే, మా హుందాగారున్నారు కదా ఆయన మా ఫ్రెండ్ దగ్గర ఉన్న బుల్ బుల్ తీసుకుని కర్కశంగా, ఏదో మద్దెల దరువేసినట్టు వాయించేసే వాడు.. పాడే అతను రామారావభిమాని అన్న ఒకే ఒక్క కారణంతో అతని పాట చెడగొట్టాలని... సీనియర్ కొలీగ్ . ఏమీ అనలేకపోయేవాళ్లం... అలా సాగేవి అభిమానాలు..మా హుందా గారే కాదు, ఎంతో మంది నాగేశ్వరరావు అభిమానులు, నాగేశ్వరరావులా మాట్లాడడం, అతనిలా నడవడం, అతనిలా బొడ్డు పైకి టక్ చేసుకోవడం... అలా అనుకరించడాలు అప్పట్లో ఉండేవి... ఆ రోజుల్లో ప్రథాన పాత్రలకు... నాగేశ్వరరావు, రామారావు వీళ్లే నటులు.. యువ ప్రేమికుల్లా, కాలేజీ స్టూడెంట్స్ లాగా , ఇంట్లో ఆఖరి తమ్ముళ్లగా వాళ్లని చూసే వాళ్లం.. ! ! ! మిగతా నటులున్నా వీరి నీడలో వారి ప్రకాశము తక్కువ అనే చెప్పాలి.. కథలన్నీ వీరి చుట్టూనే అల్లబడేవి.. వారపత్రికల్లో సీరియల్ వస్తోందంటే, అది సినీమాగా తీస్తున్నారంటే ఏ పాత్రకెవ్వరో కాలేజీ కుర్రాళ్లు ఊహించేవారు, ఊహించినవారే సినీమాల్లో ఆ పాత్రల్లో కనపడేవారు.. ఆ వయస్సులో ఇవన్నీ టైమ్ పాస్... అంతకు మించి ఏమీ కావు...
No comments:
Post a Comment