దీపం జ్యోతిః పరంబ్రహ్మా దీపం సర్వ తమోపహరమ్
దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే
దీపదర్శనము సర్వపాపాలను నశింపజేస్తుంది. మన హృదయమే ప్రమిదగా, భక్తి చమురుగా, ప్రేమ అనే అగ్నితో వెలిగించేదే దీపం. దీప ప్రాధాన్యాన్ని ఋగ్వేదం చెప్తుంది... సృష్టి, స్థితి, లయ మూడింటికి దీపంతో సంబంధం ఉంది. దీపకాంతిలో అంతర్లీనంగా కనిపించే నీల కాంతి... స్థితి కర్త విష్ణుమూర్తికి, తెల్లని కాంతి.... లయకర్త శివునికీ, ఎరుపుకాంతి... సృష్టికర్త బ్రహ్మదేవునకు అర్థంగా చెప్తారు.
మన సంస్కృతిలో పర్వదినాలుకాని, దేవతా మూర్తులు కాని, వారి ఆయుధాలు కాని అన్నీశాస్త్రసమ్మతమైన సంకేతములతో కూడినవే కాని కాకతాళీయంకాదన్నవిషయం స్పష్టం.. నరకచతుర్థి.. నరకాసుర సంహారానికి జ్యోతిష్యపరంగా విశేష అర్థం చెప్తారు.. నరకుడు భూదేవి కుమారుడు. అతడు మేషరాశికి సంకేతం. నరకుని పాలన అంధకార బంధురం.. దీనికి సంకేతమే మేషరాశి తూర్పుదిక్కుగా సూర్యాస్తమయ సమయాన ఉదయించి (తెల్లారేసరికి) అస్తమిస్తుంది. ఆ సమయానికి తులారాశి తూర్పున కనబడుతుంది. స్వాతి నక్షత్రాధిదేవత వాయువును అధిష్టించి నరకుని మీదకు బయలుదేరిన శ్రీకృష్ణుడు సూర్యునికి ప్రతీక. సత్యభామ చంద్రుడు. నరకుడు అస్తమించగానే అంచులమీద దీప ఛాయలతో ఉన్న కన్యారాశి (కొన్నినక్షత్రాల సమూహం) తమకి విముక్తిని కలిగించిన సూర్యుని చుట్టూ చేరతాయి... అది చెప్పడమే కృష్ణుని వరించడం....
నరకుడన్న ఉపగ్రహం భూమిచుట్టూ తిరుగుతూ, భూ కక్ష్యలోనికి వచ్చి, భూమిని ఢీకొనే ప్రమాదం ఏర్పడగా శ్రీ కృష్ణుడు తన ప్రజ్ఞతో దానిని ఆకాశంలో ప్రేల్చగా ఆ ముక్కలు వాతావరణం రాపిడికి అంటుకుని ఆకాశంలో వెలుగులు విరజిమ్మాయని, ఆ వెలుగుల జిలుగులే ఈనాటి దీపావళి కాంతులు అని ఒక భావన.
కాలక్రమంలో మన సంస్కృతితో పాటు దీపావళి ఉత్సవం కూడా దేశ దేశాలకూ విస్తరించింది. పై ఆచారాలు కొన్నిటితో ఒక్కొక్క దేశంలో దీపావళి పండుగ ఒక్కో విధంగా జరుపుకోవడం కనిపిస్తుంది.
సయామ్ (ఇండోచైనా)లో ఈ ఉత్సవం రాజకీయ మహోత్సవంగా జరుపుతారు.
చైనా ప్రజలు క్వాన్(అర్థనారీశ్వరుడు) అనే పేరుతో దేవపూజ చేస్తారు. చైనా తత్త్వవేత్త కన్ ఫ్యూషియన్ దేవీపూజా విధానాన్ని తన మతగ్రంథంలో వివరించాడు. చైనా ప్రజలు తమ గుమ్మాల వద్ద ఎర్ర కాగితాలతో జయవిజయులను తయారుచేసి నిలబెడతారు. తమభాషలో మైక్ శైన్ అని పిలవబడే ఈ ద్వారపాలకులను ఉంచడంవలన ఏడాది పొడుగునా భూత ప్రేత పిశాచముల పీడ ఉండదని వీరివిశ్వాసం.
జపాన్ లో దీపావళి మూడురోజులపాటు సామూహిక ఉత్సవంగా జరుగుతుంది. మొదటిరోజు ఊరిబయట దీపాలతో అలంకరించిన తోటలోకి, దీపాలతో అలంకరించిన బళ్లపై జట్లు జట్లుగా వెళ్తారు... రెండవరోజు నూతన వస్త్ర ధారణ, విందుభోజనాలు. పెద్దలున్న తావుకు వెళ్లి వారి దీవెనలు పొందుతారు. మూడవరోజు పడవలపై జలవిహారం.. పడవలపైన సామూహిక భోజనాలు.నృత్యగీత వినోదాలు.. ఆ రోజు ఏ తలుపులూ మూయరట. మూడురోజులూ ఇంట్లో చీపురు వేయరు... గుడ్డతో తుడుస్తారు, నీళ్లతో కడుగుతారు కాని చీపురు వేయరు.
జావాలో, సుమాత్రాలలోనూ... భారత దేశంలో లాగుననే రామలీల, దుర్గాపూజ, దీపోత్సవం జరుగుతాయి
ఇక దీపావళి నాడు విధిగా చేయవలసినవి..
ప్రాతఃకాలంలో అభ్యంగ స్నానం. ప్రదోషంలో దీపదానం, లక్ష్మీ పూజలను నిర్దేశించారు. ఒంటికి తైలం రాసి, నలుగుపెట్టి. (కుంకుడుకాయకాని, షీకాయకాని రసముతో)తలంటు స్నానం చేయడాన్ని "అభ్యంగం" అంటారు. తైలంలో లక్ష్మి, జలంలో గంగ, ఈ దినాన సన్నిహితులై ఉంటారని శాస్త్రోక్తి. అందుకే అభ్యంగ స్నానం ఐశ్వర్యప్రదం, పవిత్రకరం.
ప్రదోషసమయంలో (సాయంకాలం) ఇళ్లూ, వాకిళ్లూ శుభ్రం చేసి లక్ష్మీ పూజని ఆచరించాలి. అటుపై లక్ష్మీ స్వరూపంగా దీపాలను వెలిగించాలి. దీపమాలికలతో గృహప్రాంగణాలు, దేవాలయాలు, తులసికోటలు, తోటలు మొదలైనవి అలంకరించాలి.
రాత్రి ప్రారంభంలో లక్ష్మీ పూజ, దీప ప్రకాశనం చేసినతరువాత ..విందు భోజనాల ఆరగింపు, వేడుకల తరవాత,
అర్థరాత్రి దాటాక ఇళ్లూ, వాకిళ్లూ తుడిపించాలని ధర్మశాస్త్రం చెబుతుంది.
దీన్ని " అలక్ష్మీ నిస్సరణం " అంటారు.. అంటే దరిద్రాలను తొలగించడం.
దీపావళి మరునాటినుంచి ప్రారంభమయ్యే కార్తీక మాసం సర్వదేవతలకూ ప్రీతి కరమైనది . శివారాధనకు, విష్ణ్వారాధనకు, శక్త్యారాధనకు ఇది ప్రసిద్ధి. ప్రయాసలతో, కఠోర నియమాలతో కూడిన యజ్ఞయాగాదుల అవసరం లేకుండానే, ఈ మాసంలో చేసే దీపారాథనలు, అనుష్టానాలు వివిధ యజ్ఞాల ఫలాలను ప్రసాదిస్తాయి. యజ్ఞాగ్నికి సంకేతంగా రుద్రభగవానుని ఆరాధించడం సంప్రదాయం. శివారాధన సర్వదేవతా పూజాఫలన్నిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అగ్నికీ, యజ్ఞానికి సంబంధించిన ఈ మాసం ఆగ్నేయుడైన సుబ్రహ్మణ్యునికి ప్రీతి పాత్రమైనది. ఈ పూర్ణిమకు కుమార దర్శనం అని పేరు ఉంది. ఆ రోజున దేవతలందరూ సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారని పురాణవచనం. విష్ణుపరంగా .. కార్తీకం చాలా ప్రసిద్ధి. ఈ మాసంలో వచ్చే క్షీరాబ్ధిద్వాదశి తులసీ వనంలో స్వామిని అర్చించే పర్వం. ఈ మాసానికంతటికీ విష్ణువు దామోదర నామంతో అధిపతిగా ఉన్నాడు. సర్వలోకాలను తనలో దాచుకున్న పరతత్త్వమే దామోదరుడు. అందుకే ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా " కార్తీక దామోదర ప్రీత్యర్థం "అని సంకల్పించడం ఆనవాయితీ...
మన హైందవ సంప్రదాయంలోనే కాక జైన, బౌద్ధ ముస్లిమ్, క్రైస్తవ సంప్రదాయాల్లో సహితం దీపారాధన సంప్రదాయం ఉంది. ఆ యా సంస్కృతుల ప్రకారం ప్రతివారికీ దీపావళి అత్యంత పుణ్యప్రదమైన శుభపర్వదినం.
దీపారాధనలో విద్య, శక్తి, ఐశ్వర్యాలను ప్రసాదించే సరస్వతీ, దుర్గ, లక్ష్మీదేవి కొలువై ఉంటారు. దీపకాంతులు విరజిమ్మే ఇంట లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది.
నిత్య దీపారాధన జరిగే ఇంట అశుభాలు జరుగవని శాస్త్రాలు బోధిస్తున్నాయి. వైదిక సంస్కృతిలో "దీపావళి" మహాపర్వం.
ooooooOOOOOooooooo
(బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి సంపాదకత్వంలో వెలువడుతున్న ఋషిపీఠంలోని వ్యాసాలనుండి సేకరించబడింది. )
4 comments:
దీపాల వరుస చాలా బాగుంది గురువు గారు.
మీకు, మీ కుటుంబసభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!
మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు
తెలుగు వారి బ్లాగుల వారికి నమస్కారము.. మీ సరసన నా బ్లాగు కూడా ఉంచుతానంటే చాలా ఆనందము.. మీ వెయ్యిమందిలో నేనూ ఒకణ్ణవటానికి నాకే అభ్యంతరమూ లేదు.. సంతోషంగా ఉంచండి..
Post a Comment