Pages

Wednesday, April 17, 2013

గిఫ్ట్ ప్యాక్ ( హేండిల్ విత్ కేర్)

              
                                 గిఫ్ట్ ప్యాక్
                                                                 ( హేండిల్ విత్ కేర్ )                                                                                                                                                       డి.వి.హనుమంతరావు..
దేముడున్నాడా? లేడా? ...
ఏ నాటినుంచో ఉన్న గొప్ప సందేహం.. నిజం చెప్పాలంటే
దేముడు కన్నా ముందే ఈ సందిగ్ధం పుట్టి, దేమునితో పాటు ఎదుగుతోందేమో.
"....సత్వరుడై యెందును లేడు లేడని..." రాక్షస రాజు హిరణ్యకశిపుడు చాలా స్పష్టంగా లేడు పొమ్మన్నాడు..
"కలండు కలండనువాడు కలడో లేడో" అని పురాణకాలంలోనే గజ రాజు మనలాగానే కొంచెం డౌటు పడ్డాడు...
"హరి సర్వాకృతులం గలం డనుచు.." భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు స్పష్టంగా చెప్పాడు...
అప్పటినుంచి ఇప్పటిదాకా  లేడు అనేవారు కొందరైతే,
ఉన్నాడు అనేవారు మరికొందరు..
ఏదో లేడంటున్నారు గాని ఉన్నాడేమో; అనుకునేవారూ
ఆఁ.. ఉన్నాడంటారు గాని లేడేమో అని సందేహపడేవారూ ..
మన భాషలోచెప్పాలంటే...  "గజ" సందేహులు కూడా బాగానే ఉన్నారు.
ఈ చివరి కేటగిరీ లోకి మనలో చాలామంది వచ్చేస్తాము కూడా..
ఎవరికి తగ్గ ఆర్గ్యుమెంట్స్ వాళ్లకి ఉన్నాయి..ఉంటాయి కూడా...
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో చూస్తూ ఉంటాము..
నియమ బద్ధంగా సూర్యోదయం.. అస్తమయం... పక్షాలననుసరించి చంద్రుడు పెరగడం .. తరగడం... పున్నమినాడు పూర్ణ కళలతో శోభించడం..
పున్నమి, అమావస్యలనాడు సముద్రం ఆటుపోటులు...  మామిడి పూత తో  కోకిలలు కుహు కుహు రావాలు చేయడం..
ఇవన్నీ ఇంత క్రమబద్ధంగా ఎలా జరుగుతున్నాయి.. ఎవరిదీ యాజమాన్యం...
ఇందులో గొప్పేముంది...నాచురల్ అంటారు కొందరు.
తెలియదుకాని ఏదో అతీత శక్తి అంటారు మరికొందరు..
ఆ అతీత శక్తికి "భగవంతుడు" అని పేరెట్టి కొలుస్తామంటారు కొందరు.
మా చిన్నతనంలో మాకు రేడియో ఒక వింత.. క్రొత్తగా మా ఇంటిలో పెట్టారు.. పెద్ద బ్యాటరీ మీద పనిజేసేది..
అలాగే టి.వి. మన ఊళ్లలో లేనప్పుడు, మద్రాసులో షాపు ముందు నించుని నోరెళ్లబెట్టుకుని చూడ్డం గుర్తుంది...
సైకిల్ రిక్షా మా ఊళ్లో తిరగడం మొదలెట్టడం నాకు తెలుసు.. ఎక్కితే అదో విచిత్రం...
మోటర్ సైకిల్ రిక్షా (ఆటో కాదండోయ్) మరో వింత..
మా మనవడికి చెప్తే నాన్ సెన్స్ తాతయ్యా.. నువ్వు మరీ ఎలిమెంటరీ అని కొట్టిపాడేస్తాడు..
తన అనుభవంతో  స్టీమ్ కు శక్తి ఉంది అని జేమ్స్ వాట్  కనిపెట్టక ముందే స్టీమ్ కు శక్తి  ఉంది.
శక్తి ఉండడం దాని ధర్మం..
ఒక లోహం తేలికగా ఉండడం దాని ధర్మం..
ఆ లోహం ఉపయోగించడంవలన విమానం ఎగురుతోంది...
నీకు ఆ ఆలోచన స్పురించిందంతే కాని అది లేనిది కాదు కదా ?
రేడియో, విమానం మరోటీ, మరోటీ మనం ఆవిష్కరించిన వింతలు ... ఇప్పుడు పాతబడిన వింతలు...
నిజానికి ఇవన్నీ కనిపెట్టినది మీరూ నేనూ కాదు,, మనలో ఒకరు..
అదిప్పుడు వింతగా చెప్తే నాన్ సెన్స్ అని మనం అంటాము.. అదీ మన విజ్ఞత..
"రేడియో తరంగాలు ఆకాశంలో వేలాది మైళ్లు ఎలా పయనిస్తాయి అని అలా కనిపెట్టిన శాస్త్రజ్ఞుడు మార్కోనీని అడిగితే...ఈ తరంగాలు ఎలా పయనిస్తాయో శాస్త్రీయంగా చెప్పగలను .. కాని ఎందుకు అలా పయనిస్తాయి అంటే ఆ రహస్యం సృష్టించిన వానికే తెలియాలి... " అన్నాడట ..
అందుకని ఒక నిజం ఒప్పుకోవాలి.. ఎంతో తెలిసినవాడు.. తెలియనిది ఎంతో ఉంది అనుకుంటాడు..
కూసింత తెలిసిందనుకునేవాడు తనకు తెలియనిదేమీ లేదు అనుకుంటాడు..
మనం సృష్టించుకున్నవేవీ  కొన్నాళ్ల తర్వాత వింతగా కనపడవు.. నిజమే కదా..
కాని రోజూ సూర్యోదయం చూస్తాము.. ఎప్పుడూ విసుగురాదు...చూస్తుంటే ఆకాశంలో ఎన్ని రంగులు.. ఎన్ని షేడ్స్.
శరత్కాలంలో నిండు పున్నమి చంద్రుడు.. ఆ నిర్మలమైన ఆకాశంలో అలా వెలిగిపోతుంటే..  ఎంత బాగుంటుంది..
"ఆఁ అదో గ్రహం అమెరికావాడు కాలు కూడా పెట్టాడు.." అన్నమాట ఆ ఆనందానుభవంలో గుర్తొస్తుందా ?
వర్షం పడగానే ఆరుద్ర పురుగులు పుట్టుకొస్తాయి.. వీపుమీద ఎర్రటి ముఖమల్ చర్మంతో.ఆ నేతగాడెవడు ?
చీకటి రాత్రులలో కాంతివంతం చేయడానికి ఎగిరే మిణుగురు పురుగులు కంటికెంత వెలుగు..?
వర్షపురాత్రుళ్లలో రోజుకో రకం పురుగులు అలా పుట్టి వెంటనే నశించిపోతాయి.. వేటికవే ప్రత్యేకం.. అవి ఎక్కడనుంచి వస్తాయి.. ఆ కాసేపటిలో ఎలా పుడ్తాయి..ఎవరు చెప్పగలరు..?
రోతపుట్టించే గొంగళీ పురుగునుంచి బయటికి వచ్చే అందమైన, కోమలమైన రంగురంగుల సీతా కోక చిలుకలు... ఒక సీతా కోక చిలుకకు మరోదానికీ పోలికే ఉండదు.. ఎవరు తయారుచేస్తున్నారు..
ఇలా చెప్పుకుంటూ పోతే..... అంతెక్కడ ?
ఒక్కసారి మనల్ని మనం చూసుకుందాం... లోపల ఎన్ని అరాంజ్ మెంట్స్ ? ఎముకలు, మజ్జ, మాంసం, రక్తం..
కాళ్లు మడతపడడానికి, చేతులు మడతపడడానికి  .. మడత బందుల్లా పెట్టాడు.. గుండ్రంగా తిరగడానికి బంతి గిన్నె కీలు... వేళ్లు ఎక్కడికక్కడ ముడవబడడానికి...ఏర్పాటు.. అవి పని చేయడానికి కావలసిన కాల్షియమ్. కుషన్
అఫెక్ట్ కు మాంసం.. ఇంకా ఏవేవో ధాతువులు.. రక్తం అందీయడానికి నరాలు.. మంచి రక్తానికి చెడ్డరక్తానికి సిరలు ధమనులు.. గుండెకు రక్త ప్రసరణకు అనుకూలంగా లోపలికి ముడుచుకునే తలుపులు, బయటికి తెరచుకునే తలుపులు.. తిన్నది అరగడానికి కావలసిన ఎంజిమ్స్.. రక్తం గడ్డ కుండా ఏర్పాటు.. చూడ్డానికి కన్ను, వినడానికి చెవి... మీరు చెప్పినా చెప్పకపోయినా మీ ప్రమేయం లేకుండా కొట్టుకునే గుండె.. ఆలోచిస్తే ఎంత వింత...? ఎప్పుడు దంతాలుండాలో, ఎప్పుడు పాల దంతాలు పోయి మంచి దంతాలు రావాలో...ఎప్పుడు అవి ఊడాలో అన్నీ చక్కగా ఏర్పాటు చేసాడు.. రక్తం బయటికి పడకుండా, ఎముకలు కనపడకుండా  చర్మంతో దీనికో ప్యాకింగ్...చర్మానికి ఆ అతుకు ఎక్కడ వేసాడో ఎలా వేసాడో ... ఏమన్నా తెలుసా...
మన ఈ ఎదిగిన దేహానికి ఆరంభం ఎక్కడంటే.. తల్లిగర్భంలోకి ప్రవేశించిన ఒకే ఒక చుక్క..కదా... ఆ చుక్క  తనంత తాను ఎదుగుతూ... ఎప్పుడు ఏంకావాలో సమకూర్చుకుంటూ... దాని పని అది చేసుకుంటు మనం నడిచేటట్టుగా చేస్తోందంటే ఎంత ఆశ్చర్యం...ఆ పరంధాముడు అలా చేయించే రిమోట్ తన దగ్గర పెట్టుకున్నాడు..  తెల్లారి లేస్తే సుగంధాలీనే సబ్బులతోటీ షాంపూలతోటీ  స్నానాలు చేస్తాము.. అరంగుళం దళసరిని పౌడర్లు మెత్తుకుంటాం.. వళ్లంతా సెంటులు పూసుకుంటాం.. అలా షోకులు చేసుకునే ఆ చర్మం క్రిందేముందండీ.. ముఖం భాగంలో కళ్లకు రెండు కన్నాలు.. అటూ ఇటూ చెవులస్థలంలో రెండు కన్నాలు.. ముక్కుకి, నోటికి కన్నాలు.. మిగతా ఎముకల పంజరం.. లోతుల్లోకి వెళ్తే కనిపించే పాంచభౌతిక శరీరము... కనిపించని ఎముకలగూడు... చీమూ, నెత్తురూ..  కాని ఇవి ఏమీ తెలియనీయకుండా  అందమైన చర్మంతో చక్కగా ప్యాక్ చేసి జన్మదిన కానుకగా మీకందించాడు.. అందుకున్నాము ... మామూలు గిఫ్ట్ ఇస్తేనే ఓఁ వందనాలు చేసేస్తాము కదా, ఇలాంటి అపురూప కానుక అందించిన వానికి కృతజ్ఞతలు చెప్పనక్కరలేదా మరి ? చెప్పాలి అంటే ఎక్కడకెళ్లాలి.. ఎక్కడకీ అక్కరలేదు...ఇదంతా చేస్తున్న ఒక అవ్యక్త స్వరూపం ఉంది అన్న ఎఱుకతో.......తెరచిచూసే ప్రయత్నం చేయకుండా ఆ గిఫ్ట్ ప్యాక్ ను కాపాడుకుంటూ  ఈశ్వర విభూతితో ఉన్న ప్రాణికోటిని సేవిస్తే సరిపోతుంది..
ఎప్పటిదాకా అలా చెయ్యాలి అంటే ....... ఈ ప్యాక్ పంచభూతాలలో కలసి ఆయనను చేరేదాకా.....
ఆఁ ఇది నాచురల్, దీనికీ ఇంత సీనుందా అంటారా మీరనుకునే ఆ నేచర్ కే నమస్కరిద్దాము, అప్పుడైనా అలా మీరు చెప్పిన కృతజ్ఞత చేరవలసిన చోటికి చేరుతుంది.. నాచురల్ కదా..!


Thursday, April 4, 2013

                     


                              ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ
                                                        సత్సంగము మార్చి.,2013
రాజమహేంద్రవర శాఖ సమావేశంలో... ఋషిపీఠం కుటుంబ సభ్యులకే కాకుండా భగవద్విషయములు విన ఆసక్తికనబరచేవారికి కూడా ఉపయోగించేవిధంగా ప్రతినెలా ఒక సమావేశము ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్ ,రాజమహేంద్రవర శాఖ సంకల్పించింది.. శ్రీరామనగర్, రాజమండ్రిలోని శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఊహించినదానికన్నా ఎక్కువగా విచ్చేసిన రసజ్ఞుల సమక్షంలో 31-3-2013న ఆదివారము సాయం సమయంలో రెండుగంటలపాటు శ్రీమద్రామాయణ విశేషాలను హృద్యంగా వివరిస్తూ శ్రీ నారాయణ రావుగారు చాలా చక్కటి ఉపన్యాసము అందించారు.

"అమ్మ చేతి పసుపుబొమ్మ ఆగమాల సారమమ్మా" బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి గణపతి ప్రార్థన గీతాలాపనతో కార్యక్రమము ప్రారంభమైంది.. శ్రీ సామవేదం వారి మాసం మాసం వెలువడే ఋషిపీఠం మానస పత్రిక లోని  సంపాదకీయాలు ఆలోచనాత్మకంగా ఉంటూ మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు.. దేశభక్తి పరిపూరితాలు.. ప్రతి సత్సంగసమావేశంలోను అవి అందరికీ గుర్తుచేయడం అవసరమని.."మన ఇల్లే అధ్యయన కేంద్రం"  అనే శీర్షికతో వచ్చిన జూన్2008 నెల సంపాదకీయం  చదవడం జరిగింది..
వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషు చదువులకన్నా  భాషా, ధార్మిక సంస్కారము అలవరచే మన దైన విద్య గొప్పదనే తండ్రిగారి ప్రోత్సాహముతో ముందు పోతన మొదలైన వారి పద్యాలతో చదవడం ప్రారంభించిన వ్యక్తి... ఆ నేపధ్యంతో ఇంగ్లీషు చదువులు సునాయాసంగా చదివి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి అనుభవాలు ...
అలాగే తన చిన్నతనంలో భారత భాగవతాది పురాణాలలోని అందమైన పద్యాలు పాఠశాలల్లో నేర్పేవారు.. ఆ నీతి ప్రబోధకమైన విషయాలు మచ్చుకైన ఇప్పుడు కనపడటంలేదని చెప్పే మరో ఇంజనీరు వేదన..
విద్యావ్యాపార సంస్థల వలన మీ పిల్లలకి పునాదులు బలపడవు .. తలిదండ్రులే పిల్లల విషయంలో వారి బాల్యం నుండీ జాగ్రత్త పడాలి అనే సందేశం...
అదీ ఆ సంపాదకీయం యొక్క సారాంశం..

రామా ! మ్రొక్కులు నీదు నామమునకున్, రమ్యాంఘ్రి పద్మాలకున్
శ్రీమన్మంజులమైన మేనికి, ధనుర్లీలా కళాకేళికిన్,
నీ మర్యాదకు, ధర్మనిష్టకు, రసోద్వేలమ్ము నీ గాథకున్
ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ ! రామచన్ద్ర ప్రభూ !


బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు రచించిన రామచన్ద్రప్రభూ శతకంలోని పై  పద్యాన్ని
భగవత్ప్రేమ ముప్పిరిగొన్న మనస్సుతో...  భక్తినిండిన శ్రావ్యమైన గాత్రముతో శ్రవణానందముగా గానంచేస్తూ శ్రీ రామచన్ద్రప్రభువును ఆవిష్కరించారు ప్రముఖ వైద్యులు డా.టి.వి.నారాయణరావుగారు..
శ్రీ నారాయణరావుగారు..కవి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నము చేస్తూ  అర్థము చక్కగా విశదీకరించారు. 
ముందుగా రామ నామ వైశిష్ట్యము,  చక్కగా చెప్తూ చివరికి రామునికి కూడా రామనామమే శరణ్యం అన్నారు..
ఆ తర్వాత బ్రహ్మ కడిగిన పాదాల శోభ..., గంగమ్మకు జన్మనిచ్చిన పాదాలను భక్తితో కొలిచారు.
ఆ తర్వాత జీవులను సమ్మోహనపరచే ముగ్ధమోహనరూపాన్ని చూపారు.
ఆపన్నుల రక్షించే కోదండ రాముని చూపించారు...
రమ్యమైన రామగాథను స్పృశించారు.. పరివార పరివేష్టుడైన పట్టాభిరాముని పరవశులై శ్రోతలు మనసులలో ప్రత్యక్షం చేసుకున్నారు... ఈవిధంగా ఋషితుల్యులు శ్రీ షణ్ముఖశర్మగారి పద్యపఠనముతో ఋషిఋణం తీర్చుకునే ప్రయత్నం చేసి..

"తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిప్రపచ్ఛ వాల్మీకీర్మునిపుంగవమ్"


శ్రీమద్రామాయణంలోని ప్రథమ శ్లోకం..రెండుపాదాలే అనిపించే ఈ శ్లోకం అర్థ వివరణ త్రివిక్రముడిలా పెరిగి శ్రోతల హృదయాలలో శ్రీమన్నారాయణుని  ప్రతిష్టించిందంటే అతిశయోక్తి కాదు..
మొదటి శ్లోకంలోని ప్రతి పదమును ఉపనిషద్వివరణతో విశదీకరించారు..గురు రూపుడు నారదముని గొప్పతనము, మునిపుంగవుడు వాల్మీకి జిజ్ఞాస...  చక్కగా వివరించారు.. 'త' అక్షరముతో ప్రారంభమైన గాయత్రీ మంత్ర సూచకముగా
శ్రీ మద్రామాయణము 'త' అక్షరముతోనే ప్రారంభింపబడిందని చక్కగా వివరించారు. శ్రీరాముని  బాల్యలీలలు లేకుండా బాలకాండ అని దీనికి ముని ఎందుకు పేరు పెట్టాడు అని ప్రశ్నించుకుంటే చంటి పిల్లాడు అమ్మను ఎత్తుకోమని చేతులు సాచినట్టు... తన యాగ రక్షణకు శ్రీరాముని  అర్థించిన విశ్వామిత్రుడే బాలుడు.. అతడే బాలకాండలో మనకు చివరిదాకా కనిపిస్తాడు.. అందుకనే ఇది బాలకాండ అని వివరించిన తీరు అద్భుతంగా ఉంది.  అందరికీ అర్థమయ్యేరీతిగా సాగిన వారి ఉపన్యాసశైలికి  అందరూ చాలా ఆనందించారు..
మంగళ హారతి, ప్రసాద వినియోగముతో శుభప్రదముగా సభ ముగిసింది..
 
ప్రతినెలా జరిగే ఋషిపీఠం సత్సంగ కార్యక్రమములలో కొన్నాళ్లపాటు డా.టి.వి.నారాయణరావుగారు శ్రీమద్రామాయణములలోని శ్లోకసౌందర్యము వివరించే ఉపన్యాసములు అందిస్తారు.. సభాస్థలి ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది.. ఆసక్తిపరులకు ఆహ్వానము...