ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్, రాజమహేంద్రవర శాఖ
సత్సంగము మార్చి.,2013
రాజమహేంద్రవర శాఖ సమావేశంలో... ఋషిపీఠం కుటుంబ సభ్యులకే కాకుండా భగవద్విషయములు విన ఆసక్తికనబరచేవారికి కూడా ఉపయోగించేవిధంగా ప్రతినెలా ఒక సమావేశము ఋషిపీఠం ఛారిటబుల్ ట్రస్ట్ ,రాజమహేంద్రవర శాఖ సంకల్పించింది.. శ్రీరామనగర్, రాజమండ్రిలోని శాఖ కార్యాలయం ప్రాంగణంలో ఊహించినదానికన్నా ఎక్కువగా విచ్చేసిన రసజ్ఞుల సమక్షంలో 31-3-2013న ఆదివారము సాయం సమయంలో రెండుగంటలపాటు శ్రీమద్రామాయణ విశేషాలను హృద్యంగా వివరిస్తూ శ్రీ నారాయణ రావుగారు చాలా చక్కటి ఉపన్యాసము అందించారు.
"అమ్మ చేతి పసుపుబొమ్మ ఆగమాల సారమమ్మా" బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి గణపతి ప్రార్థన గీతాలాపనతో కార్యక్రమము ప్రారంభమైంది.. శ్రీ సామవేదం వారి మాసం మాసం వెలువడే ఋషిపీఠం మానస పత్రిక లోని సంపాదకీయాలు ఆలోచనాత్మకంగా ఉంటూ మన బాధ్యతను గుర్తు చేస్తూ ఉంటాయి అనే విషయం అందరికీ తెలుసు.. దేశభక్తి పరిపూరితాలు.. ప్రతి సత్సంగసమావేశంలోను అవి అందరికీ గుర్తుచేయడం అవసరమని.."మన ఇల్లే అధ్యయన కేంద్రం" అనే శీర్షికతో వచ్చిన జూన్2008 నెల సంపాదకీయం చదవడం జరిగింది..
వ్యవసాయ కుటుంబంలో పుట్టి, ఇంగ్లీషు చదువులకన్నా భాషా, ధార్మిక సంస్కారము అలవరచే మన దైన విద్య గొప్పదనే తండ్రిగారి ప్రోత్సాహముతో ముందు పోతన మొదలైన వారి పద్యాలతో చదవడం ప్రారంభించిన వ్యక్తి... ఆ నేపధ్యంతో ఇంగ్లీషు చదువులు సునాయాసంగా చదివి ఇప్పుడు ఒక ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి అనుభవాలు ...
అలాగే తన చిన్నతనంలో భారత భాగవతాది పురాణాలలోని అందమైన పద్యాలు పాఠశాలల్లో నేర్పేవారు.. ఆ నీతి ప్రబోధకమైన విషయాలు మచ్చుకైన ఇప్పుడు కనపడటంలేదని చెప్పే మరో ఇంజనీరు వేదన..
విద్యావ్యాపార సంస్థల వలన మీ పిల్లలకి పునాదులు బలపడవు .. తలిదండ్రులే పిల్లల విషయంలో వారి బాల్యం నుండీ జాగ్రత్త పడాలి అనే సందేశం...
అదీ ఆ సంపాదకీయం యొక్క సారాంశం..
రామా ! మ్రొక్కులు నీదు నామమునకున్, రమ్యాంఘ్రి పద్మాలకున్
శ్రీమన్మంజులమైన మేనికి, ధనుర్లీలా కళాకేళికిన్,
నీ మర్యాదకు, ధర్మనిష్టకు, రసోద్వేలమ్ము నీ గాథకున్
ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ ! రామచన్ద్ర ప్రభూ !
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు రచించిన రామచన్ద్రప్రభూ శతకంలోని పై పద్యాన్ని
భగవత్ప్రేమ ముప్పిరిగొన్న మనస్సుతో... భక్తినిండిన శ్రావ్యమైన గాత్రముతో శ్రవణానందముగా గానంచేస్తూ శ్రీ రామచన్ద్రప్రభువును ఆవిష్కరించారు ప్రముఖ వైద్యులు డా.టి.వి.నారాయణరావుగారు..
శ్రీ నారాయణరావుగారు..కవి హృదయాన్ని ఆవిష్కరించే ప్రయత్నము చేస్తూ అర్థము చక్కగా విశదీకరించారు.
ముందుగా రామ నామ వైశిష్ట్యము, చక్కగా చెప్తూ చివరికి రామునికి కూడా రామనామమే శరణ్యం అన్నారు..
ఆ తర్వాత బ్రహ్మ కడిగిన పాదాల శోభ..., గంగమ్మకు జన్మనిచ్చిన పాదాలను భక్తితో కొలిచారు.
ఆ తర్వాత జీవులను సమ్మోహనపరచే ముగ్ధమోహనరూపాన్ని చూపారు.
ఆపన్నుల రక్షించే కోదండ రాముని చూపించారు...
రమ్యమైన రామగాథను స్పృశించారు.. పరివార పరివేష్టుడైన పట్టాభిరాముని పరవశులై శ్రోతలు మనసులలో ప్రత్యక్షం చేసుకున్నారు... ఈవిధంగా ఋషితుల్యులు శ్రీ షణ్ముఖశర్మగారి పద్యపఠనముతో ఋషిఋణం తీర్చుకునే ప్రయత్నం చేసి..
"తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్
నారదం పరిప్రపచ్ఛ వాల్మీకీర్మునిపుంగవమ్"
శ్రీమద్రామాయణంలోని ప్రథమ శ్లోకం..రెండుపాదాలే అనిపించే ఈ శ్లోకం అర్థ వివరణ త్రివిక్రముడిలా పెరిగి శ్రోతల హృదయాలలో శ్రీమన్నారాయణుని ప్రతిష్టించిందంటే అతిశయోక్తి కాదు..
మొదటి శ్లోకంలోని ప్రతి పదమును ఉపనిషద్వివరణతో విశదీకరించారు..గురు రూపుడు నారదముని గొప్పతనము, మునిపుంగవుడు వాల్మీకి జిజ్ఞాస... చక్కగా వివరించారు.. 'త' అక్షరముతో ప్రారంభమైన గాయత్రీ మంత్ర సూచకముగా
శ్రీ మద్రామాయణము 'త' అక్షరముతోనే ప్రారంభింపబడిందని చక్కగా వివరించారు. శ్రీరాముని బాల్యలీలలు లేకుండా బాలకాండ అని దీనికి ముని ఎందుకు పేరు పెట్టాడు అని ప్రశ్నించుకుంటే చంటి పిల్లాడు అమ్మను ఎత్తుకోమని చేతులు సాచినట్టు... తన యాగ రక్షణకు శ్రీరాముని అర్థించిన విశ్వామిత్రుడే బాలుడు.. అతడే బాలకాండలో మనకు చివరిదాకా కనిపిస్తాడు.. అందుకనే ఇది బాలకాండ అని వివరించిన తీరు అద్భుతంగా ఉంది. అందరికీ అర్థమయ్యేరీతిగా సాగిన వారి ఉపన్యాసశైలికి అందరూ చాలా ఆనందించారు..
మంగళ హారతి, ప్రసాద వినియోగముతో శుభప్రదముగా సభ ముగిసింది..
ప్రతినెలా జరిగే ఋషిపీఠం సత్సంగ కార్యక్రమములలో కొన్నాళ్లపాటు డా.టి.వి.నారాయణరావుగారు శ్రీమద్రామాయణములలోని శ్లోకసౌందర్యము వివరించే ఉపన్యాసములు అందిస్తారు.. సభాస్థలి ఎప్పటికప్పుడు తెలియజేయబడుతుంది.. ఆసక్తిపరులకు ఆహ్వానము...
No comments:
Post a Comment