Pages

Monday, June 24, 2013

కేదారనాథా .. నమో నమః




శివుని  తాండవమా... శివాని లాస్యమా...

శివా.. హరా … శంభో
అనివచ్చిన ఆర్తులకు...

శివ...శివా
శివయ్యా ఏందయ్యా.. ఇది.

జటా జూట ధారీ.. జడలు సడలించావా ?
నీ తాండవ కేళి చూడ గంగమ్మ నేల జారిందా..
ఆనంద లాస్యముతో సుడులు తిరిగిందా..
అమ్మ నీతో పదం కలిపిందా..

హిమాలయ సానువుల్లో మామగారి ప్రాంగణములో జామాత నాట్య విన్యాసమా..
మేనా దేవితో వళ్ళంతా కళ్లు చేసుకుని అల్లుడి ఆనంద తాండవము చూడా లనిపిస్తే
ఏ కొండ చరియల్లోంచో చూడొచ్చు కదా.... ఆ హిమవంతుడు.
దొరులుకుంటూ వచ్చి మరీ చూడరావాలా...

కేదారవాసా .. నువ్వే  విజృంభిస్తే  ..గోడు ఎవరికి  చెప్పాలి.
అమ్మా ! నువ్వైనా అయ్యను వారించకపోతే  
మీ  ఒడిలో క్రీడించే అమాయక జీవులు.. ఎటుపోగలరు  
మీ  ఒడిలో అటూ ఇటూ.. అంతేకదా..
ఉన్నదంతా శివ శక్తి మయమే కదా మరి.

మరో మాటలేక నిన్నే చేరారట లెక్కకు మించి..
అది అనుగ్రహమా..
కన్నుల ముందర బంధాలు తెగిపోతుంటే
మరో  మాట రాక అలమంటించారట ఎంతో మంది..
అది నీ ఆగ్రహమా..
నీ ఘోర అఘోర రూపాలు వినగలము కాని
ఇదిగో చూడండంటే చూడ శక్తి లేదే...
ఎందుకయ్యా ఈ పరీక్ష ?

క్షేమంగా గూడు చేరిన వారు.. భద్రంగా ఛేర్పించావని..
గుడిలో ఉన్న నీకు కైమోడ్పులు చేస్తున్నారు..
గూటికి చేరని తమవారికై అలమటిస్తున్నవారు
తమ వారిని గూటికి భద్రంగా చేర్చమని నీకే మ్రొక్కుతున్నారు ..

కదన రంగాన కాళీ మూర్తిగా భాసించే వీర జవానులు
అమ్మ ప్రేమతో ఆపన్న హస్తమందిస్తూ..తోటివారికి సాయపడుతున్నారు.
పిల్లల వేదనలకు కరిగిన జగన్మాత మాతృహృదయం
కరుణామూర్తుల అంతరంగమంతా నిండి దయ కురిపిస్తోంది.

అందరు తమవారే  అనుకుంటూ  
తమ ప్రాణాలను లెక్క చేయక,
అంకిత భావంతో చేయందిస్తున్న
ఆ సైనికుల ఋణమేరీతి తీర్చుకోగలము..  …
ఓ వీర సైనికుడా!  నీ ముందు మోకరిల్లి
సజలనయనాలతో ..
ముకుళిత హస్తాలతో శిరసా అంజలిస్తున్నాను...

రాజకీయ దుర్గంధమంటకుండా
చెమ్మగిల్లిన గుండెలతో సోదర ప్రేమతో
సాయ పడుతున్న.. వారందరికీ
శిరసా ప్రణామాలు …

ఓ సర్వేశ్వరా!
మాలో  లోపాలున్నయంటే అవి నీవే సవరించు.
జగన్మాతా.. మా అపచారములు క్షమించి అనుగ్రహించు.

ఇంత జరిగినా... నీ ఆలయము పదిలమట.. నీవు పదిలమట..
నీవు స్థిరుడవు.. అచ్యుతుడవు.. పదిలమని చెప్పాలా ?
నిన్ను చూస్తూ ఆనందించే ఆ నందీశ్వరునికి కూడా  ఇవేమీ  పట్టలేదు
నిన్ను చూస్తున్న ఆనందానుభవములోనే ఉన్నాడు..
నీ దర్శనానందములో ఉన్నవారికి జగత్ దృష్టి ఉండదుకదా మరి.,,.?

ఎంతో తెలుసనుకుంటూ,
ఏమీ తెలియక అలమటించే పసి పాపలము మేము
జగన్మాతా పితరులు మీరే ..
తండ్రిగా తీర్చి దిద్దినా.. తల్లిగా ప్రేమ కురిపించినా
మీరే దిక్కు  ….   మీరే దిక్కు ….   మీరే దిక్కు
అన్యథా శరణం నాస్తి.. త్వమేవ శరణం  మమ...


.

4 comments:

Hima bindu said...

Touching:(

మైత్రేయి said...

Great articulation

SreeTadimarri said...

మృత్యుహేలను ధారగ ఒలికించిన మీ హృదయ భాష్పాలతో ఆ రుద్రుడు శాంతించు గాక!

అద్భుతంగా వ్రాసారు!

SreeTadimarri said...

మృత్యుహేలను ధారగ ఒలికించిన మీ హృదయ భాష్పాలతో ఆ రుద్రుడు శాంతించు గాక!

అద్భుతంగా వ్రాసారు!