గతం లోకి తంతి
“సార్ ! టెలిగ్రామ్ !”
అర్థరాత్రి టెలిగ్రామ్ ఎక్కడనుంచబ్బా...
ఆయనకూ, ఆవిడకు టెన్షన్..
“your daughter-in-law blessed with a male child” అని వియ్యంకుడుగారి దగ్గరనుంచి...
“నువ్వు బామ్మవయిపోయావుటోయ్” అని సరసుడైన ఆయన భార్యామణితో సరసాలు..
సిగ్గూ , ఆనందమూ కలసిన ముసి ముసి నవ్వులతో తన ప్రయోజకత్వానికి సంబరపడుతూ ప్రక్కగదిలోంచి విన్న
న్యూ పేరెంట్., వెంటనే తన శ్రీమతిని అభినందిస్తూ గ్రీటింగు టెలిగ్రాం ఇవ్వడానికి సన్నాహం. .
( ఆ రోజుల్లో వెంటనే సంతోషాన్ని పంచుకోవాలంటే ఫోనులు లేవుగా మరి)..
ఎన్ని అనుభవాలో....
టెలిగ్రామ్ చరిత్రలోకి వెళ్లి పోయింది. ఎన్ని వార్తలు మోసుకొచ్చేది. ఎన్ని ఆనందాలు పంచేది. ఎన్ని విషాదాలకు సానుభూతులు చూపేది. .. ఇక ఆ టెలిగ్రాం ఇక కనపడదు. నిజం చెప్పాలంటే మనం ఎప్పటినుంచో మరచిపోయాము అది వేరే విషయము. ఇప్పుడు అఫీషియల్ గా డిక్లేర్ చేసారు. అంతే ….
బిడ్డనెత్తుకుని ఫలానా ట్రెయిన్ కు వస్తున్నామని టెలిగ్రాం … ఉత్సాహంగా గంతులేసే తండ్రి హృదయం.
ట్రైన్ టైమ్ కన్నా ముందే స్టేషన్ కు చేరి, పదే పదే వాచీని, పట్టాలను మార్చి మార్చి చూసిన ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి కదూ.
మీ వాడు ఫస్ట్ క్లాసులో పాసయ్యాడు అని యూనివర్సిటీలో తెలుసున్నవారు టెలిగ్రాంఇస్తే,.
తండ్రికి ఆనందాన్ని, తనయునికి ఉత్సాహాన్ని పట్టుకొచ్చిన టెలిగ్రాము
“may heaven’s choicest blessings be showered on the young couple’
“convey our blessings to the newly wedded couple”
ఒక నెంబర్ టెలిగ్రాఫ్ ఫారంపై నింపితే చాలు అందమైన కవరులో, అందంగా ముద్రించి పెళ్లి పందిట్లో టెలిగ్రాఫ్ మెస్సెంజర్ ఇస్తే .. వధువుకు కాని, వరుడుకీ కాని, కన్యాదాతకు కాని, పిల్లాడి తండ్రికి కాని ఎంత గర్వం.. ఆ టెలిగ్రాములను అలా భద్రంగా దాచుకుని, మళ్ళీ చూడడము, ఎంత గర్వం.. కాదంటారా..
‘ఏమోయ్ మీ మాధవన్నయ్య పెళ్ళికి రావటం లేదట టెలిగ్రాం పంపాడు.” ఆలి వంకవారి నైజం ఇదీ అన్నట్టు ఆయన చెప్తే … “రావటం లేదా .. అయినా ఎందుకొస్తాడూ, మా బాబాయి షష్టిపూర్తికి మనం వెళ్లలేదుగా.. పైగా బాబాయికదా అని తీసి పారేసారు. . అవన్నీ మనసులో పెట్టుకోరా ఏంటి.” త్రిప్పికొట్టే అర్థాంగి.
‘అబ్బాయి పెళ్లి చేస్తున్నారు సార్ .. మాకేమన్నా బహుమానం ఇయ్యరా సార్..” అని నసిగే మెస్సెంజర్ కు, చుట్టూ ఉన్నవారు చూసేటట్టు క్రొత్త నోటులు తళుక్కు మనిపించడం.. ఇవన్నీ ఆ టెలిగ్రామ్స్ వల్లనే కదా..
ఇప్పుడు అమెరికా క్షేమంగా చేరేరన్న వార్త, క్షణాలమీద తెలుస్తుంది, కాని అప్పుడు కేబుల్, బొంబాయి వచ్చి అక్కడనుంచి టెలిగ్రాం ద్వారా రావలసినదేగా .. ఆ టెలిగ్రాము వచ్చేదాకా ఎంత ఆందోళన, వచ్చాక ఎంత ఆనందం.
వచ్చిన టెలిగ్రాములు తెచ్చిన వార్తలకు ఆనందంతో గంతులేయడం ఉండేది. కొన్ని వార్తలకు దుఃఖంతో ఘొల్లుమనడం ఉండేది. ఆనంద సందర్భాలలో ఆనందాన్ని, దుఃఖ సమయాలలో విచారాన్ని మనతో పంచుకునే ఆ టెలిగ్రామ్ వాలా ఆత్మీయతకు దూరమయ్యాంకదా..
మేమున్న పేట అప్పట్లో పెద్దగా డెవలప్ కాలేదు. కొద్దిగానే ఇళ్ళుండేవి. అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా టెలిగ్రాం అతను, మా ఇంటిదగ్గర బెల్ కొట్టి లేపేవాడు. ఇంక మా నాన్నగారి హడావుడి.నిజానికి టెలిగ్రాం మాక్కాదు. అడ్రస్సు తెలుసుకోవడానికి నాన్నగారిని లేపేవాడు. నాన్నగారు విసుక్కోకుండా, ఆ అడ్రస్ అనలైజ్ చేసి, ఆవసరమైతే మమ్మల్ని కూడా లేపి.. మా సాయం తీసుకుని, ఆ అడ్రస్ చెప్పి పంపేవారు. దాని ఫలితంగా మాకు ఎప్పుడూ టెలిగ్రాం రాకపోయినా వాళ్ల దసరా మామూళ్ల లిస్టులో మా పేరు ముందు ఉండేది. అదో సరదా..
ఆఫీసుల్లో చేరాక టెలిగ్రాం పాత్ర చాలా ఉండేది. క్రొత్తగా చేరిన క్లార్క్ ను సాధారణముగా డిస్పాచ్ సీట్ కు వేసేవారు. దానిలో భాగం అన్ని సెక్షన్స్ నుంచి వచ్చిన టెలిగ్రాములూ సకాలంలో టెలిగ్రాఫ్ ఆఫీస్ కు పంపడం. అలసత్వం చూపాడా--- మరునాడు వార్నింగో, మెమోయో తప్పదు. బ్యాంకుల్లో టీ.టీ లు డబ్బులొచ్చిన వార్తలు పట్టుకొచ్చేవి .. వాటికోసం కస్టమర్స్ డిస్పాచ్ క్లార్క్ చుట్టూ తిరగడం. అవి రిజిస్టర్ లో ఎంటర్ చేసి ఆఫీసర్ కు పంపే లోపు నానా హడావుడి చేసేసేవారు.. అదో సందడి.
పెద్ద పెద్ద మెసేజెస్ పంపేటప్పుడు క్లుప్తీకరించడం ఒక ఆర్ట్ . గ్రీటింగ్ టెలిగ్రాములు అలాంటివే. పంపదలచుకున్నవారు ఆ మెసేజ్ నెంబర్ వేస్తే , ఆ నెంబరు టెలిగ్రాంగా ఇస్తారు. కాని రిసీవ్ చేసుకున్న టెలిగ్రాం ఆఫీస్ వారు తర్జుమా చేసి కస్టమర్ కు పంపాలి.. కాని ఒక్కోప్పుడు ఆ నెంబరే పంపేసేవారు.. అదో తమాషా..
అర్జంట్ అని టెలిగ్రాం ఇస్తే ఆర్నెల్ల తర్వాత అందడం ఒక జోక్ అయిపోయిన సందర్భాలు కూడా ఉండేవి. అది పేపర్ న్యూస్ కూడా అయిపోయేది. ఒక సారి హైదరాబాదు నుంచి మా అన్నయ్యకు టెలిగ్రాం ఇచ్చా “మరునాటి ఉదయానికి వస్తున్నామని .. ఇంటి దగ్గర ఉండమని..” . ఆ టెలిగ్రాం హైదరాబాదులో నేనే ఇచ్చి, రాజమండ్రి వచ్చాక నేనే రిసీవ్ చేసుకున్నా. అప్పటికి అన్నయ్య తన కాంప్ కు వెళ్లిపోయాడు. అతన్ని వెనక్కి రప్పించడానికి టాక్సీ పంపాల్సి వచ్చింది. ఇప్పుడు చెప్పుకోడానికి బాగున్నా అప్పుడది బాధే కదా.
నా చిన్న తనములో టెలిగ్రాఫ్ ఆఫీస్ లోపలకు చూడ్డం ఒకసరదా.. “టక్ .. టక్.. టాక్ … టాక్ టక్కు “ అంటూ తమాషాగా సౌండ్ చేసే మిషన్స్ ఉండేవి.. ఆ సంకేతాలే అన్ని వార్తలకు ఆధారం. తర్వాత్తర్వాత మార్పులు వచ్చాయి. కొన్నాళ్ళు కార్బన్ పెట్టి వ్రాసి, కార్బన్ కాపీ మనకి వచ్చేది. సరిగా అర్థంకాక విపరీత అర్థాలు వచ్చిన సందర్భాలు ఊండేవి. కొన్నాళ్ళు ప్రింట్ అయిన ముక్కలు అతికి పట్టుకొచ్చేవారు. అలా ఎన్నో మార్పులు చెంది మనుగడ సాగించిన ఆ టెలిగ్రాము నిత్యమూ మారే ప్రపంచపు ఆధునిక పోకడల ధాటీకి ఆగలేక తెరవెనక్కి పోయింది.
ఆ అనుభవం పొందిన మన తరాలవారికి ఇది బాధ... ప్రగతి పథంలో దూసుకుపోతున్న నవతరానికి ఇది AFTERALL.
2 comments:
Thank you Hanumantha Rao Garu it is a nice tribute to TELEGRAM by compiling your/our attachment with the then fastest communication .
shastr
మేమున్న పేట అప్పట్లో పెద్దగా డెవలప్ కాలేదు. కొద్దిగానే ఇళ్ళుండేవి. అర్థరాత్రి, అపరాత్రి అని లేకుండా టెలిగ్రాం అతను, మా ఇంటిదగ్గర బెల్ కొట్టి లేపేవాడు. ఇంక మా నాన్నగారి హడావుడి.నిజానికి టెలిగ్రాం మాక్కాదు. అడ్రస్సు తెలుసుకోవడానికి నాన్నగారిని లేపేవాడు. నాన్నగారు విసుక్కోకుండా, ఆ అడ్రస్ అనలైజ్ చేసి, ఆవసరమైతే మమ్మల్ని కూడా లేపి.. మా సాయం తీసుకుని, ఆ అడ్రస్ చెప్పి పంపేవారు. దాని ఫలితంగా మాకు ఎప్పుడూ టెలిగ్రాం రాకపోయినా వాళ్ల దసరా మామూళ్ల లిస్టులో మా పేరు ముందు ఉండేది. అదో సరదా.. mavayya chala bagundi
Post a Comment