Pages

Sunday, July 21, 2013

వేడి వేడిగా....................



 


  రచన: డి.వి.హనుమంత రావు.

వర్షాలు పడుతున్నాయి... అలా వాన పడుతుంటే, పై మేడమీద గదిలో, కిటికీ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చుని, కిటికీలోంచి వాన వైపు చూస్తూ,పచ్చటి చెట్లపై వాన చేసే విన్యాసాలు పరికిస్తూ, చేతిలో ప్లేటుపెట్టుకుని, అందులో వేడి,వేడిగా, ఖారం ఖారంగా, కర కర లాడుతూ అపుడే వేసిన పకోడీలు పెట్టుకుని, ఒక్కటొక్కటే ఊదుకుంటూ తింటుంటే అడక్కండి  మరి..    మ్ము....  మ్మూ...  ఎంత బాంటుందో కదా ?
అందుకనే మీ టేస్ట్ తెలుసుకనక పట్టుకొచ్చా... ….

రాజమండ్రిలో ‘హిందూ సమాజం’ ఒక సమావేశ మందిరం. చాలా పురాతనమైంది. ఇప్పుడు ఆ ప్రాంగణంలో ఓపెన్ ఆడిటోరియం ఉంది.  ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాన్ని
‘ఆంధ్ర భీష్మ’ గా ప్రసిద్ధి పొందిన నగర ప్రముఖులు న్యాపతి సుబ్బారావు పంతులుగారు  నిర్మింపజేసారు. స్వామీ వివేకానంద చికాగో ఉపన్యాసమునకు వెళ్లనున్నప్పుడు జరిగిన సభలో  వేదికపై శ్రీ సుబ్బారావు పంతులుగారు కూడా ఉన్నారు.

పైన చెప్పిన హిందూసమాజ ప్రాంగణములో ఒక గంగ రావి చెట్టు ఉండేదట.
సాయంకాలమయ్యేసరికి దానిక్రింద లోకాభిరామాయణమునకు చేరు ఉద్ధండులు ఎవరయ్యా అంటే.... ఆంధ్రభీష్మ న్యాపతి సుబ్బారావుపంతులుగారు,ఆంధ్రప్రభుత్వ ఆస్థాన కవి, బహుగ్రంథ  కర్త, కవిసార్వభౌమ శ్రీపాద కృష్ణమూర్తిశాస్త్రిగారు, హాస్య ప్రథానంగా “గణపతి”,  అనేక హాస్య ప్రహసనాలు, ప్రముఖ పౌరాణిక నాటకం “గయోపాఖ్యానం” మొదలైనవి వ్రాసి  కవి చక్రవర్తి బిరుదును ప్రదానంచేస్తామంటే  ఇచ్చగింపని చిలకమర్తివారు, టంగుటూరి ప్రకాశంపంతులుగార్ని రాజమండ్రి తీసుకువచ్చి ఆదరించిన ఇమ్మనేని హనుమంత రావు నాయుడుగారు, ఆంధ్ర రాష్ట్ర ప్రధమ ముఖ్య మంత్రి, అంద్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారు,ఇంకా శివరాజు రామారావుగారు,పాలకోడేటి గురుమూర్తిగారు, లంక బ్రహ్మన్న సోమయాజులుగారు, రాచకొండ సుబ్బారావుగారు వంటి ప్రముఖ పెద్దలే కాకుండా సోమశేఖరరావుగారు, గాడేపల్లి కృష్ణమూర్తిగారు, తాళ్లూరి,  నేట్రకంటి శేషగిరిరావు మొదలైన చిన్నవయసువాళ్లు ... వీరికి నాయకుడు శ్రీ వేమూరి విశ్వనాథశర్మగారట.(మచిలీపట్టణంలోని ఆంధ్రా సైటిఫిక్ కంపెనీ స్థాపనకు కారణమైనవారు, ఈ శర్మగారు).  గంగరావి చెట్టుక్రింద రోజూ పిచ్చాపాటీ మాట్లాడుకుంటూ ఈ సభ్యులు  మూడు నిముషములలో ముల్లోకములను చుట్టివచ్చెడివారట.

ఒకసారి హనుమంతరావు నాయుడుగారు మిత్రుల కాలక్షేపానికి పకోడీలు తెప్పిస్తున్నానని ప్రకటించారు. ఆనంద పడ్డ మిత్రులలో ఒకరు చిలకమర్తి వారిని “మీరు పకోడీ మీద పద్యం చెప్పవచ్చుగా”అన్నారు. “అలా మీరు పద్యం చెప్తే పద్యానికి ఒక పకోడీ ఇస్తా”మని భూరి విరాళం ప్రకటించారు మరో వదాన్యులు. “హతవిధీ! పద్యములోని  అక్షరమునకు లక్షలిచ్చు కాలము గతించి, పద్యమునకు  పకోడీలిచ్చు కాలము దాపరించినది” అని చమత్కరిస్తూ,  చిలకమర్తి వారు పకోడీపై కొన్ని  పద్యాలు ఆశువుగా చెప్పారు. పద్యాలు చదివి పకోడీ రుచి ఆస్వాదించండి.    

వనితల పలుకులయందున
ననిముష లోకమున నున్న దమృతమటంచున్
జనులనుటె గాని, లేదట
కనుగొన నీయందమృతము గలదు పకోడీ !

ఎందుకు పరమాన్నంబులు
ఎందుకు పలు పిండివంటలెల్లను నాహా ! నీ
ముందర దిగదుడుపున కని
యందును సందియము కలుగ దరయ పకోడీ !

ఆ కమ్మదనము నా రుచి
యా కర కర యా ఘుమ ఘుమ, యా పొమకములా
రాకలు పోకలు వడుపులు
నీకేదగు నెందులేవు పకోడీ !

నీ కర కర నాదంబులు
మా కర్ణామృతములు, నీదు మహితాకృతియే
మా కనుల చందమామగ
నే కొనియాడెదను సుమ్ము నిన్ను పకోడీ!

ఆ రామానుజు డాగతి
పోరున మూర్చిల్ల దెచ్చె మును సంజీవిన్
మారుతి ఎరుగడు, గాక, య
య్యారె  నిను గొనిన బ్రతుకడట పకోడీ !

హరపురుడు నిన్ను దిను నెడ
గరుగదె యొక వన్నె నలుపు గళమున, మరి చం
దురుడున్ దినిన కళంకము
గరుగక యిన్నాళ్లు నుండగలదె పకోడీ!


ఈ పకోడీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు గుర్తు తెచ్చుకుని రుచి ఆస్వాదించవచ్చు.. కానీయండి మరి.

 

5 comments:

మిస్సన్న said...

కరకర లాడు పకోడిని
సరితూగెడు దివ్యమైన సంగతి రుచితో
సరగున వడ్డిస్తి రయా!
బిరబిర లాగించినాము భేష్ గురువర్యా!

ప్రేరణ... said...

థ్యాంక్యూ టైంలీగా సెర్వ్ చేసారు...సూపర్ ;-)

Padmarpita said...

పకోడీల పిక్ పెట్టి నోరూరించిందే కాక కమ్మగా వ్రాసి కడుపునింపారు :-)

హనుమంత రావు said...

పద్యంతో పలకరించిన మిస్సన్నగారికి, ఆత్మీయంగా స్పందనలు తెలియజేసిన ప్రేరణగార్కి, పద్మార్పితగారికి కృతజ్ఞాతాభినందనలు..

పుష్యం said...

ఆ సందర్భములోనే చిలకమర్తి వారు చెప్పిన ఇంకొక పద్యం:

కం//
కోడిని తినుటకు శెలవున్
వేడిరి విప్రులు వేద, నతండున్
కోడిని వలదా బదులు ప
కోడిని తినమనుచుచెప్పె కూర్మి పకోడీ