“ఆగమ్మా.. పిలుస్తున్నా గా “ అని ముద్దుగా అడిగా.. ఎంతైనా కాకిపిల్లా, తల్లికాకి కదా…
“నీతో మాట్టాడను ఫో” అంది బుంగ మూతి పెట్టి…
నాకు విషయం అర్థమైపోయింది.. ఫేస్ బుక్ సందడిలో తనని పట్టించుకోవటంలేదని అలక..
“అంతేనా ?” అన్నా..
తలూపింది.. అవునంటోంది అనుకున్నా…
నిజమే ! ఫేస్ బుక్ లో ఎక్కువ టైము గడిపేస్తున్నాను. ఎంతోమంది పోస్ట్ చేస్తున్న ఎన్నో విషయాలు, సరదాగా, సీరియస్ గా , రాజకీయ సెటైర్ లు, షేర్ లు, లైకులు, కామెంటులు అదో హడావుడి. నిజానికి క్రియేటివిటీ తక్కువే. ఎవరో గీసిన కార్టూనో, ఎవరో వేసిన జోకో, ఎవరో తీసిన ఫోటోనో .. షేర్ చేస్తారు. మనం ఒక లైక్ కొట్టడం. ఏదో కామెంట్ పెట్టడం. మన స్పందనకు స్పందించాడా లేదా అని కాస్సేపాగి మళ్లా చూస్తాం. వాడో లైక్ కొడ్తాడు .. పెద్ద అఛీవ్ మెంట్. స్వంతంగా వ్రాసేవాళ్ళు చాలా తక్కువ. దాన్ని దుర్వినియోగం చేస్తున్నవారూ ఉన్నారు.. అయినా అదో కిక్.. అక్కడకే పోతాం.
బ్లాగు అందుకు భిన్నం. కొద్దో గొప్పో మన అక్షరాలు, ఆలోచనలూ, వ్యక్తీకరణలు ఉంటాయి. దానికి సహృదయంతో స్పందిస్తారు. ఆ స్పందనలు మళ్లీ మళ్లీ వ్రాయాలనే ఉత్సాహాన్నిస్తాయి. ఒక్కోప్పుడు ఎవరూ మాట్లాడరు.. అప్పుడు నిరుత్సాహం ఎక్కువగా ఉండి, కొన్నాళ్లు వ్రాయలేకపోవడం ఉంటుంది.ఆ కంట్రీ వాడు, ఈ కంట్రీ వాడూ చూసారని అంకెలు. వాళ్లు చదవక్కరలేదు, చూస్తే చాలు మనకి రికార్డయిపోతుంది. అది నిజమని అపోహేమో కాని, ఒక ఆనందము. ఫేస్ బుక్ కాఫీ లా వెంటనే కిక్కిస్తే, బ్లాగు బార్నవీటాలా బలమిస్తూ కిక్కిస్తుంది. రెండూ కూడా స్నేహితులను కలుపుతాయి…
“ఆ సోదంతా ఎందుకు… బ్లాగుని కూడా కాస్త చూడు.. అసలు కంప్యూటర్ ప్రవేశము నా ద్వారానే కదా.. “ చెప్పాగా బుడుగు.. చిచ్చర పిడుగు.. సలహాలొకటి.
‘సరేలే కోపం పోయిందా’.. అన్నా..
నవ్వేయబోయి, ఆపేసి..’ ఊహూ’ అంది..
‘అదేం.. అసలు కోపం ఎందుకమ్మా..’ అన్నా..
‘ఈసారి కూడా మరి పుట్టిన రోజు మరచిపోయావు కదా.. అందుకని.’
‘ఓ సారీ. ఆదే చెప్దామనుకున్నా… ఫేస్ బుక్ విషయం చెప్పడములో మరచిపోయా.. రెండవ తారీకు కదా.. గుర్తుంది.. ఆవేళ అప్పుడు గురువాయూర్ లో బాల కృష్ణుని చూస్తుంటే నువ్వే గుర్తొచ్చావు.. అప్పుడే నీతో చెప్దామనుకున్నా .. కాని కుదరలేదు.’ అని సంజాయిషీ ఇచ్చా.
‘తెలుసు..’ అంది బ్లాగు.
‘తెలుసా.. నీకెలా తెలుసు…’ ఆశ్చర్యంగా అడిగా…
“మరి నేను నీతోనే ఉన్నాగా.. కన్నయ్య నన్ను చూసాడు, వెన్న పెట్టాడు… అల్లరి చేయకమ్మా అన్నాడు… బోల్డు
కబుర్లు చెప్పాడు…’ అని మురిసిపోతూ చెప్పింది.. చెప్పి మురిసిపోతోంది..
“అయితే నువ్వు హేపీ.. అవునా”
“హేపీ !”
“సరే అయితే గురువాయూర్ కబుర్లు చెప్పుకుందామా.. కన్నయ్యగురించి చెప్పుకుందామా” అన్నాను..
“సరే!” అని వెంటనే “వద్దు” అంది..
“మళ్లీ ఏం వచ్చింది.” అన్నా..
"నా పుట్టిన రోజు అని చెప్తూ, అది చెప్తే.. నాకు గ్రీటింగ్స్ చెప్తారు, కాని అది చదవరు.. ముందర నా పుట్టిన రోజు చెప్పేద్దాము.. అందరూ దీవిస్తారు.. ఆ తర్వాత అది చెప్దాం.. కన్నయ్య మెచ్చుకుంటాడు…
“బ్లాగు, నీ తెలివే తెలివి” అన్నా..
“నా తెలివి నీ తెలివి, నీ తెలివి నా తెలివి” అంటూ గీతోపదేశము చేసి అర్జునిణ్ణి యుద్ఢోన్ముఖుణ్ణి చేసిన శ్రీ కృష్ణపరమాత్మలా నిష్క్రమించింది నా మూడేళ్ల బ్లాగు.
కనపడని రికార్డులో 28000, కనపడే రికార్డులో 11000 దాటిన వీక్షణలతో , మీ అందరి అభిమానంతో నిర్వహింపబడుతున్న నా బ్లాగుకు 3 సంవత్సారాలు దాటి నాలుగులో అడుగుపెట్టింది.. (dvhrao.blogspot.com...హాస్యవల్లరి). మంచిమనస్సుతో దీవించండి.. గురువాయూర్ విశేషాలతో త్వరలో కలుస్తాను…