సిరుల వరాల దేవి.
(‘ఈనాడు’ఆగష్టు పదారు ‘అంతర్యామి’ లో
బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారి ప్రత్యేక రచన. )
ఈ అనంత విశ్వాన్ని ‘లక్షించేది’ లక్ష్మి. లక్షించడమంటే చూడటమని అర్థం. అందరినీ తన కరుణామృతపూర్ణమైన చలువ చూపులతో ‘కనిపెట్టుకుని’, ‘గమనించి’ ‘పాలించే’ శక్తి అని భావార్థం. కనులు తెరవడాన్ని సృష్టిగా, మూయడాన్ని లయగా సంకేతిస్తే - ఆ రెంటి నడుమ ఉన్నది ‘స్థితి’గా భావించవచ్చు. పరమేశ్వర శక్తిచే జరిగే సృష్టి, స్థితి, లయలే - ‘ఈక్షణ శక్తి’ గా వేదర్షులు అభివర్ణించారు........
సర్వసాక్షియైన ఈ భగవద్దర్శన శక్తిని లక్ష్మిగా ఉపాసించడం లక్ష్మీ ఆరాధనలోని ప్రత్యేకత. …
వరలక్ష్మి :‘వర’ శబ్దానికి ‘కోరుకున్నది’ అని అర్థం. అందరూ కోరుకునే సంపదలు వరాలు. వాటిని ఇచ్చేది, వాటి రూపంలో ఉన్నదీ వరలక్ష్మి. ....కోరినవేవి కావాలన్నా భగవత్సంకల్పం లేనిదీ, ఆయన దయ రానిదీ పొందలేము. అసలు ఆనందమూ, సంపదా లేని వస్తువును మనం కోరుకోము. అలా మనం కోరుకునే వాటిలో ఆనందరూపంగా ఉన్నదీ, ఆనందాలను ప్రసాదించేది ఈ వరలక్ష్మి. వాస్తవానికి ఈ వరలక్ష్మిలో, మిగిలిన అయిదు లక్ష్ములనూ (సిద్ధలక్ష్మి,మోక్షలక్ష్మి,జయలక్ష్మి లేదా విజయలక్ష్మి,సరస్వతి, శ్రీ లక్ష్మి )సమన్వయించి చరమనామంగా చెప్తారు.
‘ప్రతి స్త్రీలోనూ లక్ష్మీ కళ ఉన్నది’ అని ఆర్ష వాక్యం. అందుకే స్త్రీలను లక్ష్మీ రూపాలుగా ఆరాధించడం, స్త్రీలు లక్ష్మీ రూపాన్ని అర్చించడం - ఈ శ్రావణ వరలక్ష్మీ వ్రతం దివ్యత్వం....
No comments:
Post a Comment